పుస్తకం
All about booksపుస్తకభాష

April 10, 2017

ఆ వెనక నేను

More articles by »
Written by: అతిథి
Tags:

వ్యాసకర్త: చీమలమర్రి స్వాప్నిక్
**********
వర్షం వెలిసిపోయింది. ఇంకా అక్కడక్కడా చినుకులు వినిపిస్తున్నాయి. అందరిలాగా నేను కూడా ఒక్కసారి పైకి చూసి, చెయ్యి బయటికి చాపి, హడావిడిగా బయల్దేరాలి, కానీ యేదో వెలితితో అక్కడే ఆగిపోయా. ఇలాంటప్పుడు నాకు యేదో గుర్తుకురావాలని అనిపిస్తోంది. కానీ ఎంత ప్రయత్నించినా ఆ సంగతి గుర్తుకురావట్లేదు. నా మనసు లో ఎప్పటి నుంచో లో ఓల్టేజ్ . నా జిగ్సా పజిల్లో కొన్ని ముక్కలు కనపడట్లేదు. వాటి కోసం వెతికి, అలిసిపోయి – నిస్సహాయతని ఒప్పుకోలేక, చేసేది లేక – పూర్తి చేసిన భాగాలలోనే బ్రతుకుతున్నా.

అప్పటివరకు ఉన్న నిశ్శబ్దం, జనాల గోలతో చెరిగిపోయింది. “ఇంక వెతకడం ఆపెయ్యి” అని నాకు చెప్పినట్టుగా ఎవరికి వాళ్ళు వెళ్లిపోతున్నారు. తెలియకుండానే నేను కూడా నెమ్మదిగా ముందుకు కదులుతున్నా. అది తెలిసేసరికి నా పక్కన ఒక చిన్న నావెల్టీ కొట్టు వచ్చింది. కొట్టు ముందు చాలా బొమ్మలతో పాటు, నేను చిన్నపుడు ఆడుకున్న ‘హీమాన్’ కత్తి తగిలించి ఉంది. వెంటనే నా కళ్ళు ఆ వైపు వెళ్లిపోయాయి. ఇంక చేసేది లేక కాళ్ళు కూడా వాటితోనే వచ్చేశాయి.

****
చాలా చిన్న కొట్టు. సన్నగా, లోపలికి పొడుగ్గా ఒక బల్ల వేసి ఉంది. ఇద్దరు మనుషులకన్నా ఎక్కువ మంది ఉంటే ఇరుకైపోతుంది. కొట్లో అమ్మే అతను తప్పించి ఎవరూ లేరు.

“ఆ కత్తి.. అదే ‘హీమాన్’ కత్తి?”

బయటికి వెళ్లి దుమ్ముపట్టిన కత్తి తీసుకొచ్చి, సుబ్బరంగా తుడిచి నా ముందు పెట్టాడు. నా దగ్గర ఒకప్పుడు ఉన్న లాంటిదే. కాకపోతే ఈ హేండిల్ మీద డివైడర్ తో నా పేరు, కింద “ II – A” section అని చెక్కిలేదు. వెంటనే కొని ఇంటికి పట్టుకెళ్లా.

సమయానికి ఇంట్లో బ్యాటరీలు కనపడితే అక్కడ శ్రీ మహాలక్ష్మి తాండవిస్తుందంట. ఇటువంటి మూఢనమ్మకాలకి నేను చాలా దూరం. బ్యాటరీలు కొనటానికి బయట వాకింగ్‌కెళ్ళా. వస్తువుల గురించి ఎక్కువ ఆలోచించని నాకు ఆ కత్తి కొన్న సంగతే గుర్తులేదు. వాకింగ్ చేసి వచ్చి, ఇంటి ఒకటో మెట్టు ఎక్కాక బ్యాటరీలు కొనాలని అప్పుడు గుర్తొచ్చి, షాప్ కి వెళ్ళా. కాఫీ టేబుల్ మీద అలానే నాకోసం చూస్తూ ఉంది హీమాన్ కత్తి. వెంటనే దానికి ప్రాణం పోసి ఒక్కసారి బటన్ నొక్కా.

****

టైం 8:00. పొద్దున్నే జేబులో అలారం మోగుతోంది.

కళ్ళు తెరిచేసరికి నేను హాల్‌లో కింద పడుకుని ఉన్నా. తల పగిలిపోతోంది! చేతిలో కత్తి విరిగిపోయి ఉంది. నా చెయ్యి విరిగిపోయిన హేండిల్ మీద ఉంది.

“కత్తి ఎలా విరిగిపోయింది?”

దాన్ని పక్కకి పడేసి, కాఫీ కలుపుకున్నా. రాత్రి ఏమి జరిగిందో గుర్తుకు రావట్లేదు. కానీ ఏదో మారింది. ఏదో కాదు – అంతా మారింది. ఇంటి గోడల రంగు దగ్గరనుంచి, నేను తాగే కాఫీ రుచి వరకు. ఇంట్లోకి వచ్చే వెలుతురు నుంచి మూలన ఉన్న చీకటి వరకు. అంతా కొత్తగా ఉంది. వింతగా ఉంది. ఇదే నిజం అయితే మరి నేను ఇప్పటి వరకు బ్రతికింది?

స్పృహ వచ్చాక వచ్చిన మొదటి ఆలోచన, “ఆ కత్తి కావాలి.”

****

వెంటనే ఆ గిఫ్ట్ షాప్ కి వెళ్ళా. షాప్ మూసేసి ఉంది. నేను మళ్ళీ వస్తానని తెలుసు కాబోలు. బోర్డు మీద నెంబర్ కూడా లేదు. ఏమైందో అడుగుదామని పక్కనున్న పుస్తకాల షాప్ కి నడిచా.

“ఈ పక్క షాప్ వాళ్ళు…”

“పాపం షాప్ మూసేశారండి. చాలా రోజుల బట్టి అనుకుంటున్నదే. కస్టమర్స్ లేకుండా ఎంత కాలం నడుపుతారు?”

నాకు ఏమి చెయ్యాలో తోచలేదు. నేను తెరుచుకుందనుకున్న ఒక్క దారీ మూసుకుపోయింది. నిరాశతో వెళ్లిపోతుండగా అతనికి వెనకాల ఒక చిన్న కొటేషన్ స్టికర్ -“A Book is a magical thing that lets you travel to far-away places”.

“ అది నిజమేనా?” అన్నా, ఆ స్టికర్ వైపు చూపెడుతూ.

“నిజమే. ఎక్కడికెళ్ళాలి మీరు?” అన్నాడు నవ్వుతూ.

“ఏమో. ఎక్కడికైనా వెళ్ళచ్చా?”

“ఎక్కడికైనా”

“ఎక్కడికెళ్లాలో మర్చిపోతే?.”

“మర్చిపోతే మంచిదేగా! ఇక్కడే సుఖంగా ఉండండి.”

“ఏది మర్చిపోయామో గుర్తున్నప్పుడే కదా, ఇక్కడ సుఖంగా ఉండేది!”

నా సమస్య అర్థమైనట్టు అతను వెంటనే లోపలనుంచి ఒక పుస్తకం తెచ్చిచ్చాడు. ఖాళీ పుస్తకం. లోపల ఏమీ లేవు, పేజీ నెంబర్లు తప్ప.

“ఇదిగోండి మీ టికెట్. రోజు దీన్ని కాసేపు చదివి, తల కింద పెట్టుకుని పడుకోండి.”

“చదవాలా? ఏముందని ఇందులో?” నేను పుస్తకం చూస్తూ అడిగా.

అతనేం మాట్లాడలేదు.

“ఎంత?” అని మొహమాటంగా పర్సు తియ్యబోతుండగా నన్ను ఆపేశాడు.

“వర్షం పడేలాగా ఉంది. తొందరగా ఇంటికి వెళ్ళండి” అన్నాడు.

****

ఇంటికి చేరేసరికి బయట వర్షం మొదలైంది. వర్షం అంటే అసహ్యమేస్తోంది. ఎవరికీ వర్షం? ఎందుకీ వర్షం? మళ్ళీ ఉరుములు, పిడుగులు. వర్షమే దండగ అనుకుంటే ఇవెందుకు? అతను కొట్టు ఎందుకు మూసెయ్యాలి?

మేఘాలు సూర్యుడితో పాటు, కాలాన్ని నంచుకు తినేసాయి, ఆరు గంటలకే ఎనిమిది అయినట్టు ఉంది.
నా హీమాన్ కత్తి, ఆ షాప్, పొద్దున్న కనపడిన వెలుగు, ఇక లేవు. ఎందుకు లేవు? ఆ సమాధానాన్నీ కూడా మేఘాలు మూసేసాయి.

రాత్రి జరిగింది గుర్తుకొస్తే తప్ప.

గుర్తురానవసరం లేదు. ఇన్ని మర్చిపోయిన వాడిని ఇది మర్చిపోలేనా? గలను.

పుస్తకం!

“దీని మీద ఏమి రాయకండి.” అన్నాడు షాప్ అతను, వెళ్లిపోతుండగా.

“ఎక్కడికి కావాలన్నా వెళ్ళచ్చట. ఇదేమైనా రైలా, బస్సా.”

ఖాళీ పేజీలు ఆలా కాసేపు తిప్పి తెలియకుండానే పక్కన పెట్టుకుని పడుకున్నా.

****

జేబులో అలారం మోగుతోంది. టైం 8:00.

అంతా ఎప్పటిలాగానే ఉంది. ఏదైనా తేడా ఉన్నా గమనించేంత వీలు లేదు. ఈరోజు సోమవారం. క్రితం వారం లాగానే ఈ వారం కూడా తిరిగిపోతుంది. ఈ వారం లాగానే వచ్చే వారం. ఈరోజు నుంచి ఇంకో ఐదు రోజుల పాటు – కూర్చుని చేసే పనులు నుంచుని, నుంచుని చెయ్యవలసిన పనులు పరిగెడుతూ చెయ్యాలి. ఇంత కష్టానికి ఊరట వారం చివరి 48 గంటలు.

“నీ పని గురించి తప్ప వేరే విషయాలు ఆలోచిస్తే వెనకపడిపోతావ్!”
ఎందులో? ఎవరికీ తెలుసు!

ఫోన్ కేలండర్ వీడిని కలవాలి, వాడిని కలవాలి అని తరుముతోంది. “ఎన్ని పనులు పేరుకుపోతున్నాయో చూడు” అని విసుక్కుంటోంది. పక్క మీద ఉన్న పుస్తకం తెరిచి చూడకుండానే తీసుకెళ్ళి పేపర్ల బొత్తి మీద పెట్టేసి బయటికి వెళ్ళిపోయా.

****

సాయంత్రం ఇల్లు చేరేసరికి ఎంత టైం అయిందో చూడటానికి మనసు రాలేదు. రాంగానే టీవీ పెట్టి, పొద్దున్నే వండిన అన్నం కాస్త తినేసరికి “ఇంక నా వల్లకాదు బాబోయ్!” అని చేతులు ఎత్తేసింది శరీరం.

దాని తప్పేంలేదు చెడతిరిగాను ఈరోజు. ఇష్టంవచ్చినట్టు ఎగరగలిగే పేపర్ల స్వాతంత్ర్యాన్ని తొక్కేస్తూ కనపడింది వాటి మీదున్న పుస్తకం. కాస్త బరువుగా కనపడుతోంది. దాన్ని తీసుకుని నా గదిలోకి వెళ్లా.

తెరిచి చూసేలోగా పుస్తకం చెయ్యి జారింది. లోపల ఖాళీగా ఉండాల్సినచోట అక్షరాలు కనపడ్డాయి. ఏవో అక్షరాలు కాదు.. బాగా తెలిసిన రాత ఉన్న అక్షరాలు. పుస్తకం మొదటి పేజీలో నా పేరు, కింద సంవత్సరం దగ్గర 1997. నా క్లాస్, అడ్రస్, ఫోన్ నెంబర్, అన్నీ. నా చిన్నప్పటి రాతలో.

పేజీలు తిప్పి చూస్తే, వరసగా డేట్లు వేసి కింద ఆ రోజు జరిగిన విషయాలు రాసి ఉన్నాయ్. హడలి పోయి పుస్తకం దూరంగా విసిరేసా. భయం!
కాసేపటికి విసిరేసిన మూలకి పరిగెత్తి వెళ్ళి పుస్తకం మళ్ళీ తీసుకున్నా.

****
జులై 14 – 1997

వర్షం. ఆకాశం కూడా నాలాగే ఏడుస్తోంది. ఈరోజు కూడా స్కూల్ కి వెళ్ళటానికి ఏడ్చా. చొక్కా మీద నీళ్లు పడేంత. బస్సులో కిటికీ సీట్లని నీళ్లు పడుతున్నాయని వెలివేశారు. బస్సు ఎక్కి కిటికీ సీట్ లోనే కూర్చున్నా. రేపటి నుంచి స్కూల్ కి వెళ్ళటానికి ఏడవకూడదు.

అక్టోబర్ 7 – 1997

ఈరోజు రఘుగాడు వాడు దేవుడినని చెప్పాడు. నిజమే! నాకు చూపించాడు కూడా. వేలు వంకరగా తిప్పగలిగితే దేవుడు అనమాట. నాకు రాలేదు మరి. దేవుడే! లేకపోతే ఎందుకు చెప్తాడు?

డిసెంబర్ 15 – 1997

చాలా రోజులుగా సూపర్ మాన్ బిస్కేట్లు తెస్తా అంటున్న సిద్ధార్థ గాడు ఈరోజు తీసుకొచ్చాడు. అవి తింటే సూపర్ మాన్ లాగా ఎగరగలం. నా కొత్త పెన్సిల్ ఇచ్చేసి నేనూ రెండు బిస్కెట్లు తీసుకున్నా. అసలైతే ఒక పెన్సిల్ కి ఒకటే. సిద్ధార్థ నా బెస్ట్ ఫ్రెండ్. అందుకే రెండు ఇచ్చాడు.

జూన్ 18 – 1997

ఈరోజు క్లాస్ వెనకాలకి వెళ్లి ఆడుకున్నాం. అక్కడ దయ్యం లేదులే. వెనక్కి వచ్చేస్తుంటే, రఘుగాడు ఎందుకైనా మంచిదని అరటి చెట్టు కొరికి వెళ్ళమన్నాడు. అందరం కొరికాము. వాడికి అన్నీ తెలుసు లేకపోతే ఎందుకు చెప్తాడు? క్లాస్ కి వెళ్ళాక కాళ్ళు పెట్టే చోట బ్యాగ్గులు వేసుకుని కాసేపు పడుకున్నాం అందరం.

ఏప్రిల్ 14 – 1997

సమ్మర్ సెలవలు. ఇంట్లో పరుపులు ఎండలో వేసి కొడుతున్నారు. తాత నేను చెక్క మంచం మీద పడుకుని పిచ్చి కబుర్లు చెప్పుకున్నాం. నా హీమాన్ కత్తితో తాతని కాసేపు పొడిచా.

****

ఒక సంవత్సరం మొత్తం! నేను మర్చిపోయిన, గడిపిన, నా 1997. ఇవన్నీ నావి, నావే. గట్టిగా అరవాలని ఉంది. నావే ఇవన్నీ!

పుస్తకం మీద నీటి చుక్కలు పడ్డాయి. పైన చూశా. అంత వెలుగుని తట్టుకోలేక నా కళ్ళు కొంచెం తడి చేసుకున్నాయి.

ఏడవకూడదు, నవ్వాలి!
ఏడవకూడదు, నవ్వాలి!
ఎందుకు ఏడవకూడదు? ఏడుస్తా..

****
ఆ రోజు రాత్రి , కత్తిలో బ్యాటరీలు వేసి బటన్ నొక్కగానే ఆ శబ్దాలు, రంగులతో పాటు వెనక్కి వెళ్ళిపోయుంటా. ఎక్కడికి వెళ్లానో ఇప్పుడే తెలిసింది. అందుకనే కసిగా కత్తి విరకొట్టేసి ఉంటా. తెలుసుకోవాలనే ఆరాటం ఉండచ్చు, తట్టుకునే శక్తి ఉండద్దూ?
అయినా ఇప్పుడు నాకా కత్తి ఎందుకు!

నా డైరీని పట్టుకుని నిద్రపోయా.

పొద్దున్నే డైరీ ఇంకాస్త బరువుగా అనిపించింది. ఆ తరువాత పేజీలలో, ఇంకో మర్చిపోయిన సంవత్సరం.

****

నేను మర్చిపోయిన సంవత్సరాలన్నీ మళ్ళీ నా కోసం వచ్చేసాయి. నన్ను నింపేసాయి. మర్చిపోయిన చివరి విషయం వరకు. ఎందుకు మర్చిపోయానో తెలిసేంతవరకు నింపేసాయి.

ఇప్పుడు నా ‘గతం’ నాకు దొరికింది. వాటన్నిటితోను ఉండాలని లేదు, కొన్ని మళ్ళీ మర్చిపోవాలని ఉంది. ఎలా? నేనేమైనా రఘుగాడిలా దేవుణ్ణా?

డైరీ అయిపోయింది. ఏడుపు ఇంకిపోయింది.

ఎరగని నవ్వు మఱ్ఱి ఆకు మీద పైకి తేలింది.

****

మనిషికి ప్రాణవాయువు ఎంత ముఖ్యమో, జ్ఞాపకాలు అంత ముఖ్యం. ఆ జ్ఞాపకాలని గుర్తుంచుకోవటం ఇంకా ముఖ్యం, అది మన అనన్యత. కొన్ని పుస్తకాలకి అక్షరాల అవసరం లేదు. అవి మన గతజగత్తుకి తాళం చెవులు.

ఇలాంటి పుస్తకాలు పూర్తిచెయ్యాలంటే లోపల ఎంతో మథనపడాలి. వాటిని బయటపెట్టాలంటే, రచయితకి జనం మీద ప్రేమ, దయ, మామూలు మనుషులకన్నా చాలా ఎక్కువ శాతంలో ఉండాలి.

అలా చెయ్యగలిగిన, (నాకు తెలిసిన) కొంతమంది దయగల ప్రభువులలో Ray Bradbury ఒకరు.

ఈ మధ్య చదివిన ‘Ice Boys in Bell Bottoms’ తరువాత తెలిసింది, (జూ.) కృష్ణశాస్త్రి దేవులపల్లి గారు కూడా అంత దయగలవారే.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.20 Comments


 1. పవన్ కుమార్

  భలేగా రాసారండి.


 2. Desu Chandra Naga Srinivasa Rao

  Neatly written with the emotions expressed perfectly


 3. Desu Chandra Naga Srinivasa Rao

  Excellent Writing!


 4. Fine…nono..Excellent.naamanasukunaachindhi


 5. Jalandhara

  ఇలాంటి పుస్తకాలు పూర్తి చెయ్యాలంటే లోపల చాలా మధన పడాలి.వాటిని బయట పెట్టాలంటే రచయితకు జనం మీద మామూలు మనుషులకన్న దయ, ప్రేమ చాలా ఎక్కువ శాతం ఉండాలి…..ఈ కధ రాయాలన్నా అంతే. ఆశీస్సులు.


 6. వురుపుటూరి శ్రీనివాస్

  భలే వ్రాసారు. ఏకకాలంలో నవ్వూ, దిగులూ.


 7. Shrutha Keerthi

  Lovely write up


 8. అనురాధ

  చాలా కదిలించేట్లు రాసారండి


 9. చాలా బాధగానూ, జెలసీగానూ, ఒళ్ళుమంటగానూ ఉంది స్వాప్నిక్ మీరంటే… ఇంతందంగా వచనం రాయవచ్చని తెలియజెప్పినందుకు… అలా రాయలేని నా అశక్తతని గుర్తుచేసినందుకు.

  కొంత ఉండాలనీ… మరికొంత మరచిపోవాలనీ అనుకునేంత గతం ఉండడం… అదృష్టకరమైన దురదృష్టకరపు టదృష్ట వలయం. నా వరకూ నాకు ఆ వృత్తం వ్యాసార్ధం సున్నా. అందుకే కొన్ని అనుభూతులు అర్ధంకావు.


  • Swapnik

   థాంక్ యూ అండీ!

   “మరికొంత మరచిపోవాలనీ అనుకునేంత గతం ఉండడం… అదృష్టకరమైన దురదృష్టకరపు టదృష్ట వలయం”

   చాలా బాగా చెప్పారు.


 10. స్వాప్నిక్ పేరు కి తగ్గట్టుగా ఉంది రచన.ఆలోచిస్తూ చదవాలి ఆషామాషీ గా కాదు.


 11. నీ పని గురించి తప్ప వేరే విషయాలు ఆలోచిస్తే వెనకపడిపోతావ్!”
  ఎందులో? ఎవరికీ తెలుసు! excellent narration ..  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Ramayana stories in South India – An Anthology: Paula Richman

కథ ఎవరిది? రామునిదా? దారి పోయే దానయ్యదా? అని కాదు. అది కథ వింటే, చదివితే తెలిసిపోతుంది. ...
by Purnima
1

 
 

Unforbidden Pleasures – Adam Phillips

వ్యాసకర్త: Nagini Kandala ************* ఆ మధ్య ఇంతియాజ్ అలీ సినిమా ‘తమాషా’ అని ఒకటొచ్చింది. ఎంత త్వర...
by అతిథి
0

 
 

కథ 2016 ఆవిష్కరణ – ఆహ్వానం

కథ 2016 పుస్తకం ఆవిష్కరణ సభకు ఆహ్వానం ఇది. వివరాలు: తేదీ: 12 నవంబర్ 2017, ఆదివారం వేదిక: శ్రీ చ...
by పుస్తకం.నెట్
0

 

 

We Are What We Pretend To Be – Kurt Vonnegut

వ్యాసకర్త: Naagini Kandala ********************** ఒక ప్రక్కన వేరే పుస్తకాలు చదువుతున్నా,’మరి నేను రాసిన కథల...
by అతిథి
0

 
 

Uncommon Type: Some Stories – Tom Hanks

వ్యాసకర్త:Naagini Kandala *************** టామ్ హాంక్స్.. సుమారు పదేళ్ళ క్రిందట ఎప్పుడో చూసిన Cast Away సినిమాత...
by అతిథి
1

 
 

నియంతృత్వపు నగారా “1984”

వ్యాసకర్త: భవాని ఫణి ************* మీ ఇంట్లో ఒక స్క్రీన్ ఉంటుంది. అది మీరేం చేస్తున్నా చూస్తు...
by అతిథి
1