నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా? అయితే సంతోషం!

ఈ పుస్తకం ఖమ్మంలోని “స్పందన హాస్పిటల్” నిర్వాహకులు, ప్రముఖ కార్డియాలజిస్టు అయిన డాక్టర్ ఎం.ఎఫ్.గోపీనాథ్ గారి ఆత్మకథ. ఒక చిన్న పల్లెటూరిలో (ఆయన “పచ్చి పల్లెటూరు” అని వర్ణించారు), ఒక పెద్ద, పేద దళిత కుటుంబంలో పుట్టి తాను కార్డియాలజిస్టుగా స్థిరపడేవరకు జీవిత విశేషాలను ఇందులో రాశారు.

పై రెండు వాక్యాల వర్ణన చూసి “ఆ, ఇందులో ఏం పెద్ద విశేషం ఉందిలే?” అనుకోవచ్చు. కానీ ఉంది. ఉన్నాయి. అసలు ఆయన నేపథ్యం గురించి చదివాక అందులోంచి వచ్చి అన్ని చదువులు చదవడం ఓ పెద్ద విశేషం, స్పూర్తి దాయకమైన విషయమైతే, ఆయన మెడికోగా ఉన్నప్పుడు విపరీతంగా విద్యార్థి రాజకీయాల్లో తిరిగి, రకరకాల గొడవల్లో తలదూర్చి కూడా మళ్ళీ పై చదువులు అన్నీ పూర్తి చేయడం మరో విశేషం. ఇన్నాళ్ళు నగరవాసాల్లో ఉన్నా మరి ఆయన రాసిన భాషలో అయితే చాలా తక్కువ ఆంగ్ల పదాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ప్రాంతపు తెలుగు పదాలే వాడినట్లు అనిపించింది.

ఇక ఆయన జీవితం విషయానికొస్తే: దళితుడిగా చిన్నతనం నుండే చాలా అసమానతలను ప్రత్యక్షంగా చుసారు, అనుభవించారు. అలాంటివి పల్లెటూళ్ళో కనుక ఉన్నాయి, హైదరాబాదులో ఎక్కడుంటాయిలే అనుకున్నా నేను ఆ భాగం చదువుతున్నపుడూ (అమాయకంగా!). కానీ, ఆయన హైదరాబాదులో మెడిసిన్ చదువుతున్నప్పటి అనుభవాలు చదువుతూంటే చాలా ఆశ్చర్యం కలిగింది – అంత చదువుకున్న ప్రొఫెసర్లు/డాక్టర్లు ఇంత వ్యక్తిగత అభిప్రాయాలు, కక్షలు, వివక్షా చూపిస్తారా అని. నాకు ఇలాంటివి చూసిన అనుభవం లేదు (ఇలా ఎవరన్నా రాస్తే చదవడం, చెబితే వినడం తప్ప). అందువల్ల, ఇవన్నీ దాటుకుని ఆయన చేసిన పనులు చేయడం చూస్తే గొప్పగా అనిపించింది. అన్నింటికంటే నన్ను బాగా కదిలించిన అంశం ఏమిటంటే – ఆయన టీనేజి లో అనుకుంటా – కూలి పనికి వెళ్ళారు. రాళ్ళెత్తే పని. రిక్షా తొక్కారు. ఇదంతా ఎందుకు నేర్చుకున్నానో చెబుతూ దళిత కులం కనుక, పేదవాళ్ళు కనుకా, పై చదువులు చదవగలమో లేదో, ఎప్పుడేం జరిగినా సిద్ధంగా ఉండాలని నేర్చుకున్నా అని రాస్తారు. ఇంత కష్టపడ్డారనమాట. అవన్నీ దాటుకొచ్చి మెడిసిన్, ఒక ఎం.డీ, మళ్ళీ దానిమీద ఒక సూపర్ స్పెషలైజేషన్ కూడా చేశారు.

కుటుంబ విషయాలు పెద్దగా రాయలేదు. నిజానికి వాళ్ళ నాన్న నేపథ్యం గురించి నాకు చాలా ఆసక్తి కలిగింది ఆయన మొదట్లో రాసిందాన్ని బట్టి. వాళ్ళ వాళ్ళ మధ్య ఆయనకి ఏకాస్తైనా చదువు ఎలా అబ్బింది? ఎందుకాయనకు తక్కిన దళితులతో పోలిస్తే కొంచెం గౌరవం ఉండేది అగ్రకులాల మధ్య? వంటివి. పైగా ఈయన ఇంతపెద్ద కుటుంబంలో ఈయన కాకుండా ఇంకెవరు చదువుకున్నారు? వాళ్ళంతా ఏం చేస్తున్నారు? చదువు వల్ల మొత్తం కుటుంబం బాగుపడిందా, ఈయన ఒక్కరేనా? ఇలాంటి ప్రశ్నలు చాలా కలిగాయి. కానీ, ఇవి ఈ పుస్తకంలో అసలు దాదాపుగా లేనట్లే. తమ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోడానికి ఇపుడు పెద్దవాళ్ళు ఎవరూ జీవించి లేరని ఆయనే రాశారు పుస్తకంలో. కానీ, తన తరం వారి గురించి కూడా కొంచెం ప్రస్తావించి ఉండాల్సింది. ఒక్క చోట పిల్లల ప్రస్తావన వచ్చింది (ఇద్దరూ డాక్టర్లే). ఇక పలుచోట్ల వచ్చిన అన్నా-వదినల ప్రవర్తన గురించి వ్యాఖ్యనం కొంచెం మరీ వ్యక్తిగతం, ఇతరులకి/పాఠకులకి అక్కర్లేని విషయం అనిపించింది.

ఇకపోతే, పుస్తకానికి ఓ ఎడిటర్ ఉంటే బాగుండనిపించింది. కొంచెం ఒక్కోసారి కొన్ని మరీ వివరంగా చెప్పడం, కొన్ని అలా పైపైన చెప్పడం, ఒక కాలక్రమంలో లేకపోవడం ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టాయి. ఈ రెండు అంశాలు తప్పిస్తే పెద్ద చెప్పుకోదగ్గ “నచ్చని అంశాలు” అంటూ ఏం లేవు.

పుస్తకం ముందు రాసిన ముందు మాటల్లో పదే పదే “ఇది మర్యాదస్తుల పుస్తకం కాదు” అని రాశారు. నాకేమో అంత అమర్యాదకరంగా ఏమీ అనిపించలేదు. మన సినిమాల్లో ఇంతకంటే అమర్యాదకరమైన పదాలే వాడతారు మరి. కనుక ఇప్పుడు నేను మర్యాదస్తురాలిని కాదేమో అని కొత్త అనుమానం పట్టుకుంది!

మొత్తానికైతే అద్భుతం కాకపోయినా, చదవదగ్గ పుస్తకం.

పుస్తకం వివరాలు:
నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా? అయితే సంతోషం!
రచన: డాక్టర్ ఎం.ఎఫ్.గోపీనాథ్
ప్రచురణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 2013
వెల: 100 రూపాయలు
పేజీలు: 162
కినిగె కొనుగోలు లంకె

You Might Also Like

Leave a Reply