అగ్ని శిరస్సున వికసించిన వజ్రం – నార్ల చిరంజీవి
“దొంగదాడి కథ” పుస్తకం గురించి జంపాల గారు రాసిన మూడు భాగాల పరిచయం చదివాక – ఆ పుస్తకం గురించిన కుతూహలం కలిగింది కానీ, అంతకి మించిన కుతూహలం నార్ల చిరంజీవి రాసిన లేఖ పై కలిగింది. చిరంజీవి గారు నాకు బాగా నచ్చిన “భాగ్యనగరం” రాశారని తప్ప నాకింకేమీ తెలియదు ఆయన గురించి. ఈ నేపథ్యంలో కినిగె.కాంలో ఈ లేఖ ప్రధానాంశంగా గల “అగ్నిశిరస్సున వికసించిన వజ్రం – నార్ల చిరంజీవి” అన్న పుస్తకం కనబడడం తో చదవడం మొదలుపెట్టాను. చదివాక చిరంజీవి గారిపై ఎంత గౌరవం కలిగిందో, పుస్తకం రూపొందించిన తీరు, దానిలోని నిర్లక్ష్యం పై అంత విరక్తి కలిగింది. క్లుప్తంగా విషయం అదీ. కొంచెం వివరాల్లోకి వెళితే:
పుస్తకంలో ఉన్న వ్యాసాలు/లేఖలు వరుసగా:
(పుస్తకంలో విషయసూచిక లేకపోవడం నాకు బాగా చిరాకు తెప్పించిన అంశాల్లో ఒకటి. ఏమన్నా అంటే – మా తరంలో అలాంటివి పట్టించుకునే వాళ్ళం కాదు… అంటారు-ఇది కూడా అనుభవం అయ్యింది లెండి నాకు! కనీసం నాకు సూచిక ఉంటే మళ్ళీ చదవడానికి గానీ, ఫలానా చాప్టర్ ఫలానా చోట ఉంది అని ఎవరికన్నా చెప్పడానికి కానీ పనికొస్తుంది. పేజీ నంబర్లతో సహా మొత్తం గుర్తు పెట్టుకునేంత అమోఘమైన జ్ఞాపకశక్తి నాకు లేదు. క్షంతవ్యురాలిని. ఇక్కడ ఇస్తున్న సూచిక నాబోటి వారి కోసమే!).
౦) ప్రచురణకర్త విశ్వేశ్వర రావు గారి అంకిత వ్యాసం: పుస్తకం ఎందుకు వేస్తున్నామో చెప్పిన సంగతి పుస్తకం గురించి ఆసక్తిని, ఆయనపై గౌరవాన్ని కలిగించింది.
౧) “ప్రజాస్వామ్య పరిరక్షణ – కమ్యూనిస్టులు” పేరిట వరవరరావు రాసిన వ్యాసం : ఇది నాకు మాత్రం చాలా అయోమయంగా అనిపించింది (లెక్కలేనన్ని టైపోల వల్లా? ఒక దారీ తెన్నూ లేకుండా చరిత్రతో కోతి కొమ్మచ్చి ఆడుకున్నందువల్లా? ఏమో!). ఇలాగ రాస్తే, ఈ విషయాలతో బాగా పరిచయం ఉన్నవాళ్ళకి తప్ప ఈ వ్యాసం ఎవ్వరికీ అర్థం కాదు. ఇలాంటప్పుడే నాకు అనుమానం వస్తుంది – కొన్ని పుస్తకాలు ముందుగానే మొత్తం స్టోరీ తెలిసిన వాళ్ళకే ఊరికే వాళ్ళ మధ్య వాళ్ళు పంచుకోవడానికి వేసుకున్టారేమో అని!
౨) శివారెడ్డి ముందు మాట : శివారెడ్డి గారు ఈ పుస్తకానికి రాసిన ముందుమాట మాత్రం – అసలుకి ఇందులో ఏముంది? చిరంజీవి లేఖలో ఏముంది? అన్న కుతూహలం కలిగించేలా ఉంది!
౩) ౧౯౫౫ లో రచయితలు, పత్రికాధిపతులు కలిసి శ్రీశ్రీ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కమ్యూనిస్టు ప్రభుత్వం రాకూడదంటూ రూపొందించిన లేఖపై సంతకం పెట్ట నిరాకరిస్తూ నార్ల చిరంజీవి రాసిన లేఖ : నాకు చిరంజీవి గారి గురించి గొప్పగా అనిపించింది లేఖ చదివాక. ఒక విధమైన గౌరవభావం కలిగింది. జంపాల గారు తమ పరిచయంలో అన్నట్లు, ఈ లేఖ ఒక క్లాసిక్ అనే అనిపించింది (ముఖ్యంగా అప్పట్లో ఉన్న ఆ వేవ్ లో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే బ్యాలన్స్డ్ గా ఉన్నందుకు!)
౪) ౧౯౪౯లో ఎలమర్రు, కాటూరు గ్రామాలలో జరిగిన పోలీస్ జులుం ఉదంతం గురించి ఆంధ్రప్రభ సంపాదకీయం
౫) “ప్రాణహాని కన్నా దుస్సహం మానహాని” – అంటూ పై సంఘటన పై శ్రీశ్రీ, కొ.కు. ఇత్యాది మేధావుల స్పందన
-పై రెండూ చదివాక కొంచెం షాకింగ్ గా అనిపించింది నాకు.
౬) “స్నేహశీలి చిరంజీవి” అంటూ నార్ల చిరంజీవి మరణించినప్పుడు చేరా రాసిన వ్యాసం : చిరంజీవితో వ్యక్తిగత అనుబంధం గురించి పంచుకున్న వ్యాసం. బాగుంది.
౭) “ఒంటరి యోధుడు చిరంజీవి” అంటూ కే.ఎన్.వై.పతంజలి రాసిన వ్యాసం : ఈ వ్యాసం గురించిన ప్రస్తావన జంపాల గారి వ్యాసంలో చూశాను. బహుసా “దొంగదాడి కథ” పుస్తకం వెలువరించినప్పుడు రాసిన వ్యాసం అనుకుంటాను. నిజానికి ఈ పుస్తకానికి పరిచయ వ్యాసంగా ఉండదగ్గ వ్యాసం ఇది (వరవరరావు వ్యాసం స్థానే!). ఇదొక్కటి చదివితే చాలు, చిరంజీవి గారు రాసిన లేఖ అర్జెంటుగా చదవాలి అనిపిస్తుంది. ఈ వ్యాసం గానీ మొదట్లో ఉండి ఉంటే, నాకీ పుస్తకం గురించి కలిగిన వ్యతిరేక భావం సగం తగ్గేది! (పైగా ఇందులో అచ్చుతప్పులు తక్కువ కూడానూ!)
౮) “ఎలమర్రూ – కాటూరూ” -హరీంద్రనాథ్ చటోపాధ్యాయ కవితకు శ్రీశ్రీ అనువాదం : ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇలా చేసిందా! అని అవాక్కయ్యేలా చేసింది ఈ కవిత నన్ను మళ్ళీ. ౧౯౫౧ లో రాయబడ్డది ఈ కవిత.
౯) “మహాసంకల్పం” -శ్రీశ్రీ కవిత: ౧౯౪౭లో దేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంగా రేడియో లో ప్రసారం అయింది. నాకు చాలా నచ్చింది. భాష విషయంలో నా పరిధి తక్కువ కనుక కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ, అయినా కూడా కవితలోని రిథంలో కొట్టుకుపోయింది ఆ లిమిటేషన్.
౧౦) సంభవామి యుగే యుగే – శ్రీశ్రీ రచన. : ఈ రచన నాకు పూర్తిగా అర్థం కాలేదింకా. అయితే, నేను అర్థం చేసుకున్నంతలో – తప్పక చదవాల్సినది అనిపించింది.
కంప్లైంట్లు: భయంకరమైన అచ్చుతప్పులు. అది ఈ-బుక్ సమస్యా? లేక పుస్తకమే అలా వేసారా? అన్నది అర్థం కాలేదు.
చాలామటుకు “ధ,థ” సరిగా వచ్చినట్లు లేదు. “ప్రాదాన్యం, సాద్యం, ఆంద్ర, సాయుద, అదికారం, అద్యక్షుడు, గ్రంధం,అదికసంఖ్య, కళాసాదన, గాడాసక్తి” ఇలాగ చదవడం చాలా కష్టంగా అనిపించింది. సరిగ్గా గూగుల్ ట్రాన్స్లిటరేట్ లాగా వచ్చాయి ఇవన్నీ! కనీసం ఒక నూటా-యాభై టైపోలు అన్నా ఉంటాయి ఇలాగ!! ఎంతైనా ఇంత నిర్లక్ష్యమా! ఈ అచ్చుతప్పుల వల్ల కొన్నిసార్లు పేర్లు కూడా అయోమయంగా అనిపించాయి. ఉదా: వరవరరావు వ్యాసంలో : “రజనీ పామీ దత్ మన సిద్ధాంత కర్త. శ్రీపాద అమృత డాంగే, ఇ.ఏం.ఎస్.నంబూద్రిపాద్ లు ఆ సిద్ధాంత అన్వయ కర్తలు. ” అని ఉండింది. శ్రీపాద అమృత డాంగే ఎవరు? ఆ పేరేమిటీ ఆంధ్ర-మహారాష్ట్రల మేలుకలయికలా ఉంది? అన్నది చాలా సేపు అర్థం కాలేదు. తర్వాత అర్థం ఐంది…అది “శ్రీపాద్ అమృత్ డాంగే” (Shripad Amrit Dange) అని. ఈ టైపోలు నాలో పుస్తకం గురించిన కుతూహలం సగం మింగేశాయి.
“మేము పుస్తకం లో కంటెంట్ చూస్తాం. అచ్చుతప్పులు పట్టించుకోము.” అని చెప్పే వాళ్లకి నా జవాబు: “నాకు ఇంకా అంత అదృష్టం పట్టలేదు. హతోస్మి.”. అయితే, “దొంగదాడి కథ” పరిచయం మూలాన వీటిని అధిగమించి పుస్తకం చదవగలిగాను… ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను! (అందుకు జంపాల గారికి ధన్యవాదాలు). కానీ, ఈ విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే ముందే శివారెడ్డి గారి ముందు మాటలో అన్నట్లు : “సమీప గతం కూడా అందని, అంతుబట్టని ఒక తరం మన ముందు కదలాడుతుంది. చరిత్రని వ్యాఖ్యానించడం గాని, చరిత్రను అర్థం చేసుకుని, అన్వయించుకోవడం నేర్చుకోవడం కానీ, ఈ తరానికి పట్టదు” అని అన్న ఈతరం ఆ ప్రయత్నం చేయాలి అనుకున్నా కూడా ఇలాంటి పుస్తకాల్లో ఉండే ఈ టైపు లోపాలు అందుకు ప్రతిబంధకం అవుతాయి.
వెరసి, నేను ఈ పుస్తకం తప్పకుండా చదవాలనే చెబుతాను – ఆనాటి పరిస్థితుల గురించి ఎంతో కొంత తెలుసుకోవాలి అన్న కుతూహలం ఉన్న వారికి. అయితే, ఆ అచ్చుతప్పుల్ని భరించే ఓపిక ఉంటేనే ముందుకు సాగండి. లేదంటే, చదవలేరు.
చివ్వరగా ఒక్క ముక్క: ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశ్యం ఏదన్నా కావొచ్చును – నేను మాత్రం అప్పట్లో ఆంధ్రదేశంలో ఏం జరిగింది? అన్న కుతూహలంతో మాత్రమే చదివాను. కనుక నేను రాసిన పరిచయం కూడా ఆ కోణంలో ఈ పుస్తకం ఎవరికన్నా ఎందాకా ఉపయోగపడగలదు? అన్నది మాత్రమే.
పుస్తకం వివరాలు:
అగ్ని శిరస్సున వికసించే వజ్రం – నార్ల చిరంజీవి
ప్రచురణ: సాహితీ మిత్రులు, విజయవాడ, ఫిబ్రవరి ౨౦౦౯
వెల: ఇరవై రూపాయలు
ప్రతులకి: నవోదయ పబ్లిషర్స్, కినిగె.కాం.
pavan santhosh surampudi
నార్ల చిరంజీవి గురించి దాశరథి రంగాచార్య ఆత్మకథ నా జీవనయానంలో సవిస్తరంగా వస్తుంది. చిరంజీవికీ తనకీ మధ్య ఉన్న హృదయంగమమైన స్నేహాన్ని, అతని సాంగత్యంలో తన కవిత్వం ఎలా వికసించిందో త్యద్భుతంగా వ్రాశారాయన.