పుస్తకం
All about booksపుస్తకాలు

September 23, 2015

క్షేత్రయ్య పదములు

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు
(ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు మార్చి 2014లో ఫేస్బుక్ లో పోస్టు చేసారు. తిరిగి పుస్తకం.నెట్ లో వేయడానికి అనుమతించినందుకు వారికి ధన్యవాదాలు.– పుస్తకం.నెట్)
*******
నేను రాజవొమ్మంగి వెళ్ళినప్పుడు అక్కడ ఇంట్లో నా పాతపుస్తకాల్లో ‘క్షేత్రయ్య పదములు’ (1963) కనబడింది. విస్సా అప్పారావుగారు సంపాదకత్వం చేసిన పుస్తకం. రాజమండ్రిలో సరస్వతి పవర్ ప్రెస్స్ వాళ్ళు అచ్చువేసింది. 1986 లో రాజమండ్రి పుస్తకప్రదర్శనలో పాల్గొన్నందుకూ, కార్యకర్తగా పనిచేసినందుకూ, ఆ కమిటీ వాళ్ళు నాకా పుస్తకం ఇచ్చారని ముందు పేజీలో రాసుకున్నాను.

ఆ పుస్తకం నాకు చాలా విషయాలే గుర్తుచేసింది. 1983 నుంచి 86 దాక రాజమండ్రి పుస్తక ప్రదర్శనల్లో మేమంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళం. ప్రతి ఏటా డిసెంబరులో జరిగే ఆ వేడుకల్లో మేం వక్తలం, కార్యకర్తలం, సంస్కర్తలం కూడా.

అద్దేపల్లి అండ్ కో వారి తరఫున సరస్వతీ పవర్ ప్రెస్ అచ్చువేసిన అపురూప గ్రంథాలెన్నో, రాజమండ్రీ, తక్కిన తెలుగుప్రపంచమూ మర్చిపోయినవాటిని నేనే మళ్ళా నలుగురికీ పునః పరిచయం చేసాను. కేంద్రసాహిత్య అకాడెమీ కోసం ప్రచురించిన గోపినాథ మొహంతి ‘అమృతసంతానం’, కాకాసాహెబ్ కాలేల్కర్ ‘జీవనలీల’, విభూతిభూషణుడి ‘వనవాసి’, పురిపండా అప్పలస్వామి అనువాదం చేసిన ‘విశ్వకథావీథి’ ఆరుసంపుటాలులతో పాటు శ్రీపాదవారి చిన్నకథలు కూడా.

క్షేత్రయ్య పదాలు చదువుతూంటే మళ్ళా మరొక కొత్త లోకమేదో సాక్షాత్కరించినట్టే అనిపించింది. పారశీకకవుల్నీ, ఉర్దూకవుల్నీ, టాగోర్ నీ ఇంగ్లీషులో చదివి పరవశిస్తున్న మనం ఈ తెలుగు మహాకనినెట్లా మర్చిపోయేమా అనిపించింది.

అయితే ఇందుకు కారణమూ లేకపోలేదు. ఉర్దూకవులకి ముషాయిరాలున్నాయి. ప్రసిద్ధ గజల్ గాయకులు ప్రతి రోజూ ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ప్రతి రోజూ మీర్ నీ గాలిబ్ నీ పాడుతూనే ఉంటారు. నస్రత్ ఫతే ఆలీఖాన్ లాంటి మహనీయుడు అమీర్ ఖుస్రోని లారీ డ్రైవర్లకు కూడా సన్నిహితుణ్ణి చేసేసాడు. ఇక టాగోర్ సంగతి చెప్పనక్కర్లేదు. రవీంద్ర సంగీతం సప్తసముద్రాలమీదా పయనించింది.కాని క్షేత్రయ్యని తలుచుకోవడానికి. ఆ పదాలు పునఃపునః స్మరించడానికి దారేదీ?

ఈ ప్రశ్న నేను కాదు, ఈ పుస్తకానికి సుమారు అరవయ్యేళ్ళకిందట ముందుమాటరాసిన జమ్ములమడక మాధవరాయశర్మగారు కూడా వేసుకున్నాడు. ఆయనేమన్నాడంటే క్షేత్రయ్య పదం కేవలం సాహిత్యం కాదు, కేవలం సంగీతం కాదు, కేవలం నృత్యం కాదు. కేవలం అలంకరణ కాదు. అన్నిటి సామరస్యంతో విలసిల్లే సాహిత్యం. ఇప్పుడు సంగీతం, సాహిత్యం, నృత్యం, రంగాలంకరణ వేరువేరుగా విడిపోయినకాలంలో క్షేత్రయ్య పదానికి పూర్తి న్యాయం చేయగలిగినవారేవ్వరు?

సాహిత్యకృతిగా తీసుకున్నా కూడా క్షేత్రయ్యని అర్థం చేసుకోవడానికీ,ఆస్వాదించడానికీ రసజ్ఞహృదయాలకు తగిన శిక్షణ ఇవ్వగలిగినవారెవ్వరు? తమిళసంగం కవుల్ని ఎలా అర్థం చేసుకోవాలో తొల్కాప్పియం చెప్తుంది. ఆధునిక కవిత్వాన్నెలా అర్థం చేసుకోవాలో న్యూక్రిటిక్స్ వివరిస్తారు. కాని ఒక అమరావతి శిల్పాన్ని, ఒక క్షేత్రయ్య పదాన్ని ఆస్వాదించడమెలానో ఎవరు చెప్తారు?

అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పదమే చూడండి. ఈ పదం తెలుగు కవిత్వంలోని అత్యంత సుందరమైన కృతుల్లో అగ్రశ్రేణికి చెందిందని తెలుగురసజ్ఞ లోకం గుర్తుపట్టగలిగిందిగాని,ఆ సౌందర్య రహస్యమెక్కడుందో ఇప్పటికీ తెలుసుకోలేకపోయింది.

మగువ తన కేళికామందిరము వెడలెన్
వగకాడ మా కంచివరద తెల్లవారెననుచు /మగువ/

విడజారు గొజ్జంగి -విరిదండ జడతోను
కడుచిక్కుబడి పెనగు-కంటసరితోను
నిడుదకన్నులడెరు-నిదురమబ్బుతోను
తొడరి పదయుగము-దడబడెడు నడతోను /మగువ/

సొగసిసొగయని వలపు-సొలపుజూపులతోను
వగవగల ఘనసార-వాసనలతోను
జిగిమించి కెమ్మోవి-చిగురుకెంపులతోను
సగముకుచముల విదియ-చందురులతోను /మగువ/

తరితీపు సేయు సమ-సురతి బడలికతోను
జరుత పావడ చెరగు-జార్పైటతోను
ఇరుగడలకైదండ-లిచ్చు తరుణులతోను
పరమాత్మ మువ్వగో-పాల తెల్లవారెననుచు /మగువ/

అత్యంత రమణీయమైన నీటిరంగుల చిత్రంలాంటి ఈ పదం మీద రసలోకం ఎప్పటికీ ఎడతెగని చర్చ జరుపుతూ ఉండొద్దా? ఈ పదం తమని ఎందుకు సమ్మోహపరుస్తోందో ఎంతచెప్పుకున్నా తనివి తీరడంలేదని భావుకులు నిస్పృహకి లోనుకావలసిన అవసరంలేదా? తెలుగుపదాల్ని కొన్నింటిని ఇంగ్లీషులోకి When God is a Customer అని ఎ.కె.రామానుజన్, వెల్చేరు నారాయణరావు అనువదించినప్పుడు అందులో క్షేత్రయ్య పదాలు కూడా కొన్నింటిని అనువదించినప్పుడు, ఈ పదాన్ని ఎందుకు వదిలిపెట్టేసారో వాళ్ళని అడగక్కర్లేదా?

అన్నమయ్య పాడిన పదం ‘పలుకుతేనెలతల్లి పవళించెను’ ఈ పదానికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చునని విస్సా అప్పారావుగారు చక్కగానే నిదానించేరు. కాని ఆ పదంలో అన్నమయ్య ‘కలికితనమున విభుని కలసి’, ‘పరవశంబున పవళించిన తల్లి’ని స్తుతిస్తే, ఇందులో క్షేత్రయ్య ‘కేళికామందిరం వెడలుతున్న మగువ’ నెందుకు చిత్రించాడు? అక్కడ తల్లి, ఇక్కడ మగువగా ఎందుకు మారిపోయింది? విజయనగర సామ్రాజ్యం ఉచ్చస్థితిలోకి చేరుకోక ముందు వచ్చిన ఆ పదంలోనూ, విజయనగర సామ్రాజ్యం ధ్వంసమై, రాజకీయంగా దేశం బలహీనపడ్డకాలంలో వచ్చిన ఈ పదంలోనూ కూడా పదలాలిత్యం, భావనా సౌకుమార్యం, సురతస్మరణ ఎందుకు ప్రధానమయ్యాయి?

ఇట్లాంటివే ఎన్నో ప్రశ్నలు ఈ రోజంతా మీకూ, నాకూ.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.2 Comments


 1. సుమన వేదాలు(కోడూరు)

  నేను కూచిపూడి నర్తకిని నాపేరు
  సుమనవేదాల. క్షేత్రయ్యపదాలలో
  శ్రీపతిసుతుబారికి. అనే పదానికి
  నర్తిస్తుంటాను మిగతావి సాహిత్యం
  కొన్నేదొరికాయి సంగీతంచేసినవిఎక్కడదొరుకుతాయి
  దయచేసి వివరాలుతెల్పండీ


 2. […] అతిథి వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ […]  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Tagore: The World Voyager

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు జనవరి 2014లో ఫ...
by అతిథి
0

 
 

Reduced to Joy – Mark Nepo

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2014లో ఫేస్బు...
by అతిథి
0

 
 

సాదత్ హసన్ మంటో కథలు

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2013లో ఫేస్బు...
by అతిథి
1

 

 

Poems in Translation: Sappho to Valéry

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2013లో ఫేస్బు...
by అతిథి
2

 
 

Confucius from the Heart

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2013లో ఫేస్బు...
by అతిథి
1

 
 

The Art Of Living – Sharon Lebell

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2013లో ఫేస్బు...
by అతిథి
0