The Idol Thief – S. Vijay Kumar

“The Idol Thief” పేరు వినగానే ఏదో మిస్టరీ నవల అనుకున్నాను. “the true story of the looting of India’s temples” అన్నది ఈ పుస్తకానికున్న ఉపశీర్షిక. ఆ ఉపశీర్షికని నేను ఆశ్చర్యంగా చూస్తూంటే మా‌ఇంటాయన వచ్చి ఆ పుస్తకం బాగుంటుందనీ, చదవమని సలహా ఇచ్చాడు. దానితో చదివాను. పుస్తకం చదివాక ఒక పక్క ఆశ్చర్యం, ఒక పక్క ఆవేశం. ఈ పుస్తకం గురించి సంక్షిప్తంగా పరిచయం చేయాలి అనిపించింది. అందుకే ఈ వ్యాసం.

సుభాష్ కపూర్ అమెరికాలోని న్యూయార్కు లో పేరుమోసిన కళా వ్యాపారి (అదే, ఆర్ట్ డీలర్). ప్రపంచంలోని వివిధ ప్రముఖ ఆర్టు మ్యూజియంలలో ఏసియన్ ఆర్ట్ విభాగంలో ఆయన నుండి కొన్నవీ, ఆయన డొనేషనుల పుణ్యాన కొన్నవీ రకరకాల వస్తువులు తరుచుగా దర్శనమిస్తూ ఉంటాయట. కపూర్ తండ్రి భారతదేశం నుండి వలస వెళ్ళాడు. మామూలు షాపు స్థాయి నుండి ఇలా పెద్ద పెద్ద మ్యూజియంలతో వ్యాపారం చేసే స్థాయికి ఎదిగారు ఆ కుటుంబం. ఈ వ్యాపారమంతా కనీసం ఆరంకెల డాలర్ల స్థాయిలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా సాగినది. అతగాడికి సమాజంలో పెద్ద గౌరవం, పరపతీ ఉన్నాయి. “ఓకే, అయితే ఏమిటీ?” అంటారా? అదంతా భారతదేశం నుండి ఈయన అమ్మే/దానం చేసే కళాఖండాలు ఎక్కడివి? అన్న ప్రశ్న నేరుగా ఎవరూ సంధించలేదు చాలా ఏళ్ళు. ఆయనకి భారతదేశం, హాంగ్కాంగ్, సింగపూర్, లండన్ వగైరా వివిధ ప్రాంతాల్లో ఉన్న పెద్ద నెట్వర్కు మూలాన ఎప్పుడూ‌ అన్నింటికీ పక్కా పేపర్ వర్క్ ఏదో ఒకలాగ వచ్చేది. అసలు విషయం ఏమిటంటే ఇదంతా భారతదేశంలోని పాత ఆలయాల్లోంచి దొంగిలించిన సరుకు! రకరకాల స్థాయుల్లో ఏళ్ళ తరబడి నడిచిన అంతర్జాతీయ స్మగ్లింగ్ వ్యాపారం!. కొంతమందికి “ఆ, కొత్తేముంది?” అనిపించొచ్చు కానీ, ఎప్పుడో‌ బ్రిటీషు కాలంలో ఎత్తుకుపోయిన సరుకు కాదు. ఈమధ్య కాలంలో గత పదీ పదిహేనేళ్ళలో దోపిడీలు జరిగి పోయినవే! (ఈయన గురించి ఈయన అరెస్టు అయాక న్యూ యార్క్ టైంస్ లో వచ్చిన వ్యాసం ఒకటి ఇక్కడ చదవొచ్చు).

పుస్తకం విషయానికొస్తే ఇది సుభాష్ కపూర్ అరెస్టుకి దారి తీసిన పరిశోధనల గురించి. రచయిత విజయ్ కుమార్ సింగపూర్ లో షిప్పింగ్ రంగ నిపుణుడు. అతను 2007-08 ప్రాంతంలో భారతీయ కళ గురించి poetryinstone.in అని ఒక బ్లాగు రాసేవాడు. తన పరిశోధనల్లో భాగంగా సుభాష్ కపూర్ అనూహ్య సంఖ్యలో భారతీయ కళాఖండాలను అమ్మడం గురించి గమనించి సొంతంగా పరిశోధన మొదలుపెట్టాడు. క్రమంగా దేశీ, విదేశీ పరిశోధకులతో, పోలీసు సంస్థలతో కలిసి కూడా పని చేశాడు. కపూర్, అతని నెట్వర్క్ లోని ఇతరులు అరెస్టు కావడంలో, కొన్ని విగ్రహాలైనా తిరిగి భారతదేశం చేరడంలో ప్రముఖ పాత్ర వహించాడు. పైన ఉటంకించిన న్యూ యార్క్ టైంస్ వ్యాసంలో కూడా రచయిత ప్రస్తావన ఉంది. ఈ క్రమంలో రచయిత అనుభవాలు, అసలు జరిగిన సంఘటనలేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం – రెండూ కలిపితే ఈ పుస్తకం.

పుస్తకం ఏదో థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్లు ఉండింది. సినిమాల్లో చూపినట్లే పోలీసు శాఖల్లో, పై అధికార వర్గాల్లో ఇలా ప్రతి చోట కపూర్ కి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇదంతా ఏం‌పట్టని అధికారులూ ఉన్నారు (రచయిత ఏదో లైబ్రరీలోనో ఎక్కడో నోట్సు రాసుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన పోలీసాయన ఆ లైబ్రరీయన్ తో అంటాడు – “ఎవడో వచ్చాడండీ సింగపూర్ నుండి ఏవో విగ్రహాల చోరీ గురించి ఏదో సమాచారం పట్టుకుని. వాడి వల్ల నేను ఇలాంటి పనికిమాలిన పనుల మీద ఇక్కడికొచ్చి పడిగాపులు పడాల్సి వస్తోంది” అని, రచయిత అక్కడే ఉన్నాడని తెలియక). నన్ను బాగా ఆశ్చర్యపరచిన విషయం ఏళ్ళ తరబడి విచ్చలవిడిగా, అంతర్జాతీయంగా సాగిన కపూర్ చౌర్యం, అతని నెట్వర్క్ కాదు. పై స్థాయిలో దేశంలోని అధికారుల్లో ఈ విషయమై ఉన్న నిర్లిప్తత. సాక్ష్యాలు అవీ వచ్చాక కూడా ఏదన్నా చేయడానికి ఎంతో సమయం తీసుకోవడం. మన దేశపు అధికారులతో పోలిస్తే రచయితతో పని చేసిన అమెరికన్ అధికారే ఎక్కువ చొరవ తీసుకున్నట్లు అనిపించింది. ఇక బయటివాడై ఉండీ ఇంత పరిశోధన చేసాడంటే రచయితని అభినందించకుండా ఉండటం కష్టం.

రచయిత చివర్లో “మీరు హర్షద్ మెహతా, నిరావ్ మోదీ, విజయ్ మాల్యా, అబ్దుల్ కరీం తెల్గీ వంటి వాళ్ళ పేర్లు వినే ఉంటారు. సత్యం, కామన్ వెల్త్, ౨జీ, కోల్ గేట్, ఆదర్శ్ వంటి స్కాముల పేరు కూడా విని ఉంటారు. మను నారంగ్, బెన్ హెల్లర్ వంటి పేర్లు విన్నారా? స్మగ్లింగ్ చేసిన కళాఖండాలను కొన్నానని పబ్లిక్లో చెప్పే ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్టన్ సైమన్ వంటి వాళ్ళ పేర్లు విని ఉండరు” అంటాడు. నా విషయంలో ఇది చాలా నిజం. ఆ రంగంతో నాకు పరిచయం లేదు కానీ ఈ‌ సుభాష్ కపూర్ గురించి చదువుతూ ఉంటే ఇది కూడా ఆ స్కాముల స్థాయే అనిపించింది. రచయిత రాసినట్లు, art crime is a crime. art smuggling is smuggling. కానీ, బహుశా ప్రభుత్వం దృష్టిలో కాదేమో. పుస్తకంలో ఇచ్చిన లెక్కల ప్రకారం 1992 నుండి తమిళనాడులో దాదాపు నాలుగొందల గుళ్ళకి చెందిన 1200కి పైగా విగ్రహాలు అదృశ్యమైన కంప్లైంట్లు రిజిస్టరైతే, ఇందులో కేవలం 56 మాత్రమే పరిష్కారమై, వాటిలో 18 విగ్రహాలు మాత్రమే మళ్ళీ స్వస్థలానికి చేరాయి. దాదాపు నాలుగొందల కంప్లైంట్లు ‘untraceable idols’ అని మూసేసారంట పోలీసులు. ఇదంతా తమిళనాట, అదీ ఇప్పటికి తెలిసిన కథ. దేశమంతా ఇంకెన్ని ఉంటాయో!

అసలైనా మనకున్న ఇన్ని సమస్యల మధ్య ఇదో విషయమా? అనిపించొచ్చు. ఈ ఆర్టంతా వాళ్ళ దగ్గర ఉండడమే శ్రేయస్కరం, మన వాళ్ళు మేనేజ్ చేయలేరు అనేవాళ్ళకి రచయిత సమాధానం – “We are told that Indian art may be better off and safer in a posh foreign museum than in a dusty old temple. Nothing could be further from the truth. Let’s be clear. This is a falsehood propagated to justify crime and further the agenda of the powerful international lobbies. First, idols were not created as just pieces of art but as representations of god meant to be housed, and prayed to inside temples. They were absolutely fine for centuries upon centuries in these dusty old temples. … … … Besides, even if you believe gods are better off abroad, they’re not yours to sell off… … … They belong to village commons first, and then to all of us, to the nation”. ఆ చివరి వాక్యం నాకు అన్నింటికంటే బాగా నచ్చింది. నాకసలు ఈ విషయం గురించి అవగాహన లేదు కనుక ఇదంతా ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ రచయిత రాసింది చదువుతూ ఉంటే ఆయన రాసినదానిలో నిజం ఉందనిపించింది.

పుస్తకంలో నాకు తోచిన ఒకే ఒక పెద్ద లోపం – రచయిత స్వతహాగా రచయిత కాకపోవడం. పుస్తకానికి ఓ ఎడిటర్ లేకపోవడం. కానీ, ఇది బాగా ప్రభావం చూపి దీని వల్ల పుస్తకం పక్కన పెట్టేయాల్సి వచ్చిందంటే మీ దురదృష్టం అనుకుని ఊరుకోవాల్సిందే. నాకు సంబంధించినంత వరకూ ఇది నేను ఇతరులకి చదవమని సూచించే పుస్తకమే.

You Might Also Like

Leave a Reply