వైవిధ్యం, హర్రర్ నేపధ్యం – ఆ అరగంట చాలు

వ్యాస రచయిత: అరిపిరాల సత్యప్రసాద్
*******

నవరసాలలో భయానికి ఒక ప్రత్యేక స్థానం వుంది. అలాగే ప్రపంచ సాహిత్యంలో భయానక రచనలకీ ప్రత్యేక స్థానం వుంది. భయానక రచనలల్లో అంతర్లీనంగా సస్పెన్స్, థ్రిల్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఒకోసారి హాస్యం కూడా అవలీలగా కలిసిపోతుంది. ఇందువల్ల వైవిధ్యమైన రచనలను సృష్టించే అవకాశం వుంది. అయినప్పటికీ తెలుగు సాహిత్యంలో ఇలాంటి వైవిధ్యమైన రచనలు చాలా అరుదుగా వచ్చాయి. పాత తరంలో ఎంతో మంది రచయితలు ఇలాంటి కథలు, నవలలు రాసినా క్రమంగా ఈ జనెర్ ను తెలుగు రచయితలు అలక్ష్యం చేసినట్టు అనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో కస్తూరి మురళీకృష్ణ గారి తొలి తెలుగు భయానక కథల సంకలనం “ఆ అరగంట చాలు” ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సైన్స్ ఫిక్షన్ కథలు, హిస్టారికల్ ఫిక్షన్ కథలు వంటి వైవిధ్య రచనలు చేసిన మురళీకృష్ణగారు ఈసారి హర్రర్ కథల సంకలనం తీసుకువచ్చారు.

తెలుగు సాహిత్యంలో హర్రర్ కథలు అరుదుగా రావటం అటుంచితే, ప్రపంచవ్యాప్తంగా హర్రర్ కథలు విరివిగా రావటమే కాక అదో ప్రత్యేకమైన, పాఠకాదరణ పొందిన జెనర్ గా అభివృద్ధి చెందింది. ఈ రెండింటినీ కలిపి చూస్తే హర్రర్ కథలు రాయడంలో ఉన్న సమస్యలు ఏమిటో అర్థం అవుతాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా హర్రర్ కథ అనగానే ఇదేదో విదేశీ కథకు కాపీ అనే ప్రమాదం వుంది. అదే విధంగా పాఠకులకి అంతగా అలవాటు పడని కథ రాసి మెప్పించడం కష్టం అవుతుంది. ఉదాహరణకు సైకిక్ మీడియం, పేరానార్మల్ ఫ్రొఫెషన్ లాంటి విషయాలు చెప్పాలంటే చాలా వివరంగా రాయాల్సి వుంటుంది. ఇదంతా పేజీల పరిమితిలో ఇమిడిపోవాలి. ఇన్ని రకాల పరిధుల మధ్యలో పదిహేను కథలను రాసి మెప్పించిన మురళీకృష్ణగారి కృషి అభినందనీయం.

***
ఇందాక చెప్పినట్లు భయానక కథలలోకి సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ వంటి అనేక అంశాలు జోడించే అవకాశం వల్ల వైవిధ్యానికి ఆస్కారం వుంటుంది. ఈ కథా సంకలనంలో కూడా భయానికి వున్న అనేక కోణాలను స్పృశించారు రచయిత. సైన్స్ ఫిక్షన్ (ఆ అరగంట చాలు, తెల్లపొగ), సస్పెన్స్ (చీకటి, ఆమె), మేజిక్ రియలిజం (సాలీడు గూడు, కలకానిదీ) ఇలా వైవిధ్యమైన రచనల వల్ల ఈ పుస్తకం అద్యంత ఆసక్తికరంగా వుండి, ఆపకుండా చదివిస్తుంది. విపరీతమైన రక్తపాతాలు, పుర్రెలు, శవాలు, చేతబడులు, తాంత్రికులు అంటూ అనవసరపు ఆర్భాటాలు లేకుండా కేవలం అనుభూతి ప్రధానమైన హర్రర్ కథలే వుండటం వల్ల కూడా ఈ సంకలనంలో కథలు ఆసక్తికరంగా వున్నాయి. చాలా వరకు కథల్లో జరుగుతున్న సంఘటన, సందర్భం మన కళ్ళ ముందు కనపడి చిన్న జలదరింపు లాంటివి కలిగిస్తాయి. అక్షరాలతో ఇది సాధ్యం చెయడం రచయిత ప్రతిభకు నిదర్శనం. దాదాపు అన్ని కథలు ప్రధమ పురుషలో రాయడం, కొన్ని కథలలో స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ వాడటం, నిశబ్దాన్ని, ఉరుములు మెరుపులు వంటి శబ్దాన్ని సైతం హర్రర్ అనుభూతి ఇవ్వడానికి వాడటం అందుకు నిదర్శనం.

ఇలాంటి కథల పుస్తకంలో వున్న కథలను పరిచయం చెయ్యడం ఆ రసానుభూతిని భంగం చెయడం అవుతుంది కాబట్టి ఆ ప్రయత్నం విరమిస్తాను. “ఫాంటమ్ లింబ్”, “కలకానిదీ”, “చిత్రపటం”, “నమ్మలేని నిజం”, “ఆమె” వంటివి కథాంశం కారణంగా చాలా కాలం గుర్తుండిపోతాయి. మిగిలినవన్నీ శైలి వల్ల ఆకట్టుకుంటాయి. ఇవన్నీ చదివి అనుభవించాలేకానీ రివ్యూలలో చెప్పేవు కావు.

***
ఈ కథలన్నీ నవ్య వారపత్రికలో (రెండు మినహాయించి) హర్రర్ స్టోరీ శీర్షికన వచ్చాయి. అలా వరసగా రాసుకుంటూ పోతుంటే అన్నీ అద్భుతమైన కథలే రావటం అనేది దాదాపు అసాధ్యం. ఈ కథలు కూడా అందుకు మినహాయింపు కాదు. చాలా కథలు ఒకే రకమైన మూసలో పడిపోయాయి. సమస్య వున్న ఒక వ్యక్తి (బాధితుడు) మరొకరికి ఆ సమస్య చెప్పుకోవడం (మిత్రుడు, డాక్టర్ మె.), ఆ మరొకరు సమస్యను పరిష్కరింఛడానికి ప్రయత్నించి ఆ సమస్యకే బలికావడం. ఈ మూసలో ఇందులో వున్న చాలా కథలు వున్నాయి. అయితే ఆ సమస్య లక్షణాలు, పరిస్థితులు మార్చడం ద్వారా రచయిత కొత్తదనాన్ని తీసుకురాగలిగారు. “ఆమె” కథ సరిగ్గా ఇదే మూసలో సాగినా చివర్లో ఓ హెన్రీ మార్కు ట్విస్ట్ ఎండింగ్ తో అద్భుతం చెయ్యగలిగారు.

మొత్తం మీద చదవతగిన కథలు. చదివించే కథలు. తెలుగులో తొలి భయానక కథల సంకలనం కాబట్టి కొని దాచుకొదగ్గ పుస్తకం. అదే దృష్టితో చూసి, ఇది మొదటి హర్రర్ కథల పుస్తకం కాబట్టి తొలి అడుగుగా భావించి ఇలాంటి మరిన్ని వైవిధ్యమైన పుస్తకాలు వస్తాయని ఆశలు రేపెట్టే పుస్తకం.

చివరిగా మరో మాట – ఈ కథలతో పాటు, రచయిత ముందు మాట కూడా చదవతగ్గ అంశం. తెలుగు సాహితీ వృక్షం మూసకథల కొమ్మలనే పెంచుకుంటూ పోతూ వికృతంగా తయారైందనీ, వైవిధ్య రచనల ద్వారా ఈ చెట్టుకు సరైన రూపం కల్పించాలనీ అన్నారు రచయిత. ఆ ఆశయ సాధన దిశలో ఈ పుస్తకం ముందడుగు కాగలదు.

ఆ అరగంట చాలు
(తెలుగులో భయానక కథల తొలి సంపుటి)
రచయిత: కస్తూరి మురళీ కృష్ణ
ప్రచురణ: కస్తూరి ప్రచురణలు
వెల: రూ 100
ప్రతులకు: నవోదయ, కినిగె

You Might Also Like

3 Comments

  1. valluri raghavarao

    guru gaaru ee pustakam pi sameekshalu chadive mati poinde. idie yakkada doruku tondoo email chygalkarani naa aasaa.

  2. ఆ అరగంట చాలు – హర్రర్ కథలు | పుస్తకం

    […] ** (ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్లో వచ్చిన మరొక వ్యాసం ఇక్కడ) […]

  3. pavan santhosh surampudi

    //విపరీతమైన రక్తపాతాలు, పుర్రెలు, శవాలు, చేతబడులు, తాంత్రికులు అంటూ అనవసరపు ఆర్భాటాలు లేకుండా కేవలం అనుభూతి ప్రధానమైన హర్రర్ కథలే వుండటం వల్ల కూడా ఈ సంకలనంలో కథలు ఆసక్తికరంగా వున్నాయి. చాలా వరకు కథల్లో జరుగుతున్న సంఘటన, సందర్భం మన కళ్ళ ముందు కనపడి చిన్న జలదరింపు లాంటివి కలిగిస్తాయి. అక్షరాలతో ఇది సాధ్యం చెయడం రచయిత ప్రతిభకు నిదర్శనం.//
    ఒకవేళ పుర్రెలు లాంటివి లేకుండా అనుభూతి ప్రధానమైన అంశాలతోనే భయం సృష్టించి ఉంటే ఆ కవర్ పేజీ తప్పుడు సంకేతాలు ఇస్తోంది కదా..

Leave a Reply