కొత్త చిక్కు లెక్కలు – రెండేళ్ళ పద్నాలుగు కథలు

(పుస్తకంలో ఇది నా నూరో టపా. విసుగు చూపకుండా ప్రోత్సహిస్తున్న పుస్తకం నిర్వాహకులు సౌమ్య, పూర్ణిమలకు, పాఠకమిత్రులకు కృతజ్ఞతలు — జంపాల చౌదరి.)

మధురాంతకం నరేంద్ర ప్రస్తుతం కథకుల్లో ప్రసిద్ధులు. మధురాంతకం రాజారాంగారి కుమారుడు, ఆయన సాహితీ వారసులు అని చెప్పేయవచ్చు కానీ అది నరేంద్రగారి ప్రతిభని తక్కువచేయటమే అవుతుంది. వస్తుస్వీకరణలోనూ, వ్యక్తీకరణలోనూ, కథావ్యాకరణంలోనూ రాజారాంగారికి, నరేంద్రగారికి పోలికలు తక్కువ. అందుకే కథకుడిగా తనకంటూ ఒక స్పష్టమైన ఉనికి, పలుకుబడి ఏర్పరచుకున్నారు నరేంద్ర.

ఈ సంపుటంలో కథలు నరేంద్రగారి ఇతర కథలకన్నా కొద్దిగా భిన్నమైనవి. ఈ కథల వస్తువు నిర్మాణం, చిత్రణ కొత్తవి. 2006-2010 మధ్యలో ఈ కథలు అక్కడక్కడా చదువుతున్నప్పుడు గమనించలేదుకాని, విభిన్నంగా కనిపించిన ఈ కథలన్నిటినీ కలిపే సూత్రం ఒకటి ఉంది. కుప్పం బాదుర్‌లో గ్రామీణ బాంక్ మానేజర్‌గా పని చేస్తున్నాయన తిరుపతి శివార్లలో కృష్ణానగర్ కాలనీలో కొత్త ఇల్లు కట్టించుకుంటున్నాడు. మునిరత్నంరెడ్డి అనే మేస్త్రీ ఆ ఇల్లు కడుతున్నాడు. ఇంటాయన మామగారు, అత్తగారు దగ్గరుండి పనిపై అజమాయిషీ చేస్తున్నారు.

ఇల్లు కట్టడమంటే మాటలా? స్థలం కొనుక్కోవాలి. ప్లాను గీపించుకోవాలి. పునాదులు తవ్వాలి. గుల్ల, సిమెంటు, ఇసక, ఇటికరాళ్ళు ట్రాక్టర్ల మీద తోలించాలి. అవి ఎవడూ ఎత్తుకుపోకుండా కావలి కాయడానికొక వాచ్‌మాన్ ఉండాలి. రోజుకూలీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, పెయింటర్లు, మార్బులు గ్రానైటు పనిచేసేవాళ్ళు, ఇట్లా రకరకాల మనుషులు కావాలి. అదిగో ఆ మనుషుల కథలే ఇవి. ఒక్కొక్కరి జీవితం ఒకలా ఉంటుంది. కృష్ణానగర్‌లో ఈ పనులు చేస్తున్నవాళ్ళంతా ఎవరు? అక్కడ పుట్టి పెరిగినవారేం కాదు. ఎక్కణ్ణుంచి వచ్చారు? ఎందుకిలా వచ్చారు? ఇక్కడ ఎలా బతుకుతున్నారు? కొత్త తాజ్‌మహళ్ళు కడుతున్న కూలీల కథలు చెప్తున్నాడు నరేంద్ర ఇక్కడ. యధార్ధ జీవిత వ్యధార్త దృశ్యాలు చూపిస్తున్నాడు ఈ కథకుడు.

ఐతే ఇవి సీరియల్ కథలు కావు. ఏ కథ వ్యవహారం దానిదే. ఎవళ్ళ జీవితం వారిదే. ఎవరి సుఖాలూ, దుఃఖాలూ వారివే. ఈ కథలు ఏ వరసలోనైనా చదువుకోవచ్చు. నెలల తరబడి వ్యవధినిచ్చీ చదువుకోవచ్చు. పెద్ద తేడా ఏమీ రాదు.

కానీ, ఈ కథల నిర్మాణం కొంత విలక్షణంగా ఉంటుంది. ఒక్కో కథ ఒక సంఘటన. కొందరు వ్యక్తుల మధ్య, ఒక పరిమిత కాలంలో జరిగిన సంఘటన. ఈ కథల్లో పాత్రలుంటాయి కానీ, ముఖ్యపాత్రలు తక్కువ. ఏదో సినిమా టీవీలో వస్తుంటే మధ్యలో చూడ్డం మొదలుబెట్టి కాసేపు చూసి ఆపేస్తే ఆ సినిమా కథ ఎంత తెలుస్తుందో అంతటి కథలు. స్పష్టమైన మొదళ్ళూ, చివరలూ ఉండే మూడు అంకాల నిర్మాణం ఈ కథల్లో కనిపించదు. పూర్వమూ పరమూ విడిగా తెలియని ఒక సంఘటన (కాకపోతే కొన్ని సంఘటనలు) జీవనంలోని ఒక పార్శ్వాన్ని ఒక వినూత్న కోణంలో ప్రతిబింబిస్తుంది. క్షణికంగా కళ్ళముందు కనిపించి ఆనవాళ్ళు మిగల్చకుండా మాయమైపోయే ప్రతిబింబాలు కావు ఇవి. వ్యక్తావ్యక్తంగా మనసులో ముద్రవేసిన ఈ చిత్రాలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చి అలజడి కలిగిస్తాయి.

ఈ కథల్లో మనుష్యులంతా సజీవంగా, నిజమైన మనుష్యుల్లాగానే కనిపిస్తారు, ప్రవర్తిస్తారు. అదే సమయంలో వారు ప్రతీకలూ అవుతారు. ఈ గారడీవిద్య నరేంద్రగారికి బాగా పట్టుబడింది. ఈ కథల్లో కనిపించేవారంతా ఒకరకంగా ప్రవాసులే. తమ తమ భౌతిక, సాంఘిక, తాత్విక మూలాలనుండి అనేక కారణాలవల్ల దూరమై బతుకుతున్న వారే. ఉన్నవూరిలో అగ్రకులాలుగా అధికారంతో గౌరవంగా బతుకుతున్నా అవసరాలకోసం పట్టణాలలో చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ పాత పౌరుషాలు వీడలేక కొత్త నాగరికతలో ఇమడలేకపోయిన వాళ్ళు; వర్షాలు పడక, తరాలుగా నమ్మిన భూమి మోసం చేయగా, వర్షాలు పడేవరకూ వేరే బతుకు తెరువు చూసుకుందామని వచ్చిన వారు; వేరే రాష్ట్రాల నుండి కుటుంబాల్ని వదిలేసి కాంట్రాక్టుపనులకోసం పొట్టని పట్టుకువచ్చినవారు, ఇలా ఎందరో. ఒక సాంఘికజీవనరీతిని వదిలివేసి కొత్త చోటకి మారినప్పుడు ఇంకో సాంఘిక జీవనరీతిని ఏర్పరచుకోగలిగితే బాగానే ఉంటుంది. కాని అస్థిరమైన సామూహికజీవనం మధ్య ఒంటరిగా అస్థిమితంగా బతకవలసి వచ్చి, పెకలించుకొని వచ్చిన మూలాల స్థానంలో కొత్త మూలాలు ఏర్పరుచుకోలేకపోతే జరిగే మానసిక ఘర్షణ, ఆ ఘర్షణ వల్ల జీవితం కల్లోలం కాకుండా ఉండటానికి చేసుకునే సర్దుబాట్లు, కొన్ని ఆశలు, కొన్ని నిరాశలు ఈ కథల వృత్తాంతాలు. ఇవి రియలిస్టిక్ కథలే కాని సర్రియలిస్టిక్, లేక మాజికల్ రియలిజం బాణీ కథలు కావు.

కథకుడిగా నరేంద్ర పరిణతి ఈ కథలన్నిటిలోనూ కనిపిస్తుంది. కథ ఏ మలుపులు ఎలా తిరగబోతుందో ఊహించటానికి లేదు. కానీ కథ అయ్యేపాటికి ఇలా జరిగే ఉంటుందనిపిస్తుంది. ఆ మాటలు అట్లానే మాట్లాడుకుని ఉంటారనే అనిపిస్తుంది. కథ ఐపోయాక మరి ఏమిటి ఇప్పుడు అన్న ప్రశ్న వస్తుంది. నరేంద్ర మాటల్లో కథాస్త్థలం ఇంప్రెషనిస్టు చిత్రంలా కళ్ళముందు కదలాడుతుంది. తర్వాత ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ పెరుగుతుంది. కథనంలోనూ, వాక్యనిర్మాణంలోనూ, పాత్రచిత్రణలోనూ, లౌల్యాన్ని తగ్గించుకొని, నియంత్రణతో రాసిన కథలు.

ఈ కథలు కొన్నిచోట్ల ఔరా అనిపిస్తాయి. కొన్నిచోట్ల కడుపులో దేవుతాయి. హింసరచనలో శేషాద్రి, సువర్చలల మధ్య బంధం అర్థమయినప్పుడు తీవ్రమైన బాధ కలిగింది. వజ్రకరూర్లోనూ, ముదిగుబ్బలోనూ పడబోతున్న వానల వివరాలకోసం ఎదురుచూస్తున్న మనుషుల మధ్య అమ్మ, అప్పల్ని వెదుక్కొంటున్న ఇంద్రాణిని తల్చుకుంటే జాలేస్తుంది. ఉన్నట్టుండి మాయమైన మొగుడి అర్థంతర మరణం గురించి గట్టిగా ఏడవలేని కిట్టమ్మ కత ఏమని చెప్తాం? వుగ్రంలో ఉండేటప్పుడు నరమానవుణ్ణెవణ్ణీ లెక్కచేయని పంచరత్న అబ్బురంగా కనిపిస్తుంది. పక్క అపార్ట్‌మెంట్లో నాలుగేళ్ళబట్టి ఉన్న మనిషి మాయమైనా, శవమైనా, లేక కళ్ళముందుకొచ్చినా పట్టని మనుషుల లోకంలో బతుకుతున్న మనకి చిత్రలేఖ కథ ఆశ్చర్యం కలిగించదు.

ఈ కథలేవీ వినోదాత్మక కథలు కావు. తేలిగ్గా చదివి పక్కన పారవేసే కాలక్షేపం కథలూ కావు. రచయిత అరటిపండు వొలిచి చేతిలో పెట్టటంలేదు. ఈ కథలు చదివాక, పొరలు నెమ్మదిగా విప్పుకొంటూ, లోపల ఏమున్నదో వెతుక్కునే పని పాఠకులదే. అంత కష్టపడే ఓపిక లేకపోతే ఈ కథలు అంతగా రుచించకపోవచ్చు.

కథల్లో చాలా వాటికీ, క్రిష్ణానగర్లో కడుతున్న ఇంటికి సంబంధం స్పష్టంగానే ఉన్నా, కొన్ని కథల్లో ఆ సంబంధం బలవంతంగా తెచ్చి ఇరికించినట్లనిపించింది. ఏ అవసరమూ లేకపోయినా తమ ప్రతి సినిమాలోనూ కొంతమంది దర్శకనిర్మాతలు తెర మీద కనిపిస్తారే, అలా.

పుస్తకం పేరు చూసి పద్నాలుగు కథలుంటాయనుకున్నాను. కథలు పదమూడే ఉన్నాయి కానీ బోనస్‌గా ఈ పుస్తకంలో కథలపై బి.తిరుపతిరావు గారి తొమ్మిది పేజీల వ్యాఖ్యానం (కమ్యునిటేరియన్ జీవన విధ్వంస నేపథ్యం లోంచి…) ఉంది. సాహిత్యవిమర్శ గానూ, సామాజిక తాత్విక విశ్లేషణ గానూ మంచి వ్యాసం. తిరుపతిరావుగారితో మరింతగా వ్రాయించుకోవలసిన అవసరం తెలుగు సాహిత్యానికి, తెలుగు పాఠకులకీ ఉంది.

(దాదాపు అచ్చుతప్పులు లేకుండా, మంచి కాగితం మీద, చక్కగా ముద్రించబడ్డ ఈ పుస్తకాన్ని విశాలాంధ్ర వారు ప్రచురించారంటే ఆశ్చర్యం వేసింది. ఇక ముందు వారి పుస్తకాలన్నీ ఇంత నాణ్యతతోనూ ప్రచురిస్తారని ఆశిద్దాం). ముందు బ్రాకెట్లలో ఉన్న మెచ్చుకోలు మాటలు, ఈ వ్యాసమూ వ్రాసి దాదాపు రెండు నెలలు అవుతోంది. ఈ మధ్యలో, తిరుపతిలో నరేంద్రగారిని కలసినప్పుడు తెలిసిన విషయాలు: కథలన్నిటినీ నరేంద్రగారే డిటిపి చేయించి విశాలాంధ్రవారికి ఇచ్చారట. కాకపోతే, నరేంద్రగారు 14 కథలు ఇస్తే (పుస్తకం పేరు గుర్తుందిగా?), ఘనత వహించిన విశాలాంధ వారు ఒక కథను ముద్రించటం మరచిపోయారట. వారు పారేసిన (పోనీ పారేసుకున్న) ఆ 14వ కథ ‘యజమాని’ని రచయిత అనుమతితో, అందిస్తున్నాను. ఈ సంపుటిలో మిగతా కథలతో సరితూగే కథే. పిడిఎఫ్ లో ఉన్నట్టు ఇది సాహిత్య నేత్రం లో రాలేదట; 2010 పాలపిట్ట కథల ప్రత్యేక సంచికలో వచ్చిందట.

జీవితంమీదా, సాంఘిక పరిణామాలమీదా, మంచి కథల మీదా, కథా శిల్పం మీదా ఆసక్తి ఉన్నవారు తప్పక చదవవలసిన పుస్తకం.

రెండేళ్ళ పద్నాలుగు
కథలు
మధురాంతకం నరేంద్ర
2010
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విజ్ఞాన్ భవన్, బ్యాంక్ స్ట్రీట్, ఆబిడ్స్, హైదరాబాద్ – 1
170 పుటలు. 75 రూ.

You Might Also Like

10 Comments

  1. రామ్

    జంపాల వారూ నమోన్నమః

    మీ టపాలు నా లాంటి చాల మంది ని ‘ఉయ్యాల’ లూపుతాయి !! శత టపా మహోత్సవం సందర్భం గా శుభాకాంక్షలు !!

    రామ్

  2. venkat

    ‘ఏదో సినిమా టీవీలో వస్తుంటే మధ్యలో చూడ్డం మొదలుబెట్టి కాసేపు చూసి ఆపేస్తే ఆ సినిమా కథ ఎంత తెలుస్తుందో అంతటి కథలు’
    —-అచ్చం నేనిలాగే అనుకొన్నాను అతని కధలు చదివాక.

  3. Ismail

    Congratulations Sir.I am a regular reader of this column.
    I have ought many books after reading your reviews.
    Thanks for sharing your thoughts through this medium.
    Congrats to Purnima and Soumya too for providing you
    a pitch for scoring this 100.

  4. పేరం కిరణ్ కుమార్

    ప్రియమైన జంపాల చౌదరి గారికి,
    వంద అద్భుత టపాలు మాకు అందించిన సందర్భముగా హృదయపూర్వక అభినందనలు/ధన్యవాదాలు.

    కొంత కాలం క్రిందట పుస్తకం.నెట్ లోకి ప్రవేశించిన నేను క్రమ క్రమముగ దానికి అభిమాని నయ్యాను.అందునా మీకు వీరాభిమానిని అయ్యాను. ప్రతి రోజు పుస్తకం.నెట్ వెబ్‌సైట్ ని సందర్శిస్తాను.

    మీరు వ్రాసే టపాలు నాకు ఎంతో ఇష్టం. మీ సమీక్షలు అన్ని చదివాను. నిర్జన వారధి పుస్తకం పైన మీరు వ్రాసిన సమీక్ష చదివాక (వృత్తి రీత్యా మలేసియా లో ఉద్యోగం చేస్తున్న నేను ) మన దేశం వెళ్లిన రోజే విజయవాడ లోని విశాలాంధ్ర బుక్ హౌజ్(అక్కడ షాప్ లోని వారికి మీరు సుపరిచితులు) కి వెళ్లి ఆ పుస్తకం కొని చదివేశాను. నాలో మన భాష మీద, సాహిత్యం పైనా అభిరుచి కలగటానికి ప్రేరణ కలిగించినా వారిలో మీరు ముఖ్యులు. ఇదే విధముగా మన పుస్తకం పాఠక మిత్రులందరిని పది కాలాల పాటు అలరించాలని కోరుకుంటున్నాను.

    మీ సమీక్ష చూశాక మధురాంతకం నరేంద్ర గారు రచించిన రెండేళ్ళ పద్నాలుగు కథలు త్వరగా చదవాలి అనిపిస్తుంది.

    పుస్తకం నిర్వాహకులు సౌమ్య, పూర్ణిమ గార్లకు కృతజ్ఞతలు.

    ఇట్లు,
    పేరం కిరణ్ కుమార్
    మలేసియ / గుంటూరు

  5. vijaya

    మీలంటి వాళ్ళు రాసే పుస్తక పరిచయాలు చదవడం నా లాంటి వాళ్ళకి విందు భోజనం చేసినట్టు. ఇన్నేసి పుస్తకాలు చదివేయడం, పైగా వాటికి ఇంత ఓపిగ్గా పరిచయాలు రాయడం…అసలు ఎలా సాధ్యమో అని ఒకటికి వంద సార్లు మెచ్చుకుంటూ, ఆశ్చర్య పడుతూ చదువుతాను. నాలాంటి వాళ్ళ కోసం మీరు మరిన్ని వందల టపాలు రాస్తూ ఉండండి.
    నేను ఇంకా మధురాంతకం రాజా రాం గారి కధలే ఈ మద్య చదివాను…ఈలోపే ఆయన తర్వాత తరం కూడ రెడీ అయిపొయారా!!!
    నా తరమా ఈ పుస్తక సాగరమీదగ….రామా! (ఇక్కడ రామా= జంపాల చౌదరీ, సౌమ్య, పూర్ణిమ లాంటి వాళ్ళు)

  6. Madhu

    I look forward every day for review of some new book by Dr Chowdary. I really enjoy reading dr Chowdary’s reviews.please write review of one book per week. But for Dr Chowdary, I would have seen this Pustakam

  7. Purnima

    Congrats for the 100th post. Many more congrats for each of the earlier 99 posts.

    Time to celebrate, isn’t it? నాకు పార్టీ కావాలి. 🙂

  8. బి.అజయ్ ప్రసాద్

    Reached 100 !!
    అభినందనలు.

  9. డా. మూర్తి రేమిళ్ళ

    నూరో టపా కి అభినందనలు , జంపాల గారూ !

    ఎన్నో సమీక్షలు , ముచ్చటైన వార్తలూ అందించిన మీ నుంచి ఇలాగే అతి త్వరలో ఒక స్వీయ రచనను కూడా తీసుకొస్తారని ఆశిస్తూ … డా. మూర్తి రేమిళ్ళ.

Leave a Reply