తెలుగు కథ: జనవరి – మార్చ్, 2017
వ్యాసకర్త: రమణమూర్తి
(ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. కొద్ది మార్పులతో పుస్తకం.నెట్ లో ప్రచురించడానికి అనుమతించినందుకు రమణమూర్తి గారికి ధన్యవాదాలు)
*******
అమెరికన్ పత్రికలలో ఏటా దాదాపు 3000 కథలు ప్రచురింపబడతాయట.
వాటితో పోలిస్తే, మన తెలుగుకథ కూడా దాదాపుగా ఆ పరుగుపందెంలో ఉన్నట్టే లెక్క. ఇక్కడ కూడా ఆ సంఖ్య 2000 నుంచి 2500 దాకా ఉంటోంది. ఒక్కటే తేడా: మొత్తం కథలలో మంచికథల వాటా లెక్కేస్తే, అక్కడి లెక్కలకీ ఇక్కడి లెక్కలకీ లంకె దొరకడం కష్టమే. అయినా సరే, మనం మంచికథలకోసం వెతుకుతూనే ఉండాలి!
కథాప్రమాణాల ప్రకారం లేవు అనుకున్న కథలని విమర్శించడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. నేను బాగున్నవనుకున్న కథల్ని నలుగురికీ పరిచయం చేయాలనే ప్రయత్నం ఇది. బాగున్న కథల పట్ల అయినా అలాంటి బాధ్యతని తీసుకోవాలి. ఇలాంటి ప్రయత్నాలు జరగకపోతే, మంచికథలు మరుగున పడిపోయే అవకాశం ఉంది. మంచి అనేది ఎక్కడ ఉన్నా, దానికి అందరూ ప్రచారం కల్పించాలని నేను నమ్ముతాను.
2017 సంవత్సరం మొదటి మూడు నెలల్లో 531 డైరెక్ట్ కథలు – అనువాదాలూ, పునర్ముద్రణలూ, ఫీచర్ కథలూ మినహాయిస్తే – చదివాను. మామూలుగా ఉండే కుటుంబ, సామాజిక సమస్యల మీద కథలే కాకుండా, వర్తమాన సమస్యలైన పెద్దనోట్ల రద్దు, ఆంధ్రప్రదేశ్ భూములు, తలాక్ లాంటి సమస్యలమీద కూడా కథలు వచ్చాయి. కనుమరుగైపోయిన రికార్డింగ్ డాన్సుల గురించి కూడా ఒక కథ రావడం విశేషం. వృద్ధాశ్రమాలమీద కథలు ఇంకా విరివిగా వస్తూనే ఉన్నాయి! తలసేమియా, అల్జీమర్స్ లాంటివి వస్తువులుగా కూడా కథలు వచ్చాయి. విశేషం ఏమిటంటే – హాస్యకథలు కొన్ని నిజంగానే మంచిహాస్యం పండించడం.
ఈ త్రైమాసికంలో ఉన్న ఒక విశేషం ఏమిటంటే – చాలారోజుల తర్వాత ఒక డైరెక్ట్ కథల సంకలనం (కొత్తకథ-2017) రావడం. కథల బాగోగులు పక్కనపెడితే, అలాంటి ప్రయత్నం అంటూ ఒకటి జరగడం మంచివిషయమే! అలానే కొన్ని కొత్త, మరికొన్ని పాతకథల కలయికతో ‘నవ్యాంధ్ర’ అనే ఓ సంచిక తిరుపతినుంచి వచ్చింది. వీళ్లు కూడా పూర్తిగా కొత్తకథలనే వేసుకోవాలి అన్న నియమం పెట్టుకుంటే, మరికొన్ని మంచికథలు రాగల అవకాశం ఉంటుంది.
ఈ మూడునెలల్లో వచ్చిన వాటిల్లో నాకు నచ్చిన కథల గురించి చాలా క్లుప్తమైన పరిచయం చేస్తాను – ఆసక్తి ఉండి చదవాలనుకున్నవాళ్ల ఉత్సుకతని చెడగొట్టకుండా ఉండటం కోసం ఆ క్లుప్తత.
తూరుపు గాలులు [మూడుభాగాల పెద్దకథ] (ఉణుదుర్తి సుధాకర్ – సారంగ, జనవరి 05, 12, 19) మౌలికంగా ఇది బౌద్ధమతవ్యాప్తి గురించిన కథ అయినప్పటికీ, ఆవిర్భావంలో ఉన్న ఏ వ్యవస్థకయినా అనువర్తించే విషయాలు ఇందులో ఉండటం వల్ల, ఈ కథని ఈనాడు చెప్పుకోవడంలో ఔచిత్యం ఉంది. కథ నిడివి పెద్దదే అయినా, మంచి భాష, కథనాలవల్ల కథ నిలబడింది.
ఒక మార్చి 8 కథ (ఓల్గా – భూమిక, జనవరి 01) స్వాతంత్ర్యాన్ని హరిస్తున్న భర్తనుంచి భార్య దాన్ని రీ-క్లెయిమ్ చేసుకోవడం. సాధారణమైన ఫెమినిస్టిక్ అంశమే కానీ, కథ బాగా నిర్వహించబడింది.
పూర్ణమాణిక్యం ప్రేమకథలు (వి చంద్రశేఖరరావు – ఆంధ్రప్రదేశ్, జనవరి 01) పూర్ణ అనే పాత్ర, తన ఆశల/వాస్తవాల మధ్య తనని తాను మళ్లీమళ్లీ కనుక్కుంటూ ఉండటం. కొత్తచూపు కొనితెచ్చుకోవడం. ఈ కథ చదువుతుంటే మోహిత రాసిన ‘తొమ్మిదో నెంబర్ చంద్రుడు’ గుర్తుకొస్తుంది.
అనుత్తర (కుప్పిలి సుదర్శన్ – తెలుగు వెలుగు, జనవరి 01) అంతమంది గోపికలతో అన్ని వ్యవహారాలున్న శ్రీకృష్ణుడు కూడా, ఈతరం అమ్మాయిని ప్రేమించాలంటే ముప్పుతిప్పలు పడి బిక్కమొహం వేయాల్సిందే! గడుసుతనపు కథనానికి ఆహ్లాదకరమైన హాస్యం మరో ఆభరణం.
సావిత్రి (ఆనంద్ గుర్రం – నమస్తే తెలంగాణ ఆదివారం, జనవరి 29) అస్పష్టమైన దు:ఖం – అంతలో చిన్న వాత్సల్యం – ఆఖరికి మరో మజిలీ. అద్భుతమైన తెలంగాణ/ఆంధ్ర భాష, కథనం.
మరణానంతరం (రాణి శివశంకరశర్మ – ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 01) ఉన్మాదస్థితికీ, వాస్తవస్థితికీ మధ్య అస్పష్టంగా ఉండే సరిహద్దురేఖని తాత్వికంగా వర్ణించిన కథ. ఇలాంటి కథకి ముగింపు కష్టమే – కానీ, ఓ అందమైన ఊహ దగ్గర కథని వదిలేశాడు రచయిత.
శ్రీరామా ఎన్క్లేవ్ (పి సత్యవతి – నవ్యాంధ్ర సాహిత్య ప్రత్యేక సంచిక, ఫిబ్రవరి 28) పెద్దనోట్ల రద్దు తర్వాత ఎవరిదగ్గరా డబ్బులు లేని పరిస్థితి; వాచ్మెన్ కూతురు చావుబతుకుల్లో ఉంది; డబ్బివ్వలేని అసహాయత కొంతమందికీ, అయిష్టత కొంతమందికీ. మంచికథనంతో నడిచిన కథ.
ఒక ప్రయాణం (తాడికొండ కె శివకుమారశర్మ – ఈమాట, మార్చ్ 01) ఒక ప్రయాణం ముగిసి, మరో ప్రయాణం మొదలైంది. అతను చనిపోయి మళ్లీ పుట్టాడు. మంచి ఫాంటసీ వస్తువు, కథనం.
శ్రీమతి సర్టిఫికెట్ (పూడూరి రాజిరెడ్డి – కొత్తకథ-2017, మార్చ్ 05) ఈ మూడునెలల కథల్లోనూ నాకు అమితంగా నచ్చిన అందమైన కథ ఇది. అయ్యో పాపం అని సహాయం చేయబోయిన భర్తని, చివుక్కుమనేలా ఓ మాట అంది కదా ఆ భార్య అనిపిస్తుంది మనకి కథ చదవగానే. కానీ, కథకుడు తన కథని ఎన్ని వివరాలతో సహా చెప్పాడో, ఎంత స్పేస్ కేటాయించాడో గమనించి ఆ తర్వాత భార్య చేసిన పనిని క్లుప్తంగా ఎలా వర్ణించాడో చూస్తే – తనని తాను ఓ మెట్టుపైన కూచోబెట్టి చూపించడానికి కథకుడు ఎలాంటి విఫలయత్నం చేస్తాడో అర్థమవుతుంది! కొలతల్లో తేడాతో కథకుడు తన అభిప్రాయాల్ని చెబుతాడు.
కథని కేవలం కథనంలోని తేడాలతోనూ, విజువల్ ‘రూపం’ ద్వారానూ అర్థం చేయించడం ఇందులో చెప్పుకోవాల్సిన విషయాలు. ఇంగ్లీష్ కథలలో ఈ టెక్నిక్ ని వాడుకున్న రెండు కథలు తెలుసుకానీ – రూపాన్నీ, దృష్టికోణాన్నీ ఇంత అందంగా కథనానికి వాడుకున్న మరే తెలుగుకథా నాకు చప్పున గుర్తుకురాలేదు! రాజిరెడ్డికి అభినందనలు!!
**
పైన చెప్పినట్టు, ఈ మూడునెలల్లోనూ కొన్ని మంచి హాస్యకథలు వచ్చాయి. ఫేస్ బుక్ మీద విసుర్లతో తానొకటి తలచిన (బులుసు సుబ్రహ్మణ్యం – ఈమాట, జనవరి 01), తన సొంతపేరులోని ఇబ్బందులతో పూర్ణా నరసింహం (వసుంధర – రచన, జనవరి 01), పెళ్లయ్యాకకూడా పక్కచూపులు చూసే హీరో కథతో ఆప్షన్ (శ్రీధర – రచన, జనవరి 01), పెద్దగా కథ లేకపోయినా చమత్కార సంభాషణలతో రెండురోజుల పెళ్లి (కిరణ్మయి – తెలుగుతల్లి, జనవరి 01), పెళ్లి మధ్యలో మాయమైపోయిన పెళ్లికొడుకు కథతో పెళ్లికొడుకు మాయం (దేవులపల్లి దుర్గాప్రసాద్ – రచన, ఫిబ్రవరి 01), భర్త హక్కులని ఒక్కొక్కటే హరించేసిన భార్య కథతో పాపం ప్రద్యుమ్నుడు (బులుసు సుబ్రహ్మణ్యం – తెలుగుతల్లి, ఫిబ్రవరి 01), పూర్తిగా హాస్యం అని కాదుగానీ ఆహ్లాదకరంగా రాయబడ్డ సుందరి-సీతారామ్ (కె ఎస్ ఎమ్ ఫణీంద్ర – కౌముది, మార్చ్ 01) – వీటిల్లో చెప్పుకోదగ్గవి.
మిగతా కథల్లో ఓసారి చదివి చూడదగ్గ కథలు: పాకశాలలో పాణినీయం (చంద్రమోహన్ – ఈమాట, జనవరి 01), రికాడ్డేన్స్ (చింతకింది శ్రీనివాసరావు – సాక్షి ఆదివారం, జనవరి 22), అడవి దారిన… (పాలగిరి విశ్వప్రసాద్ – రచన, ఫిబ్రవరి 01), పిరమిడ్ (పాపినేని శివశంకర్ – ఆంధ్రజ్యోతి ఆదివారం, ఫిబ్రవరి 05), ఔర్ ఏక్ కహానీ (పి రాజ్యలక్ష్మి – చినుకు, ఫిబ్రవరి 01), పితృకార్యం (పాలపర్తి జ్యోతిష్మతి – ఆంధ్రజ్యోతి ఆదివారం, ఫిబ్రవరి 19), రహస్యం (జి ఉమామహేశ్వర్ – నవ తెలంగాణ ఆదివారం, ఫిబ్రవరి 19), బతుకొక పండుగ (సలీం – ఆంధ్రభూమి ఆదివారం, ఫిబ్రవరి 26), బోను (మల్లాది హనుమంతరావు – కౌముది, మార్చ్ 01), జీవితం… ప్రపంచం…! (అట్టాడ అప్పల్నాయుడు – నవ్యాంధ్ర సాహిత్య ప్రత్యేక సంచిక, ఫిబ్రవరి 28), క్రీ.పూ-క్రీ.శ (కోడూరి విజయకుమార్ – కొత్తకథ-2017, మార్చ్ 05), పెన్సిల్ బాక్స్ (మహమ్మద్ ఖదీర్ బాబు – కొత్తకథ-2017, మార్చ్ 05), యుద్ధం (కొట్టం రామకృష్ణారెడ్డి – నవ తెలంగాణ ఆదివారం, మార్చ్ 19)
అనువాద కథలు
అనువాద కథలు ఎక్కువగా చదవను కానీ, కొన్ని కథలని ఎకడమిక్ కుతూహలం కొద్దీ చదువుతాను. గూగి వా థియాంగో రాసిన The Upright Revolution (చాలా ఎక్కువ భాషల్లోకి అనువదింపబడిన ఆఫ్రికన్ కథ ఇది) అనే కథ ‘ఒప్పందం’ (మౌద్గల్యస – సాహిత్య ప్రస్థానం, ఫిబ్రవరి 01) పేరుతో వచ్చింది. అనువాదం పరవాలేదు. అలాగే, వడ్రంగి పిట్ట (మూలం: మార్క్ ట్వేన్) అనే కథ ఓల్గాగారి చక్కటి అనువాదంతో ‘సాహిత్యప్రస్థానం’ మార్చ్ సంచికలో వచ్చింది.
ఇతరాలు
ఇప్పుడు దాదాపు అరుదైపోయిన సాహిత్య పారడీ అనే ప్రక్రియ అంత సులువు కాదు. అరిపిరాల సత్యప్రసాద్ ఆ విషయంలో ఓ చిన్న ప్రయత్నం చేశారు. ప్రయత్నం చిన్నదే కానీ ప్రశంసనీయంగా ఉంది. ‘మిట్టూరు టు మెట్రో: ఐదు కథల మీదుగా’ (వాకిలి, జనవరి 01) లో ఐదుగురు వర్తమాన రచయితల పంధాలో వచనం రాసి చూపించారు!
ఇంగ్లీష్ కథలు
అమెరికన్ కథలతో మొదలుపెట్టిన ఈ సమీక్ష చివరికి ఇంగ్లీష్ కథల ప్రస్తావనతో ముగిస్తాను. వర్తమాన ప్రపంచ సాహిత్యంతో మన పరిచయం దురదృష్టవశాత్తూ ఇంగ్లీష్ లో వచ్చిన కథలకి మించి ముందుకు సాగదు. అలా చదివిన ఆ ముప్ఫై కథల్లోనే చాలా మంచికథలు దొరకడం విశేషం. క్లుప్తంగా వాటి పరిచయం:
On the Street Where You Live (Yiyun Li – న్యూయార్కర్, జనవరి 9): ఆటిజం సమస్య ఉన్న ఓ పిల్లవాడి గురించిన కథ. ప్రధాన సమస్య మీద కాకుండా, చుట్టూ ఉండే వివిధ అనుభవాల మీదుగా కథ సాగటం ఇందులో విశేషం. కథనంలో ఉపయోగించిన భాషా, భావాలూ అక్కడక్కడా అబ్బురపరుస్తాయి. ఓ ఊహించగలిగిన ముగింపుకే కథ చేరుతుంది – నిజమే – కానీ, అద్భుతంగా రాయబడ్డ కథ.
Chairman Spaceman (Thomas Pierce – న్యూయార్కర్, జనవరి 16): ఉన్న ఆస్తుల్ని అన్నింటినీ వదిలేసి, నిత్య యౌవనంతో ఉండగలిగిన గ్రహానికి ప్రయాణించిన మనిషి, సాంకేతికమైన కారణాల వల్ల తిరిగి వెనక్కి రావలసి వస్తుంది. తన యౌవనంలో ఓ ముప్ఫై ఏళ్ల వయసుని అతను కాపాడుకోగలిగినా, అతను కోల్పోయింది చాలా ఎక్కువ – ఓ ముప్ఫై ఏళ్ల జీవితం, అనుభవం!
Quarantine (Alix Ohlin – న్యూయార్కర్, జనవరి 30): భౌతికమైన ప్రపంచంలో మనుషులు కలుసుకోవడాలూ, విడిపోవడాలూ, మళ్లీ కలుసుకోవడాలూ మామూలుగా జరుగుతూ ఉంటాయి. ప్రతి కలయికలోనూ ఎడబాటు తాలూకు నీలినీడా, ప్రతి ఎడబాటులోనూ మళ్లీ ఎప్పుడో అన్న అస్పష్టత కలిసిపోయి ఉంటాయి. మళ్లీ ఎప్పుడు కలుస్తాం? అసలు కలుస్తామా? ఇది పెయిన్ కలిగించే విషయం. చిన్న చిన్న వివరాలు కథలో కొం..చెం… ఇబ్బంది కలిగించినా, దాన్ని అధిగమించగలిగిన కథన నైపుణ్యం ఉంది ఈ కథలో.
A Window to the World (Isaac Bashevis Singer – హార్పర్స్, జనవరి 01) – సింగర్ ఎప్పుడో రాసిన ఈ కథకి ఇంగ్లీష్ అనువాదంతో మొట్టమొదటిసారిగా ప్రచురించారు. ఇడ్డిష్ రచయితల రచనా నేపథ్యంతో ఈ కథ రాయబడింది. రచయితలమీద అక్కడక్కడా చేసిన వ్యాఖ్యానాలు బాగున్నాయి. ఆ రచయితల్లో ఓ వయసుమళ్లిన రచయిత, ఓ కుర్ర స్పానిష్ రచయిత్రిని పెళ్లి చేసుకోవడం, తదనంతర పరిణామాలూ కథాంశం.
The I.O.U. (F. Scott Fitzgerald – న్యూయార్కర్, మార్చ్ 20): ఫిట్జ్~జెరాల్డ్ దాదాపు వంద సంవత్సరాలక్రితం రాసిన కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ పుస్తకం ప్రచురించే నేపథ్యంతో సరదాగా సాగే కథ!
మరికొన్ని చదవదగ్గ కథలు: A Natural Man (Adam O’Fallon Price – The Paris Review No. 220, Jan 01), Most Die Young (Camille Bordas – The New Yorker, Jan 02), The Prairie Wife (Curtis Sittenfeld – The New Yorker, Feb 13), Dona Nobis Pacem (David Szalay – Harper’s, Mar 01)
Tin House, Spring 2017 సంచిక ఆలస్యంగా అందింది. బాగున్నవనుకున్న కథలేవైనా ఉంటే, తరువాతి వ్యాసంలో వాటిని చేరుస్తాను.
ప్రస్తుతానికి అదీ కథ. మరో క్వార్టర్లీ రివ్యూతో జులై మొదటివారంలో కలుద్దాం!
Desu Chandra Naga Srinivasa Rao
Great Info on Telugu Stories..