ప్రబుద్ధాంధ్ర పోరాటాలు

వ్రాసిన వారు: కోడీహళ్లి మురళీమోహన్
*****************

పుస్తకం పేరు: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రబుద్ధాంధ్ర పోరాటాలు (రెండు భాగాలు)
వెల: చెరొకటి 50రూ/-
సంపాదకులు:డా.నాగసూరి వేణుగోపాల్, పున్నమరాజు నాగేశ్వర రావు
ప్రతులకు: జి.మాల్యాద్రి, కన్వీనర్, జనవిజ్ఞానవేదిక ప్రచురణల విభాగం,162, విజయలక్ష్మి నగర్, నెల్లూరు 524 004

తెలుగు పత్రికలు ప్రారంభమయిన తొలినాళ్లలో అవి అన్యభాషా పత్రికలలోని అంశాలను ముఖ్యంగా ఇంగ్లీషు పత్రికల్లోని వార్తలను అనువాదం చేసి ప్రచురించేవి. ప్రభుత్వ ప్రకటనలతోనూ, గెజిట్ వార్తలతోనూ అప్పటి పత్రికలను నింపేవారు. సాధారణ పాఠకునికి ఎంతమాత్రం ఉపయోగపడని విషయాలను సైతం విదేశీపత్రికల నుండి తర్జుమా కాబడేవి. ఇలాంటి బాల్యావస్థలను దాటి తమకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకోవడానికి తెలుగు పత్రికలకు చాలా సమయమే పట్టింది. తొలి తరం తెలుగు పత్రికలు వ్యాపార దృక్పథంతో కాక సంఘ సేవను చేసే ప్రధాన ఆశయంతో నడిచాయి. భాషా సాహిత్య వికాసాలకు పాటుపడిన ఆనాటి పత్రికలలో ప్రబుద్ధాంధ్ర ఒకటి.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి సారథ్యంలో రాయవరం నుండి 1922 లో పక్షపత్రికగా ప్రారంభమైన ఈ పత్రిక 1923లో రాజమండ్రికి తన కార్యస్థానాన్ని మార్చుకుని మాసపత్రికగా రూపాంతరం చెందింది. 1925లో పత్రిక ఆగిపోయి 1934లో మళ్ళీ మొదలై 1939 వరకూ కొనసాగింది.

మొదట్లో ఈ పత్రిక పద్య రచనలను ప్రచురించినా 1934లో పునః ప్రారంభమయ్యాక తన పంథాను మార్చుకుంది. జనసామాన్యంలో విద్యా విజ్ఞాన వ్యాప్తికి వచన వాఙ్మయం అవసరాన్ని గుర్తించి వచన రచనలను మాత్రమే ప్రచురించడానికి పూనుకుంది. పద్య రచనలను ప్రచురించబోమని నిష్కర్షగా చెప్పింది. ఆకాలంలో ఒక సాహిత్య పత్రిక పద్యవాఙ్మయంపై నిషేదం ప్రకటించడం నిజంగా గొప్ప సాహసమే. ప్రబుద్ధాంధ్ర నడిపిన వ్యవహారిక భాషా ప్రచారోద్యమానికి, ఆంధ్రోద్యమానికి, హిందీ ప్రచార వ్యతిరేకోద్యమానికీ మంచి స్పందన లభించింది. సమకాలీన పత్రికలన్నీ ప్రబుద్ధాంద్రకు ఈ ఉద్యమాలలో పాక్షికంగానో పూర్తిగానో మద్దతును తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆవిధంగా ఈ పోరాటాలకు నాయకత్వ బాధ్యతను స్వీకరించింది ప్రబుద్ధాంధ్ర.

ఈ విషయాలను తెలియజేస్తూ డా.నాగసూరి వేణుగోపాల్, పున్నమరాజు నాగేశ్వరరావుగార్ల సంపాదకత్వంలో జనవిజ్ఞాన వేదిక శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రబుద్ధాంధ్ర పోరాటాలు అనేపేరుతో పుస్తకాన్ని రెండు భాగాలుగా ప్రచురించింది.

ఈ పుస్తకాలలో ప్రబుద్ధాంధ్ర 5వ సంపుటంలోని వ్యాసాలను సంకలనం చేశారు. వచన వాఙ్మయ ఆవశ్యకత, ఆంధ్రోద్యమ స్ఫూర్తి, తెలుగుభాషలోని తీయదనాన్ని తెలిపే వ్యాసాలు, సంపాదక వ్యాఖ్యలు మొదటి భాగంలోనూ హిందీ భాష ప్రచారంవల్ల తెలుగు భాషా వ్యాప్తికి జరుగుతున్న నష్టాలను వివరించే వ్యాసాలు, సంపాదక వ్యాఖ్యలు, పాఠకుల అభిప్రాయాలు రెండవ భాగంలోనూ పొందుపరిచారు. గన్నవరపు సుబ్బరామయ్య, మందలపర్తి ఉపేంద్రశర్మ, బులుసు వేంకట రమణయ్య, ఇంద్రకంటి హనుమచ్చాస్త్రి, గిడుగు వేంకట రామమూర్తి, పురిపండా అప్పలస్వామి, మారెమండ రామారావు, భావరాజు వేంకట కృష్ణారావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, రాయప్రోలు సుబ్బారావు వంటి ప్రముఖుల వ్యాసాలు ఇందులో చోటుచేసుకున్నాయి.

ఇక సంపాదకీయ వ్యాఖ్యల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తమ వాదాన్ని నిర్భీతితో, విస్పష్టంగా వెల్లడించారు. వీరి సంపాదకీయాలు నేటితరం పత్రికల ఎడిటర్లకు ఒక దిక్సూచిగా పనిచేస్తుంది. ఇంత మంచి పుస్తకాన్ని సంకలనం చేసిన డా.నాగసూరివేణుగోపాల్, పున్నమరాజు నాగేశ్వరరావులు అభినందనీయులు!

You Might Also Like

3 Comments

  1. Sreenivas Paruchuri

    Muralimohan gaaru: > తొలి తరం తెలుగు పత్రికలు వ్యాపార దృక్పథంతో కాక సంఘ సేవను చేసే ప్రధాన ఆశయంతో నడిచాయి. This sentence is not true. Plenty of opposite evidence can be presented, right from 1850s or even earlier.

    Also I am curious to know why only essays from Vol.5 (1934) are included and not others. These issues from 1934 are easily available on AP Press Academy’s website, from where they were probably taken. I wish they broadened the pool especially when another 20 issues; 10 from 1935, 5 from 1936, 3 from 1938 and 2 from 1939, are available on DLI. And a few others can be found in some smaller libraries in coastal districts.
    Regards, — Sreenivas

  2. కొత్తపాళీ

    Good show. I am glad they published these volumes.

  3. sailajamithra

    ee lanti books ippati tharaalake kaadu bhavi tharaalaku kuda entho avasaram, Good sir.

Leave a Reply