నేటి విద్యార్థులు,ఉపాధ్యాయులకు ఆదర్శం – హెలెన్ కెల్లర్ జీవిత గాథ

వ్యాసకర్త: మద్దిరాల శ్రీనివాసులు, టీచర్
*********
రచయిత్రి డాక్టర్ నన్నపనేని మంగాదేవి గారు ఒక అద్భుతమైన వ్యక్తి అయిన హెలెన్ కెల్లర్ జీవిత గాథను గ్రంథస్తం చేసి మంచి పని చేశారు. ముందుగా ఆమెకు కృతజ్ఞతలు.

ఇందులో హెలెన్ అనే ఒక అమ్మాయి తన రెండేళ్ళ వయసులో ప్రమాదవశాత్తు తన చూపు, వినికిడి రెండూ పోగొట్టుకుంటుంది. అయితే పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం వీటన్నిటితో డిగ్రీ పట్టా పొందడమే గాక, ఒక రచయిత్రిగా కూడా ఎదిగిన వైనం నేటి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తివంతం.

అంగవికలుర పట్ల సమాజం చూపించవలసింది జాలి కాదు, వారికి జీవితంలో బ్రతకడానికి కావలసిన స్థైర్యం, ధైర్యం ఇస్తే వారి లోపాలను సైతం లెక్కచేయకుండా ఎంతటి వున్నత స్థానానికైనా ఎదుగుతారు అని చెప్పడానికి ఓ చక్కని నిరూపణ హెలెన్ జీవితం. హెలెన్ చిన్నతనంలో బాగా అల్లరి చేసేదట. అపుడు తల్లిదండ్రులు తనకు చదువు నేర్పడానికి సలీవాన్ అనే ఆమెను ఏర్పాటు చేస్తారు. పాక్షిక చూపు మాత్రమే కలిగి వినికిడి, మాట కూడా లేని ఆమె ఎంతో ఓపికగా హెలెన్ కు విద్య నేర్పడం ఒక అద్భుతం. సలీవాన్ బోధనా జీవితం నేటి కాలంలోని ప్రతి ఉపాధ్యాయునికి ఆదర్శవంతమైనది.

ఇందులో సుజాత అనే అమ్మాయి హెలెన్ కెల్లర్ గురించి తెలుసుకోవడానికి తనదైన శైలిలో ఇంట్లో అన్న ద్వారా, బడిలో ఉపాధ్యాయుని ద్వారా హెలెన్ గురించి సమాచార సేకరణ చేస్తుంది. అంతే కాదు, తాను ఎంతో తెలివిగా, చక్కగా మాట్లాడి ఉపాధ్యాయురాలి ద్వారా తనకు కావలసిన చోట పిక్నిక్ ఏర్పాటు చేయుంచుకుంటుంది. ఈ పాత్ర ద్వారా విద్యార్థులంటే ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి కృషి చేయాలని, సంపూర్ణ విషయ సాధనకి విద్యార్థులు ఆసక్తి, పట్టుదల, సమయస్ఫూర్తి కలిగి విషయ సేకరణ స్వభావం తో ఎవరితో ఎలా నడచుకోవాలో తెలిపారు రచయిత్రి. ఒక్క మాటలో చెప్పాలంటే హెలెన్ గాథకు తగిన విధంగా నాటకీకరణ పాత్రలను, కథను చిత్రీకరించిన మంగాదేవి గారి సృష్టి అనిర్వచనీయం. సుజాత పాత్ర నేటి విద్యార్థులకు ఆదర్శం.

హెలెన్ గాథను నాటకీకరణ ద్వారా సంభాషణ రూపంలో అందించడం నాకు చాలా బాగా నచ్చింది. పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఎప్పుడూ తరగతి గదిలోనే కాకుండా బయటి వాతావరణం, విషయాలు తెలుపవలసిన అవసరం ఎంతైనా వుందని తెలుపడమే కాకుండా, అంధుల లిపిని కూడా పరిచయం చేయడం చాలా చాలా హైలెట్. మొత్తంపై ఈ పుస్తకం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ప్రతి ఒక వ్యక్తి, చదువదగినదే. అయితే రఘురామయ్య అనే తండ్రి పాత్ర డిక్టేటర్ అయ్యింది. మొదట్లో అలా వుంచినా చివరికి పిల్లల నడవడిక ద్వారా తండ్రిలో మార్పు వచ్చేలా మలచి, తనతో కూడా హెలెన్ గురించి మాట్లాడించడమో, మంచిపని చేసేటపుడు భయపడవలసిన పని లేదనే
సందేశం ఇప్పించడమో చేసి వుంటే బాగుండేది.

పుస్తకం చూడడానికి చిన్నదిగా కనిపించినా క్వాలిటీపరంగా, పుస్తకం లోని విజ్ఞాన విలువ పరంగా చూస్తే రూ. 30.00 లు అనేది చాలా తక్కువ ఖరీదు. అన్ని విశాలాంధ్ర బుక్ హౌస్ ల లోనూ లభ్యమవుతుంది. పూర్తి వివరాలకు visalaandhraph@yahoo.com అనే ఈమెయుల్ మరియు అనే www.visalaandhraph.net వెబ్ సైట్ లోనూ సంప్రదించవచ్చును.

You Might Also Like

One Comment

  1. amarnath

    బహుశా 12-13 ఏళ్ళ వయసులో అనుకుంటాను చదివాను ఈ పుస్తకాన్ని (ఇదే పుస్తకమో, హెలెన్ కెల్లెర్ గురించి వెరీ పుస్తకమో కూడా సరిగా గుర్తు లేదు. కాని పరిచయం చూస్తే ఇదే అనిపిస్తోంది. )

    అనుకోకుండా ఇంట్లో కనిపించిన ఏదో పుస్తకం అని మొదలు పెట్టి, ఎంతో ఆశ్చర్యం తో చదివిన పుస్తకం. ఎంతో స్ఫూర్తివంతమైన జీవితం ఆమెది.

    ఈ పుస్తకం ఆ వయసులో చదవటం బహుశా అది ఒక అదృష్టం అయి వుంటుంది అనుకుంటాను. తరువాతి తరం పిల్లలు అందరికీ కూడా ఈ అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను.

Leave a Reply