Millenium Trilogy – Stieg Larsson

ఈమధ్యనే ఒక నాలుగైదు రోజులు ఒక సమావేశం కోసమై స్వీడెన్ వెళ్ళాను. సరే, వెళ్ళబోయే ముందు -అక్కడ ఉన్నన్నాళ్ళూ స్వీడిష్ రచయితల పుస్తకాలు ఏవన్నా చదవాలి అనుకుంటూండగా, సమావేశ నిర్వహకుల్లో ఒకతని పేరు Larsson అని గమనించాను. నాకు Stieg Larsson గుర్తు వచ్చాడు. ఈమధ్య కోర్స్ ఎరా లో విన్న స్కాండినేవియన్ ఫిలిం అండ్ టీవీ కోర్సు లెక్చర్లలో కూడా ఇతన్ని, Millenium Trilogy అనబడు ఇతని నవలా త్రయాన్ని కొన్నిసార్లు ప్రస్తావించారు. మొదట పుస్తకాలు వచ్చినప్పుడు, ఆ తరువాత సినిమాలు వచ్చినప్పుడు – అవెంత పేరు తెచ్చుకున్నాయో గుర్తువచ్చింది. ఆ రచయిత మరణం తర్వాత ప్రచురణకు నోచుకున్న నవలలు ఇవి అని గుర్తుంది. దానితో ఒకసారి ఆయన గురించి తెల్సుకుందాం‌అని లార్సన్ వికీ పేజీ చూశాను. ఆసక్తికరంగా అనిపించింది. ఒక్కసారిగా Larsson చుట్టూ ఇన్ని లంకెలు ఏర్పడ్డంతో, ఈ క్రైం థ్రిల్లర్లూ అవీ నేను ఆట్టే చదవకపోయినా దాదాపు impulsiveగా ఈ Millenium Trilogy కొన్నాను కిండిల్ లో. సరే, చదవాలనుకోడం వేరు, చదవడం వేరు కదా! చూద్దాం లే! అనుకున్నా. కానీ ఒక వారంరోజుల్లోనే మూడు భాగాలూ చదివేశాను! స్వీడెన్లో ఇంటిపని లేకపోవడం ఒక కారణమైతే, నవలలు అలా ఉన్నాయి మరి – అది అసలు కారణం 🙂 ఈ నవలల గురించి, నావి నాలుగు మాటలు:

వృత్తి రిత్యా investigative journalismలో ఉన్న లార్సన్ ఈ నవలలలో కూడా అలాంటి నేపథ్యాన్నే ఎన్నుకున్నాడు. మొదట్నుంచీ నవలలలో జర్నలిజం ప్రధాన పాత్రని పోషిస్తుంది. Millenium అన్న స్వీడిష్ రాజకీయ పత్రిక ప్రచురణకర్త Mikael Blomkvist తనపై వేయబడ్డ పరువునష్టం దావాలో ఓడిపోవడంతో కథ మొదలవుతుంది. ఈ సమయంలో అతను పత్రిక నుండి తాత్కాలికంగా తప్పుకున్నప్పుడు అనుకోకుండా ఇంకొకరి అసైన్మెంట్ ఒప్పుకుని దానిపై పని చేయడం మొదలుపెట్టాక ఉహించని సంగతులన్నీ బయటపడుతూంటాయి. దశాబ్దాల తరబడి మరుగున పడ్డ విషయాలన్నీ బయటకు వస్తాయి. ఈ కథ ఇలాగుంటే, మరో ప్రధాన పాత్ర – Lisbeth Salander అన్న అమ్మాయిది. ఒక సెక్యూరిటీ ఏజెన్సీ లో పనిచేసే ఈ అమ్మాయి చాలా తెలివైనది. ఎవళ్ళనీ దగ్గరగా రానివ్వదు. మనిషి అవతారం, ప్రవర్తనా అదీ కొంచెం మామూలు వాళ్ళకంటే భిన్నంగా ఉంటాయి. ఏదో బరువైన గతం ఉందని మనకి రకరకాల హింట్లు ఇస్తారు. Blomkvist పనిలో అతనికి సహాయకురాలిగా ఈమె వస్తుంది. ఇద్దరూ కలిసి అంతవరకు అతను చూస్తున్న కేసు విషయమై పరిశోధనలు చేస్తారు. అనేక నాటకీయ, గగుర్పాటు కలిగించే సంఘటనల తరువాత కేసు పరిష్కరిస్తారు. ఈక్రమంలో వీళ్ళ మధ్య నెమ్మదిగా మొలకెత్తినట్లు అనిపించిన ప్రేమ కాస్తా మొదటి నవల ముగించే సమయానికి Lisbeth కి Blomkvist పైన కాస్త కాస్తగా ద్వేషమై పోతుంది.

రెండో‌నవలలో కొంచెం లిస్బెత్ నేపథ్యం చెప్పడం మొదలుపెట్టారు. స్వీడన్ లోని వ్యవస్థ, వారి పోలీసు వ్యవస్థ పనితీరు, అందులోని కొన్ని శాఖల్లో ఉన్న అవినీతి, వీటన్నింటి మధ్య బలయిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి గతానికి వర్తమానానికి మధ్య సంబంధం -ఇలా సాగుతుంది. మూడో నవలకి వచ్చేసరికి: లిస్బెత్ నేపథ్యం పూర్తిగా వివరించాక, అనేక పాత్రలు ఆమెకి సాయం చేయడానికి ముందుకొచ్చాక, పక్కా థ్రిల్లర్ లాగ ఎత్తులు, పై ఎత్తులు, పైఎత్తులకు పై ఎత్తులు – వేస్తూ అనేక మలుపులు తిరిగి సుఖాంతం అవుతుంది. క్లుప్తంగా ఇదీ ఈ నవలల విహంగ వీక్షణం. (నవలల కథ మొత్తం ఇక్కడ నేను రాయలేను. “కథ చదవితే నవల చదవక్కర్లేదు, పరిచయాలు రాస్తే అలా రాయాలి” అనుకునే వాళ్ళు దయచేసి వికీపేజీలు చూడండి.)

ఈ నవలలలో నేను గమనించిన ఒక అంశం – బలమైన స్త్రీ పాత్రలు. అలాగని పురుష పాత్రలన్నీ బలహీనంగా ఏం లేవు. ప్రధాన పాత్రల చిత్రీకరణ గొప్పగా అనిపించింది నాకు. చివరికి వచ్చేసరికి ఆ పాత్రలు అలా నాటుకుపోయాయి నా ఊహాలోకంలో. నవలలు చదువుతున్నప్పుడు చాలా చోట్ల చిరాకేసింది. మరీ ఫాంటసీ కథల్లాగా ఈ అవాస్తవిక సన్నివేశాలేంటి? ఎక్కడ పడితే అక్కడ ఏ కొత్త పాత్ర వస్తే దానితో ఏదో ఒక పాత పాత్రకి ఈ‌శారీరక సంబంధాలేంటి? వీటన్నింటికీ ఆ గ్రాఫిక్ వర్ణనలు ఏంటి? ప్రతిపాత్ర గురించీ కథనానికి ఉపయోగపడని ఈ వర్ణనలన్నీ ఎందుకు వస్తున్నాయి? ముఖ్యంగా రెండో నవలలో ఎంతసేపటికీ కథ ముందుకు సాగదేం అనిపించింది. సగం నవల దాటాక మట్టుకు వేగం పుంజుకుని, కరెక్టుగా సస్పెన్స్ సన్నివేశంలో “తరువాయి భాగం వచ్చే వారం” టైపులో మూసేశారు.

కానీ, మూడో భాగంలోకి వచ్చేసరికి – ఆ implausible సన్నివేశాల మధ్య కూడా ఆపకుండా చదివించింది. ప్రధాన పాత్రలతో (ముఖ్యంగా Lisbenth Salander) ఒక విధమైన అనుబంధం ఏర్పడి, ఆ పాత్ర గురించి చాలా సార్లు ఆలోచించేలా చేసింది నవల. మొత్తానికైతే, ఆ రెండో నవల పుట్టించిన చిరాకుకి దీన్ని వదిలేసి ఉంటే, మూడో నవలని మిస్ అయి ఉండేదాన్ని అనుకుంటూన్నా ప్రస్తుతానికి. నాలుగో నవల ముప్పావు భాగం రాశాక లార్సన్ మరణించాడట. ఇప్పుడు ఆ నాలుగోభాగాన్ని మరో రచయితతో రాయించి విడుదల చేస్తారట. బహుశా నాకు అది చదివే ఆసక్తి ఉండకపోవచ్చు, లార్సన్ పూర్తిగా రాయలేదు కనుక.

వీటిలో conventional senseలో “మంచి” అనదగ్గ పాత్ర ఒక్కటి కూడా కనబడలేదు నాకు. పరిస్థితులను బట్టి పాత్రలు మంచిగానూ, చెడుగానూ, మధ్యస్తంగానూ ఇలా రకరకాలుగా కనిపించాయి. ముఖ్యంగా – Lisbeth పాత్ర. ఆవిడ చేసే పనుల్లో సగం నాకు ethicalగా కూడా అనిపించలేదు. మిగితా సగంలో కూడా ప్రత్యేకంగా “గొప్ప” అనిపించలేదు కానీ, ఆ పాత్ర ను సృష్టించడంలో మాత్రం గొప్ప నైపుణ్యం చూపారు అనిపించింది. అలాగే, Blomkvist, Erica Berger, ఆవిడ భర్త, కథలో Blomkvist తో వివిధ సందర్భాల్లో శారీరక సంబంధాలలో ఉండే ఇతర పాత్రలు – ఇవన్నీ కూడా ఎక్కడా పూర్తిగా likeable గా ఉండవు. అయినా కానీ, పాఠకుల మీద గాఢమైన ముద్ర వేస్తాయని నా అభిప్రాయం.

నవలల్లో హింస, అనవసరమైన వివాహేతర సంబంధాలు, విపరీతమైన sexual abuse – ఇలాంటి అంశాలన్నీ ఎన్నోసార్లు కనిపిస్తాయి. సాధారణంగా నేను ఇలాంటివన్నీ ఉన్న నవలల జోలికి వెళ్ళను. కానీ, ఈ నవలలు మూడూ ఎలా చదవగలిగానా? అని ఆలోచించినపుడు నాకు తోచిన విషయాలు ఈ పైన ప్రస్తావించినవన్నీనూ. రచయిత ఫిక్షన్ అనుభవం తక్కువేననుకుంటాను. అయినా కూడా చాలా బాగా అల్లాడు కథని – మొదటి, మూడవ భాగాలలో. అయితే, కొన్ని అంశాలమీద విపరీతమైన obsession ఉన్నట్లు తోస్తుంది – పాత్రల చిత్రీకరణలో, వాటి వర్ణనలో అతను పెట్టిన శ్రద్ధను చూస్తే. ప్రధాన పాత్రలు అన్నింటితోనూ రచయిత వ్యక్తిగత జీవితంతో సామ్యం ఉందేమో అనిపించింది నాకు అతని గురించి తెలిసిన కాస్తలో.

నవల చదివి నెలరోజులవుతున్నా ఇంకా కొన్ని పాత్రలూ, సన్నివేశాలూ నన్ను వెంటాడుతున్నాయి. అప్పుడొకటీ ఇప్పుడొకటీ అని ఏదో ఒక సంఘటన ఏదో ఓ సందర్భంలో గుర్తురావడం, ఇంటికొచ్చాక ఆ పేజీలు చదవడం – ఇలా సాగుతోంది ప్రస్తుతానికి 🙂 అదనమాట.

Millenium Trilogy
Stieg Larsson
Scandinavian Crime Novels

You Might Also Like

2 Comments

  1. bhanuprakash

    ఈ స్టొరీ తో ది గర్ల్ విత్ a డ్రాగన్ టాటూ సినిమా వచిచింది అనుకుంటా

  2. pavan santhosh surampudi

    //కథ చదవితే నవల చదవక్కర్లేదు, పరిచయాలు రాస్తే అలా రాయాలి” అనుకునే వాళ్ళు దయచేసి వికీపేజీలు చూడండి.//
    వికీలో కూడా చదివే పాఠకుల ఆసక్తిపోగొట్టకూడదు, కథ పూర్తిగా రాయకూడదన్న పాలసీపై డిస్కషన్లు జరుగుతున్నాయి.

Leave a Reply