పేరుకే “ఆషామాషీ”

aashamaashi1

రావూరు వెంకట సత్యనారాయణగారంటే తెలిసినవారు ఇప్పటి యువతరంలో అరుదు. కానీ గత ఏడవ, ఎనిమిదవ దశకాల్లో పత్రికాపాఠకులకి ఆయన సుపరిచితుడే. ఆయన తన చివరి రోజుల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి మీద “అన్నిట నీవెరా !”అనే పేరుతో ఒక శతకం కూడా రచించారు. ఆయన సాహితీకీర్తికి ఎత్తిన పతాకమై నిలిచిన రచన “ఆషామాషీ”. ఇది నిజానికి మొదట్లో పుస్తకంగావెలువడినది కాదు. ఆనాటి ఆంధ్రప్రభ దినపత్రికలో “ఆషామాషీ” శీర్షికన అడపాదడపా ఒక వ్యాసం చొప్పున చాలా సంవత్సరాల పాటు వచ్చింది. ఆ వ్యాసాలన్నింటినీ కలిపి భాషాకుటీరం సంస్థ తరఫున వారి కుమార్తె మఱియు ప్రముఖ బ్లాగరి శ్రీమతి టి.జ్ఞానప్రసూనాంబగారు ఇటీవలే ఒక ముచ్చటైన సంకలనంగా వెలువరించారు.

కాలక్షేపం బటాణీల్లా కనిపించే ఈ వ్యాసాల్లో రావూరువారు ఎంతో లోకానుభవాన్ని, పరిశీలననీ రంగరించి సమకాలీన సమాజాన్ని, మనుషుల మనస్తత్త్వాన్నీ, ధోరణుల్ని హాస్యస్ఫోరకంగా, వినోదంగా మనముందు పెట్టిన విధానం అబ్బురపఱుస్తుంది. కొన్ని వ్యాసాలు చదువుతూంటే ఇవి వ్యావహారికంలో రాసిన “సాక్షి” వ్యాసాలా ? అనిపిస్తుంది. వీటి ద్వారా ఒక ముప్ఫై – నలభయ్యేళ్ళనాటి ప్రశాంతమైన ఆంధ్రదేశం, అందులోని మధ్యతరగతివారి జీవనశైలి, మాటతీరు, వారి కుటుంబజీవితం ఎంతో ఆహ్లాదకరంగా మనల్ని పలకరిస్తాయి.

మచ్చుకు కొన్ని మీగడ తఱకలు :

౧. మొన్న ఒక బంధువులింటికి వెళ్ళాం. ఆ ఇల్లాలికి యాభై ఏళ్ళుంటాయి. ఏదో మాట్లాడుతుండగా, మధ్యలో కల్పించుకుని “మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతా చెప్పండి. తేనెమనసులు బాగుందా ? కన్నెమనసులా ? మీరు సరిగ్గా చెప్పాలి” అంది. “ఏదో నా మనసు బాగుండక మీ ఇంటికొచ్చాను. ఈ మనసుల సంగతి నన్నడిగితే ఎలాగండి” అన్నాను. “అలా కాదు,. మీరు చెప్పి తీరాలి. దాన్తో ఒక పని ఉంది.” అని ఆమె బలవంతం చేసింది. “ఈ వయస్సులో ఆ మనసుల సంగతేం తెలుస్తుందమ్మా ?” అన్నాను. “మీరు నిజం చెప్పడంలేదు. ఏదో వేదాంతం చెబుతున్నారు. అసలు అభిప్రాయం చెప్పండి.” అన్నదామె. ఆమె మనసులో కన్నెమనసులు ఉండి ఉంటుందని గ్రహించి అదే చెప్పాను. ఆవిడ శాంతారాం ఝనక్‌ఝనక్ పాయల్ బాజే లో సంధ్య నృత్యం చేసినట్లు ఎగిరి గంతులు వేసి గిరగిరా తిరిగి తాళయుక్తంగా చప్పట్లు కొట్టి “నిజం, నిజం, మీ మాట నిజం….అంతా నిజం – అదే నిజం” అంటూ పాటకచేరీ అయిపోయే ముందు జానపదగేయం వాయిస్తూ ఫిడేలు మీద ముక్తాయింపులు ఇచ్చినట్లు ఇచ్చింది. (పెదవులపై పువ్వులు)

౨. “ఒకసారి విజయవాడలో రిక్షా ఎక్కి బంధువుల ఇంటికి వెళ్ళాను. రిక్షాదారుని వద్ద రూపాయి చిల్లర లేకపోయింది. పోనీ ఇంట్లో వారిని అడిగి చిల్లర తీసుకుందామని గృహిణిని “ఒక రూపాయి చిల్లర ఉందా అమ్మా ?” అన్నాను. ఇక చూడండి…నస…పావుగంట దాటింది. నాకు విసుగెత్తిపోయింది. బయట రిక్షావాడు నిలబడి ఉన్నాడు. మచ్చుకోసం ఆవిడ పుల్లవిరుపులు: “చిల్లరా ? రూపాయి చిల్లరా ? ఆ రోజులెప్పుడో పోయాయి. ఎలా వచ్చాయో ఎలా పోయాయో అలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అర్ధాంగిని గదా అని పిలిచి ఆయన పావలా చేతిలో పెట్టరు. అలానన్నా చేస్తే నాలుగు పావలాలు దాద్దును. రూపాయి చేద్దును. మీబోటివారు చిల్లర ఉందా ? అన్నప్పుడు గబగబా తీసి ఇద్దును. ఆయనగారికి ముద్దూ లేదు, బుద్ధీ లేదు. చిల్లర నేనెక్కడ ఇవ్వను ? మాట నేనెక్కడ దక్కించుకోను ? పావలా దాకా దేనికి బాబాయి ?…పదిపైసలు చూసి ఎన్నాళ్ళయిందో ….మీరు పొద్దున్నే వచ్చారు. అబద్ధమెందుకు చెప్పాలని నిజం చెబుతున్నా…మొన్న అర్దరూపాయి ముగ్గు కొనడానికి పెద్ద రాద్ధాంతమైంది. అసలారోజుతో తెగతెంపులన్నట్లు మాట్లాడారు.” ఇలా నడిచింది ధోరణి. అక్కడితో నేను బయటికి వెళ్ళి మళ్ళీ ఆ రిక్షాలోనే ఎక్కి ఇంటికి చేరాను. అవును మరి, ఆవిడ మాటలకు దిమ్మతిరిగిపోయింది. నెమ్మదిగా నడిచి వద్దామన్నా వీల్లేకపోయింది. మెదడు కుదుటబడ్డానికి ఒక పూట పట్టింది. ఆవిడ పేర ఎంతో డబ్బుంది బ్యాంకులో…ఇంట్లోనూ తక్కువగా ఉండదు. కాని అలా పిల్లికూతలు కూస్తుంది, సొమ్ము మాటెత్తితే ! బిచ్చం కోసం తిరిగితిరిగి ఖాళీబొచ్చెతో ఇంటికి అప్పుడే తిరిగివచ్చినట్లు ఉసూరుమంటుంది. (పుల్లవిరుపులు – పిల్లికూతలు)

౩. ఎండలు ఎంతవాణ్ణయినా నుంచోపెట్టి ఎడాపెడా లెంపలు వాయిస్తున్నాయి. నీ తాతతో చెప్పుకోమంటున్నాయి. ఏ తాతతో చెప్పుకుంటారు ? అందరికీ ఒకడే తాత….ఆయనతో చెప్పుకుంటున్నారు. జాతకాలు తెలిపిన తాత వాటి ప్రకారం కార్యక్రమాలు నడుపుతున్నాడు. అదేం విచిత్రమో, ఈ మండుటెండల్లోనే మమకారం, బంధుప్రీతి, అన్యోన్యత అన్నీ ఒకసారి ముప్పేటగా బయలుదేరతాయి కొందరి హృదయాలలో. బంధుదర్శనంలో కల చల్లదనాన్ని పోగొట్టి చెండ్రనిప్పులు చెరిగిపోస్తాయి ఈ హటాత్ దర్శనాలు. అన్ని ఋతువులలో కంటే ఈ గ్రీష్మఋతువులోనే బంధుసాక్షాత్కారం ఎక్కువగా ఉంటుంది….వయస్సు వాల్లభ్యం అంటూ లేదు….అన్ని మజిలీలలో వాళ్ళు బయలుదేరతారు. ఒకామె వచ్చి “అన్నయ్యా ! నిన్ను చూడాలని బెంగపుట్టింది. నగరంలోకి వచ్చాను. నలుగురినీ చూడందే ఎలా వెళ్ళను ? ఒక్కొక్క రోజన్నా ఉండాలా ? వద్దా ? ఆట్టే రోజులుండే అవకాశం లేదు. అక్కడ ఆయన ఒక్కరే ఉంటారు. వండుకోవడం అలవాటేననుకో….అయినా ఆడది లేని సంసారం ఎలా ఉంటుంది ? ఇక వెళ్ళిపోతా ఉండను….మహా ఉంటే ఇంకో పదిరోజులు….తొలకరికి ఇల్లు చేరాలి లేకపోతే బాగుండదు. ఏమంటావు ?” అని ప్రశ్న. (వడగాడ్పులు – వంశవృక్షాలు)

ఇలా సాగిపోయే సత్యనారాయణగారి కబుర్లు మరో లోకంలో మనల్ని విహరింప జేస్తాయి. భాషలో సరళత్వం, విషయాల విశ్వజనీనత్వం, అభివ్యక్తిలో దాపఱికాలు లేని సూటిదనం, ఇజాల భేషజాలు లేని సంసారపక్ష ధోరణి – ఇవన్నీ కలిసి “ఆషామాషీ”ని ఒక సాహితీకళాఖండంగా తీర్చిదిద్దాయి. చదువుతూ ఉంటే ఎప్పుడు అవతలి అట్టకి చేరుకున్నామో మనకే తెలియదు. “అప్పుడే అయిపోయిందా ?” అనిపించి నిరాశోపహతులమవుతాం. కబుర్లకి సైతం కావ్యగౌరవాన్ని సంపాదించి పెట్టిన ఈ సంకలనాన్ని చదవడం పూర్తిచేశాక మనలో అంకురించే భావం – “కబుర్లు కూడా ఇలా రాయడం సామాన్యమైన విషయం కాదు” అని !

(ఆషామాషీ (Ashamashi); రచన – కీ.శే. రావూరు వెంకట సత్యనారాయణ (Ravuru Venkata Satyanarayana) ; 160 పుటలు ; వెల – రు. 30 ; ప్రచురణ – భాషాకుటీరం ; ప్రతులకు – శ్రీమతి టి. జ్ఞానప్రసూనాంబ, 208, కదం టవర్స్, అశోక్‌నగర్, హైదరాబాద్ – 20)

You Might Also Like

4 Comments

  1. jampaala caudari

    నా చిన్నతనంలో ఆంధ్రప్రభ దినపత్రికలో రావూరిగారి ఆషామాషీ చదవటం నాకు ఇష్టమైన పనులలో ఒకటి. ఆరోజుల్లో ఆయనను నేను ఒక్క హాస్య రచయితగానే భావించేవాణ్ణి. ఆయన బహుముఖ ప్రతిభ గురించి తర్వాతెప్పుడో తెలిసింది. ఈ పుస్తకం అందుబాటులో ఉందంటే ఆనందంగా ఉంది.

  2. lalithasravanthi

    ఈ పుస్తకం ఎక్కడ అమ్ముతారండీ ?

  3. నెటిజన్

    మొన్న ఇ – తెలుగు పుస్తక ప్రదర్శనకి వచ్చింది రావురి గారి అమ్మాయా? భలే గుర్తు చేసారు. మంచి పుస్తకం. మళ్ళీ బయటకు తీసి చదవాలి. కాని “సాక్షి” వ్యాసాలకి – “ఆషామాషి” కి పోలిక లేదండి, తాబాసు గారు!

Leave a Reply