తిరుమల – రవీందర్ రెడ్డి – ఛాయాచిత్ర సంకలనం

2000 సంవత్సరం జులైలో అనుకొంటాను, డిట్రాయిట్ తెలుగు సంఘం రజతోత్సవ సందర్భంలో కన్వెన్షన్ సెంటర్ కారిడార్లో నడుస్తుంటే ఒక టేబుల్ మీద India – Andhra Pradesh పేరుతో ఒక మంచి ఫొటోగ్రాఫుల పుస్తకం కనిపించింది. ఆ పుస్తకంలో ఫొటోగ్రాఫులు తీసి స్వయంగా ప్రచురించిన యువ ఫొటోగ్రాఫరు శ్రీ డి. (దుగ్గెంపూడి) రవీందర్ రెడ్డితో అక్కడే పరిచయమయ్యింది. ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వుతో చురుగ్గా చిన్నగా ఉండే ఆ యువకుడు అలుపూ, భయమూ ఎరగని, అభిరుచి ఉన్న మంచి ఛాయాచిత్రకారుడని తరువాత తెలిసింది. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని చిత్రీకరించిన, పావురాయిగుట్ట మీద రాజశేఖర్ రెడ్డి యాక్సిడెంటు మొదటి ఫొటోలు తీసిన రవీందర్ రెడ్డి జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ చాలా అవార్డులూ, పేరూ పొందినవాడు. మొదటి పరిచయంనుంచీ, మా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతూ ఉంది. తెలుగునాడి పత్రికకు అతని ఫొటోగ్రాఫులు చాలా అందాన్ని సంతరించాయి. అందుకు అతనికి నేను కృతజ్ఞుణ్ణి.

ravinder reddy2013 జనవరిలో శ్రీ రవీందర్ రెడ్డిని కలసినప్పుడు, అతను కొత్తగా ప్రచురించిన రెండు పుస్తకాలను ప్రేమగా బహూకరించాడు. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత పరిశ్రమ గురించిన పుస్తకం ఒకటైతే, రెండవది – Tirumala – The Hill-Shrine of the Hindu God Lord Venkateswara. తిరుమల పుస్తకాన్ని మే 2013లో డల్లాస్ నగరంలో జరిగిన 19వ తానా మహాసభలలో కాంగ్రెస్ వుమన్ తుల్సీ గాబ్బర్డ్ ఆవిష్కరించినప్పుడు, నేనుకూడా అక్కడ ఉన్నాను.

చాలా ఏళ్ళ క్రితమే రవీందర్ రెడ్డి తీసిన తిరుమలకొండల అద్భుత ఛాయాచిత్రం ఒకటి చాలా ప్రశంసలు పొందింది. నాకు చాల ఇష్టం; తెలుగునాడి మొదటి సంచికలో ఆ ఫొటో ప్రచురించాము. అందుచేత అతను తిరుమలపై ఏకంగా పూర్తి పుస్తకం తెచ్చాడంటే, చాలా ఆసక్తితో ఈ పుస్తకాన్ని చూశాను/చదివాను.

tirumala3తిరుమల పుస్తకం, రవీందర్ రెడ్డి అన్ని పుస్తకాలలాగానే, అద్భుతంగా ప్రచురించబడింది. అలిపిరి దగ్గర మొదలుపెట్టి, మెట్లదారిలో పైకివెళ్ళి, కొండపైన, గుడి దగ్గర, ఇతర ప్రదర్శక స్థలాల వరకూ అన్నిటినీ అతని కెమెరా అందంగా పట్టుకొంది. బ్రహ్మోత్సవాలు, స్వామి వాహనాలు, నగల ఫొటోలు ఉన్నాయి. ముఖ్యంగా వివిధ అలంకరణలలో మలయప్పస్వామి చిత్రాలు కన్నులపండుగగా ఉన్నాయి. ఐతే రవీందర్ రెడ్డి దృష్టి ఒక్క స్వామి పైనే కాదు. తిరుమలను సందర్శించే భక్తులపైనా అంతే దృష్టి పెడతాడు. స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తుల, ఊరేగుతున్న స్వామిని దర్శించిన పారవశ్యంలో ఉన్న భక్తుల మనోభావాలను, ఉద్వేగాలను రవీందర్ రెడ్డి చక్కగా పట్టుకున్నారు.

ఈ పుస్తకంలో ఫొటోలతోపాటు, చాలా ఉపయుక్తమైన వ్యాసాలు ఉన్నాయి. నాకు ఇంతకు ముందు తెలీని విషయాలు చాలా తెలిశాయి. తిరుమల కొండగురించి ఉన్న ఐతిహ్యాలతోపాటు, గుడి కట్టడము, దానికి జరిగిన ముఖ్య మార్పులు, చేర్పుల గురించి చాలా చారిత్రక విషయాలు శ్రీ వి.జె.ఎం. దివాకర్‌గారి వ్యాసంలో వివరించారు. ఫ్రొఫెసర్ ఎస్.కె. రామచంద్రరావు తన వ్యాసంలో తిరుమలలో ఉన్న ఐదు స్వామి విగ్రహాలగురించి విపులంగా వివరించారు. ఈ విగ్రహలను బేరాలు అని వ్యవహరిస్తారు (ధృవబేరం- మూల విరాట్, కౌతుక బేరం – భోగ శ్రీనివాసుడు, బలి బేరం- కొలువు శ్రీనివాసుడు, స్నపన బేరం – ఉగ్ర శ్రీనివాసుడు, ఉత్సవ బేరం – మలయప్ప). ప్రతి విగ్రహాన్ని, ముఖ్యంగా మూలవిరాట్టు విగ్రహాన్ని చాలా విపులంగా వర్ణించారు. స్వామికి నిత్యం ధరించే ఆభరణాల, అలంకారాల పట్టిక కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. తిరుమల బ్రహ్మోత్సవాలలో జరుపుకునే వివిధ ఉత్సవాల వివరాలు శ్రీ కె. ప్రభాకర్ (ఈ పుస్తకం సంపాదకుడు) వివరించారు. పుస్తకం చివరలో, పది పేజీలలో శ్రీ ప్రభాకర్ ఆలయం గురించి, ఆలయసంప్రదాయాల గురించి ఆసక్తికరమైన విశేషాలు చాలా తెలియచేశారు. ఫ్రొఫెసర్లు డేవిడ్ షుల్మన్, వేల్చేరు నారాయణరావులు ముందుమాట వ్రాశారు.

ఆంధ్ర ప్రదేశ్ విశేషాలు తెలిపే అందమైన కాఫీటేబుల్ పుస్తకాలు, నాకు తెలిసి, చాలా తక్కువగా ఉన్నాయి. ఆ లోటును పూడ్చడానికి రవీందర్ రెడ్డి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా అతనిని అభినందించాలి. నాకు తెలిసి అతను ఇప్పటికి కనీసం నాలుగు పుస్తకాలు (ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు, చేనేత, తిరుమల) ప్రచురించాడు. పుస్తకాలన్నీ 11.5 x 11.5అం. సైజులో, మంచి ఆర్టుకాగితంమీద అందంగా ముద్రించి, నాణ్యమైన బైండింగుతో ఉంటాయి. పొటోలు అందంగా, చక్కగా కూర్చబడి ఉంటాయి. వ్యాసాలు, వ్యాఖ్యలు అవసరమైనంత విపులంగా ఉంటాయి. అచ్చుతప్పులు ఉండవు.

ఈ పుస్తకాన్ని అందంగా ముద్రించింది ప్రగతి ఆఫ్‌సెట్ ప్రింటర్స్ (హైదరాబాద్).

అందమైన ఫొటోగ్రఫీ పుస్తకాలపైనో, వేంకటేశ్వర స్వామి పైనో, తిరుమల విషయాల పైనో ఆసక్తో ఉన్నవారందరూ తప్పక కొని, చూసి, చదివి, తమ కాఫీటేబుళ్ళ మీద ఉంచుకొని, ఇంటికి వచ్చినవారితో గర్వంగా పంచుకోవలసిన పుస్తకం.

ఈ పుస్తకం ఈ-పుస్తకంగా కూడా ఇక్కడ దొరుకుతుంది.

కొన్ని వివరాలు:
Tirumala – The Hill-Shrine of the Hindu God Lord Venkateswara
D. Ravinder Reddy (Edited by K. Prabhakar)
Book and Cover Design by Y.N. Sreenivas
Ravi Press Photo
Somajiguda, Hyderabad
ravistudios@gmail.com
91-40-2340-4363
91 986 633 2244

Tirumala - The Hill-Shrine of the Hindu God Lord Venkateswara
D. Ravinder Reddy (Edited by K. Prabhakar)
2012
184

You Might Also Like

Leave a Reply