అసాధారణ రచయిత – చలం గురించి నండూరి

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. చలం మరణించినపుడు వచ్చిన సంపాదకీయ వ్యాసం. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్)

******

చలం గారిని పోలిస్తే ఒక నిర్ణిద్ర సముద్రంతో పోల్చాలి. ఒక మహా జలపాతంతో పోల్చాలి. ఒక ఝంఝానిలంతో పోల్చాలి.
చలంగారి అస్తమయంతో ఒక సముద్రం స్తంభించినట్లు, ఒక జలపాతం నిశ్చలమైపోయినట్టు, ఒక ఝంఝానిలం శాంతించినట్టు.

అరవై ఏళ్ళనాడు గుడిపాటి వెంకటచలం గారు ఆంధ్ర సాహిత్యంలో ఒక సుడిగాలి వలె, ఒక పెద్ద వరద వలె ప్రవేశించారు. సంఘంలో, సాహిత్యంలో, ప్రజల ఆలోచనలలో తరతరాలుగా పేరుకుపోయిన కశ్మలాన్ని కడిగి వేశారు. చెత్తా చెదారం, దుమ్మూ దూగర ఎగరగొట్టారు. కొత్త గాలులకు తలుపులు తెరిచారు, కొత్త భావాలకు లాకులు ఎత్తివేశారు.

ఒక గొప్ప రచయిత ప్రవేశం తర్వాత ఏ సాహిత్యం యథాతథంగా మిగలదు. దాని స్వరూపం మారిపోతుంది. దాని స్వభావం మారిపోతుంది. సాహిత్యంపై అతడు తన ప్రభావాన్ని ఎన్నటికి చెరగని విధంగా ముద్రిస్తాడు.

చలం గారు చేసిన పని అదే. తెలుగు వచన స్వరూపాన్ని, రచన స్వభావాన్ని పూర్తిగా మార్చివేశారు. సమకాలిక రచయితలపైన, తరువాత తరం వారిపైన తన ప్రభావ ముద్ర వేశారు.

ఆనాడు ఆయనను గురించి రెండే రెండు అభిప్రాయాలు. విమర్శిస్తే అతి తీవ్రంగా విమర్శించడం. లేదా అంతే గాఢంగా అభిమానించడం. మరొక అభిప్రాయానికి – ఫరవాలేదు బాగానే వ్రాస్తాడు అనో, లేదా ఏమి వ్రాశాడు లెద్దూ అనో చప్పరించి వేయడానికి – వీలులేని రచనలు ఆయన చేశారు.

“చలం ఏమిటి, ఇలా వ్రాస్తాడు? ఇంత పచ్చి బూతులా? ఇంత బరి తెగింపా? అవినీతిని, విశృంఖలత్వాన్ని బోధిస్తున్నాడే! సంఘాన్ని, ముఖ్యంగా వివాహ వ్యవస్థను కూకటి వేళ్ళతో సహా కూలద్రోయడానికి యత్నిస్తున్నాడే! హిందూ సంప్రదాయాన్ని, ఆచారాలను, విశ్వాసాలను, కులభేదాలను మంట గలుపుతున్నాడే!” – ఆయనను ద్వేషించిన వారి విమర్శ ఇది.

కాని ఈ విమర్శలకు చలం గారు చలించలేదు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం సంఘానికి, వ్యక్తులకు ఏది శ్రేయస్కరమని తాము భావించారో ఆ విలువల కోసం ఆయన పుంఖానుపుంఖంగా రచనలు చేస్తూనే పోయారు.

“సెక్స్ తో సహా అన్ని విషయాలలోనూ స్త్రీకి పురుషునితో సమానమైన హక్కులుండాలి. యుగయుగాలుగా పురుషుడికి స్త్రీ బానిసగా పడి ఉంది. పురుష సమాజం స్త్రీని అణగద్రొక్కి వేసింది. ఆమె ఒక వ్యక్తి అని, ఆమెకొక వ్యక్తిత్వం ఉంటుందని, ఆమెకి కూడా సొంత ఇష్టానిష్టాలు, అభిరుచులు, స్వేచ్ఛానురక్తి ఉంటాయని ఊహించలేదు. కేవలం పిల్లలను కానీ, వంట చేసి పెట్టే మరబోమ్మగానే స్త్రీని పురుషుడు పరిగణించాడు. ఇది అన్యాయం. పురుషునికున్న స్వేచ్ఛ స్త్రీకీ ఉండాలి. అప్పుడు గాని ఆమె వ్యక్తిత్వం పరిపూర్ణత్వం చెందదు” అని చలంగారు ఆనాడు ఘోషించారు. కాలానికి ఎదురీదుతూ, గొప్ప ఆత్మా విశ్వాసంతో, అచంచల ధైర్య సాహసాలతో ఆయన తన భావాలను ప్రచారం చేశారు. తన మొత్తం సాహిత్యాన్ని తన సాంఘిక విశ్వాసాలకు అంకితం చేసారు.

ఎన్ని రచనలు? ఒక పెద్ద ఉప్పెన వలె చలం గారి రచనలు ఆంధ్రదేశంపై విరుచుకుపడ్డాయి. ప్రేమలేఖలు, మ్యూజింగ్స్, దైవమిచ్చిన భార్య, శశాంక, చిత్రాంగి, పురూరవ, మైదానం, బ్రాహ్మణీకం, అమీనా, అరుణ – ఇంకా ఇంకా ఎన్నో అసంఖ్యాకమైన నవలలు, నాటకాలు, కథలు, ఇతర రచనలతో, వాటిలోని అసాంప్రదాయిక భావాలతో ఆయన తెలుగువారిని ఉక్కిరి బిక్కిరి చేశారు.

తన భావాలను కాదంటూ, తన వచన శైలిని ఎవరైనా మెచ్చుకుంటే ఆయన సహించేవారు కారు. “నా భావాలనుంచి, నా ఆవేశాల నుంచి నా శైలిని విడదీయవద్దు. అవి పరస్పరాశ్రితాలు” అని ఆయన అనేవారు. అయినా తెలుగులో వ్యావహారిక వచనాన్ని తీర్చిదిద్దిన కొద్ది మందిలో ఒకరుగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఒకసారి ఆప్యాయంగా కబుర్లు చెబుతున్నట్టు, మరొకసారి అదిలిస్తున్నట్టు, ఒకసారి మృదువుగా, మరొకసారి తీక్షణంగా వుండేది ఆయన భాష. తెలుగుదేశపు ప్రకృతిని అంత అందంగా, అనురక్తితో వర్ణించిన ఆధునిక రచయిత మరొకరు లేదనడం అతిశయోక్తి కాదు. ఆయన చందోబద్దంగా వ్రాయలేదు గాని, వచనంలోనే కవితా సౌరభాన్ని గుబాళింప జేసేవారు.

తొలినుంచి ఆయనలో ఒక ద్వైదీభావం ఉండేది. ఒకటి హేతువాదం, రెండవది విశ్వాస వాదం. చివరకు రెండవదే గెలిచింది. ముప్పదేళ్ళ నాడు ఆయన ఆంధ్రదేశాన్ని వదలి అరవ దేశానికి మహాభినిష్క్రమణం చేశారు. తిరువణ్ణామలైలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. జీవిత ప్రథమార్థంలో నిరీశ్వరవాదిగా, లేదా ఆజ్ఞేయవాదిగా పేరు పొందిన చలంగారు మలి దశలో పూర్తిగా ఈశ్వరవాదిగా మారిపోయారు. అదొక విచిత్ర పరిణామం.

చలంగారిని తెలుగువారు చిరకాలం జ్ఞాపకం పెట్టుకుంటారు కాని, హేతువాదం నుంచి భగవద్విశ్వాసానికి మారిన చలం గారిని కాదు. సంఘ దురాచారాల మీద, మూఢ విశ్వాసాల మీద, కులం మీద, మతం మీద ధ్వజమెత్తి, స్త్రీల స్వేచ్ఛ కోసం, వారికి సాంఘిక న్యాయం కోసం పరితపించిన మానవతావాదిగా చలం గారిని జ్ఞాపకం పెట్టుకుంటారు. సమకాలికుల ఆలోచనా ధోరణిని సమూలంగా మార్చివేయడానికి కలం పట్టిన అసాధారణ రచయితగా ఆయనను కలకాలం జ్ఞాపకం పెట్టుకుంటారు.

మే ౬, ౧౯౭౯ (May 6, 1979).

You Might Also Like

17 Comments

  1. మంజరి లక్ష్మి

    తన భావాలను కాదంటూ, తన వచన శైలిని ఎవరైనా మెచ్చుకుంటే ఆయన సహించేవారు కారు. “నా భావాలనుంచి, నా ఆవేశాల నుంచి నా శైలిని విడదీయవద్దు. అవి పరస్పరాశ్రితాలు” అని ఆయన అనేవారు. ఈ వ్యాక్యం బాగుంది.

    1. kv ramana

      @మంజరి లక్ష్మి: మంచి వాక్యం. చదవలసిన పుస్తకాల గురించి కొన్ని ఆలోచనలు వ్యాసం లో దీనిని పోస్ట్ చేస్తే బాగుంటుంది.ఇది అక్కడ చాలా relevant

  2. khadeer

    hi somya.is whole book of telugu velugu chalam is avialable on dli. i can not proceed beyond page i after downloading alternatiff with the help of an it professional. i am a novice in using i-t.

  3. Halley

    “హేతువాదం నుంచి భగవద్విశ్వాసానికి మారిన చలం” గురించి ఏవైనా పుస్తకాలు లేదా వ్యాసాలు ఉంటే ఎవరైనా తెలుపగలరు

    1. Srinivas Vuruputuri

      Not sure if they are available in market now. purAnam subramaNya Sarma wrote a three volume biography of Chalam. They were titled “telugu velugu chalam”, AndhralO chalam” and “aruNAchalamlO chalam”.

      I read the first two volumes and they were very well written. I couldn’t get hold of the third one. 🙁

      A friend of mine mention that they are available on DLI. I am DLI challenged. :(.

      “satyAnvEshi chalam” by vADrEvu veeralakshmIdEvi (?), might be another book that might throw some light.

    2. సౌమ్య

      The first two by Puranam Subramanya Sarma are available on DLI:
      * Telugu Velugu Chalam here
      * Andhralo Chalam here.

      I couldn’t find the third one on DLI yet.

    3. ప్రసాద్

      నాకు తెలిసినంత వరకూ చలం ఎప్పుడూ హేతువాది కాదు. చలం ఒకప్పుడు హేతువాది అని మీరు ఎలా అనుకున్నారూ? ఆధారాలు ఏమిటీ? హేతువాది నిర్వచనం: ప్రకృతినీ, సమాజాన్నీ గతి తార్కిక భౌతిక వాదంతో అర్థం చేసుకుంటాడు – నాస్తికుడు అవడమే కాకుండా, సమాజం లోని అసమానతలకి కూడా మూల కారణాలు అర్థం చేసుకుంటాడు సశాస్త్రీయంగా.

      ప్రసాద్

    4. సౌమ్య

      “చలం ఒకప్పుడు హేతువాది అని మీరు ఎలా అనుకున్నారూ? ఆధారాలు ఏమిటీ?”
      -హేలీ గారు అనలేదండీ చలం హేతువాదని. మీరు ఆ వ్యాసం చదివితే… అందులో నండూరి వారు అన్న విషయాన్ని హేలీ గారు కోట్ చేశారు అంతే.

  4. varaprasad

    chalam a great writer,now the people compasary read his novels,they can reflect our expectations,inferiarity complex,sef confidence,brootal thinking,negative altitude and manymore bad habits of us…………prasad.

  5. Indian Minerva

    చలం తన రచనలలో సంబంధాలు, సమాజం యొక్క మెహర్బానీలకు లొంగిపోయికాకుండా నిజాయితీగా ఉండాలని రాసినట్లుగా నాకనిపిస్తుంది. ఆవిధంగా ఆయన రచనలన్నీ “high-ground” పైనుండి, ఆస్థాయికి ఎదగని సమాజాన్ని తీవ్రంగా నిందించేవే చీల్చి చెండాడేవే. sycophancyని విలువలుగా పొరబడే, నిజాయితీకన్నా “ఆమోదాన్నే” ఘనంగా కీర్తించే సాంప్రదాయవాదులకు ఆయనరచనలు అశ్లీలంగా అనిపించడం పెద్ద వింతేమీకాదనుకుంటను.

    ఆయన ఎంత బలమైనవాడుకాకుంటే సాంప్రదాయవాదులందరూ, వేల సంవత్సరాల సంస్కృతిని, ఆయనొక్కడే పెళ్ళగించివేయగలడని భయపడ్డారంటారు?

  6. ramamohan

    సౌమ్య గారికి.
    సాదారణంగా యవరైనా ఒక కామెంట్ ను డిలీట్ చేశారంటె అందులొ వ్యక్తిగత దూషణలు వుంటాయి. అలాంటి లేకపొతే అవి అలాగే వుంటాయి. కొన్ని కామెంట్లు జవాబు ఆసించవు. కొన్ని కామెంట్లు ప్రశ్నెలు అడిగి జవాబు ఆశిస్తాయి. నా కామెంట్ జవాబు ఆశించనిది కాబట్టి దానికి మీరు రీప్లె ఇవ్వవలసిన అవసరం లేదు. మీరన్నట్టు సమయం చాలక వుంటారు కాబట్టి మీ నిభంధన పట్టికలొ యవరైనా కామెంట్ చేస్తె డిలీట్ చేయబడునునని తెలియచేయండి అప్పుడు ఇలాంటి సమస్య లేకుండా వుంటాయి. మీరు డిలీట్ ఎందుకు చేశారొ అవతల మనిషికి తెలుస్తుంది లేకపొతె మీరు ఏకారణంతొ డిలీట్ చేశారొ తెలియదు కదా. నేను వరాహం అనే పదం వాడినాను క్షెమించండి. నాకు ఉచిత సలహా ఒకటి పడేశారు అది మీకే బాగా వర్తిస్తుంది.

    1. సౌమ్య

      Your comment was not deleted. It was under “moderation”. All comments remain in moderation until they are approved (or deleted) by the system adminstrator. Please understand the difference.

  7. hjh

    బుడదలొ దొర్లే వరాహమా అది ఎందుకు తీశాలొ చెప్పకుండ వుంటె దానర్దమేమిటి. ? అందులొ ఎమైనా దొషాలూ, తప్పులు వుంటె చెప్పండి సరిదిద్దుకుంటాము,కామెంట్ వద్దనుకుంటె అలాంటప్పుడు కామెంట్ పాలసీ తీసెయ్యండి. అలాంటప్పుడు ప్రసురించకుండా వుండాల్సింది.

    1. సౌమ్య

      రామమోహన్/hjh గారికి:

      వ్యాసం చదివి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు. అయితే, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి:
      1) ఈ వెబ్సైటు కోసం రోజులో ఇరవై నాలుగు గంటలు, వారంలో ఏడు రోజులు, సంవత్సరంలో 365/366 దినాలూ వెచ్చించి పనిచేసే వ్యక్తులు దురదృష్టవశాత్తూ లేరు.
      2) మరింత దురదృష్టం ఏమిటంటే – అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. కనుక, పగటి పూట ఉద్యోగాలు చేయక తప్పదు. కనుక, ఎంత ఈమెయిల్స్ తెరిచి ఉంచుకుని ఉన్నా కూడా, మెయిల్ రాగానే ఎగిరి దూకి వ్యాఖ్య అప్రూవ్ చేయాలి అన్న విషయం మాకు తట్టదు – ఎందుకంటే, ఆఫీసులో ఆఫీసు పనులు చేసుకోవడం ధర్మం.
      3) మేము వ్యాసకర్తలకి సూచనల్లో “వీలైనంత వరకు సరళమైన, గౌరవమైన భాషను వాడేందుకు ప్రయత్నించండి.” అని రాశాము. వ్యాఖ్యాతలకి సూచనలు ఇవ్వకపోవడం మాదే తప్పు..మన్నించండి (@”బుడదలొ దొర్లే వరాహమా” తదితరాలు).
      4) ఇంతా చేసి రెండు గంటల తేడాకే ఇంత కోపగించుకుంటే ఇరవై నాలుగ్గంటల పై చిలుకు ఎదురుచూడాలి కొన్ని వెబ్-పత్రికలలో. దయచేసి వాటి జోలికి వెళ్ళకండెప్పుడూ.

      (ఈ అభిప్రాయాలు నా వ్యక్తిగతం. పుస్తకం.నెట్ టీం మూకుమ్మడి అభిప్రాయం కాదు.)

    2. varaprasad

      rammohan garu,,,jananiki telugu akshralu kanipinchatame apuroopamga unna neti rojullo,,pustakam net dwara,,manchi manchi vishayalu telustunnai,,dayunchi meelanti peddavaru pustakam net jananiki marinta cheruvayyela choodandi,,manamanta oke kutumbamga bavinchi chinna chinna vishayalu marachipondi….goodday sir…….varaprasad.

  8. ramamohan

    ఆయన వ్యక్తపరిచిన అభ్యుదయ భావాలు సంఘం ఈనాటికీ ఆమొధించే స్తితికి చేరలేదు. ఈ నాటి రచయితలు కుడా ఆస్తాయికి చేరలేదు. చిట్టి పొట్టి సంస్కరణ దగ్గరే ఆగిపొయారు. ఆయన సమూలమైన మార్పును కొరాడు. అంత కళాత్మకంగా ఆశైలిలొ చెప్పడం నాకు తెలిసి ఆంద్రదేశంలొ లేరు. ఇక ఉండరు కుడా అనుకొవచ్చు. ఇప్పటి వాళ్ళు అందానికి అంధులు.ఉరుకుల పరుగుల జీవితంలొ వాటికి చొటెక్కడుంది.

    1. varaprasad

      kluptamga,sutiga,saralamga,,,accham chalam cheppinattundi mee coment.

Leave a Reply