పుస్తకం
All about booksపుస్తకభాష

August 15, 2014

మౌలానా ఆజాద్

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. మౌలనా అబుల్ కలాం అజాద్ రచించిన “ఇండియా విన్స్ ఫ్రీడం” పుస్తకం 30 అముద్రిత పుటలతో కలిపి 1988 లో మళ్ళీ విడుదలైనప్పుడు వచ్చిన సంపాదకీయం. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్)
******

గాంధీజీ నాయకత్వాన భారత జాతీయోద్యమంలో పాల్గొన్న మహామహులలో నెహ్రు, పటేల్ తర్వాత ఎన్నదగిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్.

పార్సీ, అరబిక్, ఉర్దూ భాషలలో సాటిలేని పండితుడు ఆజాద్. ఉర్దూలో గొప్ప రచయిత. పత్రికా రచయిత, సంపాదకుడు. భారతజాతి గర్వించదగిన దేశభక్తులలో ఆయనొకరు. చిన్నతనంలోనే జాతీయోద్యమంలో ప్రవేశించారు. గాంధీజీ ప్రభావం క్రిందికి వచ్చే వరకు తీవ్రవాది. జాతీయ కాంగ్రెస్లో చేరి, దానికి ౧౯౨౩ లోనే, తన ౩౫వ ఏట – అధ్యక్షుడయ్యారు. పాకిస్తాన్ వేర్పాటును అంతగా వ్యతిరేకించిన ముస్లిం గాని, హిందువు గాని మరొకరు లేరు. కనుకనే ముస్లిం లీగ్ ఆజాద్ ను తన ప్రధాన శత్రువుగా భావించేది.

మరి రెండు రోజులలో మౌలానా ఆజాద్ శత జయంతి సంవత్సరం ముగియనున్నది. ఈ సందర్భంలో ఆయన సంస్మరణ- ఇండియా స్వతంత్రం కావడానికి ముందు రోజులలో ఆయన నిర్వహించిన కీలకపాత్ర దృష్ట్యా, దేశం స్వతంత్రమైన తర్వాత దేశ రాజకీయాలలో ఆయన ప్రముఖ పాత్ర దృష్ట్యా, సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. అయితే ఈ ఆసక్తిని ద్విగుణీకృతం చేస్తున్న అంశం మరొకటుంది.

ఆజాద్ మరి కొద్ది నెలలకు చనిపోతారనగా తన స్వీయ చరిత్రకు భారత జాతీయోద్యమ విశేషాలను, ముఖ్యంగా దేశ విభజన నాటి సంఘటనల వివరాలను జోడించి “ఇండియా విన్స్ ఫ్రీడం” అన్న గ్రంథం రచించారు. మౌలానా చెబుతుండగా ఆయన అభిమాని హుమయూన్ కబీర్ ఇంగ్లీషులో నోట్సు వ్రాసుకుని గ్రంథ రచన చేసినప్పటికి, దాన్ని ఆజాద్ రచనగానే పరిగణించాలి.

ఆజాద్ చనిపోయిన సుమారు ఏడాది తర్వాత ౧౯౫౯ జనవరిలో ప్రచురితమైన “ఇండియా విన్స్ ఫ్రీడం” అప్పటిలోనే ఎంతో కుతూహలాన్ని, వివాదాన్ని కూడా రేకెత్తించింది. తన సమకాలికులపైన, దేశ విభజనకు దారి తీసిన పరిస్థితుల పైన ఆయన దాపరికం లేకుండా అనేక విషయాలు వెల్లడించారు.

కాగా, అసలు గ్రంథంలో ౩౦ పేజీలను అవి మరీ కటువైన నిజాలను వెల్లడిస్తున్నవని భావించినందున ఆజాద్ ప్రస్తానికి తొక్కి పెట్టవలసిందని తనతో చెప్పారని, వాటిని ఆజాద్ చనిపోయిన ౩౦ ఏళ్లకు మాత్రమే ప్రచురించాలని హుమయూన్ కబీర్ గ్రంథ ప్రచురణ కర్తలతో చెప్పడం, ఆ కోర్కె మేరకు కడచిన ఫిబ్రవరిలో ఆ ౩౦ అముద్రిత పుటలను వెలుగులోనికి తీసుకురావలసి వుండగా, అటు ఆజాద్ వారసులు, ఇటు కబీర్ వారసులు వివాదం లేవదీయడం, చివరికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం ప్రకారం ఆ పేజీలను ప్రచురణకర్తలకు అందజేయగా వారు మొన్న సోమవారం నాడు పూర్తి పాఠంతో గ్రంథాన్ని విడుదల చేయడం జరిగింది.

అయితే, ఆజాద్ పుస్తకంలోని అముద్రిత పుటలు దేశంలో కొన్ని నెలలుగా కలిగించిన సంచలనానికి కారణం గ్రంథ వారసత్వంపై వివాదం కాదు. ఆ పుటలలో ఆజాద్ ఏవో రహస్యాలు వ్రాసారని, అవి కనుక బయటపడితే ఎందరెందరో జాతీయోద్యమ మహామహుల కీర్తి ప్రతిష్ఠలు మట్టిపాలు కాగలవని ఒక ఊహాగానాన్ని ఎవరో ప్రారంభించారు. ఆ ఊహాగానం అందుకుని వివిధ పత్రికలూ ఆజాద్ గ్రంథంపై ఆసక్తిని మరింతగా పెంపొందించాయి. ముఖ్యంగా నెహ్రూకు సంబంధించిన ఏవో రహస్యాలు ఆజాద్ వెల్లడించి ఉంటారని చాలామంది ఎదురుచూశారు. రాజకీయంగా తమకు లాభిస్తుందని ఆశపడ్డారు కూడా!

చివరకు, ఇటీవల కొద్ది రోజులుగా వెల్లడి అవుతున్న ఆజాద్ అముద్రిత పూతల విశేషాలను చూడగా, ఆయన అందులో కొత్తగా వెల్లడించిన – అదివరకు ఎవరికీ తెలియని, లేదా ఊహించని – విశేషాలంటూ ఏమంతగా లేవని విదితమౌతుంది. నెహ్రూకు సంబంధించిన “రహస్యాలు” ఏమీ లేకపోవడం బహుశా కొందరికి ఆశాభంగం కలిగించి ఉండవచ్చు కూడా.

ఆజాద్ తన గ్రంథంలో వెల్లడించినవన్నీ చారిత్రిక సంఘటనలే, అవి అందరికీ తెలిసినవే. వాటిపైన, అంతకంటే ఎక్కువగా ఆ సంఘటనలలో పాల్గొన్న తన సమకాలికులపైన, ఆజాద్ వెల్లడించిన కొన్ని అభిప్రాయాలు మాత్రం ఆసక్తి కలిగిస్తాయి.

నెహ్రూ, పటేల్ లపై ఆజాద్ కొన్ని ఆరోపణలు చేసారు. ముఖ్యంగా దేశ విభజనకు నెహ్రూ అంగీకరించడాన్ని నిశితంగా విమర్శించారు. కీలక సమయంలో తాను వైదొలగి కాంగ్రెస్ అధ్యక్షా పదవిని నెహ్రూకు అప్పగించడం తన రాజకీయ జీవితంలోకెల్లా గొప్ప తప్పిదంగా ఆయన పేర్కొన్నారు. ౧౯౩౭ లో యూ.పి. లో ముస్లిం లీగ్ ను రాష్ట్ర ప్రభుత్వంలో చేర్చుకొనడాన్ని నెహ్రూ వ్యతిరేకించడం, ౧౯౪౬ లో క్యాబినెట్ మిషన్ పథకంపై నెహ్రూ చేసిన ప్రకటన ముస్లిం లీగ్ వేర్పాటు ఉద్యమాన్ని బలపరిచాయని ఆయన భావించారు.

అయితే, ఇవి మొదటిసారిగా బయటపడుతున్న విషయాలు కావు. దేశ విభజన నాటి రాజకీయాలను శ్రద్ధగా గమనించిన వారందరికీ తెలిసినవే. దేశ విభజనకు నెహ్రూను బాధ్యుడిని చేయడం, అందులో లేడీ మౌంట్ బాటెన్ ప్రభావంలో పడి నెహ్రూ దేశ విభజనకు అంగీకరించారనడం అన్యాయంగా కనిపిస్తుంది. దేశ విభజనను ఆజాద్ వ్యతిరేకించిన మాట నిజమే కాని, నెహ్రూయే కాక తక్కిన ప్రముఖ నాయకులందరూ అంగీకరించారు. గాంధీజీ కూడా అనిష్టంగానే తల వూపారు.

ఆజాద్ పేర్కొన్నట్టు క్యాబినెట్ మిషన్ పథకం అమలు జరిగినప్పటికీ కాంగ్రెస్, ముస్లిం లీగ్ల మధ్య ఎంతో కాలం సహజీవనం కొనసాగి వుండేది కాదనడం కాదనలేని విషయం. పాకిస్తాన్ వేర్పాటు ఒక చారిత్రిక, అనివార్య సంఘటన. దాని అనివార్యతను ౧౯౪౨ లోనే రాజాజీ ఊహించారు. అప్పటిలో ఆయనను ఛీత్కరించిన వారే పాకిస్తాన్‌ను అడ్డుకొనడం సాధ్యంకాదని అంగీకరించక తప్పలేదు.

అయితే, ఆజాద్ తన పుస్తకంలో పేర్కొన్న విషయాలన్నీ ఆనాటి సంఘటనలకు ఆయన వ్యక్తిగత ప్రతిస్పందనను తెలియజేస్తాయి. వాటిని ఇతరులు యథాతథంగా, తిరుగులేని నిజాలుగా అంగీకరించనవసరం లేదు.

టాల్స్టాయ్ తన “వార్ అండ్ పీస్” నవలలో మానవ చరిత్రను మలుపు తిప్పిన మహోదంతాలు ఏ కొద్దిమంది వ్యక్తుల ఇష్టనిష్టాలతోనో ముడిపడి వుండవని ఉద్ఘాటించాడు. అలాగే చరిత్ర కనివిని ఎరుగనంతటి ఘోర రక్తపాతం మధ్య జరిగిన ఇండియా విభజనకు ఏ కొద్దిమంది నాయకులో కారణం కాదు. అదొక చారిత్రిక అనివార్యత. దానికి సన్నిహితంగా మసలినవారికి కొద్ది మంది వ్యక్తులే బాధ్యులుగా కనిపించడం సహజం.

ఇప్పటికే ఆజాద్ అముద్రిత పుటలు రేకెత్తించిన ఆసక్తి, వాదోపవాదాలు ఇకపై కూడా కొనసాగుతాయని భావించవచ్చు. ఆయన ఆరోపణలకు గురి అయినంత మాత్రాన నెహ్రూ, పటేల్ వంటి మహా వ్యక్తుల దేశ భక్తికి కళంకం రాబోదు.

(నవంబర్ ౯, ౧౯౮౮)
(November 9, 1988)About the Author(s)


2 Comments


  1. paramesh reddy

    Pustakam lo vishayam emaina moulana garu hindu muslim ikyatha kosam patu padina vyakti ga manandari madilo nilichi poyaru


  2. pavan santhosh surampudi

    భారత విభజనను గురించి చదివినప్పుడల్లా కోట్లాదిమంది హిందూ-ముస్లిం-సిక్ఖు బాధితుల గురించి విపరీతమైన బాధకలుగుతుంటుంది. వారితో పాటుగా రాజకీయనేతల్లో మరో ఇద్దరి గురించి కూడా చాలా బాధపౌడుతుంటాను. వారు-మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. వీరిద్దరినీ కాంగ్రెస్ నాయకత్వం హిందూ-ముస్లిం ఐక్యత, అఖండ భారత దేశ ఏర్పాటు అవసరం వంటి విషయాలపై నమూనాలుగా, అడ్వొకేట్లుగా రకరకాలుగా ఉపయోగించింది. వీరు కూడా ఆ మహోన్నతమైన లక్ష్యానికి తమ జీవితాన్ని అంకితం చేసినట్టుగా ప్రవర్తించారు. ఇటు మౌలానా తన తోటి యూపీ, బీహారీ ముస్లిముల దృష్టిలో చాలా బలహీనుడిగా, పాకిస్తాన్ ఏర్పాటుకు పెద్ద విఘాతంగా చిత్రీకరింపబడ్డారు. అటు గఫర్ ఖాన్ సరిహద్దు పఠాన్లను సమీకరించి పంజాబ్, సరిహద్దు, సింధు రాష్ట్రాల ముస్లిములకు పెద్ద భూతంగా నిలిచారు. వీరిని ముస్లిం లీగ్ దారుణంగా చిత్రీకరించింది. తుదకు పాకిస్తాన్ ఏర్పాటు కావడంతో వీరు మానసికంగా, తాత్త్వికంగా, రాజకీయంగా అధః పాతాళానికి వెళ్లినట్టయ్యారు. గఫార్ ఖాన్ స్థితి మరీ దారుణం ఆయన స్వస్థలం అటు ఆఫ్ఘాన్లకు, ఇటు పాక్ ముస్లిములకు మధ్య మిలిపోయింది. “మమ్మల్ని తోడేళ్ళ ముందు విసిరి మీరు(కాంగ్రెస్ నాయకులు) వెళ్ళిపోతున్నారు” అన్న గఫార్ ఖాన్ మాటలు నేను ఎన్నటికీ మరచిపోలేను. ఆయన ఎంత వేదనలో అనివుంటారో, ఎంత నిస్పృహలో మాట్లాడి వుంటారో ఊహించుకుంటే నాకు హృదయాఘాతమై తగులుతూంటుంది.
    అటువంటి ఘోర స్థితిని పొందిన ఆజాద్ ఆ బాధలో ఏ కాంగ్రెస్ నాయకుని ఏమన్నా పెద్ద విషయం కాదు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

యుగకర్త నిర్యాణం – 1983 నాటి వ్యాసం

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. తెల...
by పుస్తకం.నెట్
0

 
 

కొడవటిగంటి – 1980 నాటి వ్యాసం

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. తెల...
by అతిథి
1

 
 

చాసో సప్తతి – (1985 నాటి వ్యాసం)

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. తెల...
by అతిథి
1

 

 

మానవతావాది సార్త్ర

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. Jean-Paul S...
by అతిథి
0

 
 

మహాకవి అస్తమయం (1980 వ్యాసం)

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. దేవ...
by అతిథి
0

 
 

నవ్యకవితా పితామహుడు

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. కవి ...
by పుస్తకం.నెట్
0