పుస్తకం
All about booksపుస్తకలోకం

October 18, 2017

విశ్వనాథునకు వివిధ కవి నాథుల పద్య నివాళి

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు
******************
ముందు మాట
ఈ నెల (అక్టోబరు) 18న కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారి వర్ధంతి కావటం; పోయిన నెల (సెప్టెంబరు) 10వ తేదీన వీరి జయంతి కావటం వల్ల వీరి మీద ఏదైనా ఒక వ్యాసం వ్రాస్తే బాగుంటుందని అనుకున్నాము. ఐతే, ఇప్పటికి ఎన్నోసార్లు, ఎన్నోసంధర్భాలలో విశ్వనాథ వారి సాహిత్యం గురించి, వారు వ్రాసిన పద్యాల గురించి, వాటి గొప్పతనం గురించి, మీరందరూ వివిధ మాధ్యమాల్లో చదివి, విని ఉండే ఉంటారు. కాబట్టి, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పటం వల్ల ప్రయోజనం లేదు. వ్యాసం ఏదైనా వ్రాస్తే కొంచెం కొత్తదనం ఉండాలి అని ఆలోచన చేయసాగాము. మరి ఈ వ్యాసం ఎలా మొదలు పెట్టాలి? ఎక్కడ మొదలు పెట్టాలి? ఏమి చెప్పాలి? మాకు అర్థం కాలేదు. ఇలా ఆలోచనలో ఉండగా, మాకు ఒక మెరుపులాంటి ఒక ఆలోచన ఒకటి తట్టింది. విశ్వనాథ వారి సమకాలీకులు, సమఉజ్జీలు, వీరి తరువాత తరం కవులు, ఇతర సాహితీ ప్రియులు, వీరి సాహిత్యం నుంచి ప్రేరణ, స్ఫూర్తి పొందిన మరి కొందరు కవులు, విశ్వనాథ వారి మీద ఏమైనా వ్రాసారా? ఏమైనా చెప్పారా? అన్న ఆలోచన కలిగింది. వెంటనే మా దగ్గరున్న డైరీలో వెదకటం మొదలు పెట్టాము. మాకు కొంతమంది కవులు విశ్వనాథ గురించి కొన్ని పద్యాలు చెప్పిన సంగతి కనబడింది, అంతే ఇక ఆలస్యం దేనికీ అని ఈ వ్యాసం వ్రాయటం మొదలు పెట్టాము. మేము ఈ వ్యాసములో ప్రస్తుతిస్తున్నవారిలో కొందరు ప్రముఖ కవులైతే, మరికొందరు తెలుగు సాహితీ వేత్తలు, మరికొందరు సాహిత్యాభిలాషులు ఇలా వివిధ వర్గాలకు చెందిన వారు విశ్వనాథ గురించి ఎమి చెప్పారో తెలుసుకుంటే అది సమగ్రమైన విషయమవుతుందని ఈ ప్రయత్నం చేస్తున్నాము. మాఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తూ.. ఇక వ్యాసం మొదలు పడదామా?

కవి పరిచయము

తెలుగు వారికీ విశ్వనాథ సత్యనారాయణ గారు సుపరిచితులే. ఇక సాహితీ ప్రియులకి విశ్వనాథ అంటే ఇంచుమించు దైవంతో సమానం. విశ్వనాథ గారికి “కవిసామ్రాట్” “కళా ప్రపూర్ణ” మరియు “పద్మ భూషణ్” వంటి బిరుదులు కలవు. వీరు భారతదేశంలో  అత్యుత్తమమైన, ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారంమైన  “జ్ఞాన పీఠ్” పురస్కారమును పొందిన అతి కొద్ది మహనీయులలో ఒకరు, అందునా, యీ పురస్కారం పొందిన తెలుగు వారిలో ప్రప్రథములు. వీరు తెలుగు ప్రజలకి మరియు తెలుగు సాహితీ ప్రియులకి ఇచ్చిన సాహిత్యసంపద అపూర్వమైనది, అపురూపమైనది.  వీరు ఎన్నో పద్య కావ్యములు, కావ్యేతిహాసాలు, శతకములు, నాటకములు, నాటికలు, నవలలు, చిన్న కధలు, వ్యాసాలు, వ్యాసంగాలు, గేయాలు మరియు లలిత గీతాలు ఇలా ఎన్నో రచించారు. వీరి రచనలలో శ్రీమద్ రామాయణ కల్పవృక్షంవేయి పడగలుఏక వీర, చెలియలికట్ట, మాక్లి దుర్గంలో కుక్కఆంధ్ర పౌరుషంఆంధ్ర ప్రశస్తివిశ్వేశ్వర శతకం, పంచశతి, తెలుగు ఋతువులు మరియు కిన్నెరసాని పాటలు వంటివి ఎన్నో ప్రజాదరణ, బహుళ ప్రాచుర్యము పొందినవి. వీరికి శతాధిక గ్రంథకర్తగా కుడా పేరున్నది. ఇంతే కాక, వీరు పాల్గొన్న పలు రేడియో ముఖా ముఖి ప్రసంగాలు, ఆకాశవాణి ప్రసంగాలు, దిన పత్రికలలో విశ్లేషణలు కుడా ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని ఇతర భారతీయ భాషలలో కుడా అనువదించ బడ్డాయి. యీ అనువాద కర్తలలో చాలా ప్రసిద్ధి కెక్కిన అనువాద కర్త మన భారత దేశపు మాజీ ప్రధాని కీర్తిశేషులు డా|| పి. వి. నరసింహ రావు గారు.  పి. వి. గారు విశ్వనాథ వారి రచనలలో బహుళ ప్రజాదరణ పొందిన  “వేయి పడగలు” కావ్యాన్ని హిందీ భాషలోకి “సహస్ర ఫణ్” అనే పేరుతో అనువదించారు. తిరుపతి వెంకట కవులుగా పేరెన్నికగన్న జంటకవులలో ఒకరైన “చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి” గారికి విశ్వనాథ వారు ప్రియ శిష్యుడు.

వివిధ కవుల ప్రశంసలు

ఒక ప్రముఖ సాహితీ వేత్త, సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత ఐన ప్రో. యస్.వి.జోగారావు గారు, విశ్వనాథ వారి గురించి ఒక పుస్తకములో ముందు మాట వ్రాస్తూ, జ్ఞానపీఠ పురస్కారము విశ్వనాథ వారికి అందజేయటం అనేది జ్ఞానపీఠ పురస్కారానికే ధన్యత కలిగినది, జ్ఞానపీఠ పురస్కారమే ధన్యమైనదని అన్నారు.

ఉత్పలమాల:

అక్షరలక్ష లంచిత శుభాక్షతలై పొలు పొందునట్లుగా

అక్షరమైన హ్లాద మెదసాక్షిగ సర్వరసజ్ఞ జాతికిన్

దక్షతనిచ్చు సూరిసుర ధాణికి సత్కవితా కళా మహా

ధ్యక్షున కొక్క లక్షయిడి ధన్యతగాంచెను జ్ఞానపీఠమున్

భావము: విశ్వనాథ వారి అక్షర లక్షలు శుభాక్షతలుగా అనగా శుభము జేకూర్చు అక్షతలుగా – తలంబ్రాలుగా, పోలియున్నవని. వారి ప్రతి అక్షరము రసజ్ఞులకు ఆనందమును ఆహ్లాదమును కలిగించునని. అట్టి సత్ కవితా మహాధ్యక్షునకు ఒక్క లక్ష రూపాయల పైకమిచ్చి జ్ఞానపీఠ పురస్కారమునకు ధన్యత కలిగినది అని అన్నారు. అంటే విశ్వనాథకు జ్ఞానపీఠ పురస్కారము ఇవ్వటం అనునది జ్ఞానపీఠ పురస్కారమునకు పెద్ద గౌరవము అని కొనియాడారు.

మరో సందర్భంలో జోగారావు గారు వ్రాస్తూ విశ్వనాథ వారు ఈ కవి దృష్టిలో ఏమిటి అన్న విషయం ఈ క్రింది సీస పద్యం ద్వారా తెలియ జేశారు. భగవత్ గీతలో  చెప్పినట్టు శ్రీ కృష్ణుడు ఈ సృష్టిలో పక్షులలో గరుత్మంతుడని, మృగములలో సింహమని, పర్వతములలో మేరు పర్వతమునని చెప్పిన రీతిలో ఈ పద్యములో కవి చాలా రమ్యముగా కవితా శిల్పాన్ని చెక్కినాడు.

సీసం-పూర్వభాగము:

ఒక గండభేరుండ మొక గంధ వేదండ
మొక యున్నత ముహీధ్ర మొక సముద్ర
మొక వేద మొక శాస్త్ర మొక మహాభాష్యమ్ము
నొక పురాణ మ్మొక నుపనిషత్తు
ఒక ఝుంఝు యొక వృష్టి యొక ఝరి యొక ప్రౌఢ
నాయికాయత పురుషాయితమ్ము
ఒక పండితోద్దండు డుద్దతుండొక యోద్ధ
ఒక మహాసమ్రాట్టు నొక మహర్షి.

తేటగీతి:
స్మృతి దగిలి పాయకుండు తదతి విశిష్ట
కావ్య హేతుత్రయీ వ్యక్తి భవ్యతలను
వరుస నొక్కొక్కదాని భావనము సేయ
నాకు నచ్చిన కవి విశ్వనాథ యొకడు.

భావము: విశ్వనాథ వారు ఒక పక్షి రాజమని, పక్షులలో రారాజని, శ్రేష్టమైన ఏనుగులలో ఐరావతమని, పర్వతములలోకెల్లా అత్యున్నతమైన పర్వత శిఖరమని, ఒక పర్వతరాజమని, సముద్రములలోకెల్లా మహాసముద్రమని, వేదములలో ఒక వేదమని, శాస్త్రములలో ఒక శాస్త్రమని, వేదాంత భాష్యములలో ఒక మహా భాష్యమని (మహా వాక్యమని), పురాణమని, ఉపనిషత్తని, గాలివానయని, ప్రళయ సమాన పాతమని, పండితులలో ఉద్దండుడని (శ్రేష్టుడు, ఘటికుఁడని), తెలుగు వారు గర్వించ తగ్గవాడని, ఒక యోధుడని, మహాసామ్రాట్టని చివరగా ఒక మహర్షియని అభివర్ణించారు. అలా వివరిస్తూ విశ్వనాథ వారు నాకు నచ్చిన కవులలో ఒకడు అని అభివర్ణించారు.

మరో ప్రముఖుడు, విప్లవకవి, మహాకవి బిరుదాంకితుడైన శ్రీశ్రీ విశ్వనాథ గురించి ఏమన్నారో మీరే చూడండి.

వచనము:

మాట్లాడే వెన్నెముక, పాట పాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు, నేటి కవి సామ్రాట్టు
గోదావరి పలుకరింత, కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు, తెలుగువాళ్ళ గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం, ఆసేతు మహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి, అనవరతం తెలుగువాడి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద, సత్యానికి నా ఉపద

భావము: ఈ వచనానికి ప్రత్యేకంగా ఆర్థము, భావము చెప్పాలా?

అలాగే వివిధ రంగాల్లో (అనగా సంగీతము, సాహిత్యము, మరియు నృత్యము) బహుముఖ ప్రజ్ఞాశాలి గా పేరొందిన డా|| జి.వి.సుబ్రహ్మణ్యం గారు, ఒకసారి విశ్వనాథ వారి గురించి ఇలా అన్నారు.

వచనము:

ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం – ఈ వ్యక్తిత్వం.

భావము: ఈ వచనానికి ప్రత్యేకంగా ఆర్థము, భావము చెప్పాలా?

ఒక ప్రముఖ సాహితీ వేత్త, ఆధునిక కవి ఐన తాడేపల్లి పతంజలి ఒక సారి విశ్వనాథవారి  గురించి ఇలా అన్నారు.

చంపకమాల (సరసీ):

వెలుగగు విశ్వనాథునికి వేదనతోడ నమమ్ములిచ్చెదన్
కొలిచిన విశ్వనాథునికి గుండె నొసంగెదు కల్పభూజిగాన్
పిలిచిన  విశ్వనాథులకు ప్రేమగ శోభల అంజలించెదన్
నిలిచిన విశ్వనాథులకు నేయ్యముతోడ నమస్కరించెదన్

భావము: తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక వెలుగైన విశ్వనాథునికి వేదనతో నమస్సులు అర్పిస్తున్నాను, ఆ విశ్వేశ్వరుని కొలిచిన లేక సేవించిన కల్పవృక్షమై కోరికలను తీర్చును అని కొనియాడారు.

మరో ప్రముఖుడు, కవి, సాహితీ ప్రియుడు ఐన బాపురెడ్డి అనే కవి ఏమన్నారో మీరే చూడండి.

ఉత్పలమాల:

నన్నయ నుండి నా వరకు, నమ్మిన దానిని నమ్మినట్లు, దే
శోన్నతి కోసమై నవర సోజ్జ్వల కావ్యము లల్లినట్టి భా
వోన్నతులందు సన్నతుడ వోయి! సహస్ర ఫణాగ్ర కాంతి సం
ఛన్నుడ వోయి! నీ కృతులు సత్య సరిత్తులు విశ్వరాట్కవీ!

భావము: నన్నయ్య నుండి నా వరకు నమ్మిన దానినే నమ్మి, దేశోన్నతికి నవరస భరితమైన కావ్యాలు రచించి, ఉత్తమమైన భావలకు పలికించుటలో దిట్టవి. సహస్ర ఫణి నీడ నందు సదా నివసించు వానివి. నీ కృతులు (రచనలు) నిత్యమూ ప్రవహించు సత్య నదీజలాలు. ఓ విశ్వవిరాట్కవీ అని కొనియాడారు.

అలాగే మరోక పద్యంలో గమ్మత్తుగా విశ్వనాథ వారి కొన్ని రచనలను ఆసరాగా చేసుకుని చాలా గొప్పగా విశ్వనాథ కవిత (పద్య) సౌరభాన్ని ప్రశంసించారు.

చంపకమాల (సరసీ):

చెలియలి కట్టపై కడిమి చెట్టును కిన్నరసాని పాటతో
వెలయగ జేసినావు; అది వేదసుబోధ వసంత శోభతో
తెలుగున కల్పవృక్షమయి, దివ్యత రామ కదాంరుతమ్ము ని
స్తులముగ పంచి పెట్టు పరిశుద్ధుల కామన లెల్ల తీర్చుచున్

భావము:  చెలియలి కట్ట మీద అతిశయముతో ఒక చెట్టును పెంచి దానికి కిన్నెరసాని పూయించినావు. ఆది కృతి అయిన రామాయణమును వసంత శోభతో పరిమళాలు నింపావు. నీ యీ రామ కథ కల్పతరువు వలే కోరిన కోర్కెలు తీర్చు.

ఈ క్రింది పద్యంలో కవి విశ్వనాథ యొక్క గుణగణాలు వర్ణిస్తూ వ్రాసిన పద్యం. ఇందులో బమ్మెర పోతనామాత్యుడు “లోకంబులు లోకేశులు… పెంజీకటి కవ్వల నెవ్వండే… నతని నే సేవింతున్.” అని చెప్పిన చందాన విశ్వనాథ వారిని ఒక వెలుగుతో పొల్చి బహు భేషుగ్గా సమర్ధించు కున్నారు మీరే చూడండి.

సీసం-పూర్వభాగము:

వాద నినాద వివాదాంధ్ర సాహిత్య వనములో వల్మీక వాణి నీవు
నాటి వ్యాకరణ ఛందస్సూత్ర రణభూమిన ధర్మగీతా ప్రభోధనము నీవు
ప్రాచీన ద్రుష్టి కర్వాచీన దృష్టికి శిష్ట సమీచీన సృష్టి వీవు
నిందయు స్తుతియు వెన్వెంట నీ కీర్తిని మోసెడి అద్వైత మూర్తి వీవు

తేటగీతి:

దేశ కాలాలకును వేష భాషలకును
అంతుబట్టని పరమాత్మ కాంతి వీవు
గురువులకే గురుడై శిష్యవరుడ వీవు
శిష్యు లెవ్వరు సరిరాని చిద్గురుడవు

భావము: వాద ప్రతివాదాలు వివాదాలు ఉండే సాహితీ వనంలో ఆది కవి వాల్మీకి పలుకు వంటి వానివి. అంటే నీ వాక్కుకు అడ్డు లేదు నీ వాక్కు వేద వాక్కు అని అర్థం. అప్పటి వ్యాకరణము ఛందస్సు పద్య కావ్య రచనా రణభూమిలో నీవు గీతాప్రభోధ చేసే గీతాచార్యునివి. ప్రాచీన ఆధునిక ద్రుష్టి కోణంలో నీవు సదా సత్యమై నిత్యమైన వానివి. పొగడ్తలను తెగడ్తలను కీర్తిని సమ ద్రుష్టితో చూసే అద్వైత మూర్తివి అంటే నీవు గీతాచార్యుడు చెప్పిన స్థితప్రజ్ఞుడవు నీవు. దేశ-కాల-వస్తు పరిమితులు లేని దివ్య కాంతివి నీవు. గురువులను మించిన గురుడైన శిష్యాగ్రేశ్వరుడవు నీవు. మరే శిష్యుడు అందుకోలేని చిత్ గురుడవు నీవు.

ఇలా, ఎంతో మంది విశ్వనాథ వారి అభిమానులు, అనుచరులు, శిష్యులు, సాహితీ ప్రియులు తమ తమ  రచనలలో విశ్వనాథ గోప్పాతనాన్ని, వారి మీద ఉన్న గౌరవభావాన్ని, గురుభావాన్ని, విశ్వనాథ సాహిత్య విలువలను, దాని ఔన్నత్యాన్ని పలు పలు విధములుగా కొనియాడారు.

“విశ్వనాథకు వివిధ కవినాథుల పద్య నివాళి” ఇలా ఇచ్చి తరించారు. మేము కూడా విశ్వనాథుని కవితా సామాగ్రిని సామర్థ్యాన్ని మాకు తోచిన విధంగా ఈ క్రింది పద్యంలో తెలియ చేసాము.

విజయమంగళ రగడ:

బంధువులార! మిత్రులార! విజ్ఞులార! సుశ్రేష్టు
పండితులార! రమ్ము,  నిమ్ము, విశ్వనాథుకు నివాళి!!
చిందులొలుకు శతక పద్య గద్య మాలికల తరంగ
సందడితో నందము నొంది వారికిమ్ము సునివాళి!!
సుందరమగు తెనుగు బాస సారమునే మధుర
మరంద ధారగా నొసగిన సామ్రాట్న కిమ్ము  ఘన నివాళి!!
ముందుగా సమర్పణ నెవ్వారు సేతురో? యని నా
మది  పరుగులు దీసెనుగాన, నిత్తు ప్రధమ సునివాళి!!About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

విశ్వనాథ చిన్న కథలు

విశ్వనాథ గారివి ఇదివరలో నవలలు కొన్ని, ఆత్మకథాత్మక వ్యాసాలు/ఇంటర్వ్యూలు చదివాను కాన...
by సౌమ్య
1

 
 

తెలుగు సాహిత్యంలో బలమైన స్త్రీ పాత్రలు-మొదటి భాగం:విశ్వనాథ నాయికలు

వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి ***************** ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన...
by అతిథి
2

 
 

తెఱచిరాజు – ఒక పరిశీలనా ప్రయత్నము

వ్యాసకర్త: శ్రీకాంత్ గడ్డిపాటి (విశ్వనాథ గారి తెఱచిరాజు నవలపై బెంగుళూరులో జరిగిన సా...
by అతిథి
7

 

 

స్వర్గానికి నిచ్చెనలు – అస్తి నాస్తి ల గంభీర చర్చ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************ భారతీయ భాషల్లో ఆలోచనాత్మకమైన రచనలకు ఏ క...
by అతిథి
0

 
 

విశ్వనాథలోని ‘నేను’ – మూడవభాగం

రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. రెండ...
by అతిథి
1

 
 

విశ్వనాథలోని ‘నేను’ – రెండవభాగం

రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. (తొలి ...
by అతిథి
0