పుస్తకం
All about booksఅనువాదాలు

May 20, 2014

A Doll’s House: Henrik Ibsen

More articles by »
Written by: Purnima
Tags: ,
ముళ్ళపూడిగారికి ఇష్టమైన రచయితలు తెల్సుకోడానికి ప్రయత్నించినప్పుడు తెల్సిన రచయితల్లో ఒకరు ఇబ్సెన్. ఆయన రాసిన అన్నింటిలోకి బాగా ప్రాచుర్యం పొందిన A Doll’s House, ఓ రెండు, మూడేళ్ళ క్రితమే చదివాను. పోయిన వారమెందుకో, ఆ నాటకం మళ్ళీ గుర్తొచ్చింది. అందుకని మళ్ళీ చదివాను.

నాటకం మొదలయ్యేసరికి ఇది ఒక అనోన్య జంట గురించిన కథ అని అర్థమవుతుంది. వాళ్ళ అన్యోన్యతకు చిహ్నంగా పిల్లలు. ఆర్థికంగా కష్టాల కడలి ఈది, గట్టుకు చేరుకొని అప్పుడప్పుడే సేద తీరుతున్నారు. అతడికి అప్పుడే ఒక బాంక్‍లో మానేజర్‍గా ప్రమోషన్ వచ్చి ఉంటుంది. ఆమెను అతడు “డబ్బులు దుబారా చేయకు” అని నవ్వుతూనే హెచ్చరిస్తుంటాడు. అతడు ఇచ్చిన డబ్బులో చాలా వరకూ డబ్బును పాత బాకీ ఒకటిని తీర్చడానికి ఉపయోగిస్తుంది. అతడు ఏవో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని ఉన్నప్పుడు, తన తండ్రి సాయం చేశాడంటూ అతడిని నమ్మించి, ఆమె డబ్బు సమకూరుస్తుంది. నిజానికి, అది ఆమె చేసిన అప్పు. ఆ విషయాన్ని అతడి దగ్గర దాస్తుంది. భర్త చనిపోయి,  తోడూ-నీడా లేని తన చిన్ననాటి స్నేహితురాలు తన ఇంటికి వచ్చినప్పుడు, ఈ రహస్యాన్ని చెప్తుంది. అతడిని ఆర్థకంగా కాపాడుకున్నది తానేనని మురిసిపోతుంది. అతడితో చెప్పి, ఆ స్నేహితురాలికి ఉద్యోగం ఇప్పిస్తుంది.

స్నేహితురాలికి ఏ ఉద్యోగమైతే వచ్చిందో, ఆ ఉద్యోగంలో అంతకుముందున్నవాడు ఒక లాయర్. అతడికి చిన్ననాటి స్నేహితుడు్. అన్నింటికీ మించి, ఆమెకు అప్పు ఇచ్చినవాడు. తన ఉద్యోగం వేరొకరికి ఇచ్చేస్తుండడంతో అతడికి కోపం, అక్కస్సు. అదంతా ఆమెపై చూపిస్తాడు. తండ్రి ఆఖరి రోజుల్లో డబ్బు పరంగా సాయం అర్థించలేక, కనీసం సాక్షి సంతకాలు పెట్టమని అడగలేక తండ్రి సంతకాన్ని ఆమే పెట్టేస్తుంది. ఆ “ఫొర్జరీ”ను కనిపెట్టిన అప్పిచ్చిన వాడు, ఆ సంగతంతా మర్యాదస్తుడూ, పరువుకి పాణం పెట్టేవాడైన ఆమె భర్తకు చెప్పేస్తానని బెదరిస్తాడు. ఆ బెదిరింపులకు లొంగి, ఆ బాకీ ఉన్న వాడిని ఉద్యోగంలోకి మళ్ళీ తీసుకోమని భర్త దగ్గర పోరుబెడుతుంది. అతడు పెడచెవినపెడతాడు, ఆమె మాటలను. ఉద్యోగం ఊడిపోవడంతో ఆవేశంలో ఆమె దొంగసంతకాల గురించి మొత్తం సంగతి ఉత్తరం రాసేసి భర్తకు పంపిస్తాడు. అవి క్రిస్మమస్ రోజులు కావటంలో పార్టీలో బిజి ఉన్నఅతడు, రాత్రెప్పుడో ఆ ఉత్తరం చదువుతాడు. చదవగానే అగ్గిమీద గుగ్గిలమవుతాడు. అప్పుడే మరో ఉత్తరం వస్తుంది. అందులో ఆమె దొంగసంతకాలు పెట్టిన కాగితాలు ఉంటాయి. దానితో అతడు క్షణం క్రితం జరిగినదంతా మర్చిపోతాడు. కానీ, ఆమె మర్చిపోదు. ఆమెను దొంగగా, మోసగత్తెగా అభివర్ణించి, ఆమె తన పిల్లలను పెంచడానికి కూడా పనికిరాదని అన్న అతడికి అవే మాటలు గుర్తుచేస్తుంది. చేసి, తన అవసరం ఆ ఇంటికి, అతడికి, ఆ పిల్లలకి లేదు కాబట్టి, ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరమూ తనకి లేదంటూ, ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది, తలుపు దభాలున వేస్తూ.

భర్త కష్టం తన కష్టమనుకొని, అతడి సమస్యకు తానే పరిష్కారమై, ఒళ్ళు హూనమయ్యేలా చిన్నాచితకా పనులు చేస్తూ, చిల్లర పోగేస్తూ, సంసారం నడపడానికి అతడిచ్చిన డబ్బుల్లో పైసాపైసా కూడబెట్టి, అలా కూడిన డబ్బులతో అతడికోసం చేసిన అప్పును తీరుస్తూ వచ్చిన భార్య ప్రేమను గానీ, శ్రమను గానీ క్షణం పాటైనా అర్థం చేసుకోకుండా, ఆమెను నోటికొచ్చినట్లు మాటలు అని, ఆమె చేసిన పొరపాటు / తప్పు వల్ల ఒరిగే నష్టం ఏం లేదని తెలిసీ తెలియగానే ఆమె చేసినదంతా మర్చిపోయే భర్తను, అతడి ఇంటిని వదిలివేయడంతో ఈ నాటకం ముగుస్తుంది కాబట్టి, దీన్ని స్త్రీ-ఆమె హక్కులు అన్న దృష్టికోణంలో నుండి చూడవచ్చు. బహుశా, చాలా మంది అలానే చూస్తారనుకుంటాను. కానీ, ఇది కేవలం స్త్రీలు, వారి హక్కులో లేక వాళ్ళ స్వేచ్ఛను గురించి మాత్రమే అని నాకు అనిపించలేదు.

ఫిక్షన్ అనేది కేవలం పుస్తకాల్లో దొరికేది మాత్రమే కాదు. మన జీవితాల్లో అంతర్భాగం. “అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం – ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం”లో cynicism తారాస్థాయిలో ఉందనిపించినా, ఎంతో కొంత నిజమే కదా? బంధాల చుట్టూ అల్లుకున్న కలలు కల్లలే అని తెల్సినప్పుడు, ఆడైనా, మగ అయినా, దాన్ని నుండి బయటపడాలనుకోవడం ఎంత సహజమో ఈ నాటకం తెలియ చెప్తుందని నా అనుకోలు. ఇందులో భార్య తన భర్త కోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడే మనిషి. అతడికి సాయపడే తాపత్రయంలో ఆమె నేరాలూ, ఘోరాలూ చేసినా కూడా, అవి చేయడానికి ఆమెకు ఉన్న కారణాలు పరిగణలోకి తీసుకోవాలని ఆమె అభిప్రాయం. [“According to it* a woman has no right to spare her old dying father, or to save her husband’s life. I can’t believe that.”] (it = the law)

అలా తీసుకోని చట్టాల దృష్టిలో, ఆ చట్టాలకు విలువనిచ్చే వారి దృష్టిలో ఆమె నేరస్థురాలే అయినా, తన దృష్టిలో మాత్రం కాదు. అయితే, ఇంత త్యాగం ఆమె ఏ ప్రతిఫలం ఆశించకుండా చేసిందా? అంటే, అదీ అనుమానమే! తన భర్తకు ఈ అప్పు సంగతంతా ఎప్పుడు చెప్పేది, తన స్నేహితురాలితో చెప్తూ, ఇలా అంటుంది:

One day I might, yes. Many years from now, when I’ve lost my looks a little. Don’t laugh. I mean, of course, a time will come when Torvald is not as devoted to me, not quite so happy when I dance for him, and dress for him, and play with him.

వాళ్ళిద్దరి మధ్యా ఇప్పుడు బంధంగా బలంగా ఉండడానికి ఆమె అందం కారణమనీ, అది మిగలని రోజున, తాను అది మాత్రమే కాదని, అంతకన్నా ఎక్కువ కాబట్టే అతడిని ఆర్థిక ఇక్కట్ల నుండి తప్పించుకోగలిగానని చెప్పుకోడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్టు తోస్తుంది. అంటే, ఆ బంధంలో లోటుపాట్లు ఆమెకు తెల్సు. అది ఇప్పుడు ఉన్నట్టే, ఎల్లకాలమూ ఉండదని ఆమెకు తెల్సు.

తమ బంధం గురించి అంత realistic perception ఉన్న ఆమె, తాను చేసిన దొంగ సంతకాల గురించి తెలియగానే భర్త ఆ నేరాన్ని తన మీద వేసుకుంటాడన్న వెర్రి ఆశతో ఉంటుంది. [When that was done, I was so absolutely certain, you would come forward and take everything upon yourself, and say: I am the guilty one.] కానీ అతడికి తెలియగానే, నేరాన్ని నెత్తికెత్తుకోవటం అటుంచి [But no man would sacrifice his honour for the one he loves.], ఆమెది ఎంతటి నేరమో ఏకరువు పెట్టి, ఆమె నీడ తన పిల్లల మీద కూడా పడకూడదని ఆవేశపడతాడు. సమాజంలో, పది మంది ఎదుటా, తల ఎలా ఎత్తుకొని తిరగాలన్న అతడి బాధ, ఆమె నేరం ఇక ఎన్నటికి పది మంది ముందుకూ రాదని తెలియగానే మాత్రం, మాయమైపోతుంది. అంటే, ఆ బంధాన్ని పదిమంది ముందు ఆకర్షణీయంగా ప్రదర్శించినంత కాలం, అతడికి ఏ సమస్యా లేదనేగా! అందుకే ఆమె ఇలా వాపోతుంది:

“No, only merry. And you have always been so kind to me. But our home has been nothing but a playroom. I have been your doll-wife, just as at home I was papa’s doll-child; and here the children have been my dolls. I thought it great fun when you played with me, just as they thought it great fun when I played with them. That is what our marriage has been, Torvald.”

ఈ కింది వాక్యాలు లేక ఆలోచనలు ఆడవారివి అయినా, మగవారివి అయినా, వాటిలో అంతరార్థం ఒకటే – బంధంలో దాదాపుగా చెరిగిపోయిన “నేను”ని మళ్ళీ వెతుక్కోవడం.

“I believe that before all else I am a reasonable human being, just as you are—or, at all events, that I must try and become one. I know quite well, Torvald, that most people would think you right, and that views of that kind are to be found in books; but I can no longer content myself with what most people say, or with what is found in books. I must think over things for myself and get to understand them.”

అప్పట్లో ఈ నాటకమెంట వివాస్పదమైంది అంటే, రచయిత వాటికి తగలొగ్గి నాటక ముగింపు మార్చాడట. వాదోపవాదాలు అయ్యాక, భార్య శాంతించి అదే ఇంటిలో కొనసాగేట్టు. అయితే, ఇది ఆ నాటకానికే ద్రోహం చేసినట్టు అవుతుందని భావించి, మళ్ళీ అసలైన ముగింపే పెట్టారట. ఈ కాలానికీ, ఆమె చేసినదాని గురించి తప్పొప్పుల చర్చ జరుగుతూనే ఉండచ్చు. కానీ, ఇహ ఇమడలేమని తెల్సిన బంధాల్లో ఇరుక్కున్న కొందరికైనా ఈ నాటకంలో మతలబు అర్థమవుతుంది అనుకుంటాను.

అందుకనే ఇది స్త్రీ జనోద్ధారక నాటకంగా కన్నా, మానవ జనోద్ధారకమని నాకనిపిస్తుంది.

ఈ నాటకంలో డాక్టర్ పాత్ర ప్రాముఖ్యత, ముఖ్యంగా ఆ పాత్ర మృత్యుముఖం వైపు వెళ్ళడం ఎందుకో అన్న సంగతి నాకు అర్థం కాలేదు. ఆ డాక్టర్‍కు ఆమె అంటే ఇష్టమన్న సంగతి, ఆమెకు కొంత తెగువనీ, తనపైన తనకి నమ్మకాన్నీ ఇచ్చాయని అనుకున్నా, అతడిని చావుకు సమీపంగా చూపడం దేనికి ప్రతీకో అర్థం కాలేదు. బహుశా, ఆ డాక్టరులానే వాళ్ళ బంధం కూడా చచ్చిపోబోతుందని చూపడానికేమో!

Full text of the play.

Strindberg vs Ibsen
A Doll's House

Henrik Ibsen

Play
ebookAbout the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..3 Comments


 1. సౌమ్య

  “I believe that Nora’s most beautiful declaration and act of love is leaving her husband”
  -Liv Ullmann, who played Nora in several stage enactments of “Doll’s house” in Norwegian and English, says about the character.

  Courtesy: “Changing”, Liv’s autobiography.

  I enjoyed reading Liv’s comments on “Doll’s House” and Nora’s character. As I read them a few minutes back, I was reminded of this article 🙂


 2. pavan santhosh surampudi

  పుస్తకం.నెట్ పేరిట ఇప్పటివరకూ ప్రకటనలు, వీక్షణాలు, వార్తలే వచ్చాయి. ఇక ఇలా పుస్తక పరిచయాలూ ఉంటాయా? అప్పుడు పుస్తకం.నెట్ అభిప్రాయాలూ, ఫిలాసఫీ వంటివి న్యూట్రల్‌గా మెయింటైన్ చేయగలుగుతారా మరి?


  • సౌమ్య

   పుస్తక పరిచయాలు గట్రా ఆ పేరుతోఉండవండి. అది పొరబాటు 🙂  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

An Enemy of the People – Henrik Ibsen

“Enemy of the People” నార్వే కు చెందిన రచయిత Henrik Ibsen రాసిన ఒక నాటకం. నేను మొదటిసారి చదివేటప్పటిక...
by అసూర్యంపశ్య
0