తెలుగుకథ: జులై-సెప్టెంబర్ 2017

వ్యాసకర్త: రమణమూర్తి
***********

గత మూడునెలల్లో (జులై-సెప్టెంబర్) వచ్చిన కథల్లో 480 కథలు చదివాను. ఈ సంవత్సరపు మొదటి త్రైమాసికంలో వచ్చిన కథల సంఖ్యతో (564) తో పోలిస్తే ఇది తక్కువే అయినా, రెండో త్రైమాసికంలో వచ్చిన కథల సంఖ్య (466) కంటే ఇవి ఎక్కువే. మొత్తంమీద ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ వచ్చిన కథల సంఖ్య 1500 దాటింది. ప్రతి సమీక్షాకాలానికీ, నచ్చిన కథల నిష్పత్తి మాత్రం కాస్త అటూయిటుగా అంతే వుంటోంది!

రాబోయే మూడునెలల కాలంలో కథల సంఖ్య మరింత ఆశాజనకంగా ఉండవచ్చు. రచన, నవ్య, విశాలాంధ్ర లాంటి పత్రికలు దీపావళి సంచికలని తీసుకువస్తాయి కాబట్టి, కొన్ని మంచికథలని కూడా ఆశించవచ్చు!

జులై నుంచి సెప్టెంబర్ వరకూ వచ్చిన మన కథల్లో నా దృష్టిని ఆకర్షించిన కథల పరిచయానికి వద్దాం!

నచ్చిన కథలు

ఒక భార్య-ఒక భర్త (దగ్గుమాటి పద్మాకర్ – ఆంధ్రజ్యోతి ఆదివారం, జులై 23): “Happy families are all alike; every unhappy family is unhappy in its own way.” అనే వాక్యం గుర్తుందా? చాలా కుటుంబాల్లో దంపతుల మధ్య దూరం కొలవడానికి వీల్లేనంత తక్కువగా, ఉపేక్షించడానికి వీల్లేనంత ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఒక కాపురపు కలహాలు కౌన్సెలింగ్ దాకా వెళ్లగా, అక్కడి డాక్టర్ దాన్ని నిర్వహించిన తీరుని, చక్కగా ప్రదర్శించిన కథ ఇది. జీవితం కంటే సిద్ధాంతాలు ఎప్పటికీ గొప్పవి కావనే విషయం మనసులో పెట్టుకుని చదివితే, ఎలాంటి గందరగోళాలూ కనిపించని కథ. ఎంతవరకూ అవసరమో అంతే ఉన్న బిగువైన కథనం కథని చదివించడంలోనూ, చదివేశాక గుర్తుపెట్టుకోవడంలోనూ సహకరిస్తుంది. [ఇదే కథావస్తువుతో ‘ఇంకోలా’ ఎలా రాయవచ్చో తెల్సుకోవాలంటే, ‘అద్దంమీద ఆవగింజలు’ (పైడిపాల – స్వాతి వారం, జులై 28) అనే కథ చదివితీరాలి!]

స్వల్పజ్ఞుడు (తాడికొండ కె శివకుమార శర్మ – కౌముది, ఆగస్ట్ 01): ఒక బ్లాక్ అమెరికన్‌ని పెళ్లి చేసుకున్న తెలుగు వ్యక్తి, చివరికి ఆ అమ్మాయితోనూ పిల్లలతోనూ విడిపోతాడు. ఇతనికి విషయపరిజ్ఞానం చాలా ఎక్కువే కానీ అందులోంచి నిజాయితీగా గ్రహించిన సారం చాలా తక్కువ అనిపిస్తుంది. కథకుడి అన్‌రిలయబిలిటీని ఒక పాయగా కనీకనిపించకుండా అల్లుకుంటూ వచ్చిన ఈ కథ, ఆ విషయం బోధపడితే కానీ, ముగింపుని ఆస్వాదించలేని పరిస్థితిని కల్పిస్తుంది. ఆ అంతర్వాహిని అర్థం కాని వారికి ఇది చాలా మామూలు కథే కదా అని అనిపిస్తుంది. డయస్పోరా కథలలో మనం ఆశించే వాతావరణం తాలూకు వినూత్నత, ఆథెంటిసిటీతో ఈ కథలో మనకి కనిపిస్తుంది.

అతడి బాధ (సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి – తానా తెలుగుపలుకు, సెప్టెంబర్ 01): ఉరిశిక్ష గురించి ఉన్న అభ్యంతరాలలో ఒకటి: నేరస్థుడు ఏ మానవహక్కులని ఉల్లంఘించాడని రాజ్యం ఉరిశిక్ష విధిస్తోందో, ఆ రాజ్యం కూడా మానవహక్కుల ఉల్లంఘనకే పాల్పడుతోందీ అని. ఇంకొంచెం ముందుకి వెళ్లి ఆలోచిస్తే, ఉరి తీయబడుతున్నవాడి మీద ఆధారపడ్డ కుటుంబసభ్యులకి ఉన్న జీవించే హక్కుని కూడా రాజ్యం అణగదొక్కుతోంది. ఈ కొనసాగింపు కోణాన్ని పట్టుకున్న మంచికథ ఇది. కరుణ అనే థీమ్‌ని నేపథ్యంగా పెట్టుకుని, దానికి తగిన కథా వాతావరణాన్ని కల్పించి, చక్కటి సంయమనంతో కథని నడిపారు రచయిత. కథలో ఉపయోగించిన రాయలసీమ మాండలీకం, పాత్రలని ఆవిష్కరించడానికి మరింత తోడ్పడింది. అంతా చాలా చక్కగా నడిచిన ఈ కథ ముగింపు విషయంలో, రచయిత వాచ్యం చేయదలచుకున్న విషయాల పట్ల మరికొంత లోభత్వం పాటిస్తే మరింత బాగుండేది. ఆ ఒక్క చిన్నలోపాన్ని మినహాయిస్తే, మిగిలిన ప్రమాణాలూ, వస్తువూ అభినందించదగ్గ స్థాయిలో ఉన్న కథ.

మరికొన్ని మంచి కథలు

బతుకు ప్రశ్న (దాముగట్ల హిదయతుల్లా – తెలుగు వెలుగు, జులై 01): వానొస్తుందా అనేదే జీవితంలో ముఖ్యమైన ప్రశ్న అయిపోయినప్పుడు, దానికి అనుబంధంగా కొన్ని మూఢవిశ్వాసాలూ వచ్చి చేరతాయి. రాయలసీమ బతుకు నేపథ్యంలో రాయబడ్డ ఈ కథలో ‘న్యాయాన్యాయాల తారతమ్యాల తెమ్మెర్లు వాళ్ల కండ్లముందు కళారూపాలుగా కదలాడతాండాయి’ లాంటి మంచి వాక్యాలతో బాటు, ‘ఇట్లాంటివి నమ్మడంలోనే వాళ్లకి అసలైన భద్రత ఉండాది’ అన్న వాస్తవికమైన ముగింపు వాక్యమూ ఉంది.

తారుమారు (డి కామేశ్వరి – రచన, ఆగస్ట్ 01): ప్రేమించి, కొన్ని కారణాలవల్ల ఆ అమ్మాయినితిరస్కరించిన తన కొడుకుని ఆ అమ్మాయి బెదిరిస్తుంది. కొడుకు చెప్పిన కారణాలు కూడా సమంజసంగానే ఉన్నాయి. అచ్చం కొడుకు చెప్పినట్టే ఆ అమ్మాయి ఉంది. ఏదో రకంగా కొడుకు రక్షింపబడ్డాడని సంతోషించాలా లేక ఆ అమ్మాయి ఫెమినిజాన్ని అభినందించాలో తెలీని ద్వైదీభావంలో ఆ తల్లి పడిపోవడం, వాస్తవికంగా ఉంది.

సెవెన్త్ ఫ్లోర్ (కె ఎ మునిసురేష్ పిళ్లె – ఆంధ్రజ్యోతి ఆదివారం, ఆగస్ట్ 13): కథ అంటూ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా, నేటి అవినీతి కార్యకలాపాలని – ముఖ్యంగా పై స్థాయిలో జరిగేవాటిని – ఆసక్తికరమైన కథనంతో చెప్పిన కథ.

బ్రేకప్ (పి స్వాతి – ఈమాట, సెప్టెంబర్ 01): అతి సున్నితమైన వస్తువు. ఒక సర్దుబాటు చేసుకున్న పరిస్థితినుంచి, పొరపాటు అని గమనించుకుని తప్పుకొని పోయే పార్ట్‌నర్‌లో ఉండే అపరాధభావన, మరొకరిలో ఉండే అసహనం కథావస్తువు. దాదాపు సంభాషణలతోనే నడిపించిన కథ.

నూటొకటో మార్కు (జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి – తానా తెలుగుపలుకు, సెప్టెంబర్ 01): కేవలం సంభాషణలతో మాత్రమే కథని నడిపించి, కథని పొరలు పొరలుగా పాఠకులముందు విప్పి, ఓ చక్కటి ఆవిష్కారాన్ని ముగింపులో చూపిన కథ. కథలోని ముఖ్యసంఘటన (పరీక్ష హాల్) బలహీనంగా ఉండటం, నమ్మశక్యంగా లేకపోవడం అన్నదే ఈ కథలోని స్వల్ప లోపం.

తెల్లతాచు (అరిపిరాల సత్యప్రసాద్ – తానా తెలుగుపలుకు, సెప్టెంబర్ 01): జీవికకోసం మనసు చంపుకొని సాగే ఓ తద్దినపు బ్రాహ్మడి జీవిత వ్యధ. చేతిలో ఉన్న ఆరువందలూ, కుటుంబాన్ని తాత్కాలికంగానైనా పోషించగలవన్న వాస్తవాన్ని కూడా విస్మరించి, ఆ డబ్బుతో ఏదో శాంతి చేయిస్తే పిల్లల సంగతి కుదురుకుంటుందన్న నమ్మకం వెనక ఉన్న విషాదం. కథలో ‘తెల్లతాచు’ అనేది కేవలం ఓ వేదనకి కథాకృతి ఇవ్వడానికి పనికొచ్చే అంశమే కానీ, వేదనలో నిజమైన గాఢత ఉంటే అలాంటి చిన్న అభ్యంతరాలని కాస్త వదిలేసినా పర్వాలేదనిపిస్తుంది. ఈ కథ వాతావరణ పోషణలో అలాంటి గాఢత ఉంది.
ఏడుకానాల వంతెన (ఉణుదుర్తి సుధాకర్ – ఆంధ్రజ్యోతి ఆదివారం, సెప్టెంబర్ 03): మొట్టమొదటి ఎన్‌కౌంటర్‌ని గుర్తుచేసుకుంటూ సాగిన ఈ హిస్టారికల్ ఫిక్షన్ – పోరాటాల గురించి ఆలోచించేవారికి ఒళ్ళు జలదరించేలా చేస్తుంది. Ambrose Bierce కథ ‘An Occurrence at Owl Creek Bridge’ నుంచి సెట్టింగ్ (బ్రిడ్జ్), ఒక సన్నివేశం (నీళ్లల్లో పడిపోవడం) స్వీకరించిన ఈ కథ, చక్కటి కథనంతో సాగుతుంది.

హాస్య కథలు

క్రమం తప్పకుండా మనకు కొన్ని నిజమైన హాస్యకథలు లభిస్తూ ఉండటం – హాస్యకథల అభిమానిగా నాకు చాలా సంతోషం కలిగించే విషయం. ఈ దిశలో కృషి చేస్తున్న రచయితలని అభినందించి తీరాలి!

కరివేప కలిపింది ఇద్దరినీ..! (యలమంచిలి పధ్మశ్రీ – తెలుగు వెలుగు, జులై 01): కథ కాదుగానీ, కరివేపాకు మీద సరదాగా నడిచిన ఓ వ్యాసం!

జోగారావు దయచేతను… (చింతకింది శ్రీనివాసరావు – ఆంధ్రజ్యోతి ఆదివారం, జులై 09): ఊరివాళ్లని మభ్యపెట్టి, వాళ్ల డబ్బులు కొట్టేసి, తూతూ మంత్రంగా జోగారావు వాళ్లని తిరుపతి యాత్రకు తీసుకువెళ్ళిన కథ. పదప్రయోగాలూ, హాస్యం బాగున్నాయి.

ఓ మరుగు కథ (పి వి రామశర్మ – గో తెలుగు, జులై 21): ఎంత మొత్తుకున్నా అందరూ తన ఇంటి కాంపౌండ్ వాల్ మీదే… ఛీ! చివరికి అక్కడ ఒక బాత్రూం కట్టించినా గానీ… ఛ!

దసరా గిలక (సత్యాజీ – ప్రజాశక్తి ఆదివారం, సెప్టెంబర్ 24): చిన్నపిల్లల దృష్టికోణంలోనుంచి చెప్పే హాస్యకథలు గడుసుదనపు కథనంతో ముడిపడ్డప్పుడు ఆ వచనమే హాయిగా ఉంటుంది. పెద్దగా కథ లేకపోయినా, అలాంటి హాయిని కలిగించిన కథ ఇది.

గుర్రాల మావయ్య (శ్రీరమణ – ఈమాట, సెప్టెంబర్ 01): తిండిపోతుల గొడవే అయినా, ఇలాంటి నిఖార్సయిన హాస్యకథల్లో కథ కంటే హాస్యమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాకు నచ్చింది. కేవలం ఆ హాస్యకథనంతోనే కట్టిపడేసి (కథలో కొంతభాగం వరకూ సస్పెన్స్ కూడా ఉందండోయ్!) – ఈ మావయ్య చివరికి రేసుగుర్రాల మావయ్యేమో అని అనుమానించే అవసరం లేకుండా చక్కగా ముగించిన కథ. చక్కగా ముగించిన అని అనడం ఎందుకంటే: “వెదుళ్లపల్లిలో యిప్పటికీ ఖాసిం పిండిమర వుంది. నూనె గానుగ కరెంటు మీద తిరుగుతూనే వుంది. జీడితోటల్లో పుష్కలంగా జీడిపప్పు పండుతూనే వుంది. ఎటొచ్చీ అన్నింటినీ సమీకరించి పకోడీలు వేయించే మావయ్యే కరవు.” అనే ముగింపు వాక్యాలు ఒక్క జీడిపప్పు పకోడీల తయారీకే సంబంధించినవి కాదేమో!

ఎలుకలుకలుకలు (సరసి – నవ్య, ఆగస్ట్ 30):
పైన చెప్పినట్టు, హాస్యకథలో రెండోది తక్కువగానూ, మొదటిది ఎక్కువగానూ ఉండటం అనే సహజత్వమే ఈ కథలోనూ ఉంది! ఎలుకలమీద చేసే పరిశోధనలు ఇతివృత్తంగా సాగిన కథలో హాస్యాన్ని బాగా పండించారు. కథలో చేసిన పదప్రయోగాలు చాలా ఉన్నాయి, బాగా ఉన్నాయి.

సైన్స్ ఫిక్షన్

ఈ వర్గంలో కథలు స్వల్పంగా వచ్చినా, అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికరమైన కథలు దొరుకుతుంటాయి.

వలయం (మధు చిత్తర్వు – ఈమాట, ఆగస్ట్ 01) కథ – కాలం పునరావృతమౌతూ ఉంటే, మనిషి తీసుకునే నిర్ణయాల్లో వచ్చే మార్పులని టైమ్ లూప్ అనే అంశం ఆధారంగా రాయబడింది. చదవండి.

మరికొన్ని చదవిచూడదగ్గ కథలు

సాక్షి (విజయ కర్రా – వాకిలి, జులై 01) కథ బాల్యజ్ఞాపకాలూ, స్నేహం గురించి. అయితే ఇందులో ఒక చిన్న క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉండటం కొసరు విశేషం. అరుదుగా వాడబడే ఉత్తమపురుష బహువచనం (‘మేము’ కథని చెబుతున్నాం!) లో ఈ కథని రాయడం, శిల్పపరంగా ఒక ప్రయోగం. మానవత్వం చూపించడానికి కూడా డబ్బు కావాలన్న విషయాన్ని వెలి (జొన్నలగడ్డ రామలక్ష్మి – కౌముది, జులై 01) చెబుతుంది. జీవితం, ఎదుగుదలల గురించి శ్రద్ధగా రాయబడ్డ కథ డెలివరీ (మానస చామర్తి – మధురవాణి, జులై 01). పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రాసిన విలువ-విలువలు (సింహప్రసాద్ – ఆంధ్రభూమి ఆదివారం, జులై 02) కథలో – అసలే అవినీతి నిరోధక శాఖ వారి రైడ్ జరుగుతుంటే, సరీగ్గా అదే సమయానికి లంచం ఇవ్వడానికి (పాతనోట్ల రూపంలో) ఓ మహిళ వస్తుంది! తన సరొగేట్ మదర్‌ని కనుక్కునే ప్రయత్నంలో కథలోని పాత్రకి కలిగిన సత్యావిష్కరణ నాదీ అద్దెమనసే (నూవుశెట్టి కృష్ణకిషోర్ – మాలిక, జులై 01) కథ. ఒక నాన్న కూతురుగా పెరిగి పెద్దదయిన అమ్మాయి, నిర్ణయాధికారాల్లో తన తల్లి పాత్ర ఎక్కడా లేకపోవడం గమనించి, పెళ్లి విషయంలో నిర్ణయాన్ని అమ్మకే అప్పగించడం నా కూతురు (విశాలి పెరి – మాలిక, జులై 01) కథలోని సారాంశం. ఒక అణువిద్యుత్కేంద్రం, అక్కడ భూకంపం అనే విభిన్నమైన వాతావరణంలో రాసిన పుట్టినరోజు (పుట్టగంటి గోపీకృష్ణ – స్వాతి వారం, జులై 14) కథలో కథానాయకుడు తన సొంతపనులను సైతం పట్టించుకోడు. ప్రస్థానం (ఎన్ తారకరామారావు – జాగృతి, జులై 17) కథలో వృద్ధుడైన తండ్రి అమెరికా పిల్లలమీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఇస్తున్న బంగారాన్ని తిరస్కరించిన కోడలు ఆలోచనలని పట్టుకుని, కథని ఆసక్తికరమైన పద్ధతిలో చెప్పిన కథ బంగారం (వి వి కూర్మారావు – ఆంధ్రప్రభ ఆదివారం, జులై 30).

క్షమయా ధరిత్రీ (గాయత్రి (క్రొవ్విడి) చెనిమిళ్ల – కౌముది, ఆగస్ట్ 01) కథ, గాంగ్‌రేప్‌కి గురై, దాదాపు ఆత్మహత్య చేసుకోబోయిన అమ్మాయి కథ. భవబంధాల దరిద్రాలనన్నింటినీ వదిలించుకొని, ఆఖరికి మరణించబోతున్నందుకు ఆనందంగా నవ్వుకున్న వ్యక్తి కథ చావు నవ్వు (ఆర్ శర్మ దంతుర్తి – ఈమాట, ఆగస్ట్ 01). పరువుహత్య అనే సాధారణాంశాన్ని ఒక సన్నివేశం చూపిస్తున్నట్టుగా నడిపిన కథ నివురుగప్పిన పరువు (చిరంజీవి వర్మ – వాకిలి, ఆగస్ట్ 01). అపోహలు-అసహనాలు (శ్రీఉదయిని – నవ్య, ఆగస్ట్ 02) కథ- అమ్మాయి నాన్‌వెజ్ (బీఫ్) తినడం అత్తగారికి రుచించనప్పుడు, ఆవిడని మార్చగలనన్న అబ్బాయి కథతో, గడుసుదనం నిండిన కథనంతో నడుస్తుంది. అవినీతిపరులూ జులాయి సినిమా పాత్రలూ ఇవాళ్టి యువతకి ఆదర్శప్రాయంగా తయారవుతున్నాయని హెచ్చరించిన కథ రోల్ మోడల్స్ (పి వి డి ఎస్ ప్రకాష్ – నవ్య, ఆగస్ట్ 16). అమ్మాయిపైన అత్యాచారం జరిగిందని తెలియగానే, అప్పటిదాకా పట్టుకుకూర్చున్న సంప్రదాయాన్ని వదిలేసి ఆ అమ్మాయిని ఇష్టపడ్డవాడికి ఇచ్చి పెళ్లిచేయడం (తీరా చూస్తే, ఈ అత్యాచారం అంతా నాటకమే…) ఇలా కూడా జరుగుతుందా? (వి వి కూర్మారావు – నవ్య, ఆగస్ట్ 16) కథలోని సారాంశం, పాఠకులకి కలిగే సందేహం కూడా! ప్రేమ పెళ్లిగా రూపాంతరం చెందాక పురుషాధికారం అనేది వ్యవస్థీకృతమైపోతోందన్న విషయాన్ని చెప్పిన కథ మబ్బులు మింగిన వెన్నెల (మోహన్ రావిపాటి – ఆంధ్రజ్యోతి ఆదివారం, ఆగస్ట్ 20).

నవ్వే ఏనుగు బొమ్మ (మధు పెమ్మరాజు – వాకిలి, సెప్టెంబర్ 01)
పిల్లల మనస్తత్వాల గురించి మంచి కథనం జతపడ్డ చక్కటి కథ. స్త్రీ బాధ్యతల గురించి మరో చక్కటి కథనంతో వచ్చిన కథ ఏమవుతుంది? (పలమనేరు బాలాజి – విరసం, సెప్టెంబర్ 01). మరో స్వేచ్ఛ (యాజి – తానా తెలుగుపలుకు, సెప్టెంబర్ 01) కథ- స్త్రీ పురుష సంబంధాల విషయంలో అవగాహన, దాని రాహిత్యాల మధ్య ఉండే పొర చాలా సన్నటిదేనన్న విషయం చెప్పిన కథ. గుళ్లల్లో విగ్రహాలు తారుమారై, పరిస్థితులన్నీ తికమకగా మారిన వ్యంగ్య, హాస్య, ఫాంటసీ కథ తారుమారు తకరారు (తాడికొండ కె శివకుమార శర్మ – తానా తెలుగుపలుకు, సెప్టెంబర్ 01).

ఒకే కథ, రెండు పత్రికలు!

ఈ మూడు నెలల కాలంలో కనీసం నాలుగు కథలు ఇంతకుముందు వేరే పత్రికల్లో (ఈ సంవత్సరంలోనే!) ప్రచురింపబడ్డ కథలు. సరే, పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నప్పుడు జరిగే తీరతాయి కాబట్టి అదేమంత పెద్ద విషయం కాదుగానీ, పాత్రల పేర్లు మార్చి ఒకే కథని రెండు పత్రికలకి పంపించడం మాత్రం దారుణం. ఈ లిస్ట్‌లో నాలుగో కథ అలాంటిది.

* దెయ్యం (భమిడిపాటి గౌరీశంకర్) – విపుల:: ఆగస్ట్, 2017 & ఆంధ్రభూమి ఆదివారం:: ఏప్రిల్ 16, 2017
* ఎర్ర బెలూన్స్ (లాస్యప్రియ కుప్పా) – ఆంధ్రభూమి వారం:: ఆగస్ట్ 17, 2017 & ఆంధ్రప్రభ ఆదివారం:: మే 21, 2017
* ఏనాటివో ఈ వానచినుకులు (దాట్ల దేవదానం రాజు) – ఆంధ్రప్రభ ఆదివారం:: సెప్టెంబర్ 3, 2017 & నవరసం:: జనవరి 25, 2017
* లోలకులు (చెన్నూరి సుదర్శన్) – తెలుగువెలుగు:: సెప్టెంబర్, 2017 & ‘జూకాలు’ పేరుతో (పాత్రల పేర్లల్లో మార్పు!) నమస్తే తెలంగాణ ఆదివారం:: ఆగస్ట్ 6, 2017

ఆకస్మిక హాస్యం!
హాస్యకథలు అని పేరు పెట్టి ఊరికే ఊరిస్తారు కానీ, అబ్బే- అవన్నీ దాదాపుగా నేతిబీరకాయలే! అయితే, కంపోజర్ల పుణ్యమో, ఏం రాస్తున్నారో గమనించకుండా రచయితలు రాయడం వల్లనో అయాచితంగా అప్పుడప్పుడూ బోలెడంత హాస్యం కథల్లో దొరుకుతూ ఉంటుంది. ఈ ఏడాది వచ్చిన అలాంటి వాక్యాలు, విచిత్రాలు కొన్ని ఇస్తున్నాను. సరదాగా నవ్వుకోవడానికే కాబట్టి, కథల పేర్లు చెప్పడం లేదు!

* “కానీ, ఆ ఏడాది కురిసిన వానలకి లంగ్స్‌లో తన్వికి నీరు చేరి జ్వరం వచ్చింది…”
* “రామరాజు వైరక్తికంగా నవ్వాడు…”
* ఒక మాస్క్ వేసుకుని, సముద్రం అడుగున గడ్డి నాటితే కాలుష్యం అంతా పోతుంది!
* డిఫెన్స్ లాయర్‌కి ఎదురుగా ‘అఫెన్స్ లాయర్’!
* “…కమ్యూనికేటెడ్ స్కిల్స్”
* “తానే పూలఘోరం అయిన అందాల భరిణ…” ఇదేమిటబ్బా? అని ఆశ్చర్యపడేలోగా తరువాతి వాక్యం: “చేత పూలహోరం ధరించి నిలబడ్డది.”
* “లారీ ఎక్కి బోనెట్లో కిశోర్ పక్కనే కూచుంది దీపాలి”

చదివినవాటిల్లో బాగున్న ఇంగ్లీష్ కథలు
అద్భుతం అని చెప్పదగ్గ కథలేవీ ఈ మూడునెలల కాలంలో చదవలేదు కానీ, ఉదహరించదగ్గ కొన్ని కథలు మాత్రం ఉన్నాయి. శిల్పపరంగా ఒక కథ మాత్రం ఒక కొత్తదారిని తొక్కింది!

The Adventure of a Skier (Italo Calvino – The New Yorker, Jul 03): ఈ కథ ఇటాలియన్ మూలం దాదాపు యాభై అయిదేళ్ల క్రితమే వచ్చిందిట కానీ, అనువాదం ఇప్పటికి జరిగింది. కథగా ఇందులో చెప్పటానికి ఏమీ లేదు. కానీ, ఆ వచనం మాత్రం, చదివి అనుభవించాల్సిన వేగం. కథనంలో విజువల్ డిటెయిల్స్ ఎంత ‘రష్’లో ఉంటాయో, మన చూపులు కూడా అంతే వేగంగా ఆ పదాల వెనక దొర్లుకుంటూ వెళ్లిపోతాయి. పైగా కథ స్కీయింగ్ గురించి! వినూత్నమైన పఠనానుభవం అనేది వివిధరూపాల్లో ఉండొచ్చని తెలియచెప్పిన కథ.

Everything is Far from Here (Cristina Henriquez – The New Yorker, Jul 24): అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ, అనేక ఇబ్బందులు పడుతూ, దారిలో తన బిడ్డని కూడా కోల్పోయిన ఒక స్త్రీ వేదనని మంచి నేరేటివ్‌తో చెప్పగలిగారు కానీ, కథగా రూపాంతరం చెందలేకపోయింది.

The Vanishing Point (Novella) (Paul Theroux – The New Yorker, Aug 07): Flaubert రాసిన ‘A Simple Heart’ ఆధారంగా ఈ నవలిక రాసానని రచయిత థోరో చెప్పుకున్నారు. అనవసరమైన ఆశలు లేకుండా, ఉన్నదాంతో తృప్తిపడగల గై అనే ఒక కార్పెంటర్ జీవితకథ ఇది. అతని జీవితం అంతా కొన్ని సుఖాలూ, మరికొన్ని కష్టాలూ కలిపి కుట్టిన అతుకులబొంతలా తయారై, నివాసం ఒక చిన్న రూంనుంచి మరో చిన్న రూంలోకి మారుతూ గడిచిపోగా, ఇక ఆ జీవితం ముగియబోతోందీ అని అర్థమైనప్పుడు అనుకోకుండా సంపద వచ్చిపడుతుంది. కానీ, ఇప్పుడు దాన్ని అనుభవించడానికి తగినంత జీవితమే మిగిలి లేదు!

F.A.Q.s (Allegra Goodman – The New Yorker, Sep 11): కాలేజ్ నుంచి వెకేషన్‌మీద ఇంటికి వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. తరాల మధ్య ఉండే తేడాలని స్పృశిస్తూ ఉండే ఈ కథ, ముగింపులో హఠాత్తుగా ఒక మలుపు తిరుగుతుంది. నిజానికి ఎవరు ఎవరిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనే ప్రశ్న ఒకటి పాఠకులకి మిగులుతుంది.

The Blind (Sigrid Nunez – The Paris Review No.222, Fall 2017): ఆలోచనామాలికగా నడిచిపోతూ ఉండే కథ, దారులు (కొన్ని సాహిత్యపు దారులు కూడా…) మారుతూ ఉన్నా, చివరికి ఒక కొలిక్కి వస్తుంది. కానీ, అది మీరూ నేనూ అనుకునే సాధారణమైన ముగింపు కాదు. అలాగని అసాధారణమూ కాదు!

Ace (Spanish నుంచి అనువాదం: Esther Allen) (Antonio Di Beneditto – The Paris Review No.222, Fall 2017): ఒక చిన్నపిల్లలో ఉన్న అద్భుతమైన శక్తి: ఏ ఆట ఆడినా సాధారణంగా గెలుస్తూ ఉంటుంది. ఈ అంశం చుట్టూ తిరిగే ఈ కథ చాలా సింపుల్, హాస్య కథనంతో నడుస్తుంది.

As You Would Have Told It To Me (Sort Of) If We Had Known Each Other Before You Died (Jonas Hassen Khemiri – The New Yorker, Sep 25): సాధారణంగా ఉత్తమ, ద్వితీయ పురుష కథనాలు కలగాపులగంగా ఉండే కథల్లో ద్వితీయపురుష కథనం అని అనిపించేదంతా, ఉత్తమపురుషలో కథ చెబుతున్న కథకుడి అంతరంగాన్ని ఆవిష్కరించడానికి ఉపయోగిస్తారు (దీనికి ఉదాహరణగా Thomas Wolfe రాసిన No Door అనే కథ దొరికితే – ఆ రచయిత కథాసంకలనం ‘From Death to Morning’ నుంచి – చదివి చూడండి. ఇలా ఇంకా చాలా కథలు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి గుర్తులేవు!). కానీ ఈ కథలో మాత్రం కథకుడే మారిపోవడం కథని ఒక అనూహ్యమైన మలుపు తిప్పుతుంది. అప్పటివరకూ కథని చెబుతున్న కథకుడు, నిజానికి ఇంకో పాత్ర చెబుతున్న కథలో పాత్రగా మారిపోతాడు. కథ టైటిల్‌కి అసలు అర్థం ఏమిటనేది ఈ మలుపుదగ్గర (నాకైతే ఒకటికి రెండుసార్లు చదివాక!) అర్థం అవుతుంది. కథని పూర్తిగా మధించడానికి మరో రెండుసార్లైనా చదవాలి. కేవలం శిల్పంతో ఒక గొప్ప మలుపుని కథలో సృష్టించగలగడం శిల్పపరంగా అపూర్వమైన ప్రయోగమే. ఆ సృజనాత్మక ధోరణికి రచయితని తప్పకుండా అభినందించాల్సిందే! దీనికి తోడు ఒక ఆసక్తికరమైన ప్రారంభం, సరదాగా సాగే కథనం కూడా అభినందనీయమే! కథలో కొత్తపాయింట్ ఏమీ లేదు అన్నది నిజమే కానీ, కథానిర్మాణాలపట్ల ఆసక్తి ఉన్నవారికి గుర్తుండిపోయే కథ ఇది. [స్వీడిష్ భాషనుంచి అనువాదం చేసింది Rachel Willson-Broyles. ఈ ముక్క సాధారణంగా పేరా మొదట్లోనే చెబుతాను కానీ, ఇది కూడా చెబితే ఆ కథ టైటిల్ మరింత పెరిగిపోయినట్టు కనిపించే ప్రమాదం ఉందని ఇక్కడ చెప్పటం!]

గత వారం విడుదలయిన The Best American Short Stories తాజా సంకలనానికి గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించిన Meg Wolitzer తన ముందుమాటలో ఓ. హెన్రీ రాసిన ‘ది లాస్ట్ లీఫ్’ కథని ప్రస్తావించి, ఆ కథ స్ఫూర్తితో ముగింపువాక్యం చాలా బాగా రాసారు. కథలలో ఉన్న పాత్రల్లో వచ్చే మార్పుల గురించి సరదా టోన్‌తో సీరియస్ వ్యాఖ్య కూడా ఒకటి చేశారు.
We live in a moment when change is continually demanded and fetishized. […] I once asked a therapist friend if any of her patients ever actually “changed.” I said to her, essentially, “Come on, you can tell me, I won’t tell anyone,” thinking that maybe she would lean over and confide in me that no, no one ever really changed. That “change” was a grail too far. Maybe modification was a better word. Maybe subtle shift nailed it more accurately. Maybe learning experience was the closest way to describe what actually transpired in therapy. But instead she was mildly offended by this question, and she said to me, “Of course they do.”
So okay, maybe they do, in therapy and in life. In short stories, I don’t think characters or their situation or their surroundings change as frequently as they turn.

గత వారం విడుదలయిన The Best American Short Stories తాజా సంకలనానికి గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించిన Meg Wolitzer తన ముందుమాటలో ఓ. హెన్రీ రాసిన ‘ది లాస్ట్ లీఫ్’ కథని ప్రస్తావించి, ఆ కథ స్ఫూర్తితో ముగింపువాక్యం చాలా బాగా రాసారు. కథలలో ఉన్న పాత్రల్లో వచ్చే మార్పుల గురించి సరదా టోన్‌తో సీరియస్ వ్యాఖ్య కూడా ఒకటి చేశారు.

We live in a moment when change is continually demanded and fetishized. […] I once asked a therapist friend if any of her patients ever actually “changed.” I said to her, essentially, “Come on, you can tell me, I won’t tell anyone,” thinking that maybe she would lean over and confide in me that no, no one ever really changed. That “change” was a grail too far. Maybe modification was a better word. Maybe subtle shift nailed it more accurately. Maybe learning experience was the closest way to describe what actually transpired in therapy. But instead she was mildly offended by this question, and she said to me, “Of course they do.”

So okay, maybe they do, in therapy and in life. In short stories, I don’t think characters or their situation or their surroundings change as frequently as they turn.

ఇప్పటికి ఇవీ కథల కబుర్లు! సరికొత్త విశేషాలతో, ఈ సంవత్సరపు ఆఖరి సమీక్షతో మళ్లీ జనవరి మొదటివారంలో కలుద్దాం!

You Might Also Like

3 Comments

  1. లోకేష్

    మీ ఓపికకు ,కథలపట్ల మీ ప్యాషన్ కు జోహార్లు. మంచి అనాలసిస్.ఒక్కసారి అన్నీ తెలుసుకునే వీలు కలిగింది. ధన్యవాదాలు

  2. లోకేష్

    What an analysis.మీ ఓపికకు కథలపట్ల మీ passion కి జోహార్లు

    1. Ramana Murthy

      థాంక్స్, లోకేష్ గారూ! 🙂

Leave a Reply