Modern Reading – A miscellany

selectbookపేరు కాస్త భయపెట్టేలా ఉంది – నిజమే. నేను కూడా ఈ పుస్తకం చదవ సాహసించేదాన్ని కాదు. బెంగలూరు బుక్ ఫెస్ట్ లో తిరుగుతున్నప్పుడు “సెలెక్ట్ బుక్ షాప్” స్టాల్ కనిపించింది. లోపలికెళ్ళి తిరుగుతూ ఉంటే ఈ పుస్తకం కనిపించింది. అక్కడే కూర్చుని ఉన్న మూర్తి గారిని అడిగాను – ఏమిటిది? అని. “సెలెక్ట్” అరవై ఏళ్ళు పూర్తైన సందర్భంగా వేసిన పుస్తకం అన్నారు. “ఓహ్..ఇదేదో బాగుందే…” అనుకుని కొన్నాను. చదవడం మొదలుపెట్టాక అర్థమైంది ….. ఆ miscellany అనడంలోని అర్థం. ఇంత భిన్న విషయాలపై వ్యాసాల్ని ఒకే సంకలనంగా వేయడం ఇదే నేను మొదటిసారి చదవడం, చూడటం. It was a wonderful experience reading and browsing through this book.

సీ.వీ.రామన్ తో ఓ ఫొటోగ్రాఫర్ కు ఉన్న పరిచయం, మైసూర్ రాజ్య చరిత్ర పై ఓ అధ్యయనం, చరకుడి చరిత్ర, పుస్తక సంరక్షణ, సెకండ్ హాండ్ పుస్తకాల కొట్లు, ఒక కథ, పశ్చిమ కనుమల్లో ఉన్న వైల్డ్ ఆర్కిడ్స్ గురించి ఓ వ్యాసం, చోమ్స్కీ కి పరిచయం, సెలెక్ట్ మూర్తిగారి తమ్ముడి జ్ఞాపకాలు – ఇలా రకరకాల (బహుశా పరస్పర సంబంధం కూడా లేని) విషయాల గురించిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. వీటిలో నాకు అన్నింటికంటే బాగా నచ్చిన వ్యాసాలు – పుస్తకాల గురించి, పుస్తకాల కొట్లతో ఏర్పడే అనుబంధాల గురించీ, పుస్తకాలను కొనే ప్రక్రియ గురించి రాసిన వ్యాసాలు. వ్యాసాలు రాసిన పద్ధతి కూడా రకరకాలు. ఒకరేమో, పాత రోజుల్ని నెమరువేస్తున్నట్లు…ఒకరు, రిసర్చి పేపర్ రాస్తున్నట్లు…ఒకరు, ఎక్కడో మాట్లాడ్డానికి రెడీ చేసిన లెక్చర్ ట్రాన్స్క్రిప్ట్…. అందుకనే, వ్యాసాలు చదివేతీరులో కూడా మనకి కావాల్సినంత వెరైటీ.

“సెలెక్ట్” మూర్తి గారిని కదిలిస్తే ఎన్నో కథలు చెబుతారు పుస్తకాల గురించి, తమ షాపు గురించి, షాపుకొచ్చేవారి గురించి. అలాంటి కథలెన్నో ఉన్నాయి ఈ వ్యాసాల్లో. అలాగే, టాగోర్ ఆత్మకథ సంపాదకురాలు -ఉమా మహదేవన్-దాస్ గుప్తా – బెంగళూరు లో చదువుకున్నారనీ, సెలెక్ట్ కి వచ్చేవారనీ విన్నాక ఏమనిపించింది? మనోహర్ మల్గావ్కర్ ఒకసారెప్పుడో ఏదో పుస్తకం దొరక్క వెళ్ళిపోతే, ఆ విషయం గుర్తుపెట్టుకుని ఎన్నో ఏళ్ళ తరువాత ఆయన కూతురు ఇటొస్తే, మూర్తిగారు గుర్తు పెట్టుకుని మరీ ఈ పుస్తకం ఇచ్చారనీ తెలిస్తే మీకేమనిపిస్తుంది? ఓ అరుదైన పుస్తకమో, చాన్నాళ్ళుగా వెదుకుతున్న పుస్తకమో – ఉన్నట్లుండి ఏ పాత పుస్తకాల కొట్టులోనో దొరికితే ఎలా ఉంటుంది? – ఇలాంటి కథల్ని చదువుతూ ఉంటే – వ్యాస రచయితల నొస్టాల్జియాలో మనమూ భాగస్థులం కామూ?

అలాగే, ఇవి అటు పెడితే, ఈ పుస్తకం చదువుతూ ఉంటే, నాకు చరకుడి చరిత్ర, నటరాజ స్వామి విగ్రహం గురించిన కథా, resurrecting village tanks – ఇన్ని రకాల టాపిక్స్ చదివే అవకాశం చిక్కింది. ఇలాంటి వ్యాసాలు ఇలా సింగిల్గా చదివే అవకాశం బహుశా నాకు ముందైతే దొరికి ఉండేది కాదేమో. వీటిలో నాకు నచ్చినదేమిటంటే – ఇవన్నీ వేటికవి ప్రత్యేక కార్యరంగాలు. దేని గురించన్నా పుస్తకాలకి పుస్తకాలే వస్తూ ఉంటాయి. కానీ, ఇక్కడి వ్యాసాల్లో, వీలైనంత సరళంగా ఉన్నాయి. కనుక, చదవబుల్. తల పైన్నుంచి వెళ్ళిపోవు. చాలాభాగం అర్థమౌతుంది (నాకే అర్థమైందంటే… ఇక అందరికీ అర్థమౌతుందన్నట్లే!!)

ఇందులో ఒకానొక వ్యాసం చదువుతూ ఉండగా నేను చెన్నైలో ఒకప్పుడు ఉండి ఆ తరువాత దాదపు ఇరవై ఏళ్ళ క్రితం అగ్నిప్రమాదంలో కాలిపోయిన మూర్ మార్కెట్ గురించి చదివాను. ఆ తరువాత నెట్లో చూస్తూ ఉంటే – మూర్ మార్కెట్ గురించిన ఆసక్తికరమైన కథనం ఒకటి చదివాను. (వివరాలు: ఇక్కడ). అక్కడ కథ ఇది: వ్యాస రచయిత్రి 1980 లో లా విద్యార్థిని గా ఒక అరుదైన పుస్తకాన్ని మూర్ మార్కెట్లో కొన్నదట. ఓ ఐదారేళ్ళ తరువాత, ఒకరు స్నేహితుడై, తర్వాత వీళ్ళిద్దరూ పెళ్ళిచేస్కోవాలని అనుకున్నారు. ఆ రోజుల్లో ఓరోజు ఏదో పనుండి మళ్ళీ ఈ పుస్తకాన్ని ఆమె బైటకి తీస్తే, పుస్తకంపై ఉన్న పేరు, x-x-1976 అన్న తేదీ చూసి అవాక్కైందట. కారణం : ఈ పుస్తకం అప్పటి యజమాని ఇప్పటి తన ప్రేమికుడు! అతను చదివిన నాలుగేళ్ళకి ఈమె అదే పుస్తకం చదవడం ఏమిటో, ఐదేళ్ళ తరువాత వీళ్ళిద్దరూ కలిసి పెళ్ళి చేస్కోడం ఏమిటో అని… కర్మ సిద్ధాంతం దాకా వెళ్ళారు ఆ వ్యాసంలో 😉

ఇందులో రకరకాల సందర్భాల్లో, రకరకాల విషయాల గురించి వ్యాసాలు ఉన్నాయి. వ్యాసకర్తల పేర్లు ఉన్నాయి కానీ – వాళ్ళ గురించిన వివరాలు ఎక్కడా ఇవ్వకపోవడంతో కాస్త అసౌకర్యంగా అనిపించింది. రామచంద్ర గుహ వంటి వారైతే, పేపర్లలో తరుచూ చూసేపేరు. కానీ, ఈ పుస్తకంలో రాసిన వాళ్ళు దాదాపు తొంభైశాతం మంది నాకు ఎవరో తెలీదు. తెలిసి ఉంటే, బహుశా, i would have appreciated them better.

మర్చిపోయా – కొన్ని కన్నడ వ్యాసాలు కూడా ఉన్నాయి – అవేమిటో, వేటి గురించో నాకు తెలీదు కనుక నో కామెంట్స్..

అన్నట్లు, పుస్తకం మొదట్లోనే మూర్తిగారు కర్ణాటక గవర్నర్, పుస్తక ప్రియులు అయిన టీ.ఎన్.చతుర్వేది తో చేసిన ఇంటర్వ్యూ ఉంది. నేను బుక్ ఫెస్ట్ లో – ఇలాంటివే ప్రశ్నలు మిమ్మల్ని పుస్తకాల గురించి అడిగితే, పుస్తకం.నెట్ కి ఇంటర్వ్యూ ఇస్తారా? అని అడిగితే, సరే నన్నారు. 🙂 సో, ఈసారి ఈ ఇంటర్వ్యూ చేసి మీకు కూడా చూపిస్తా 🙂

పుస్తకం వివరాలు:
Modern reading : A miscellany
A Sashtabdhipoorti release by Select books, Bangalore
71, Brigade road cross, Bangalore-5600001
ph:080-25880770

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సెలవు. (ఇప్పుడు డీడీ వార్తలే చూడట్లేదు…ప్చ్!)

You Might Also Like

2 Comments

  1. పుస్తకం » Blog Archive » బెంగళూరులో పుస్తకాల కొనుగోలు అనుభవాలు

    […] ఇక, బెంగళూరంటే నాకు గుర్తొచ్చేంత గుర్తుండిపోయిన షాపులు: సెలెక్ట్ బుక్ షాపు నాగరాజు గారు ఒకసారి సెలెక్ట్ బుక్ షాపులో ఎవరో ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తీసుకెళ్ళారు. అదే అక్కడికి నేను మొదటిసారి, చివరిసారీ వెళ్ళడం. కానీ, ఆ ఒక్కసారి లోనే, ఈ షాపు నాకు బాగా గుర్తుండిపోయింది. నాకు పుస్తకాల షాపు అంటే, అంతులేనంత వైవిధ్యం ఉండాలి మొదటగా. ఆ తరువాతే నేను మరేమన్నా చూసేది అక్కడ.నేను చూసిన కాసేపట్లో ఆ వైవిధ్యం ఇక్కడ కనబడ్డది. ఉన్న పుస్తకాలు నేను చదివే రేంజిలో ఉంటాయా లేదా అన్నది వేరే విషయం. అలాగే, మూర్తిగారు అక్కడ కూర్చుని ఆయన కథ చెబుతున్న దృశ్యం నా మనసులో నిలిచిపోవడం కూడా, ఈ షాపు నచ్చడానికి ఒక కారణం అనుకుంటాను. ఆరోజుటి అనుభవం గురించి ఇక్కడ రాసాను. సెలెక్ట్ బుక్ షాప్ కి అరవై ఏళ్ళు నిండిన సందర్భంగా వేసిన పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో వచ్చిన పరిచయం ఇక్కడ చదవొచ్చు. […]

Leave a Reply