పుస్తకం
All about booksపుస్తకభాష

August 8, 2012

నగ్న క్రీడలు

More articles by »
Written by: Jampala Chowdary
Tags:

నాలుగేళ్ళకొకసారి జరిగే ఆటలపోటీలు. ప్రత్యేకంగా సిద్ధపరచిన క్రీడాస్థలాలు. వివిధ దేశాల క్రీడాకారులు, ప్రతినిధులు. క్రీడలను చూడటానికి వచ్చిన వేలాది జనం. క్రీడాకారులతో పాటు దేశాధిపతులు, సైనికులు, ఇతర కళాకారులు. ఘనంగా ప్రారంభోత్సవాలు. క్రీడలలో పాల్గొనబోతున్న క్రీడాకారుల ఊరేగింపు. విజేతల సంబరాలు. పరాజితుల విషాదం. ఈ వారం జరుగుతున్న లండన్ ఒలింపిక్స్ గురించి నలు పక్కలా అన్ని మాధ్యమాలలో వినిపిస్తున్నదీ, కనిపిస్తున్నదీ చాలదా, పుస్తకంలో కూడా ఈ గోలేనా అని విసుక్కోకండి. ఇది లండన్ ఒలింపిక్స్ గురించి కాదు. నేను పరిచయం చెయ్యబోతున్నఒలింపిక్ క్రీడోత్సవాల్లో పాల్గొనే క్రీడాకారులు అసలు బట్టలే వేసుకోరు; పూర్తిగా నగ్నంగానే అన్ని పోటీలలో పాల్గొంటారు. మీకు ఈవ్యాసం మీద ఇప్పుడు ఆసక్తి కలిగింది కదా? సరే.

మనం ఇప్పుడు ఘనంగా జరుపుకొనే ఒలింపిక్ క్రీడల్ని నవీన (modern) ఒలింపిక్స్ అంటాం. 1896లో ఏథెన్స్‌లో మొదలుబెట్టి నాలుగేళ్ళకొకసారి జరుపుకొంటున్నాము. కానీ వీటికన్న ముందు ఎప్పుడో, క్రీ.పూ 772లోనే ఇలాంటి క్రీడోత్సవాలు జరిగేవి – అవి అసలు ఒలింపిక్స్ అన్న మాట. క్రీ.పూ. 776 నుంచి. క్రీ.శ. 394 వరకు నాలుగేళ్ళకొకసారి ఒలింపియా ప్రాంతంలో 1200 సంవత్సరాల పాటు నిరాఘాటంగా జరిగాయి ఈ ఒలింపిక్ క్రీడలు (పోల్చి చూస్తే, నవీన ఒలింపిక్స్ ఈ 116 యేళ్ళలో – మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల వల్ల – మూడుసార్లు ఆగిపోయాయి; మరికొన్ని ఒలింపిక్స్‌లో ప్రపంచదేశాలన్నీ పాల్గోకుండా, కొన్ని దేశాలు అలిగి బయట కూర్చున్నాయి). దక్షిణగ్రీసులో ఎలీ దేశస్థుల ఆధ్వర్యంలో, ఒలింపియా అనే గ్రీకుల పుణ్యక్షేత్రంలో ప్రపంచంలోని ఎనిమిదో వింతగా పేరుగాంచిన జ్యూస్ (గ్రీకు పురాణాల్లో దేవాధిదేవుడు) బృహత్తర విగ్రహం ఉన్న ఆలయం ఎదుట ప్రత్యేకంగా నిర్మించిన క్రీడాప్రాంగణంలో ఈ క్రీడోత్సవాలు జరిగేవి. ఈ క్రీడల స్ఫూర్తితోనే నవీన ఒలింపిక్స్ ఉద్యమం ప్రారంభమైంది.

అప్పుడు ఎలాంటి ఆటలు ఆడేవారు? క్రీడాకారులు క్రీడలకు ఎలా తయారయ్యేవారు? క్రీడోత్సవాల నిర్వహణ ఎలా జరిగేది? పోటీలు ఎలా ఉండేవి? ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? ఉత్సవాల తరువాత క్రీడాకారుల పరిస్థితులేమిటి? ఆసలు ఈ క్రీడలు ఎందుకు జరిగేవి? అన్నేళ్ళు నిరాటంకంగా ఎలా జరిగాయి? ఎందుకు ఆగిపోయాయి అన్న ప్రశ్నలు వస్తాయి కదా ఈ విషయాలు గురించి ఆలోచించటం మొదలుబెడితే. వేలయేళ్ళు గడచాయి కదా. మనం ఇప్పుడు తెలుసుకోవటమెలా?

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ క్రీడల గురించి మనకు ఇప్పుడు స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంది. అప్పటి రచయితలు ఈ క్రీడల గురించిన వివరాలు తమ రచనల్లోకి జొప్పించేవారు. ఈ వివరాలు ఉన్న చాలా వ్రాతప్రతులు (పపైరస్ మీద వ్రాసినవి) ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ఒలింపియా గ్రామంలో ఉన్న చాలా శిల్పాల వల్ల అప్పటి విజేతలైన క్రీడాకారుల వివరాలు తెలుస్తున్నాయి. అప్పటి మధుపాత్రలు, ఇతర భాండాల మీద ఈ క్రీడలను ప్రతిబింబించే బొమ్మలను చిత్రించేవారు. అట్లాంటి పాత్రలూ, భాండాలూ చాలానే దొరికాయి పురాతత్వ శాస్త్రజ్ఙులకి. అప్పటి క్రీడావేదిక ఇంకా నిలచే ఉంది. అప్పటి పరుగుడు పందెగాళ్ళు పరుగెత్తడానికి ముందు తమ కాళ్ళ వేళ్ళు ఆనించే ప్రారంభ రేఖలు ఉన్న రాతి కట్టడాలు ఇంకా నిలచే ఉన్నాయి.

అప్పటి గ్రీకుదేశంలో ప్రతి ముఖ్యనగరమూ ఒక దేశంగా ఉండేది. ఈ దేశాలకి రాజులూ, సైన్యాలూ, పౌరుషాలు, చిన్న చిన్న భాషాభేదాలూ, దేశభక్తులూ, పోటీలు, స్పర్థలు, స్నేహాలు, యుద్ధాలూ, శాంతులూ, ఒడంబడికలు ఇవన్నీ ఉంటూ ఉండేయి. ఏడాదికి ఒకచోట చొప్పున నాలుగు అంతర్దేశీయ క్రీడోత్సవాలు జరిగేవి (నెమియా, డెల్ఫై, కొరింత్, ఒలింపియా) కానీ ఈ నాలుగిట్లోనూ ఒలింపియాలో జరిగే పోటీలపైనే అందరి దృష్టీ. నాలుగేళ్ళకొకసారి, సూర్యుడు దక్షిణాయణం మొదలుబెట్టాక వచ్చే రెండవ పౌర్ణమికి రెండురోజుల ముందు ఈ క్రీడలు మొదలై, పౌర్ణమి తర్వాత రెండోరోజున ముగిసేవి (మొత్తం ఐదు రోజులన్న మాట).

ఈ క్రీడల్లో పోటీ చేయడానికి క్రీడాకారులు కనీసం పది నెలలముందు తరిఫీదు మొదలుబెట్టాలి. ఈ తరిఫీదు జరిగేచోట్లకి జిమ్నేసియములు అని పేరు (gymnos అనే మాటకి నగ్నంగా అని అర్థం). ఈ క్రీడాకారులు తమ అభ్యాసాన్ని నగ్నంగా సాగించేవారు. అసలు పోటీల్లో కూడా నగ్నంగానే పాల్గొనేవారు (ఈ వ్యాసంతో ఉన్న బొమ్మలు చూడండి). నగ్నత్వం గురించి అప్పటి గ్రీకు నాగరికతలో పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు మన సినిమా హీరోలు సిక్స్‌పాక్ పొట్టలు చూపించుకోవడానికి చొక్కాలు విప్పేసినట్టు, ఆ రోజుల్లో మంచి శరీర సౌష్టవం ఉన్న గ్రీకులు ఆ శరీరాన్ని నిర్మొహమోటంగా ప్రదర్శించేవారు.అదీ కాక కొన్ని పోటీలలో నగ్నత్వం గెలుపు అవకాశాలను పెంచుతుందనీ, బట్టలు ఉండటం కొన్ని క్రీడల్లో ప్రత్యర్థులకు అవకాశాలని అందజేయటమేననన్న నమ్మకాలు కూడా ఉండేవి అనుకుంటాను.ఆ రోజుల్లో స్త్రీలు క్రీడల్లో పాల్గొనటానికి అవకాశాలు ఉండేవి కావు. ఒక్క స్పార్టా దేశంలోనే స్త్రీలు క్రీడలు అభ్యసించి, వారికి ప్రత్యేకించిన పోటీల్లో పాల్గొనేవారు. వారూ నగ్నంగానే ఉండేవారు. క్రీడాకారులు ఆడేటప్పుడూ, అభ్యాసం చేసేటప్పుడూ, వంటినిండా నూనె ఓడేట్టుగా రాసుకునేవారు. ప్రతి క్రీడకూ పేరు గాంచిన శిక్షకులు (coaches) ఉండేవారు. ఎవరి రహస్య శిక్షణాపద్ధతులు వారివి. ఏ రకమైన ఆహారం తింటే ఏ క్రీడాకారుడికి ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయం మీద కూడా రకరకాల సిద్ధాంతాలు ప్రచారంలో ఉండేవి. అభ్యాసం సమయంలోనూ, పోటీలలో కూడా సంగీతానికి ప్రాధాన్యత ఉండేది. రెండు వేణువులు కలిపినట్టు ఉన్న ఒక వాయిద్యం పోటీలకు సంబంధించిన చాలా చిత్రాలలో కనిపిస్తుంది.

ఈ ఒలింపిక్స్ పోటీలను ఎలీ దేశస్థులు నిర్వహించేవారు. ఒలింపియా గుడిప్రాంతం వారి అధీనంలోనే ఉండేది. పోటీకి కొన్ని నెలలముందు ఎలీనుంచి అన్ని దేశాలకూ పోటీ తేదీలు చెప్పటానికి వార్తాహరులు వెళ్ళేవారు. పోటీలకు రెండునెలలు ముందునుంచి, రెండునెలల తర్వాత వరకూ యుద్ధాలు చేయమనీ, తమ దేశంగుండా క్రీడలకు వెళ్ళేవారికి తమనుంచి ఏ హానీ జరగదనీ ప్రతి దేశమూ ప్రమాణం చేసేది. ఎలీ దేశస్థులు ఒలింపిక్స్ క్రీడలకు పదిమంది న్యాయనిర్ణేతలను, తమలోంచే, ఎంపిక చేసేవారు. పోటీలలో వీరు చెప్పిందే వేదం. విజేతలను నిర్ణయించటం, తప్పులు పాల్పడ్డవారిని బహిష్కరించటం, జరిమానాలు, ఇతర శిక్షలు వేయటం వగైరా అన్ని హక్కులూ వారికి ఉండేవి. ముగ్గురు న్యాయనిర్ణేతలు అశ్వక్రీడలను, ముగ్గురు మైదానక్రీడలను (Track and Field), ముగ్గురు మల్లయుద్ధం పోటీలను పర్యవేక్షించేవారు. ఈ తొమ్మిదిమందినీ సమన్వయం చేయటం పదో ఆయన పని.

పోటీ తేదీలకు నెలరోజులముందు క్రీడాకారులు అందరూ ఎలీ నగరం చేరుకుని న్యాయనిర్ణేతలకు అర్హత పత్రాలు సమర్పించి ప్రాథమిక పోటీలలో పాల్గొనేవారు. ఆ పోటీల్లో గెలిచి తమ సామర్థ్యం నిరూపించుకున్న కొద్దిమంది మాత్రమే ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత వస్తుంది.

పోటీల సమయానికి అరవైవేలమంది వరకూ ఒలింపియా చేరేవారు. అది కనీస సౌకర్యాలు కూడా లేని ప్రాంతం. క్రీడాకారులకు, న్యాయ నిర్ణేతలకు, బాగా డబ్బున్న ఆసాములకు మాత్రం అక్కడ ఉన్న కట్టడాలలో మంచి బసలు దొరికేవి. మిగతా వారు గుడారాలు వేసుకునో, చెట్టుకిందో పుట్టకిందో మనం తిరునాళ్ళకు వెళ్ళి సర్దుకున్నట్లు సర్దుకోవటమే. నిజానికి ఒలింపిక్స్ అంటే జ్యూస్ దేవుడి తిరునాళ్ళే. క్రీడలతోపాటు జ్యూస్‌కు, ఇతర దేవతలకు పూజలు, ఉత్సవాలు నిర్వహించే సమయం. ఇంతమంది జనాలు, తిరునాళ్ళు అంటే ఇంకా ఏముంది, అనేక వ్యాపారాలు చేసేవాళ్ళు, ఒళ్ళు అమ్ముకునేవారితో సహా, అక్కడికి చేరేవారు. వీరందరికీ తోడు కవులు తమ కొత్త కావ్యాలను అక్కడ వినిపించేవారు. తత్వవేత్తలు వారి ప్రచారాలు చేసుకునేవారు. చరిత్రకారులు తమ గ్రంథాలను ఆవిష్కరించేవారు. గుళ్ళ్ళూ, గోపురాలూ, శిల్పాలూ, చిత్రాలూ చూసుకోవటానికి కూడా ఇది మంచి అవకాశం.

ఐతే, వివాహం చేసుకున్న స్త్రీలకు ఈ క్రీడాస్థలానికి రావడం నిషిద్ధం. తప్పీ జారీ ఎవరైనా వచ్చి పట్టుబడ్డారంటే విపరీతమైన శిక్షలకు గురికావాల్సి ఉంటుంది. అలాగే, క్రీడలు, పోటీలు మగవారికే, ఆడువారు పాల్గొనడం నిషిద్ధం (కొంతమంది డబ్బున్న ఆడువారు రథాల యజమానులుగా రథాల పోటీలో పాల్గొనేవారు).

మొదటి రోజు ఉదయం ప్రారంభోత్సవ సంబరాలు; జడ్జీలు (నీలిరంగు బట్టలు వేసుకుని మెళ్ళో పూలదండలతో ఆడంబరంగా, ప్రముఖంగా కనిపించేవారు), ఆటగాళ్ళను (నగ్నంగా) ఒక్కొక్కర్నీ పేరుపేరుగా పరిచయం చేయడం, ఆ తర్వాత ఊరేగింపుగా పాల్గొనడం, ఆటగాళ్ళందరూ ప్రమాణాలు చేయడం, గుళ్ళలో ఆటగాళ్ళు ప్రత్యేకంగా పూజలు చేయించి బలులు ఇవ్వడం వగైరా కార్యక్రమాలు ఉండేవి. సాయంత్రం ఖాళీగా అందరికీ కళోపాసన చేసుకునే సమయం (కవిత్వం వింటం, శిల్పాలు చూడడం వగైరా) ఉండేది.

రెండో రోజు ఉదయం గుర్రపు పందేలు, ఆ తర్వాత నాలుగు గుర్రాలు కట్టిన రథాల పోటీలు (బెన్‌హర్ సినిమా మాదిరి). మధ్యాహ్నం పూట పంచక్రీడల (పెంటాథ్లాన్ – డిస్కస్, జావెలిన్‌లు విసరటం, లాంగ్‌జంప్, పరుగెత్తటం, కుస్తీ) పోటీలు. గెల్చిన వారికి బహుమానాలు వెంటనే ఇచ్చేవారు కాదు; ఒక పైన్ బెత్తాన్ని వారికి ఇచ్చేవారు. అది పట్టుకుని తిరిగేవారు విజేతలన్న గుర్తింపు అన్న మాట. రెండో రోజు రాత్రి పెలోప్స్ అనే వీరుడి స్మృతిగా పూజలు, గెలిచినవారికి సన్మానపు విందులు. గుర్రపు పందేలలోనూ, పరుగు పందేలలోనూ అందరూ ఒక్కసారే బయలుదేరేలా చూడడానికి ప్రత్యేకమైన బిసలు ఏర్పాటు చేసుకున్నట్టు రేఖాచిత్రాల ఆధారాలు తెలుపుతున్నాయి.

మూడో రోజు ఉదయం జ్యూస్‌కు ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, వంద వృషభాల బలి; మధ్యాహ్నం బాలుర ఆటలపోటీలు. సాయంత్రం పొద్దున్న బలి ఇచ్చిన జంతుమాంసాలతో అందరికీ విందు.

నాలుగో రోజు ఉదయం: 200, 400, 3,600 మీటర్ల పరుగు పందాలు. మధ్యాహ్నం మల్లయుద్ధాలు: కుస్తీ, బాక్సింగ్, పాన్‌క్రేషన్ (కిక్‌బాక్సింగ్ వంటిది, కనుగుడ్లు పీకగూడదు అని తప్పించి రెండో రోజు నిబంధనలు ఏమీ లేవు). సాయంత్రం: కవచధారుల పరుగు పందాలు

ఐదవరోజు: గెలిచినవారికి బహుమతులు అంటే పత్రకిరీటాల (wreaths ఈ మధ్య ఏథెన్స్‌లో ఒలింపిక్స్ జరిగినప్పుడు చూసి ఉంటారు; ఇప్పటిలా పతకాలేమీ ఉండేవి కాదు, పాపం) ప్రదానం; ముగింపు ఉత్సవాలు. విజేతలకు, అధికారులకు విందు; సంబరాలు.

ఈ ఐదు రోజులూ అయ్యాక నెమ్మదిగా ఎవరి దారిన వారు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయేవారు. ఎలీ దేశస్థులు కూడా క్రీడా స్థలాల్ని, గుళ్ళనీ, విడిది, వాణిజ్య ప్రదేశాల్ని శుభ్రం చేసి వారి దారిన వారు వెళ్ళేవారు.

విజేతలను వారి దేశస్థులు విపరీతంగా సన్మానించేవారు. ఒక్కసారి ఒలింపిక్స్‌లో విజయం సాధించారంటే, ఇంక శేషజీవితమంతా భోగభాగ్యాలతో జీవించటమే (ఇప్పుడు కొన్ని క్రీడల విజేతలలాగే). విజేతలు వారి కౌశల్యాన్ని శ్లాఘిస్తూ పద్యాలు వ్రాయించుకునేవారు. వారి విగ్రహం ఒకటి చేయించుకుని, ఒక ఫలకంమీద వారి విజయాలగురించి చెక్కించి ఒలింపియా గ్రామంలో క్రీడాస్థలం బయట ప్రతిష్టించేవారు. వివిధ దేశాల ఆటలపోటీలకు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని పాల్గొనేవారు. ఐతే ఈ క్రీడల్లో పాల్గొనటం గొప్ప సాహసమే. రథాల పందాలలో చాలా ప్రమాదాలు జరిగేవి; చావులూ, గాయాలూ మామూలే. మల్లయుద్ధపోటీలకు కాలపరిమితి ఉండేది కాదు. అటో ఇటో తేలేంత వరకూ కొట్టుకోవటమే. జావెలిన్, డిస్కస్ పోటీలయితే ప్రేక్షకులకూ ప్రమాదమే.

రోమన్ సామ్రాజ్యం గ్రీసును ఆక్రమించాక కూడా చాలా కాలం పాటు ఒలింపిక్ క్రీడలు కొనసాగాయి. ఐతే రోమన్ సామ్రాజ్యం క్రైస్తవమతాన్ని అధికారిక మతంగా స్వీకరించాక, క్రీ.శ 394లో పురాతన చిల్లర మతాలను (pagan religions), వాటి పండగలను నిషేధించారు. ఒలింపిక్స్‌ని నిలపివేశారు. గుడిని ధ్వంసం చేసి, జ్యూస్ విగ్రహాన్ని కాన్స్టంటినోపుల్‌కు తరలించారు. దానితో పురాతన ఒలింపిక్స్ శకం ముగిసిపోయింది.

ఈ విషయాలన్నిటినీ ఎక్కడెక్కడినుంచో సేకరించి, The Naked Olympics అనే పుస్తకంలో టోనీ పెరోటే (Tony Perrottet) క్రోడీకరించాడు. అప్పటి ఒలింపిక్స్‌ని, ఆ క్రీడోత్సవం రోజుల్లో ఒలింపియాలో స్టేడియం లోపలా, బయటా ఏం జరుగుతూ ఉండేదీ, వివిధ క్రీడల నియమాలు, ప్రచారంలో ఉన్న కథలు, పుక్కిటి పురాణాలు, పుకార్లు, మంచీ చెడూ అన్నిటినీ కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తాడు. చాలా సునాయాసంగా చదివించే ఈ పుస్తకం అబ్బురపరచే చారిత్రక వ్యాస సంచయమే ఐనా దీన్ని ఆసక్తికరమైన కథనంగా మార్చటంలో రచయిత చాకచక్యం అబినందనీయం. ఈ క్రీడోత్సవాల పట్ల, మతోత్సవాల పట్ల, కొంత కుతూహలం, కొంత అబ్బురం, కొంత వెటకారం చక్కగా మేళవించిన శైలి. అప్పుడు జరిగిన సంఘటనలను గ్రీకులు ఇంతగా గ్రంథస్థం చేశారా అని ఆశ్చర్యం వేస్తుంది. మధుపాత్రలపైనా, లోనా, ఇతర భాండాలపైనా ఉన్న చిత్తరువుల నకళ్ళు చాలా ఉన్నాయి ఈ పుస్తకంలో. అన్ని రకాల ఆటల ముందు ఆటగాళ్ళు ఎలా తర్ఫీదు పొందేవారు, ఒకో క్రీడా ఎలా ఉండేది, ఎలా నిల్చునేవారు, ఎటువంటి సామగ్రి వాడేవారు వంటి అనేక విషయాలు చాలా విపులంగా ఉన్నాయి ఈ బొమ్మలలో. ఇంత ప్రత్యేకంగా ఈ బొమ్మలు ఎలా, ఎందుకు గీశారబ్బా అనిపిస్తుంది. అప్పటికీ, ఇప్పటికీ ఉన్న పోలికలు, తేడాలు విస్మయాన్ని, కుతూహలాన్ని కలిగిస్తాయి. శాస్త్రీయంగా చరిత్ర అధ్యయనం చేయటంపై ఆసక్తిని పెంచుతుంది ఈ పుస్తకం. మన గతాన్ని గురించి మనకు ఇంత విపులమైన ఆధారాలు ఎందుకు లేవు అన్న చింత కూడా కలిగింది ఈ పుస్తకం చదువుతుంటే.

ఒలింపిక్స్ ముందు వారం లైబ్రరీకి వెళితే, ముందు అరల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలో ఈ పుస్తకం కనిపించింది. చదివిన మర్నాడు (లండన్ ఒలింపిక్స్ మొదటి రోజు) ఉదయం నేషనల్ పబ్లిక్ రేడియోలో పురాతన ఒలింపిక్స్‌లో కవిత్వం పాత్ర గురించి ఈ పుస్తకం రచయిత టోనీ పెరోటేతో సంభాషణ వినటం సరదాగా అనిపించింది. ఆ ఇంటర్వ్యూ ఒకరోజు ముందు వచ్చి ఉంటే, అతనెవరో తెలిసేదే కాదు. పెరోటే ఇలాంటి చరిత్ర పుస్తకాలు ఇంకా వ్రాశాడట. The Pagan Holiday అనే పుస్తకంలో క్రీస్తుపూర్వపు రోముకు వచ్చిన పర్యాటకులు చూడటానికీ, చేయటానికీ ఏం ఉండేవో వివరిస్తాడట. ఇలాంటివే మరి కొన్ని.

The Naked Olympics క్రీడలు, చరిత్రల పట్ల ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చదవతగిన, చదవవలసిన పుస్తకం. సరదాగానూ, విజ్ఞానదాయకంగానూ ఉంటుంది.

The Naked Olympics
Tony Perrottet
2004
Random House Paperbacks
214 pagesAbout the Author(s)

Jampala Chowdary

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానాకు 2013-2015కు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, 2015-2017కు అధ్యక్షుడిగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.One Comment


  1. ఆనాటి విశేషాలు తెలుసుకుంటుంటే చాలా విచిత్రం గా అనిపించింది. మీరన్నది నిజమే – మన చరిత్ర ని ఇంత వివరం గా గ్రంధస్తం చేసిన దాఖలాలు కనిపించవు. అంతెందుకు, మొన్న ఎన్ బీ సి వారి ఒలింపిక్ కార్యక్రమం లో చర్చిల్ గురించి అనుకుంటాను – ఒక డాకుమెంటరీ ప్రసారం చేసారు. అది చూసి, “వీళ్ళకి చరిత్ర కి సంబంధించిన ఫుటేజి ఇంత ఉందా” అనిపించింది.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0