ఇతిహాసాల్లో ఇంతుల కథలు ఇ(ం)తిహాసం
డా. సి.మృణాళిని తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక సాహిత్యంలో ఆచార్యురాలిగా, రచయిత్రిగా, రేడియో, టివి రంగాల్లో వ్యాఖ్యాతగా, కార్యక్రమ నిర్వాహకురాలిగా తెలుగువారికి సుపరిచితులు; చిరకాలంగా మిత్రులు. కొన్నేళ్ళ క్రితం మృణాళిని గారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇంతిహాసం పేరిట వారంవారం పురాణాలలో స్త్రీలపాత్రలను పరిచయం చేశారు. ఆ వ్యాసాలకు మరో రెండు వ్యాసాలు (సీత, ద్రౌపది) కలిపి ఇప్పుడు పుస్తకంగా తీసుకువచ్చారు.
ఏదో ఒక సిద్ధాంత ప్రాతిపదిక, నిర్దిష్ట భావజాలం పునాదిగా ఈ పరిచయాలు వ్రాయలేదని, ఆయా పురాణేతిహాసాల్లో ఉన్న పాత్రలను యథాతథంగా పరిచయం చేశానని రచయిత్రి తన ముందుమాటలో వివరించారు. పాత్రల చిత్రణ, స్వరూపం, స్వభావం యథాతథంగా చూపిస్తూ, కేవలం అంతర్గత సాక్ష్యాల ఆధారంగానే వ్యాఖ్యానించినందుకు కొన్ని విమర్శనలను ఎదుర్కొన్నారట.
పురాణేతిహాసాలు ధర్మబోధప్రధానమైనవే కాని, పాత్ర ప్రధానమైనవి కావని, చెప్పదలుచుకొన్న ధర్మవిశేషాలకు పాత్రలు సంకేతాలు మాత్రమేనని, అందుచేత పురాణాలలో పాత్రల నిడివి, చిత్రణ ఆ పాత్ర ప్రయోజనాన్ని బట్టి మాత్రమే ఉంటాయని రచయిత్రి అంటున్నారు. ఐనా, ఈ పరిధుల్లో కూడా పాత్రల వ్యక్తిత్వాలు తళుక్కుమంటుంటాయి. ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించి పాఠకులకు పరిచయం చేయటం రచయిత్రి చేసిన పని. ఆ పరిచయాలలో పాత్రల ప్రవర్తనలను విమర్శించటానికి, విశ్లేషించటానికి ప్రయత్నం చేయనక్కర్లేదని, ఆ పనిని పురాణకర్తలే చేసి వేరే పాత్రలద్వారా చెప్పించారని రచయిత్రి అన్నారు.
ఈ వరుసలో సీత, శకుంతల, దమయంతి, ద్రౌపది, పార్వతి, రుక్మిణి, సత్యభామ, వంటి ప్రధాన నాయికలతో పాటు, కౌసల్య, సుమిత్ర, మంథర, శూర్పణఖ, తార, మండోదరి, సత్యవతి, అంబ, కుంతి, గాంధారి, సుధేష్ణ వంటి రామాయణ భారత పాత్రలను, రంభ, ఊర్వశి, రతీదేవి, రాధ వంటి శృంగార నాయికలను, అనసూయ, సుకన్య వంటి మునిపత్నులను, దేవయాని వంటి మునిపుత్రికలను, మానసాదేవి, శశికళ, వంటి ప్రత్యేకపాత్రలను, అయ్యల గన్న అమ్మలను (దేవకి, యశోద), పురాణాల్లో తల్లులను (లీలావతి, రేణుక వగైరా) పరిచయం చేస్తారు. వీరికితోడు, లంకలో రాక్షసస్త్రీలగురించి, మృత్యువు గురించి కూడా వ్రాయటం రచయిత్రి సమదృష్టికి తార్కాణం.
మృణాళిని గారి శైలి చక్కగా చదివిస్తుంది. ప్రతి పాత్ర ముఖ్య లక్షణాలని పరిచయం చేయడానికి ప్రయత్నించారు. పాత్రలను యథాతథంగా పరిచయం చేయటం మాత్రమే తాను చేశానని రచయిత్రి చెప్పినా, వ్యాసం మొదట్లోనూ, చివరలోనూ పాత్ర తత్వాన్ని, ప్రాధాన్యతనూ తెలిపేది మాత్రం రచయిత్రి కంఠమే. ఉదాహరణకు రచయిత్రి దృష్టిలో, సత్యవతి “… భర్త, తండ్రి వంటి మగవారి అండదండలు లేకున్నా, కురువంశం నిలబెట్టడానికి తన యావత్తు శక్తిని తెలివితేటలనూ వినియోగిస్తుంది. భీష్ముడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు – భారతంలో అత్యంత కీలకమైన ఈ ముగ్గురు మహానుభావుల చరిత్రకు రూపకల్పన చేసింది సత్యవతే ”. అంబ పగపట్టిన పడుచే కాక, పురుషుడి బలహీనతనూ, స్త్రీల స్వావలంబననూ గుర్తించిన విజ్ఞురాలనీ, మహాభారతంలోని పెద్దమనుష్యులలోకెల్లా పెద్దమనిషిలోని చిన్నతనాన్ని ఎత్తిచూపిన స్త్రీ అనీ అంటారు మృణాళిని. ఇటువంటి ప్రతిపాదనలు, మనం ఆలోచించటానికి ఈ పాత్రలను వేరే కోణంలో పరిశీలించటానికి దోహదం చేస్తాయి.
ఒక పాత్ర వేరువేరు పురాణాలలో కనిపించినప్పుడు, ఆ పాత్ర చిత్రణలో ఉన్న సామాన్యతలనూ, వైరుధ్యాలనూ రచయిత్రి వివరిస్తారు. ప్రతి పాత్రకూ ఆ పురాణంలో ఉన్న ప్రాముఖ్యతని తెలుపుతారు. శూర్పణఖ, మంథర వంటి ప్రతినాయికలతో సహా అందరినీ రచయిత్రి సానుభూతితో పరిశీలిస్తారు.
ఈ పుస్తకంలో కథలూ, పాత్రలూ ఇంతకుముందు పరిచయమైనేనని అనుకున్నా, రచయిత్రి ఆ పాత్రల గురించిన చెప్పిన కొన్ని వివరాలు నాకు కొత్తవి. రాధ ప్రతీకనుంచి పాత్రగా మారిన విధానాన్ని గురించి కొత్త అవగాహన కల్పించారు. మృత్యువు అని ఒక పురాణపాత్ర ఉన్నదని నాకు మృణాళినిగారు చెప్పేవరకు తెలీదు. అగ్నిపురాణం ప్రకారం అధర్మానికి, హింసకూ పుట్టిన కూతురు నికృతి. నికృతికీ, అనృతానికీ పుట్టిన కొడుకు భయం. భయానికి మాయకూ పుట్టిన కూతురు మృత్యువు. ఈమెకు ఐదుగురు కొడుకులు: వ్యాధి, జర, శోకం, తృష్ణ, క్రోధం.
మహాభారతంలో శాంతిపర్వంలో నారదుడు అకంపనుడికి చెప్పిన మృత్యువు కథ వేరు. ఆ కథ ప్రకారం లోకం మీద ఆగ్రహించిన బ్రహ్మ తేజస్సునుంచి పుట్టిన స్త్రీ మృత్యువు. ప్రజలను సంహరించే బాధ్యతను ఆమెకు అప్పచెప్పటానికి బ్రహ్మ ప్రయత్నిస్తే ఆమె నిరాకరిస్తుంది. అతిప్రయత్నంపై బ్రహ్మ ఆమెను చివరికి ఒప్పిస్తాడు.
ఇ(ం)తిహాసం శీర్షిక తెలివిగా, ఆకర్షణీయంగా ఉంది. ఆ శీర్షికను సూచించింది ఆంధ్రజ్యోతివారట.
ఆంధ్రజ్యోతిలో 32 పురాణపాత్రలను ఈ ధారావాహికలో పరిచయం చేశానని, పుస్తకం కోసం కొత్తగా సీత, ద్రౌపదులపై ఇంకో రెండు వ్యాసాలు కొత్తగా వ్రాశానని రచయిత్రి ముందుమాటలో అన్నారు. మరి పుస్తకంలో 33 వ్యాసాలే ఉన్నాయి. ఒక వ్యాసం తప్పిపోయిందా (చూ. రెండేళ్ళ పద్నాలుగు) లేక లెక్కలో ఎక్కడో తప్పు వచ్చిందా అని సందేహం.
పుస్తకం పెద్ద అక్షరాలతో, పుష్కలంగా ఉన్న మార్జిన్లతో, మంచి కాగితంతో ఆకర్షణీయంగానే ఉంది. వ్యాసాల్లో అచ్చుతప్పులు బాధించలేదు. పుస్తకానికి బాపుగారు గీసిన ముఖచిత్రం గురించి కొత్తగా ఇంకేం చెప్తాం? ప్రతి వ్యాసానికి (ఒక్క మంథరకు తప్ప) ముందు ప్రత్యేకంగా ఆర్ట్‌పేపర్‌మీద ఆ పాత్ర వర్ణచిత్రాన్ని ముద్రించారు. కొన్ని చిత్రాలు శ్రీ పినిశెట్టి పేర (ఆయన సంతకంతోనూ, సంతకం లేకుండానూ) ఉన్నాయి. మరికొన్ని బొమ్మలపై వెంకట్, మీరా అన్న సంతకాలు కనిపించాయి. ప్రతి బొమ్మలోని ఒక భాగాన్ని మళ్ళీ వ్యాసారంభంలో కూడా ముద్రించారు. కొన్నిచోట్ల వర్ణచిత్రమూ, వ్యాసంలో చిత్రమూ భిన్నంగా ఉన్నాయి. సత్యవతిని మొదటి చిత్రకారుడు వృద్ధరాణిగా చిత్రించినట్లున్నారు; వర్ణచిత్రంలో బెస్తపడుచును చెయ్యటానికి ప్రయత్నించారు. నిజం చెప్పాలంటే, ఈ బొమ్మలు పాత్ర గుణగణాల్ని వివరించేట్లుగా ప్రత్యేకంగా ఏమీ లేవు. ఆకర్షణీయంగానూ లేవు. ఆ విషయం పక్కన పెట్టినా, ఈ వర్ణచిత్రాలపైన ఆ పాత్రల పేర్లు వ్రాసిన విధానం చెప్పుకోతగ్గది. 32 పేర్లలో దాదాపు ఎనిమిది అచ్చుతప్పులు ఉండటంలో టైపు చేసిన వారి అజ్ఞానంతో పాటు ప్రూఫులు చూడవలసినవారి నిర్లక్ష్యమూ కనిపిస్తుంది. పుస్తకానికి ఎక్కువ ధర పెట్టినట్లు అనిపించింది.
పుస్తకం స్త్రీ పాత్రల గురించే ఐనా, చాలా పురాణగాథలను పరిచయం చేస్తుంది. మన పురాణేతిహాసాలు, సంస్కృతి, తాత్విక దృక్పథాలపై ఆసక్తి ఉన్న వారు ఈ పుస్తకం తప్పక చదవాలి.
పుస్తకం వివరాలు:
ఇ(ం)తిహాసం
డా. సి.మృణాళిని
నవంబరు 2012
చినుకు పబ్లికేషన్స్
2728, 3rd floor, Datta’s Nayabazaar
Opp. Raj, Yuvaraj Theaters, Gandhinagar
Vijayawada 520 003
Phone: 0866-6640595, 98481 32208
E-mail: editor_chinuku@yahoo.com
225 పేజీలు; 250 రూ.
Rajan
‘ఇంతిహాసం’ eBook గా ఇప్పుడు ‘కినిగె’లో లభ్యమౌతుంది.
http://kinige.com/kbook.php?id=1361&name=Inthihasam