Caged Eagles – Eric Walters

కెనడా నేపథ్యంలో వచ్చిన కథలో, నవలలో ఏవన్నా‌ ఉన్నాయేమో అని Ames Public Library వెబ్సైటులో వెదుకుతూ ఉంటే “Caged Eagles” అన్న నవల కనబడింది. దాని తాలూకా ఒక పేరా పరిచయం చదివాను – కథ ఒక జపనీస్ పూర్వీకులున్న కెనడియన్ టీనేజీ పిల్లవాడి కథనంతో నడుస్తుంది, కథా వస్తువు పెర్ల్ హార్బర్ బాంబింగ్ తరువాత జపనీస్ పరంపర ఉన్న కెనెడియన్ల జీవితంలోని మార్పులు, అని తెలిసింది. ఇదివరలో అమెరికాలో ఇదే సమయంలో జరిగిన సంఘటనల గురించి ఒక ఇమ్మిగ్రంట్ ఇంటర్వ్యూల పుస్తకంలో చదివాను – కెనడాలో కూడా ఇలాగే జరిగిందని నాకు తెలీదు. అందువల్ల ఈ నవల చదవడం మొదలుపెట్టాను. (అన్నట్లు ఇది young adults కోసం రాసిన నవల -అయినా ఎవరైనా చదవొచ్చు).

క్లుప్తంగా కథ: పధ్నాలుగేళ్ళ Tadashi వాళ్ళది జాలరి వాళ్ళ కుటుంబం. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో వాళ్ళ నివాసం. గ్రామం మొత్తం దాదాపు జపనీస్ పరంపర ఉన్న కుటుంబాలే. అందువల్ల పిల్లలు జపనీస్, ఇంగ్లీష్ రెండూ నేర్చుకుంటూ పెరుగుతారు. అతనికి ఒక నేటివ్ కెనేడియన్ (అక్కడి ఆదివాసీ) జాతి స్నేహితుడు. ఇద్దరు చెల్లెళ్ళు. ఒక బామ్మ. అమ్మా, నాన్నా. ఇదీ అతని ప్రపంచం. ఇదంతా 1941నాటి కథ. జపాన్ సైన్యం అమెరికా మీదకి దాడి చేసింది పెర్ల్ హార్బర్ వద్ద. ఆ సమయంలో కెనెడా కూడా వారితో చేయి కలిపినందువల్ల, మొత్తం రెండు దేశాల్లోనూ జపాన్ పౌరులు, జపాన్ వారసత్వం ఉన్న కెనెడియన్/అమెరికన్ పౌరుల మీద చర్యలు మొదలయ్యాయి. ఇళ్ళు, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, వీళ్ళనంతా కుటుంబాలకి కుటుంబాలు తరలించి క్యాంపులలో నిర్భందించడం‌ జరిగాయి. అలా వెళ్ళిన వాళ్ళలో Tadashi కుటుంబం ఒకటి. ఇక క్యాంపులో అతని అనుభవాలు, అతనికి కలిగిన స్నేహాలు – ఇదీ నవలలో జరిగే కథ. వాస్తవ సంఘటనల ఆధారంగా రాసిన కల్పిత రచన ఇది.

పుస్తకంలో నన్ను ఆకట్టుకున్న అంశాలు: జపనీస్ సంప్రదాయాలను గురించి, పిల్లలు జపనీస్ నేర్చుకోడం గురించి, అంత సంఘర్షణ మధ్య కూడా వాళ్ళలో ఉన్న పట్టుదల. ఒకపక్క “కెనడా నా భూమి, ఇదే మా ఊరు” అంటూనే, అదే సమయంలో తమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపుటలవాట్లూ, భాషా – అన్నీ నిలుపుకోవడం గొప్పగా అనిపించింది నాకు. క్యాంపులో అధికారులని ధిక్కరించి దహన సంస్కారాలు జరపడం, ఎక్కడా పిల్లలు పెద్దవాళ్ళని ఎదిరించకపోవడం, క్యాంపులో ఆహారం గురించి అందరూ కలిసి సమ్మె చేయడం – ఇలాంటివి అన్నీ వాళ్ళలోనే ఉన్న జపనీయులనీ, కెనెడీయులని అవేవో రెండు conflicting personalities లా కాకుండా, co-existing personalities లాగా చూపడం నాకు నచ్చింది – ఇది ఎక్కడికన్నా వలసవెళ్ళి అక్కడి సమాజంలో కలిసిపోతూనే తమ గతాన్ని మరిచిపోకుండా, తమ సంస్కృతీ, సంప్రదాయాలను పాటించాలనుకునే ప్రతి ఒక్కరికీ అనుభవంలో ఉండేదే. పుస్తకంలో అసలు కథకన్నా నన్ను బాగా ఆకట్టుకున్నవి ఈ భిన్న సంప్రదాయాల/జాతుల సంఘర్షణ గురించిన పరిశీలనలే.

ఇక ఉన్నదంతా రాత్రికి రాత్రే కోల్పోయి, పడవల్లో కుటుంబాలకి కుటుంబాలు ప్రభుత్వ కాంపులకి తరలించబడ్డం, అక్కడ సైన్యంవారు పశువులను కట్టేసే కొట్టాలలోకి గుంపులుగుంపులు గా మనుష్యుల్ని తోలేస్తూ ఉంటే వాళ్ళ స్పందనలు, ఆలోచనలు, మధ్యలో చిన్నచిన్న పిల్లలు అమాయకంగా తమ బొమ్మల గురించి దిగులు పడ్డం, టీనేజీ అబ్బాయిలు క్యాంపు నుండి బయటపడి ఊరిలోకి వెళ్ళాలని చూడ్డం, ఊళ్ళో‌ జపాన్ జాతిపై ఉన్న వ్యతిరేకత, ‘I am Chinese’ అని చెప్పుకుంటే బతికిపోతాం అని ఈ అబ్బాయిలు అనుకోడం ఇలాంటివి చదువుతూ ఉంటే కొంచెం బాధగా అనిపించింది. కానీ, ఇంత దానిలో కూడా వాళ్ళు అందరూ కలిసి ఉండడం, కాస్తో కూస్తో పిల్లలు ఆడుకోవడం, క్యాంపులో వాళ్ళకి వాళ్ళు సెటప్ చేసిన స్కూలుకి వెళ్ళడం, వాళ్ళలోని డాక్టర్లు, నర్సులు కలిసి ఒక ఆసుపత్రి పెట్టుకోవడం, ఇలాంటివన్నీ స్పూర్తివంతంగా అనిపించాయి. మొత్తంగా చూస్తే నవల చాలా బాగుంది. కాల్పనిక రచనలు ఇష్టపడేవారికి జపనీస్ జాతి వాళ్ళ గురించి ఏ కాస్త ఆసక్తి ఉన్నా పుస్తకం చదవదగ్గది.

కథ టీనేజర్ల కోసం రాసినది కనుక కొంచెం ఆ పిల్లలు adventurousగా ఉన్నట్లు చూపారు. ఈ అంశం గురించి పిల్లలని ఆకట్టునేలా చెప్పడానికి ఈ నవలకి అది బాగా సరిపోయింది కానీ, ఆ ఆలోచనలు, జపనీస్ సంస్కృతి గురించి మధ్య మధ్యలో వ్యాఖ్యలు, విశ్లేషణలు-ఇవన్నీ కొంచెం ఆ వయసు పాత్రలకి లోతైన పరిశీలనలనే అనిపించాయి. మరి ఆ ఈడు పిల్లలకి ఇవన్నీ ఎంత మేరకు అర్థమవుతాయి? ఎంత ఆలోచిస్తారు? అన్నది తెలీదు నాకు. కానీ, ఒక తనది కాని నేపథ్యం గురించి రచయిత ఇంత పరిశీలించాడంటే గొప్ప విషయమే. రచయిత Eric Walters పుంఖానుపుంఖాలుగా రచనలు చేసాడట. తొంభైకి పైగా కథలు/నవలలు, అనేక అంశాల మీద రాశాడంట. ఈ పుస్తకం నన్ను బాగా కదిలించింది కనుక ఇతర రచనలు ఏవైనా చదవాలనుకుంటున్నాను. మొత్తానికి,కథాగమనం ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది. ఎక్కడికక్కడ తర్వాత ఏమౌతుంది? అన్న ఉత్కంఠ నాకు. రోజూ ట్రెయిన్ లో ఆఫీసుకి వెళ్తూ చదివేదాన్ని. అలా నెక్స్ట్ ఏమౌతుంది అని మళ్ళీ‌ ట్రెయిన్ ఎక్కేదాకా ఎదురుచూపన్నమాట. అందువల్ల, యంగ్ అడల్ట్స్ కే కాదు. యంగ్ గా ఫీల్ అయే అడల్ట్స్ కి కూడా చదవదగ్గ నవలే.

You Might Also Like

Leave a Reply