హాయిగా ఏడ్చేసా..

వ్యాసకర్త: కడప రఘోత్తమరావు
(ఈ వ్యాసం కొండముది సాయికిరణ్ కుమార్ గారి కవిత్వం “అంతర్యానం” కు కడప రఘోత్తమరావు గారు రాసిన ఆప్తవాక్యం.)
********

“ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విచారం కలుగుతుంద”ని తిలక్ అన్నా “హాయిగా ఏడ్చేసా” అని సాయికిరణ్ అన్నా పాఠకుల్లో కలిగే రసస్పందన ఒక్కటే – సౌకుమార్యంతో కూడిన అంతఃచేతనపు మేలుకొల్పు.

అప్పటివరకూ స్ఫురించని భావాలు తోచడం, పరిచితమైన భావాల్లో కొత్తకోణాలు అగుపడడం వంటి అనుభవాలు పాఠకులకి అందించగలిగిన క్షణాన ఆ కవి ధన్యుడౌతాడు. ’అంతర్యానం’ ద్వారా ఆ ధన్యతను సాయికిరణ్ సాధించాడని చెప్పడానికి నేను సందేహించను.

అగ్నిపర్వతం బ్రద్దలవ్వక మునుపే దాన్ని గ్రహించే పరికరంలా, మానవ మస్తిష్కంలో సంభవించే సూక్ష్మసంవేదనల్ని పసిగట్టడంలో కవి ప్రథముడుగా ఉంటాడు. కవికి మాత్రమే ఉన్న ఈ శక్తి ఈ సంకలనంలో స్పష్టంగా ప్రదర్శితమైంది. అనేకాలైన హృదయ విన్యాసాల్ని ఒడుపుగా పట్టి, కవితలుగా ప్రదర్శించడంలో చక్కటి నేర్పును చూపాడు కవి. అలా చేయగలిగాడు కనుకనే అందరిలా గాక ‘హాయిగా’ ఏడ్వగలిగాడు.

ఇంతకీ ఏమిటీ ‘అంతర్యానం’? ఎక్కడి నుండి ఎక్కడికి? ఎందుకు?

బహిర్ముఖాలైన అనుభవాల్ని మనసులోకి ఆహ్వానించి, వాటిల్ని అక్కడే కట్టివేసి, అలజడి చేసేవాటిపై అదుపును సాధించి, అదుపులో ఉన్నవాటిపై ఆధిపత్యాన్ని స్థిరపరచి, చెదరని అంతర్ముఖత్వాన్ని సాధించడమే ‘అంతర్యానం’. సులభభాషలో చెప్పుకోదల్చితే – ’తనలోకి తానే ప్రయాణించడం’.

తనను తాను గాయపర్చుకోవడం ఎంత కష్టమో, ఈ అంతర్యానం కూడా అంతే దుస్తరం. ’అభ్యాసేన తు కౌంతేయ’ అని గీతాచార్యుడే హెచ్చరించాల్సి వచ్చినంత కఠినమీ పయనం.

సాహితీ అంతర్యానంలో సాయికిరణ్ ఎత్తుపల్లాల్ని, మనోవైకల్యాల్నీ, పరస్పర విరుద్ధాలైన భావాల్నీ చవిచూస్తూ ’’నిర్జరణీ జర్ఝరిలో జర్జరిత”మైన భాషాడంబరాల బండరాళ్ళపై పడి కూడా చెదరకుండా, చిట్లకుండా నిశ్శబ్దప్రయాణాన్ని పెంచుకుపోయాడు.

ఈ ప్రయాణానికి ఆరంభస్థానం కవిత్వం. ప్రేరణ కవిత్వం. గమ్యం కవిత్వం. సాగాల్సిన దారి నిండుగా కవిత్వపు మజిలీలు. శాబ్దికాడంబరజృంభిత జలపాతాల శాఖాచంక్రమణం నుండి పారిజాతాలు రాలినప్పుడు చెట్టు విడిచే నిట్టూర్పులోని నిశ్శబ్దాన్ని అందిపుచ్చుకునేంత వరకూ సాగిన ఈ అంతర్యానం ఒక్క కవినే కాదు పాఠకుల్నీ నడిపిస్తుంది. ‘అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం’ చేయిస్తుంది.

నుత జల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్క్రతు వది మేలు తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు త
త్సుత శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్
– నన్నయ

కడప రఘోత్తమరావు
బెంగుళూరు, 27-నవంబరు-2012

****
పుస్తకం వివరాలు:

అంతర్యానం (కవిత్వం)
కొండముది సాయికిరణ్ కుమార్
తొలి ముద్రణ: మార్చి 2013
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు:
1. కొండముది సాయికిరణ్ కుమార్, email: kskk@rediffmail.com, phone: +91 9702911151
2. పాలపిట్ట బుక్స్, email: palapittabooks@gmail.com, phone: 040-2767 8430

You Might Also Like

5 Comments

  1. navyamprathap

    baagaavundi

  2. varaprasad

    raghottamarao garu chalakalamga meegurinchi vintunna,ipudu mee ratachadive bagyyam kaligindi,chala santosham.

    1. రఘోత్తమరావు

      వరప్రసాద్ గారు,

      మనం ఇంతకు మునుపు కలిసినట్టుగా గుర్తుకు రావడం లేదు అందుకు క్షమించాలి.

      మీ అభిమాన పురస్సరమైన వ్యాఖ్యకు ధన్యవాదాలు. నేనో సాధారణ వ్యక్తిని మాత్రమే – భాగ్యదాతను కాను :))

    1. రఘోత్తమరావు

      నారాయణస్వామి గారు,

      అంతర్యానంలో మంచి కవితలున్నాయి. తాత్విక అన్వేషణ పట్ల ఆసక్తి ఉన్నవారికి, లేనివారికీ ఒకేరకమైన స్ఫురణను, జటతిని కల్గించే వస్తువులున్నాయి.

Leave a Reply