పుస్తకం
All about booksపుస్తకలోకం

November 15, 2013

విశ్వనాథ వారు ఎలా చెప్పారు?

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్
********
విశ్వనాథ సత్యనారాయణ గారు నవలలు ఎలా చెప్పారు? అన్నది ప్రశ్న.

తన ఇంట్లో నులకమంచంపై బోర్లా పడుకుని మంచం పట్టెపై రెండు చేతుల మధ్య తల పెట్టుకుని కింద కూచుని ఉన్న పేరాల భరతశర్మ, జువ్వాడ గౌతమరావు వంటి మిత్రశిష్యాదులు రాస్తూండగా ఆశువుగా చెప్పారు అని విన్నాం. నిజమే గానీ ఇక్కడ సమాధానం అది కాదు. ఈ ప్రశ్న సాహిత్యపరమైనది. ఏం చెప్పారు(వస్తువు), ఎలా చెప్పారు (శైలి, శిల్పం) అనే సాహిత్యానికి సంబంధించిన మౌలికాంశాల్లో ఒకటైన ఎలా చెప్పారు గురించి. ఈ వ్యాసం దాన్ని గురించి ఆయన నవలల్లోని “భగవంతుని మీది పగ”ను ఆసరా చేసుకుని మాట్లాడుతుంది.

విశ్వనాథ సత్యనారాయణ గురించి ఎంతో కొంత తెలియనివారు తెలుగుపాఠకుల్లో అరుదు. ఆయన సాహిత్యం చదివినవారు కూడా అరుదే. దానిపై ఎన్నో శక్తులు పనిచేసినాయి. ఐతే ఏ సిద్ధాంతాన్ని ఇష్టపడేవారైనా సాహిత్యోపజీవులైతే చదివి తీరాల్సినవిగా (అలా ఎవరూ శాసించరు కానీ చదివితీరేవి) చెప్పబడే సాహిత్యం ప్రతీ భాషవారికీ కొంత ఉంటుంది. ఫ్యూడల్ భావజాలమనో, సంస్కృతి వ్యతిరేక భావాలనో, బూర్జువా సాహిత్యమనో, మతభావాలనో ఏవేవో పేర్లు పెట్టుకుని వాటిని విస్మరిస్తే ఆ భాషలో జరిగిన సాహిత్య వికాసంలో ఓ పార్శ్వాన్ని శాశ్వతంగా కోల్పోయినవారవుతారు. “మహాప్రస్థానం”, “అమృతం కురిసిన రాత్రి”, కొ.కు.కథలు, శ్రీపాద కథలు, కన్యాశుల్కం, గురజాడ సాహిత్యం, కృష్ణపక్షం, హంపీ నుంచి హరప్పా దాక మొదలైన వదిలిపెట్టరాని సాహిత్యం జాబితాలో విశ్వనాథ వారి నవలలూ ఉండాలి. దురదృష్టవశాత్తూ-కఠినమైన గ్రాంథిక భాష అనే అపోహ వల్ల, అభ్యుదయ నిరోధక సాహిత్యమనే ప్రచారం కారణంగా విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యమంతా అసంబద్ధతల మయమనే ప్రచారం వల్లనూ ఎందరో తెలుగు పాఠకులు విశ్వనాథ నవలల నడకల సొగసునూ, ఆ రచనల అందాలనూ కోల్పోయారు. కోల్పోతున్నారు.

ఆయన నవలల్లో మనుష్యులు 200ఏళ్లు బ్రతికారన్నట్టుండే అంశాలు, చంద్రగుప్త మౌర్యుని కాలం, ఇతరేతర విశేషాలు నచ్చకుంటే నచ్చకపోవచ్చు గాక. ఆయన చెప్పే ఆయా చారిత్రిక (వారి దృక్పథంలో) విశేషాలు రుచించనివారు దాన్ని ఫిక్షనల్ పాయింట్ గా అంగీకరించి చదువుకోవచ్చు కదా. చారిత్రిక నవల అని విశ్వనాథ అన్నంతమాత్రాన అందులోని అంశాలు చరిత్రతో పొసగాలా? పొసగకుంటే ఆ నవలల్లో శిల్ప వైచిత్రి పోతుందా? దయ్యాలు లేవని నమ్మేవారు హారర్ సినిమాలు ఎంజాయ్ చేసినట్టుగానే ఈ అంశాలను తీసుకోవచ్చు. ఏదేమైనా నా అభిప్రాయంలో రచయిత గాఢంగా నమ్మే కొన్ని విషయాలతో పాఠకుడు విభేదిస్తూనే ఆ కల్పనల్లోని రమణీయతను ఆస్వాదించవచ్చు.

సోమర్ సెట్ మాం రచనల్లో ఉండే స్త్రీపట్ల చిన్నచూపుని పక్కనపెట్టి ఆయన రచనల్లోని శిల్ప విశేషాలని ఆస్వాదించే స్త్రీవాదులున్నారు. అంతవరకూ ఎందుకు మహాభారతాన్ని ఓ పురాగాథల మహాసంకలనంగా భావించే చాలామంది కృష్ణుడు ద్రౌపదికి కోకలు అలా ఒకదానివెంటటొకటిక్గా ఇచ్చాడన్నా, అభిమంత్రించి అస్త్రం వదిలే ఆగ్నేయాది అస్త్రాలపట్లా నమ్మకం లేదు. ఐతే ఆ ఇతిహాసంపై గౌరవం వారికి తగ్గిన దాఖలాలేమీ ఉండవే. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అలా విశ్వనాథ సాహిత్యాన్ని శిల్ప విన్యాసాల కోసం, శైలీ విశిష్టతల కోశమైనా (వస్తువు పట్ల ఇప్పటికే “ముందే ప్రేరేపింపబడ్డ వ్యతిరేకత” కలవారు) చదవాలి. ఆయన విశిష్టమైన శైలీ శిల్పాల గురించి ఒక నవల తీసుకుని ఏదో ఈ వ్యాసంలో నేను చెప్పగలిగినంత వివరిద్దామని ఈ ప్రయత్నం.

సాధారణంగా విశ్వనాథ నవలల పేర్లు చూసీ చూడగానే ఆకట్టుకునేలా, చదివాకా గుర్తుండిపోయేలా ఉంటాయి. తెఱచిరాజు (చదరంగపుటెత్తుకు తెలుగుపేరు), విష్ణుశర్మ ఇంగ్లీషుచదువు, పులుల సత్యాగ్రహము, ఆఱునదులు, హాహాహూహూ, శార్వరి నుండి శార్వరి దాక, దిండు క్రింది పోకచెక్క, చిట్లీ చిట్లని గాజులు, దంతపుదువ్వెన, పాతిపెట్టిన నాణెములు, నదోరాజా భవిష్యతి ఇలా ఉంటాయి ఆ పేర్లు. అలాగని అవేమీ కేవలం ఆకర్షించడానికే పెట్టినవైతే కాదు. వాటికి ఒక విశిష్టత ఆ నవలల్లో ఉంటుంది. అలాంటి ఆసక్తికరమైన పేరు “భగవంతుని మీది పగ”. పేరు చూడగానే ఒక విధమైన ఆసక్తి కలిగిస్తూ, ఇతివృత్తాన్ని గురించి కొంత మాత్రం చెప్తూ, చదివినవారికి మంచిపేరని సంతృప్తి కలిగిస్తూ చాలా చక్కగా అమరిన పేరది.

నవలలో విశ్వనాథవారు చేసిన చమత్కారమంతా దాని అల్లికలోనే ఉంది. గొప్ప ప్రతినాయకుణ్ణి పెట్టి ఆతని అడుగులు ఎలా పడుతున్నాయో, ఎటు పడుతుందో తెలియనివ్వకుండా మొదలుపెట్టి, మెల్లగా కథాభాగంలోకి వెళ్లేప్పుడు ఆసక్తికరంగా పొరలు విప్పుతూ సాగే కథన శిల్పమే మొత్తం నవలకు ఆయువుపట్టు. ఒక్కో సన్నివేశంలో ఒక్కో విశేషాన్ని పొదుగుతారు విశ్వనాథ. ఒకచోట రమణీయమైన ఏదో విషయాన్ని చెప్పి ఒళ్లు పులకింపజేస్తే, మరోచోట అద్భుతావహంగా ఉండేలా లోకవృత్తాన్ని ఆవిష్కరిస్తారు, ఇంకోచోట ఊహించనివిధంగా ఒక పాత్రలో దాగిన మహావ్యక్తిత్వమో, మహా ధూర్తత్వమో బయటపెడతారు. ఏదేమైనా అటు మొత్తంగా చూస్తే నవలను ఒకపొరలుగా చుట్టి విప్పుతూ, ఇటు సన్నివేశాలపరంగా ఒక్కోదానిలో ఒక్కో విశేషాన్ని చూపుతూ గుక్కతిప్పుకోనివ్వని శిల్పవైభవంతో ఈ నవల సాగుతుంది.

మొదటి సన్నివేశం ముగిస్తూండగా రాకుమారుడు ఒకవిధంగా కథానాయ్కుడు ఐన శ్రీముఖుడు ప్రతినాయకుని స్నేహంలో ఆతని ప్రోద్బలం వల్ల ఉత్సాహంలో నదితోపాటు నదీలోయలోకి దూకడంతో ఉద్వేగం ఆపనివ్వని ప్రారంభం ఉంటుంది, అలానే ముగింపులో ఆర్నెల్లపాటు కుళ్లి, రహస్యంగా తీసుకురాబడ్డ తండ్రి తల ముందు తల్లి పక్కన నిలబడ్డ కొడుకు చేసే ప్రతిఙ్ఞతో మరో నవలకు ప్రారంభంలా ముగుస్తుంది. ఇలా ఎత్తుగడ వేయడంలో ఎంత నైపుణ్యం చూపుతారో, అంతకన్నా నైపుణ్యంతో ముగిసే నవల ఇది.
కాళింది అనే పాత్రను గురించి నవలలో పలుమార్లేదో రాజకుమారుని భార్యగా చెప్పి ఒక్కమారుగా ఆమెలోని విశేషమైన రాజనీతివేత్తృత్వాన్ని, మహారాఙ్ఞిత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వాన్నీ, బహువిషయ పాండిత్యాన్ని బయటపెట్టి మంత్రముగ్ధున్లి చేస్తారు. నిజానికి ఆ సయమంలో ఆమె, ప్రతభ ఉండీ ఊగిసలాటలో కొట్టుకునే ఆమె చినతోడికోడలుతో మాట్లాడే సన్నివేశం నవలను శిఖరానికి చేరుస్తుంది. ఆమెకు ఒకరవ్వ తక్కువ పాండిత్యం, వేత్తృత్వాలు కలిగి ప్రతినాయకిలాంటి దుస్సల ఆమెను కలసినప్పుడు కాళింది ఆమెను చేసే పరిశీలన, అక్కడ ఆ పరిశీలన విషయంగా విశ్వనాథ వాడిన పదశిల్పాలు అనితరసాధ్యం. అపురూపం. అది ఇక్కడ పంచుకోవాలనే లౌల్యాన్ని మీకు మీరుగా చదివి ఆనందించే అవకాశం ఎందుకు పోగొట్టాలనే తలంపుతో చంపుకున్నాను. నిజానికి కాళింది చూసిన ఆ చూపును వర్ణించే వాక్యంలో విశ్వనాథుని ప్రతిభ అమోఘమే. ఏ పాత్ర లోకజ్ఞతనూ, గాంభీర్యాన్నీ, పెద్దరికాన్నీ, సునిశితత్వాన్నీ ఇతరులెవరైనా కూడా ఒకే మారు అంత అద్భుతంగా వ్యక్తీకరించగలరా అనిపిస్తూంటుంది నాకు.

అలాగే మరో ముఖ్యపాత్రను గురించి పరిచయం చేస్తూనే –

“ఒక్కొక్క విద్య నేర్చుకున్నవారు ఆయా విద్యల్లో సాధన చేసేకొద్దీ ఆ విద్యను ఆశ్రయించుకున్న కొన్ని లక్షణాల్ని కూడా పొందుతారు. తీవ్రమైన సాధనవల్ల తెలియకుండానే ఆ గుణాలు సాధకునికి అలవడతాయి. గదా విద్య సాధన చేసినవాడిది మత్తగజ ప్రకృతి. మదించిన మత్తగజం తామరతూళ్లను తునకలు చేసినట్టే శత్రువుల్ని చంపగలడు. చంపలేడు. వాడి మనస్సులో మాత్రము అలా చేస్తున్నాననే భావనే ఉంటుంది. ధనుర్విద్య సాధకునిది పెద్దపులి లక్షణం. దూరం నుంచే పొంచి కొడతాడు. లక్షంవైపు ఏకాగ్రంగా గురి చూస్తాడు. ఇవన్నిటితో పాటు పెద్దపులికుండే తీవ్రత, అంత తీవ్రతలోనూ మాటువేయడమూ వాడికలవడుతుంది. ఎంత చిన్న విషయంలోనైనా నిశితమైన ఆలోచన, అనూహ్యస్పందన, లక్ష్యభేదకరమైన దాడి వాడి తత్త్వం. ఖడ్గ విద్యను ఆశ్రయించి ఉన్నది తాచుపాము ప్రకృతి. కాటువేసేప్పుడు సత్తువంతా ఒడ్డి, అనంతరం నిస్సత్తువతో కూలుతుంది. తాచుకు తనను తాకిన ప్రకృతి శతృస్వభావమైనదా, మిత్రస్వభావమున్నదా అని ఆలోచన ఉండదు. హఠాత్తుగా తాకితే బండరాతినైనా, మనిషినైనా కాటువేసే తీరుతుంది. ఆ మహావిషాగ్నికి బండరాయే బద్దలవుతుందో, కోరలే విరుగుతాయో తర్వాతి విషయం. అప్పటి సంగతి ఐతే కాటువేసి తీరడమే తప్ప విచారించి చూసే ప్రకృతి ఉండదు. దాని లక్షణమే కత్తివిద్యను ఆశ్రయించుకుంది. విపరీతమైన సాధనతో విజయసింహుడూ అట్టి లక్షణాలే తెలియకుండా పొందాడు. పాము కోపంలా అతని కోపమూ పట్టరానిది. దగ్గరకు వచ్చినవాడు ఎవడు అన్నది చూడకుండానే మీదపడుతూండడంతో అతనే సమయంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలియక సేవకులు గజగజలాడుతుంటారు”

అంటూ ఆ పాత్ర సమగ్రమైన లక్షణాలు అద్భుతమైన లోకపరిశీలనతో రంగరించి చెప్తారు. దీనిలోనే సూక్ష్మంగా నవల చివర్లో జరగే విశేషాలు విత్తారు. ఆ చివరకు వచ్చేసరికి ఇది గుర్తొచ్చిన పాఠకుడైతే ఎంతో ఆనందమనుభవిస్తాడు. ఇదిటుంచితే పై వాక్యాలు నవలలో ఆ ఎత్తుగడ సాంతం గుర్తుచేసుకుని నేను రాసింది. ఇదే వాక్యాలు ఆయన రాసినవి యథాతథంగా చదివి ఆపై నేను రాసిన వాక్యాలతో పోల్చిచూడండి. ఆయన శైలి ఎంత మధురమో తెలియవచ్చు.

విశ్వనాథ తలచుకుంటే ఆకుపచ్చగా పెరిగిన రహస్యమైన నదీలోయలోంచి నడివేసవిలో పక్కగా వెళ్లేవాడిపై కొట్టే చల్లగాలి మనపై వీచేలా చేయగలడు, ఎక్కెడో భారతదేశపు వాయువ్యప్రాంతంలో నేర్పే అప్రాచ్య క్షుద్రోపాసన విద్యల మంత్రాలు చెవుల్లో గింగిర్లెత్తించగలడు, ఆర్నెళ్ల పాటు కుళ్లిపోయిన తండ్రి తలపైన కొడుకు ప్రమాణం చేస్తూంటే కలిగే వరపు, జాలి, భయం కలిగించగలడు. ఇవి చేయగలవారెందరో ఉండి ఉండొచ్చు కూడా. కానీ ఏ అనుభూతి ఎప్పుడు ఇప్పిస్తే నవల పండుతుందో తెలిసినవారు ఎందరో లేరు. ఆ అత్యంత అరుదైన నవలాకారుల్లో ఒకడు, మహగట్టివాడు విశ్వనాథుడు.

అభ్యుదయవాది అనైనా అనిపించుకోవాలని కృష్ణశాస్త్రివంటివారూ తీర్థం పుచ్చుకున్నరోజుల్లో, తానేది రాస్తే దాన్ని ఖండించేవారు ఉన్న రోజుల్లో ఆయన తాను విశ్వసించినవి తీవ్రాతీవ్రమైన భావాలైనా చెప్పారు. ఆయన సాహిత్యం అరఠావుకూడా చదవకుండానే పొగడుతూ, తెగడుతూ ఆరేడు ఠావులు అవలీలగా నింపగలవారున్న నేటి కాలంలోనూ నిలిచారు. ఇవన్నీ ఇలా జరగాలంటే ఆయన శైలి ఎంత అపురూపమైతే, శిల్పం ఎంత అనన్య సాధ్యమైతే కుదురుతుందో ఆలోచించిచూడండి.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.17 Comments


 1. Srinivas Vuruputuri

  పవన్ గారికి

  చాలా బావుంది మీ వ్యాసం! ఏ కినిగె వాళ్ళో ఈ-ప్రచురణ చేయకపోతారా అని ఎదురుచూస్తున్నాను. ఇంకొన్నాళ్ళు చూసి అచ్చు పుస్తకాలైనా కొనేస్తాను (నవోదయలో దొరుకుతున్నాయట).

  శ్రీనివాస్


 2. Can we link other essays on this book to this essay, please?


  • సౌమ్య

   మీ సూచనకు ధన్యవాదాలు. వీలు చిక్కినప్పుడు లంకెలు జతచేయగలము.


 3. baleandu

  What about the magnum opus of Viswanadha Satyanarayana’s “Veyi Padagalu”. Please make a detailed comment/ interpretation about the characters in that novel and its’ importance and its’ affect on Telugu novel.


  • pavan santhosh surampudi

   ఈ వ్యాసం లక్ష్యం “భగవంతుని మీది పగ” నవల శైలీ శిల్పం గురించే తప్ప ఇతరములైన నవలల విశ్లేషణ కాదు. ఐనా భవిష్యత్తులో ఎపుడైనా వేయిపడగలు నవల గురించిన వివరాలతో వ్యాసం రాయగలనేమో తెలియదు. కానీ మీ ఆసక్తికి కృతజ్ఞతలు.


  • సౌమ్య

   ఐదేళ్ళ క్రితమేమో చదివినట్లు ఉన్నానీ పుస్తకాన్ని నేను..అప్పట్లో పురాణవైర గ్రంథమాల మొదటి అరడజను నవల్లు చదివినప్పుడు.
   అప్పట్లో నాకిది బాగా నచ్చింది. దీని గురించి చెబుతూ ఒక స్నేహితురాలికి రాసిన వాక్యం ఇప్పుడిక్కడ పంచుకోవాలనిపిస్తుంది – “ఉదయ దంభోజాతబంధు మందార కుసుమ సందోహారుణ కిరణ సంతాన తంతన్యమాన ధారుణీరుహ కిసలయ చ్ఛవిచ్ఛటా పరిదీప్తమైన ఆ ప్రదేశము నాకబలి మ్రుగ్గులు పెట్టినట్లుండెను.” – ఇలాంటి వాక్యాలతో నిండిపోయి ఉన్నా కూడా పూర్తిగా చదవగలిగాను అంటే అర్థం చేసుకోవాలి కథ ఎంత పకడ్బందీగా రాశారో 🙂 🙂


 4. ధీర

  “ఆయన సాహిత్యం అరఠావుకూడా చదవకుండానే పొగడుతూ, తెగడుతూ ఆరేడు ఠావులు అవలీలగా నింపగలవారున్న నేటి కాలంలోనూ నిలిచారు.”- ఈ వాక్యం అర్ధం కాలేదు. విస్వనాథని చదవకుండా పొగిడేవారు ఎవరున్నారు? ఎందుకుంటారు?


  • pavan santhosh surampudi

   చాలామంది విశ్వనాథ సాహిత్యాన్ని చదవకుండా తెగుడుతారన్న విషయం అంగీకరించగలరు కదా.
   ఇక చదవకుండా పొగిడేవారి విషయానికి వస్తే నేను కొందరు భక్తిపరుల్ని చూసాను-రామాయణల్ విషవృక్షం గురించి మాట్లాడుకుంటూ “మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు అత్యద్భుతంగా రామాయణ కల్పవృక్షమని రాస్తే తగుదునమ్మా అంటూ విషవృక్షమని…” అంటూండగా నేను కాసేపు వారితో మాట్లాడాకా వారు కనీసం “మరలనిదేల రామాయణంబన్నచో..” పద్యం కూడా చదవకుండా కల్పవృక్షాన్ని పొగుడుతున్నారనీ, రామాయణం గురించి చదివిందీ, విన్నదీ, సినిమా-సీరియళ్లలో చూసిందీ కల్పవృక్షానికి అన్వయించుకుని అలా లేని పాండిత్య ప్రదర్శన చేయగలరనీ అర్థమైంది. వేయిపడగలు గురించీ అలా మాట్లాడేవారిని, వే.ప. నవల గురించి విమర్శించేవారితో హోరాహోరీగా ఎదుర్కున్నవారిని చూశాను.
   అంతవరకూ ఎందుకు-నా చేతిలో విశ్వనాథ సాహిత్యం చూసి “అబ్బా మహగొప్ప రచయితను చదువుతున్నావ”న్నవారూ, “అదేంటయ్యా ఇంత చిన్నవయసులోనే ఇలాంటి పాతబూజు తలకెత్తుకుంటున్నావ”ని ప్రశ్నించినవారు కూడా విశ్వనాథ రాసిన నవలల గురించి నేనేదైనా చెప్తూంటే నోరెళ్ళబెట్టినవారే. ఇవన్నింటి ద్వారా నాకు అర్థమైనదది.


  • ధీర

   నేను అంగీకరించగలిగినా గలగకపోయినా, ఇంత సమర్ధన వ్రాశారంటే మీరు ఆ వాక్యాన్ని కావాలనే వ్రాశారన్నమాట. సర్లెండి. వాక్య నిర్మాణాన్ని బట్టి పొరపాటేమోననుకున్నాను.


 5. appanna

  viswanadhavaru terachi raaju annaa trosiraaju annaa vaarike chellututundi. aa saili aa kalpana aa vivarana nabhuto na bhavishyati


 6. Santwana

  చాలా బాగా రాశారు పవన్ సంతోష్ గారూ! నిజంగా ఫిక్షన్ ని ఇష్టపడే వారు అందరూ చదివి తీర వలసినది విశ్వనాథ వారి సాహిత్యం. విశాల దృక్పథం తో చదవ గలిగితే ఒక స్థాయి పైన ఐ క్యూ ఉండే వారికి మెదడు కి మేత దొరుకుతుంది. ఆలోచన పదునెక్కుతుంది. ఆయన పై భక్తి తో చదివితే ఎప్పటికైనా ఆ స్థాయి జ్ఞానం వంట పడుతుంది. ఏ రకం గా అయినా లాభమే చదవటం వల్లన.


 7. ఏల్చూరి మురళీధరరావు

  మాన్యులు శ్రీ శ్యామలరావు గారికి
  నమస్కృతులతో,

  మీరు వివరించిన చదరంగపు ఎత్తుల పరిభాష ఇలా ఉండాలి:

  Checkmate Moveను తెలుగులో ‘కట్టెత్తు’ అంటారు. ఏ ఎత్తుతో ప్రత్యర్థి ఆటకట్టవుతుందో అది కట్టెత్తు అన్నమాట. కట్టెత్తు కాకపోయినా, Check (రాజు = రాజుకు ప్రాణభయం ఉన్నది, చూసుకో! “check your position” అని చేసే హెచ్చరిక కాబట్టి ‘రాజు’ అనటం) చెప్పేందుకు వేసే ఎత్తులలో వేసిరాజు, త్రోసిరాజు, తెఱచిరాజు అన్నవి ప్రత్యేకార్థాలలో ఏర్పడిన పదాలు.

  ‘వేసిరాజు’ అంటే ప్రత్యర్థి రాజుకు ఆటగాడు తన గుర్రంతో ‘రాజు’ చెప్పటం. గుర్రంతో చెబితేనే అది ‘వేసిరాజు’. రాజు తప్పించుకొంటే ఆట కొనసాగుతుంది. అలా కాక ‘కట్టెత్తు’ కాబట్టి తప్పించుకోలేనట్లయితే, ‘వేసిరాజు – ఆటకట్టు’ అంటారు.

  ‘తోసిరాజు’ అంటే కేవలం బంటు పావు (Pawn) తో చెప్పే ‘రాజు’ మాత్రమే.

  ‘వేసిరాజు’ గుర్రంతోనూ ‘తోసిరాజు’ బంటుతోనూ చెబుతారు. వేఱే పావులతో ‘రాజు’ చెబితే అది ‘తోసిరాజు’ కాదు.

  ‘వేసిరాజు’, ‘తోసిరాజు’లకు ఆంగ్లపదాలు లేవు.

  ‘తెఱచిరాజు’ అన్నది రాజును మోహరించటానికి తనదే అయిన ఒక పావు ముందున్న మఱొక పావును అడ్డు తొలగించి, ‘రాజు’ చెప్పటం. ‘తెఱచిరాజు’ చెప్పినపుడు అడ్డు తొలగించిన ఆ పావుద్వారా కూడా ‘రాజు’ చెప్పటం జరిగితే – రెండు పావులతో ‘రాజు’ అయింది కనుక దానిని ‘జమిలిరాజు’ అనేవారు కాని, ఇప్పుడు వాడుకలో లేదు. ఆంగ్లంలోని Double Check అదే.

  తక్కినవి పరిభాషాపదాలు చాలానే ఉన్నాయి.

  విశ్వనాథ వారి ‘తెఱచిరాజు’ బందరులో ఉండిన ప్రఖ్యాత రంగస్థలనటులు శ్రీ ముంజులూరి కృష్ణారావు గారి జీవితకథతో ముడిపడినదని ఆయనే వ్రాశారు. అనూహ్యమైన సంఘర్షణలో ఒక ముఖ్యపాత్రను తప్పించవలసి రావటం వల్ల ఆ కథకు ‘తెఱచిరాజు’ శీర్షిక ఎంతో భావగర్భితంగా అమరింది. అది విశ్వనాథ వారి ప్రతిభానతకు నిదర్శనం.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు


 8. mythili abbaraju

  బాగా చెప్పారు సంతోష్. మంచి లేదా గొప్ప రచనని చదివి మెచ్చుకోవటానికి అందులోని భావాలతో పూర్తిగా ఏకీభవించి తీరాలని లేదు. ఆ మాటకొస్తే ఒక వ్యక్తి తన నేపథ్యాన్ని బట్టి, ఆలోచనాపద్ధతి బట్టి ఎలా ప్రవర్తించగలరో ఆ తార్కికమైన లెక్కలని విశ్వనాథ ఎప్పుడూ మీరిపోరు. మనకన్న భిన్నమైన మనుషులు ఉంటారు అన్నదాన్ని ఎలా అంగీకరించాలో మనం ముద్ర వేసుకునే సాహిత్యానికి భిన్నమయినదీ ఉంటుందని తెలుసుకుని తీరాలి. లేదంటే చదవటం తో రాగల ఆనందాన్ని చాలా మేరకు నష్టపోతాము.


 9. చదరంగంలో తోసిరాజు, వేసిరాజు, తెరచిరాజు అనే మాటలు వినిపిస్తాయి. ఇవి రాజుని కాచుకో అని ప్రత్యర్థికి చేసే హెచ్చరికలు.

  తోసిరాజు అంటే, తన బలగంలో ఒకదానిని జరపటం ద్వారా ప్రత్యర్థి యొక్క రాజుకు మృత్యుభయం కల్పించటం. ఒక్క గుఱ్ఱం తప్ప మిగతా బలగం ఏదైనా తన దారిలో‌ ప్రత్యర్థి బలగం అడ్డు రానంత మేరకే కదులుతూ వెళ్ళగలదు.

  వేసిరాజు అంటే ఆటగాడు తన గుఱ్ఱాన్ని ఎత్తి మరొక చోట వేయటం ద్వారా ప్రత్యర్థి యొక్క రాజుకు మృత్యుభయం కల్పించటం. చదరంగంలో గుఱ్ఱం నడక చిత్రంగా ఉంటుంది. అది ప్రత్యర్థి బలగం మీద నుండి దూకగలదు. ఒక దిశలో రెండు గళ్ళూ దానికి లంబదిశలో ఒక గడీ మీదకు ఎగిరిదూకుతుంది గుఱ్ఱం. .

  తెఱచిరాజు అంటే ఆటగాడు తనబలగాన్ని ఒకదాన్ని ఉన్నచోటునుండి తప్పించగానే, అప్పటికే పొంచి ఉన్న తనదే ఐన మరొక బలగం ద్వారా ప్రత్యర్థి యొక్క రాజుకు మృత్యుభయం కల్పించటం.
  ఉదాహరణకు ఆటగాడు తన గుఱ్ఱాన్ని మరొకచోటికి తరలించాడు. కాని గుఱ్ఱం వెనకాలే అతడి శకటం ఉంది. అంతేకాదు ప్రత్యర్థి రాజు తిన్నగా శకటం నడిచే దారికి ఎదురుగా దొరికి పోయాడు గుఱ్ఱం తప్పుకోగానే. మాట వరసకు తరలిపోయిన గుఱ్ఱం ప్రత్యర్థి మంత్రి మీదకు దూకే ప్రమాదం కలిగింది అనుకోండి. అప్పుడు రాజును రక్షించుకోవటం కోసం ప్రత్యర్థి ఎత్తు వేయగలడు కాని మంత్రిని రక్షించలేడు కదా?


  • pavan santhosh surampudi

   థాంక్యూ అండీ. మీరు తెరచి రాజుకు ఇచ్చిన వివరణ చాలా బాగా అర్థమయ్యింది. మిగిలినవి కూడా ఇంకొంచెం వివరంగా చెప్పగలరా?(జాలిపడి అన్నం పెడితే మీ ఆయనకు పెట్టినట్టే పెట్టు అనడిగాట్ట నాబోటిగాడు).


 10. Vijayagopal

  తెరచి రాజు అన్న మాటకు ఇంగ్లీషు మాట చెక్ మేట్. ఉరుదూలో షై. నీ రాజును ఎట్లా కాపాడుకుంటావో అని ఒక సవాలు అది. విశ్వనాథ వారి సాహిత్యమంతా, చదివి ఎట్లా అర్థం చేసుకపంటావో చూద్దాం అన్నట్లుంటుంది. ఆయనే అంటారు, నా పుస్తకం ఇదివరకు చదివిందేనని పక్కన పడేయకు. మళ్లీ చదువు. నీ బుద్ది పరిపక్వతను బట్టి ఈ సారి నీకు మరొక తీరున అర్థమవుతుంది అని. చదవని వారిని చూచి జాలి పడడము తప్ప మరేమీ చేయలేము. వారి భావాలన్నింటితో నేను ఏకీభవించకపోయి ఉండవచ్చు. అందువల్ల ఎవరికీ కష్టము గానీ నష్టము గానీ ఉండనవసరము లేదు.


  • సౌమ్య

   “తెరచిరాజు” అన్న పదానికి అసలు అర్థం ఏమిటి? అన్న విషయమై కొన్నాళ్ళ క్రితం ఫేస్-బుక్ లో ఒక చర్చ జరిగింది. తెరచిరాజు కు ఆంగ్లపదం – “discovered check” అని ఏల్చూరి మురళీధరరావు గారు ఆనాటి చర్చలో వివరించారు.
   http://en.wikipedia.org/wiki/Discovered_attack  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

విశ్వనాథునకు వివిధ కవి నాథుల పద్య నివాళి

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** ముందు మాట ఈ నెల (అక్టోబ...
by అతిథి
0

 
 

విశ్వనాథ చిన్న కథలు

విశ్వనాథ గారివి ఇదివరలో నవలలు కొన్ని, ఆత్మకథాత్మక వ్యాసాలు/ఇంటర్వ్యూలు చదివాను కాన...
by సౌమ్య
1

 
 

తెలుగు సాహిత్యంలో బలమైన స్త్రీ పాత్రలు-మొదటి భాగం:విశ్వనాథ నాయికలు

వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి ***************** ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన...
by అతిథి
2

 

 

తెఱచిరాజు – ఒక పరిశీలనా ప్రయత్నము

వ్యాసకర్త: శ్రీకాంత్ గడ్డిపాటి (విశ్వనాథ గారి తెఱచిరాజు నవలపై బెంగుళూరులో జరిగిన సా...
by అతిథి
7

 
 

స్వర్గానికి నిచ్చెనలు – అస్తి నాస్తి ల గంభీర చర్చ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************ భారతీయ భాషల్లో ఆలోచనాత్మకమైన రచనలకు ఏ క...
by అతిథి
0

 
 

విశ్వనాథలోని ‘నేను’ – మూడవభాగం

రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. రెండ...
by అతిథి
1