పుస్తకం
All about booksపుస్తకాలు

October 30, 2012

రెండు దశాబ్దాలు-కథ 1990-2009

More articles by »
Written by: అతిథి
Tags: , ,

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్
***************
నాలాంటివాడికి కథల గురించి చెప్పడం అంత కష్టం మరొకటి లేదు. ఎందుకంటే-కథని ఓ బయాలజీ స్టూడెంట్ బుల్లి ల్యాబ్ జంతువుని డిసెక్ట్ చేసినట్టుగా.. ఇతివృత్తం, శైలి, శిల్పం అంటూ చెప్పెయ్యొచ్చు. అయితే జంతువు చచ్చినట్టుగానే కథ అందం చస్తుంది అలాంటి వివరణల వల్ల. ఆ జంతువులో కనిపించనిదీ కోసి వివరిస్తే మటుమాయమయ్యేదీ ప్రాణం. అట్లానే విడదీసి, వివరిస్తే అంతర్లీనంగా ఉండే తాత్త్వికత, పాఠకునికి ధ్వనించాల్సిన ధ్వని వివరించడం అవ్వదు సరికదా అవన్నీ ఒక్కోమారు వాచ్యంగా చెప్పాల్సి రావడం వల్ల కథ చదివితే రావాల్సిన అనుభూతి పోతుంది. ఐతే అసలు చెప్పడం ఎందుకూ? “బావుంది. నాకు నచ్చింది.” అంటే చదివేసెయ్యడానికి నేనేమీ ముళ్ళపూడి వెంకటరమణనేమీ కాదు. నా మాట నమ్మించడానికి ఈ వ్యాసం అంతా వ్రాయవలసి వస్తోంది. అందుకే కర్ర విరగకుండా పాము చావకుండా కథాసంపుటి గురించి చెప్తాను.

కథాసాహితి పేరిట వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ లు ఏటా ఉత్తమకథలతో కథ-1990 నుండి కథ-2009 వరకూ 20పుస్తకాలుగా ప్రచురించిన సందర్భం అది. ఆ సమయంలో ఆ 20 ఉత్తమ కథల సంకలనాల్లోంచి 30 కథల మరో ముగ్గురు లబ్దప్రతిష్టులు జంపాల చౌదరి, ఎ.కె.ప్రభాకర్, గుడిపాటిల సంపాదకత్వంలో రెండు దశాబ్దాలు-కథ 1990-2009 సంకలనం వేశారు. ఆధునిక తెలుగుసాహిత్యంలో కథ ఉన్నతోన్నత స్థాయుల్లోకి చేరిన ప్రక్రియ. అలాంటి కథ కాస్త మసకబారడం ప్రారంభమైన ఈ 20 ఏళ్లలో ఉత్తమ కథల సంకలనాలు వేసే ప్రయత్నం విజయవంతంగా జరగడం చాలా గొప్ప విశేషం. రచయితలకూ, పాఠకులకూ కూడా ఇటువంటి ఉత్తమ కథల సంకలనాలు చదవడం అవసరం. రెండు దశాబ్దాలుగా అలాంటి పని విజయవంతంగా సాగిన సందర్భం సంతోషానికీ, సమీక్షకీ సమయం. ఆ సంతోషానికీ, అలాంటి సమీక్షకీ దారి ఈ సంకలనం.

ఇది కథల సంకలనం కాబట్టి విహంగ వీక్షణంగానైనా ఇందులో కొన్ని కథల గురించి చెప్తాను. సంకలనంలో పేరొందిన రచయితలూ ఉన్నారు. అంతగా తెలియని రచయితలూ ఉన్నారు. చదివేసి నెమరేసిన కథలూ ఉన్నాయి. ఇంతవరకూ నేను చదవని కథలూ ఉన్నాయి. అయితే చాలా కథలు చదివాకా వెంటనే మరో కథలోకి కదలనివ్వనివే.

నా దృష్టిలో అది మంచి కథకీ, గొప్పకథకీ లిట్మస్ టెస్ట్. గొప్ప కథ వాక్యాలు నడిచేకొద్దీ మన చుట్టూ వేరే వాతావరణం నిర్మిస్తుంది. రకరకాల పాత్రలను నించోబెడ్తుంది. అంతర్లీనంగా మాటల్లో లేని ఏదో భావాన్ని ఆ పాత్రలకి వినపడకుండా, అక్షరాల్లో లేకుండా నేరుగా మనకు రహస్యంగా చెప్పబూనుతుంది. కథ పూర్తయ్యేపాటికి ఆ రహస్యం పూర్తికాదు. దాంతో మనం మన అనుభవాలతో, కథని విశ్లేషించుకునైనా అది అర్థం చేసుకోవాలి. లేదూ మళ్లీ ఆ కోణంలో కథను చదివి తెలుసుకోవాలి. అందుకే అనేది గొప్ప కథలు చదవడం పూర్తయ్యాకా మరో కథలోకి అంత తేలిగ్గా వెళ్లనివ్వవు. అలాగని అన్ని గొప్పకథలూ అలానే ఉండాలనేం లేదు. కాని కారణం ఏదైనా చాలా గొప్పకథలు పాఠకుడిలో మౌనాన్ని ప్రసవిస్తుంది. ధ్యానానికి ఆస్కారం ఇస్తుంది. కొన్ని కథలు తామే అంతా చెప్పేస్తాయి. అయినా ఆ కథలోని రుచి పోకూడదని మరో కథలోకి వెళ్లబుద్ధి కాదు. మంచి కాఫీ తాగినవాడు వెంటనే మంచినీరు తాగుతాడా?

ఆ మౌనం, ఈ కథల్ని విశ్లేషించుకోవడానికీ, ఓ చిన్ననోట్ వ్రాసుకోవడానికి పనికివచ్చింది నా వరకూ. ఆపై కథ చివర ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఫోన్ కొట్టి రచయితలతో మాట్లాడాను. మరీ గొప్పగా ఉందనుకున్నవి మరోసారి చదివాను. మొత్తానికి కొన్ని ఉత్త కథలూ, కొన్ని మంచి కథలు, ఎక్కువగా గొప్పగా నిలిచిపోయే కథలు ఉన్నయిందులో నా లెక్క ప్రకారం.

కె.ఎన్.వై.పతంజలి వ్రాసిన “పిలక తిరుగుడు పువ్వు” ఆయన గతంలో వ్రాసిన “గోపాత్రుడు” నవలకి కొనసాగింపులా ఉంటుంది. పాత్రలు సహజంగా, సంఘటనలూ సహజంగాను ఉండి ముఖ్యమైన పాయింట్ కామిక్ గా ఉంటే ఎంత హాస్యానికి, మరెంత సెటైరుకీ ఆస్కారం ఉంటుందో చూపించిన కథ ఇది. “భూమి గుండ్రంగా ఉందా? బల్లపరుపుగా ఉందా?” అని ఊళ్లో రాజులూ, వెలమలూ గొడవపడి కులాలన్నీ రెండు ముక్కలైపోయి, తేల్చుకోవడానికి ముందు రభస తర్వాత దొమ్మీ జరుగుతుంది. ఆ తర్వాత అన్ని సినిమాల్లా పోలీసులు వచ్చి భూమి పోలీసోడి లాఠీలా ఉందని నిర్ణయిస్తారు. అక్కడ “గోపాత్రుడు” పూర్తవుతుంది. ఆపై కేసు కట్టి కోర్టుకు తీస్కెళ్తే ఎవరికీ శిక్ష వేయకుండా భూమి బల్లపరుపుగా ఉందని తీర్పిస్తాడు ఆ సంఘటనతో ఈ కథ ప్రారంభమౌతుంది. పోలీసులు, విలేకర్లు, లాయర్లు, జడ్జీలు, ఉన్నతాధికారులు, కులపెద్దలు, కుట్రకేసులు అందరికీ వడ్డింపులు వడ్డించేస్తారు రచయిత ఈ కథలో. ఇలాంటిదే మనకో సినిమా ఉంది “అష్టా చెమ్మా”. కాని, పాత్రల ప్రవర్తన కూడా కామిక్ గా ఉండటంతో సెటైర్ సరిగ్గా తగలల్సినవారికి తగలదందులో. పతంజలి మాత్రం బ్రిలియంట్. ఆయన రచన అదును పదును చూసుకుని వ్రాసినట్టుంటుంది.
అందుకే సెటైర్ పండింది.

నా దృష్టిలో “బంగారు మురుగు“లోని బాక్ డ్రాప్ “రెండు నదుల మధ్య“లో ప్రధాన ఇతివృత్తం ఒకలాంటిదే. మొదటిది బ్రాహ్మణుల్లో ఒక శాఖ ఐన నియోగులు పాతిక ముప్పై ఏళ్లనాడు దొంగ స్వాముల మధ్య, డాంబికాల మధ్య ఆస్తులు కరగబెట్టుకోవడం కాన్వాసుగా బామ్మా-మనవల మధ్య వికసించి, పండిన అనుబంధం గురించి వ్రాసిన కథ. ఆ కులశాఖ వారి ఆస్తులు పతనం కావడం బ్యాక్ డ్రాప్ గా మాత్రమే వాడుకున్నారు ఈ కథలో. ఈ అంశం రచయిత అనుకుని వ్రాయలేదు అని నా భావన(ఆ రచయిత కూడా దాన్ని సమర్థించారు). ఇక “రెండు నదుల మధ్య” కథలో రచయిత కావాలనే ఇతివృత్తంగా కమ్మకులం దాదాపుగా ముప్పై, నలభై ఏళ్ల క్రితం ప్రారంభించిన ఓ ఆర్థిక ప్రయాణం వ్రాశారు. ఆ కులస్తులు రకరకాల దారుల్లో వెళ్ళి, ఆర్థికోన్నతి కోసం ఏం చేశారో ఏం కోల్పోయారో? ఊళ్లో అలానే ఉన్నవారికి ఏం మిగిలిందో? ఏం పోయిందో? అన్నది తీసుకున్నారు. అందులో భాగంగా వేరే ప్రాంతాల్లోని తన కులస్థులతో సాహచర్యం. తన ఊరి వాళ్ళే అయిన వేరే కులస్థులతో వైమనస్యం ఎలా పెంచుకున్నారో కూడా చిత్రితమైంది. ఈ కథ కూడా ఓ అన్వేషణలా ఉంటుంది కాని అంతిమ తీర్పులా ఉండదు.

“రెక్కలు” కేతు విశ్వనాథరెడ్డి కథ ఈనాటి మహిళ జీవిక కోసం వంటిల్లు దాటి చిరుద్యోగాల్లో ఎలాంటివి ఎదుర్కొంటోందన్న ఇతివృత్తం. అలాంటి అమ్మాయిలు కొందరు తమ బుల్లిరెక్కలతో జీవితాన్ని లాగుతూ కనిపిస్తే అంతకు కొన్ని వందల రెట్ల సంఖ్యలో వాళ్లవంక వెకిలిగా చూసేవాళ్లున్నారు. “సుజాత” అన్న వాడ్రేవు చినవీరభద్రుడి కథ మాత్రం నాకు అంతగా నచ్చలేదు. కాని దానికో ప్రత్యేకత ఉంది. రచయిత ఉత్తమపురుషకోణంలో(నేను అంటూ మొదలుపెట్టి కథ చెప్పే శిల్పం) కథ చెప్తారు. కాని ఆ కోణం స్త్రీది. పురుషుడైన రచయిత స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకుని, స్త్రీకోణంలోంచి కథ చెప్పడం చాలా ప్రత్యేకమైన శిల్ప విన్యాసం. వల్లంపాటి వెంకట సుబ్బయ్య “కథాశిల్పం”లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు(కథా సంకలనంలో కథ చదివిన కొన్నాళ్లకి కథాశిల్పంలో ఈ కథ ప్రస్తావన, ఉత్తమపురుషకోణంలో పురుషరచయిత స్త్రీగా ఊహించుకుని రాయడం చదివాను). ఏదేమైనా ఆ కథ నాకొక అస్పష్టమైన చిత్రంలా మిగిలిపోయింది.

“తెగినగొళ్లాలు” కథ అంతా శిల్పవిన్యాసమే. అడవిలో వెళ్తూ కొండవాగు మంచిగంధం చెట్లను, ఓషధులనూ కుమ్ముకుంటూ తనతో లాక్కుపోయినట్టు. ఇతివృత్తాన్నీ, శైలినీ.. ఈ కథలోని శిల్పమే లాక్కుపోతుంది. కథలో ముగింపు కూడా అబ్బురపరుస్తుంది. ముగింపు అనూహ్యమైనది ఒక విధంగా. తెగినగొళ్లాలు అన్న పేరును చూసి ముగింపు ఒకలా ఊహించుకుంటే ఆ ముగింపు మరోలా జరిగుతుంది(ఐనా కథకు పేరు సరైందే). కాని ఆశ్చర్యం కలగదు. నిర్మాణ సౌష్టవం జీవన సాక్షాత్కారానికి దారితీస్తుంది. నేటి సమాజంలో వింతపోకడలు పోతున్న బంధాలు, డబ్బూ ఎక్కడ కౌగలించుకుని, ఎక్కడ కత్తులు దూసుకుంటాయో చాలా వింత శిల్పంతో, అందుకు తగ్గ శైలితో వ్రాయకుంటే రక్తికట్టదు మరి.

అల్లం రాజయ్య సింగరేణి కాలరీస్ నేపథ్యంలో ఒక గొప్ప కార్మికోద్యమనేత ఎన్కౌంటర్ అనంతర పరిణామాన్ని ఇతివృత్తంగా తీసుకుని “అతడు” కథ వ్రాశారు. అది అద్భుతమైన కథ. ఏ కొలతలు పట్టుకుని వెళ్లినా ఆ కథ గొప్పదే అనిపిస్తుంది. సగం కథ పూర్తవగానే మిమ్మల్ని ఆ సింగరేణి కాలరీస్ లో దారీతెన్నూ చెప్పకుండా వదిలేస్తారు రచయిత. నేపథ్యానికి కథకీ ఓ అవినాభావసంబంధం ఉందా కథలో. మహోజ్వలమైన ఇతివృత్తం. అన్నింటినీ మించి తాను చెప్పగలిగినదీ, చెప్పదగినదీ, చెప్పాల్సినదీ ఏంటో అర్థం చేసుకుని మరీ ఈ కథ చెప్పారనిపించింది. అలా ఎంచుకుని చెప్పే కథ ఏదైనా జాతిరత్నమే. అందుకే ఈ కథ బాగా జాగ్రత్తగా సానబెట్టిన సహజరత్నం.

అల్లం శేషగిరిరావు వ్రాసిన “చీకటి” కథ శైలితో మన చుట్టూ వాతావరణాన్ని అల్లిన కథ. డిబిరిగాడు అనే సంచారజాతి వాడి విషాద చరిత్ర చెప్పేందుకు కెప్టెన్ రాజునూ, అడవిలో చీకటి, వేట నేపథ్యాన్నీ ఎంచుకోవడంలోనే ఉంది చాతుర్యమంతా. ఆ చాతుర్యం లేనివారూ, ఆ వాతావరణాన్ని పోషించలేని అసమర్థులూ ఈ కథ వ్రాస్తే, డిబిరిగాడికి దారమ్మటపోతూ జాలిపడి వాడి దిక్కుమాలిన బ్రతుకు వింటున్నట్టుంటుంది. అదే శేషగిరిరావు వ్రాసిన వాతావరణంలో అయితే నాగరికులు దద్దమ్మలవుతారు. ఆ సమయానికీ, ఆ వాతావరణానికీ డిబిరిగాడనే వాడు రాజు. కెప్టెన్ రాజు దేశదిమ్మరి(ఆ అడవికీ, ఆ వేటకీ). అక్కడ చెప్తేనే ఆ కథ అంత రంజుగా ఉంటుంది. ఎంతటి సంగీతవిద్వాంసుడైనా నడిరోడ్డు మీద, ట్రాఫిక్ లో పాడితే తాదాత్మ్యతకు లోనుకాగలడా? ఆయన పాటకు విలువ ఉంటుందా?

ఏమో ఇలా అయితే అన్ని కథల గురించీ చెప్పేసి మీకు ఈ కథాసంకలనాన్ని ఉప్పులేని చప్పిడికూడు చేసేస్తానేమోననిపిస్తోంది. అందుకే అనేది కథల గురించి చెప్పడమంత కష్టం మరొకటిలేదు. ఒక్కటే చెప్పగలను ఇది చదవాల్సిన కథల సంపుటి. కథాప్రియులకీ, ఔత్సాహికరచయితలకూ మాత్రమే కాదు ఎవరికైనా ఇది చదవాల్సిన సంపుటే. అందుకే 30కథల్లో కేవలం చాలా తక్కువ కథల గురించే చెప్పాను. అన్నం మెతుకు ముట్టుకుని అన్నం మొత్తం ఉడికిందో లేదో చూడగలరులెండి మీరు.

ఈ సంపుటి ప్రారంభంలోనూ చివర్లోనూ కొ.కు. కథల గురించి వ్రాసిన వాక్యాలు ఉంటాయి.(అదేంటో) పుస్తకాన్ని కథాసాహితి వారు ప్రచురించారు. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది. హార్డుబౌండు పేజీలు 422, ధర రూ.150(విశేషమేంటంటే ఈ పుస్తకం నాణ్యతకి, పేజీలకీ, హార్డుబౌండు అట్టకీ 250రూపాయలు చాలాతక్కువ ధర)

******
పుస్తకం వివరాలు:
రెండు దశాబ్దాలు: కథ 1990 – 2009
(30 కథలతో రెండు దశాబ్దాల ఉత్తమ కథా సంకలనం)
సంపాదకులు: జంపాల చౌదరి, ఏ.కే. ప్రభాకర్, గుడిపాటి
ప్రచురణ: కథాసాహితి, సికందరాబాద్, ఫోన్: 040 2779 7691
కథల జాబితా ఇక్కడ చూడవచ్చు.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.5 Comments


 1. Madhu

  If reviewers says everything, there is no fun and no interest. The reviewer has high light some stories, which was done. I appreciate the review, if all stories are introduced, Readers lose interest in reading this stories book. I too read some stories. I have to read others too.


 2. vinay

  ఎవరిదీ పరిపక్వత కాదు. విమర్శకు ఉండరానిది భయం. చదవడానికి ఇబ్బంది కలుగుతుందేమో అన్నది అన్నిటికన్నా హాస్యాస్పదం. కథల మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నా వ్యాసం కూడా ఒక మంచి సాహిత్య ప్రక్రియ. దానికీ న్యాయం చేయాలి.

  ఇకపోతే మీ ప్రతిపాదనలు నిరూపణలు లేనివిగా మిగిలిపోతున్నాయి – అన్ని కథల గురించి చెప్పకపోవడం వల్ల. చెప్పడం మీ స్వేచ్చ. అదెలా ఉన్నా.


 3. vinay

  భారీ ఎత్తున ఉపోద్ఘాతం మొదలుపెట్టి అర్థంతరంగా ముగించడం – ఆరంభశూరత్వంలా ఉంది మీ వ్యాసం. చివరికంటా సమగ్రంగా రాయలేకుంటే అసలు రాయకుండా ఉండటమే మంచిది. ముప్పైకథల్లో మూడునాలుగు కథల గురించే ప్రస్తావిస్తే ఎలా. పైగా ఉత్త కథలూ, కొన్ని మంచి కథలూ, ఎక్కువగా గొప్పగా నిలిచి పోయే కథలూ ఉన్నాయని ప్రకటించి అన్నిటి గురించి చెప్పకపోవడం విమర్శకుడి (లేదా సమీక్షకుడి) బాధ్యతారాహిత్యం.


  • కథలన్నిటి గురించీ చెప్పేస్తే చదవడానికి ఇబ్బంది కలుగుతుందేమోనన్న ఓ భయం. బహుశా అది సమీక్షకునిగా నా అపరిపక్వత వల్ల వచ్చినదనుకోవచ్చు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

భార్యని వర్ణించిన కవులున్నారు

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ************* కవులేల తమ భార్యను వర్ణించరని ఎల్లేపెద్ది వెంక...
by అతిథి
5

 
 

పుస్తకాలకు, పాఠకులకు మధ్య అనుసంధానమైనది

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ********** ఆరువేల పుస్తకాలు.. ఆరేడు నెలలు.. వెయ్యి వికీ వ్యాస...
by అతిథి
4

 
 

కథ 2013

వ్యాసకర్త: వాయుగుండ్ల శశికళ ****** వివిధ అంతర్జాల పత్రికలు మరియు వివిధ సంచికలలో ఈ ఏడాది ...
by అతిథి
6

 

 

కథ-2012

వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్ గార్ల సంపాదకత్వంలో ప్రతి సంవత్సరం కథా సాహితి వ...
by DTLC
6

 
 

విశ్వనాథ వారు ఎలా చెప్పారు?

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ******** విశ్వనాథ సత్యనారాయణ గారు నవలలు ఎలా చెప్పారు? అన్...
by అతిథి
17

 
 

సప్తవర్ణాల కరచాలనం

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ****** తెలుగువారిలో ఏ లలిత కళలోనైనా మంచి కళాకారులకులోటు...
by అతిథి
2