నీల పెండ్లి – విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: Halley
*********
ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమాలు దాదాపు ఒక ఇరవై ఏడు చూసి ఉంటాను ఇప్పటికి. ఒకే దర్శకుడివి అన్ని సినిమాలు ఎందుకు చూసావు అంటే ఏం చెప్తాం? ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కొత్త అనుభవం. కొంత కొంత మందికి కొన్ని కొన్ని అలా నచ్చేస్తాయి అంతే. అలానే విశ్వనాథ నవలలు కూడానూ. ఈ పరిచయం “నీల పెండ్లి” గురించి. ఇప్పటి దాకా నేను చదివిన విశ్వనాథ వారి సాంఘికాలలో నాకు పరిచయమైన స్త్రీ పాత్రలలో ప్రథమ శ్రేణి పాత్ర ఈ “నీల”. ఈ నవల దేని గురించి అంటే పెద్ద చెప్పుకోటానికి ఏమీ లేదు. నీల పెండ్లి గురించి! అయితే ఎప్పటి లాగానే గుర్తు ఉండిపోయే మాటలూ పాత్రలూ గుర్తుంచుకోవాల్సిన విషయాలూ చాలానే ఉన్నాయి. వాటి గురించే ఈ పరిచయం.

“పరలోకములు లేవన్నవానికి మతమేమి?”, “పరలోకం లేని సంఘమునకు వ్యవస్థ ఎందులకు?” అంటూ తొమ్మిదవ పేజీలోనే ‘ఇది విశ్వనాథ నవల’ అని పాఠకుడికి సిగ్నల్ ఇస్తారు రచయిత. ఈ సృష్టి అణువు నుంచి మహత్తు దాకా వ్యాపించినదా మహత్తు నుంచి అణువు దాకా వ్యాపించినదా అని మొదలుపెట్టి షడ్దర్శనాలను జ్ఞాపకం చేసి భారత దేశంలోని సాంఘిక విప్లవాల గురించి కొన్ని తర్కాలు చేసి ఒక భారీ లెక్చర్ ఇస్తారు ఒక అధ్యాయంలో. ఈ పుస్తకం మొత్తంలో అద్భుతం అని అనిపించింది ఈ అధ్యాయమే!

ఇక అసలు నవల ఎక్కడ మొదలు అవుతుంది అంటే నీల తన అన్నగారయిన సుధాకర రావు ఇంటికి వెళ్ళినప్పటి నుంచి. “నాకు కులము లేదు. నాకు మతము లేదు” అనే సుధాకర రావు “మతము లన్నియు దొంగలేర్పరచినవి. తక్కిన ప్రజలను మూర్ఖులను చేసి వారిని దోచికొని తినుటకు, వారి యజ్ఞానము మీద వర్తకము చేయుటకు మతము లేర్పడెను” అని అంటాడు. ఇక్కడి నుంచి నీల సుధాకర రావు మధ్యన జరిగిన సంభాషణల నిండా విశ్వనాథ మార్కు కొట్టొచ్చినట్టు కనపడుతుంది.

ఇక మరోచోట జ్ఞానం గురించి అన్న మాటలు నాకు చాలా నచ్చాయి. ఎందుకనో నేడు ఎన్నో విశ్వవిద్యాలయాలలో చెలామణీలో ఉన్న peer review system ను గుర్తుకు తెచ్చాయి ఈ వాక్యాలు. “యధార్థమైన జ్ఞానము రెండు విధములుగా ఉండును. మొదటిది కూడు గుడ్డలు సంపాదించుకొనుటకు యోగ్యమైనది. రెండవది ఆత్మోన్నతికి దోహదం చేయునది. పరీక్షలిచ్చినచో ఉద్యోగములు వచ్చును. జీతములు వచ్చును. అది ఈనాడు కుడు గుడ్డలకి సంబంధించిన జ్ఞానము. సినిమాలను గురించి, రైళ్ళను గురించి కృతకములైన గ్రంథముల గురించి తెలుసుకొనుట, ఆత్మోన్నతికి హేతువు కాదు. మన వలెనే వ్యర్థ ప్రసంగములు చేయుట కలవాటు పడిన సంఘములోనున్న వ్యక్తలతో అది యొక జ్ఞాన విషయము వలె మాటాడుటకు పనికివచ్చును. ఒక సినిమా బొమ్మలో ఒక గొప్ప తార నటించెను. ఆమె పేరు నీకు తెలియును. ఆ తెలియుట జ్ఞానము లోని భాగమా? తెలిసినందువలన నీకేమైనా డబ్బు వచ్చెనా? నీకు సంఘములో గౌరవము కలిగెననవచ్చును. ఆ గౌరవమెచ్చట దొరికినది? నీ వలెనే, జ్ఞానములోని భాగము కాని ఆ విషయము తెలిసియుండుట, జ్ఞానమనుకొను కొందరు మనుషుల యందు కలిగినది”.

ఇక బ్రాహ్మణుడైన సుధాకర రావు మాంసము తినటం గురించీ ఆయన భావాల గురించీ ఆయన భార్యకీ నీలకీ జరిగిన సంభాషణలు చాలా లోతుగా అనిపించాయి. “మన దేశములో అన్ని మాంసములు నందరు తినరు” అని అంటూ మాంస భక్షణలో భేదాల గురించి చెబుతుంది నాంచారు (సుధాకర రావు భార్య, నీల వదినె). “ఆ మాంసము తినుటలో నది ఏదో ఘన కార్యము చేసినట్లు తిందురు. బ్రాహ్మణులు కాని వారిలో నెంత మంది తినుటలేదు? వారు తిన్నప్పుడెల్ల నింత ఉత్సాహ పడుచుండిరా? ఈ ఉత్సాహము నాకు అర్థమగుట లేదు. ఇది ఒక వ్యాధి అనుకొందును” అని అంటుంది నాంచారు సుధాకర రావు మాంస భక్షణ గురించి. ఈ జాతి మేధావి వర్గం ఇప్పటికీ సజీవంగా అలాగే ఉన్నది. నేను ఎరుగుదును ఇట్టి కొన్ని నమూనాలను!

ఇక సుధాకర రావు తన పిల్లలకు “ఏక్వా” (aqua) “ఆషిరో” (acheiro) అని పెట్టటం గురించి నీలకూ సుధాకర రావుకీ జరిగిన సంభాషణ విశ్వనాథ అభిమానులను అలరిస్తుంది. ఇటువంటి పాత్రలను అయన మాత్రమే సృష్టించగలరు అనుకుంటాను (అప్పటి కాలంలో ఇటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ఉండి వచ్చును కూడాను. అది వేరే విషయం!) జ్యోతిష్యము సాముద్రికము వంటి శాస్త్రముల నమ్మకము లేక ఆ శాస్త్రములో పేరు సంపాదించిన షిరో మీద తిరస్కార భావంతో ఆ పేరు పెట్టుకుంటాడట సుధాకర రావు తన కొడుకుకు.

మరొక చోట దాదాపు ఐదు ఆరు పాత్రలు కలిసి భోజనం చేసే సీను ఒకటి ఉంటుంది. ఇదొక రమ్యమైన ఘట్టం ఈ నవలలో. కొన్ని పదునైన సంభాషణలు ఉన్నాయి ఈ ఘట్టంలో. ఈ పాత్రలలో రాజ్యాంగ కార్యదర్శి మరియు అధిక వేతనుడు అయిన రంగయ్య ఒకటి. హరిజనుడు అయిన రంగయ్య ఒక బ్రాహ్మణ స్త్రీని పెళ్ళాడతాడు. అయితే కేవలం ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహమాడిన తాను భారత దేశంలో ఉన్న సర్వ బ్రాహ్మణ స్త్రీలనూ వరించాను అన్న అభిప్రాయంలో ఉంటాడట అతను. ఈ విషయమై నీల సంధించిన వాగ్భాణాలకు యెవ్వరి దగ్గరా జవాబులుండవు. అయితే అనూహ్యంగా సంస్కర్త అయిన సుధాకరరావు కూడా ఈ విషయంలో నీలతో ఏకీభవిస్తాడు. ఈ విషయమై సుధాకరరావు ఇచ్చిన జస్టిఫికేషన్ నాకు నచ్చింది. నేను నీ సిద్ధాంతమునకు యెదురుగా మాట్లాడితే నువ్వు నన్ను సమర్థిస్తావేంటి అని అడిగిన నీలతో సుధాకర రావు ఇలా అంటాడు. “నాది సిద్ధాంతమమ్మా. వారిది కాదు. నాకు బ్రాహ్మణులని లేదు. వారికి ఉన్నది. నాకు సర్వ జనులు సమానమే. ఆ సమాన భావముతో వివాహములు చేసుకొని సంఘము నందు ఆధిక్యము అల్పత్వము లేకుండ మనినచో నాకిష్టము. సంఘముండవలయునని నా ఊహ. వీరు వివహము చేసుకొనది మొదలు నొకడు బ్రహ్మణ స్త్రీని చేసికొన్నచో వారికది గొప్ప. ఉపన్యాసములలో వ్యవహారములలో బ్రహ్మలని తిట్టుచుందురు. వారి గొప్ప ఏమందురు. తీరా యొక బ్రాహ్మణ స్త్రీ తన్ను పెళ్ళి యాడు వేళకు తన భార్య బ్రహ్మణ స్త్రీ యని అహంకారము వహింతురు. తన భర్త బ్రహ్మణుడైనచో ఆ స్త్రీ యొక్క కుటుంబము వారందరు తమ జన్మ తరించినట్టు భావింతురు. ఈ సంఘము బాగుపడదు. బ్రహ్మణులు గొప్ప కాదని వీరు వాదించుచుందురు. బ్రహ్మణులు గొప్పవారని వారిలో వారే అనుకొనుచుందురు. అట్టి దుర్భావమును నీవు ఖండించితివని నాకు అనందముగా ఉన్నది” అని అంటాడు. ఇంటర్ కాస్ట్ వివాహము చేసుకొని సమాజాన్ని ఉద్ధరించేసాం అని అనుకొనే వారిలో రంగయ్యలే ఎక్కువ తెలుసు నాకు సుధాకరరావుల (సమాన భావంతో అధికత అల్పత్వం లేకుండా చేసుకొనే వారు) కంటే కూడా.

ఇక అన్ని విశ్వనాథ నవలలకు మల్లే చివరకి వచ్చే సరికి నవల విశ్వరూప దర్శనం అవుతుంది మనకి. “ఇంగ్లీషు వాడు తన చదువు యొక్క ప్రభావము చేత భారతదేశములో ఉన్న పూర్వ సంప్రదాయాల నడుము విరుగగొట్టి, దోహదము (సుధాకర రావు వంటి వారి సిద్ధాంతములకు) కల్గించెను. దేశములో మతమన్నను సంప్రదాయమన్నను పలు మంది యందు ద్వేషం కలిగెను” అంటారు.

ఇక మధ్య యుగపు క్రైస్తవ సమాజ ప్రభావంతో అక్కడి సమస్యల వంటివే ఇక్కడివనీ అక్కడి మతము వంటిదే ఇక్కడిదనీ బ్రిటీషు వారు అనుకోవటం వల్ల వచ్చిన నష్టాల గురించి కొన్ని చక్కని మాటలు రాసారు. తప్పక చదివి గుర్తు పెట్టుకోవాల్సిన మాటలు. ఇంగ్లీషు వారికి మాత్రమే కాదు మార్క్సిస్టు చరిత్ర కారులకి కూడా ఇది వర్తిస్తుంది అనిపించింది నాకు. ఇప్పటి కాలంలో కూడా మన గతం గురించి ఆలోచించవలసి వచ్చినప్పుడు మనము ఈ పద్ధతిలోనే ఆలోచిస్తాము (రెఫ్). పాత కాలపు భారత సమాజం కూడా మధ్య యుగపు యూరోపుకు మల్లే ఒక ఫ్యూడల్ వ్యవస్థ అనీ భూస్వాముల పెత్తనం ఉండేదని మతపెద్దలు భూస్వాములు అంతా కుమ్ముక్కై అందరినీ అణగద్రొక్కారనీ అనుకోవటం కద్దు. అసలు ఈ దేశంలో ఎప్పుడూ ఉండని వారు ఈ దేశం గురించి ఏవో అనువాదాల ద్వారా వారి మనసులోని కల్పనల ఆధారంగా రాసిన విషయాలను మనం చరిత్ర అంటున్నాము నేడు. అన్ని సమాజాలు ఒకలాంటివే అన్నీ నా ఫ్రేం వర్కులో వచ్చేసేవే అనే భావజాలం వల్ల జరిగిన నష్టాలు అన్నీ ఇన్నీ కావు అనిపించింది నాకు ఇది చదివినపుడు.

“పాశ్చాత్య దేశములలో పూర్వ క్రైస్తవ మతస్తులు పెద్ద భూస్వాములయి సర్వాధికారులయి సామన్య ప్రజనణచిరి. రాజుల గూడ వారి ఆఙ్ఞలకు తలలొగ్గ వలసి వచ్చెను. అట్టి స్థితికి ఎదురు తిరిగి వారు సంఘమును కొత్తగా తీర్మానించుకొనిరి. ఆ ఇంగ్లీషు వారు మన దేశమును పాలింప రాగా నిచట బ్రాహ్మణుల ఆధిక్యము కనిపించెను. ఆ బ్రహ్మణుల ఆధిక్యము నిజమైనది కాదు. ఇచటనున్నది బ్రహ్మణ మతము యొక్క ఆధిక్యము. వేదములు శాస్త్రములు వాని సిద్ధంతములు సర్వ జనుల యందు నభివ్యాపించి, సంఘము బ్రాహ్మణత్వ రూపము పొందెను. దీనిని తొలగించినగాని వాని ఆటలు సాగునట్లు గనిపించలేదు. అందుచేత వాడు సర్వ శాఖల యందు బ్రహ్మణత్వ చిహ్నములు తొలగించుటకు పూర్వము తత్సర్వమునకు బ్రహ్మణులు కారణభూతులుగా, తన దేశములోని పరిస్థితుల వంటివే ఇచ్చటి పరిస్థితులనుకొని ద్వేషము కల్పించెను. పురాణములబద్దములని, శాస్త్రములు మిథ్యావాదములని, మన సంఘ మర్యాదలన్నియు బ్రహ్మణుల యొక్క స్వార్థము చేత స్వాహంకారము చేత ప్రబలినవి అని ఉపదేశించి, చదువు చెప్పి భారతసంఘమును తారు మారు చేసెను” అని అంటారు.

సుధాకర రావు మాంస భక్షణ గురించి మరో చోట ఒక మాట అంటాడు అతని అనుయాయి ఒకతను. “నీలమ్మ గారూ! మేము చిన్నప్పటి నుంచీ మాంసము తినుచుంటిమి కానీ మీ అన్నగారు తిన్నట్లుగా మేము తినలేము. మాకు మాంసపు కూర కూరలలో నొకటి. దానిని కూడా తిందుము. ఒక యిష్టమైన కూరను కొంత ప్రియముగా తినుట ఎవరైనను చేయుదురు. ఆయనకు మాంసము తప్ప మరియొకటి పనికి రాదు. ఆ తినుటలో తానేదో మహా కార్యము చేయునట్టు తినును” అని అంటాడు ఆతను. ఇది ఇక్కడితో ఆగక పిల్లి మాంస భక్షణ దాకా వెళుతుంది. సుధాకర రావు సంస్కరణ భావాల గురించి తెల్సుకోవాలంటే ఈ పిల్లి మాంసం గురించీ పుట్ట గొడుగుల పచ్చడి గురించీ నవలలో రాసింది చదవాల్సిందే. ఇందాక చెప్పినట్టు మాంసం తినుటయే మహాకార్యం అని అనుకొనే వారు ఇప్పటికి చాలానే ఉన్నారు! కొన్ని కొన్ని విశ్వవిద్యాలయాలో అది విప్లవానికి తోలి మెట్టు గా భావింప బడుతోంది ఇప్పటికీ!

ఇదంతా కాక అసలు నీల(ను) ప్రేమించిన ఉమాపతి గురించీ, నీలకు వచ్చే పెళ్లి సంబంధాల గురించీ చాలా కథ ఉంది ఈ నవలలో. అయితే నాకు సంబంధించినంతవరకు సుధాకర రావు – నీల ఉన్న సన్నివేశాలే ముఖ్యం ఈ నవలకు. మిగిలినదంతా నాకు అనవసరం :D!

ఎప్పటి లాగానే నా వరకు నాకు ఇది పైసా వసూల్ నవల. విశ్వనాథ బ్రాండు వాల్యూ ఏ మాత్రం తగ్గలేదు ఇన్ని నవలలు చదివాక కూడా! ప్రతీ నవలలో ఏదో కొత్త దనం ఉంటోంది ప్రతీ నవలలో అదే పాతదనం కూడా ఉంటోంది. There are differences but there is a certain sameness. విశ్వనాథ నవలా సాహిత్యంలో ఉండే మజా అదే అనుకోవాలి!

****
విశ్వనాథ వారి రచనల కోసం :
Sri Viswanadha Publications
Vijayawada & Hyderabad…
8019000751/9246100751/9246100752/9246100753

Neela Pendli
Viswanatha Satyanarayana

You Might Also Like

One Comment

  1. Rays

    “ఏదో కొత్తదనం ఉంటోంది మళ్ళీ అదే పాతదనం కూడా ఉంటోంది”
    బాగా చెప్పారు, విశ్వనాథ వారి మార్కు నవలకి సరిగ్గా సరిపోయే విశ్లేషణ.
    ధన్యవాదాలు.

Leave a Reply