ఇరవై ఏళ్ళ కథ

రాసిన వారు: జంపాల చౌదరి
[రెండు దశాబ్దాలు కథ 1990 – 2009 సంకలనానికి జంపాల చౌదరి గారు రాసిన ముందుమాట ఇది. పుస్తకం.నెట్ లో ప్రచురణకు అంగీకరించినందుకు చౌదరిగారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్]
****************

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

****************

కథాసాహితి పేర మిత్రులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్‌లు ఉత్తమ తెలుగు ‘కథ’ సంకలనాలు ప్రచురించటం ప్రారంభించి ఇరవై సంవత్సరాలు గడిచాయి. ఏ స్వచ్ఛంద కార్యక్రమమైనా ఇరవై ఏళ్ళు నిరాఘాటంగా నిర్వహించటం సామాన్య విషయం కాదు; నిర్వాహకుల దీక్షకు, శ్రమకు మెచ్చుకోదగ్గ దృష్టాంతం ఈ మైలురాయి. ఇది సంతోషించి, సంబరాలు చేసుకోవాల్సిన సమయమే. ఒక్క సారి ఆగి, చేసిన పనిని చేయాల్సిన కార్యక్రమాల్ని సమీక్షించుకోవాల్సిన కాలమే.

ఈ ఇరవయ్యవ వార్షికోత్సవానికి అర్హమైన జ్ఞాపిక గురించి జరిగిన చర్చకు ఆఖరి రూపం ఈ ‘రెండు దశాబ్దాలు’ కథాసంపుటం. ఈ రెండు దశాబ్దాల ‘కథ’ వార్షిక సంకలనాలలో ప్రచురించిన కథలనుండి 20 ఉత్తమకథలను ఎంపిక చేసి ఒక ప్రత్యేక సంపుటాన్ని అందించాలని ఈ ప్రయత్నం ప్రారంభించాము. ఇరవై సంకలనాలు మళ్ళీ చదివాక 20 కథల పరిమితి చిన్నదనిపించింది. ముందు 25కు, ఆ పైన 30 వరకూ ఆ సంఖ్య పెరిగింది. ఇంకా పెంచినా బాగుంటుందన్న ఆలోచన వచ్చినా, ప్రచురణ పరిమితులను దృష్టిలో పెట్టుకొని అక్కడే ఆగిపోయాము.

ఏ సంకలనానికయినా కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ సంపుటానికి మేము విధించుకొన్న పరిమితులు మూడు: ’కథ’ 1990 – 2009 సంకలనాలలో ప్రచురితమైన కథలు మాత్రమే ఎంపికకు అర్హం. ఒక రచయిత కథలు ఎన్ని అర్హమైనవి ఉన్నా, వాటినుంచి ఒక్క కథని మాత్రమే ఎన్నిక చేసుకోవాలి. కథల సంఖ్య 30ని మించకూడదు.

ఈ సంపుటానికి మేము ఎంచుకొన్న కథలే ఈ రెండు దశాబ్దాలలో వచ్చిన ఉత్తమ తెలుగు కథలు అని మేము అనుకోవడం లేదు. గత రెండు దశాబ్దాలలో నాకు బాగా నచ్చిన కథలు కొన్ని, ఏ కారణాల చేతైనా, ’కథ’ వార్షిక సంకలనాలకు ఎక్కలేదు. అటువంటి కథలకు ఈ సంపుటంలో ఉండే అవకాశమే లేదు. వాటిని పక్కనపెట్టినా, ఈ ఇరవై ఏళ్ళ ’కథ’లలో ఈ కథలే ఉత్తమమైనవి అనుకుందామన్నా, పైన చెప్పిన పరిమితులకు తోడు సంపాదకుల వ్యక్తిగత అభిరుచుల పరిమితుల ప్రభావాన్ని ఉపేక్షించలేము. ముగ్గురు సంఫాదకులలో ఏ ఒక్కరి జాబితాను ఈ కథల జాబితాతో పోల్చినా కొన్ని తేడాలు ఉంటాయి; ఈ సంపుటిలో ఉండవలసినవి అని మేము విడివిడిగా అనుకొన్న కొన్ని కథలు ఈ సమిష్టి జాబితాలో చేరలేదు. ఏ కథాప్రియుడు 30 కథల జాబితా తయారు చేసినా కొంత తేడా ఉంటుందనే నా నమ్మకం.

నా సహసంపాదకులతో నాకు పూర్వ ప్రత్యక్ష పరిచయం స్వల్పం. వారి అభిరుచులు, దృక్పథాల గురించి నాకు తెలిసింది తక్కువ. ఐనా, ఈ 30 కథల్లోనూ, 10 కథలు మా ముగ్గురి మొదటి జాబితాలలో ఉన్నాయి. ఇంకో పదకొండుమంది కథకులు మా మొదటి జాబితాలలో వేరు వేరు కథలతో ఉన్నారు. మిగతా కథల విషయంలో ముగ్గురమూ భిన్నమైన కథకులను, కథలను మొదట ఎంపిక చేసుకొన్నాము. అన్ని కథల గురించి కూలంకషంగా చర్చించుకోవటం మొదలుబెట్టి, కొన్ని పట్టువిడుపుల తర్వాత 31 దగ్గర కొద్దిసేపు ఆగి, చివరకు ఈ సంకలనంలో తప్పకుండా ఉండవలసినవి అని ముగ్గురమూ ఏకాభిప్రాయానికి వచ్చిన కథలు ఇవి. ఈ ఎంపిక పూర్తిగా కథల సమగ్రస్వరూపంపైనే ఆధారపడింది కాని ఇతర విషయాల జోలికి వెళ్ళలేదు.

ఈ సంపుటం గత రెండు దశాబ్దాల తెలుగు కథల వస్తు, భావ, భాషా, శిల్ప, శైలీ వైవిధ్యాలకు దర్పణం పడుతుంది. నాలుగు తరాల రచయితల కథలు ఈ సంపుటంలో ఉన్నాయి. విస్తృతంగా వ్రాసిన కథకులూ, బహుకొద్ది కథలు వ్రాసినవారూ ఈ సంపుటిలో చోటు చేసుకొన్నారు. వామపక్ష రాజకీయపు కథలనుండి తాత్వికాన్వేషణ వరకూ భిన్నవస్తువులపై కథలున్నాయి. ఈ రెండు దశాబ్దాలలో తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అనేక ఉద్యమాల, రాజకీయ సాంఘిక పరిస్థితుల ప్రభావం చాలా కథల్లో స్పష్టంగా గోచరిస్తుంది. అదృశ్యమైపోతున్న జీవనవిధానాల దగ్గరనుండి ఇంతకుముందెన్నడూ కనని వినని నూతన విషయాల వరకూ ఈ కథల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నలుచెరగులనుండి రకరకాల వ్యక్తులు తమ తమ మాండలికాల్లో ఈ కథలు వినిపిస్తారు. పౌరాణిక కథల పునర్మథనం దగ్గరనుంచి మ్యాజికల్ రియలిజం వరకూ రకరకాల ప్రక్రియలు కనిపిస్తాయి. నవరసాల అనుభూతులు , ముఖ్యంగా రావిశాస్త్రి కథల్లో కనిపిస్తుందని శ్రీశ్రీ చెప్పిన రసన, ఈకథలు అందిస్తాయి.

ఎంపిక చేసిన కథలన్నీ ఇంతకుముందు మళ్ళీ మళ్ళీ చదువుకొన్నవే.. సుజాత, అడుసు నారయణప్ప, చీకటి డిబిరిగాడు, పిలకతిరుగుడు పువ్వు మాజిస్ట్రేటు, సీఐ, బంగారు మురుగు బామ్మ, కిందనేల ఉంది డాక్టరు, ఆమె కుమారుడు, అతడు, తాయమ్మ వంటి ఎన్నో వెంటాడే పాత్రలు ఈ కథల్లో ఉన్నాయి. జీవన వాస్తవాలపై, మానవప్రవృత్తిపై మనకున్న అభిప్రాయాల మూలాలను ప్రశ్నిస్తాయి కొన్ని కథలు. మనుషుల మనుగడపై మారుతున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ప్రభావాల్ని చిత్రీకరిస్తాయి మరికొన్ని కథలు.

’కథ’ 10వ వార్షిక సందర్భంగా, సమకాలీన చరిత్రకు ఈ సంకలనాలు అద్దం పడుతున్నాయని అన్నాను (కథ-99). ఐతే, ఈ సంపుటిలోని కొన్ని కథలు ఆ బేరీజుకి లొంగవు. అతడు, జాడ, టైటానిక్ వంటి కథలు 90వ దశకంలోనే రావటానికి వీలుంది. సాలభంజిక, కింద నేల ఉంది వంటి కథలు 2000 దశకంలోనే రాగలవు. కానీ, బంగారు మురుగు, చీకటి, మాయిముంత, అస్తిత్వానికి అటూ ఇటూ వంటి కథలకు ఈ కాలస్పృహ లేదు. ఆ కథలు ముప్పై ఏళ్ళ క్రితమైనా లేక 2010లో ఐనా వ్రాసి ఉండవచ్చు.

జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కథలన్నింటిలో కనిపించే సామ్యం, సన్నివేశ చిత్రీకరణలో, పాత్రీకరణలో ఈ కథకుల నేర్పు. అర్థరాత్రిపూట పిట్టలవేటైనా, పురిటినెప్పులు పడుతున్న గేదెను బ్రతికించుకోవాలన్న ప్రయత్నమైనా, తమకు ప్రియమైన నాయకుణ్ణి కోల్పోయి కుతకుత ఉడుకుతున్న పట్టణ వాతావరణమైనా, కాశీలో నిమజ్జన వ్యాపారం సాగించే పాండా సత్రమైనా, బసివిని చేస్తున్న గేరిలో పిల్లల సందడి ఐనా, ఏదైనా కానీ, ఉత్తమ చిత్రకారుడు అనేక వన్నెలతో చిత్రించిన చిత్రాల్లా సజీవంగా ఈ పాత్రలు, వారి జీవన స్థితిగతుల నేపధ్యం కళ్ళకుగట్టేలా, మనస్సుపై బలంగా ముద్రపడేలా చిత్రీకరించారు ఈ రచయితలు.

ఈ కథల్లో చాలావరకూ పరిమాణంలో పెద్దవి కావటం కూడా గమనించదగ్గ విశేషమే. ఇంత పెద్దవి కాకపోతే ఈ కథలు ఇంత బలంగా ముద్ర వేయగలిగేవా అన్నది ఆలోచించవలసిన ప్రశ్న. అదే నిజమైతే ఇంతింత పెద్ద కథల్ని ఇప్పుడెవరైనా వ్రాస్తే ప్రచురించే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయా? లేకపోతే ఇలాంటి కథలు ఇంకా వచ్చే అవకాశం తగ్గిపోతుందా లేక ఇప్పటికే పూర్తిగా మృగ్యమయిపోయిందా అన్నవి ఆలోచించవలసిన ప్రశ్నలు.

ఆందోళన కలిగించే ఇంకో విషయమేమిటంటే, ఈ సంపుటిలో కథల్లో మూడింట రెండొంతులు (20 కథలు) మొదటి దశకం నుంచి వచ్చాయి. రెండో దశకంనుంచి పదే కథలు. 2000 దశకంలో ఐదు వార్షిక సంకలనాలనుంచి ఒక్క కథ కూడా ఈ సంపుటి కెక్కలేదు. ఇది సంపాదకుల దృక్పథాన్ని సూచిస్తుందా లేక తెలుగు కథాప్రపంచంలో ఏర్పడుతున్న మాంద్యాన్ని సూచిస్తుందా అన్నది ఆలోచించవలసిన విషయం. ఒకవేళ రెండోదే నిజమైతే దానికి నివారణ మార్గాలను కనుగొనాల్సిన బాధ్యత కథాభిమానులందరి పైనా ఉంది.

ఈ సంపుటికి కథలు ఎన్నుకొనే ప్రయత్నంలో ఈ 20 ’కథ’ సంకలనాలలో 140మంది కథకులు రచించిన 272 కథలనూ శ్రద్ధగా పలుమార్లు చదివితే నాకు తోచిన కొన్ని విషయాలను ప్రస్తావిస్తాను. ఏ సంకలనానికి ఆ సంకలనం విడిగా చదివినప్పుడు కథల్లో చాలావరకు మంచి కథలుగానే అనిపించినా, అన్ని కథలూ ఒక్కసారే చదివినప్పుడు కొన్ని ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కథల్లో, ముఖ్యంగా ఈ దశాబ్దపు కథల్లో, వస్తువైవిధ్యం బాగా తగ్గిపోతుంది. కొన్ని వస్తువులు ప్రతి సంకలనంలోనూ మళ్ళీ మళ్ళీ దర్శనమిస్తున్నాయి. పంటలు పండక అప్పులపాలైన రైతు కథ, ఆధునికీకరణ వల్ల పనులుపోయిన వృత్తిపనివారి కథ, కంపెనీ మూతపడి ఇబ్బందులు పడుతున్న కార్మికుని/ఉద్యోగస్తుని కథ, పిల్లలకు భారమైన ముసలివాళ్ళ కథ, ’వాడి’ చేత మోసపోయిన వాళ్ళ కథ, బలవంతంగా వలస వెళ్ళిన కథ, దాదాపు ప్రతిసంపుటంలోనూ కనిపిస్తున్నాయి. ఒకోసారి ఒక రచయిత అదే వస్తువుని మళ్ళీ మళ్ళీ రాయటమూ కనిపిస్తుంది.

ఈ సంకలనాల్లోఉన్న కథల్లో చాలావాటిలో ప్రధానంగా కనిపిస్తున్నవి రెండే రసాలు: విషాదం, భీభత్సం. ముప్పై ఏళ్ళుగా తెలుగుదేశానికి దూరంగా నివసిస్తున్న వాడిగా అడుగుతున్నాను. తెలుగు జీవితాలలో మిగతా రసాలన్నీ ఉడిగిపోయాయా? లేక ఆ రసాలు కథావస్తువులుగా మలుచుకొనే నైపుణ్యం కరువైందా? ఆ రసాలు కథకు అవసరం లేదని సమిష్టిగా నిర్ణయించుకొన్నామా? లేక ’కథ’ సంపాదకులు విషాద, భీభత్స ప్రధాన కథలనే ఎంపిక చేస్తున్నారా? కథలు ఇలాగే కొనసాగితే తెలుగు కథకు పాఠకులు మిగులుతారా?

కథల్లో వస్తువైవిధ్యం లేనట్టే, శిల్ప వైవిధ్యమూ తక్కువగానే కనిపిస్తుంది. తొలినాళ్ళలోనే తెలుగు కథను పరిపుష్టం చేసిన తాత్వికత, మార్మికత దాదాపు మృగ్యమైపోయాయి. సింగిల్‌పాయింట్ కథలు ఎక్కువైపోయాయి. మళ్ళీ మళ్ళీ చదువుకొని కొత్త పొరలను పక్కకు తీసి కొత్త అందాలు, కొత్త విశేషాలు గమనించి, కొత్త ఆలోచనలు, అనుభూతులు పొందే అవకాశాలిచ్చే కథలు బాగా తక్కువ. పాఠకుణ్ణి రచయితలు తక్కువగా అంచనా వేస్తున్నారని అనిపిస్తుంది. చాలా కథలు సెంటిమెంటు, నోస్టాల్జియాల చుట్టూ తిరిగుతున్నాయి. ఆర్థికసంబంధాలపై పెడుతున్న దృష్టి, మనస్తత్వ విశ్లేషణపై, మానవసంబంధాలపై పెడుతున్నట్టు లేదు. ఒకవేళ పెట్టినా పైపొరలు దాటి శోధిస్తున్నట్లు లేదు. మాయమైపోతున్న పాత గురించి వెతలు చెందటం, గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అన్నట్లు రచయితలు సూచించటం అభిలషణీయమా?

నాకు కనిపించిన ఇంకో సమస్య. ఉపరితలాన్ని మాత్రమే స్పృశిస్తున్న వార్తాకథానాలు లేక వ్యాసాలు కథలుగా చలామణి కావటం. కథలకు నిత్యజీవితమే ఆలంబన ఐనా, కథ వార్తాకథనం స్థాయి మించనప్పుడు కథలు చదవవలసిన అవసరమేముంది? వార్తాపత్రికలు, ఇరవైనాలుగు గంటల న్యూస్‌ఛానెళ్ళు చాలా అందుబాటులో ఉన్నాయి కదా? పాత్ర చిత్రణ, శైలి, శిల్పం వంటి విషయాల మీద దృష్టి పెట్టని కథల్ని ప్రోత్సహించటం వల్ల మనం తెలుగు కథావికాసానికి మేలు చేస్తున్నామా, హాని చేస్తున్నామా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.

సమకాలీన సమస్యను వస్తువుగా తీసుకోవటమొక్కటే మంచి కథ లక్షణం అని మనం భావిస్తున్నామా? సమకాలీన విషయాన్నే చిత్రిస్తున్నా, సార్వకాలీనత, సార్వజనీనత, తాత్వికత లేకుండా గొప్ప కథలు అరుదుగా ఉంటాయని మనం మర్చిపోతున్నామా? శైలీ, శిల్పాలపై దృష్టి పెట్టకపోతే వస్తువొక్కటే కథని బలోపేతం చేయలేదు, గొప్ప కథ స్థాయికి తీసుకు వెళ్ళలేదు.

ఈ రెండు దశాబ్దాలు సంపుటానికి ఎంచుకొన్న కథలు తెలుగులో గొప్ప కథలుగా నిలబడుతాయి అని నేను అనుకోవటానికి కారణం ఈ కథలు పైన చెప్పిన లోపాలను చాలావరకూ అధిగమించాయి. ఈ కథలన్నీ బలమైన వస్తువును తీసుకొని, శైలికీ, శిల్పానికీ తగు ప్రాధాన్యమిచ్చాయి. తరచిచూసిన కొద్దీ కొత్త అంశాలు, అందాలు కనిపిస్తాయి. పాఠకులలో ఆలోచననూ, ఆసక్తినీ రేపెట్టే ఈ కథలు ఔత్సాహిక రచయితలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి అని నేను భావిస్తున్నాను.

ఈ సంపుటానికి సంపాదకత్వం వహించే అవకాశాన్ని ఇచ్చిన కథాసాహితి నిర్వాహకులు, మిత్రులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్‌లకూ, సహృదయ వాతావరణంలో కార్యనిర్వహణలో తోడ్పడిన కొత్త మిత్రులు సహసంపాదకులు ఏ.కే. ప్రభాకర్, గుడిపాటి గార్లకూ నా కృతజ్ఞతలు.

డా. జంపాల చౌదరి,
మండలైన్, ఇల్లినాయ్, యు.ఎస్.ఏ
నవంబరు 12, 2010

రెండు దశాబ్దాలు: కథ 1990 – 2009
(30 కథలతో రెండు దశాబ్దాల ఉత్తమ కథా సంకలనం)
కథల జాబితా ఇక్కడ చూడవచ్చు.

సంపాదకులు:
జంపాల చౌదరి
ఏ.కే. ప్రభాకర్
గుడిపాటి

ప్రచురణ:
కథాసాహితి
164 రవి కాలనీ
తిరుమలగిరి, సికందరాబాద్, 500015
ఫోన్: 040 2779 7691

424 పేజీలు
175 రూ. /25 డా.
ఆవిష్కరణ : నవంబరు 21, 2010 (ఆహ్వానా ప్రకటన ఇక్కడ చూడవచ్చు)

You Might Also Like

40 Comments

  1. రెండు దశాబ్దాలు-కథ 1990-2009 | పుస్తకం

    […] గుడిపాటిల సంపాదకత్వంలో రెండు దశాబ్దాలు-కథ 1990-2009 సంకలనం వేశారు. ఆధునిక […]

  2. తమ్మినేని యదుకుల భూషణ్

    @చౌదరి జంపాల:
    జంపాలగారు , పాత వ్యాసమే , “నేటి కాలపు కవిత్వం -తీరు తెన్నులు” పుస్తకం వచ్చిన కొత్తలో దాన్ని
    సమీక్షిస్తూ ( ఈ వ్యాసం క్రింద సమీక్షకు లింకు ఉంది , ప్రమాద హెచ్చరిక అన్న పేరుతో , పని చేయడం లేదు ) అందులో వారికి నచ్చిన వ్యాసంగా కథ – వాతావరణాన్ని ప్రచురించారు. అప్పుడు లింకు ఇద్దామంటే , అది
    కనిపించలేదు, ఇప్పుడు మళ్ళీ పని చేస్తోంది , పుస్తకం లేని పాఠకుల కోసం లింకు ఇచ్చాను.

  3. చౌదరి జంపాల

    @సురేశ్ కొలిచాల:
    సురేశ్:
    నా పాత వ్యాసాన్ని ఆర్కైవ్స్‌లోకి తిరిగి తెచ్చినందుకు కృతజ్ఞతలు. అది ఇప్పటిదాకా మాయమైపోయిందని నాకు తెలీదు. పరిస్థితులు 2001 నుంచి ఇప్పటివరకూ పెద్దగా మారినట్లు లేవు.

  4. చౌదరి జంపాల

    భూషణ్ గారూ:

    ఇది పాత వ్యాసమే కదా?
    అప్పుడే ప్రచురింపబడిందా లేక కొత్త మార్పులు, చేర్పులు ఏమన్నా ఉన్నాయా?

Leave a Reply