గొల్లపూడి మారుతీరావు గారితో ఇంటర్వ్యూ – 2

ఈ ఇంటర్వ్యూ మొదటి భాగం – ఇక్కడ. ఇక రెండో భాగం చదవండి.
***************************************************

మీరు తరుచుగా వెళ్ళిన / వెళ్ళే పుస్తకాల షాపులు గురించి చెప్పండి..

నేను రచనలు ప్రారంభించిన తొలి రోజుల్లో దాదాపు ప్రతీరోజూ వెళ్ళి కూర్చున్న పుస్తకాల షాపు విశాఖపట్నంలో హిందూ రీడింగ్ రూంకి ఎదురుగా వుండే గుప్తా బ్రదర్స్. దాని ప్రొప్రయిటర్ జగన్నాధ గుప్తా గారు స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తి. వారబ్బాయి రామం నాకు మిత్రులు. షాపులో పుస్తకం ఇంటికి తీసుకువెళ్ళి చదువుకునే అవకాశం రామంగారు నాకు ఇచ్చేవారు. ఇక్కడే శ్రీశ్రీన్, పురిపండా అప్పలస్వామినీ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, పన్యాల రంగనాధ రావు వంటి సాహితీ మిత్రుల్ని కలిశాను. చదువు పూర్తయి మొదటి ఉద్యోగానికి(ఆంధ్ర ప్రభ లో) విజయవాడ వచ్చినప్పుడు అప్పటి నవోదయా పభ్లిషర్స్, తర్వాత పి.ఎస్.ప్రకాసరావుగారి నవభారత్ బుక్ హౌస్ నాకు నిరంతరం చేరే గమ్యం. పరపతిని సాధించిన తర్వాత- ఇప్పుడిప్పుడు నాకు ఎందరో రచయితలు తమ పుస్తకాలు పంపుతారు. ఏ సభకి వెళ్ళినా అయిదారు పుస్తకాలతో ఇల్లు చేరుతాను. అప్పుడప్పుడు మద్రాసులో Land Mark కి వెళ్ళి పుస్తకాలు కొనుక్కుంటాను. ఎప్పుడేనా హైదరాబాదు వెళ్ళినప్పుడు కాచిగుడా దగ్గర నవోదయా బుక్ హౌస్ నన్ను ఆకర్షిస్తుంది.

గ్రంధాలయాల గురించి?

పైన సమాధానం చెప్పాను. నాటకరంగానికి సంబందించిన గ్రంధాలకి, విమర్శక గ్రంధాలకి తరుచుగా మద్రాసులో అమెరికన్ కల్చరల్ సెంటర్ కి వెళ్తాను. నాటక రంగం ప్రసక్తి వచ్చింది కనుక నన్ను చాలా ఆకర్షించిన పుస్తకం ప్రముఖ అమెరికన్ నాటక విమర్శకుడు Walter Kerr “How Not to Write A Play”. ఆత్మకధల విషయంలో “Telling Lives”

పుస్తకాలు చదివే వాళ్ళని “అంత సమయం ఎలా ఉంటుందండీ బాబూ” అని అడిగేస్తూ ఉంటారు జనాలు. అదే మాట మిమల్ని అడిగితే, మీ జవాబు.

వాళ్ళని చూసి జాలిపడతాను. కాని సుళువుగా క్షమిస్తాను.

ఇప్పుడంటే, పుస్తకాల కొట్లు, ఆన్లైన్ షాపింగ్, ఈబుక్స్ ఇలా ఎన్నోమార్గాలున్నాయి. మీ చిన్నతనంలో ప్రధానంగా పుస్తకాలు ఎలా తెచ్చుకునేవారు? గ్రంథాలయాల్లో మనం అడిగిన పుస్తకాలు తెప్పించుకునే సౌకర్యాలు ఉండేవా?

ఈ ప్రశ్నకీ పైన సమాధానం చెప్పాను.

అనుభవం కలిగే కొద్దీ, ఓ పుస్తకాన్ని గానీ, రచయితని గానీ – కొంతవరకూ అంచనా వేయగలమంటారా? (ఆ రచన/రచయితది మనం ఇదివరకు ఏదీ చదవకున్నా కూడా). ఎందుకడుగుతున్నాను అంటే – ఇప్పుడేదన్నా పుస్తకాల కొట్టుకు వెళ్తే, వందల వేల కొద్దీ పుస్తకాలుంటాయి. ఒక్కోసారి మనకసలు ఊరూ పేరూ తెలీని రచయితల పుస్తకాలు చూసి కూడా – ఏ కవర్ పేజీ చూసో, టైటిల్ చూసో ఆకర్షితులమై, అట్టవెనుక కథ చూసి కొనాలి అనుకోవచ్చు. తీరా కొన్నాక అది చెత్త అని తేలొచ్చు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలని (జేబుకి చిల్లు కనుక అవాంఛనీయమే! 🙂 ) చదువరిగా అనుభవం పెరిగే కొద్దీ అరికట్టగలమంటారా?

నిర్డుష్టంగా అంచనా వేయవచ్చు. నన్నడిగితే ఆ వ్యక్తి శీలాన్ని (profile) బేరెజు వేయవచ్చు. మళ్ళీ చెప్తున్నాను. వయస్సుని బట్టి, అభిరుచిని బట్టి. మన సంస్కారాన్ని బట్టి, మన అవగాహన స్థాయిన్ బట్టి మనం చదివే పుస్తకం వుంటుంది. మరోలా చెప్తాను. మన చేతిలో ఉన్న పుస్తకం మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ఈ వాక్యం రాయగానే గుర్తొచ్చిన విషయం- హత్య కాక ముందు చెర్లపల్లి జైల్లోంచి మొద్దు శీను నా “సాయంకాలమైంది’ నవల చదివి నన్ను గురువుగా భావిస్తున్నానంటూ సుదీర్ఘమైన ఉత్తరం రాశారు. ఆయన వ్యక్తిత్వానికి ఇది అద్దమా? లేక నా generalisationకి ఇది విపర్యయమా!

మీకు ఫలాని చోట ఫలాని పుస్తకం తప్పక దొరుకుతుంది – వంటి సమాచారం ఎలా దొరికేది, పాతరోజుల్లో?

ఆ ప్రసక్తి లేదు. దొరికే చోటే నేను ఉండేవాడిని కనుక.

మీకు పుస్తకాల ఎంపిక చదవడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఎలా జరిగేది? ఎవరన్నా మీకు ఇవి చదువు..అని తెచ్చి ఇచ్చేవారా? లేక, దొరికినవన్నీ చదువుతూ మీరే మీకంటూ ఓ అభిరుచిని ఏర్పర్చుకున్నారా?

తొలి రోజుల్లో ఆకలితో వున్న వ్యక్తి వంట గదిలోకి దూకిన సందర్భం లాంటిది. చేతికి దొరికిందల్లా చదివాను. చదివిందానిలో ఏ కొత్తయినా మనస్సుని అయస్కాంతంలాగ ఆకర్షించేది.
మిత్రులు చదవమని సూచించిన సందర్భాలు తర్వాతి దశ.

మీరు రచయిత కూడా కదా – మీరు ఫలానా తరహా విషయంపై రాస్తున్నప్పుడు అదే విధమైన వస్తువులపై పుస్తకాలు చదివితే, వాటి ప్రభావం నా రచనపై పడుతుంది అని అనిపించి, చదవడం ఆపేసిన సందర్భాలున్నాయా?

లేదు. లేదు. నిజానికి ఆ విషయానికి సంబంధించిన చదవడమే ఎక్కువ. వాటి ప్రభావం పడడం కన్న ఆ విషయం మరింత focus లోకి రావడం ముఖ్యం కదా?

మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు కళాశాలల్లో రీడింగ్ క్లబ్స్ వంటివి ఉండేవా? ఒకరు చదువుతున్న పుస్తకం గురించి ఇంకోళ్ళతో చర్చించడం – ఇలాంటివి ఏ విధంగా జరిగేవి?

కళాశాలల్లో రీడింగ్ క్లబ్స్ లేవు. కాని విశాఖలో విశాఖ సాహితి సమావేశాలలో రాసిన రచనలు చదువుకొని చర్చించే సంప్రదాయం వుండేది. అలాగే విజయవాడలో మహీధర రామమోహన రావుగారు కొన్ని సమావేశాలు జరిపేవారు. అక్కడ రచనలు చదివి చర్చించుకునే సంప్రదాయం ఉండేది. నేను డిల్లీలో ఉండగా (1959) పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించారు. కపిలకాశీపతి, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, పన్యాల, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు, శెట్టి ఈశ్వరరావ్ వంటి వారలు సమావేశమయి- నా “చీకటిలో చీలికలు’ నవలలో కొన్ని భాగాలు, “రాగరాగిణ్’ నాటకం విని చర్చించారు.

పుస్తకాలు ఎంచుకోడం విషయంలో మీరు ఏమన్నా సలహాలు ఇవ్వగలరా? ఇందాక అన్నానే – టైటిల్/కవర్పేజీ వంటివి చూసి మోసపోవడం గురించి – అలాంటివి జరక్కుండా ఉండేందుకు.

చదవడానికి ఏ పుస్తకమూ అనర్హం కాదు. కాగా, మీ అభిరుచే మీ పుస్తకాల ఎంపికన్ నిర్ణయిస్తుంది. టైటిల్ చూసి మోసపోయినా తప్పులేదు. కొన్ని శీర్షికలతో పాఠకుడిని ఎలా మభ్య పెట్టవచ్చో తెలియడమూ విద్యే!

అన్నట్లు, బుక్ ఫెయిర్ల సంస్కృతి మీరు యువకులుగా ఉన్నప్పుడు కూడా ఉండేదా?

ఆ అదృష్టం మాకు లేదు.

నాకు ఎప్పుడూ కలిగే సందేహాన్ని మళ్ళీ మీ ముందుంచుతున్నాను – ఇప్పుడంటే ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచంలోని ఏమూల సంగతినన్నా తెలుసుకుంటున్నాము. అంతకుముందు ప్రపంచంలోని వివిధ దేశాల సాహిత్యం గురించి ఇక్కడున్న తెలుగువారికి ఎలా తెలిసేది? “ఎంత” తెలిసేది అన్నది పెరుగుతూ వచ్చిందంటారా అప్పటితో పోలిస్తే ఇప్పుడు?

మంచి ప్రశ్న. నా సమాధానం జాగ్రత్తగా చదవండి. ఇంగ్లీషు పాలన వల్ల మనదేశానికి జరిగిన అనర్ఢం మాట పక్కన పెడితే- ఈ దేశానికి దక్కిన అదృష్టం- ఇంగ్లీషు. ప్రపంచ భాషలలో- ఒక్క ఇంగ్లీషు భాషే- ఎటువంటి స్పర్ద లేకుండా ప్రపంచంలోని అంత గొప్పతనాన్నీ తెచ్చుకుంది. మనకి సంస్కృతం రాకపోయినా వేదాల్ని, భగవద్గీతని, మహా భారతాన్ని, శిలాప్పదికరం ని, త్యాగరాజు సంగీతాన్ని, తమిళ పాశురాల్ని, జయదేవుని అష్టపదుల్ని- దేన్నయినా చదువుకోవచ్చు. ప్రపంచ సాహిత్యంలో- సాహిత్యం అన్నమాటేమిటి? అన్ని రంగాల ప్రాశస్త్యాన్ని తమ భాషలోకి తెచ్చుకున్నారు ఇంగ్లీషువారు. నా అదృష్టం- ఏమీ prejudice లేకుండా ఆ భాషని నేర్చుకున్నాను. నేను ఏమీ నష్టపోలేదని తెలుసుకున్నాను.
*****************************************
(సమాప్తం)

You Might Also Like

5 Comments

  1. prasad peddada

    amma kadupu chaduvunna naaku eee interview oka goppa bonus.gollapudigari meeda abhimanam rettimpu ayyindi

  2. VAIDEHI MURALI

    Interview chaala baavundi. Naa manasuloni konni sandehaala javabulu
    ee interview dwara telusukunnanu. Tanks

    Vaidehi Murali,
    Bangalore

  3. శ్రవణ్ కుమార్

    ఇంటర్వ్యూ చాలా బాగుంది. థాంక్యూ.

  4. Emu

    మొద్దు శీను చదివిని నవల e-వెర్షన్ ఉందా? 😀

  5. నిషిగంధ

    ఇంత చక్కని ఇంటర్వ్యూని అందించినందుకు కృతజ్ఞతలు.. గొల్లపూడి గారితో మాట్లాడటం మొదలుపెట్టిన అరక్షణంలో ఆయన విజ్ఞానం అఖండమైనదని అర్ధమైపోతుంది మనకు!!
    ఆఖరి ప్రశ్న, జవాబు చాలా ఆకట్టుకున్నాయి!

Leave a Reply