పుస్తకం
All about booksపుస్తకభాష

September 3, 2017

అంపశయ్య – నవీన్

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: Sujata Manipatruni
*****************
అంపశయ్య మొదటి సారి 1969 లో విడుదలయ్యింది. రచయిత నవీన్ మొదటి నవల, ఆయన పేరునే అంపశయ్య నవీన్ గా మార్చేసింది. ఫేమస్ వర్క్ ఆఫ్ అ ఫేమస్ రైటర్. కేంద్ర సాహిత్య ఎకాడమీ ఎవార్డును గెలుచుకున్న తెలుగు నవల. ఈ మధ్యనే దీని పదకొండో ప్రచురణ (2015) తరవాత పుస్తకం కొనుక్కోవడానికి కుదిరింది. మొదలు పెట్టాకా ముగించేవరకూ ఆలోచనా స్రవంతి లో కొట్టుకుపోవడమే. దాన్లోంచీ తేలానాం మునగానాం అనుకుంటూ ఇక కొట్టుకుపోవడమే. దీన్నేదో చైతన్య స్రవంతి అంటారంట. ఇదో ప్రయోగం అంట. అలాగా అనుకుంటూ – ఆ ప్రయోగం లో మనమూ కాస్త చెయ్యి వేయడానికి వెళ్ళామా దొరికిపోయామే. కేవలం రవీంద్ర అనే యువకుడి ఆలోచనలే – వాదనలే – దూకుడే – మొత్తం ఒక భావి నిరుద్యోగి – భావి ఫెయిల్యూర్ – కాబోయే ఆత్మ హంతకుడి కథ. ఏవేవో తప్పులు ఒకదాని వెంబడి ఒకటి చేస్తూనే పోతూ, వాటిని ఆపలేక, నిస్సహాయత అనే ఊబిలోకి కూరుకుపోతుండే మానసిక రోగి లాంటి మనిషి రవీంద్ర. ఇదంతా అతని ఆలోచనా స్రవంతి. భావాల పరంపర. అతని ఆలోచనలే భాష్యాన్ని, ఫ్లాష్ బాక్ ని కూడా చెప్తాయి.

ఒక రోజులో జరిగే కథ అంట. హిమజ్వాల లా జ్వలించే ఆలోచనలేనంట అంటూ ముందుకు సాగిపోయామా – వికృతమైన పరిస్థితులు, విచిత్రమైన బూతులు. ఇంగ్లీషు సినిమాలు, తారలు, వాళ్ళ నగ్న శరీరాలూ, యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ రొచ్చు అంతా చదవాల్సొస్తుంది. ఆడపిల్లలు ఎలా చదువుతారో ఈ పుస్తకాన్ని అని కొందరన్నారు. ఈ బూతులు – ఈ సెక్స్ వర్ణనలు, కాలేజీ కుర్రాళ్ళ ప్రగల్భాలు, అన్నీ ప్రయోగాలేనా? ఈ ప్రయోగం అసలు మంచిదేనా? తమతో పాటూ చదువుకునే ఆడపిల్లల గురించి ఇంత అసహ్యంగా మాటాడుకునే కుర్రాళ్ళే తమ ఇళ్ళలో చెల్లెళ్ళనీ, పెళ్ళాలనీ కాలేజీ గుమ్మాలు ఎక్కించనిది. ఒక వేళ వాళ్ళు చదువుకున్నా, ఉద్యోగాలు చేసినా – తమ ఇష్టాల మీద పెళ్ళాడదలచుకున్నా పరువు హత్యలు చేసేది – అని కోపం కూడా వస్తుంది కొన్ని పాత్రల్ని చూస్తే. అయినా ఈ పుస్తకం 60 ల కాలం నాటిది. కొత్త దేశం, కొత్త విశ్వ విద్యాలయాలు, పాతదే అయిన పేదరికం, పురాతనమైనదే అయిన వర్ణ వ్యవస్థ, అంతకంటే ఎక్కువ గా మన రక్తాల్లో ఇంకిపోయిన భూస్వామిత్వం, బానిసత్వం, కొత్తగా కొమ్ము విదిలిస్తున్న ఆశే లేని నిరుద్యోగం. అందుకేనేమో – ఈ ప్రయోగాలు మంచివి. మనుషులు ఇలా ఎందుకు ఆలోచిస్తారు, ఎందుకు ప్రవర్తిస్తారు అని ఆలోచించగలిగేలా చేస్తాయి ఈ ప్రయోగాలు.

60 లలో ఉస్మానియా యూనివర్సిటీ లో పీజీ చెయ్యడానికి వరంగల్ నుంచీ వచ్చి చేరిన ఒక బ్రైట్ స్టూడెంట్ హీరో రవీంద్ర. కానీ యూనివర్సిటీ రాజకీయాలూ, నగరపు ఆకర్షణలు, సినిమాల వ్యామోహం మధ్యా, అంతదాకా ఉర్దూలోనే బోధన సాగించి ఈ మధ్యే ఆంగ్లం లోకి దూకిన ప్రొఫెసర్ల పాఠాలు తలకెక్కక, చదువు నుండీ పారిపోవడానికీ, పాడైపోవడం వైపు పయనించే ‘సిటీ ‘ పోకళ్ళు తెలియని ‘ఊరి’ వాడు. అరవైలలోనే కాలేజీ లో, యూనివర్సిటీలో చదివే అమ్మాయిలు, వాళ్ళ శరీరాలు, ప్రేమలూ, వర్ణనలు, లావెటర్లీల్లో బూతు సందేశాలు, హాస్టల్లో రక రకాల మనుషులు, రవీంద్రని అదోలా చూసే (గే) గుర్నాథం, రవి చూసిన సినిమాలు, అప్పట్లో వియత్నాం యుద్ధం గురించి, నెహ్రూ విధానాల గురించి కాలేజీ కుర్రాళ్ళ వాదనలు, వాళ్ళు వాడే ఇంగ్లీషూ, ప్రతీ కేరక్టరునూ రచయిత పరిచయం చేసిన తీరూ అవీ చాలా బావున్నాయి. ప్రతీ దానికీ ఓ కనెక్షన్.

రవి ఆలోచనల్లో, అతను చూసే పీడ కలల్లో, అతని నైరాశ్యంలో, అతను ఊర్లో తల్లి నీ తండ్రినీ, చెల్లెల్నీ తల్చుకుంటూ బాధపడే తీరులో తాను ఎందుకూ పనికిరాకుండా తయారు కావడం గురించి, పరిక్షల గురించి విపరీతంగా భయపడుతూనే, అస్సలు చదవలేక తీవ్ర నిస్పృహ లో ఉంటూనే, కాలేజీ బ్యూటీ కిరణ్మయి కోసం వెంపర్లాడిపోతూ, ఆమె ను తను పొందడం అనేది సాధ్యం కాదని తెలుసుకుంటూనే, చాలా ప్రాక్టికల్ గా ఉండే ఆ అమ్మాయి వెంట ఎడారి లో ఒయాసిస్ లో పరిగెట్టినట్టు పరిగెట్టేస్తూ, రవి! మూడు నెల్లు గా మెస్ బిల్ కట్టకపోవడం వల్ల తింటానికి తిండి లేక, మల మల మాడిపోతూ కూడా పలాయన వాదం వైపు, గుర్నాథం దగ్గర చేసిన అయిదు రూపాయల అప్పుతో పరిగెట్టేస్తూండే రవి!

ఈ రవి కథ కదూ ఇది. దీన్లో ఉస్మానియా లో పిల్లలు మాటాడుకునే ఆంధ్రా తెలంగాణా వేర్పాటు వాద సంభాషణలున్నాయి. రవి హృదయం ఎంత గొప్పదో – “మనం యూనివర్సిటీ విద్యార్ధులం అర్రా.. ఇలా సంకుచిత భావాలేంటి మనకి – ఈ నేల మనది (రవి తెలంగాణా అబ్బాయి) అనుకోవడం ఎంత మూర్ఖత్వం? ఈ దేశం మనది రా” అంటాడు. తన ముందరే అత్యంత అసహ్యంగా అమ్మాయిలను కామెంట్ చేసే సహ విద్యార్థులని చూసి చిన్నబుచ్చుకుంటాడు. వీళ్ళా నా స్నేహితులు అని నిరాశ పడిపోతాడు. నవల ముగిసే సరికీ తనని ఆప్యాయంగా అభిమానంతో చూసే గుర్నాథాన్ని విపరీతంగా అసహ్యించుకునే మనిషి కూడా “మనిషి” లా మారతాడు. పాపం దేవుడు వాణ్ణలా చేసాడు. దానిలో వాడిదేం తప్పు అని జాలిపడతాడు.

ఆకలి చంపేసిన విచక్షణ నుంచీ, ఇతరుల మానవత్వపు ఓదార్పు పొందడం వల్ల మానసికంగా పరిపక్వం చెందాకా, పరిణితుడై, తన సహచరుల్లో దోషాల్నీ, ఒప్పుల్నీ సమానంగా స్వీకరిస్తాడు. “వరంగల్ లో అమాయకపు, నిర్మలమైన స్టూడెంటు జీవితానికీ, హైదరాబాద్ లో ఒకడి గొంతు ఇంకోడు కోసేసుకునే cut throat కాంపిటీషన్ కీ, సామ్యమే లేదంటూ, నీ జీవితం, నీ చదువు మీద దృష్టి పెట్టు – భయపడవు బాగుపడతావు. నీ మీద ఆశలు పెట్టుకున్న నీ కుటుంబం కోసం” అంటూ కాలేజీ రోజుల్నాటి ఫేవరెట్ లెక్చరర్ చెప్పిన హితవు విని, ఇంక పరీక్షలు రాబోతున్నాయి కాబట్టి ఎలా అన్నా బాగా చదివి మంచి మార్కులు సంపాయించుకోవాలన్న ఆశావహ దృక్పథానికి ప్రయాణించే దాకా మనని తనతో పాటూ ప్రయాణింపచేసేసే రవి. ఎంత బావుంటాడో. తన బలాలూ, బలహీనతలతో పాటూ.

రవి మనసులో కొన్నేళ్ళుగా ఆరని గాయం రత్తి – వాళ్ళ ఊళ్ళో ఉండే బీద అమ్మాయి. ఆ అమ్మాయి కథ చాలా బాధ పెట్టేస్తుంది. ఆ అమ్మాయి నిస్సహాయత కి తానూ కారణం అనే స్పృహ, ఆమె మరణం తరవాత ఈ కుర్రాడిలో కలిగిన గిల్ట్, మానవత్వం వర్ణనాతీతం. సహాధ్యాయి ఒకడు ఒక బిచ్చగత్తె నగ్నత ని ఫోటో తీసి చూపించినప్పుడు – వెళ్ళగక్కేసిన ఆక్రోశం, రత్తి మీద తనకున్న ఆప్యాయత, ప్రేమ, సాఘిక కట్టుబాట్లు, తన మీద తనలో పేరుకుపోయిన న్యూనత, మానసిక సంఘర్షణ – గ్రేవ్ దాకా తీసుకుపోతానేమో అన్న రత్తి సీక్రెట్ ని స్నేహితునితో పంచుకున్నాక మనసు విచ్చుకుని, దాన్లోకి వెలుగు ప్రసరించడం మొదలవుతుంది. ఇవన్నీ చదివాక ఈ అబ్బాయి అసలు సిసలు అబ్బాయి కదా అనిపిస్తుంది. మానవత్వం నశించినవాడు మనిషే కాదు గాబట్టి.

రచనా కాలం గడిచి ఇన్నేళ్ళయినా, ఇప్పటికీ ఎందరో తెలివైన ఆదర్శవాది విద్యార్థుల డిప్రెషన్లకి, ఒత్తిళ్ళకీ మానసిక దౌర్బల్యాలకీ అద్దంపట్టే రచన. ఇన్నాళ్ళ తరవాత కూడా విద్యార్థుల ఉద్యోగాల మార్కెట్ లో చెల్లని కాణీల్లాంటి విలువలూ, ఆదర్శాలూ ఇప్పటికీ ఈవ్ టీజింగ్ కి ఆడపిల్లలు గురవ్వటాలూ, ఇప్పటికీ పిల్లల చదువు కోసం తల్లితండ్రులు కొవ్వొత్తుల్లా కాలిపోవడాలు, అన్నీ ఇప్పటికీ అవే దృశ్యాలు.

ఏదేమైనా Cruel life కి కాస్తంత సహాయం చేసిన స్నేహ హస్తాల గొప్పతనం, మంచితనం చక్కగా కళ్ళకి కట్టేసారిందులో. సముద్రంలో నీటిబొట్టంత కరుణ కూడా దొరక్కపోయి కదా జరిగేవి ఈ ఆత్మహత్యలు. నిరాశా నిస్పృహలలో కూరుకుపోయి ఆత్మహత్యే శరణ్యం అనుకుని, అమ్మో! నేను ఆత్మహత్య చేసుకుంటే మా అమ్మ గుండె పగిలి చచ్చిపోదూ అని భయపడిపోయే వెర్రి కొడుకు, దారులన్నీ మూసుకుపోయి, మానసికంగా ఓడిపోయిన విద్యార్థికి, దొరికిన ఆలంబన అతని స్నేహితులు. వాళ్ళు అనాలోచితంగానూ, ఆలోచించుకునీ చేసిన చిన్న చిన్న పన్లు, చేసిన మాట సాయాలూ… వీడి మంచితనాన్ని గౌరవించే చిన్ని చిన్ని gestures; అవి ఎంత గొప్ప Transformation తీసుకొస్తాయో జీవితంలో – ఒక్క ధాటి గా చదివించేస్తుందీ అంపశయ్య!

ఆకల్తో అలమటించేస్తున్నప్పుడు రోడ్డు వార హోటళ్ళలో బిర్యానీ తినే వాళ్ళ ప్లేట్లు లాక్కుందామా అని చూసే మనిషి, మెస్ బిల్లు డ్యూ కట్టకపోతే హాల్ టికట్ ఎలా వస్తుందా అని భయపడే మనిషి. మూడొందల కోసం తండ్రి ఎవరి కాళ్ళు ఎలా పట్టుంటాడో తెలీక భవిష్యత్తు పట్ల బిక్క మొహంతో చూసే మనిషి, ఆఖరికి వరంగల్ రోజుల్నాటి లెక్చరర్ గారింటికి వెళ్ళి వాళ్ళిచ్చిన బోర్న్ వీటా తాగి, బలం పుంజుకుని, ఆయనిచ్చిన ప్రోత్సాహంతో హాస్టల్ కు చేరి చదువుకు ఉపక్రమించేదాకా ఇప్పుడో అప్పుడో ఆత్మహత్య చేసుకోబోయిన మనిషి. కానీ ఈ చిన్న సంఘటన అతని దృక్పధం లో మార్పు తీస్కొస్తుంది. అంతవరకూ వివిధ లోపాలతో తన చుట్టూ చేరే స్నేహితుల, హాస్టల్ మేట్ల పట్ల అతని ఆలోచనల్లో మార్పు రావడం, అందరూ కలిసి రవిని తీవ్రంగా భయపెట్టేస్తూండే కాంపస్ రౌడీ రెడ్డి గాంగు ని ఎదుర్కోవడం – అన్నీ కేవలం ఒక విద్యార్థి జీవితంలో ఒక్క రోజులో కలిగిన మార్పు. ఆశ్చర్యం.

ఒక డిప్రెస్డ్ వ్యక్తి కి తన మీద, తన ఖర్చుల మీద, నోటి మీద అదుపు లేని ఫక్తు నెగెటివ్ వ్యక్తి ఆలోచన పరంపరల్లో పచ్చి బూతులతో – సాటి విద్యార్థినుల దగ్గర్నించీ స్త్రీ లంటే కలిగే అంతు లేని సెక్సు ఆలోచనల్లో – తోటి విద్యార్ధినుల పట్ల వాళ్ళ కుండే అమూల్య అభిప్రాయాలూ (‘ఈమె అందమైనదో కాదో ఇంకా నిర్ణయించుకోలేదు’ – తరహా) ఇవన్నీ విసుగ్గా, వికృతంగా అనిపించినా ఒక్క outburst తరవాత రవీంద్ర అసలు మనసు బయటపడి – అతని మానవత్వం బయటపడి, అతనిలో కాస్త పాసిటివ్ దృక్పథం కనిపించాకా, హమ్మయ్య అనిపిస్తుంది. అంతవరకూ ఆలోచనల, పరిస్థితుల అంపశయ్య పై చాలా బాధనీ, వ్యధనీ అనుభవించిన రవీంద్ర – మెల్లగా తనని తాను రక్షించుకోగలడు అన్న నమ్మకం కలిగాకా పాఠకుడిలో కాస్త ప్రశాంతత కలుగుతుంది.

తెలుగులో మెదడు ని స్టిమ్యులైజ్ చేసే రచనలు – కేవలం కొన్ని ఆలోచనల ప్రకటన గా జరిగే రచనలు ఎన్నున్నాయో నాకు తెలీదు. ఈ అంపశయ్య మాత్రం గొప్ప రోలర్ కోస్టర్ రైడ్. రచయిత మిగిలిన రచనలు కూడా ప్రయత్నించాలనిపించేంత బావుంది.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.2 Comments


 1. Gopalam Karamchedu

  తెలుగులో మెదడు ని స్టిమ్యులైజ్ చేసే రచనలు – కేవలం కొన్ని ఆలోచనల ప్రకటన గా జరిగే రచనలు ఎన్నున్నాయో నాకు తెలీదు. ఈ అంపశయ్య మాత్రం గొప్ప రోలర్ కోస్టర్ రైడ్. రచయిత మిగిలిన రచనలు కూడా ప్రయత్నించాలనిపించేంత బావుంది.
  Stimulate?
  Try his other works?
  Great Telugu expressions!
  I may not understand Telugu in future!


  • సౌమ్య

   Gopalam garu

   ఆ పదాలు వాడ్డంలో సుజాత గారి ఉద్దేశ్యాన్ని గురించి నేను చెప్పలేను కానీ, వాటిల్లో అంత అర్థం కాకపోవడానికి ఏముందో నాకు అర్థం కాలేదు.
   ఇది మీకు ఉపయోగపడుతుందేమో చూడండి: http://www.urbandictionary.com/define.php?term=Stimulize
   ఇక – రచయిత ఇతర రచనలు ప్రయత్నించడం అన్నది ఇప్పటికి చాలామంది రాయగా చూశాను. దాన్ని కనిపెట్టిన ఘనత సుజాత గారిది కాదనుకుంటాను.
   నాకు మామూలుగానే అనిపించాయి రెండు వాక్యాలు. భాషలో కాలక్రమంలో మార్పులు రాకుండా, కొత్తపదాలు రాకుండా ఉన్నదే భాష? అదేం భాష?

   “I may not understand Telugu in future!” – ఎవరికీ అర్థం కాకపోవచ్చు లెండి. మీకు తోడుగా చాలామంది ఉంటారు. ప్రాచీన తెలుగు అర్థం కాదు నాకు. కానీ, నాకు బోలెడుమంది తోడు ఉన్నారని క్రమంగా తెలిసింది. మీక్కూడా అలా ఎవరో దొరుకుతారని ఆశిస్తాను.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

పథేర్ పాంచాలీ – బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్

వ్యాసకర్త: Sujata Manipatruni పథేర్ పాంచాలీ – బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ (1894-1950) అనువాదం : మద్దిపట్...
by అతిథి
0

 
 

“The Ministry of Utmost Happiness” – Arundhati Roy

వ్యాసకర్త: Sujata Manipatruni ********** ఏ భేషజాలూ లేకుండా నిజమే చెప్పాలంటే, ఓ 200 పేజీల దాకా… దీనిలో “...
by అతిథి
1

 
 

“కొల్లాయిగట్టితేనేమి?” – మహీధర రామమోహనరావు

వ్యాసకర్త: Sujata Manipatruni ***************** “కొల్లాయిగట్టితేనేమి” ఒక చారిత్రక నవల – ఒక ఆదర్శవాది జ...
by అతిథి
1

 

 

ఓల్గా – రాజకీయ కథలు

వ్యాసకర్త: Sujata Manipatruni *********** ఓల్గా రాసిన మంచి రాజకీయ కథలు. ఈ పది కథలూ రాయడానికి మిగిలిన రచనల...
by అతిథి
0

 
 

ISIS: The State of Terror

రాసినవారు: సుజాత మణిపాత్రుని ఇది ఒక సారి చదవడానికీ, కరెంట్ అఫైర్స్ రిఫ్రెషర్ లాంటి  ...
by అతిథి
0

 
 

ద బుక్ థీఫ్ (The Book Thief) – Marcus Zusak

వ్యాసకర్త: Sujata Manipatruni *************** ఇది బాల సాహిత్యం. ఈ కథ పుస్తకాలెత్తుకుపోయే పదీ పన్నెండేళ్ళ ఏ...
by అతిథి
2