The Skin of Water: G.S.Johnston

ఓ ప్రాంతం / ఊరు గురించి తెల్సుకోడానికి కాల్పనిక సాహిత్యాన్ని ఆశ్రయించడం ఎంత వరకూ సబబు అన్న ప్రశ్నకు సాధారణంగా వచ్చే సమాధానం గురించి నాకు తెలీదు. నేను మాత్రం, హంగారీ దేశ రాజధాని బుడాపెస్ట్ కు వెళ్ళేముందు,  ఆ నగరంలో నడిచిన నవలంటూ పేరొందిన ఈ నవలను ఎంచుకున్నాను. దానికి తోడు అమెజాన్ కిండిల్‍లో సులభంగా దొరకడంతో, చదవడం కూడా సాధ్యపడింది.

నవలలోని కథ క్లుప్తంగా: కథ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల నాటిది. అప్పటికి బుడాపెస్ట్ neutralగా ఉంటుంది యుద్ధంలో. అందుకని, పక్కదేశాలతో పోల్చుకుంటే అక్కడ మారణహోమం అంతగా లేదు. అలాంటి సమయాల్లో, బుడాపెస్ట్ కు దూరంగా ఒక హోటెల్లో పనిచేసే ’జీనో’ అనే టీనేజర్‍కు ఒక ధనికురాలు పరిచయమవుతుంది. సినిమాల్లో పనిచేయాలనే కోరిక బలంగా ఉన్న, జీనోకు ఆ యువతి భర్త తమ భవంతిలో నౌకరుగా ఉద్యోగం ఇస్తాడు. ఆ ఉద్యోగంలో కుదురుకున్న జీనోకి, ఆ యువతికి పరిచయం ముదిరి, అక్రమ సంబంధం రూపుదాల్చుతుంది. ఆమె గర్భవతి అవుతుంది. అదే సమయంలో బుడాపెస్ట్ పై దాడులు మొదలవుతాయి. నాజీ సైన్యం నగరాన్ని ఆక్రమించుకొని, యూదులను చిత్రహింసలు పెట్టబోతున్నారని వార్తలు ఊరంతటా పాకుతాయి. అప్పుడే, తనతో సంబంధం ఉన్న ఆమె jew అని తెలుస్తుంది. ఇంట్లోనూ, మరెవరికీ తెలీకుండా ఊరి వదలి, యుద్ధంలేని ప్రాంతాలకి పారిపోయి, తమ బిడ్డను కాపాడుకోవాలని ఆ ఇద్దరు ప్రేమికులూ నిశ్చయించుకుంటారు. వాళ్ళు రహస్యంగా కల్సుకునే మరో ఇంటిలో కల్సుకోవాలని పథకం సిద్ధం చేసుకుంటారు. వాళ్ళు ఆ ఇంట్లో అనుకున్నట్టే కలుసుకున్నారా? అనుకున్న ప్రకారం తప్పించుకున్నారా? అన్నది తక్కిన కథాంశం.

కథంతా ఒక తాటిమీద నడుస్తూ, నడుస్తూ, ఒక్కసారిగా ఒక్క మలుపు తీసుకొని మొత్తంగా సీన్నే మార్చేస్తుంది. ఇలాంటి మలుపులు కొంచెం వేగంగా ఆలోచించేవారికి మామూలుగా అనిపించచ్చేమో కానీ, నేను మాత్రం తెగ ఆశ్చర్యపోయాను. ఆ మలుపు తర్వాత జరిగిన కథ మొత్తం మళ్ళీ కొత్తగా అర్థంచేసుకోవాల్సి ఉంటుంది. అప్పటివరకూ అమాయకంగా కనిపించినవారిలో ఎంత selfishness ఉందో అర్థమవుతుంది. అలాంటి మలుపు. అయితే, ఈ కథకు ఈ మలుపు అంతగా అవసరం పడలేదనే అనిపించింది నాకు. నాజీలలో కూడా అవినీతి ఉండేదని, వాళ్ళని మచ్చిక చేసుకొని కొంతమంది rich jews, వాళ్ళ సాయంతోనే సురక్షిత ప్రదేశాలకు వెళ్ళారని వచ్చిన వార్తలు, సంఘటనలను ఆధారంగా చేసుకొని రాసిన నవల కాబట్టి, ఈ మలుపు పెట్టాల్సి వచ్చిందనుకుంటా రచయితకు.

కానీ, నాకు మాత్రం, ఈ కథలో అన్నింటికన్నా నచ్చింది యుద్ధ సమయంలో బుడాపెస్ట్ ను వర్ణించిన విధానం. యుద్ధ ఛాయలింకా రాకముందు నగర వీధులని పరిచయం చేసి, అవే వీధులు యుద్ధం తీవ్రమయ్యాక, ఎంత భయంకరంగా మారిపోయాయో బాగా చూపించారు. అప్పటివరకూ ముఖ్యపాత్రలతో పాటు నేను కూడా ఆ వీధుల్లోనే తిరుగుతున్నట్టు అనిపించింది. ఆ వెంటనే నాజీల వల్ల వాళ్ళకి ఎదురవుతున్న constraints నాకూ ఎదురవుతున్న భావన కలిగింది. అది ఈ పుస్తకానికి హైలైట్. నాజీల అకృత్యాలను కూడా విపులంగా వర్ణించారు. పట్టుబడినవారికి నాజీలు ఏయే రకాలుగా చిత్రహింసలు పెట్టారో, ఎంత మారణహోమం సృష్టించారో తెల్సుకునే వీలు కలిపిస్తుంది.

నేను బుడాపెస్ట్ కి వెళ్ళి, ప్రశాంతంగా ప్రవహిస్తున్న డాన్యూబ్ నది ఒడ్డున ఉన్న క్షణాల్లో, ఈ నవలలో నాజీలు దొరికినవారి దొరికినట్టు చంపేయడంతో డాన్యూబ్ నది ఎర్రగా మారిపోయిందన్న వర్ణన గుర్తుకు వస్తూనే ఉంది. బుడాపెస్ట్ చరిత్ర తిరగేస్తే, రెండో ప్రపంచ యుద్ధంలో వారి పరిస్థితేంటో తెలుస్తుంది. కానీ, ఆ కాలంలో, ఆ ప్రదేశంలో జరిగిన కథను – అది కాల్పనికమే అయినా – చెప్పుకొస్తే, అది కొన్ని universal emotions బయటకు వచ్చి, వాటిని empathize చేసుకునే వీలు కలిపిస్తుంది. Power of story telling అంటే అదేనేమో. కళ్ళముందు ప్రశాంతమైన డాన్యూబ్ కనిపిస్తున్న, ఒకప్పటి రక్తసిక్తమై ఎర్రగా మారినా డాన్యూబ్‍ను కళ్ళముందు ఉంచగలిగేది సాహిత్యమే అనుకుంటాను.

ఈ కథకు శృంగారం చాలా కీలకం. ముఖ్యంగా చివర్లో వచ్చే మలుపుకు. కానీ, దాన్ని కొంచెం మోతాదు మించి రాశారనిపించింది నాకు. మరి అంతటి వర్ణనలు అనవసరం కథకు. అయితే, ఆ ఒక్క కారణం చేత ఈ నవలను తప్పుబట్టలేం. ఇది చక్కగా రాయబడ్డ నవల. వచనం బాగుంటుంది. కథనం కూడా చాలా వరకూ బాగుంటుంది.

బుడాపెస్ట్ కు వెళ్ళే ముందు చదవాల్సిన పుస్తకమా? అంటే చెప్పలేనుగానీ, ఎప్పుడో ఒకప్పుడు చదువుకోదగ్గ పుస్తకం.  ముఖ్యంగా, రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన నవలలు చదివే ఆసక్తి ఉంటే, తప్పక పరిగణించాల్సిన రచన. నాజీలలో అవినీతి, దాన్ని ఎవరు ఎలా వాడుకున్నారు, ఎవరు బలైపోయారు అన్నది చక్కగా చూపిస్తుంది ఈ రచన.

 

The Skin of Water
G.S.Johnston
Fiction
Paperback
296

You Might Also Like

Leave a Reply