పుస్తకం
All about booksపుస్తకలోకం

March 11, 2015

స్త్రీ వాద కవిత్వంలో శిల్పవిశేషాలు

More articles by »
Written by: అతిథి
Tags:

వ్యాసకర్త: డా. వై.కామేశ్వరి
(భూమిక పత్రిక ఆగస్టు 2010లో ప్రచురితమైన వ్యాసాన్ని కొద్ది మార్పులతో రచయిత్రి పంపగా ప్రచురిస్తున్నాము – పుస్తకం.నెట్)
*******
‘సుఖం అంటే ఏమిటి?’ అని పూర్వం ఎప్పుడో ఒక నిర్భాగ్యుడు తన గురువును అడిగాడట. ‘నీకాలికంటే తక్కువ కొలత ఉన్న చెప్పులను వేసుకొని, కాసేపు ఆగాక దాన్ని విడిచి వెయ్యి. అప్పుడు సుఖం అంటే ఏమిటో తెలుస్తుంది’ అన్నాడట ఆ గురువు.

స్త్రీ వాద కవిత్వాన్ని గురించి మాట్లాడుకొనే సందర్భంలో ఈ కథను చెప్పుకోక తప్పదు. వెనకటికాలంలో స్త్రీలు తమకాలికంటే తక్కువ కొలత గల చెప్పులనే ధరించి జీవితాలను గడపివేశారు. వాటిని ఒక్క క్షణమైనా విడిచి వెయ్యటం జరగలేదు. వారికి ఆ అవకాశమూ లేదు. ఆలోచనాలేదు. అందుచేత సుఖం అంటే తెలిసే అవకాశమూ లేదు, అది తమకు లేదనే స్పృహకూడా లేదు. అజ్ఞానం వల్ల కూడా ఒకరకం శాంతి కలుగుతుంది. అందువల్ల స్త్రీలూ శాంతిగా ఉన్నారు. పురుషులూ శాంతిగా ఉన్నారు.

ఆనాటి సమాజశాంతికి మరొక కారణం కూడా ఉంది. స్త్రీలు నిత్యజీవితంలో ఆచరణాత్మకంగా ఉండే వారు. వారికి తమ జీవితాలను ఉన్నంతలో సుఖసంతోషాలతో గడిపి వేసేందుకు వీలైన నేర్పు ఉండేది. కనీసం జీవితంలో అనుభవాలతోనైనా, కొంత పరిణతి సాధించాక అయినా ఈ ఆచరణాత్మక దృక్పథం వారికి కలిగేది. ఈ నాడు అమ్మాయి, అబ్బాయి వివాహానికి ముందు ఒకే విధమైన వాతావరణంలో పెరుగుతున్నారు. వారికి వైవాహిక జీవితపు బాధ్యతలపట్ల ఎటువంటి అవగాహన ఉండటంలేదు. అబ్బాయిలకు మారిన పరిస్థితుల్లో తమ సహచరులతో వ్యవహరించవలసిన తీరు మారవలసి ఉంటుందని, తమ బాధ్యతలను పెంచుకోవాలనే అవగాహన ఉండటంలేదు. ఒకసారి వైవాహిక జివితంలోకి అడుగుపెట్టాక అమ్మాయికి తన బాధ్యతలు విపరీతంగా పెరిగిపోవటం తప్పటంలేదు. స్త్రీ పురుషపాత్రల్లో భేదాలు వివాహం తర్వాత మాత్రమే ప్రస్ఫుటమవుతున్నాయి. అందుకు తగిన సంసిద్ధత ఇరువురిలోనూ కొరవడుతోంది.

దానితో సమాజంలో ఒక చిత్రమైన స్థితి నెలకొంది. స్త్రీలకు ‘సుఖం’ ఏమిటో తెలుస్తోంది. సుఖం లేనితనం తమకు మాత్రమే ఎందుకో అర్థం కాక వారికి అశాంతి కలుగుతోంది. తమ తల్లులూ, తల్లుల తల్లులూ చేసిన నిరంతర అవిశ్రాంత, నిరపేక్ష శ్రమను, శ్రమ అనే స్పృహలేకుండా గాలి వీచినంత సహజంగా చేసిన శ్రమను చెయ్యడానికి, ‘స్త్రీ సహజ’ జీవితాన్ని గడపడానికి ఈతరం స్త్రీలు ఎందుకు ‘అసుఖం’గా భావిస్తున్నారో అర్థంకాక పురుషులు తికమక పడుతున్నారు. స్త్రీలు ఎదుగుతున్నారు. తమ ఎదుగుదలకు అనుగుణమైన చెప్పులను ధరిస్తున్నారు. కానీ, వారిపట్ల వారికి అనుగుణంగా సమాజం ఎదగటం లేదు. సమాజపు విలువలు ఎదగటంలేదు. సహజీవన సౌభాగ్యాన్ని అందించ వలసిన పురుషుడు ఎదగటంలేదు. తగిన కొలత గల చెప్పును ధరించటానికి అలవాటు పడిన స్త్రీకి వివాహం కాగానే సమాజం ఆమె కొలతకంటే తక్కువ కొలతగల చెప్పును అందిస్తోంది. ఉద్యోగం చేసే చోటకూడా ఆమె అటువంటి చిన్న పాదరక్షలను మాత్రమే ధరించాలని అభిలషిస్తోంది. ఆమె మేధోజీవితాన్ని మరచి శరీరమాత్రంగా మిగలవలసిన పరిస్థితి సర్వత్రా నెలకొని ఉంది.

సమాజం ఎన్ని రంగాలలో ఎంత ఎదిగినా స్త్రీపట్ల అనాగరికంగానే ఉంటోంది. స్త్రీపట్ల సగటు పురుషుని దృక్పథం కొన్ని శతాబ్దాల వెనుకనే ఉంది. నేడు భారతదేశంలో కుల, మత, వర్గ, వయోభేదం లేకుండా, ఇంటా, బయటా, వృత్తిలో స్త్రీ నిరంతరం అపాయంలోనే బ్రతుకుతోంది. 21వ శతాబ్దంలో కూడా స్త్రీ హింసనీ, స్త్రీ సమస్యనీ వైయక్తిక కుటుంబ వ్యవహారంగా భావించడం జరుగుతోంది. కళ్ళ ఎదట ఎంత ఘోరం జరుగుతున్నా ఈ కారణం చేత స్త్రీకి సహాయపడటానికి సంస్కారవంతులైన స్త్రీ పురుషులుకూడా జంకవలసి వస్తోంది. అంతేకాదు, సహాయపడేవారిని ఆటంకపరుస్తున్నారు. చట్టపరమైన రక్షణ కాగితాల్లోనే మిగిలిపోతోంది.

అయితే, సమాజంలో చైతన్యవంతులైన కొద్దిశాతం మహిళలు వాస్తవపరిస్థితులను అర్థం చేసుకొని స్పందిస్తున్నారు. తమ పరిస్థితిని గ్రహించి, తమ తోటి మహిళను కూడా చైతన్యపరుస్తున్నారు. ఎదగని స్త్రీలు ఎదగనిపురుషులూ అందరూ కలసి సమాజంలో, కుటుంబ జీవితంలో స్వయంగా నరకాన్ని సృష్టించుకుంటున్నారు. తామూ బాధపడి ఇతరులను బాధిస్తున్నారు. చైతన్యవంతులైన స్త్రీలు తమ అణచివేతను ప్రశ్నిస్తున్నారు. తమతో పాటుగా సమాజాన్నీ ఎదగమని బోధిస్తున్నారు. ఈ నేఫథ్యంలో స్త్రీల కలాలనుండి, వైవిధ్యభరితమైన, శిల్పబంధురమైన కవిత్వం వెలువడుతోంది. అట్టడుగు స్థాయిలోని స్త్రీనుండి, బి.పి.ఒ లలో పనిచేసే స్త్రీలవరకు, బాల్యదశనుండి వృద్ధాప్యం వరకు వివిధ దశల్లో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని స్త్రీలు ఈ కవిత్వంలో వ్యక్తీకరిస్తున్నారు. పురుషుల ఆలోచనలనే కాక , స్త్రీలపట్ల తోటిస్త్రీల ఆలోచనలను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

కవితాశిల్పదృష్టితో చూచినప్పుడు కవితను అక్షరం అక్షరం జాగ్రత్తగా చెక్కి ప్రతిపొల్లూ చివరకు హైఫన్‌ తో సహా కవిత్వశిల్పానికి దోహదం చేసేలా ఒకవర్గంవారు రచిస్తున్నారు. ఈ వర్గానికి జయప్రభగారు ప్రతినిధిత్వం వహిస్తున్నారు. మరొక వర్గం వారు సహజ సుందర సునిశిత శిల్పంతో ఉద్వేగభరితమైన రచనలను చేస్తున్నారు. ఈ వర్గానికి కొండేపూడి నిర్మలను నాయకత్వం వహిస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు.

సగటుభారతీయ కుటుంబంలో కోడలుగా ప్రవేశించిన స్త్రీ ఎదుర్కొనే పరాయీకరణను కొండేపూడి నిర్మల వధూగీతంలో ఇలా వర్ణిస్తుంది.
“స్వాగతగీతంలో స్వగతాలే ఎక్కువ
కర్పూరం వెలిగించితూర్పారబెట్టడం మక్కువ
కాళ్ళయినా కడుక్కోకుండా కఠినమైన ప్రశ్నాపత్రం ఇస్తారు.
సెర్చివారంటైనా లేకుండా శిక్షవేస్తారు.
ఎప్పటికప్పుడు అసంతృప్తి.
దప్పిక చాలని అహంతృప్తి..”

ఒక స్థాయిని దాటిన పరాయీకరణ బలవన్మరణాలకు, వరకట్నపు చావులకు దారితీస్తుంది. అది ఈ సమస్యకు పరాకాష్ఠ. కొత్తగా పెళ్ళయిన ఆడపిల్లకు కొత్ తప్రదేశానికి, కొత్త జీవితానికి అలవాటుపడటానికి తగిన సమయమైనా ఇవ్వరు అనే విషయాన్ని సరళసుందరంగా ‘కాళ్ళయినా కడుక్కోకుండా కఠినమైన ప్రశ్నాపత్రం ఇవ్వడం’ అనే వ్యక్తీకరణ చెపుతుంది. సాధారణంగా ఒక స్థాయి కుటుంబాలలో అత్తవారింటి కుటుంబ సభ్యులనుండి ఎదర్కొనే ఒత్తిడికి మూలం అహంకారమే. ‘దప్పికచాలని అహంతృప్తి అనే వ్యక్తీకరణ ఎంత అప్రయత్నంగా వచ్చిందో గమనిస్తే ఆ కవిత ఎంత ఉద్వేగం నుండి ఉద్భవించిందో అర్థం అవుతుంది.సమాజంలో ఏస్థాయిలో ఉన్న మహిళకైనా తాగుబోతు భర్త పెద్ద సమస్య. తుర్లపాటి రాజేశ్వరి ‘ఊసరవెల్లి’ అనే కవితలో ఈ సమస్యను చిత్రిస్తుంది.

“వాడు దేవభాషలో దీవించి, దీవించి
పాపం అలసి సొలసి గాఢనిద్రలోకి జారిపోతాడు.
వాడికి ఏకష్టాలకడలి
బాష్పనదాలభోగట్టా లక్కరలేదు.
అనంత సుఖశయ్యాభోగాలే కావాలి
ఏబాధ్యతలూ వద్దు
నమ్రసేవా పూజనలే కావాలి
ఆహరిణ నయనాలలో
భవదీయపాదసరోజాలే గతి..”

పురుషుని నిర్దాక్షిణ్య కర్కశ ప్రవర్తతో సున్నితమైన స్త్రీ ఎలా నలిగిపోతుందో ‘మల్లెమొగ్గను మందారంగా మార్చడంలో వాడు నేర్పరి’ అనే ఒకే వర్ణనతో సమర్థవంతంగా చెప్పటం జరిగింది. ‘గార్ధభాకృతి వీడి గజరాజంగా వీధిమొగలో దర్శనం” ఇవ్వడం పురుషుని ద్వంద్వ ప్రవృత్తిని బహిరంగపరచడం. పూర్వపుకథలో అత్తవారింటి ఆడపిల్ల ‘ మోచేతికి దెబ్బతగిలినంత సుఖంగా ఉంది నాజీవితం’ అందిట. సరిగా అలా ‘మల్లెమొగ్గ మందారంగా మారటం ‘ అనే వ్యక్తీకరణ క్లుప్తంగానూ , భావస్ఫోరకంగానూ ఉంది. ఆధునిక కవిత్వంలో పునరుక్తి, క్లిష్టత, అతివిస్తృతి, వాచ్యత ప్రతికూలలక్షణాలుగా చెప్పుకుంటున్న రోజుల్లో క్లుప్తత, భావస్ఫోరకత, సరళత అనే అనుకూల విషయాలను స్త్రీవాద కవిత్వం ఆధునిక కవిత్వంలో వికసింపచేసింది.

‘ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన స్త్రీ పొద్దుటి నుండి నాలుగిళ్ళి తిరిగి వచ్చిన న్యూస్‌ పేపరులా‘ ఉంటుందిట.

‘కనిపించినప్పుడల్లా
కంపరం పుట్టేలా
వంటిమీదచూపులు,
చెదల్లా పాకుతూ ఉంటాయి’ అని జయప్రభ అవాంఛితమైన అపరిచితుల పరికింపులను వర్ణిస్తే,

“కాళ్ళకడాలు పెట్టుకోని చంద్రన్న
కలుపుదియ్యనేను బొతిరో చెంద్రన్న
వాడుచూసే చూపులకు చంద్రన్న
కాళ్ళకడాలు పాములాయెరో చెంద్రన్న”

అని తెలంగాణ ప్రజలు పాడుకున్నారు. వదలని ఈ చీదర గురించి ఏవర్గస్త్రీకైనా అనుభవపూర్వకంగా తెలుస్తుంది.

ఓల్గా వర్ణించిన యాంత్రిక స్త్రీజీవితాన్ని అనిభవించని ఆధునిక స్త్రీ లేదంటే అతిశయోక్తిలేదు.

“చేసిన పనే మళ్ళీ మళ్లీ వందసార్లు
వెయ్యసార్లు అంతులేణ్ని సార్లు
చేసీ చేసీ –అదిచెయ్యడంకోసమే
బతకాలని తెలిసి నిద్రగన్నేరైన మనసు
అర్థరాత్రి నువ్వుతుమ్మితే ఉలికి పడదు
నీముక్కుదిబ్బడకు చలించదు.-”

మొరటు యాంత్రిక జీవనం స్ త్రీని స్పందనా రహితంగా చేసి, ప్రేమరాహిత్యంలో ముంచెత్తుతోందన్నమాట వాస్తవం. నిద్రగన్నేరు పూర్తిగా విచ్చుకోకుండానే రాలిపోతుంది.స్త్రీ మనసూ అంతే!

‘రుబ్బుడుపొత్రంలా
తలతిరుగుతూనే ఉన్నా
ఆలోచనల పప్పుమెదగదు’
కలల అలల తుంపరలు
హృదయపు పెనంపై చుయ్యిమంటూనే వుంటాయి’
-గృహలక్ష్మి, ఓల్గా

ఇలాంటి పోలికలు జానపద అభివ్యక్తికి దగ్గరగా ఉంటాయి. అవును. జానపద కవిత్వం ఎంత అనుభవజనితమో, స్త్రీవాద కవిత్వమూ అంతే! అందువల్లే కురిసి, భూమిని ఫలవంతం చేసే నీలిమేఘాన్ని స్త్రీగా, కురవని మేఘాన్ని పురుషునిగా సంకేథించటం స్త్రీవాదకవిత్వానికి సాధ్యపడింది.

జయప్రభ రచించిన ‘నేనే వర్షించి నేనే మొలకెత్తి‘ అనే పద్యంలో ఆరోపక పరంపర స్త్రీ లోని భావ పరిణామాన్ని సూచించేందుకు ఉపయోగపడింది.

“నేనా
నేణిక్కడ వేప చిగుళ్ళలోకి
చూపుసారించి వేడెక్కిన ఆకాశాన్ని చూస్తున్నాను
నడిమధ్యాహ్నం నీటికోసం పక్షుల వెదుకులాటనీ
ఎండిపోయి కురియటానికి చుక్కనీరుకూడా లేని
మబ్బుల లోతైన కళ్ళలోని జీరనీ చూస్తున్నాను
అంతే కాదు దాహంతో రెక్కలార్చుకుంటూ కూడా
బతకటంకోసం మబ్బుల నీడలకు చేరుతున్న
వాటిజీవితాన్ని చూస్తున్నాను
వాటిలాగే నేనూ మౌనంగా ఉన్నాను
కడలికన్నీటిలా ఉప్పగా ఉన్నందుకు
బాధగా ఉన్నాను
ఈనల్లని అక్షరాల్లా ఏకాంతంగా ఉన్నాను
తియ్యగా స్పందించిన క్షణంలోనే
చేదుగా చలించే జ్ఞానపాకాల్లో
ఏరుచికీ అమదని భావంలా కొత్తగానూ ఉన్నాను
…..పంటలేక ఎండిన పొలంలా
దిగుళ్ళేసి ఉన్నాను (గమనించండి పగుళ్లేసికాదు)
ఏమో చెప్పలేను లెండి
మంచుపుష్పాలను ధరించి మళ్లీ నవ్వనూ గలను
ఏమో ఏంచెప్పను ఒక్కసారిగా నేనువర్షించి
మళ్ళీ నేనే మొలకెత్తగలనేమో!”

మొదటిపాదాలలోని స్త్రీ పక్షుల దీనత్వాన్ని పరిశీలిస్తూ తీపి చేదుస్పందనలను కలబోసుకున్న స్త్రీ. స్త్రీలకు పక్షులు ప్రతీకలు. ‘నీరులేని మబ్బుల లోతైన కళ్ళలోని జీర’ స్త్రీలపట్ల కర్కశంగా వ్యవహరించే పురుషదృక్పథం. అయినా నీడకోసం వాటికిందకే చేరే పక్షుల మూర్ఖత్వం లేదా అమాయకత్వం స్పష్టంగానే ఉంది. తన సహజ స్పందన తియ్యదనమైతే, తగిన ప్రతిస్పందనలేకపోవటం చేదు. ఈ రెండూ ఏకకాలంలో స్త్రీకి అనుభవంలోకి వస్తూనే ఉంటాయి. తమకు ఇలా జరుగుతోందనే స్పృహకలగటం కొత్తదనం- ఇక వర్షించేది మేఘమైతే, మొలకెత్తేది బీజం. తానే వర్షించి తానే మొలకెత్తటమంటే తనకు తానే ప్రోత్సహించుకొని తన అభ్యున్నతికి తానే కృషిచెయ్యటం. మరోరకంగా వ్యాఖ్యానించాలంటే తన తోటిస్త్రీలను జాగృతపరచటం- అందరూకలసి స్త్రీల అభ్యున్నతికి కృషిచెయ్యటం. ‘నేను’ను స్త్రీగా వ్యాఖ్యానించుకున్నప్పుడు, వ్యక్తిగత అభ్యున్నతి, ‘నేను’ను స్త్రీజాతికి ప్రతీకగా వ్యాఖ్యానించుకుంటే అభ్యున్నతి సంకేతించబడ్డాయని చెప్పవచ్చు.

జయప్రభ మరో రచన “చిత్రగ్రీవుడా రా!”, మొక్కపాటి సుమతి “మిత్రవైరుధ్యమా”, కె. గీత “పరపరాగ విరాగం”, కె. జయ “కట్టుకొయ్య” ఇవన్నీ శిలప్పరంగా ప్రతి అక్షరం సార్థకతను పొందిన రచనలే. ప్రాచీన కవిత్వంలో విశేషమైన పద్యాలకు ప్రతిపదార్థ తాత్పర్యవిశేషాలను వివరించినట్లుగా వీటిని వ్యాఖ్యానించ వచ్చు.

గుజరాత్‌లో జరిగిన దురాగతాలపై కవితను వ్రాస్తూ షాజహానా ఇలా అంటుంది.

“కానీ నన్ను హత్య చేయలేవు
అనంతంగా సాగే జీవనదిని
నేణు బతకటమే కాదు
నిన్ను పుట్టించి బతికించేది నేనే
అయినా
స్త్రీతప్ప మగాణ్ణి క్షమించేదెవరు?
ఎప్పెప్పటికీ ఈ ప్రపంచం
నారొమ్ము తాగుతున్న పసిబిడ్డే”

తన బ్రతుకుపట్ల , తన కష్టసుఖాలపట్ల, తన స్పందనలపట్ల చెప్పలేనంత ఉదాసీనతను ప్రదర్శించే ప్రపంచాన్ని, వీలైనంత అణచివేసే ప్రపంచాన్ని, తన ప్రయత్నాలకు వేటికీ సహకరించని లోకాన్నిఇందుకే ప్రేమిస్తుంది స్త్రీ. మాతృహృదయంతో క్షమిస్తుంది. తనపోరాటాన్ని జాగ్రత్తగా సహనంతో చేస్తుంది. వసంత కన్నభిరాన్‌ అన్నట్లుగా ‘తాను మూసలో మెలితిప్పి బిగించబడినప్పటికీ, తనతోపాటు, కుటుంబమూ, సమాజమూ నాశనం అవుతాయనే భయంతో, బాధతో వీథి పోరాటానికి దిగకుండా, సమస్కరణతో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. నడిచే ఎడపిల్లకు చేయూతనిస్తూ, నడకరాని పాపను చంకన వేసుకొని, జీవితమనే కొండను చైతన్యమూర్తియైన స్త్రీ ఓర్పుతో ఎక్కాలి. అంటే ఎదిగీ ఎదగని సమాజాన్ని తనతో పాటుగా ఊర్ధ్వముఖంగా నడిపించాలి స్త్రీ. అందుకు పురుషుడు అవగాహనతో ఆమెకు సహకరించాలి.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.7 Comments


 1. స్త్రీ పురుషుడిగా ,పురుషుడు స్త్రీగా ఆలోచించ గలిగినప్పుడే సమస్యకు పరిష్కారం.కవితలో ఆవిష్కారం. స్త్రీవాద కవిత్వం స్త్రీలు మాత్రమె కాదు.పురుషులూ చేయగలరు ,చేసారు.సమకాలీన స్త్రీ సమస్యలేకాదు,సార్వకాలిక స్త్రీ ప్రాముఖ్యాన్ని అనాదిగా మనకావ్యాలు చెబుతూనే ఉండినవి మనము వాటికి వక్రభాష్యాలు చెప్పుకుంటున్నాము. అపార కావ్య సంసారము ‘స్త్రీపుంస యోగోద్భవము’.యోగం సామాజిక రోగం కావడానికి కారణం స్త్రీ స్త్రీగా ,పురుషుడు పురుషుడుగా ఆలోచించడమే.
  కామేస్వరి గారు స్త్రీవాద పురుషుల కవితలు కూడా కొన్ని ఉదహరిస్తే బాగుండేది
  –సూరపరాజు రాధా కృష్ణ మూర్తి


  • kameswari yaddanapudi

   రాధా కృష్ణ మూర్తిగారూ ధన్యవాదాలండీ మీ విలువైన అభిప్రాయానికి,
   నేను ‘అవగాహన’ అని చెప్పినప్పుడు పురుషుడు స్త్రీకోణం నుండి చూడాలనేది నాఉద్దేశమండి. ఇక స్త్రీ అందరి కోణాలనుండీ చూస్తూ ఉండబట్టే కొన్ని సంసారాలైనా సవ్యంగా నడుస్తున్నాయి. ఈ వ్యాసం రాసినప్పుడు పురుషుల స్త్రీవాదకవిత్వం నాదృష్టికి రాలేదండీ. వారు రాయలేరనికానీ, రాయలేదని కానీ నా అభిప్రాయం కాదండీ. మరొకసారి ధన్యవాదాలు.


 2. padma mocherla

  చాల చక్కగ రాసేవు. విడమరిచి విషయాన్నిఎంతో క్లియర్ గ చెప్పేవు.


 3. J.Bharathi

  కామేశ్వరి గారూ
  ఏం చేస్తే పురుషుల అవగాహన పెరుగుతుందో , సహకరిస్తాడో ఇంకొంత వివరిస్తే బావుండేది . తగిన కొలత ఉన్న చెప్పులు ధరించాలేదేమో అని స్త్రీలు ఆలోచిస్తారేమో కాని ధరించటానికి ఏం చెయ్యాలో ఈ వ్యాసం ద్వారా తెలుసుకోగలిగితే ఇంకా బావుంటుంది అనిపించింది.ఆలోచన రేకెత్తించే మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు .


 4. yaddanapudi Kameswari

  I am sorry for the spelling mistakes in the artcle


  • kameswari yaddanapudi

   భారతి గారు,
   థాంక్యు. నేను శిల్ప విశేషాలను చెప్పేముందుగా కొంత పరిస్థితుల వివరణ ఇచ్చానండి. పరిష్కారాలను సూచించడం నా ఉద్దేశం కాదు. ఆయా సమస్యలను కవిత్వంలో ఎలా చెప్పారో చెప్పటం, ముఖ్యంగా యువతరానికి కవిత్వ గుణాలపట్ల అవగాహన కల్పించటమ్ నా కార్యక్రమం. పరిష్కారాలు, వారి వారి జీవన విలువలను అనుసరించి, వారి వారి ప్రత్యేక పరిస్థితుల ను బట్టి ఉంటుందని నా అభిప్రాయం.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 

 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1