తెలుగులో కొత్త మాటలు – వేమూరి వెంకటేశ్వరావు

మన భాషలో పదసంపద కాలానుగుణంగా వృద్ధి చెందాలంటే, ఆధునిక శాస్త్రాల్లోని విషయాలను మన భాషలో వ్యక్తం చేయాలంటే, కొత్త పదాలు సృష్టించుకోవడం తప్పనిసరి. మరి ఆ కొత్త పదాలు ఎలా సృష్టించాలి? అన్నది ఒక చర్చనీయాంశం. కొన్నాళ్ళ క్రితం తెలుగు బ్లాగుల తొలినాళ్ళలో కొంతమంది చేరి ఒక గూగుల్ గుంపును ఏర్పరిచారు – తెలుగుపదం అనుకుంటాను పేరు. అప్పట్లో అంతర్జాలానికి, సాంకేతికతకీ సంబంధించిన కొన్ని పదాలకి తెలుగు సమానార్థకాల గురించి చర్చించుకునేవారు. అప్పట్లో ఆ చర్చలు చదువుతూ అనుకునేదాన్ని – ఇదంతా ఒక పద్ధతిలో ఎలా చేస్తారు? అని. తరువాత పై చదువులకి జర్మనీ వెళ్ళినపుడు వాళ్ళకి చాలా సాంకేతిక పదాలకి, శాస్త్రీయాంశాలకీ వాళ్ళ భాషలో పదాలున్నాయని తెలిసింది.

తెలుగులో కూడా ఉన్నాయి కొన్నింటికి – నేను ఒక చోట ఇంటర్ మొదటి సంవత్సరం చదివినపుడు అక్కడ తెలుగు మీడియం వాళ్ళ క్లాసులు కూడా మా క్లాసుల పక్కనే ఉండేవి. ఆ క్లాసులోని వాళ్ళతో కొంచెం స్నేహం కుదిరాక surface tension, viscosity, simple harmonic motion వంటి భౌతిక శాస్త్ర పదాలకి, కొన్ని రసాయన శాస్త్ర, కొన్ని గణిత పదాలకి తెలుగు సమానార్థకాలు తెలిశాయి నాకు. కానీ, ఆ విధంగా కంప్యూటర్ సైన్సు పదాలగ్గానీ, అంతకుముందు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పదాలగ్గానీ తెలుగు ఉన్నాయో లేదో తెలియదు నాకు. అసలు ఇతర డిగ్రీలకి తెలుగు మీడియం ఉందిగాని, ఇంజనీరింగ్ డిగ్రీలకి తెలుగు మీడియం లేవనుకుంటాను నేను చదివే నాటికి. కనుక, జర్మనీ వెళ్ళాక వాళ్ళకి సమస్తం జర్మన్ లో నడుస్తూ ఉంటే ఆశ్చర్యమేసింది. ఇదే తంతు మధ్యలో ఇతర ఐరోపా దేశాల విశ్వవిద్యాలయాలు సందర్శించినపుడు కూడా చూశాను. అసలు వీళ్ళంతా ఈ కొత్త పదాలు ఎలా సృష్టిస్తారు? అందులో ఉన్న సాధక బాధకాలేమిటి? అని చాలా కుతూహలం నాకు. ఈ మధ్య ఫీల్డ్ లింగ్విస్టిక్స్ అన్న క్లాసులో విద్యార్థినిగా చేరాను. దాని గురించి తెలుగులో బ్లాగు రాస్కుంటూ, ఆ భాషాశాస్త్ర పదాలకి తెలుగు సమానార్థకాల కోసం కుస్తీ పడుతూ ఉండగా, ఒకరోజు వేమూరి రావు గారు ఈ పుస్తకం గురించి చెప్పి, నాకు చదవమని పంపారు.

మన భాష విస్తృతిని పెంచాలంటే వాడుకని పెంచాలి. వాడుక పెరగాలంటే క్లిష్టమైన భావాలని, సరికొత్త విషయాలని తెలుగులో వ్యక్తపరచటానికి సదుపాయంగా మన పదజాలం పెరగాలి. అలాగని టోకు బేరంలా, పెద్ద ఎత్తున, ఇంగ్లీషులోని మాటలని తెలుగులోకి దింపేసుకుంటే అవి మన నుడికారానికి నప్పవు. కనుక మన సంప్రదాయాలకి, మన వ్యాకరణానికి అనుకూలపడేలా ఈ పదజాలాన్ని సమకూర్చుకోవాలి. ఈ పని ఎవరు చేస్తారు? మనమే ప్రయోగాత్మకంగా చేసి చూడాలి. మాయాబజారు సినిమాలో ఘటోత్కచుడు చెప్పినట్లు మాటలు మనం పట్టించకపోతే మరెక్కడనుండి పుట్టుకొస్తాయి?

-ఇదే ఈ పుస్తకం ప్రధానోద్దేశ్యం.

“ఇంగ్లీషులో పదాలు అలాగే వాడేస్కుంటే పోయే, అలవాటైపోయింది కదా?” అని చప్పరించేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి సమాధానంగా రావు గారు ఒకట్రాసారు… నాకైతే ఒక క్షణం షాక్, మరో క్షణంలో పెద్దగా నవ్వేశాను ఆ జవాబు చూసి:

ప్ర: ఇంగ్లీషులో ఈ మాటలు ఉండగా మళ్ళా కొత్తవి తయారు చేసుకోవడం ఎందుకు?
జ: పొరుగువాడు పిల్లల్ని కంటున్నాడు కదా అని మనం కనడం మానేస్తున్నామా?

భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, కంప్యూటర్లు, గణితం, కూరగాయల/పండ్ల పేర్లు ఇలా రకరకాల రంగాలను తీసుకుని, కొన్ని ఉదాహరణలతో ఆంగ్ల పదాలకి తెలుగు సమానార్థకాలు రూపొందించడం ఎలాగో చర్చించారు. కొన్ని పదాలు “అరే, భలే చేశారే” అనిపిస్తే కొన్ని కొంచెం అతిగా అనిపించాయి. కొన్ని బాగా తేలిగ్గా, వాడుక భాషలా అనిపిస్తే, కొన్ని మరీ “ఇలా ఎవరు వాడతారు?” అనిపించాయి. అయితే, ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం రావు గారి రచనా శైలి.

ప్రస్తుతం సైన్సుని తెలుగులో రాయాలనే ప్రయత్నం చేస్తున్నాము కదా. ఈ ప్రయత్నం చేసే వారికి సైన్సు మీదా పట్ట్ ఉండాలి, భాష మీదా పట్టు ఉండాలి కనుక సైన్సులో పదజాలం సృష్టించాలన్నా, పుస్తకాలు రాయాలన్నా, ఆ పనిని తెలుగు పండితులకి పురమాయించడం శుష్క దండగ. ఈ వాదానికి బొరుసు కూడా ఉంది. సైన్సు వచ్చిన వాళ్ళంతా వారికి తెలిసిన విషయాలని ఇతరులకి అర్థం అయ్యేరీతిలో చెప్పలేరు, రాయలేరు – ఏ భాషలోనైనా సరే. పైపెచ్చు మన దేశంలో ఇంగ్లీషు వ్యామోహంలో పడ్డవారిలో కొందరు కొద్దిగానో, గొప్పగానో ఇంగ్లీషులో రాయగలరేమో కాని తెలుగులో బొత్తిగా రాయలేరు.

పదాలు కూర్చడానికి భాషా పండితులు కావడం గాని, ఆయా శాస్త్రాల్లో ఉద్ధండులవడం కాని సరిపోదని ఆయన చేసిన పరిశీలన నిజం. రావు గారికి తెలుగు భాషపైన మంచి పట్టు ఉంది. అలాగే వివిధ శాస్త్రీయ అంశాల మీద కూడా. వీట్కి తోడు జీవితానుభవం, మన సంస్కృతి, సాంప్రదాయం, సంస్కృతం వగైరాల గురించిన పరిజ్ఞానం కూడా చాలా ఉంది. అందువల్ల ఇలాంటి పుస్తకం రాయడానికి ఆయన అన్ని విధాలా సరైన మనిషి. కొంచెం హాస్యం, వ్యంగ్యం కూడా కలిపి రాసినందుకు, ఏ కథో, కవితో కాకపోయినా, కాస్త “బోరింగ్” అని చాలామంది అనుకోదగ్గ అంశమైనా, పుస్తకం ఎక్కడా బోరు కొట్టకుండా చదివించింది. పుస్తకం చివర్లో ఆంగ్ల/తెలుగు ఉపసర్గలు, ప్రత్యయాలతో కూడిన ఒక పట్టిక కూడా ఇచ్చారు.

మొత్తానికి ఏదైనా శాస్త్రీయాంశం గురించి తెలుగులో రాస్తూ, సమానార్థక తెలుగ్ పదాల కోసం వెదుక్కునే వాళ్ళకి ఈ పుస్తకంలోని ఆలోచనలు, సలహాలు చాలా ఉపయోగకరం. ప్రస్తుతం ఈ స్ఫూర్తితో నేను కూడా నా బ్లాగులో రాసుకుంటున్న ఫీల్డ్ లింగ్విస్టిక్స్ వ్యాసాల్లో, ఒక భాషాశాస్త్ర పారిభాషిక నిఘంటువు తోడుగా, నాకు తెలుగు సమానార్థకం తెలియని భాషాశాస్త్ర పదాలకి తెలుగు పదాలు కనిపెట్టడం మొదలుపెట్టాను. కనుక పుస్తకం నా మీద ప్రభావం చూపినట్లే! నేను సరదాకి చేస్తున్నా, నిజంగా ఇలాంటి ప్రయత్నాలు మొదలుపెడితే, ఈ పుస్తకంలోని సూచనలు మంచి నిర్దేశకాలు కాగలవు.
******
పుస్తకం కినిగె.కాం లో కొనుగోలుకి లభ్యం

You Might Also Like

Leave a Reply