చందమామ

రాసిన వారు: అజయ్ ప్రసాద్ బి.
********************
ముప్పై సంవత్సరాలక్రితం నేను ఆరు ఏడు తరగతులు చదువుతుండగా కావచ్చు ఇంట్లో వాళ్ళని పట్టి పీడించి మా వీధిచివర బడ్డీకొట్టులో ప్రతినెలా చందమామ కొనుక్కుని చదువుతుండేవాడిని. చందమామలో వచ్చిన ముగ్గురు మాంత్రికులు, తోకచుక్క, రామాయణం, మహాభారతం, దేవీ భాగవతం, తదితర సీరియల్స్ తో పాటు జాతక కథలు, వసుంధర, మాచిరాజు కామేశ్వరరావు మొదలగు రచయితల అసంఖ్యాకమైన కథలు ఇప్పటికీ ఎవరికైనా కళ్ళలో మెదులుతూనే ఉంటాయి. నాలాంటి చందమామ అభిమానులు చాలామందే ఉన్నారని చందమామకు దూరమవుతుండగా తెలుసుకున్నాను. ఎక్కడైనా పుస్తకాల షాపు దగ్గర ఆగి చందమామ తీసుకుంటే కళ్ళముందు చందమామలేని అమావాస్యచీకటే మిగులుతుంది. ధర పెరిగినా పర్లేదు కాని కథలులేక పత్రిక బక్కచిక్కిపోయింది. సైజులో ఏముందిలే అనుకుంటే లోపల కథలు మాయమవుతూ కామిక్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ముందుముందు ఎప్పటికీ చిత్ర, శంకర్ బొమ్మలు చూడలేనేమోనని దిగులు కలిగింది. ఒక్కసారన్నా ఆ రంగుల బొమ్మలను తనివితీరా చేత్తో తడుముకుని చిన్ననాటి దిగులుని పోగొట్టుకోవాలనే కాంక్ష చాలారోజులుగా అలానే నాలో ఉండిపోయింది. పాత చందమామలు దొరుకుతాయేమోనని ఒకసారి మద్రాసు చందమామ ఆఫీసుకు ఫోను చేస్తే అందులో పనిచేసే జయశీలన్ గారు ఆఫీసు కాపి బౌండు బుక్కులు ఒక సెట్టు మాత్రమే ఉందనీ మిగతావి ఎన్నారై లు హాట్ కేకుల్లా తీసుకెళ్ళిపోయారని చెప్పారు.

ఆ తరువాత చందమామ కథలు సి.డీల రూపంలో దొరుకుతున్నాయని విన్నానుగాని బొమ్మలులేని కథలను చదవడానికి ఇష్టపడక వాటిని కొనలేదు.

ఇన్ని సంవత్సరాల తరువాత తెలుగులో అంతర్జాల పుణ్యమా అని ఇటీవల చందమామ వెబ్ సైట్లో ఒకేసారి నలభై సంవత్సరాల చందమామలు చూసి చెప్పలేనంత సంతోషం కలిగింది. నలభై ఏళ్ళ (సుమారు ఐదువందలకు పైగా) చందమామలు ఇప్పుడు చందమామ ఆర్కివ్స్ లో దొరుకుతున్నాయి. చక్కటి ఫ్లాష్ ప్లేయర్ ఫార్మాట్ తో ప్రతిపేజీ చూడముచ్చటగొలిపే రీతిలో 1947 జులై సంచిక నుంచి 1985 వరకు సాఫ్ట్ కాపీలు ఇప్పుడు ఇంటర్నెట్లో ఉచితంగా లభ్యమవుతున్నాయి. ఇదే ఫార్మాట్లో భారతి, ఆంధ్రపత్రిక, యువ పాత పత్రికలు అన్నిపేజీలతో సహా ముందుముందు మనకు అనుబాటులో వస్తే ఎంత బాగుంటుంది. ఈపని ఎవరైనా చేయగలగాలి. ఇప్పుడు, ఇన్నేళ్ళ తరువాత పాతబడి రంగువెలసిన పేజీలను తిరగేస్తుంటే ఇరవై ఐదేళ్ళక్రితం వీధిచివర బడ్డీకొట్టు ముందు ఒకానొక సాయంత్రపు మసకచీకటిలో మెరిసిన సరికొత్త చందమామ రంగురంగులబొమ్మల జ్ఞాపకాలు కళ్ళముందు మెదిలాయి. అదే కొత్తకాగితపు వాసన. అవే మెరిసే రంగులు. చందమామతో అనేకమంది అనుబంధం అలాంటిది.

ఇకపోతే చందమామలో వచ్చిన మొదటి సీరియల్ “ఐదు ప్రశ్నలు” సీరియల్స్ లో అందరికీ నచ్చే సీరియల్స్ ముగ్గురు మాంత్రికులు, తోకచుక్క (దానికి కొనసాగింపు మకరదేవత), జ్వాలాదీపం, కంచుకోట ఒకేసారి చదువుకోవచ్చు. ముగ్గురు మాంత్రికులు సీరియల్లో మనమూ పింగళుడితోపాటు మహామాయుడి పాడుదేవళంలోకి వెళ్ళి విలువైన వస్తువులు తెచ్చుకోవచ్చు. (అవి చందమామపత్రిక వంటి అద్భుతమైనవి కాకపోయినా). తోకచుక్కలో ఏకాక్షి మాంత్రికుడి కంకాళా కాలభైరవా అని భీతిగొలిపే పిలుపులు, చతుర్నేత్రుడి ఉలూకా నరవానరా అనే కర్ణకఠోరమైన గర్జనలు చదువుకోవచ్చు. భయంకరమైన మాయాద్వీపాలను, వింతగొలిపే మౄగాలను చిత్రాగారి బొమ్మలతో చూసి తరించవచ్చు. ఈ సీరియల్స్ రచయిత దాసరి సుబ్రమణ్యం గారని కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి చందమామ జ్ఞాపకాలు ఈమాట వ్యాసం ద్వారా తెలిసింది. సుబ్రమణ్యం గారిప్పుడు విజయవాడలో రెస్టు తీసుకుంటున్నారని విన్నాను. సీరియల్స్ బొమ్మలు రంగులతో రావడం తోకచుక్క సీరియల్ తోనే మొదలైంది.

ఇక కథల విషయానికి వస్తే కొన్ని వందల కథలను గురించి ప్రస్తావించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ కధల్లో (పాత సినిమాలలో కూడా) చెడుని కృఊరంగా చంపడం అంటూ ఉండదు. మనుషులనుంచి చెడుని తీసివేయడం ఉంటుంది. మనుషులు బుద్దితెచ్చుకోవడం ఉంటుంది. సరైన మార్గంలోకి రావడం ఉంటుంది. కలుపుమొక్కలను పెరికి అవతలపడేసినట్లు మనలోని మలినాన్ని కడగడం ఉంటుంది. మనుషులను చంపి పగతీర్చుకోవడం ఉండదు. మనకిప్పుడు కావలసిందిదే. దీన్ని నేర్చుకోవడానికి మనం చందమామ పత్రికలను చదవాలి. ఈ కథలనిండా మనుషులకు మంచి చేసే పిశాచాలు, అమాయకులను కాపాడే దయ్యాలు, దారిలోకి వచ్చే పనిచేయని సోమరులు, పిసినిగొట్టులు, కొడుకులను దారిలోకి తెచ్చే తండ్రులు, తండ్రులను గాడిలోపెట్టే కొడుకులను ఈకథలనిండా చూడవచ్చు.

ఇకపోతే ఉత్పల సత్యనారాయణచార్య గారి గంగావతరణం, శమంతకమణి, దక్షయజ్ఞం వంటి గేయకథలతో పాటు వడ్డాది పాపయ్యగారి బొమ్మలతో విద్వాన్ విశ్వం గారి పంచతంత్రం వంటి అమూల్యమైన సాహిత్యసంపద ఈ చందమామలలో దొరుకుతుంది.

కేవలం కథలూ, సీరియల్స్ వంటివేగాక అలనాటి అణిముత్యాలు పాతాళభైరవి, గుణసుందరి, షావుకారు, బీదలపాట్లు, విప్రనారాయణ, మిస్సమ్మ, ఉమాసుందరి, రాజీ నాప్రాణం, బంగారుపాప, చంద్రహారం వంటి పాత చిత్రాల ప్రకటనలు, వాటి విడుదల తారీఖులు తెలుసుకొవచ్చు. వీటితో పాటు తెనాలి వారి శాస్త్రి పెన్ వర్క్స్, మదరాసు వారి ఈగిల్ మార్కు వ్రాత పలకలు (మనం చిన్నప్పుడు చీమిడి ముక్కు తుడుచుకుంటూ బలపంతో అక్షరాలు దిద్దుకున్న మట్టిపలకలు), అన్ని పూజలకు పనికివచ్చే గడియారం మార్కు కర్పూరం వాసన కూడా ఈ పాతచందమామలో ఘాటుగా తగులుతుంది. మిమ్మల్ని పాతరోజులకు తీసుకువెళుతుంది. ఇక పుస్తకాల చివర్లో పెద్దమ్మ చెప్పే పిల్లలపెంపకం చిట్కాలు, పి.సి.సర్కార్ ఇంద్రజాల నిజాలు, స్త్రీలువేసుకునే ముగ్గులు, పిల్లలకోసం రంగులు వేయండి, ఫోటోగ్రఫి, ఫొటోవాఖ్యపోటి, ఎందుకోతెలుసా? వంటి శీర్షికలు పిల్లల్నే కాక మనల్ని అలరిస్తాయి.

ఇదంతా ఉత్త కాలయాపన, కాలక్షేపం అనుకుంటే ఏం చేయలేం. కాలం చెల్లిన విలువల్తో మనకేంటి పని అనుకుంటే చివరికి అంతా అశాంతే మిగులుతుంది.
అధర్మంపై ధర్మం యొక్క విజయం, పరోపకారం వలన కలిగే ఆతంప సంతౄప్తి, కార్పోరేట్ స్కూళ్ళు కూడా నేర్పించలేని పిల్లలు నేర్చుకోవలసిన యుక్తి, సహనం, సంఘజీవనం, వ్యక్తిత్వవికాసం ఈపుస్తకాలనిండా నిండుగా దొరుకుతాయి.

You Might Also Like

6 Comments

  1. M.V.AppaRao

    మన చందమామ అనగానే అదేదో వింత అనుభూతి.నాకు ఏడేళ్ళ వయసు నుంచే చందమామలు మా ఇంట్లో తెప్పిస్తున్నా వాటిని జాగ్రత్తగా దాచుకోవాలని నా 12వ ఏటి నుంచే ఆలోచనవచ్చింది.1953 నుంచి ప్రతి ఏడాది ఒక్కో బైండ్ చొప్పున 1980 వరకు దాచుకున్నాను.తరువాత నుంచి చందమామ రూపంలో మార్పులు రావటం వలన ఆశక్తి తగ్గుతూ వచ్చింది.అయినా చందమామ అంటే అభిమానం తగ్గలేదు.బ్లాగు మితృలు శ్రీ సివరామ ప్రసాద్ గారు,రాజశేఖరరాజు గారు చందమామ వెబ్సైట్ల ద్వారా చందమామ గురించి చెబుతున్నందుకు వారికి చందమామ అభిమానుల తర్ఫున ధన్యవాదాలు.————సురేఖ.

  2. P. Ravi Kumar

    Dear Mr. Ajay

    I read your article and it was very informative and fabulous. Really u taken me back to my childhood days and there is no words to express my feelings and happiness, thanks u very much. The present generation especially youth should read these books, those who are going on wrong track and we should make them habit of reading “CHANDAMAMA”.

    Ravi

  3. Vasu

    చందమామ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
    అంతర్జాలం లో చందమామ ఆర్కైవ్స్ చూసి నేనూ సంబర పడిపోయాను.

    ఆ మధ్య కల్లెక్టర్స్ ఎడిషన్ ఒకటి విడుదల చేసారు. అదీ కొన్నాను.

  4. Telugu4Kids

    http://blaagu.com/chandamamalu/2009/12/02/%e0%b0%ae%e0%b0%be%e0%b0%ae%e0%b0%be-%e0%b0%ae%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b5%e0%b1%81/

    పై టపా చూశాక నాకూ చందమామ కొనాలనే ఆసక్తి పెరిగింది.
    అంతకు ముందు నేనూ కొత్త చందమామలు నచ్చక కొనడం ఇష్టపడలేదు.
    ఆ మధ్య అనుకోకుండా నా చేతికి ఒక చందమామ దొరికింది.
    ప్రయాణంలో కలిసిన ఆమె తన కూతురి కోసం తెచ్చిన చందమామలలోనుంచి ఒకటి నాకు ఇచ్చేశారు,తెలియని చోట తోడుగా ఉన్నందుకు అభిమానంతో. అది చాలు ఆమె నాకు గుర్తుండిపోవడానికి అని చెప్పాను.
    అందులో కథలు బావున్నాయి. బొమ్మల ముద్రణ నాణ్యత అంత బాగా అనిపించలేదు. అందుకే మళ్ళీ మళ్ళీ పిల్లలతో కలిసి ఆ పుస్తకం తిరగేస్తున్నా, కొత్తది కొనడానికి ఇంకా బుధ్ధి పుట్టలేదు.
    కానీ ఇన్ని రోజుల తర్వాత, ఇంతమంది కోరిన తర్వాత వచ్చే సంచికలు బాగుంటాయని ఆశ పుడ్తోంది.
    online ఉచితంగా దొరకడం బానే ఉంది కానీ, చేతిలో పట్తుకుని పేజీలు తిరగేసినంత మజా రాదు కదా.
    ఐతే పాత చందమామలు అలా అందుబాటులో ఉంచుతున్నందుకు చందమామ వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి.
    వారి శ్రమ చందమామలు బ్లాగ్ చదువుతుంటే అర్థమౌతోంది.

  5. వేణు

    అజయ్ ప్రసాద్ గారూ, చందమామ గురించి బాగా రాశారు. అభినందనలు!

    అలనాటి చందమామ సంచికల అన్వేషణ, ఆ జ్ఞాపకాల తలపోత , అద్భుత రచయితల- చిత్రకారుల స్మరణలూ బ్లాగుల్లో విస్తృతంగానే జరిగాయి; జరుగుతున్నాయి.

    ‘చందమామ చరిత్ర’ అనే బ్లాగు ఉంది -http://blaagu.com/chandamamalu/

    చందమామ టపాల సమాహారంగా కొత్త బ్లాగు కూడా వెలిసింది. చూడండి- http://manateluguchandamama.blogspot.com/

  6. SRRao

    ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
    అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
    *** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
    SRRao
    శిరాకదంబం
    http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

Leave a Reply