పుస్తకం
All about booksపుస్తకలోకం

May 22, 2015

హేరీ మార్టిన్సన్ కవిత్వం, జీవితం

More articles by »
Written by: అతిథి
Tags: , ,

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు

(ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు ఏప్రిల్ 2015లో ఫేస్బుక్ లో పోస్టు చేసారు. తిరిగి పుస్తకం.నెట్ లో వేయడానికి అనుమతించినందుకు వారికి ధన్యవాదాలు.– పుస్తకం.నెట్)

*******
మొన్న ఇంటికి వచ్చేటప్పటికి ఎక్కడో దూరదేశాన్నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రియబంధువులాగా హేరీ మార్టిన్సన్ కవితాసంపుటి The Procession of Memories, Selected Poems 1929-1945 నా కోసం ఎదురుచూస్తూ ఉంది.

కొన్నాళ్ళకిందట Chickweed Wintergreen, Selected Poems చదివినప్పణ్ణుంచీ మార్టిన్ సన్ కవిత్వం పట్ల గొప్ప ఇష్టం పెంచుకున్నాను. అందులో ఉన్న కవితలు కొన్ని ఈ పుస్తకంలో కూడా ఉన్నప్పటికీ, అనువాదకులు వేరు కావడంతో మళ్ళా కొత్త కవితలు చదివినట్టే ఉంది. Chickweed Wintergreen రాబిన్ ఫుల్టన్ అనువాదాలు, The Procession of Memories కి లార్స్ నోర్డ్ స్ట్రోం అనువాదకుడు.

హేరీ మార్టిన్ సన్ (1904-1978) స్వీడిష్ రచయిత, కవి, యాత్రాచరిత్రకారుడు. 1974 లో మరొక స్వీడిష్ నవలాకారుడితో కలిసి సాహిత్యానికి గాను నోబెల్ బహుమతి అందుకున్నాడు.

మార్టిన్ సన్ జీవితం కథ కన్నా విచిత్రమైంది. ఆరేళ్ళ వయసులోనే కుటుంబం ముక్కలైంది. తండ్రి క్షయవ్యాథితో మరణించాడు. అఏడుగురు పిల్లల్ని సాకలేక తల్లి అమెరికా పారిపోయింది. పిల్లలంతా తలోదిక్కూ అయిపోయారు. మార్టిన్ సన్ కూడా తర్వాత పదేళ్ళ పాటు రరకాల ఇళ్ళల్లో, పొలాల్లో బతుకుతెరువు వెతుక్కోవలసి వచ్చింది. పదహారో ఏట నావికుడిగా మారాడు. ఆ ప్రయాణాల్లో అమెరికా వెళ్ళవచ్చుననీ, తల్లిని చూడొచ్చనీ కోరిక. 1922 లో అమెరికా వెళ్ళడమైతే వెళ్ళాడుగానీ, తల్లిని చూడలేకపోయాడు. 1927 లో మలేరియా బారినపడి క్షయవ్యాధి సూచనలు కనిపించడంతో సముద్రాన్ని వదిలి మళ్ళా స్వీడన్ చేరుకున్నాడు. నిరాశ్రయుడిగా, నిర్భాగ్యుడిగా జీవిస్తుండగా హెల్గా జొహన్సన్ అనే ఒక వామపక్ష స్త్రీవాది పరిచయమైంది. ఆమె అతడికన్నా పధ్నాలుగేళ్ళు పెద్దది. ముగ్గురు పిల్లలతల్లి. ఆమె స్టాక్ హోం శివార్లలో ఉన్న తన వ్యవసాయక్షేత్రానికి వచ్చి కొన్నాళ్ళు ఉండమని మార్టిన్ సన్ ని ఆహ్వానించింది. ఆ పరిచయం ప్రణయంగా మారి ఆ మరుసటి ఏడాది వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత 1940 లో వాళ్ళిద్దరూ విడిపోయేదాకా ఆ కాలమంతా మార్టిన్ సన్ జీవితంలో అత్యున్నతమైన, సృజనాత్మకంగా సుసంపన్నమైన కాలం. ఒకదానివెనక ఒకటి అతడు కవిత్వం, నవలలు, వ్యాసాలు, నాటకాలు, రేడియో నాటకాలు రాస్తూనే ఉన్నాడు. కాని అతడికి రాజకీయ నిబద్ధత లేదని అతణ్ణి హెల్గా వదిలిపెట్టేసాక, ఇంగ్రిడ్ లిండ్ క్రాంజ్ అనే ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. 1949 నుంచీ స్వీడిష్ అకాడెమీ సభ్యుడిగా ఉన్నాడు. 1974 లో అతడి కవిత్వానికి నోబెల్ బహుమతి వచ్చిందిగాని, ఆ ఎంపిక కమిటీలో అతడు కూడా ఉన్నందువల్ల తీవ్ర విమర్శను ఎదుర్కోవలసి వచ్చింది. దాంతో అతడు రాయడం, ప్రచురించడం మానేసాడు. ఆ విమర్శ మానసికంగా కలిగించిన ఒత్తిడి తట్టుకోలేక నాలుగేళ్ళు తిరక్కుండానే ఒకరోజు హాస్పటల్లో తన పేగులు కత్తిరించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మార్టిన్ సన్ చక్కటి పాఠశాల చదువుకు నోచుకున్నవాడు కాడు. కాని చదువుని ప్రేమించాడు, సాహిత్యాన్ని ప్రేమించాడు. ప్రకృతిని ఆరాధించాడు. భూగోళ, ఖగోళ శాస్త్రాలు అతణ్ణి సమ్మోహితుణ్ణి చేసాయి. నిరాశ్రయంగా గడిచిన బాల్యం, ప్రపంచ సముద్రాలన్నిటిమీదా పయనించిన యవ్వనం, ఏళ్ళ తరబడి ఆకాశాన్ని మాత్రమే చూస్తూ ఖండాంతరాల మీద సాగిన జీవితం అతడి దృష్టిని అసీమితం చేసేసాయి.. ‘ఒక తుహినకణంలో విశ్వాన్ని దర్శించగల కవిత్వం’ అతడిదని నోబెల్ కమిటీ ప్రస్తుతించింది.

ఒక దిమ్మరిగా, కూలీగా, నిర్భాగుడిగా జీవించినప్పటికీ మార్టిన్ సన్ కవిత్వం సోషలిస్టు తరహా ప్రసంగాలకు పూనుకోదు, నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోదు. ఎంతో ఆరోగ్యవంతంగా, నవనవలాడే పండులాగా, అప్పుడే వికసించిన అడవిపువ్వులాగా, దూరంగా కనవచ్చే దీవి మీద వినవచ్చే తొలిపక్షి కూజితంలాగా కొత్తగా తాజాగా ఉంటుంది. ఏ కవిత చదివినా ప్రాణం లేచివచ్చినట్టుంటుంది.

మార్టిన్ సన్ లానే నేను కూడా తొమ్మిదో ఏటనే ఇల్లు వదిలిపెట్టాను. అతడు తనవికాని దారుల్లో సంచరించినట్టే నేను కూడ నావి కాని దారుల్లో, తీరాల్లో ప్రయాణిస్తూనే ఉన్నాను. అతడిలానే నేను కూడా తల్లి కోసం వెతుక్కుంటూనే ఉన్నాను. అతడిలానే నాకు కూడా పూలూ, ముళ్ళూ అనే తేడా లేకుండా ప్రకృతి మొత్తం ప్రాణప్రదం. బహుశా అందుకేనేమో ఆ కవిత్వం చదువుతుంటే ఒక ఫిన్నిష్ విమర్శకురాలు రాసినట్టుగా Reading poetry is human nearness అని అనిపిస్తుంది.

మార్టిన్ సన్ కవితలు మూడు మీకోసం:

కవిత

ఇప్పుడు మనమీ భూమ్మీద ఒక తాళం వాయిద్దాం
ఆ తాళం మరేదో కాదు, ఒకప్పటి నీ చందమామనే.
వానాకాలపు అడవుల్ని కొమ్ముతో గోరాడినంతకాలం గోరాడి
ఇప్పుడు ఏడు సత్రాల యజమానిలాగా లావెక్కిపోయాడు.

చిత్తడినేలలలోతుల్లోంచో,ఆకాశమంత ఎత్తుల్లోంచో
నువ్వు ఊహించగలిగిన మాటల్లోనే మేం మాట్లాడతాం
వికసించినవో, వాడిపోయినవో నక్షత్రాలకుమళ్ళా ప్రాణంపోసి
నీ చేతుల్లో ఉన్న పువ్వులో కొత్త పరిమళం ఊపిరూదుతాం
తమ్ముడూ, తమ్ముడూ, ఏమైనా రానివ్వు-
దవానలం, బీభత్సం, నేల నాలుగు చెరగులా విప్లవం,
కాని గుర్తుపెట్టుకో,ఎప్పటికీ, ఈ రెండుమాటలూ:
పువ్వుకి పరిమళాలూదు.

స్వగ్రామం

నీ స్వగ్రామంలో వానపాములు గుల్లబరిచిన తోటలో
కాశీరత్నం తీగె ఇంకా పూస్తూనే ఉంది.
ఇళ్ళల్లో పాతాకాలపు పొడవాటి గోడగడియారాలు టిక్కుటిక్కుమంటూనే ఉన్నాయి.
ఇళ్ళ కప్పుల్లోంచి యూపస్తంభాల్లాగా పొగపైకి లేస్తోనే ఉంది.
ఎన్నో సముద్రాల మీద ఎంతో కఠినాతికఠిన జీవితం ముగించుకుని
క్రూరాతిక్రూరమైన తావులన్నీ చూసి వచ్చినవాడికి
ఈ శాంతిమయ గ్రామం ఒక ప్రశాంత అసత్యంగా గోచరిస్తుంది.
కాని ఈ అసత్యానికే జీవితమంతా చుట్టుకుపోవాలనిపిస్తుంది.
ఈ ఒక్క అసత్యం కోసం
ఎన్ని దుష్టసత్యాల్నైనా కాళ్ళతో మట్టేసి రావాలనిపిస్తుంది.

శ్రోతలు

వినడమొక్కటే తెలిసిన ఆ రోజుల్లో
నెగడిచుట్టూ చేరి పెద్దవాళ్ళంతా
అంతిమదినందాకా, ఒక రక్షకుడెవరో
వాళ్ళని శుభ్రపరిచే క్షణంకోసం వేచిచూస్తూ
తమ పాపమయదేహాల్ని చలిగాచుకుంటూ ఉండేవాళ్ళు.

ఎక్కణ్ణుంచో ఒక పిల్లి మావుమనేది, నెగడి రగుల్తుండేది,
పొగగొట్టాలు కూతపెట్టేవి.
కాలుజారిన ఒక పిల్లను తలుచుకుంటూ
ఎవరో శోకభరితంగా గొంతెత్తేవారు.
పళ్ళూడి పొద్దువాటారినవాళ్ళు
పొల్లుపోయిన ధాన్యంగురించో
పురుగుపట్టినపంటగురించో మాట్లాడుకునేవాళ్ళు.

ఆ చిన్నప్పటి నెగడిదగ్గరే నేనిప్పటికీ గడ్డకట్టుకుపోయాను.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

క్షేత్రయ్య పదములు

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు మార్చి 2014లో ...
by అతిథి
2

 
 

Tagore: The World Voyager

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు జనవరి 2014లో ఫ...
by అతిథి
0

 
 

Reduced to Joy – Mark Nepo

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2014లో ఫేస్బు...
by అతిథి
0

 

 

సాదత్ హసన్ మంటో కథలు

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2013లో ఫేస్బు...
by అతిథి
1

 
 

Poems in Translation: Sappho to Valéry

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2013లో ఫేస్బు...
by అతిథి
2

 
 

Confucius from the Heart

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2013లో ఫేస్బు...
by అతిథి
1