పుస్తకం
All about booksపుస్తకభాష

September 11, 2012

విశ్వనాథ సత్యనారాయణ గారి నవలిక “మాబాబు”

వ్రాసిన వారు: కొత్తపాళీ
(నిన్న-సెప్టెంబర్ 10, విశ్వనాథ జయంతి)
********
2009లో అనుకుంటా, విశ్వనాథవారి నవలల్ని సెట్టుగా విడుదల చేశారు. ఒక సెట్టు కొనుక్కుని తెచ్చుకున్నాను. అప్పటికి నాకు ఆయన రచనలని గురించి ఇంచుమించు ఏమీ తెలియదు. మా హైస్కూల్లో తెలుగు అధ్యాపకులు శ్రీరామమూర్తిగారు ఆయనకి నేరుగా శిష్యులు, వీరాభిమాని. అంచేత ప్రతీ ఏడూ జరిగే వ్యాసరచన పోటీలకి ఇచ్చే బహుమతుల్లో కనీసం ఒక్కటైనా విశ్వనాథవారి నవల ఉంటూ ఉండేది. ఆ రోజుల్లో చేతికందిన పుస్తకమల్లా చదివేసేవాణ్ణి, అర్ధమైనా కాకపోయినా .. అలా కొన్ని చదివానుగానీ ఏవీ గుర్తులేవు.

సరే ఈ సెట్టు కొని తీసుకు వచ్చిన తరవాత ఒక ప్రాజెక్టులాగా, వరసగా ఇవన్నీ చదివేద్దాము అనుకుని మొదలు పెట్టాను. ఒక ఆరు నవలలు చదివాను ఏకబిగిన. ప్రతి రచనా చాలా విచిత్రమైనదీ, విలక్షణమైనదీ. చదివిన వాటిని గురించి నోట్సు రాసుకుందా మనుకున్నాను, చెయ్యలేదు. ఒక పుస్తకంలో ఉన్నంత సేపూ దాన్ని ముగించే ఆలోచన. పుస్తకం ఐపోగానే .. కూర్చుని నోట్సు రాయకుండా .. ఇంకో పుస్తకం శీర్షిక ఆకర్షించేది. చిట్లీచిట్లని గాజులు .. దిండు క్రింద పోకచెక్క .. ఏమై ఉంటుందబ్బా ఈ కథ అని కుతూహలం .. ఇంకొక పుస్తకం తెరవడం .. అంతే, అలా జరిగిపోయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే చదివేసిన ఆ ఆరేడు నవలలూ చూచాయగా మాత్రమే గుర్తున్నాయి. ఐతే ఒకటి అర్ధం అయింది. ఈయన రచనల్ని, కనీసం వచన రచనలని, వెంటవెంటనే చాలా రోజులు చదవలేము. ఆ మాటల్లో, వాక్యాల్లో, భావాల్లో – వెరసి ఆ కథల్లో ఉన్న భావసాంద్రత చాలా తీవ్రమైనది – తక్కువ అంచనా వేసేందుకు లేదు. చదివినది అరిగించుకోడానికి మధ్యమధ్య విరామం కావాలి. అలా అప్పటి పఠనం ఆగింది. అడపా దడపా ఒక పుస్తకం పట్టుకుంటూనే ఉన్నా గానీ, ఏకబిగిన చదివే అవకాశం కుదరలేదు .. నిన్నటిదాకా.

నిన్న సాయంత్రం ఒక గంట ఖాళీగా ఉండి చేతికి అందిన పుస్తకం పట్టుకున్నాను. చిన్నదే – 160 పుటలు- నవలిక అనొచ్చు. పేరు మాబాబు. ఏదన్నా చిన్నపిల్లవాడి కథ యేమో అనుకున్నాను. చదవడం మొదలు పెట్టాను. మధ్యలో ఏవో కొన్ని పనులు చేసుకున్నా రాత్రి 1 గంటకి కథ ముగించే పడుకున్నాను.

టూకీగా కథ: కథానాయకుడు తానే “నేను” అని ఉత్తమ పురుషలో కథ చెప్పుకొచ్చాడు. ఈ కథలో ఇతనితో సహా ఎవరికీ పేర్లుండవు. ఇతను పుట్టకముందే తండ్రినీ, పుట్టుకతో తల్లినీ పోగొట్టుకున్న అనాథ. జాలిపడి పినతల్లి తీసుకెళ్ళిందిగానీ అత్తారింటి ఉమ్మడి కుటుంబంలో ఆమె మాటకేమీ విలువలేక జీతంబత్తెం లేని పిల్లపాలేరుగా ఆ యింటో పెరిగాడు. ఏడేళ్ళ వయసులో ఒక సందర్భంలో ఆ యింటివారిపై తిరగబడి, అక్కణ్ణించి పారిపోయి ఊళ్ళుపట్టుకుని పోతూ ఉంటే ఒక వూరివాళ్ళు రాత్రిపూట అతన్ని దొంగనుకుని చచ్చేట్టు కొట్టి గుంజకి కట్టిపడేశారు. మర్నాడు ఒక పెద్దాయన, వూళ్ళో మోతుబరి రైతు ఇతన్ని చూసి జాలిపడి, కట్లు విప్పించి తన ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టించాడు. అలా అతను ఆయన ఇంట్లో ఉండిపోయాడు. ఆ పెద్దాయన్ని బాబు అని పిలుస్తున్నాడు. ఆ పెద్దాయనే కథా శీర్షికలో ఉన్న “మా బాబు”. ఆ పెద్దాయన భార్య కూడా మహదొడ్డ ఇల్లాలు. ఇతన్ని చాలా దయగా చూస్తుంది. ఈ పిల్లాడు సహజంగా తెలివి తేటలు, ప్రతిభ కలవాడు కావడంతో, రెండేళ్ళలోనే వ్యవసాయం, అవసరమైన వ్యవహార విషయాలు, కొంత చదువు కూడా నేర్చుకుని ఆ పెద్దాయనకి కుడిభుజంగా ఉంటున్నాడు. పెద్దాయనకి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. ఆలస్యంగా కలగడంచేత వాళ్ళు బాగా చిన్నవాళ్ళు. పెద్దాయనకి అకస్మాత్తుగా పెద్దజబ్బు చేసి, కొన్ని రోజులు మంచంలో తీసుకుని చనిపోయాడు. ఈ సందులో ఆ పెద్దాయనకి బావమరది వరస అయ్యే ఒక బంధువు ఆ ఇంట్లో చేరి ఆయనతో ఏవో కాయితాల మీద సంతకాలు చేయించేసుకున్నాడు. అంతా ఇతనికి తెలుస్తూనే ఉన్నదిగానీ చిన్న పిల్లవాడు కావడంతో ఏమీ చెయ్యలేకపోయాడు. పెద్దాయన ప్రాణం పోగానే ఆయన భార్య శోకం భరించలేక బావిలో పడి చనిపోయింది. శవదహనం జరిగే లోపలే ఇతనికి ఆయింట్లో రోజులు చెల్లినాయని స్పష్టమైపోయింది.

మళ్ళీ రోడ్డునబడి కొన్ని వింత అనుభవాల తరువాత ఒక మోస్తరు పెద్దవూరు చేరాడితను. తీరా చూస్తే అది అతని మేనమామగారి ఊరు. ఆ మేనమామ ఇతన్ని ఎన్నడూ పట్టించుకోలేదు. ఆయనా పోయి కొన్నేళ్ళయింది. ఒక కూతురు, కొడుకుతో ఆ మేనమామ భార్య ఏదో తిప్పలు పడుతూ బండి ఈడుస్తున్నది. కొంత అయిష్టంగానే అతనికి ఆశ్రయమిచ్చింది. మంచి సమర్ధుడవటంతో ఒక్క ఏడాదిలోనే ఇంటి వ్యవసాయాన్ని చక్కబరిచి, పనులన్నీ ఒక కొలిక్కి తీసుకొచ్చి ఇంట్లోనూ, ఊళ్ళోనూ ఆ పిన్న వయసులోనే గట్టి మనిషి అని పేరు సంపాయించాడు. మేనమామ భార్య అభిమానంగా చూస్తూ, నా కూతుర్ని నీకే ఇచ్చి చేసి సగం ఆస్తికి యజమానిని చేస్తాను, నీ బావమరిదిని కూడా నువ్వే తీర్చి దిద్దాలి అంటూ వస్తున్నది. మరదలు మరిది కూడా ఎంతా అభిమానంగా గౌరవంగా ఉంటూ ఉన్నారు. ఇక అన్నీ బాగానే సాగిపోతాయి అనుకుంటున్న తరుణంలో ఇతనికి కలలో వాళ్ళ బాబు కనిపించి నా పిల్లల్ని అలా వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి వచ్చేశావా అని అడిగాడు. ఉలిక్కిపడి, ఎలాగో గుండె చిక్కబట్టుకుని మళ్ళీ ఆ వూరు వెళ్ళి చూస్తే అక్కడ పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఆస్తంతా ఆక్రమించుకున్న ఆ బంధువు పిల్లలు ముగ్గుర్నీ దారుణంగా హింసిస్తూ బానిసల్లాగా చూస్తున్నాడు.

కొన్ని ఆసక్తికరమైన పరిణామాల తరవాత, ఇతని తెలివి తేటలన్నీ ఉపయోగించి మొత్తానికి బాబుగారి ముగ్గురు పిల్లల్నీ ఆ వూరినించి తప్పించి తనతో తీసుకు వచ్చేశాడు మన కథానాయకుడు. ఇక అక్కణ్ణించీ కథ .. అడ్డం కాకపోయినా .. పక్కకి తిరగడం మొదలు పెట్టింది. మేనత్త కూడా చనిపోయింది. ఇంట్లో అందరూ కుర్రకారే – ఇతనే పెద్దవాడు. బాగా ఆలోచించి బాబుగారి పెద్ద కొడుకునీ తన బావమరిదినీ గుంటూరు పట్టణానికి తీసుకు వెళ్ళి పెద్ద హైస్కూలులో చేర్పించాడు. శలవలకి బస్తీబాబులా తిరిగొచ్చిన బాబు కొడుకుని చూసి మరదలు అతనివేపు ఆకర్షితురాలైంది. అది గ్రహించి బావమరిదికి కోపమొచ్చింది, ఇన్నాళ్ళు మనల్ని కనిపెట్టి ఉన్న బావయ్యకి అన్యాయం చేస్తావా అని.

మధ్య మధ్యలో ఎదురుపడి మాయమవుతూ ఉండే పాములవాడొకడు. అలాగే కలలో కనిపించి నిలవదీస్తూ ఉండే బాబు.

మరదలు ఎవర్ని పెళ్ళాడింది? బాబుగారి కూతురి గతేమయ్యింది? ఇతనేం చేశాడు? బావమరిది ఏం చేశాడు? బాబుగారి ఆస్తి మింగేసిన బంధువేమయ్యాడు? పాములవాడి పాత్ర ఏవిటి ఈ భాగోతం అంతటిలో? ఇంతకీ ఇతను తన పిల్లల పట్ల బాధ్యతని నెరవేర్చినట్లు బాబు ఆత్మ తృప్తి పొందిందా? ఇవన్నీ తెలియాలంటే నవలిక చదవాల్సిందే. నవలికలో సస్పెన్సు ప్రధానాంశం కాదు గానీ ఈ ప్రశ్నలు కొంత సస్పెన్సుతో కథాగమనాన్ని వేగంగా నడిపిస్తాయి. అంచేత నేను కథ సాంతం ఇక్కడ చెప్పెయ్యడం లేదు.

నా మాట: కథాసమయం ఇతమిత్థంగా చెప్పలేదుగాని, 1920లలో అయి ఉండవచ్చని నాకు తోచింది. అంతా గుంటూరు జిల్లా పల్నాటి సీమప్రాంత గ్రామాలలో జరుగుతుంది. మెట్టవ్యవసాయం, పొగాకు పంట, జొన్న కూడు-గోగు పచ్చడి – వీటి ప్రస్తావనలు కోకొల్లలు. కథ అంతా కాపు కుటుంబాల్లో జరుగుతుంది. కథలోనూ, కథలో పాత్రల జీవితాల్లోనూ కులం మరీ ముఖ్యం కాకపోయినా, ఆనాటి గ్రామీణ వాతావరణనికి తగినట్టు, వూళ్ళోకి ఒక కొత్త వ్యక్తి వచ్చాడంటే అతడు ఏ వర్ణస్తుడు అని కనుక్కోవడం, ఈ పిల్లవాడికి పాములవాళ్ళతో సంపర్కం ఉన్నదని తెలిసి ఆ ఊరివాళ్ళు ఆ కుటుంబాన్ని వెలేసినట్టుగా చూడ్డం వంటివి స్పష్టంగా చిత్రించారు. మొత్తమ్మీద వర్ణనలూ అవీ పెద్దగా లేవుగానీ, కథలో అంతర్భాగంగానే ఆ నేపథ్యం అంతా కూడా ఉండి కథకి రంగూ రుచీ వాసనా కల్పించాయి. అలా చూస్తే, విశ్వనాథ ఈ కథని కొంత ఆలోచించుకుని, ఒక ప్రణాళిక వేసుకుని రాసినట్టు నాకనిపించింది. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం – ఎందుకంటే నేను చదివినంతలో ఆయన ఇతర నవలలు దేనిలోనూ ఈ లక్షణం నాకు కనబడలేదు. అంతే కాదు, అతి సరళమైన భాష, పుస్తకం కింద పెట్టనివ్వని కథనం – ఈ రెండు లక్షణాలు కూడా నాకు చాలా అరుదనిపించాయి.

ఇంతాచేసి, కథలో ముఖ్యభాగం జరిగేది ఆరేడేళ్ళ కాలంలో. కథ పూర్తయ్యేప్పటికి కథ చెప్పుకొస్తున్న కథానాయకుడి వయసు పద్ధెనిమిది పంతొమ్మిది కంటే ఉండవు. కథ మధ్యలో కొన్ని కొన్ని సంఘటనలను గురించీ, వ్యక్తుల్ని గురించీ అతను చేసే వ్యాఖ్యానాలు ఆ ఈడుని మించి ఉంటాయి. కాకపోతే అతను సాధించే విజయాలు, కనబరిచే పరిణతీ కూడా ఈడుకి మించే ఉంటాయి కాబట్టి దీన్నీ సరిపెట్టుకోవచ్చు ననుకుంటాను. మామూలుగానే విశ్వనాథ నవలల్లో మానసిక విశ్లేషణ బాగా ఎక్కువ. ఈ కథ ప్రధాన పాత్ర తానే చెప్పుకోవడం వల్ల అతని ఆలోచనలన్నీ విస్తారంగా మనకి విశదపరుస్తూనే ఉంటాడితను. ఇతని మనస్తత్వంలో హేంలెటు లక్షణాలు కనిపించాయి కొంత. ఈ ఆలోచన తోచినాక, కథలో కూడా హేంలెటు ప్రభావం ఉన్నదేమో ననిపించింది. తండ్రి వంటి బాబు చనిపోవడం, చనిపోయాక కలలో కనబడుతూ ఉండడం, ఇదంతా. మధ్యలో పాములవాడి పాత్ర ఒక విచిత్రం. ఈ పాములవాళ్ళ జాతి ఏమిటో, పల్లెజీవితాల్లో దాని ప్రాముఖ్యత ఏమిటో నాకు తెలియదు. ప్రస్తుతం షెడ్యూల్డు తెగలు అని చెప్పబడుతున్న తెగల్లో ఒకటై ఉంటుందని అనుకుంటున్నా. వీళ్ళు ద్రిమ్మరులు (nomads). ఒక చోట స్థిరంగా ఉండరు. పాముల్నీ కోతుల్నీ ఆడిస్తూ భిక్షాటన చేస్తారల్లే ఉన్నది. అంతేకాక దొంగతనాలు, దారి దోపిళ్ళు కూడా. ఈ పాములవాళ్ళకీ గ్రామస్తులకీ మధ్య నడిచే అపనమ్మకంతో కూడిన ఒక సంక్లిష్టమైన సంబంధం నాకు చాలా ఆసక్తిని కలిగించింది కానీ, రచయిత ఇదేదో సర్వసాధారణమైన విషయమన్నట్టు దాన్ని వివరంగా రాయలేదు. బహుశా పల్లెల్లో పెరిగినవారికి తెలియవచ్చు. ఒక విధంగా పాములవాడు మన కథానాయకుడికి ప్రతిబింబం అన్నట్టుగా కూడా నాకనిపించింది. ఇద్దరూ కడు సమర్ధులు. ఇద్దరూ కృతజ్ఞతా భావంతో తామిచ్చిన మాట చెల్లించుకోవడానికి సర్వాన్నీ ఒడ్డినవాళ్ళు. ఇద్దరినీ అనేక విధాలుగా దురదృష్టం వెన్నాడుతూనే ఉన్నది. మొత్తమ్మీద ఈ పాత్ర మనస్తత్వం అంతటా, తద్వారా కథ అంతటా ఒక పలుచని దుఃఖపు తెర పరుచుకుని ఉన్నది.

అప్పట్లో దేశంలో జరుగుతున్న సాంఘిక మార్పుల చిత్రణ బహు కొద్దిగా కనిపించింది కథలో. కథ మొదట్లో ఒక్కసారి గాంధిగారి ప్రస్తావన తప్ప రాజకీయ ఆలోచన ఎక్కడా లేదు. అంతా వ్యవసాయానికీ, పల్లెటూళ్ళకీ అంటుకుపోయిన జనజీవనం. బాగా భాగ్యవంతులైన వివిధ వర్ణస్తుల పిల్లలు బహుకొద్దిమంది మాత్రం గుంటూరుకి పోయి ఇంగ్లీషు చదువుకోవడం, అటువంటి ఒక బ్రాహ్మణ యువకుని స్నేహంతో ఉత్తేజితుడై, తాను చదువుకోక పోయినా, తన తమ్ముణ్ణీ బావమరిదినీ చదివించాలని కథానాయకుడు శ్రమపడ్డమూ, ఆఖరుకి ఆమె కోరికను కాదనలేక, తనకు ఇష్టం లేకపోయినా, మరదలిని కూడా గుంటూరు స్కూల్లో చేర్పించడమూ చేశాడు. ఇంచుమించుగా ఇదే స్థలకాలాల్లో జరిగినట్లు రాయబడిన మహత్తరమైన తెలుగు నవల మాలపల్లిలో కనబడే రాజకీయ సామాజిక చైతన్యం (స్వాతంత్ర్యోద్యమం, అస్పృశ్యతా నివారణ, క్రైస్తవ మిషనరీల ప్రభావం, ఇత్యాది) ఇక్కడ మనకు కనబడవు కానీ, గ్రామీణ రైతాంగ జీవన చిత్రణలో, పాత్రల చిత్రణలో కొన్ని పోలికలు కనిపించాయి.

చలం రచనలు ఇంచుమించు అన్నీ చదివాను. విశ్వనాథవి చదివినది బహు కొద్ది. అయినా, పాఠక ప్రపంచం చలాన్ని అర్ధం చేసుకోనట్టే విశ్వనాథని కూడా అర్ధం చేసుకోలేదని చాలాకాలంగా నాకు అనిపిస్తూ వస్తున్నది. ఇద్దరి మీదనూ చెరొక ముద్ర వేసేసి చేతులు దులుపుకున్నారు అభిమానులూ విమర్శకులూ ఇద్దరూనూ. ఈ విషయాన్ని చలమూ విశ్వనాథా తామే ప్రస్తావించారు చాలా చోట్ల. ఈ ముద్రలకీ, ఇతర pre-conceived notionsకీ అతీతంగా విశ్వనాథ వచన సాహిత్యాన్ని, ముఖ్యంగా ఫిక్షన్ని అధ్యయనం చెయ్యాల్సి ఉంది.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.10 Comments


 1. mythili

  అంత ప్రసిద్ధం కాని మంచి నవలను పరిచయం చేసిన మా నారాయణ స్వామి గారికి ధన్యవాదాలు.
  ఇందులో తనను ఆదుకున్న పెద్దాయనని ‘ మా బాబు ‘ అంటాడు కథానాయకుడు. చదవకముందు ఇదేదో చిన్న పిల్లవాడిగురించిన కథ అనుకునేదాన్ని. విశ్వనాథ వారి ప్రతిభ ఒక్కొక్క రచనలో ఒక్కొక్క విధంగా వ్యక్తమవుతూ ఉంటుంది. చాలా సరళమైన శిల్పంతో చెప్పిన నవలిక ఇది. విశ్వనాథ ఒక ‘ సంసార్ల ‘ [అలాగే అనేవారు కృష్ణా, గుంటూరు జిల్లాల పల్లెటూళ్లలో ] అబ్బాయి కథను ఎంత సాధికారంగా చెప్పుకుంటూ వస్తారో ! మానవసంబంధాలలోని వేర్వేరు ఛాయలన్నీ కనిపిస్తాయి ఇక్కడ. ‘ సాంబారు కారం ‘ వర్ణన ఆకలి పుట్టిస్తుంది ..


 2. rahul

  panna lal gari anuvadam kathalu ekkada dorkutayo telupagalaru


 3. “పాఠక ప్రపంచం చలాన్ని అర్ధం చేసుకోనట్టే విశ్వనాథని కూడా అర్ధం చేసుకోలేదని చాలాకాలంగా నాకు అనిపిస్తూ వస్తున్నది. ఇద్దరి మీదనూ చెరొక ముద్ర వేసేసి చేతులు దులుపుకున్నారు అభిమానులూ విమర్శకులూ ఇద్దరూనూ.”ఈ మాటల గురించి చదివినప్పటినుంచీ ఆలోచిస్తూనే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ చదివితే గానీ “అభిమానులూ, విమర్శకులూ ఇద్దరూనూ” అన్న మాటలను గమనించలేదు.విశ్వనాథ గారి రచనలుఅతి కొద్దిగా చదివాను. కానీ ఆయన గురించి దురభిప్రాయం పెద్దగా లేదు. చలం ప్రసక్తి రాగానే నేను నా భుజాలు తడుముకున్నాను. నాకు చలం గారి స్వంత గొంతులో ఆయన రమణ మహర్షి గారి ఆశ్రమంలో చెప్పిన మాటలు వినేవరకూ ఆయన మీద అంత గొప్ప అభిప్రాయం లేదు. ఆయన వ్రాసిన కథలు ఒకటి రెండు చదివాను. నవలలు చదవలేకపోయాను. అది ఆయన ఎంచుకున్న వస్తువు వల్ల కాదు, శైలి వల్ల కాదు. ఆయన రచనల మీద ఉన్న “ముద్ర” వల్లనైతే అసలు కాదు. భరించడానికి కష్టమైన భావాలు. ఆ వ్రాసే భావాలలో వ్రాసే వారే మునిగిపోయినట్టనిపించినప్పుడు చదవడం కష్టమనిపించింది నాకు. మనుషుల మనస్తత్వాల పై ఒక అభిప్రాయం, తన అభిప్రాయమే సరైందని నిర్ణయించేసినట్టు కూడా అనిపించింది నాకు. అవకాశం దొరికినప్పుడు చలం గారి మ్యూజింగ్స్ చదవాలని ఉంది.
  తెలుగు పుస్తకాలను నేను చదివే తీరు అర్థం చేసుకోవడానికి ఆంగ్ల పుస్తకాల మీద పడ్డాను ఇప్పుడు. ఆయా రచయితల మీద ఉన్న “ముద్రల” వల్ల, లేదా భాష ఎక్కువ అలవాటు ఉండడం వల్ల ఆంగ్ల పుస్తక పఠనానుభవం తెలుగు పుస్తక పఠనానుభవం వేరుగా ఉంటాయా అని నా మీద నాకున్న సందేహం. ప్రస్తుతానికి కాదనే అనిపిస్తోంది. ఏ భాషలోనైనా రచయిత కథను చెప్పి, కథలో జీవించకుండా ఉంటే (ఆఖరికి అది తన స్వీయ చరిత్రే ఐనా) నాకు నచ్చుతోంది. చెప్ప దల్చుకున్న విషయాన్ని స్పష్టంగా objective గా చెప్పినప్పుడు ఒక్కో సారి ఆ స్పష్టతని భరించడం కష్టమే ఐనా చదవడం ముందుకి సాగుతోంది. చదవాలని అనిపిస్తోంది.


  • varaprasad

   manasuloni bavalni adi tappayina,oppayina bayataku cheppaleni valle chalam pustakalu chadavataniki bayapadalikani meerukadu saamee.


 4. SIVARAMAPRASAD KAPPAGANTU

  “ఆయా ముద్రల మాటునపడి ఎన్ని ఆణిముత్యాలు కోల్పోతున్నామో”

  People with vested interests shall create such stereo typing and we should be able to go beyond such brainwashing techniques and read what we like.


 5. “అప్పట్లో దేశంలో జరుగుతున్న సాంఘిక మార్పుల చిత్రణ బహు కొద్దిగా కనిపించింది కథలో.” — probably, the quantitative span of the novel was an obstacle for the author. He did such narration in Veyi Padagalu and some other novels big in size. I guess “Sarvari numchi Sarvari varaku” is a novel depicting social conditions during that 60 year period. I am unable to recollect the name of a novel, which is almost a 200-250 page one, discusses the merits and demerits of democracy.


 6. ”maa babu” pusthakam gurinchi entho chakkati visleshana rasaru. naku chaala ashcharyamga undi ee rojullo aa pusthakam chadavatam? intha chakkani bhavam, bhasha, vyaktheekarana undatam? oka goppa rachayitha laga ye vakyam/ ye vishayam tarwatha ye vakyam/ vishya cheppalo spashtatha undatam? ivanni chusthunte meeru maaji yuvakulemo anipisthondi? emanukokanda mi vayasentho chebuthara (naku 30)


 7. ఆయా ముద్రల మాటునపడి ఎన్ని ఆణిముత్యాలు కోల్పోతున్నామో నేడు మీ సమీక్ష చదివానాకా తెలిసింది. ఇటువంటి ఏ రాజకీయప్రసక్తులూ లేని గ్రామీణజీవనచిత్రణ కోసం పన్నాలాల్ పటేల్ గారి గుజరాతీనవలల అనువాదాలు చదువుకుంటోన్న నాకు ఇలాంటి నవల మన విశ్వనాథవారే వ్రాసారని తెలియకపోవడం దౌర్భాగ్యం. ధన్యవాదాలు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

విశ్వనాథునకు వివిధ కవి నాథుల పద్య నివాళి

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** ముందు మాట ఈ నెల (అక్టోబ...
by అతిథి
0

 
 

విశ్వనాథ చిన్న కథలు

విశ్వనాథ గారివి ఇదివరలో నవలలు కొన్ని, ఆత్మకథాత్మక వ్యాసాలు/ఇంటర్వ్యూలు చదివాను కాన...
by సౌమ్య
1

 
 

తెలుగు సాహిత్యంలో బలమైన స్త్రీ పాత్రలు-మొదటి భాగం:విశ్వనాథ నాయికలు

వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి ***************** ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన...
by అతిథి
2

 

 

తెఱచిరాజు – ఒక పరిశీలనా ప్రయత్నము

వ్యాసకర్త: శ్రీకాంత్ గడ్డిపాటి (విశ్వనాథ గారి తెఱచిరాజు నవలపై బెంగుళూరులో జరిగిన సా...
by అతిథి
7

 
 

స్వర్గానికి నిచ్చెనలు – అస్తి నాస్తి ల గంభీర చర్చ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************ భారతీయ భాషల్లో ఆలోచనాత్మకమైన రచనలకు ఏ క...
by అతిథి
0

 
 

విశ్వనాథలోని ‘నేను’ – మూడవభాగం

రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. రెండ...
by అతిథి
1