చలం గారి ఉత్తరాలు వీరేశలింగం గారికి

వ్యాసకర్త: Halley
*******
నేను చలం గారి రచనలు పెద్దగా చదివింది లేదు. “మైదానం” చదివాను ఎప్పుడో కొన్ని ఏళ్ళ కిందట. వికీ పుణ్యమా అని నేను ఆ మధ్యన రంగనాయకమ్మ గారు చలం గురించి రాసిన ఈ వ్యాసం చదవటం జరిగింది. అందులో చలం పై రమణ మహర్షి ప్రభావం గురించి చెబుతూ “However, as a result of that influence, he led himself into an unscientific path because of which he could not accept any other theory” అని రాసారు. ఇక అప్పటి నుంచి రమణాశ్రమ చలం అంటే ఒక fascination నాకు. ఎందుకు అని అడక్కండి .. అదంతే!

“భగవాన్ స్మృతులు” చదివాను ఆ మధ్యన, అయితే అందులో చలం తక్కువ చలం రమణాశ్రమంలో విన్నవీ కన్నవీ ఎక్కువ. కాకపోతే ఆ పుస్తకం ద్వారా కూడా కొన్ని కొత్త విషయాలు తెలిసాయిలెండి. “భగవాన్ పాదాల ముందు – దివాన్” చదవాలి అని అనుకున్నా కానీ కుదరలేదు. ఇంచు మించు ఈ కాలంలోనే “చలం” చదివాను. రచనా శైలి కొంచెం అస్త వ్యస్తం గా అనిపించినా చలం గురించి మరికొంత తెలిసింది.

దాని తర్వాత ఈ మధ్యన చదివింది ఇదిగో ఈ పుస్తకం. “చలం గారి ఉత్తరాలు వీరేశలింగం గారికి” అన్నది. నాకు చలం గురించి చాలా కొత్త విషయాలు తెలిసాయి ఈ పుస్తకం ద్వారా. 1952 నుంచి 1978 దాకా రాసిన లేఖలు ఉన్నాయి ఇందులో. చలం జననం 1894 మరణం 1979. కాబట్టి జీవితపు చివరి పాతిక ఏళ్ళ లోని చలం కనపడతాడు ఈ లేఖలలో పాఠకునికి. సాధారణంగా popular narratives లో చెప్పే చలం రంగనాయకమ్మ గారి వ్యాసంలోని చలం మాత్రమే. ఇలాంటి చలం కూడా ఒకడు ఉన్నాడు అని నేను చాలా లేట్ గా తెల్సుకున్నాను. నాలాంటి novice పాఠకునికి చలం గురించి సమాజం వేసిన stereotypeకి బలైపోయిన బాధితులకి ఎవరికన్నా ఉపయోగపడుతుంది ఏమో అని, ఈ లేఖల పుస్తకం గురించి ఇది ఒక చిన్న పరిచయం.

లేఖల నిండా “ఈశ్వరుడు ” “ఈశ్వర ధ్యానం” “ఆధ్యాత్మికత” “విశ్వాసం” “ఈశ్వరాశిర్వదాలతో” “ఈశ్వరాజ్ఞ ” “ఈశ్వరానుగ్రహం” “ఈశ్వర సంకల్పం” “ఈశ్వర కరుణ” “ఈశ్వరాదరణ” “ఈశ్వరుని దయ” వంటి పదాలే. అసలు స్కాన్ చేసిన పీ-డీ-ఎఫ్ అయిపొయింది కానీ నాకైతే ఈ పదాల మీద ctrl+f చేయాలి అనిపించింది నిజానికి. అన్ని సార్లు దొర్లాయి మరి. నేనైతే షాక్ తిన్నాను. ఏంటా ఇలాంటి చలం ఒకడు ఉన్నాడు అని ఎవరూ ఎపుడూ చెప్పలేదే నాకు అని.

మొదటి లేఖలో అనుకుంటాను ఇలా రాసారు

“అదేమిటి, నా పుస్తకాలని, నా స్ట్రగుల్ ని అంత బాగా అర్థం చేసుకుని, నేను రమణాశ్రమం చేరుకున్నానని దిగులు పడుతున్నారు?

యదార్థ ప్రపంచాన్నించి అంతకన్నా తక్కువ యధార్థమైన చీకటి లోకో, వ్యర్థ కల్పనలలోకో పోతే, దిగులు పడాలి కాని, యదార్థ మనబడే ఈ ప్రపంచం నించి ఇంతకన్నా యదార్థమైన ప్రపంచాన్వేషణలో ఈ ఆశ్రమం చేరుకున్నా, చాలా సంతోషించాల్సిన విషయం”

నిజమే! నాకు తెల్సింది కూడా దిగులు పడ్డ అభిమానులే. ఈ మార్పుకి సంతోషించిన చలం అభిమానులు కూడా ఉండి ఉండచ్చును నాకు కనపడలేదు అంతే!

“ఇదివరకు పురుషులు భయపడే వారు, నేనూ నా పుస్తకాలూ, వాళ్ళ ఆడవాళ్ళని, వాళ్ళ అధీనం లోంచి, ఎక్కడ తిరుగుబాటు చేయిస్తానేమో అని. ఇప్పుడు స్త్రీలు భయపడుతున్నారు. (ఇంకా భయపడతారు కూడా ఎక్కువగా ముందు ముందు) తమ పురుషుల్ని ఎక్కడ సన్యాసుల్ని చేస్తానో అని.”

ఈ రెండో రకం చలం ప్రభావం ఆంధ్ర దేశం పైన అంతగా ఉండిందా? నాకు తెలియలేదు ఈ విషయం నా రిసర్చిలో. మొదటి రకం చలం ప్రభావం అయితే ఇప్పటికి కూడా ఉన్నాదని తెల్సు. బహుశా ఆ కాలం సమాజానికి రెండో రకం చలం నచ్చలేదేమో మరి.

మరో లేఖలో ఇలా అన్నారు. ఇవన్ని కూడా ఆయన మిత్రుడు వీరేశలింగం గారిని ఉద్దేశిస్తూ రాసినదే.

“నమ్మకపోతే మిమ్మల్ని ముందుకు ఎవరూ తోయ్యతలచుకోలేదు. మీ అశాంతే మిమ్మల్ని తోస్తోంది.

మీకు మార్గం చూపాను, మీకు నచ్చిన మార్గం కాదిది. నచ్చిన మార్గాలు చూపరు ఇక్కడ. మీకు నచ్చకపోయినా శ్రేయస్సు నిచ్చే మార్గాలు చూపుతారు. తర్వాత మీ ఇష్టం.

మళ్ళీ చెబుతున్నాను సంకోచం లేకుండా, ఆయనే దిక్కని భగవాన్ని ఆశ్రయించండి. ఎప్పుడు ఆయన్ని మీ ధ్యానంలో ఉంచుకోండి. ఆయన రక్షించగలరని విశ్వసించండి. ఎందుకు? చలం చెప్పాడు కనుక: చలానికి తెలుసును గనక. చలం లోనూ నమ్మకం లేదా, చలంతో ఇంకా స్నేహం వృథా, చలాన్ని ఇంక disturb చేయకుండా వుంటే మంచిది.”

“చలం చెప్పాడు కనుక. చలానికి తెలుసును కనుక” అంటే నమ్మేస్తామా ఏంటి .. నాకు నచ్చలేదు కనుక అని అనేసేయమూ?!

మరొక లేఖలో-

“ఈనాడు దేశమంతా రాజకీయాలలో మునిగి ఉంది. సారస్వతమైనా politics లో భాగమే. ఆధ్యాత్మిక విషయం ఎవరికో గాని అక్కర్లేదు. ఆ విషయాలు అచ్చు వేస్తే పత్రికలు ఎవరూ కొనరు. సినిమా, politics రెండే రాజ్యం చేస్తున్నాయి మనోవీథుల్లో.”

ఇప్పుడు కూడా ఇంతే అనుకుంటాను. ఇంకోక చోట ధర్మం గురించి ఒక మాట అన్నారు. ఆలోచించాల్సిందే అనుకుంటాను ఇది కూడా!

“అధర్మం చేస్తున్నాము అనే జ్ఞానం లేకుండా సంచరిస్తున్నారు ప్రజలు. ప్రభుత్వాలేం చేస్తాయి? ఈ ప్రజలు ఎన్నుకున్నవారే కదా! వీరి వంటి వారే వారును.
కనక ధర్మమూ సత్యమూ అనేవి ఉన్నాయని వాళ్ళని చూసేట్టు చెయ్యాలి. రెండు యుద్ధాలు ఏమి చెప్పలేకపోయాయి. ఈసారి యుద్ధమే కాదు. ప్రళయమే బుద్ధి చెప్ప బోతోంది”

ఇక ఈ పుస్తకంలో నన్ను బాగా షాక్ కి గురి చేసినవి ఈ కింది మాటలు అని అనుకోవచ్చు.

“వేశ్యల సంగతి – కొందరు రాతల అనుభవాల్లో, మిత్రుల అనుభవాల్లో, వాళ్ళు గొప్ప శృంగారమైన ఆకర్షకమైన వేశ్యల్ని కలుసుకునట్టు చెప్పుతారు. పూర్వం ప్రబంధాల్లో కథల్లో అట్లాగే చదువుతారు. ఈ సంఘ సంస్కారులు వచ్చి వాళ్ళని నాశనం చేసారు. పైగా పరదేశస్తుల బోధలతో కూడిన ఈ చదువుల వల్ల వాళ్ళ పైన నీచాభిప్రాయం బయలుదేరింది. అది గాక ఆకర్షణ ఉన్న వాళ్ళందరూ సినిమాల చుట్టూ చేరారు. అంతేగాక ఈ ఉద్యోగాలలో చేరిన స్త్రీల వల్ల వేశ్యలకి competition ఏర్పడ్డది.
…….
పాకీ వాళ్ళు మురికిని అసహ్యిన్చుకునట్టుంది, వేశ్యల్ని లోకువగా చూడటం”

మరొక లేఖలో కళల గురించి ఒక మాట అన్నారు. తెలుగు వాళ్ళు ఈ విషయంలో ఇప్పటికి కూడా పెద్దగా ఇంప్రూవ్ అవలేదు నాకు తెల్సి. ఆఫ్ కోర్స్! తెలుగు సారస్వతంలో గత రెండు దశాబ్దాలుగా ఇబ్బడి ముబ్బడిగా కళా ఖండాలు వచ్చేస్తూ ఉండి ఉండవ్వచును నేను కళాదృష్టి లేని గాడిదను అవ్వవచ్చును!

“మీ కార్డు. మీ చిత్రకారుడి సంగతి – తెలుగు వాళ్ళకి కళ అక్కర్లేదు. వాళ్ళకి అందం తెలీదు. ఒక కళలో పుట్టడం దురదృష్టం. చాలా అశాంతికి కారణం. ప్రజాదరణ దొరక్కపోతే, ఎడతెగని దుఖ్కం. ప్రజాదరణ దొరికిందా ఆ ఆదరణ అతనిని శుద్ధ గాడిదను చేస్తుంది. గొప్ప కళ ఎప్పుడూ ఆ మనిషి జీవితంలో recognition పొందదు. ఆ మనిషికి వ్యధ తప్పదు. దీనికంతా ఒకే solution. పూర్వపు Artists మల్లే తమ కళని ఈశ్వరార్పితం చెయ్యడం.
ఈ కాలంలో అది చెయ్యటం ఎట్లాగో కూడా మర్చిపొయినారు. అందువల్లనే ఈ అశాంతి. ఈ frustration”

ఇంకొక చోట ఒక మాట అన్నారు. ఇది పంచ్ డైలాగులకే పంచ డైలాగు!

“మనం మారడానికీ గంటలు లెఖ్కపెడతాము. కాని ఈశ్వరుడి చేతిలో యుగాలున్నాయి మనని సిద్ధం చేసేందుకు.”

ఇంకొక లేఖలో ఇలా అంటారు:

“మీకో జాతక చక్రం పంపుతున్నాను. కొంచెంగా నన్నా ఆ గ్రహాల సంగతి తెలిసిన వాళ్ళ చేత, rough గా ముందు జీవితం యెట్లా ఉంటుందో, అడిగి నాకు రాయండి.”

మహాప్రభో! ఒక్క మనిషిలో ఇన్ని కోణాలా అనుకున్నాను నేను. “ఆ” చలం ని ఆరాధించిన వాళ్ళకి “ఈ” చలాన్ని ఆరాధించటం కష్టమే! అసాధ్యం కుడానేమో! ఆరాధకుల్లో కూడా ఈ స్థాయిలో కాకపోయినా ఏదో ఒక స్థాయిలో మార్పు వస్తే తప్పిస్తే! అది progress కాదా మరి ? unscientific ఆలోచనలు అయ్యి ఉండచ్చును (ఆ సైన్సు పరిధి పెరిగితే unscientific కాకపోవచ్చునేమో) unscientific అయినంత మాత్రాన ప్రోగ్రెస్సివ్ కాకుండా పోయాడా ఈ చలం? రమణ మహర్షి ప్రభావానికి లోనైన చలంలో ఇంత లోతు ఉందా అని అనుకున్నాను. ఇంకా చదవాల్సిందేనేమో చలాన్ని పూర్తిగా! తప్పదు! తప్పేటట్టు లేదు.

You Might Also Like

8 Comments

  1. మైత్రేయి

    నాకు ఈ చలమే ఇష్టం. 🙂

    1. మైత్రేయి

      నిజానికి నేను ఈ చలాన్ని చదివాక ‘ఆ’ చలాన్ని చదివాను. అందుకే నాకు ‘ఆ’ చలం చిన్నప్పటి ఫోటోల్లో మనం అడ్మెర్ చేసే ప్రొఫొసర్ గార్ని చూసినట్లు ఉంటుంది . ఎప్పటికీ కామన్ కొన్ని ఉంటాయి. ‘నిజం’ , ‘నిజాయితీ’, ‘ఆవేశం’ , ‘మానవత్వం’.
      గీతాంజలికి చలం అనువాదం గొప్ప పుస్తకం. అది ఎక్కువ దొరకటం లేదు. దొరికితే చదవండి.
      (http://telugu-chalam-quotes.blogspot.com/)

  2. మణి వడ్లమాని

    అందుకే కదా చలం ఇలా అంటారు ‘ మృణ్మయమైన ఆత్మలు తమో నిర్మితాలైన మేధస్సులు నన్ను అర్ధం చేసికోగలవా?

  3. S. Narayanaswamy

    అసలు ఒక మనిషిని ఇంకో మనిషి ఎంతవరకూ అర్ధం చేసుకుంటాడు? రచయిత తనని తాను రచనల్లో చాలా తక్కువగానే వెలువరిస్తాడు. ఎక్కడో చలంలాంటి రచయితలు చాలా చాలా అరుదుగా ఉంటారు – వాళ్ళు తలచి, తలపోసి, అనుభవించి, సాక్షాత్కరించుకున్న ప్రతీ చిన్న విషయాన్నీ అక్షరాల్లో పెట్టి తన బతుకుని ప్రపంచం ముందు కాగితాల మీద పరిచినవాళ్ళు. చలం అంత నిజాయితీగా మనలో ఏ ఒక్కరమైనా .. ఒక జీవిత కాలం దాకా ఎందుకు – ఒక రోజులో కలిగే అనుభూతులన్నీ పచ్చి నిజాయితీతో కాగితం మీద పెడితే, ఓ పది రోజుల తరవాత అది చదివితే ఆ మనిషి మనమే అని గుర్తు పట్టలేము – ఇంకోరి సంగతి దాకా ఎందుకు?
    ఇంకోటి – చలం తనని తాను సైంటిఫిక్ అని ఎప్పుడూ చెప్పుకోలేదనే నేను అనుకుంటున్నా. నేను చదివినంతలో ఐతే తారసపళ్ళేదు. రమణాశ్రమం ప్రభావం కూడా ఆయన మీద చివర్లో అకస్మాత్తుగా వచ్చి పడ్డది కాదు – మొదణ్ణించీ ఉన్నదే. రాజమండ్రి రోజుల్లో చింతా దీక్షితులు గారు అనుకుంటా తొలిసారి చలాన్ని రమణాశ్రమానికి తీసుకెళ్తారు. అంచేత, రమణాశ్రమ ప్రభావంతో వయసుడిగాక చలం సైంటిఫిక్ మార్గాన్ని తప్పాడు అనేది అసంబద్ధమైన ప్రతిపాదన.
    Anyway .. good show, Halley.

    1. varaprasad

      అచ్చంగా మీ కామెంట్స్ చదువుతుంటే చలాన్ని కళ్ళెదుటే చూస్తున్నట్టుంది,చలాన్ని శ్రీశ్రీని మళ్ళీ మళ్ళీ చదవాలనిపించడమే వాళ్ళ గొప్పదనం మన అదృష్టం.

  4. అఫ్సర్

    చలం ఎప్పుడూ వొక పజిల్. చదివే వారి మనఃస్తితిని బట్టి చలం మారిపోతాడు. ఎవరి చలం వారి సొంతం! మనల్ని మన నించే కాకుండా మనలోపలి చాలా వాటి నించి విముక్తం చేసే శక్తి చలం తన వాక్యాలకి నేర్పుకున్నాడు. అందుకే, చలంతో ఎవరి ప్రయాణం వాళ్ళదే! ఏ ప్రయాణమూ ఇంకో ప్రయాణంతో ముడిపడదు.

    ఈ వ్యాసం బాగుంది. చలాన్ని పూర్తిగానో, కనీసం కొంతగానో చదవడం అసాధ్యం. హెలీ నిజాయితీ నాకు నచ్చింది. “రమణ మహర్షి ప్రభావానికి లోనైన చలంలో ఇంత లోతు ఉందా అని అనుకున్నాను” ఆ ప్రిజుడిస్ చాలా కాలం పాటు నాకు వుండేది చలం పట్ల! నా యవ్వనం అంతా అయిపోయాక కాని చలాన్ని చదవలేదు ఆ ప్రిజుడిస్ వల్ల! నేను చదివిన మొదటి చలం పుస్తకం కూడా ఇదే ఆ మాటకొస్తే! హెలీ చలం ప్రయాణం నా చలం ప్రయాణం వొక్కటే అనిపించింది ఈ వ్యాసం ద్వారా!

  5. Halley

    అన్నట్టు ఈ వ్యాసం లో రాయటం మర్చిపోయాను . నాకు రమణాశ్రమ చలం మీద ఆసక్తి పెరగటానికి కారణం ఈ వ్యాసం కూడానూ (రెఫ్:http://pustakam.net/?p=12074) . ముఖ్యంగా ఈ వ్యాసంలోని చివరి లైనులు
    “చలంగారిని తెలుగువారు చిరకాలం జ్ఞాపకం పెట్టుకుంటారు కాని, హేతువాదం నుంచి భగవద్విశ్వాసానికి మారిన చలం గారిని కాదు. సంఘ దురాచారాల మీద, మూఢ విశ్వాసాల మీద, కులం మీద, మతం మీద ధ్వజమెత్తి, స్త్రీల స్వేచ్ఛ కోసం, వారికి సాంఘిక న్యాయం కోసం పరితపించిన మానవతావాదిగా చలం గారిని జ్ఞాపకం పెట్టుకుంటారు”

    1. విన్నకోట నరసింహా రావు

      ఈ మాట నిజం. నేనైతే చలం గారిని ఇలాగే గుర్తు పెట్టుకున్నాను.

Leave a Reply