దేవర కోటేశు, హోరు – తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి

తెలుగు పుస్తకాలు కొనడానికెళ్ళే ముందే, కొనాల్సిన పుస్తకాల జాబితా తయారుచేసుకొని పెట్టుకుంటాను నేను. కొట్లోకి వెళ్ళీ వెళ్ళగానే అక్కడున్న ఎవరో ఒకరికి జాబితా ఇచ్చి నేను దిక్కులు చూస్తూ ఉంటాను. దొరకాల్సినవి దొరికాయా, సరేసరి! లేకపోతే ఓ నిట్టూర్పు విడిచి బయటకొచ్చేస్తాను. అంతే కానీ, ఎప్పుడూ లోపలకెళ్ళి ఏ పుస్తకాలున్నాయి? ఎన్ని ఉన్నాయీ? లాంటి కుతూహలం ప్రదర్శించను. సొంత తెలివితో తీసుకొన్న కొన్ని తెలుగు పుస్తకాలు పెట్టిన వాతలు గుర్తుండడం వల్లానూ, మన తెలుగు పుస్తకాల వెనుకా ముందూ అట్టలపై పుస్తకానికి సంబంధించి తగిన సమాచారం లేకపోవటం వల్లానూ! మొన్నటి సారి వెళ్ళినప్పుడు మాత్రం ఒక పుస్తకంలోని వాక్యాలు చదివి కొనాలని నిర్ణయించుకొన్నాను.

“జ్వరం కంట్లో సూర్యాస్తమం. ఎర్రటి కంటి వేసవి! సంధ్యవేళ అప్పుడే నిప్పులు తీసిన కుంపటి. ఎండల్లో మెట్ట గ్రామం గింగిరాలు తిరుగుతోంది. తార్రోడ్డు నల్ల లావా దారం బొంగరం జాలీ..

జ్వరం దేహం. కిటికీ అవతల ఇవతల చీకటి పడుతోంది. జ్వరం కన్నులా సూర్యుడు. నల్లటి కన్రెప్ప మూసుకుంది. ఒళ్ళంతా వేడి. సూర్యుడి కెమోథెరపీ తరవాత నేల ఒంటి మీద ఒక్క పచ్చ వెంట్రుక లేదు.

ఆవులించాడు. వేడిగాలి బొడ్లోంచి వచ్చినట్టుగా నల్లటి నోరులా, ఎండిన బావుల్లా నోరులాంటి బావులు… మొక్కల నరాలు నేల కింద కుళ్ళిపోయాయి. ఎర్రబల్బు కూడా గాయంలా ఉంది. ఒళ్ళే పుండయ్యిపోయింది. పుండులాంటి బల్బు. ఆఖరి ఎరుపు నలుపులో కలుస్తోంది. కుంకుమ కొండ బద్ధలై విరజిమ్మిన అరుణిమ లేతనలుపులో కరుగుతూంటే రావి చెట్టు మూలిగింది. “

ఎందుకో, చదవచ్చీ పుస్తకం అనిపించింది చూసిన దగ్గర్నుండీ. గడిచిన వారంలో “ఏదైనా వెరైటీగా చదవాల”నిపించినప్పుడు ఈ పుస్తకం మొదలెట్టాను. ఆపకుండా పూర్తి చేశాను. తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి  రాసిన రెండు నవలికలున్నాయి – దేవర కోటేశు, హోరు!

దేవర కోటేశు:

పైన చెప్పబడ్డ వ్యాఖ్యానంతో మొదలవుతుంది ఈ నవలిక. ఎండల్లో మాడి మసవుతూ, ఏనాటికైనా వాన పడి గ్రామం మళ్ళీ కళకళాడుతుందన్న గట్టి నమ్మకంతో ప్రస్థుత గడ్డు పరిస్థితులకు ఎదురీదుతున్న గోదావరి తీర ప్రాంతం గ్రామం తురకపాలెం కథ ఇది. అనాదిగా ఉన్న రామాలయం, గంగమ్మ గుడిలోని దేవతలను భక్తి శ్రద్ధలతో కొలుచుకునే ఈ గ్రామంలో కొత్తగా కోటేశు స్వామి ఆలయం ఎలా వెలసింది? ఒక మామూలు జీవితాన్ని గడిపిన యువకుడు ఉన్నట్టుండి ఊరికి దేవుడెలా అయ్యాడు? కొత్తగా వెలసిన ఈ దేవుడు ఊరికేం చేశాడు? అనేదే కథాంశం.

కథనం కూడా ఆసక్తికరంగా నడిపించారు. పాత్రలు, వాటి తీరు తెన్నులూ నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతపు వాతావరణాన్నీ, భాషా వ్యవహారాల్నీ చాలా బాగా చిత్రీకరించారు. ఈ నవలిక చదువుతున్నంత సేపు, ఓ పక్క ఆ వాతావారణాన్నీ పూర్తిగా ఆస్వాదిస్తున్నా, మన పల్లె ప్రజల జీవితాల్లో కష్ట నష్టాలు మాత్రం ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ వానలపైనే ఆధారపడే మన వ్యవసాయం, అవి రాక, మరేవీ చేయలేక, అప్పుల్లో కూరుకుపోయి బతకలేక చచ్చే వారి జీవనాన్ని చాలా బాగా చూపించారు. కొన్ని చోట్ల మాటల ప్రయోగం మాత్రం నాకు విపరీతంగా నచ్చాయి. ఉదా: ఒక మూగ పిల్లతో ఏదో చెబ్దామని పిలవబోయి ఊరుకొన్న ఒక మనిషిని గురించి చెప్తున్నప్పుడు.. “నిశ్శబ్దంతో మాట్లాడే ఓపిక లేదాయనకు ఇప్పుడు” లాంటి ప్రయోగాలు.

హోరు:

ఇది మరీ చిన్న నవలిక. లేదా కొంచెం పెద్ద కథ. నిజాయితికి మారుపేరైన ఒక ఐ.ఏ. ఎస్ ఆఫీసర్ విధి నిర్వహణలో అలసి జబ్బు పడితే, డాక్టర్ల సలహా మేరకు, భార్య విన్నపం మేరకూ సముద్ర తీర ప్రాంతానికి ఆటవిడుపు కోసం వస్తారు. అప్పటికే పెళ్లై, పిల్లలు లేని వాళ్ల అన్యోన్య దాంపత్యంలో, తెచ్చి పెట్టుకున్న ఈ సాన్నిహిత్యం ఏ పరిణామాలకు దారి తీసింది? ఎవరు ఏ తీరానికి చేరారు? అన్నదే కథాంశం. అనుకుంటాం, దగ్గరయ్యే కొద్దీ దూరాలు పెరిగే అవకాశం ఎక్కువే! దూరంగా ఉన్నప్పుడు కొన్ని అంశాలున్నాయో లేదో తెలీదు. అలా తెలీకపోవడమే శ్రేయస్కరం. దగ్గరయ్యే కొద్దీ అవి భూతద్దంలో కనిపించి, భయపెట్టి దూరాలని ప్రోత్సహిస్తాయి. ఈ కథలో భార్య పాత్రతో నాకు కొన్ని చిక్కులున్నాయి, అవన్నీ ఇక్కడ అప్రస్తుతం. కథ ముగింపు నాకు నచ్చకపోయినా కథనం మాత్రం ఆపకుండా చదివించింది.

మొత్తానికైతే మంచి పుస్తకాన్ని చదివిన అనుభూతి మిగిలింది. చాలా అచ్చు తప్పులున్నాయి పుస్తకంలో, వాటిపై శ్రద్ధ చూపించుంటే బాగుండేది. మీకీ పుస్తకం ఎక్కడైనా కనిపిస్తే ఓ సారి చూడండి, మీకూ నచ్చొచ్చు!

వీరివి ఇతర రచనలుంటే తెలియజేయగలరు! (పోస్టు రాసేసి, ఊరికే వీరి పేరు గూగిలాను. ఒక అనువాదమూ, ఒక కథా కంటబడ్డాయి. మరిన్ని విషయాలు తెల్సిన వారు ఇక్కడ పంచుకోగలరు.)

***********************************************************************************************

దేవరకోటేశు, హోరు
(నవలికలు)
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి
ప్రథమ ముద్రణ: మే, 2007
వెల: రూ 9౦ /-

ప్రతులకు:
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి
86-4-16/1, వాడ్రేవు నగర్, రాజమండ్రి – 533 103
ఫోన్: 0883-242945(O), 2478801(R), Cell: 9440703440

You Might Also Like

2 Comments

  1. malathi

    పతంజలిశాస్త్ర్రి నాకు చాలా మంచి స్నేహీతుడు. అతనిపేరు తెల్లారిలేస్తూనే చూడ్డం నాకు చాలా సంతోషంగా వుంది. మంచికథకుడుగా పేరు తెచ్చుకున్నట్టు నాకు ఇప్పుడే అర్థం అవుతోంది. ఆయనరచనలు పరిచయం చేసినందుకు థాంక్స్, పూర్ణిమా.

  2. కొత్తపాళీ

    పతంజలి శాస్త్రిగారు రాజమహేంద్రవరం వాస్తవ్యులు. చాలా కాలంగా పర్యావరణ రక్షణరంగంలో పనిచేస్తూ ఒక స్వఛ్ఛంద సంస్థ నడుపుతున్నారు. అటు భారతీయ వేద పురాణ గాధలూ, ఇటు సమకాలీన సామాజిక, పర్యావరణ సమస్యలూ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. వడ్ల చిలకలు అనే కథల సంపుటి 90లలో బాగానే సంచలనం కలిగించింది. ఆ తరవాత, 2006 ప్రాంతంలో ఇప్పటిదాకా వెలువడిన కథలన్నీ కలిపి ఒక బృహత్ సంపుటి అచ్చయింది.
    అనేక విభిన్న ఇతివృత్తాలతో మంచి నాటికలు కూడా రాశారు.
    కలిస్తే, చాలా బాగా మాట్లాడుతారు కూడా.

Leave a Reply