తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు – పుస్తక పరిచయం

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
*****************
గాంధీజీ! భారతదేశం స్వాతంత్ర్యం పొందడానికి ప్రధాన కారకుడు! అనేకుల దృష్టిలో ఓ మహానేత! కొందరికి మాత్రం ఆయన విఫల నాయకుడు! ఆయన నచ్చినా నచ్చకపోయినా, ఆయనని ఆమోదించినా, ఆయనతో విభేదించినా స్వాతంత్ర్య సమరంలో ఆయన పాత్రని తగ్గించలేము, ఆయన కృషిని చిన్నది చేయలేము. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీకి ముందు, గాంధీతో పాటు ఎందరెందరో తమ తమ పద్ధతులతో ప్రయత్నించారు. కానీ జనబాహుళ్యం గాంధీమార్గాన్ని ఆమోదించినట్లుగా మరే పద్ధతిని అంతగా ఆదరించలేదు. ఆయన సరళ జీవన విధానం, ప్రజలతో మమేకమైన తీరు జనులు ఆయనను విశ్వసించేలా చేసింది.

‘బహుశా కొన్నితరాల తరువాత – ఇటువంటి మనిషి ఒకడు రక్తమాంసాలతో ఈ నేలమీద జీవించాడంటే నమ్మశక్యం కాని వాస్తవంగా భావిస్తారు’ అని ఐన్‍స్టీన్ గాంధీజీని ఉద్దేశించి అన్న మాటలు ఎంతో నిజం.

చెప్పేవాటిని పాటించి చూపడం ఆయనను వ్యక్తిగతంగా గౌరవించేలా చేసింది, నేతగా అనుసరించేలా చేసేంది. ఇలా ఒక తరాన్ని ప్రత్యక్షంగానో, ఎన్నో తరాలని పరోక్షంగాను ప్రభావితం చేసిన మహానుభావుడు గాంధీజీ. ఏ కాలపు సాహిత్యమైనా ఆనాటి సమాజపు తీరుతెన్నులను, ఘటనలను, గుణదోషాలను విస్మరించజాలదు. భారత స్వాతంత్ర్య సమరం, గాంధీజీ, ఇతర నాయకులు ఇందుకు మినహాయింపు కాదు. భారతీయ భాషలలో స్వాతంత్ర్య పోరాటం గురించి, గాంధీజీ గురించి రచనలు వచ్చాయి. స్వాతంత్ర్యోద్యమాన్ని సమాజంలోని అన్ని వర్గాల వారికి చేర్చేందుకు కథలు, నాటకాలు, పాటల రూపంలో సాహిత్యంలో ఇమిడ్చారు సాహితీవేత్తలు. ఆ కాలంలో తెలుగులోనూ గాంధీజీపై అనేక కథలు వచ్చాయి. గాంధీజీని ప్రధాన పాత్ర గానో లేదా గాంధీ సిద్ధాంతాలను ఇతివృత్తంగా తీసుకుని చాలామంది కథలు వ్రాశారు. జాతిలో స్ఫూర్తినింపేందుకు ప్రయత్నించారు.
***

గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ భావాల ప్రభావంతో సమాజానికి సందేశ రూపంలో, తెలుగు కథకులు రచించిన కథలను సంకలనం చేయాలని ‘గాంధేయ సమాజ సేవా సంస్థ’ మండలి బుద్ధప్రసాద్ పూనుకుని, సంకలన బాధ్యతలను చేపట్టవలసిందిగా శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ గార్లను అభ్యర్థించారు. వీరిద్దరూ కృషి చేసి – గాంధీజీ కేంద్రంగా వచ్చిన కథలు, సమాజంపై గాంధీజీ ప్రభావాన్ని ప్రతిబింబించే కథలు, ఆధునిక సమాజం ఏ రకంగా గాంధీజీ ప్రభావానికి దూరమవుతూ తత్ఫలితంగా నష్టానికి గురవుతూ గాంధీజీని ఎలా గుర్తుచేసుకుంటుందో చూపించే కథలు ఒక సంకలనంగా తెచ్చారు. అదే “తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు”.

మహాత్మాగాంధీ జీవితాన్ని ఆదర్శాలను సిద్ధాంతాలను ప్రతిబింబించే ఈ కథా సంకలనంలో “స్వాతంత్ర్య పోరాటం – మహాత్ముడు”, “స్వాతంత్ర్యానంతరం మహాత్ముడు” అనే రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో ‘సత్యాగ్రహం’, ‘అహింస’, ‘స్వదేశీ’, ‘అస్పృశ్యత నివారణ’, ‘వ్యక్తిత్వం’, ‘దేశవిభజన’ అనే విభాగాలలో 18 కథలు; రెండవ భాగంలో12 కథలతో మొత్తం 30 కథలు ఉన్నాయి.
***
గాంధీ ప్రేరణతో తమ ఊర్లో మద్యపాన నిషేధానికి ప్రయత్నించి, కల్లుదుకాణాలకి చెందిన వ్యక్తులుతో దెబ్బలు తిని, జైలుకెళ్ళిన ‘ప్రభాకరుడు’ అనే విద్యార్థి కథ ఈ సంకలనంలో మొదటి కథ.
ఉప్పు సత్యాగ్రహానికై గాంధీజీ ఇచ్చిన పిలుపు పిల్లలని సైతం ఎలా ప్రభావితం చేసిందో చెప్పే కథ రాయసం వెంకట శివుడు రాసిన ‘నీలవేణి’.
తమను పీడించిన అమీన్‌సాబ్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గ్రామస్థులను ఏకం చేసి గాంధీమార్గం అనుసరించమంటాడు సంఘాలపంతులు. సంఘాలపంతులుపై దాడి చేయాలని ప్రయత్నించిన జవాన్లపై స్థానిక యువకులు తిరగబడతారు. చివరికి పై అధికారులు వచ్చి అమీన్‌ని భర్తరఫ్ చేసి, నాకా తొలగిస్తారు. సురవరం ప్రతాపరెడ్డి గారి కథ ఇది.

“దేశం కోసం, మన కోసం, మన సంఘం కోసం” సత్యాగ్రహం చేస్తానంటాడు గోపాలరావు. మనకేంటి లాభం అంటుదతని భార్య సత్యవతి. భార్య మాట వినక సత్యాగ్రహంలో పాల్గొని రెండేళ్ళ కోసం జైలు కెళతాడు గోపాలరావు. ఆ కాలంలో తన అక్క ఇంట్లో ఉన్న సత్యవతికి – పాశ్చాత్య పిశాచానికి బలియై ఉద్యోగ లుబ్దత్వానికి దాసులైన అక్కా బావగార్ల సుఖం చూసి మరింత దుఃఖం కలుగుతుంది. అయితే పొరుగింట్లో ఉండే రుక్మిణమ్మ సత్యాగ్రహం విలువని సత్యవతికి అర్థమయ్యేలా చెబుతుంది. అప్పుడు సత్యవతికి గోపాలరావుపై సదభిప్రాయం కలుగుతుంది. మరి గోపాలరావు ఆ సదభిప్రాయాన్ని నిలుపుకోగలిగాడో లేదో గూడ నరసింహారావు రాసిన “సత్యాగ్రహం” ఈ కథలో తెలుస్తుంది.

‘నే ధన్యనైతి’ కథ లీల, శ్యామసుందర్లు స్వదేశీ ఉద్యమానికి చేసిన సేవను వివరిస్తుంది. ప్రజల్లోనూ, ప్రభుత్వంలోనూ పలుకుబడి ఉన్నప్పటికీ సత్యాగ్రాహంలో పాల్గొనడానికి కుంటిసాకులు చెప్పి పిడుగుపాటుకు గురై మరణించిన సత్యనాథం పంతులు గురించి – తనకక్కరకు రాని పుత్రుడి మీద తన కసిని దేశమాత తీర్చుకుందని అనుకుంటారు జనాలు ‘దేశమాత’ కథలో.

తమ కొడుకు దేనికీ పనికిరాని మాంద్యుడని భావించిన తల్లిదండ్రులు అతడితో కఠినంగా ఉండాలని ప్రయత్నిస్తారు. విదేశీవస్తు బహిష్కరణకి పిలుపునిచ్చిన గాంధీజీని ప్రభుత్వం అరెస్టు చేయడంతో సరోజినీనాయుడు బొంబాయిలో ప్రజలని ఉత్తేజితులను చేసే బాధ్యత స్వీకరిస్తుంది. ఆమె ప్రసంగం విన్న ఆ కొడుకు ముందుకొచ్చి స్వరాజ్యపోరాటంలో దూకుతాడు. ‘బాబూగన్నో’ కథ ఆసక్తిగా చదివిస్తుంది.

కాంగ్రెస్ వారి ఊరేగింపుని నిరోధించాలన్న పోలీసుల ప్రయత్నంలో రథోత్సవానికి వెళ్ళిన పిల్లలకు లాఠీ దెబ్బలు తగులుతాయి. ఆ పిల్లల మనస్సులో ఎన్నో ప్రశ్నలు – కాంగ్రెస్ అంటే ఏమిటి? జై బోలో స్వతంత్ర్య భారత్‌కి అని నినదిస్తే పోలీసులు ఎందుకు కొడతారు? – వాళ్ళు కూడా రథంతో పాటు నడుస్తూ నినాదాలు చేస్తే అనేకమంది వారి వెంబడి తామూ నినాదాలు చేస్తారు. పోరాట స్ఫూర్తి కొనసాగుతుంది.

డిప్యూటీ కలెక్టరుగా పనిచేసే నాగభూషణరావు – దేశనాయకులను జైళ్ళకు పంపి పొలమో, రావు సాహెబ్ వంటి బిరుదో పొందలనుకునే అధికారి. అతని భార్య విశాలాక్షిది అదే ధోరణి. వీళ్ళ అబ్బాయి సూరీడు. అతనికి రాట్నం వడకాలని ఉంటుంది. చివరికి ఎలాగొలా డబ్బు సంపాదించి రాట్నం కొని, నూలు వడుకుతూ ఓ పాట పాడతాడు. తండ్రి తెల్లబోయి, “నా ఇంట్లో కూడా ప్రవేశించిందే” అంటాడు.

కాళోజీ గారి ‘తెలియక ప్రేమ – తెలిసి ద్వేషము’ కథలో ప్రత్యక్షంగా గాంధీజీ ప్రస్తావన లేకపోయినా అంటరానితనం నివారణకై జరిగిన ఓ పోరాటంలో చనిపోయిన బ్రాహ్మణుడు, దళితులు నరకానికి పోతూ… బ్రతికుండగా తామే ఒకరినొకరు చంపుకున్నట్టు తెలుసుకుని అక్కడ కూడా కొట్లాడుకుంటారు. 1943లో రాసిన ఈ కథ ఇప్పుడు కూడా ఆసక్తిగా చదివిస్తుంది.

శారద, రావు భార్యాభర్తలు. శారద జాతీయవాదాన్ని జీర్ణించుకుని సత్యాహింసలను నమ్మిన కుటుంబానికి చెందినది. రావుది సంపన్న కుటుంబం. అతను కమ్యూనిస్టుగా మారి భార్యని కూడా పార్టీలో చేరమని బలవంతం చేస్తాడు. వారి మధ్య మొదలైన గొడవ ముదురుతుంది. పార్టీలో చేరకపోతే విడిపోక తప్పదంటాడు. చివరికి వార్దాకు వెళ్ళిపోదామని రైలు ఎక్కుతుంది శారద. ‘నిట్టూర్పు’ కథలోని చివరి వాక్యం పాఠకులను నిట్టూర్చేలా చేస్తుంది.

‘నేక్‌డ్ ఫకీర్’ కథలో గాంధీ గురించి తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఇద్దరు ఇంగ్లీషు సివిల్ సర్వెంట్స్ మాట్లాడుకుంటారు. గర్భదరిద్రుడిలా వుండే ఓ ‘నేక్‌డ్ ఫకీర్’ మహత్తరమైన సామ్రాజ్యాన్ని ఓడించడంలో ట్రాజెడీ కన్నా కామెడీపాలే ఎక్కువగా వున్నట్లు వారికి తోస్తుంది. కానీ గాంధీ చేసున్నది మంచేనని అంతరంగంలో విశ్వసించిన ఓ న్యాయమూర్తి రాబర్ట్ బ్రూమ్ ఫీల్ట్ గాంధీజీని ప్రశ్నిస్తారు. తనపై రాజద్రోహం ఆరోపణలు చేసిన కేసులో తనను శిక్షవేయమని లేదా జడ్జిని రాజీనామా చేయమని అంటారు గాంధీజీ. ఆసక్తిగా చదివించే ఈ కథ గాంధీజీ సిద్ధాంతాలను చక్కగా వెల్లడిస్తుంది.

‘దీపం కడుపున చీకటి’ కథ గాంధీజీ పెద్ద కొడుకు హరిలాల్ గురించి చెబుతుంది. హరిలాల్ కథ ఒక విషాద గీతిక అంటారు రచయిత కోడూరి శ్రీరామమూర్తి.

గుడిపాటి వేంకటాచలం వ్రాసిన ‘హిందు – ముసల్మాన్’ కథ రెండు మతాల మధ్య జరిగిన ఘర్షణలో క్షతగాత్రులైన వారి వ్యథను చెబుతుంది. మనుషులు అకస్మాత్తుగా పులులూ, తోడేళ్ళు అయిన వైనాన్ని ఈ కథ చెబుతుంది.

‘బాపూజీ…. భౌతికంగా 30 జనవరి 1948 నాడు మరణించారు కానీ దేశ విభజన ప్రతిపాదన అంగీకారం పొందినపుడే ఆయన మానసికంగా మరణించారు’ అని కస్తూరి మురళీకృష్ణ సృజించిన ‘వైష్ణవ జన తో తేనే కహియెజె…’ కథ చెబుతుంది.

విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ‘సప్తాశ్వము’ కథ దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కుంటున ఏడుగురు ఒకళ్ళ తర్వాత ఒకళ్లు ఏమేమి చెప్పారో చెబుతుంది.

‘నరిసిగాడి గాంధీయం’ కథ – స్వాతంత్ర్యం అనంతరం దేశంలో వచ్చిన అవాంఛిత మార్పులను, దిగజారిన నైతిక విలువలను ప్రస్తావిస్తుంది.

పెద్దిభొట్ల సుబ్బరామయ్య రాసిన ‘గాంధీని చూసినవాడు’ కథ కేవలం గాంధీని భౌతికంగా దర్శించి – ఆయన సిద్ధాంతాలనేవీ పాటించిన వ్యక్తి గురించి చెబుతుంది. ఆసక్తిగా చదివిస్తుంది.

‘ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్ అను గాంధీయుడి కథ’లో దేశభక్తుడు, వయోవృద్ధుడు ఊశన్న చనిపోతే… తమ కులాచారం ప్రకారం అంత్యక్రియలు చేస్తామని చెబుతుంటే ఆశ్చర్యంగా ప్రాణం పోసుకుంటాడు ఊశన్న. అలా మరోసారి కూడా జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇంకోసారి చస్తాడు, బ్రతుకుతాడు. చివరికేమయిందో పాఠకుల ఊహకే వదిలేస్తారు రచయిత. మారుతున్న సమాజంపై గొప్ప అధిక్షేపణ ఈ కథ అనిపిస్తుంది.

‘మహాత్ముని స్వదేశీ పర్యటన’ కథని ఎవరో రాశారో తెలియదు కాని, అది 1966 ఆగస్టు 15 నాటి ‘చుక్కని’లో ప్రచురితమైనట్లు తెలిపారు. దేశంలో 1966 నాటి పరిస్థితులకే గాంధీ కళ్ళనీళ్ళు పెట్టుకున్నటు ఈ కథలో రాశారు, మరి నేటి పరిస్థితికి ఆయనేం చేసేవారో?
గాంధీజీ వ్రాసిన “మానవులంతా సోదరులే” అన్న పుస్తకం గురించి వ్రాస్తు “మానవులంతా” సోదరులే (నా?) అని ప్రశ్నిస్తారు పాలగుమ్మి పద్మరాజు ఈ కథలో.

గాంధీగారితో కలిసే బతికేస్తున్నాం అని కథకుడు చెప్పుకున్న కథ ‘గాంధీమేకు’. తన ఇంట్లోని గాంధీ చిత్రపటాన్ని స్వార్థానికి ఉపయోగించుకుందామనుకున్న మిత్రుడి వద్దనుంచి ఆ చిత్రపటాన్ని వెనక్కి తెచ్చుకున్న కథకుడు – ఆ మిత్రుడు కూడా ఓ గాంధీమేకు లాంటివాడే అనుకుంటాడు.

“అందరికీ అన్నీ వుంటాయి. కొందరికి ఎన్నో వుంటాయి. కొందరికి కొన్నే ఉంటాయి. ఈ మనిషికి ఏమీ లేవు” అంటారు కొలకలూరి ఇనాక్ ‘సంస్కరణం’ కథలో. ఎవరా మనిషి? గాంధీకేమవుతాడు? సమాజానికేమవుతాడు? ఆలోచనలు రేకెత్తించే కథ.

“ఆయన ఏంది వద్దన్నాడో దాన్నే అడ్డం పెట్టుకుని ఈ జనం బతికిపోతావుండారు” అంటాడో వ్యక్తి గాంధీ గురించి ‘గాంధీబొమ్మ’ కథలో.

‘బాపూ! ఏమిటిది?’ కథ ఉత్తమ పౌరులను రూపొందించే అవకాశం ఉపాధ్యాయుల చేతినే వున్నది! మంత్రుల ‘చేతిన’ కాదని చెబుతుంది.

‘ఇదం శరీరం’ కథ గాంధీజీ ఏకలవ్య శిష్యుడి కొడుకులు ఎటువంటి నేతలయ్యారో చెబుతుంది.

పచ్చనోటుపై ఉన్న గాంధీ బొమ్మ ఓ ప్రభుత్వాధికారిని ఎలా కాపాడిందో ‘గెలుపు’ కథ చెబుతుంది.

***
ఈ కథలన్నీ చదివాకా, “మహాత్ముడి సమకాలీకులుగా తెలుగు కథకులు అత్యద్భుతమైన రీతిలో స్పందించారు. ఆనాటి సమాజంలో మహాత్ముడి ద్వారా కలిగిన చైతన్యాన్ని, ప్రజల మనస్తత్వాలను అతి చక్కగా పరిశీలించారు. గాంధీజీ అనంతరం కూడా ఈనాటికీ గాంధీజీ ప్రభావం భారతీయ సమాజంపైన ఉంది అని నిరూపిస్తూ ఈనాటికీ ఆయన ఆదర్శాలను ప్రతిబింబిస్తూ, ఉత్తమత్వానికి గాంధీజీని గీటురాయిగా చూపిస్తూ కథకులు కథలని సృజిస్తున్నారు” అని సంపాదకులు అన్న మాటలలో అతిశయోక్తి లేదనిపిస్తుంది.
***

తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు (కథా సంకలనం)
సాహితి ప్రచురణలు
పేజీలు: 280
వెల: 150/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

You Might Also Like

Leave a Reply