కాంతిపుంజాలను వెతుక్కుంటూ

వ్యాసకర్త: చంద్రలత
*********

(రావూరి భరద్వాజ గారి గురించి, ఒక జ్ఞాపకం)

అప్పుడే వారిని తొలిసారి కలవడం.
తొంభై దశకం ఆరంభం.
మల్లాది సుబ్బమ్మ గారి ఆవరణలో. వారి నిర్వహణలో.
మహిళా రచయిత్రుల సదస్సు.
వోల్గా గారి ఉపన్యాసమూ, చేరా గారి అధ్యక్ష దక్షతలతో పాటు అనేక మంది రచయిత్రులను ఆ పూటే తొలిసారి కళ్ళారా చూశాను.
వంటరిగా వెళ్ళాను. మొదటిసారిగా.
సహజంగానే బిడియపడుతూ వెనకగా ఒక పక్కగా కూర్చున్నా.
చిన్న పుస్తకంలో నచ్చిన మాటలు రాసుకుంటూ మౌనంగా కూర్చున్నా.

వారిలో చాలా మట్టుకు పరిచయస్తులే .వారి రచనల ద్వారా. ఎప్పుడైనా సభల్లో పెళ్ళిళ్ళలో పేరంటాలలో కలిసిన వారే. రామ్మూర్తి గారితో సహా అనేకులు హేతువాదులుగా మా ఇంటికి వచ్చి వెళ్ళే కుటుంబ స్నేహితులే. చేరా గారి వంటి వారి సంగతి చెప్పక్కర లేదు.

నేను ఎరిగిన వారంతా క్రొత్తరూపాలతో ఆ పూట పరిచయం అయ్యారు. వ్యక్తమవుతోన్న ఒక్కోరి ఆలోచనా ఒక్కో ఆవిష్కరణ . ఒక తెలియని గాఢానుభూతిలో మునిగి ఉన్నా. నిశ్శబ్దంగా.

భోజనాలకు అందరూ లేచీ లేవగానే ..
“మీ నాన్నేమిటీ నిన్ను వదిలేసివెళ్ళాడు?” ఒక ఆత్మీయ స్వరం వినపడింది. నా వెనుకగా .
నోట్లో పెట్టుకొన్న బంగాళ దుంపలకూర ముద్దను గుటుక్కున మింగి, వెనక్కు గిర్రున తిరిగి చూసా.
ఎప్పుడు వచ్చారో కానీ. వారు తెలిసిన వారే.
నా ముఖంలో ఏ భావాలు కదలాడాయో కానీ, వారు ఫక్కున నవ్వారు తన తెల్లబడుతోన్న గడ్డాన్ని నిమురుకొంటూ.
“నా గడ్డం చూసి దడుచుకొన్నావా ఏంటి? నేను మీ తాతయ్యను లే.” అని గడ్డం వూగేలా పక పక నవ్వారు.
“అవునూ, ఇపుడు విన్న ఉపన్యాసాలన్నీ ఆ పుస్తకంలో పడతాయా?” నా చిన్న నోట్ ప్యాడ్ గురించి వ్యాఖ్యానించారు.

ఇంతలో మంచి నీళ్ళ గ్లాసుతో మల్లాది సుబమ్మ గారు స్వయంగా వచ్చేసారు.
“ఏం… మీ నాన్నని ఉండమంటే ఉండకుండా వెళ్ళారు?” సుబ్బమ్మ గారు తమ సహజధోరణిలో బిగ్గరగా అన్నారు.
గ్లాసుడు నీళ్ళు గబ గబ తాగి ..ఓ నవ్వు నవ్వాను.
“అబ్బెబ్బె..” నేనేదో చెప్పబోయే లోపలే, రామ్మూర్తి గారటు వచ్చారు. “అమ్మా… వారు మన హైదరాబాదు ఠాగూరులే… రావూరి భరద్వాజ గారని..”
“నమస్కారమండీ..” అంటూనే ఉన్నా కానీ, వారి కాంతమ్మ గారి ఎలిజీలోని జ్ఞాపకాల తడి నన్ను తాకింది. నా నోట మాట మెదలలేదసలు. ఆ పూట ఆ సదస్సులో సాగుతోన్న అనేక కోణాల్లో ఇమడని మరొక ఆత్మీయ కోణం. దాంపత్య బంధం. హృద్యమైనదీ. ఆర్ద్రమైందీ. అనంతమైనదీ.

భోజనాంతరం రావూరి గారి పక్కనే కూర్చున్నా. వక్తల ఉపన్యాసాల పై సున్నిత వ్యాఖ్యానాలు చేస్తూ ఆద్యంతమూ హాస్యభరితం చేసారు. ఆ దుఃఖమే వారినంటనట్లు.
నాన్న గారు రావడమే “ఏవండోయ్ బావ గారు” అని పలకరిస్తూ వచ్చారు. రాగానే ,”మీ నెల్లూరు జమీన్ రైతు లో..” అంటూ పరిచయం చేసారు. అప్పటి నుంచి నన్ను నెల్లూరమ్మాయి అని పిలిచేవారు.

వారిద్దరూ మాటల్లో మునిగారు. పాత స్నేహితులు. సాహితీ మరమరాలు పంచుకొనే వారు ఎప్పుడు కలిసినా.

ఆ నాటి సదస్సు ముగిసాక ,కొండేపూడి నిర్మల గారినీ రావూరి గారినీ తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. రావూరి గారి ఇంటికి వెళ్ళాం అలా. మనిషి లాగానే వారిల్లు నిరాడంబరంగా నిండుగా ఉన్నది.

వారిద్దరు కబుర్లాడుకొంటుంటే, నేను నిశ్శబ్దంగా పుస్తకాలను చూస్తూ కూర్చున్నా.నేనప్పటికి పాఠకురాలిని మాత్రమే.
“అమ్మో… రచయితలంటే ఇంతంత చదవాలి ఇన్నన్ని రాయాలి కాబోలు!” ననుకొంటూ.
ఆ తరువాత తెలిసింది. వారు చదివింది జీవితాన్నని. జీవిత ఆవిష్కరణలోనే వారి అక్షరాలు రూపుదిద్దుకొన్నాయని. మూర్తి మత్వమందాయనీ. సజీవమయ్యాయనీ.
అ తరువాత వారిని అనేక సాహితీ సభలలోనూ , బయటా కలిసాను. నాన్న గారు రావూరి గారు మాట్లాడుకొన్నంత సేపూ చెణుకులు విసురుకొంటూ వుండే వారు. కలిసిన ప్రతి సారీ, “మీ నెల్లూరు జమీన్ రైతులో..” అంటూ ఆనాటి ముచ్చట్లు ప్రస్తావించక మానేవారు కారు.
***

అది నందమూరి తారక రామా రావ్ కళాపీఠం. 2004. క్రిస్టమస్ దాటిన మూడో రోజు. చిక్కటి చలి. 2003 వ సంత్సరపు ధర్మ నిధి పురస్కారాల ప్రదానోత్సవ సభ. వేదిక నిండుగా ఉంది. ఆచార్య సుబ్రమణ్యం గారూ, జస్టిస్ చలమేశ్వర రావు గారు.. ముఖ్య అతిథులు. బొమ్మారెడ్డి గారు, రావెల సాంబశివరావు గారు, ఘంటశాల నిర్మల గారు మొదలగు పెద్దలెందరో అసీనులైన వేదిక అది. దృశ్యాదృశ్యం నన్నూ అక్కడ దాకా తీసుకెళ్ళింది. కానీ , బిడియ పడుతూ, నేను ..ఒక పక్కగా ఒదిగి కూర్చున్నా. నిశ్శబ్దంగా వేదిక మీదన ఉన్న వారిని, ముందున్న వారిని చూస్తూ ఉన్నా.

ఎప్పటి లాగానే ముందువరసలో నాన్న గారు. వారి పక్కనే రావూరి గారు. ఒకరితో ఒకరు గుస గుసలు పోతూ. ముసి ముసి నవ్వులు నవ్వుతూ.
వేదిక దిగి రాగానే, నాన్న గారు పుత్రికోత్సాహంలో మునిగి ఉండగా, మొహమాటపడుతూ నిల్చున్న నన్ను గట్టున పడేసింది రావూరి గారి ఆత్మీయ వచనాలే.
ఆ తరువాత తీసుకొన్న ఛాయా చిత్రమిది. ఒక్కొక్కరుగా దూరమవుతూ మిగిల్చి వెళుతోన్న వెలుగురేఖల ఛాయలివి.
ఏ సభలో కలిసినా అదే కపటం లేని నవ్వు, అదే నిరాడంబరత,నెమ్మది, సౌమ్యత. స్నేహశీలత..
నాన్న గారికేమో బావ గారు, నాకేమో తాతయ్య .. అదీ వరస.

స్నేహ సంబంధాలకు ఎంతో విలువ నిచ్చేవారు. నవ్వుతూ ఎదురొచ్చి పలకరించేవారు. నోరారా. వారు పెద్దవారనీ భేషజాలు మచ్చుకైనా లేవు. వేదిక ఎక్కిన ప్రతి మారూ ఎదురుగా కూర్చుని నిశ్శబ్దంగా ఆనందించేవారు. దిగీ దిగగానే పరామర్శించేవారు.

అలాంటి అత్మీయులు లేరు. మరి రారు. వారి జ్ఞాపకాలు, నడవడిక, నమ్రత, కపటమెరుగని భోళా నవ్వు, నేర్చుకోమని ఇచ్చి వెళ్ళిన పాఠాలు.
వారి లాంటి కపటమెరుగని అక్షరలానే పాకుడురాళ్ళ పై పరిచేసి …

కాలాలు మారినా కలతలు మారేనా అని దుఃఖమతులై ….తిరిగి రాని లోకాలకు పయనమయ్యారు.
మంగమ్మను మంజరిగా మలచిన ఈ చీకటి లోకంతో ఇక నాకేం పనంటూ. కాంతిపుంజాలను వెతుక్కుంటూ.

***
రావూరి భరద్వాజ గారికి వినమ్ర నమస్కారాలు.
తాతయ్యకు అంతులేని ఆప్యాయతలు.
****

You Might Also Like

One Comment

  1. మరొక ఆత్మీయ కోణం | మడత పేజీ

    […] కాంతమ్మ గారి ఎలిజీలోని జ్ఞాపకాల తడి నన్ను తాకింది.  నా నోట మాట మెదలలేదసలు. ఆ పూట ఆ సదస్సులో సాగుతోన్న అనేక కోణాల్లో ఇమడని మరొక ఆత్మీయ కోణం.  దాంపత్య బంధం.  హృద్యమైనదీ.  ఆర్ద్రమైందీ.  అనంతమైనదీ. “కాంతిపుంజాలను వెతుక్కుంటూ” http://pustakam.net/?p=15668 […]

Leave a Reply