పుస్తకం
All about booksపుస్తకాలు

July 22, 2015

విస్మృత కథకుడి యాదిలో

More articles by »
Written by: అతిథి
Tags: , ,

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్

(సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకత్వంలో వెలువడుతోన్న జి.సురమౌళి కథల సంపుటికి ముందు మాట)
***********

‘ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జి సురమౌళి’ – మబ్బు వురిమినట్టుండే ఆ గొంతు రేడియోలో వినడమే గానీ దాని సొంతదారుని చాలామందిలాగానే చానాళ్లు నేనూ చూడలేదు. ఆ గొంతుని చూడాలంటే ఎర్రమంజిల్ కాలనీ సర్కారీ క్వార్టర్స్ కి పొమ్మని యెవరో చెప్పారు. తెలంగాణా మాండలిక కథ నా పరిశోధనాంశం కాకుంటే నాకా అవసరం కలిగేది కాదు; ఆయన్ని కలిసేవాణ్ణే కాదేమో!

89- 90 ల్లో తెలంగాణా భాషా శిల్పి, కరీంనగర్ మాండలికంలో కథలు రాసిన సురమౌళిని కలవడం మరవలేని సంఘటన. గొంతుకి తగ్గట్టే నిండైన రూపం. నల్లటి దృఢకాయం. అరుదుగా నవ్వినపుడు కన్పించే తెల్లటి పలువరస. తీక్ష్ణమైన చూపులు. తెల్లటి జుబ్బా ధోవతీ. ముక్తసరి మాటలు. ఇంటర్వ్యూ అడిగితే ‘సారీ’ అన్నారు. నేనొదల్లేదు. వెంటపడ్డా. మరోసారి మాండలిక రచనల మీద వొక ప్రశ్నావళి (questionnaire) రాసుకొనెళ్ళా. పత్రికలకు కాదు; పరిశోధన కోసం అనడిగా. కెరీర్ కోసం పట్టాలు సంపాదించే చదువులపట్ల కూడా ఆయనకి సదుద్దేశం లేదు. కానీ నా మొఖం చూసి జాలిపడి ‘ఇహ తప్పదు’ అనుకొన్నారో యేమో నేనిచ్చిన కాయితాలు పక్కన పడేసి ‘కూర్చో – అడుగు యేమడుగుతావో’ అన్నారు.

ఇంటర్వ్యూ లేదు – ప్రశ్నావళి లేదు. తన సాహిత్య ప్రస్థానం గురించి, జర్నలిస్టు జీవితం గురించి, తెలంగాణా భాషలో కథా రచన గురించి, వస్తు శిల్పాల గురించి, సాహిత్య ప్రయోజనం గురించి, రామమనోహర్ లోహియా భావజాలం గురించి, సోషలిస్టు – మార్క్సిస్టు రాజకీయాలగురించి, 56నాటి విలీన భయాందోళనల గురించి, 69నాటి ప్రత్యేక రాష్ట్రోద్యమం గురించి, వుత్తర తెలంగాణాలో పురివిప్పుకొన్న వుద్యమాల గురించి వొడవని ముచ్చట్లెన్నో చెప్పారు. తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాకా సంగిశెట్టి యిప్పుడు వెలుగులోకి తెస్తున్న సురమౌళి కథల గురించి అప్పటి యాదినుంచి యీ నాలుగు మాటలూ …
*** *** ***

1953, ఆలంపూర్ లో ఆంధ్ర సారస్వత పరిషత్ మహాసభలు. హైదరాబాద్ రాష్ట్రం యిండియన్ యూనియన్ లో కలిసి అయిదు సంవత్సరాలవుతుంది. మద్రాసు నుంచి తెలుగు వాళ్లకి యింకా ప్రత్యేక రాష్ట్రం యేర్పడలేదు. అటు ఆంధ్ర ప్రాంతం నుంచీ యిటు తెలంగాణా ప్రాంతం నుంచీ పేరుమోసిన కవులూ రచయితలూ వొక వుత్సవ సంరంభంతో సభలకి వచ్చారు. ఒకటే జాతర. కాళోజీ నా గొడవ ఆ సభల్లోనే ఆవిష్కారమైంది. నా గొడవ కవితలు విని ‘తెలంగాణా లూయీ ఆరగాన్’ అని కాళోజీని శ్రీశ్రీ గుండెకు హత్తుకొన్న సందర్భం అది. వేములవాడ పక్కనున్న పల్లె నుంచి కాలేజి చదువుల కోసం నగరానికొచ్చి వుదరపోషణార్థం సారస్వత పరిషత్ లో క్లర్క్ గా పనిచేస్తున్న సురమౌళి ఆ సభలకి కార్యకర్తగా వెళ్ళాడు. సాహిత్యమ్మీద అప్పటికే మంచి అభిరుచి వుంది. మహోత్సాహంతో సభా ప్రాంగణమంతా కలె తిరుగుతున్నాడు. మీసాలు యింకా పూర్తిగా నల్లబడ్డాయో లేదో – నిండా యిరవై యేళ్ళు కూడా లేవు. సుప్రసిద్ధులైన సాహిత్యకారుల్ని వినడం వాళ్ళతో పరిచయాలు చేసుకోవడం గొప్ప భాగ్యంగా భావించాడు. కథకుల కోసం ప్రత్యేకంగా వొక సభ యేర్పాటు చేయమని కొందరు రచయితలు అడిగితే పరిషత్తు అధ్యక్షుడు వొప్పుకోలేదు. అప్పుడు కథా రచయితలే స్వయంగా వొక సమావేశం యేర్పాటు చేసుకొన్నారు.

‘ఆ సమావేశంలో విశ్వనాథ సత్యనారాయణ , మా గోఖలే , పాలగుమ్మి పద్మరాజు వంటి మహామహులంతా పాల్గొన్నారు. నా కథ ‘ఒట్టు’ అనుకొంటా చదివాను (ఈ కథ అడ్లూరి అయోధ్య రామ కవి నడిపిన పత్రికలో వచ్చినట్టు గుర్తు). దానిలో సంభాషణలు పాత్రోచితంగా తెలంగాణా భాషలో పలికించాను. విశ్వనాథ విని చాలా మెచ్చుకొన్నాడు – ముఖ్యంగా కథలో వాడిన భాషని. కథ మొత్తం, కథనంతో సహా, మాండలికంలో నిర్వహిస్తే బాగుండేది గదా అని విశ్వనాథ సలహా యిచ్చాడు. ఆ సలహా నా మీద బాగా పని చేసింది. అప్పటినుంచీ తెలంగాణా భాషలో చాలా కథలు రాశా. ఆంధ్రభూమి నుంచి బయటకు వచ్చేవరకూ రక్తపూజ (సాధనలో వచ్చింది), మంకు, ఇప్పసారా, మోసపోయిన మల్లమ్మ, అంగుడు పొద్దు (ఆళ్వారుస్వామి వేసిన పరిసరాలులో వుంది) మొదలైన కథలు మొత్తం మా వూరి భాషలోనే రాశా. అన్ని ప్రాంతాలవారూ బాగానే రిసీవ్ చేసుకొన్నారు. తెలంగాణా భాషా యాసల్ని చక్కగా ప్రజెంట్ చేసారనేవారు. అయితే మాండలికంలో రాయడానికి నామీద యెవరి ప్రభావం లేదు. గుంటూరి మాండలికంలో మా గోఖలే రాసిన కథలు ఆ తర్వాతే చూశా. అవి నాకు బాగా నచ్చాయి. ఆన్ని ప్రాంతాలనుంచీ అటువంటి కథలు రావాలని అనిపించినప్పటికీ నేనే కొంత కాలం తర్వాత మాండలికంలో రాయడం మానేశా. జర్నలిజంలోకి వెళ్ళాకా సృజనాత్మక రచనకి చాలా వరకు దూరమయ్యా. రాజకీయాల్లో మునిగాకా అసలు కథలు రాయడమే పోయింది.’

రాసింది కొద్ది కథలే అయినప్పటికీ కథా రచన విషయికంగా గానీ అందులోని వస్తువు గురించి గానీ శైలి గురించిగానీ వాడాల్సిన భాష గురించి గానీ సురమౌళికి నిర్దిష్టమైన ప్రత్యేకమైన అభిప్రాయాలున్నాయి. వాటిని ‘నేను – నా కథలు’ వ్యాసంలో స్పష్టంగా పేర్కొన్నాడు. కథలో ఏం చెప్పాలన్నదానిమీద కన్నా ఎలా చెప్పాలన్నదాని మీదే ఎక్కువ దృష్టి పెట్టాలన్నది ఆయన అభిమతం. అలాగని వస్తువు అప్రధానమనీ కాదు. వస్తువు తప్పనిసరిగా జీవితంలోంచీ తీసుకొన్నదై వుండాలి. పాత్రలు మామూలు సమాజంలో బతుకుతున్న సజీవులు కావాలి. వారి ప్రవర్తన సర్వ సామాన్యంగా హేతుయుతంగా వుండాలి. తుదకు మనం సాధించగలమన్న జీవిత తత్త్వాన్ని ప్రతిపాదించాలి. ఇదీ రచయితగా ఆయన ఆశయం. సాహిత్యం / కథారచన ఆయన లక్ష్యం కాదు. లక్ష్యానికి సాధనం మాత్రమే. లక్ష్యం మానవ జీవితం. భావం ప్రధానం. భావానికీ చెప్పాల్సిన విషయానికీ అనువుగా కథ రూపు దిద్దుకుంటుంది అని ఆయన నమ్ముతాడు. దాన్ని యే భాషలో చెప్పాలన్నది కూడా స్వీకరించిన వస్తువుని బట్టీ భావానుగుణంగానే నిర్ధారితమౌతుందనీ తాను విశ్వసిస్తున్న జీవిత సత్యాల్ని వ్యక్తీకరించడానికి అనుకూలమైన భాషనే వాడుకోవాలనీ గుర్తించాడు. అందువల్ల భాష కూడా వొక సాధనమనే ఆయన అభిప్రాయం.

‘తెలంగాణా భాషకి ఒరిజినాలిటీ వుంది. ఎక్కడైనా వెనకబడ్డ ప్రాంతాల్లో భాష మౌలికతని కోల్పోదు. కరీంనగర్ చుట్టూ తెలంగాణా ప్రాంతాలే వుండడం వల్ల మిగతా భాషల ప్రభావం అక్కడి భాషమీద తక్కువ. అక్కడినుంచి మంచి మాండలిక రచనలు వస్తున్నాయి. అయితే కొందరు శిష్ట భాషలో ఆలోచించి మాండలికంలోకి తర్జుమా చేస్తున్నారు. అది తప్పు. ప్రజల మధ్య జీవిస్తేనే సరైన భాషని – జీవద్భాషని – రాయగలం. అప్పుడే రచన సహజంగా వుంటుంది ; పాఠకుల గుండెను ఆత్మీయంగా తాకి కదిలించగలుగుతుంది. కథని మాండలికంలో చదువుకొన్నప్పుడు అందులోని సారం పాఠకుడిలో ఇంకుతుంది. లోతుగా ఆలోచింపజేస్తుంది. విన్నప్పుడు ఉత్తేజపరుస్తుంది. చైతన్య వంతుల్ని చేస్తుంది. ప్రజోద్యమాలకు ఆవేశోత్తేజాలు అవసరమే కానీ యే విషయాల్లో ఆవేశపరచాలి – చైతన్య పరచాలి అన్నది నాయకులూ బుద్ధిజీవులూ ఆలోచించాలి. అది రాజకీయాలకు సంబంధించిన విషయం. రేడియోలో ‘మా వూరు’ కార్యక్రమానికి తెలంగాణా భాషలో స్క్రిప్ట్ రాసిచ్చేవాణ్ణి. ఆ కార్యక్రమానికి శ్రోతల నుంచి మంచిస్పందన వచ్చేది. కానీ ప్రజల్లో వుండి రాయాల్సిన కథల్ని టేబిల్ ముందు కూర్చొని రాయడం ఇష్టం లేక మాండలికంలో రాయడం మానేశానేమో! భాష వొక సాధనమేగానీ భాషే సర్వస్వం కాదు.’

నిజానికి మాగోఖలే గుంటూరు గ్రామీణ మాండలికంలో కథలు రాయడానికి ముందే తెలంగాణా నేలమీదే తొలి మాండలిక కథా రచనకు బీజాలు పడ్డాయి. 40ల నాటికే ఎం బి సీతారామారావు (గరీబోణ్ణి), బోయినపల్లి రంగారావు (ఆడివాప), చరకుపల్లి రఘోత్తమరావు (కోవిల్లో), చరకుపల్లి హరికృష్ణారావు(పల్లెబడి) వంటివారు తెలంగాణా భాషలో రాసిన కథలు ప్రాంతేతరుల మెప్పుని సైతం పొందాయి. అన్ని ప్రాంతాల నుంచీ యిటువంటి రచనలు రావాలని నవ్య సాహిత్య పరిషత్ పత్రిక ‘ప్రతిభ’ అభిప్రాయపడింది. సాహిత్యం ప్రజల వద్దకి చేరాలంటే ప్రజల జీవితాన్ని ప్రజల భాషలో రాయాల్సిన అనివార్యమైన అవసరాన్ని బూర్గుల రంగనాథరావు వొక కథలో (ఎందుకు?) నిర్థారించాడు.

మాండలికంలో రాయడం వొక వుద్యమంగా బలపడాలని సురమౌళి భావించలేదు గానీ గూడూరి సీతారాం, ఇరివెంటి కృష్ణమూర్తి వంటి రచయితలకి అచ్చంగా తెలంగాణా భాషలో కథలు రాయడానికి స్ఫూర్తినిచ్చాడు. వస్తువు స్థానీయమైనప్పుడు దానికి అనుగుణంగా స్థానీయ భాషని వాడడంద్వారా నేటివిటీని సాధించవచ్చు అన్న ఆలోచనతో రాసిన సురమౌళి కథలు వారికి ఆదర్శంగా నిలిచాయి. ఒక విధంగా సురమౌళి కథా రచనలో భాషా శైలీ శిల్పాలకి సంబంధించిన అనేక విషయాల్లో తర్వాతి తరానికే కాదు సమకాలికులకి సైతం మార్గదర్శనం చేసాడు.

మాండలికంలో విస్తృతంగా రచనలు చేయడం ద్వారా స్థానీయ భాషాసంపదని కాలగర్భంలో కలిసిపోకుండా వొక పూనికతో కాపాడుకోవచ్చు అన్న యశోదారెడ్డి అభిప్రాయంతో సురమౌళికి యేకీభావం లేనప్పటికీ అసంఖ్యాకమైన సామెతల్నీ పదబంధాల్నీ జాతీయాల్నీ అర్థవివరణల్తో సహా కథల్లో చొప్పించి తెలంగాణా గ్రామీణ సంస్కృతికి అద్దంపడ్తూ ఆమె చెప్పిన ‘మా ఊరి ముచ్చట్ల’ని ఆయన మెచ్చుకొన్నాడు. తెలంగాణా భాషలోని సౌందర్యాన్ని కొండ నెత్తం మీద నిలబెట్టడంలో , తెలంగాణా పల్లెల్లో యింకా జనం వాడుకలో వున్న ప్రాచీన పదజాలాన్ని నమోదు చేయడంలో యశోదారెడ్డి సఫలమయ్యారని అంగీకరించాడు. అన్ని ప్రాంతాలవారికీ యితర ప్రాంతాల భాషలు పరిచయమై తెలుగు భాష పరిపుష్టం కావాలంటే మాండలికంలో విరివిగా రచనలు రావాలనీ పత్రికలు అందుకు ప్రోత్సాహమివ్వాలని సురమౌళి బలంగా చెప్పారు. అయితే చాలావరకు పత్రికలూ ప్రచురణ సంస్థలూ మాస్ మీడియా అంతా కోస్తా ప్రాంతంలో కేంద్రీకృతం కావడం మూలాన సారస్వతం అంతా ఆ భాషలోనే వుండడం జరిగింది – యితర ప్రాంతాల భాషలో సాహిత్యం తక్కువగా వచ్చింది – దానివల్ల చాలా నష్టం సంభవించిందని ఆయన ఆవేదన చెందాడు. మలిదశ తెలంగాణా రాష్ట్రోద్యమంలో భాషా సాంస్కృతిక చైతన్యంతో వచ్చిన సాహిత్యం చాలా మేరకు ఆ నష్టాన్ని పూడ్చింది. దానికి నాందీ పలికింది సురమౌళి కాకపోవచ్చుగానీ ప్రస్తావన చేసింది మాత్రం ఆయనే. యువరచయితగా సురమౌళి రాసిన తొలి కథలే అందుకు వుదాహరణ.
*** *** ***

suramouli photo-fineహైస్కూల్లో పదో తరగతి చదువుతోన్న రోజులనుంచే కథలు రాసేవాణ్ణని సురమౌళి పేర్కొన్నప్పటికీ దొరుకుతున్న వాటిలో ‘రక్తపూజ’ కథే మొదటిది. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట కాలంలో ప్రజల పక్షంలో న్యాయం కోసం నిలబడినందుకు సొంత అన్న దుర్మార్గానికే బలైన బండోల్ల తిరుమలయ్య కథని జానపద గాయకులు పాటగా కట్టి పాడేవారు.
కారీన రక్తమంత కడవల్ల నింపినారు
చిల్లీన రక్తమంతా సీసల్ల నింపినారు ….

అన్ని ప్రాంతాల్లోనూ ప్రాచుర్యం పొందిన యీ జానపద గీతం యాదగిరి ‘బండెనక బండి కట్టి’ పాటకీ, శివసాగర్ ‘నరుడో భాస్కరుడా’ పాటకీ స్ఫూర్తినిచ్చింది. ఆ పాటతో మొదలుపెట్టి ఆ పాటతోనే ముగిస్తూ తాను విన్నదాన్నే సంక్షేపించి మొత్తం జానపద మౌఖిక ధోరణిలోనే రచయిత యీ కథని చెప్పాడు. అందువల్ల ఆ నాడు దాన్ని ప్రచురించిన నినాదం పత్రిక జానపద కథగా పేర్కోంది. రచయితగా సురమౌళి సామాజిక దృక్పథం తొలినాటి కథలోనే స్పష్టమైంది.

మంకు, తొలి చూపు వంటి కథలు రచయిత స్వీయ జీవితానుభవం నుంచి పుట్టినవే. రచయిత బాల్యమే ఆ కథల్లో గోచరమౌతుంది. అయితే నేరమూ శిక్ష ఆకలి ఆత్మాభిమానం వంటి వైరుధ్యాల్ని కుటుంబ నేపథ్యం నుంచి చిత్రించడంలో, బాల్య స్మృతుల్ని మనుషులమధ్య వెల్లివిరియాల్సిన ప్రేమానుబంధాల్ని వ్యక్తం చేయడానికి అనువుగా మలచడంలో రచయిత పరిణతి తెలుస్తుంది. కొత్తగా చదువు నేర్చిన సామాజిక వర్గాల్లోంచీ యెదిగిన తరం నాగరికతని నేర్చుకొని తమ మూలాలు మర్చిపోయి వంచకులయ్యే వైనాన్ని యెంతో నేర్పుతో వర్ణించిన ‘మోసపోయిన మల్లమ్మ’ కథ కూడా రచయిత స్వయంగా చూసిన జీవితమే.

‘అంగుడు పొద్దు’ ఆలంపూర్ లో చూసిన సభావిశేషాల వర్ణనే అయినప్పటికీ ఆ సభకి అవసరమైన కూలి పన్లు చేసే మల్లయ్య దృష్టికోణం నుంచి కథ నడవడంతో విలక్షణంగా రూపొందింది. ‘పుత్తకాలల్ల దరిద్రుల కతలుండాల్నట. ఎవడు జదువుతాడు పటేలా? మరి మాకేమొ సదువే రాకపోయె. సదవొచ్చినోల్లేమొ దరిద్రులు గాకపోయిరి.’ మల్లయ్య అమాయకంగా వేసిన ప్రశ్న యెంతో మౌలికమైనది. కేవలం వుపన్యాసాల వరకూ కాగితాల వరకూ పరిమితమైన సాహిత్యకారుల, విద్యావంతుల చిలక పలుకుల్ని భేషజాలనీ యీ కథ యెద్దేవ చేస్తుంది. ఆచరణాత్మకం కాని చదువుల్నీ సిద్ధాంతాలనీ యెండగడుతుంది.

ఆ తర్వాతికాలంలో రాసిన ‘రచయిత’ కథ రచనల్లో ప్రతిపాదించే విలువల్ని నిజ జీవితంలో ఆచరించని రచయితల కుహనా ఆదర్శాలని బలంగా విమర్శిస్తుంది. స్త్రీల సమస్యల గురించి విప్లవాత్మకమైన కథలు రాసిన వొక పత్రికా సంపాదకుడు సమస్య తన కాళ్ళ దగ్గరకి వచ్చినప్పుడు చల్లగా జారుకొంటాడు. దానికి విరుద్ధంగా నమ్మిన ఆదర్శాన్ని ఆచరించడానికి తనకిష్టమైన రచనా ప్రవృత్తినే వదులుకొన్నాడు వర్ధమాన రచయిత. సమాజం చేతిలో వంచితురాలైన అభాగ్యురాల్ని జీవితంలోకి ఆహ్వానించిన వర్ధమాన రచయిత ఆచరణవాది అయిన సురమౌళేనేమో! సాహిత్య సృజనలో కంటే సామాజిక నిర్మాణంలో భాగం వహించడం ప్రధానమని వుద్బోధించే యీ కథ సురమౌళి సృజనాత్మక సాహిత్య వ్యాసంగానికి దూరమవడానికి ముందు రాశాడేమో! కథనం లోపల కథ (అంతఃకథ/ గర్భకథ) అదీ వుత్తరం పద్ధతిలో సాగిన ‘రచయిత’ కథా శిల్పం విలక్షణమైంది. కథా వస్తు శిల్పాల నిర్మితిలో శిఖరానికి చేరుకొన్న దశలో సురమౌళి కథారచనకి స్వస్తి చెప్పడం విషాదం. కథా సాహిత్య ప్రయోజనం గురించి యీ కథలో రచయిత విపులంగా ప్రస్తావించాడు.

‘కథానికా సాహిత్యం ఉంది చూశారూ? ఇదే ముఖ్యంగా మనుషుల్లో మార్పు తెచ్చే సాహిత్యం. ఒక సమస్య మీద దానికి తగిన సంఘటనలూ, వాతావరణమూ సృష్టించి దాని మంచి చెడ్డల్ని నిర్ణయిస్తుంది. తార్కికంగా మంచిని మంచీ, చెడును చెడూ అని ఏరి చూపిస్తూ చెడు మీద ఏహ్యభావం, మంచి మీద ఆసక్తీ కలిగించే శక్తి కథానికకున్నంత మరే ఇతర సాహిత్య విభాగానికీ లేదంటే అతిశయోక్తి కాదు. కొంచెం అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళను ముఖ్యంగా మధ్యతరగతిని విప్లవోన్ముఖులను చేసింది కథానికా నవలా సాహిత్యమే…..

‘నిజమైన కథల్ని ఎప్పుడూ రాయకూడదు. మనముంటున్న ప్రపంచాన్ని గాదు రచయిత చిత్రించాల్సింది. ఉండదల్చుకొన్న ప్రపంచాన్ని చిత్రించాలి…..
‘ఇవాళ ఆంధ్రప్రదేశంలో అన్ని పత్రికలనూ ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి ముఖ్యాంగమైన కథానిక పోషిస్తున్నది. ఆంధ్రదేశానికి ప్రపంచ విఖ్యాతి తెచ్చింది కథానిక.’

ఆదర్శాలని రాతల్లో తప్ప చేతల్లో చూపని రచయిత నోట పలికించడం వల్ల పాత్రౌచితి దెబ్బతిందిగానీ సాహిత్య ప్రయోజనం గురించి అందునా కథానిక ప్రయోజనం గురించి సురమౌళి ఆలోచనల్లోని తీవ్రతకీ స్పష్టతకీ చక్కటి దృష్టాంతంగా యీ మాటలు కనిపిస్తాయి. కొత్తగా కలం పట్టే కథకులకి మార్గదర్శకంగా నిలుస్తాయి.

‘జీవుని వేదన’ను సాహిత్యం వ్యక్తీకరించాలి అన్న విశ్వనాథ సత్యనారాయణ అభిప్రాయంతో సురమౌళికి యేకీభావం వుంది గానీ జీవుని వేదన విషయంలో ఆయన భావజాలం వేరు. విశ్వనాథ సనాతన సంప్రదాయవాది – ఆస్తికుడు. సురమౌళి ఆధునిక ప్రగతిగామి – నాస్తికుడు. ‘మానవుడు జన్మత: స్వేచ్ఛాప్రియుడు. ఆ స్వేచ్ఛను పొందటానికి అతడు చేసే ప్రయత్నం, దానికోసం పడే వేదన, ఆ వేదనలో నుంచి అతడు పొందే జ్ఞానం (లేక వేదం) – ఇదీ జీవుని వేదన’ అని సురమౌళి అభిప్రాయం. సురమౌళికి వున్న ప్రాగ్మటిక్ దృష్టే ఆయన రచనల్లో ప్రతిఫలిస్తుంది. యెటువంటి ప్రీచింగ్ (వుపదేశం అని ప్రాచీనాలంకారికులు) లేని సాహిత్యం నిస్సారమని అతని అభిమతం (నేను – నా కథలు). సజీవమైన జీవన తాత్త్వికతని ప్రతిపాదించడం ద్వారా సాహిత్యం శాశ్వతం కాగలదని నమ్మి అటువంటి సాహిత్యాన్నే సృజించాలని తొలినాళ్ళ నుంచి కంకణం కట్టుకొన్న నిబద్ధ రచయిత సురమౌళి.

ఆ నిబద్ధత కారణంగానే వ్యక్తులు పాటించవలసిన నైతిక విలువల గురించి తన కథల్లో విస్తృతంగా చర్చించాడు. ‘తమసో మా జ్యోతిర్గమయ’ కథ వృత్తిపరంగా నర్సుల జీవితంలో కన్పించే వుదాత్త మానవీయ కోణాన్ని ఆవిష్కరించచడానికి వుద్దేశించినది. చెప్పుడు మాటలు విని నర్సును కామైకదృష్టితో చూసిన ప్రోటొగానిస్ట్ ఆమెలోని వృత్తి తత్పరతకీ విధి నిర్వహణలో ఆమె దీక్షకీ సేవాదృక్పథానికీ ముగ్ధుడై తన తప్పుని తెలుసుకొని సంఘర్షణకి గురౌతాడు. తనలో రేగిన పశువాంఛకి సిగ్గుపడతాడు. మానవ జాతిలో స్త్రీ ఔన్నత్యాన్నీ నర్సువృత్తిలోని ఔన్నత్యాన్నీగుర్తిస్తాడు. రచయితే యీ కథలో ప్రథాన పాత్ర. ఆత్మాశ్రయ పద్ధతిలో సాగిన కథలో ‘నేను’ పేరు మౌళి. అందువల్ల యీ కథ కూడా రచయిత స్వీయ జీవితానుభవ పరిధిలోంచే వచ్చిందని భావించాలి. అయితే కథలో ప్రతిపాదించిన జీవన తాత్త్వికత, రచయితే పేర్కొన్నట్టు, సజీవమైందీ మనిషిని సంస్కారం వైపు నడిపించేదీ కావడంతో వస్తు స్వీకరణ రీత్యా సురమౌళి కథల్లో ప్రత్యేకంగా నిల్చి వుంటుంది.

ఏదైనా ఒక వస్తువు కథా రూపమెత్తాలా వ్యాసంగా మారాలా అన్నది ముందుగా ప్లాన్ చేసుకోగూదదనీ, అలా వొక పూనికతో ప్లాన్ చేసుకొంటే అది Craft అవుతుందనీ సృజనాత్మకత దెబ్బ తింటుందనీ, Art తన రూపాన్నీ భాషనీ అప్రయత్నంగా యెన్నుకోవాలనీ అభిప్రాయపడే సురమౌళి తన రాజకీయాభిప్రాయాల్ని నమోదు చేయడానికి కథా మాధ్యమాన్ని యెంచుకోవడం ఆశ్చర్యమే. చటుక్కున గుర్తించకుండా కథలో రాజకీయాల్ని చొప్పించడం తెలివైన కళ. దీన్ని కొ.కు. లాగానే సురమౌళి కూడా చిన్న వయస్సులోనే సాధించాడు (చూ.వలయం). వ్యాసంలో మాత్రమే యిమిడే శుష్కమైన కేవల రాజకీయాంశాల్నికథగా మలవడం – మల్చి మెప్పించడం చాలా కష్టమైన విద్య. ఈ సంపుటిలో పోస్టు చెయ్యని వుత్తరం రూపంలో వున్నకథ (స్వాతి చినుకులు) నిజంగా రచయితతో రాజకీయంగా విభేదించిన మిత్రుడికి రాసి పోస్టు చేయని వుత్తరమేనేమో! దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోగం మొదలైన ప్రారంభ దినాల్లో దాని స్వరూప స్వభావ ప్రయోజనాల గురించి కలిగే సందేహాలూ, కార్మిక – యాజమాన్యాల మధ్య తల యెత్తే సమస్యలకి వర్గ సంఘర్షణ కంటే సామరస్యమే మెరుగైన పరిష్కారమిస్తుందన్న ఆలోచనలూ యేకకాలంలో సురమౌళి యీ కథలో ప్రస్తావిస్తాడు. ప్రజా సంక్షేమం మరచి పార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్న వర్తమాన రాజకీయ సందర్భంలో అప్పుడే వోటు హక్కు పొందిన రచయిత రాసిన యీ వుత్తరాన్ని చట్ట సభల్లో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళందరికీ పోస్ట్ చెయ్యాలి.

‘అందరం బతకాలె. అందరం కమ్మగా బతకాలె. అందరం కలిస్తేనే బతుకుతం. కలువకపోతె మనలో మనమే ఒకండ్ల నొకండ్లు చంపుకొని చస్తం. … బ్రతుకటానికి తయారీలు త్వర త్వరగా చేసుకొని చావుతోటి పోట్లాడాలె.’

పోటీ ఆర్థిక వ్యవస్థ గురించి, సమష్టి వ్యవసాయం గురించి, సహకార సంఘాల గురించి, ‘కలిసి బ్రతుకుదాం’ (1958) లో చెప్పిన ఆర్థికశాస్త్ర సూత్రాలు స్థూలంగా సురమౌళి జీవన తత్త్వానికీ, అతనిలో బలంగా పాతుకొన్న సోషలిస్టు భావజాలానికీ, లోహియా ఆలోచనాధారకీ అద్దం పడతాయి. లేఖారూపంలో వ్యాసాన్ని సృజనాత్మక రచనా ప్రక్రియగా (వెనకటికి కనుపర్తి వరలక్ష్మమ్మ రాసిన లేఖా వ్యాసాలు బాగా ప్రాచుర్యం పొందాయి) మలిచాడు సురమౌళి. తెలంగాణా భాషలో వ్యాస రచనకి యివి సిలబస్ గా వుపయోగపడతాయి.

సురమౌళి రాజకీయ దృక్పథాల గురించి ఆచరణ గురించి మాట్లాడుకొనేటప్పుడు తప్పనిసరిగా పేర్కొనాల్సిన విశిష్టమైన కథ ‘ముక్కోటి బలగమోయి’. తొలి మలి తెలంగాణా రాష్ట్రోద్యమాలకి పోరాట స్ఫూర్తిని అందించిన ప్రధానమైన అంశం తెలంగాణ ఆత్మగౌరవం. రాజకీయంగా కావొచ్చు సాంస్కృతికంగా కావొచ్చు ఆత్మ గౌరవానికి హాని కల్గినందువల్లే స్వయం ప్రతిపత్తి ఆశయం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షా వుద్యమమై ముందుకొచ్చాయి. తెలుగు ప్రాంతాలు విడిపోడానికి బీజాలు కలవడంలోనే పడ్డాయని 56 ఆంధ్రప్రదేశ్ అవతరణలోనే గుర్తించిన కథ ‘ముక్కోటి బలగమోయి’.

పెద్దమనుషుల వొప్పందంతో ఆంధ్రప్రదేశ్ యేర్పడ్డాకా ముక్కోటి తెలుగు వాళ్ళకీ అన్ని సదుపాయాలూ సౌకర్యాలూ వసతులూ వున్న హైదరాబాద్ నగరం రాజధానిగా లభించింది. కర్నూల్లో మూడు సంవత్సరాలు అనుభవించిన కేంపు కేపిటల్ కష్టాలు తొలగిపోయాయి. అన్నిప్రాంతాల నుంచీ నగరానికి వలసలు మొదలయ్యాయి. అనేక భయసందేహాలతో యితర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని నగరం సాదరంగా ఆహ్వానించింది. అయితే బయట నుంచి వచ్చినవాళ్ళు ప్రదర్శించే ఆధిపత్య స్వభావం అహంకార వైఖరి స్థానికులతో మమేకం కానివ్వవు. స్థానికులపై వారికి చిన్నచూపు యేర్పడింది. కొత్త ప్రాంతాన్నో రాజ్యాన్నో ‘గెల్చుకొన్నా’మన్నగర్వం కలిగింది. నిజాం రాజును గద్దె దించింది కూడా తామే, ఆ గద్దె తమదే అన్నది వారిలో మరి కొందరి భావన. దాంతో తమ యేలుబడిలోనే సమస్తం నడుస్తుందనీ నడవాలనీ ఆభిజాత్యం పెరిగింది. ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఘర్షణ అక్కడే మొదలైంది. ఈ ఘర్షణకున్న భిన్న కోణాల్ని గొప్ప సంయమనంతో నిజాయితీతో ఆవిష్కరించాడు సురమౌళి. కలయిక పరస్పరం ప్రేమ విశ్వాసాల పునాదిగా యేర్పడాల్సి వుందనీ రెండు ప్రాంతాల ప్రజల మధ్య అన్నదమ్ముల అనుబంధం సహజంగా చోటుచేసుకోవాలనీ రచయితగా ఆకాంక్షించాడు.

‘ముక్కోటి బలగమోయి’ కథలో వుద్యోగం రీత్యా ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన వాడూ, అతణ్ణి ఆదరించి హక్కున చేర్చుకొన్న తెలంగాణా స్థానికుడూ యిద్దరూ కోటయ్యలే. ముక్కోటి బలగంలో మూడో కోటి నేనైనా మీరైనా యెవరైనా కావచ్చు. పాఠకులు కథలోని పాత్రల్తో మమేకం కావడం గాక స్వయంగా పాత్రలుగా మారిపోతారు. కథలో అంతగా లీనమైపోతారు. సన్నివేశాల్ని అంతకు ముందు యెక్కడో చూసినట్టుగా/విన్నట్టుగా భావిస్తారు. వాస్తవంగా జరిగిన సామాజిక సంఘటనలనే, నిజానికి సామాజిక పరిస్థితుల్ని అనాలి, కథగా రూపొందించడంలో సురమౌళి చూపిన శిల్ప విన్నాణం అద్భుతం. కథా నిర్మాణంలో రచయిత చూపిన నేర్పు వల్ల మాత్రమే అది సాధ్యం కాలేదు. రాజకీయ దృక్పథంలో వున్న స్పష్టత కూడా అందుకు దోహదం చేసింది. బహుముఖీనమైన అనేక సామాజికాంశాల్ని యెటువంటి సంక్లిష్టతలకీ తావులేని సాదా సీదా పాత్రల ద్వారా వ్యాఖ్యానించడంలో గొప్ప నేర్పు కనిపిస్తుంది.

తల్లి ఒక్కటె నీకు తెలుగోడా…
సవతి బిడ్డల పోరు మనకేల?
అనే వుద్బోధతో రచయిత కథని ఆశావహంగా ముగించాడు గానీ చరిత్ర మరో విధంగా నడిచింది.

1969 ప్రత్యేక రాష్ట్రోద్యమాన్ని సోషలిస్టు పార్టీ బలపరిచింది. అప్పుడు సురమౌళి పార్టీ రాష్ట్ర కార్యదర్శి. రచయితగా ముక్కోటి బలగమోయి కథలో తానిచ్చిన ముగింపునే కోరుకొని పార్టీ పదవికి రాజీనామా చేసాడు. దాశరథి లాంటి ఆనాటి అనేకమంది రచయితల్లా ముక్కోటి తెలుగు ప్రజల ఐక్యతనే ఆయన కోరుకొన్నాడు. ఆలంపూర్ సాహిత్యసభల ప్రభావం కూడా అందుకు యెంతో కొంత కారణమై వుంటుంది.

అనేక త్యాగాలతో వలసాధిపత్యాలకు ముగింపు పలికిన మలిదశ రాష్ట్రోద్యమాన్ని సురమౌళి చూడకుండానే వెళ్ళిపోయాడు. ఉంటే ప్రజల ఆకాంక్షని గౌరవించి ‘విడిపోయి కలిసుందాం’ అనేవాడేమో!

*** *** ***

సురమౌళి జీవించి వుంటే ఇవ్వాళ తెలంగాణా భాషలో వస్తున్న సాహిత్యం చూసి యెంత యెలా స్పందించేవారో యెంతగా సంతోషించేవారో తెలియదు గానీ విప్లవోద్యమం నుంచి యెదిగిన రచయితల్లో తెలంగాణా మాండలికంలో గొప్పగా రాస్తున్న వాళ్ళలో అల్లం రాజయ్యని ఆయన ముందుగా పేర్కొన్నాడు.

‘రాజయ్య శైలీ – కథనం – భాషా చాలా గొప్పగా ఉన్నాయి. శిల్పం దృష్ట్యా ‘మార్పు’ కథ చాలా గొప్పది. అయితే రాజయ్య రాజకీయాల్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను.’

ప్రజాస్వామికంగా రాజయ్య రాజకీయాభిప్రాయాల్తో విభేదించడానికి గానీ రాజయ్య విశ్వసించిన పోరాట మార్గాన్నీ విప్లవాచరణ పద్ధతుల్నీ తిరస్కరించడానికి గానీ సురమౌళికున్న స్వేచ్ఛని కాదనలేం. కానీ తాను పుట్టి పెరిగిన కరీంనగర్ మట్టి కల్లోల చట్టాల ఉక్కుపాదాల కింద నలుగుతున్నప్పుడు అమాయిక ప్రజల నెత్తుటి యేరులు కలిసి యెర్రబడిన గోదావరి నదీజలాలు వుత్తర తెలంగాణా నాగేటి చాళ్ళలోకి ప్రవహిస్తున్నపుడు నిత్య ఎన్ కౌంటర్లతో తుపాకీ మందు వాసనతో అడవీ గుట్టా వూపిరాడక వుక్కిరిబిక్కిరౌతున్నప్పుడు భూస్వామ్య దురాగతాలకు వ్యతిరేకంగా జగిత్యాల జైత్రయాత్రలో పీడిత జనం కదం తొక్కుతున్నప్పుడు ‘మధ్యతరగతిని విప్లవోన్ముఖులను చేసింది కథానికా నవలా సాహిత్యమే’ అని నమ్మిన రచయిత ప్రజల పక్షం వహించకుండా రాజ్యానికి వత్తాసు పలుకుతూ రాజ్యహింసకి వకాలత్ పట్టడం వైరుధ్యమే కాదు విషాదం కూడా. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే క్రమంలో సురమౌళి పోలీసుకి దగ్గరయ్యాడు. నాలాంటివారు ఆయనకి దూరమయ్యారు.

‘కథానికా రచయిత భూమ్మీద కాలుమోపి మరీ నడవాల’ని విశ్వసించి సోషలిష్టు రాజకీయాల దృక్పథానికి పరిమితులకి లోబడి, మనసా వాచా కర్మణా రాతల్లో చెప్పినదాన్నే కడదాకా చేతల్లో చూపిన ఆదర్శవాద ఆచరణశీలి రచయిత గరిశకుర్తి సురమౌళి.

నా పరిశోధన పరిమితుల కారణంగా సురమౌళి రాసిన మాండలిక కథల సేకరణపైనే నేనెక్కువ దృష్టి పెట్టా. చీకట్లో మగ్గే కవిలె కట్టల్ని వెలుగులోకి తెచ్చి దస్త్రాల దుమ్ము దులిపి తొలి తరం తెలంగాణా సాహిత్యాన్ని వెలికి తీయడంలో గొప్ప తవ్వకపు పనిమంతుడుగా పేరొందిన మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్ లభ్యమౌతోన్న మేరకు సురమౌళి కథల్ని సరైన సమయంలో మనముందుంచుతున్నాడు. తెలుగు నేల మీద కథకుడిగా సురమౌళి స్థానాన్నిఅంచనా కట్టడానికి యిది మంచి అవకాశం. ప్రత్యేక రాష్ర్టం యేర్పడ్డాకా తెలంగాణా తెలుగులోనే సాహిత్య సృజనకు పెద్దపీట వేయాలని పూనుకొన్న సృజనాత్మక రచయితలకి పత్రికా రచయితలకి పాఠ్యపుస్తక రచయితలకి సురమౌళి మాండలికంలో రాసిన కథలూ వ్యాసాలూ శైలీ పత్రాల్లా (style sheets) వుపయోగపడతాయని నా నమ్మకం.

హైదరాబాద్
ఏప్రిల్ 14 , 2015
ఎ. కె. ప్రభాకర్
(బాబా సాహెబ్ పుట్టినరోజు)About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

తంగేడు పూల బతుకమ్మలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (కొన్నాళ్ళ క్రితం భూమిక ప్రియాంక అనే యిద్దరు 12/13 సంవత్సరాల బం...
by అతిథి
1

 

 

భాష కూడా యుద్ధ క్షేత్రమే

వ్యాసకర్త : ఎ.కె. ప్రభాకర్  కాళోజీ జయంతి సందర్భంగా (తెలంగాణా భాషాదినోత్సవం సెప్టెంబర...
by అతిథి
0

 
 

గాయపడ్డ ఆదివాసి సంధించిన ‘శిలకోల’

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ [రచయిత మల్లిపురం జగదీశ్ ‘శిలకోల’కి డాక్టర్ మాడభూషి రంగాచార...
by అతిథి
4

 
 

రాజకీయ బీభత్స దృశ్యం – చీకటి రోజులు

వ్యాసకర్త: ఎ.కె. ప్రభాకర్ (ఈ వ్యాసం మొదట పాలపిట్ట జనవరి 17 సంచికలో వచ్చింది. పుస్తకం.నెట...
by అతిథి
3