శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి “అనుభవాలూ-జ్ఞాపకాలూనూ”

రాసిన వారు: విష్ణుభొట్ల లక్ష్మన్న
*****************************
anubhavalu-gyapakalunu

ఎప్పుడో వచ్చిన ఈ పుస్తకాన్ని ఇప్పుడు నేను పరిచయం చెయ్యటమేమిటి? అని ముందు అనిపించినా ఈ పుస్తకాన్ని ఈ మధ్యే మళ్ళీ చదివిన తరవాత ఈ పుస్తకంపై ఒక పరిచయ వ్యాసాన్ని రాయాలన్న కోరికను ఆపుకోలేకపోయాను. అందుకే ఇలా మళ్ళీ మీ ముందుకు….

తెలుగులో ఆత్మ కథలు తక్కువ. అందులో విశేష ప్రతిభ కలిగిన సాహితీకారుల జీవిత విశేషాలున్న పుస్తకాలను వేళ్ళ మీద లెక్కించ వచ్చు. ఈ పుస్తకాన్ని “తెలుగువాడు తెలుగుకి కట్టిన పట్టం” గా కొందరు వర్ణించారు. నాకైతే తెలుగులో ఎటువంటి రచనలో (వచన, పద్య రచనలు కలుపుకొని) సిద్ధహస్తులు కావాలనుకున్నా, వారికి ఈ పుస్తకం ఒక పెద్దబాల శిక్ష లా అనిపిస్తుంది. శ్రీపాద వారికి తెలుగు భాష అంటే
ఎంత మమకారమో తెలుస్తుంది ఈ పుస్తకంలో. ఈ పుస్తకం చదివిన వారికి తెలుగు భాష మీద ప్రేమ మరింత పెంచుతుంది. ఈ పుస్తకంలో వాడిన భాష ఇప్పుడు ఎక్కువ వాడకంలో ఉన్నట్టు కనపడదు. అప్పటి వాడుక భాషలో ఉన్న పదాలను తెలుసుకోటానికైనా ఈ పుస్తకం చదివి తీరాలి.

“జాతీయమైన తెలుగు భాష కావాలంటే స్త్రీల దగ్గిరే నేర్చుకోవాలి; మర్యాద గల తెలుగుభాష కావాలంటే, మళ్ళీ, క్షత్రియ రమణుల దగ్గరే నేర్చుకోవాలి, మరోదారి లేదు.”  ఇలాంటి సునిశితమైన పరిశీలనలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. తన తరం చవిచూచిన అనుభవ సారాన్ని అంతా ఈ పుస్తకం ద్వారా తరవాత తరాలకు అందించారు శాస్త్రి గారు. సుద్ధశోత్రియ కుటుంబంలో జన్మించిన శ్రీపాదవారు అప్పటి కుటుంబాల్లో
ఉన్న ప్రేమ, అనురాగాల్ని మాత్రమే కాక పంతాలూ – పట్టింపులూ కూడా మన కళ్ళ ముందు ఉంచుతారు ఈ పుస్తకం ద్వారా. ఒక్క బ్రాహ్మణ కుటుంబాల్లోనే కాక అప్పటి సమాజంలో ఇతర కులస్థులైన కమ్మ, రెడ్డి మొదలైన వారి మధ్య ఒకరంటే మరొకరు ఎంతటి గౌరవానురాగాలు కనపరిచేవారో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది.

ఈ పుస్తకంలో కొన్ని విషయాలు నా బుర్రకెక్కటానికి కొంచెం సమయం పట్టింది. ఒక చిన్న ఉదాహరణ. తన తండ్రి, అన్నలకు ఏ మాత్రమూ ఇష్టంలేని తెలుగు రచనా వ్యాసాంగాన్ని చాటుగా, ఎవరికంటా పడకుండా శాస్త్రి గారు ఎలా సాధించారో తెలుసుకున్న కొద్దీ, తరవాత తరాల్లో తెలుగులో రచనలు చేసినావారు తప్పకుండా ఈ పుస్తకం వల్ల ప్రభావితులు అయి ఉంటారని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను.

తన 13వ ఏటనే కథలు రాయటం ప్రారంభించి, తెలుగు కథా ప్రపంచంలో అనితరసాధ్యమైన శిల్పంతో, చదువరుల మనస్సులను చూరగొన్న శాస్త్రిగారి కథల వెనుకనున్న కథ ఏమిటో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఈ మధ్య వచ్చే చాలా తెలుగు కథలు ఎందుకు పేలవంగా ఉంటున్నాయో కూడా ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. కథా రచనలో బహుశా శాస్త్రిగారు ఎదురుకున్న ప్రతిబంధకాలూ, అనుభవించిన నిర్బంధాలూ, పొందిన ఆవేదనా,
పట్టిన దీక్ష, చేసిన సాధనా, ఆ సాధనలో వారు కనపరచిన పరాకాష్టా ఉంటేగాని ఉత్తమ సాహిత్యం సాధ్యం కాదేమో.

నా దగ్గర ఉన్న పుస్తకం అచ్చేసినవారు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు. ఈ పుస్తకంలో ముందుగా “చదివినవారన్న మాటలు” శీర్షికతో, కొందరు  మహామహులు ఈ పుస్తకానికి ఇచ్చిన
విలువ తెలుసుకుంటే, ఎందుకు శ్రీపాదవారి పేరు తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందో తెలుస్తుంది. కొందరి చదువరల పేర్లు: వేలూరి శివరామశాస్త్రి, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, పురిపండా అప్పల స్వామి, విశ్వనాథ సత్యనారాయణ, ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి, జనమంచి వేంకట సుబ్రహ్మణ్య శర్మ, చిలుకూరి పాపయ్య శాస్త్రి,
నీలంరాజు వేంకట శేషయ్య, మహీధర రామమోహన్, మల్లాది రామకృష్ణ శాస్త్రి, మునిమాణిక్యం రఘురామ యాజ్ఞవల్కి.

ఈ పుస్తకం చదవటం పూర్తి అయ్యేసరికి తెలుసుకున్న ఒక నిజం నన్ను చాలా బాధ పెట్టింది. తెలుగు జాతి కోసం ఇంత శ్రమించిన వ్యక్తి, తన అవసాన దశలో అయినకాటికి తన రచనలు అమ్ముకోటానికి సిద్ధపడ్డారట! అంటే శాస్త్రిగారు ఎంతటి దారిద్యం అనుభవించారో! ఈ విషయం సాహితీ ప్రియుల కంట తడి పెట్టిస్తుంది. తెలుగువారికి తమ జాతి రత్నాలను గుర్తించే జ్ఞానం ఎప్పుడు వస్తుందో కదా!

You Might Also Like

19 Comments

  1. maitreyi

    <<>>

    నాకు తెలిసి శాస్త్రి గారు చివరదాకా చాల గౌరవ ప్రద మైన జీవితం గడిపారు.
    వారు స్థితిమంతులు. మా వారి తాత గారి ఊరికి పొలం పనుల మీద వచ్చి వీరి ఆతిధ్యం స్వీకరించే వారట.
    అసలు పుస్తకం అమ్మటం తప్పని భావిస్తూ అలా అన్నారేమో !

    1. Sowmya

      నేనూ గత వారం రోజులుగా ఈ పుస్తకాన్ని పారాయణం చేస్తున్నట్లు చదువుతున్నాను. నాకైతే నాకు ఏకాస్తో పరిచయం ఉన్న ఊరే పూర్తిగా కొత్తగా కనిపిస్తే ఎలా ఉంటుందో…అలాగనిపిస్తోంది.

      పుస్తకంలోని భాష నాకు మొత్తంగా అర్థం అవుతుంది అనను కానీ, అయినా నాకు ఆ పలుకుబళ్ళూ, వాడకం చాలా నచ్చాయి.

      అలాగే, తాను చూసిన సమాజం గురించి శాస్త్రి గారి పరిశీలనలూ ఆసక్తికరంగా ఉన్నాయి.

      @Maitreyi garu: నేను మూడో భాగం మొదటిదాకా వచ్చాను… చివరి రోజుల్లో ఏమైందో తెలీదు కానీ, మధ్యలో మాత్రం ఆర్థిక ఇబ్బందుల వల్లనే తాను అవధానం చేయడానికి పూనుకున్నానని రాసారు.

  2. నరసింహారావు మల్లిన

    తెలుగుభాష పట్ల అభిమానమూ గౌరవమూ ఉన్న వారంతా తప్పక చదవాల్సిన పుస్తకం. మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.

  3. విష్ణుభొట్ల లక్ష్మన్న

    శాస్త్రి గారి జననం 1891. మరణం 1961. సుమారు 75 కథలకు కర్త అయిన శ్రీపాద వారి (కొన్ని) కథల మూడు సంపుటాలుగా (నాకు తెలిసి) విశాలాంధ్ర వారు 1992లో ప్రచురించారు. ఆ తరవాత ఏమైనా ప్రచురించబడ్డాయేమో తెలియదు. ఒక వేళ ఆ సాహిత్యం అంతా ఇప్పుడు మార్కెట్లో దొరక్కపోతే, మళ్ళీ ఈ సాహిత్యమంతా ప్రచురణకు అర్హమే!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  4. రవి

    ఆయన కథల సంపుటాలు అనేకం దొరుకుతున్నాయి, విశాలాంధ్రలో. “పుల్లంపేట జరీచీర” అన్న కథల సంపుటి ఒకటి ఉన్నది, బాగా పాపులర్.

  5. చంద్రశేఖర్

    లక్ష్మన్న గారూ, శ్రీపాద వారి ఆత్మకథ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. పాశ్చాత్యభావజాలంతో, భాషలతో పరిచయం లేకుండ ఆధునిక అభ్యుదయభావాల్ని ఒరిజినల్ గా, తన నిశిత పరిశీలనాదృష్టే పెట్టుబడిగా తెలుగువారికి అందించిన మహానుభావుడు శ్రీపాద ఒక్కరే అంటే అతిశయోక్తి కాదేమో. అలాగే, ఆధునిక జీవితానికి వచనప్రక్రియల అవసరాన్ని గుర్తించి వాటి పరిపుష్టికి జీవితాన్ని అంకితం చేసిన క్రాంతదర్శి ఆయన. తనకంఠస్వరం ఏ భావజాలాన్ని సమర్ధించినా తన కథనంలో అన్ని కంఠస్వరాలనూ వినిపింపజేసిన గొప్ప కళాకారుడు, సహృదయుడాయన. ఆయన ఇచ్చిన స్ఫూర్తి అమరం.

  6. Meher

    బొల్లోజు బాబాగారూ,

    🙂

    హవ్వ, అదే మీ చేతికొచ్చిందా! అవును నేనే. అసలు మీ అదృష్టం కొద్దీ అదైనా దొరికింది. కాసేపైతే లైబ్రరీ డిపాజిట్టు గాలికొదిలేసి పుస్తకాన్ని నేనే వుంచేసుకోవాలని కూడా కక్కుర్తి పడ్డాను 🙂 వదల్లేక వదల్లేక వదిలాను. ఎలాగూ వదులుకోవాలి కాబట్టి, వున్న నెల రోజుల్లోనే రెండు సార్లు చదివాను. పునఃపఠనానికి వీలుగా ఆ టిక్కులు పెట్టుకున్నాననుకుంటా.

    మీరు మాత్రం నాలాంటి కుట్రలేం మనసులోకి రానీయక బుద్ధిగా తిరిగి లైబ్రరీకిచ్చేయండి. నేనూరెళ్ళినపుడు మళ్ళీ చదువుకోవాలి 😛

    మెహెర్

  7. స్వాతి కుమారి

    ఈయన పుస్తకాల్లో చదివి తీరవలసినవి ఇంకా ఉంటే చెప్పండి.. త్వరలో ఇక్కడ పుస్తకాల సంత ఉందిగా, దొరుకుతాయేమో.

  8. బొల్లోజు బాబా

    meher gaaru
    కాకినాడ మాదిరెడ్డి గారి లైబ్రేరీలో ఈ పుస్తకంలో టిక్కులు/ మార్కులు/ అండర్లైనులు చేసింది మీరే కదూ? 🙂

    బొల్లోజు బాబా

    1. Varaprasad.k

      Maadireddy library ఎక్కడ మాస్టారూ.

    2. Varaprasad.k

      శ్రీపాద వారి పుస్తకాలు కాకినాడలో ఎక్కడ దొరకవచ్చు.

  9. Meher

    మంచి పరిచయం.

    >>> నాకైతే తెలుగులో ఎటువంటి రచనలో (వచన, పద్య రచనలు కలుపుకొని) సిద్ధహస్తులు కావాలనుకున్నా, వారికి ఈ పుస్తకం ఒక పెద్దబాల శిక్ష లా అనిపిస్తుంది.

    అవును నిజం. పెడితే సంక్షిప్తంగా కాదు, పూర్తి పుస్తకాన్ని నాన్-డిటైల్డ్‌గా పెట్టాలి. విశాలాంధ్రా వాళ్ళు ఈ పుస్తకాన్ని పునర్ముద్రిస్తే బాగుంటుంది.

  10. Bhaktavatsalam

    చాలా మంచి పరిశీలన. ఈ మధ్యనే నేను కూడా ఈ పుస్తకం కొంత భాగం చదవటం జరిగింది. ఇరవయ్యో శతాభ్దపు సాంఘిక చరిత్ర చదువుతున్న అనుభూతి కలిగింది. గోదావరి జిల్లావాసి అయినప్పటికీ కాకతీయ సీమ, (వరంగల్), కడప, కర్నూల్, ప్రాంతాల్లో మాట్లాడే చిక్కని తెలుగు భాష పట్ల మమకారం, గౌరవం కనబడుతుంది. సమకాలీన ధాష్టీకంతో పోల్చండి!

  11. commenter

    It is unfortunate that an article that is introducing such beautiful Telugu writing has so many typos. Please take some time to correct them.

  12. విష్ణుభొట్ల లక్ష్మన్న

    జనార్థన రెడ్డి గారూ:

    పరిచయ వ్యాసం నచ్చినందుకు సంతోషం! నేను ఉండేది ఆష్టిన్, టెక్సాస్ (USA) లో. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో పుస్తకాల అందుబాటు, అమ్మకాలపై నాకు అవగాహన తక్కువ. కానీ, ఈ పుస్తకం ఇప్పుడు అమ్మకానికి అందుబాటులో లేకపోతే మళ్ళీ ముద్రించతగిన గొప్ప పుస్తకం ఇది. వీలైతే, గ్రంధాలయాల్లో అయినా దొరికితే తీసుకొని చదవండి.

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  13. జనార్ధన రెడ్డి

    ఒక గొప్ప పుస్తకాన్ని గుర్తుచేసినందుకు మీకు ధన్యవాదాలు.ఈ పుస్తకం చదువుతాను.
    పుస్తకం వివరాలు, ఎక్కడ దొరుకుతుంది – వంటి వివరాలు ఏమన్నా తెలిస్తే, చెప్పగలరు.

  14. శ్రీహర్ష

    నాకు చాలా బాగా నచ్చిన పుస్తకాల్లో ఇదొకటి. ఈ పుస్తకం చదువుతున్నంత సేపు నేను చాలా ఉద్విగ్నతకు లోనయ్యాను….. తెలుగు గురించి ఇంతలా తపన పడ్డాడా ఓ మనిషి అని…..

    ఈ పుస్తకం సంక్షిప్త రూపాన్ని పాఠ్య పుస్తకాల్లో non-detail గా పెట్టాలి అని నా అభిప్రాయం.

  15. రవి

    ఈ పుస్తకం విశాలాంధ్రలో ఇప్పుడు దొరకట్లేదు.

Leave a Reply