పుస్తకం
All about booksపుస్తకభాష

July 26, 2017

ఓ సామాన్యుడి అసాధారణ కథ – “ఓ సంచారి అంతరంగం”

More articles by »
Written by: అతిథి
Tags: ,

ఇది ఓ మామూలు మనిషి జీవితం! భద్రజీవితం గడిపేవారికి ఇది ఓ సామాన్యుడి కథే, కాని ఆయన అసాధారణంగా జీవించారు. సంచార జీవనం సాగించే “దొంబి దాసరుల” కుటుంబంలో పుట్టిన రచయిత స్వీయ చరిత్ర ఈ పుస్తకం. తన ముందు తరాలవారి బతుకు వెతలను ప్రపంచానికి వెల్లడి చేసేందుకు ఈ రచన చేసినట్టు రచయిత చెప్తారు.

సంచార, అర్థ సంచార జీవనం సాగించే కుటుంబంలో పుట్టి ఆ కులం నుండి మొదటి సారిగా చదువుకొని ఎదిగిన క్రమాన్ని 66 అధ్యాయాలలో వివరించారు రచయిత. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల నైసర్గిక స్వరూపాన్ని, అప్పటి సాంఘిక పరిస్థితులను మన కళ్లముందుంచుతారు రచయిత. సంచార జీవితంలో ఉండే బాధని, తరతరాలుగా సంచారానికి అలవాటు పడటంతో స్థిరనివాసం అంటే వాళ్లలో ఉండే తెలియని సంకోచాన్ని వెల్లడిస్తారు. ఆ సంకోచాన్ని క్రమంగా అధిగమించిన తీరు, వారి అభ్యున్నతికి అప్పటి ప్రభుత్వం సహాయం చేసిన వైనం తెలియజేస్తారు.

గ్రామీణుల వినోదం కోసం, వికాసం కోసం తమ జ్ఞానాన్ని ఉపయోగించేవారు దొంబిదాసరులు. ఆ నేపథ్యాన్ని వివరిస్తారు. అప్పటిదాకా సంచార జీవితం గడిపిన దొంబిదాసరుల సమూహాలు, రచయిత కుటుంబం స్థిర నివాసం ఏర్పరుచుకోడానికి దారితీసిన పరిస్థితులను తెలుపుతారు రచయిత. తన తల్లిదండ్రులైన సణ్ణమ్మ, సింగయ్యల జీవన విధానాన్ని వివరిస్తారు రచయిత.

రచయిత తండ్రి మరికొందరితో కలిసి ఏర్పాటు చేసుకున్న నాటక బృందం ఊర్లు తిరుగుతూ – భక్తప్రహ్లాద, శని మహత్యం, గంగా-గౌరి, కంసవధ – మొదలైన నాటకాలను ప్రదర్శించేవారు. ఏ నాటకం వేసిన రచయిత తండ్రి రంగస్థలం మీద రాత్రంతా ఉండేవారు. ఆయన వేసేది విదూషకుడి పాత్ర. ఏ నాటకంలోనైనా అయన పాత్ర ఉండాల్సిందే. నాటకం లయ తప్పకుండా ప్రేక్షకులకు విసుగనిపించకుండా తన పాత్రని ఆయన అద్భుతంగా నిర్వహించేవారు. తండ్రికి కోడంగయ్య అనే పేరెలా వచ్చిందో చెబుతారు.

తాము ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకోడం ప్రకృతికి ఇష్టం లేదేమో అంటారు – ఆ సంవత్సరం కరువు కాటకాల వల్ల పంటలు పండకపోనడం వల్ల!కడుపు చేత పట్టుకుని దేశాలు పట్టుకుపోయినా, సంచారం సరిగా సాగలేదు. కొడగు జిల్లా చేరి అక్కడ తాత్కాలిక బస ఏర్పాటు చేసుకుంటారు. పిల్లల ఆకలి తీర్చడానికి తల్లి ఓ తోటలో పనికి కుదురుతుంది. తండ్రికి మాత్రం కూలీనాలీ చేయడం ఇష్టం ఉండదు. ఆ ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణమవుతుండగా ఒక తోటలో రచయితని, ఆయన సోదరుడిని జలగలు కుడతాయి. అప్పుడు ఓ మహిళ చూపిన ఆదరణ రచయితని ముగ్ధుడిని చేస్తుంది. అక్కడ పనిచేస్తూ తల్లి గాయపడడంతో ఆ ఊర్లో ఉండడం తండ్రికి ఇష్టం లేకపోయింది. దాంతో ఆ ఊరు వదిలి మరో ఊరికి బయల్దేరుతారు.

మైసూరు – హుణసూరు రహదారిలో ఓ మైదానంలో గుడిసెలు వేసుకుని నివసించడం మొదలుపెడతారు. ప్రభుత్వం కూడా ఇంటి స్థలాలు మంజూరు చేస్తుంది. స్త్రీ వేషాలు వేసే సమూహాం కాబట్టి ఆ తాండాకి “స్త్రీల వేషధారుల గుడ్లు” అని పేరు పెట్టారు. ఆ పేరు విచిత్రంగా ఉందని ఓ సాధువు పేరిట “జ్ఞానానందపుర” అని పేరు పెడతారు. ఈ పేరు పలకడం గ్రామీణులకి కష్టమై చివరికి గాంధీగారి పేరిట బాపుజీ కాలనీ అని పేరు స్థిరపరుస్తారు.

కాలక్రమంలో వాళ్ళ ఊరికి ఒక ప్రభుత్వ పాఠశాల మంజూరు అవుతుంది. అయినప్పటికీ పిల్లలు బడికి వెళ్ళడానికి ఆసక్తి చూపించరు. లక్ష్మణశెట్టి అనే ఉపాధ్యాయుడు అత్యంత శ్రద్ధతో ప్రతీ ఇంటికి వెళ్ళి పిల్లల్ని బడికి పంపాల్సిందిగా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తారు. రచయిత చదువుకోడం మొదలుపెడతారు. అదే సమయంలో ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలు ప్రారంభిస్తుంది. ప్రభుత్వాధికారుల ప్రోత్సాహంతో రచయిత ఓ ఆశ్రమ పాఠశాలలో చేరి అక్కడి హాస్టల్‍లో ప్రవేశిస్తారు. అక్కడ శివణ్ణ అనే ఉపాధ్యాయుడి ఆదరణ ఎంతో బావుంటుంది. కొత్త మిత్రులు ఏర్పడుతారు. చదువుపై ఆసక్తి రెట్టింపవుతుంది. రచయిత ఇంగ్లీషు నేర్చుకున్న విధానం భలే ఆసక్తిగా ఉంటుంది. ఏడో తరగతి వరకూ హాస్టల్లో చదివాకా, అగ్నిపరీక్షలాంటి పబ్లిక్ పరీక్షలు పూర్తి చేసి ఊరికి తిరిగొస్తారు. ఇప్పుడు మరో సమస్య ఎదురవుతుంది. అన్నం సమస్య. హాస్టల్లో ఉన్నప్పుడు వేళకి తిండి దొరికేది. ఇంటికొచ్చాకా ఆహారం సమస్య అయ్యింది. ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుంది.

కొత్త బడిలో ఎనిమిదో తరగతిలో చేరే లోపు మారెమ్మ జాతరని చూస్తారు, మనకి జాతర గురించి వివరిస్తారు. ప్రభుత్వం కొంత భూమి ఇస్తే, సేద్యం చేసే పద్ధతులు తెలియక తమవాళ్ళు ఇబ్బంది పడిన వైనాన్ని వివరిస్తారు. నిద్రపల్లి పర్యటనకు ఎందుకు వెళ్ళాలనుకున్నారో తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది. మాదాకవళం రుచి గురించి చక్కగా చెబుతారు. ఆ వివరాలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. ఎల్లమ్మ పండుగని ఎంత గుట్టుగా చేశారో చెబుతారు. గట్టి పిండం మాగూరవ్వ గురించి చదివితీరాల్సిందే. చేయూపి పిలిచిన అడవి గురించి చెబుతారు, సంరక్షించే పల్లెల తీరు వివరిస్తారు.

“శని కథ – జుగల్‍బందీ” అనే అధ్యాయం చదువుతుంటే పురాణ కాలక్షేపం కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది.

తమది Nomadic and Seminomadic Tribe అని ప్రభుత్వాధికారుల వద్ద సర్టిఫికెట్ తీసుకుని ఎనిమిదో తరగతి చేరుతారు. ఆ సర్టిఫికెట్ పొందడం వల్ల అప్పటిదాకా ఏ అస్థిత్వము లేకుండా ఉన్న తమకు ఓ గుర్తింపు లభించిందని ఆనందిస్తారు. సెక్షన్ లీడర్ అవుతారు. పాంట్లు వేసుకోవాలనే చిరుకోరిక ఎలా తీరిందో చెబుతారు. అక్క పెళ్ళి జరిగిన తీరుని వివరిస్తారు. సినిమాల పిచ్చి ఎలా పెరిగిందో చెప్తారు. ఎన్.సి.సి.లో దొరికిన రుచికరమైన భోజనం గురించి చెబుతారు రచయిత. చనిపోయిందనుకున్న అమ్మ బతికిన వైనం ఓ అద్భుతమంటూ వివరిస్తారు. గుప్తజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉపాధ్యాయుడి చేత తన్నులు తినడం మనలో జ్ఞాపకాలను తట్టిలేపుతాయి.

పదో తరగతి పాసవగానే చిన్నచిన్న పనులు చేసి డబ్బు సంపాదించుకుంటారు. కాలేజీలో చేరి అక్షరయాత్ర కొనసాగిస్తారు. పుణ్యభూమి హాస్టల్లోని దళితుల పట్ల చూపిన వివక్షపై పోరాటం చేస్తారు. జ్వరం వచ్చి ఆరోగ్యం పాడయితే, తండ్రి ఊర్లో కథలు చెప్పి, జనాలను డబ్బులడిగి తెచ్చి రచయితకి ఇస్తారు. తండ్రి భిక్షాటన చేసి ఆ డబ్బు తెచ్చాడని తెల్సిన రచయిత కుమిలిపోతారు. పుణ్యభూమి హాస్టల్లోని దళితుల పట్ల చూపిన వివక్షపై చేసిన పోరాటం వల్ల దళిత సంఘాలతో పరిచయం ఏర్పడుతుంది. కన్నడ సాహిత్యంలో ప్రఖ్యాతి గాంచిన దేవనూర మహాదేవ గారితో పరిచయం ఏర్పడుతుంది. చదువుతో పాటు ఉద్యమాలు కొనసాగించారు. రిజర్వేషన్ లేకపోవడం హాస్టల్లో సీటు పోగొట్టుకోడం, ఆ సమయంలో పుస్తకం ఆయనకి కలిగించిన భరోసా గురించి తెలుసుకుంటే, విద్య మీద గౌరవం పెరుగుతుంది. కువెంపు గారి రచనలు నాగరాజ గారిని ప్రభావితం చేసిన వైనం చదివితే, సాహిత్యం మీద గౌరవం పెరుగుతుంది.

ఒక పత్రికకి ఉత్తరం రాయడం వల్ల తమ ఊరికి విద్యుత్ ఎలా వచ్చిందే రచయిత చెప్పినప్పుడు సమస్యలని చూసి బెదిరిపోకుండా, వాటిని ఎలా అధిగమించాలో తెలుస్తుంది. తను చేసిన తప్పుని క్షమించిన గొప్ప మనిషిని పరిచయం చేస్తారు. ఆయన వల్ల తనలో కల్గిన మార్పును చెబుతారు రచయిత. మట్టిలో మట్టిగా కల్సిన అమ్మ గురించి చెప్పినట్టు చెమర్చని కన్ను ఉండదు.

తమ సముదాయం వారందరిని సంఘటితం చేసి వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేశారు రచయిత. ఈ పుస్తకంలోని కొన్ని అధ్యాయాలను అనేక విద్యాసంస్థలు, యూనివర్సిటీలు తమ విద్యార్థుల పాఠ్యాంశాలుగా ఎంపిక చేశాయి.

అయితే కథ అసంపూర్తిగా ఉన్నట్టు, పుస్తకం హఠాత్తుగా ముసిగిపోయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే రచయిత తన జీవితంలో కొంత భాగాన్నే అక్షరబద్ధం చేశారు. తదుపరి దశ జీవితం గురించి వ్రాస్తాననీ, మరో పుస్తకంలా వెలువరిస్తామని అనువాదకులతో చెప్పారట. పాఠకులు రెండో భాగం కోసం వేచి ఉండవచ్చు.

ఈ పుస్తకానికి చిదంబరం గారి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణ. ప్రతీ అధ్యాయానికి దాని కథలోని ఇతివృత్తానికి నప్పేలా అందమైన బొమ్మలు గీశారు. ఇక రంగనాథ రామచంద్రరావు గారిది సరళమైన అనువాదం. పుస్తకం అంతా మామూలు తెలుగులో ఉంటే సంభాషణలు మాత్రం దొంబి దాసర్లు మాట్లాడే భాషలో ఉండడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొదటిసారి చదివితే వెంటనే అర్థం కాకపోవచ్చు గాని ఒకటికి రెండు సార్లు చదివితే ఆ యాస లోని సొగసు గ్రహించవచ్చు.
“మల్లవరపు వెలువరింతలు” వారు ప్రచురించిన ఈ 192 పేజీల పుస్తకం పాఠకులని ఆకట్టుకుంటుంది.

కన్నడ మూలం: కుప్పె నాగరాజ, తెలుగు: రంగనాథ రామచంద్రరావు
వెల: రూ.200, ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.
ప్రచురణకర్తల చిరునామా : 1-2-740, హనుమాన్ మందిరం దగ్గర, రాకాసిపేట,
బోధన్-503185, నిజామాబాద్ జిల్లా. ఫోన్:90101 53505.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

“నల్లమల ఎర్రమల దారులలో… యాత్ర” పరిచయం

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************** ఒక రచన మరికొన్ని రచనలకి కారణమవుతుందని మనం వింటూం...
by అతిథి
0

 
 

నిర్వాసితుల వ్యథ – “పొద్దు ములిగిపోయింది”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ **************** అభివృద్ధి పేరిట జరుగుతున్న మాయ వల్ల ఊర్లకి ఊర్ల...
by అతిథి
1

 
 

“వెలుగు దారులలో…” పుస్తక పరిచయం

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************ ఓ పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. మరి స్త...
by అతిథి
2

 

 

విస్మృత జీవుల అంతశ్శోధనకు అక్షరరూపం “మూడవ మనిషి”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************* ఆధునిక కవిత్వంలో హైకూలు, నానీలు, మినీ కవితల్లానే మ...
by అతిథి
2

 
 

నగరానికి నిండు నమస్కారం – “షహర్ నామా”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ****************** ప్రతీ ఒక్కరికీ తాము పుట్టి పెరిగిన ఊరి పట్ల కాస...
by అతిథి
0

 
 

కొత్త ముద్రలను వేసే ప్రయత్నం – ‘కాన్పుల దిబ్బ’

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ***************** ప్రముఖ రచయిత డా. చింతకింది శ్రీనివాసరావు గారి రె...
by Somasankar Kolluri
1