Dublin Literary Pub Crawl: ఓ అరుదైన అనుభవం

పబ్ క్రాల్ అంటే?
పబ్ క్రాల్ అంటే కొంతమంది కలిసి ఒక గుంపుగా ఒకే రాత్రి చాలా పబ్‌లు, లేక బార్‌లలో తాగడం. ఒక పబ్ నుండి ఇంకో దానికి కాలినడకనో, బస్ ద్వారానో చేరుకోవడం. కొత్త స్నేహాలను ఏర్పర్చుకోడానికి, తెలియని ప్రదేశాల్లో పబ్‍లను పరిచయం చేసుకోడానికి ఇవి ఉపయోగపడతాయి.
లిటరరీ / మ్యూజికల్ / వగైరా పబ్ క్రాల్‍లంటే?
ఆటవిడుపు కోసం చేసే ఈ పబ్ క్రాల్‍లు ఒక్కోసారి థీమ్ ఆధారంగా కూడా నడుస్తాయి. ఉదాహరణకు, మ్యూజికల్ పబ్ క్రాల్‍లో సంగీతానికి పెద్దపీట వేసే పబ్‍ల గుండా క్రాల్ చేయడం, ఆ పబ్‍లో సంగీతపరంగా ఉండా ప్రత్యేకతలను తెల్సుకోవడం, పసందైన సంగీతాన్ని అక్కడే కూర్చోని వినడం లాంటివి ఉండచ్చు. అలానే, సాహిత్యానికి సంబంధించిన పబ్ క్రాల్‍లో, రచయితలకూ ఆయా పబ్‍లకూ ఉండే అనుబంధాన్ని తెల్సుకునే విధంగా ఉండచ్చు.
మరి డబ్లిన్ లిటరరీ పబ్ క్రాల్ ఎలా ఉంది?
బ్రహ్మాండంగా ఉంది. ఐరిష్ వాళ్ళు మద్యప్రియులు. ప్రస్తుతపు డబ్లిన్ నగరంలో దాదాపుగా ఎనిమిది వందల పబ్‍లు ఉన్నాయి. వాళ్ళు సాహిత్యప్రియులు కూడా. ప్రపంచపటంలో కనీకనిపించకుండా ఉండే ఈ బుల్లి దేశం నుండి వచ్చిన రచయితలు ప్రపంచ అబ్బురపోయేంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించారు. ఇక్కడ వీధులూ, వాడలూ, వంతెనలూ అన్నీ సాహిత్యానికి సంబంధించినవారి పేర్లతోనే ఉంటాయి.
మరి అటు మద్యపానానికి, ఇటు సాహిత్యానికి పెద్ద పీట వేసే డబ్లిన్‌లో లిటరరీ పబ్ క్రాల్ అంటే, పండుగే కదా!
అబ్బో.. ఇంతకీ ఏమేం తెలుస్తాయేంటి, ఈ క్రాల్‍కి వెళ్తే?
బోలెడన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి – డబ్లిన్ నగరం గురించి, ఐరిష్ సంస్కృతి గురించి, వారి మద్యం అందులో రకాలను గురించి, వారి రచయితల గురించి, ఆయా రచయితల మద్యపాన విశేషాల గురించి.
ఏ రచయిత ఏ కాలంలో ఏయే పబ్‍లను ఆశ్రయించాడు? ఏ రచయిత ఏ పబ్‍లను తన రచనలలో భాగం చేశాడు? అటు తర్వాత, ఆ రచయిత, ఆ రచన ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకున్నాయో తెల్సుకునే వీలు కల్పిస్తుంది.
నా మట్టుకు నాకు, బాగా తెల్సిన జేమ్స్ జాయిస్, ఆస్కర్ వైల్డ్, బ్రామ్ స్టోకర్లతో పాటు కొత్తగా కొద్ది మంది రచయితలు పరిచయమయ్యారు. “I’m a drinker with writing problems.” అన్న బ్రెడన్ బీన్‌ను త్వరలో చదవాలని నిశ్చయించుకున్నాను.
లిఖిత సాహిత్యం మాత్రమే కాకుండా, ఐరిష్ జనజీవన స్రవంతిలో భాగమై పోయిన అనేక పాటలు, పద్యాలు కూడా తెల్సుకున్నాను. వాళ్ళు తీసుకెళ్ళిన నాలుగు పబ్‍ల ఘన చరిత్రలు కూడా..
అవునూ.. ఇంతకీ ఇది ఎవరు నిర్వహిస్తారు?
ఓహ్.. అదే చెప్పలేదా నేను?!
Colm Quilligan అనే ఆయన మొదలు పెట్టినట్టున్నాడు ఈ పబ్ క్రాల్ ని. బీర్ కోసం డబ్బులు వస్తాయిగా అని సరదగా మొదలెట్టినా, ఇప్పుడు డబ్లిన్ టూరిజంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది ఈ ఈవెంట్.
కాలమ్‌లో మరో ఆక్టర్ కూడా ఉంటారు. మొదట డ్యూక్ పబ్ లో అందరూ సమావేశమయ్యాక, కార్యక్రమం మొదలవుతుంది. అక్కడ కార్యక్రమం ఏ విధంగా సాగబోతుందో కొంత వివరణ ఇచ్చి, మొదటగా “వెయిటింగ్ ఫర్ గోడో” నుండి కొన్ని సన్నివేశాలు నటించారు.
ఆ పై అక్కడ నుండి ట్రినిటి కాలెజి కాంపస్‍కు తీసుకెళ్ళారు. అక్కడ, ఆరుబయట చలిగాలిలో నించోబెట్టి ట్రినిటి ఎంత గొప్పగొప్ప రచయితలను అందించిందో చెప్పుకొచ్చి, ముఖ్యంగా ఆస్కర్ వైల్డ్ జీవితం గురించి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఒక పబ్‌కి తీసుకెళ్తారు. అక్కడో ఇరవై నిముషాల బ్రేక్. తాగడానికి. తినడానికి.
అది అయ్యాక, ఒకప్పటి పెద్ద చర్చ్, ఇప్పటి టూరిజం ఆఫీసు ముందు మళ్ళీ కొంత మంది ఐరిష్ రచయితల గురించి చెప్పి, వారి రచనల నేపధ్యాన్ని వివరించి, మరో నాటకంలో సన్నివేశాలను నట్టించారు. అప్పటి సాహిత్యంతో పాటు, అప్పటి ఐర్లాండ్ లో జీవన విధివిధానాలను కూడా పరిచయం చేశారు.
అక్కడి నుండి టెంపుల్ బార్‌లో మరో పబ్. మరిన్ని కబుర్లు. జేమ్స్ జాయిస్ గురించి.
చివరకి మొదలైన చోటే మళ్ళీ చేరుకున్నాం. వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు అడిగేసి..
ప్రశ్నలా?
ఊ.. అవును. మొదట్లోనే చెప్పారు, “ఎంత తాగడం మీదే మీరు శ్రద్ధపెట్టినా, మేం చెప్పేవాటి మీదా శ్రద్ధపెట్టండి. మిమల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం మధ్యమధ్యన. వాటిని చివర్లో మళ్ళీ అడుగుతాం. అప్పుడు ఎవరెన్ని ఎక్కువ సరైన సమాధానాలు చెప్తే వాళ్ళకి మా డబ్లిన్ పబ్ క్రాల్ చొక్కా బహుమతిగా ఇస్తామని?”
అలానే అడిగారు. మా గుంపులో జర్మనీ అమ్మాయి అత్యధిక మెజారిటీతో చొక్కా కొట్టేసింది.
Sounds fun?!
It is FUN!
కొంత డ్రింక్స్. బోలెడంత సాహిత్యం. ఇంకెన్నో కబుర్లు. మరెన్నో నవ్వులు. కొత్త పరిచయాలు. చలిగాలులు వీస్తున్న రాత్రుల్లో, వెచ్చగా ఉండడానికి ఇవి బ్రహ్మాండంగా పనికొస్తాయి.
తాగడమా? అపచారం.. అపచారం..
ముందే చెప్పినట్టుగా, వాళ్ళ సంస్కృతిలో మద్యం, సాహిత్యం కల్సిపోయున్నాయి. మద్యాన్ని దూరం పెట్టే మనం వెళ్ళినప్పుడు మాత్రం, మనల్ని ఇబ్బంది పెట్టేలా వాళ్ళేమీ చేయరు. మీకు డ్రింక్స్ పై ఆసక్తి లేకపోతే, నాలా తక్కిన కార్యక్రమాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు. టికెట్ ధరలో డ్రింక్స్ ఏమీ included కాదు. కట్టేసిన డబ్బులకు న్యాయం చేయాలన్న అనవసరపు ఒత్తిడి కూడా లేదు.
అలానే, నాకులా పబ్‌లలో వచ్చే వాసన పడక, తాగుతున్న వాళ్ళ మధ్య కూర్చోడానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఆ పావుగంట-ఇరవై నిముషాలు బయటకొచ్చి నిలబడొచ్చు. ఇంకేదో పని చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పిన చోటుకు, చెప్పిన సమయానికి వస్తే చాలు.
డ్రింక్స్ ని మైనస్ చేసినా ఇదో అరుదైన అనుభవాన్ని ఇచ్చిందని నేను చెప్పగలను.
వివరాలు…
Few Photos
[portfolio_slideshow size=large include=”17603,17607,17608,17609,17610,17611,17612,17613,17615,17616,17617,17618,17619,17620,17621,17622,17624,17625,17627,17629,17630,17631,17632″ click=advance showcaps=true showtitles=true showdesc=true pagerpos=disabled]
Leave a Reply