యోగ వాసిష్టము.

వ్యాసకర్త: రాఘవేంద్రముందు నా సోది కొంత.
“నిరుక్తం చదవాలనుంది.”అన్న భావన మరింత బలపడింది.
“కాకతాళీయం” పద  భావార్థాల్లో ఒకటి మాత్రమే అప్పటిదాకా తెలుసునన్నది అర్థమయ్యేప్పటికి.
(కాకము (కాకి) తాళ వృక్షం మీద రాలిన క్షణమే తాళఫలము (తాటిపండు) విరిగి పడటం అట కాకతాళీయం. ఎన్ని సార్లు ఉదహరిస్తారో ఈ ఘటనను ఈ పుస్తకంలో).పరిచయము.
ముప్పది రెండు వేల పద్యాలతో ప్రకాశించే తాత్విక గ్రంధం. వాల్మీకి కృతం. ఇరవది నాలుగు వేల పద్యాలుగల వాల్మీక రామాయణం కంటే “సాధకునికి” వెయ్యి రెట్లు ఉపయుక్త గ్రంధం. “చిన్న పిల్లాడు చెప్పినా అది నిజమనిపిస్తే పాటించి తీరాలిసిందే. బ్రహ్మ విరచితమైనా తార్కికతకూ, సత్యానికి సంబంధం లేనట్లనిపిస్తే తృణప్రాయమే”నని ఎలుగెత్తే గ్రంధం.

స్వామి వెంకటేశానంద – ఆంగ్ల అనువాదకర్త – తన ముందుమాటలో అంటారు – పండితులు ఈ గ్రంధ రచయిత గూర్చి,  దేశ కాలమాన పరిస్థుతుల గూర్చి చాలా పరిశోధన చేస్తున్నారు. వారిని దేవుడు చల్లగా చూడు గాక”. అని. నిజమే. ఫలాలనుభవించటమే కాని చెట్టు నాటిన వానితో ఏమి పని?

మధ్యలో నా సోది మరికొంత 🙂
ధర్మమూ, న్యాయమూ ఇవి రెండూ సత్య దూరాలు కావు.
మనసున్న మనిషికి.
సత్యమెన్నటికీ తాత్వికతకు దగ్గరి చుట్టమే.
సత్యసోధనంటూ మొదలిడితే తాత్వికులవక మానరు.
తాత్వికతకూ హైందవానికీ ఏదో అవినాభావ సంబంధం.
హైందవమంటే …..వద్దులెండి.
“ఆకాసము నీలంగా ఉంటుంది అన్నది సత్యదూరము. కాని అది అలా ఎందుకనిపిస్తుంది అని తలబద్దలు కొట్టుకోరు పెద్దలు. అనవసరమైన దాని వాటి మీద దృష్టి పోవకపవటమే సాధన” అన్న పద్యం కూడ ఇందులోనే ఉంది.

అసలు సంగతి
పదహారేళ్ళ రామునికి దేశాటనలో వైరాగ్యం కలిగి ఇహలోకపు దృష్టిలో “కృంగి కృశించి”పోతున్న వేళ వచ్చిన విశ్వామిత్రుడు ఖర దూషణుల బారినుండి తన యఙ్ఞశాలను రక్షించేందుకు రాముని పంపమని అర్థించిన సందర్భంలో, కులగురువు వసిష్టుని నోట ప్రవచించబడిన ఈ ముప్పది రెండు వేల పద్యాల ఆత్మ ఙ్ఞాన ఆత్మ బోధా ….తరవాత రామ ఆయనానికి పునాది అయ్యింది అనుకోవచ్చు.

వైరాగ్య ప్రకరణంలో -రాముని వైరాగ్య ప్రకటన శ్లోకాలూ
ముముక్షు వ్యవహార ప్రకరణంలో – సాధకుని ప్రవర్తన సోదాహరణంగానూ
ఉత్పత్తి, స్థితి, పూశమన ప్రకరణాల్లో – జన్మ, జీవిక, మరణాల తాత్వికత సంబంధకాలూ
నిర్వాణ ప్రకరణంలో -మోక్షానికి సంబంధించినవీ
ఇలా ఆరు ప్రకరణాలుగా విభజింపబడ్డాయి.

ఎవరికి ఉపయోగపడొచ్చు?
సాధనలో ఇప్పటికే ఉన్నవారికి మాత్రమే రుచించే పుస్తకం. కాళిదాసు తాళపత్ర గ్రంధాలను “సాధించినట్టు” కాకుండా ఉండాలంటే “ఇది పూర్తిగా ముక్తుడికీ, పూర్తి వైముక్యుడికీ…ఇద్దరికీ చదవనర్హతలేని గ్రంధం”అన్న స్వయం ప్రకటనను గౌరవింపకతప్పదేమో.

నడిచే మార్గమేది?
“ఆడవారిని, విధవలనూ చూడను వారి పాదాలు మాత్రమే చూస్తాను” దగ్గరనుంచి ముందుకు సాగలేని స్వామిగార్ల అద్వైతాన్ని మించిన ద్వైతాద్వైత రహిత ఏకత్వం “నిరూపింప”బడుతుంది. హైందవంలో ప్రత్యక్ష, అనుమాన, శృతి అన్న మూడురకాల ప్రమాణాలు అన్న ఆర్యోక్తినే పాటిస్తూ. కాపోతే గుడ్డి నమ్మకానికి ఎక్కడా విలువనివ్వదు. ప్రత్యక్షానుభవానికి మాత్రమే తావు అంటుంది.

చెక్కని పాలరాయి అందులోని శిల్పమూ
మట్టికుండలోని గాలి, దాని చుట్టూ ఉన్న గాలి
స్వర్ణాభరణమూ, స్వర్ణమూ
సముద్రమూ అందులోని అలలూ
కాకమూ తళీయమూ
పగిలిన అద్దమూ -ప్రతిబింబాలూ

ఇలా దైనందిన వస్తువులలోనే వాటి అనిత్యతనూ, వాటి అష్తిత్వ రాహిత్యాన్నీ- నిరూపిస్తారు అనటంకంటే – ఆలోచనలు రేకెత్తించి -ఇక పయినించుపో అనేస్తారు -అనటం సబబేమో.

ప్రత్యక్షానుభవం కాని సాధనేదీ ఫలితమివ్వదు.
అనిపిస్తుంది,
ఇప్పటికి.
ఆ మార్గంలో ఉండి, మార్గదర్శకత్వం కావాలనుకుంటే.
చదవండి.

నాకు దొరికిన మూడు రిఫరెన్సెస్

1. The Supreme Yoga – A new translation fo Yoga VaaSishTa

by Swami venkaTESaananda

New Age Books

nab@newagebooksindia.com

2. ఎనిమిది సంపుటాల పుస్తక భండాగారము
కేవలము ఎనిమిది వందల రూపాయలు మాత్రమే
పునర్ముద్రించమని అభ్యర్తించవలసిన వారు
సంపాదకులూ ప్రకాశకులు
శ్రీ వ్యాసశ్రమము
ఏర్పేడు, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా

Ph-0091-8574-68528

3. యోగ వాసిష్ట రత్నాకరము
శ్రీ శుక బ్రహ్మాశ్రమము
శ్రీకాళహస్తి

ph-0091-8578-222239

You Might Also Like

Leave a Reply