కూచిపూడి కళాప్రపూర్ణ: Dr. Vempati – Maestro With a Mission
ఎవరో మిత్రులు 1994 ఆగస్ట్ మధ్యలో ఫోన్ చేసి అమెరికాలో పర్యటిస్తున్న వెంపటి చినసత్యంగారి బృందం కార్యక్రమంలో ఒక రోజు అనుకోకుండా ఖాళీ వచ్చింది, డేటన్‌లో ఆరోజు కార్యక్రమం ఏర్పాటు చేయగలరా అని అడిగారు. అప్పటికి మేము డేటన్ (ఒహాయో) వచ్చి ఎక్కువ రోజులు కాలేదు. అక్కడ తెలుగు సంఘం కూడా లేదు. ఇలాంటి సాంస్కృతిక ప్రదర్శనలు ఊళ్ళో ఏర్పాటు చేసే కొంతమంది తెలుగేతర పెద్దల సహాయం కోసం అడిగితే, ‘ఆ ప్రోగ్రాం అనుకున్న రోజుకు ఒక వారం ముందు మల్లికా సారాభాయ్ కూచిపూడి ప్రదర్శన ఉంది. నాలుగు వారాల వ్యవధిలో, ఈ పరిస్థితిలో ఇంత పెద్ద ప్రోగ్రాం చేయటం కష్టం’ అని పెదవి విరిచారు. కానీ మిత్రుడు డా.సురేంద్ర నెరవెట్ల, ‘సత్యంగారి ప్రోగ్రాంకు భయపడవలసిన పనిలేదు. మీరు ఏర్పాట్లు మొదలుబెట్టండి, నష్టమొస్తే నేను భరిస్తాను’ అని భరోసా ఇచ్చాడు. ఊళ్ళో ఉన్న తెలుగువారంతా, పెద్దవాళ్ళు విరాళాలు ఇచ్చీ, కుర్రవాళ్ళు స్వచ్ఛందసేవ చేసీ కార్యక్రమానికి నడుము కట్టారు. డేటన్ కన్వెన్షన్ సెంటర్ ఆడిటోరియం నిండిపోయేంతగా టిక్కెట్లు అమ్మగలిగాము. డేటన్ మేయర్ ఆరోజును కూచిపూడి దినంగా ప్రకటించాడు. డేటన్ డెయిలీ న్యూస్‌లో ప్రత్యేక వ్యాసం వచ్చింది.
ఆదివారం, సెప్టెంబరు 18న మూడుగంటలకు ప్రదర్శన. మధ్యాహ్నం పన్నెండు గంటలకు డేటన్ హిందూ దేవాలయం బేస్‌మెంట్‌లో మేమంతా నిరీక్షిస్తున్నాము. లాల్చీ, కండువా, పంచెకట్టులో పొడుగ్గా, హుందాగా, చూడగానే నమస్కారం పెట్టాలనిపించేలా ఉన్న ఒక పెద్దాయన లోపలకు వచ్చి, జంపాల చౌదరిగారు ఎవరు అని అడిగారు. అదే మొదటిసారి నేను మాస్టరుగార్ని చూడ్డం. తొందరతొందరగా భోజనం పూర్తిచేసి బృందమంతా ఆడిటోరియంకు వెళ్ళిపోయింది. రంగాలంకరణ, పాత్రధారుల అలంకరణ హడావుడిగా పూర్తి చేసుకున్నారు. మూడుగంటలకల్లా, అనుకున్న ప్రకారం ప్రదర్శన మొదలయ్యింది. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు వ్రాసిన క్షీరసాగరమథనం. అనురాధా నెహ్రూ లక్ష్మి, రత్తయ్యశర్మగారు బలి చక్రవర్తి, మొసలికంటి కిశోర్ వాసుకి, వెంపటి రవిశంకర్ శివుడు, రవి మోని ధన్వంతరి, పెనుమర్తి శశికళ మోహిని. కళ్ళకీ, చెవులకీ పండగే పండగ. తరవండీ క్షీరాబ్ధీ…,తరగంగ తరగంగా… అంటూ పెమ్మరాజు సూర్యారావుగారు, సూర్యప్రకాశరావుగారు, సీతాలక్ష్మిగారు పాడిన పాటలు ఇప్పటికీ చెవుల్లో సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. కిశోర్ వాసుకి నాట్యానికీ, వెంపటి రవిశంకర్ శివతాండవానికీ ఒళ్ళు గగుర్పొడిచింది. అప్పట్నుంచీ మేము కూచిపూడి నాట్య అభిమానుల మయ్యాము. ఆ ప్రదర్శనకు ఎంత ఆకర్షితులయ్యామంటే ఒకసారి క్షీరసాగరమథనం ప్రదర్శన చూడటానికి డేటన్‌నుంచి డర్హాం (నార్త్ కరోలీనా) వరకూ డ్రైవ్ చేసుకుని వెళ్ళాము (కూచిపూడి గ్రూపీలు అని మమ్మల్ని మేమే వెక్కిరించుకునేవాళ్ళం). మాకు తోడు ఇంకొందరుకూడా ఉన్నార్లెండి.
మర్నాడు పొద్దున్నే లేచి ఇండియానాపొలిస్ లో బ్రాడ్లీ యూనివర్సిటీ డాన్స్ డిపార్ట్మెంట్‌లో కూచిపూఢి వర్క్‌షాప్‌కు వెళ్ళాము. అది పూర్తయి తిరిగివచ్చేదాకా, మాస్టరుగారు కానీ, శిష్యులుకానీ స్థిమితపడలేదు. మొత్తం మూడురోజులు మాస్టరుగారు, మరికొంతమంది నర్తకులు మా ఇంట ఉన్నారు. రెండవరోజు సాయంత్రం, మాస్టారు తీరిగ్గా కూర్చున్నప్పుడు ఒక విడియో ఇంటర్వ్యూ చేశాను. అక్టోబరునెల తానాపత్రికను ‘అమెరికాలో కూచిపూడి’ ప్రత్యేకసంచికగా తయారుచేసి, మాస్టరుగారి ఇంటర్వ్యూను ప్రచురించాను. తర్వాత చాలా సార్లు ఆ ఇంటర్వ్యూ ఇతరచోట్ల ప్రచురింపబడింది. ఆ సంచిక ఆయనకూ నచ్చింది. ఇప్పటికీ నాకు సంతృప్తినిచ్చిన తానాపత్రికలలో ఒకటి.
ఆ సమయంలోనే, ఈ బృందంతో ప్రయాణిస్తూ, గాత్రాన్ని అందిస్తున్న శ్రీ పెమ్మరాజు సూర్యారావుగారితో పరిచయం కలిగింది. సూర్యారావుగారు ప్రముఖ గాయకులు. విజయవాడ సంగీతకళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. హిందూ పత్రికలో కళావిషయాలపై వ్యాసాలు వ్రాసేవారు. సూర్యారావుగారు, అండవల్లి సత్యనారాయణగారితో కలసి వ్రాసిన చినసత్యంగారి జీవిత చరిత్ర, Dr. Vempati – Maestro With a Mission అప్పుడే చదివాను.
తన స్వగ్రామం కూచిపూడి విడచి జేబులో రెండు రూపాయలతో కాలినడకన మద్రాసు బయలుదేరిన పద్దెనిమిదేళ్ళ కుర్రవాడి ప్రయాణాన్ని వర్ణిస్తూ ఈ పుస్తకం మొదలౌతుంది. అరటిపళ్ళతోనూ, మంచినీళ్ళతోనూ కడుపు నింపుకొంటూ మద్రాసు వరకూ నడిచాడు ఆ పిల్లవాడు. దారిలో అతను భోజనం చేసింది ఒకే ఒక్కసారి – నెల్లూరు దగ్గర వెంకటాచలం అనే చిన్నఊరి రైల్వే స్టేషనుమాస్టరు తన తండ్రిగారి ఆబ్దికం చేస్తూ భోజనం పెట్టారట.
చినసత్యంగారు 1929 అక్టోబరు 15న కూచిపూడిగ్రామంలో పుట్టారు (కొన్ని పత్రికలలో అక్టోబరు 25, 1925అని వచ్చింది; అది తప్పు). తొమ్మిదేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయారు. తల్లికి ఆయన ఒక్కరే మగసంతానం. నలుగురు అక్కచెల్లెళ్ళు. తల్లి సంసారబాధ్యతను మోయవలసివచ్చింది. నాట్యం నేర్చుకోవడానికి వెళితే బంధువే ఐన ఒక గురువుగారు, చినసత్యం నృత్యానికి పనికిరాడని, వేరే బ్రతుకుతెరువేదైనా చూసుకుంటే మంచిదనీ సలహా ఇచ్చి ఆయనకు నాట్యం నేర్పడానికి నిరాకరించాడట. నిరాశపొందిన ఆ కుర్రవాడికి తాడేపల్లి పాపయ్యశాస్త్రిగారు నృత్యం నేర్పటం మొదలుబెట్టారు.
జీవితపోరాటంలో ఈ పిల్లవాడు మందకొడిగా అయ్యాడు. ఒకరోజు చినసత్యానికి కూచిపూడి గ్రామదేవత బాలాత్రిపురసుందరి కలలో బాల రూపంలో కనబడి, “నీ పైన అన్ని కుటుంబబాధ్యతలు ఉండగా ఇలా స్థబ్దుగా కూర్చోవటమేమి”టని ప్రశ్నించిందట. అప్పటినుంచీ ఆ పిల్లవాడి దృక్పథంలో మార్పు వచ్చింది. కూచిపూడి గురించి ఇంకా నేర్చుకోవాలని అభిలాష కలిగింది. ఆ కళకు ప్రసిద్ధి తేవాలన్న కోరిక కలిగింది. అప్పటికి తమ గ్రామంనుంచి తన జ్ఙాతులు వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యం (అన్న వరుస) మద్రాసులో సినిమారంగంలో పనిచేస్తున్నారు. మద్రాసు వెళ్ళి తన భవిష్యత్తును తేల్చుకోవాలని ఊరు విడచి బయలుదేరాడు ఆ కుర్రవాడు.
మద్రాసులో అన్నగారిదగ్గర చేరినా, ఈయనకు సహాయం చేసే స్థితిలో ఆయన లేడు. కూచిపూడి నాట్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలన్న చినసత్యం జిజ్ఙాసకు ఊతమిచ్చే తీరిక ఆయనకు అసలు లేదు. ఆ సమయంలో కమలా లక్ష్మణ్ భరతనాట్య ప్రదర్శన చూసిన చినసత్యాన్ని ఆవిడ కౌశల్యం, నాట్యంలో ఆవిడ సాధించిన పరిపక్వత అబ్బురపరచాయి. తాను కూడా ఆ స్థాయి అందుకోవాలని గురువుకోసం అన్వేషిస్తూ వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రిగారి దగ్గర చేరారు. శాస్త్రిగారు అభినయంలో దిట్ట. అప్పటికే ఆయన దగ్గర మద్రాసులో పేరుగాంచిన బాలసరస్వతి, తారాచౌదరి, మైలాపూరు గౌరియమ్మ, రాంగోపాల్ వంటి నర్తకులు కూచిపూడి, అభినయం నేర్చుకొంటున్నారు. కూచిపూడినాట్యంలో నిష్ణాతులైన శాస్త్రిగారు ఛాందసత్వానికి వ్యతిరేకి. కూచిపూడి ఔన్నత్యాన్ని ఆయన గుర్తించారు, పాత నియమాలు కళను ఎలా నిర్వీర్యం చేస్తున్నదీ ఆయన గమనించారు. సంప్రదాయాన్ని ధిక్కరించి ఆడువారికి కూచిపూడి నేర్పించటం మొదలుబెట్టింది శాస్త్రిగారే. అలాగే వ్యక్తిగతమైన నృత్యాలను (సోలో ఐటెమ్స్) కల్పించటం మొదలుబెట్టింది కూడా శాస్త్రిగారే.
గురువుగారి ప్రోత్సాహంతో చినసత్యంగారు మరింత శ్రద్ధతో నాట్యం నేర్చుకోవటమే కాక శాస్త్రగ్రంథాల్లో ఏముందో తెలుసుకోవటానికి ప్రయత్నించటం మొదలుబెట్టారు. పోణంగి శ్రీరామ అప్పారావు గారు తెలుగుచేసిన భరతుని నాట్యశాస్త్రం, జమ్మలమడక గారి నాట్యవేదం, అభినయదర్పణం వంటి గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
వెంపటి పెదసత్యం, వేదాంతం రాఘవయ్యలకు సహాయకుడిగా సినిమాలలో చాలకాలం పనిచేస్తూ చాలా పాటలకు ఆయన నృత్యకల్పన (choreography), గుర్తింపు లేకుండానే, చేశారు. దేవదాసు చిత్రంలో ఆయన పనితనాన్ని గుర్తించిన ప్రఖ్యాత నర్తకి లలిత (ట్రావన్‌కోర్ సిస్టర్స్), తన సోదరులతో కలసి చినసత్యంగారి దగ్గర నాట్యం నేర్చుకోవటం మొదలుబెట్టింది. 1956లో చినసత్యంగారు కోవెలమూడి భాస్కరరావు నిర్మించిన పార్వతీకల్యాణం చిత్రానికి స్వయంగా నృత్యదర్శకత్వం వహించారు. జయ జయ సుందర నటరాజ అనే జూనియర్ సముద్రాల గీతానికి సత్యంగారు సృష్టించిన నృత్యం బహుళప్రశంసలను పొందింది. ఘంటసాల నిర్మించిన పరోపకారం చిత్రంలో “వేచి ఉన్న చెవులలోనే ప్రియురాలి పేరు స్వాతి వాన”అన్న పాటపాడుతున్న వీధిగాయకునిగా తెరపై కూడా కనిపించారు. అడపాదడపా సినిమాలు వస్తున్నా, ఆయనకు పనీ, పేరూ, సంపాదనా అంతంతమాత్రంగానే ఉండేవి. స్వంతంగా ఒకసారి కూచిపూడి నృత్యపాఠశాల పెట్టి మూసివేసుకోవలసి వచ్చింది. తర్వాత రాజసులోచన పెట్టిన కూచిపూడి పాఠశాలలో కొంతకాలం పనిచేసి మానివేశారు.
కావలి విశ్వోదయా కళాశాలవారు విద్యార్థులతో ఏదైనా నాట్యప్రదర్శన చేయించాలనుకొంటే బి.ఎన్..రెడ్డిగారు వారికి చినసత్యం పేరు సూచించారు. అక్కడ తెలుగు అధ్యాపకులు శ్రీరామ్ వెంకట భుజంగరాయ శర్మగారు పరిచయమయ్యారు. ఇద్దరికీ మంచి స్నేహం కలిసింది. భుజంగరాయశర్మ గారు శ్రీకృష్ణపారిజాతం రూపకం వ్రాస్తే, చినసత్యంగారు నృత్యకల్పన చేశారు (1957). మద్రాసు ఆలిండియా రేడియో తెలుగు సంచాలకులుగా పనిచేస్తున్న ఆచంట జానకిరాం ప్రోద్బలంపై 1961లో చినసత్యంగారు, భుజంగరాయశర్మ గారు కలసి రవీంద్రనాధ్ టాగోర్ ఛండాలికను తెలుగు నృత్యరూపకంగా మలిచారు. భుజంగరాయశర్మ గారు మరణించేవరకూ, సత్యంగారితో కలసి చాలా నృత్యరూపకాలను సృష్టించారు. ఈ రూపకాలకు సంగీతకల్పన శ్రీ పట్రాయణి సంగీతరావుగారు (వైణికుడు, ఘంటసాల గారి గురువుగారి పుత్రుడు, కొన్నాళ్ళు సినిమాలలో ఘంటసాలగారికి సహాయకుడు). ప్రపంచప్రఖ్యాతి గాంచిన ఎన్నో కూచిపూడి నృత్యరూపకాలకు సృష్టికర్తలు ఈ మూర్తిత్త్రయమే.
1962లో బందా కనకలింగేశ్వరరావుగారు కూచిపూడి నృత్యోద్ధరణ కోసం ఒక కొత్త నృత్యనాటకాన్ని నిర్మించటానికి సంగీత అకాడెమీ నుంచి ఒక గ్రాంటు సంపాదించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారితో క్షీరసాగరమథనం నాటకాన్ని వ్రాయించారు. దానికి నృత్యకల్పన చేసే అవకాశం చినసత్యంగారికి దక్కింది. ఆయన సృష్టికి మంచి పేరు వచ్చింది. అనేక ప్రదర్శనలు ఇచ్చారు. చినసత్యంగారు శివుడి వేషం వేసేవారు (వెంపటి రవిశంకర్ శివతాండవాన్ని నేను ప్రశంసిస్తుంటే, మాస్టరుగారు ఇంకా బాగా చేసేవారని, ఒకసారి ఉధృతంగా తాండవనృత్యం చేసి స్పృహ తప్పిపడిపోయారని ఫ్లూటు నాగరాజన్‌గారు నాతో అన్నారు). మొదటి ప్రదర్శనలో యామిని కృష్ణమూర్తి మోహిని; వేదాంతం సత్యనారాయణ శర్మ ధన్వంతరి.
క్షీరసాగరమథనం ప్రదర్శన చూసి ముగ్ధురాలైన ప్రఖ్యాత భరతనాట్య నర్తకి శాంతారావు కూచిపూడి నాట్యం నేర్చుకోవాలని సత్యంగారిని గురువుగా పెట్టుకొంది. కూచిపూడి గురించి ఆవిడకు వస్తున్న వందలాది సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కోసం చినసత్యంగారు నాట్యశాస్త్రాన్ని మరింత సూక్ష్మంగా పరీక్షించి నేర్చుకోవలసి వచ్చింది. శాంతారావు ఒక కూచిపూడి పాఠశాలను స్థాపించి చినసత్యంగార్ని అధ్యాపకులుగా మంచి జీతంతో నియమించింది. కానీ ఆవిడ మిగతా విద్యార్థులకు చెప్పకుండా కొన్ని నృత్యాలు తనకే నేర్పాలన్న నిబంధనలు పెట్టటం మొదలుబెట్టింది. స్వతంత్ర ప్రవృత్తి విరివిగా ఉన్న చినసత్యంగారు ఆవిడ నియమాల మధ్య ఇమడలేకపోయారు. కూచిపూడి డాన్స్ అకాడెమీని కళాక్షేత్రకు మించేలా తయారుచేస్తాను అంటూ ఆమె పెట్టిన ప్రలోభాన్ని తృణీకరించారు. సినిమాలకు పనిచేయడం కూడా ఆయనకు విసుగు కల్గించింది. ఆయన కళాతృష్ణకు, స్వతంత్ర ప్రవృత్తికీ సినిమాలకు అంతగా పొసగలేదు.
స్వతంత్రంగా తనకు తోచిన రీతిలోనే, దారిద్ర్యానికి వెరవకుండా, కూచిపూడికళను అందరికీ నేర్పాలని నిశ్చయించుకొన్న వెంపటి చినసత్యంగారు 1963లో నలభైమంది విద్యార్థులతో మద్రాసు టినగర్‌లో కూచిపూడి ఆర్ట్ అకాడెమీని ప్రారంభించారు. విపరీతంగా శ్రమించారు. విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. 1966లో మద్రాసు శ్రీకృష్ణ గానసభలో కూచిపూడి ఆర్ట్ అకాడెమి ప్రదర్శనను చూసిన ఉద్దండ నాట్యకళాకారులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. అంతకు ముందు కూచిపూడి నృత్యంపై తక్కువ అభిప్రాయం ఉన్న రుక్మిణీ అరుండెల్ కూడా ఈ ప్రదర్శన చూసి ప్రశంసించారు. ఒక్కసారిగా కళాప్రపంచంలో కూచిపూడి నృత్యానికి, వెంపటి చినసత్యంగారికి గుర్తింపు వచ్చింది. కమలా లక్ష్మణ్ స్వయంగా తన చెల్లెళ్ళను చినసత్యంగారి దగ్గర శిష్యులుగా చేర్పించింది.
భరతనాట్యంలో ప్రఖ్యాతి వహించిన నర్తకులెందరో చినసత్యంగారి దగ్గరకు వచ్చి కూచిపూడి నృత్యం నేర్చుకొన్నారు. యామిని కృష్ణమూర్తి, సోనాల్ మాన్‌సింగ్, వైజయంతిమాల, హేమమాలిని, జయలలిత మొదలైనవారందరూ ఆయన దగ్గర నేర్చుకొన్నవారే. హేమమాలిని పెద్ద తార అయ్యాక కూడా మద్రాసు వచ్చినప్పుడల్లా చినసత్యంగారి దగ్గరకు వచ్చేది. జయలలిత తమిళ్నాడు ముఖ్యమంత్రి అయ్యాక కూచిపూడి ఆర్ట్ అకాడెమికి సహాయం చేసింది. ఎన్.టి.రామారావు నర్తనశాల సమయంలో చినసత్యంగారి దగ్గర నృత్యం నేర్చుకొన్నారు – నర్తనశాలలో బృహన్నల నృత్యం చినసత్యంగారి సృష్టే. చినసత్యంగారి తొలిదశలలో ముఖ్య శిష్యులు చంద్రకళ (తర్వాత సినీ నటిగా ప్రఖ్యాతిపొందింది), శోభానాయుడు, మంజుభార్గవి. అమెరికాలో పేరున్న నాట్యాచార్యులు – రత్నపాప, మృణాళిని సదానంద, శశికళ, సంధ్య, కమలారెడ్డి, ఇంకా మరి చాలామంది మాస్టరుగారి శిష్యులే.
నాట్యశాస్త్రపు లోతుల్ని తరచిన చినసత్యంగారు కూచిపూడి నృత్యాన్ని జనాకర్షణీయంగా చేయటానికి, కూచిపూడి గ్రామందాటి ప్రపంచమంతటా వ్యాపించటానికీ చేసిన కృషి అనన్యం. కొత్తతరహాలో ఆయన రూపొందించిన నృత్యరూపకాలు కూచిపూడి కళకు కొత్త జీవాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న చాలా ‘సోలో’ నృత్యాలు ఆయన నృత్యకల్పన చేసినవే. ఈరోజు భారతదేశంలోని ఆరు ముఖ్య నాట్యరీతుల్లో ఒకటిగా కూచిపూడికి గుర్తింపు లభించటానికీ, ప్రపంచం నలుమూలలా కూచిపూడి శిక్షణకేంద్రాలు విస్తరిస్తూ ఉండటానికీ, లక్షలమందితో పెద్దపెద్ద స్టేడియాలలో ఆర్భాటంగా ప్రదర్శనలు నిర్వహించటానికి మూలాలు కూడా చినసత్యంగారు దారిద్ర్యానికి వెరవకుండా దశాబ్దాల తరబడి ఒంటరిగా చేసిన ఉద్యమంలోనే ఉన్నాయి.
చినసత్యంగారి బృందం భారతదేశమంతటా, ప్రపంచంలోని చాలాదేశాలలోనూ ప్రదర్శనలు ఇచ్చింది. 1984లో మొదలుబెట్టి అమెరికాలో పలుసార్లు కూచిపూడి జైత్రయాత్రలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో గౌరవించింది. తిరుమలతిరుపతి దేవస్థానానికి ఆస్థాన నాట్యచార్యులుగా నియమితులయ్యారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదాన్నిచ్చింది. 2000 సెప్టెంబరులో మాస్టరుగార్ని TANA జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. లెక్కలేనన్ని సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు సత్యంగార్ని వరించాయి.
స్ఫురద్రూపి. పద్ధతైన ప్రవర్తన. సింహంలా కనిపించేవారు. మాస్టరుగారి శిష్యులందరూ, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఆయనంటే చూపించే భయమూ, భక్తీ ముచ్చటగా ఉండేయి. కూచిపూడి గురించి, తన శిష్యుల గురించి మాట్లాడేటప్పుడు ఆయనలో కనిపించే తాదాత్మ్యత, ఆప్యాయత మురిపెంగా అనిపించేది. ఆయన నిక్కచ్చితనం, నిబ్బరం, ఆత్మవిశ్వాసం, కళ పట్ల భక్తి, శ్రద్ధ, గౌరవింపచేసేవి. చివరివరకూ ఆయనలో ఉన్న జిజ్ఙాస, కొత్త విషయాలపట్ల,ఉత్సుకత, ఆరాటం అబ్బురపరచేయి.. అంత ప్రఖ్యాతి వహించినా, చాలా నిరాడంబరంగా ఉండేవారు. మాస్టరుగారి నట్టువాంగం శైలి ప్రత్యేకం. మార్దవంగా ఉండే ఆయన గొంతులో అనుభూతి నాట్యం చేస్తున్నట్టు అనిపించేది. ఆ అందం ఇంకెవరి నట్టువాంగంలోనూ మాకు కనిపించదు. ఫిబ్రవరిలో ఆయన్ను మద్రాసులో కలవటమే ఆఖరుసారి అవుతుందనుకోలేదు. వయసు తెచ్చిన ఇబ్బందులు ఆయనను వీల్‌ఛైర్‌కు పరిమితం చేయటం బాధను కల్గించింది. మాస్టరుగారు నిన్న (జులై 29, 2012) ఉదయం మద్రాసులో మరణించారు.
మాస్టరుగారి పరిచయం, ఆయన మమ్మల్ని సన్నిహితులుగా చూడటం మా అదృష్టంగా అరుణ, నేను భావిస్తాము. (కొంత స్వంత డబ్బా: 1999 సిన్సినాటి తానా మహాసభల ప్రారంభకార్యక్రమంగా మేము ఆంధ్రుల చరిత్ర నృత్యరూపకాన్ని రూపొందించాము. మరు సంవత్సరం మాస్టరుగారు వచ్చినప్పుడు చూసి మెచ్చుకొన్నప్పుడు అపాత్రమని తెలిసీ, స్వర్ణపతకం అందుకున్నట్లు మేము ఆనందించాము. ఆంధ్రచరిత్ర బాలే చేద్దామని ఆయన ఒకసారి ప్రయత్నించి పూర్తి చేయలేదట).
Dr. Vempati – Maestro With a Mission పుస్తకం చినసత్యంగారి జీవితచరిత్రను సరళంగా, విపులంగా సాక్షాత్కరింపచేస్తుంది. అతిశయోక్తులు తక్కువ. జీవితవివరాలతో పాటు, సత్యంగారి జీవితంలో ముఖ్యవ్యక్తుల గురించి, ఆయన రూపకల్పన చేసిన బాలేల గురించి, ఆయన ముఖ్య శిష్యుల గురించి ఆయన అప్పటివరకూ అందుకున్న సత్కారాల గురించి విపులంగా తెలియచేశారు. చాలా అరుదైన ఛాయాచిత్రాలు ఉన్నాయి (52 పేజీలు). భాష బాగుంది. సాగతీత లేదు. త్వరగా చదివించింది. అచ్చుతప్పులు దాదాపుగా లేవు. చక్కటి బైండింగ్. మాస్టరుగారి మీద, కూచిపూడి నాట్యకళ మీద అభిమానం ఉన్నవారందరూ చదువుకోవలసిన పుస్తకం.
పుస్తకం వెనుక అట్ట మీద, కీ.శే. ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గారి మాటలు:
Sarangadeva, the author of Sangeeta Ratnaakaram, described the qualities of a teacher, thus: “He is a person with a striking personality, learned in the Sastras, enunciated by Bharata and others, capable of singing and playing musical instruments, posessing knowledge acquired from the teacher directly in Guru Parampara, endowed with perfect knowledge and Laya and Taala, posessing an innovative talent, capable of coaching students efficiently. …
He is one who is handsome, capable of speaking pleasingly and humorosuly. It is rarely we come across a person who has in him all the ideal qualities of Acharya, Sutradhaari and Nattuvanar. Such an ideal Natyacharya is Dr. Vempati Chinna Satyam.
ఇంతకంటే ఏం చెప్పగలం మాస్టరుగారి గురించి, అశృనివాళులు అర్పించటం, కుటుంబసభ్యులకు, వేలాది శిష్యులకు, కోట్లాది అభిమానులకు సానుభూతి చెప్పటం తప్పించి.
* * *
Dr. Vempati – Maestro With a Mission
Andavalli Satyanarayana and Pemmaraju Surya Rao
June 1994
SSV Publishers
32-26-21 Sarada Nivas
Machavaram, Vijayawada, 520 004
160 pages; 300 Rs. / 30$
Sudha
మీరు వెంపటి సత్యంగారి గురించి రాసిన విశేషాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. అటువంటివారి పరిచయం ఏనాటికైనా మరువలేని మధురమైన జ్ఞాపకమే. Dr. Vempati – Maestro With a Mission పుస్తకం గురించి ఇక్కడ మీరు గుర్తుచేయడం చాలా ముదావహం. శ్రీ సంగీతరావుగారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోగోరే వారికి ఈ బ్లాగ్ ఉపయుక్తంగా ఉంటుంది. http://www.patrayani.blogspot.com. ధన్యవాదాలు.
cbrao
వెంపటి చినసత్యంగారి జీవిత విశేషాలు చాలా ఆసక్తికరంగా చెప్పారు.
కొత్తపాళీ
Appropriate tribute.
Srirama Krishna Dronamraju
డా. జంపాల గారు! చాలా చక్కని ఎపిటాఫ్ రాశారు! పొద్దున్నే డా. రాధ చెప్పారు, వెంపటిగారు ఇకలేరని. మీవ్యాసం చదివాక కళ్ళు, గుండె చమర్చాయి.
శ్రీరామకృష్ణ ద్రోణంరాజు, Pasadena (temp camp)
రామ
వారితో సాన్నిహిత్యం కలిగిన మీరు అదృష్టవంతులు.
Dr.M.V.Ramanarao
వెంపటి గారి గురించి పత్రికలు,టీ.వీ.చానల్స్ చాలా వ్యాసాలు,వ్యాఖ్యలూ చేసాయి .అందుచేత కొత్తగా రాసేదేమీ లేకపోయినా ఒక్క విషయం మాత్రం చెప్తాను.సంగీతరావుగారు మా బంధువు. ( ఆయన అసలు పేరు వెంకటనరసిం హశాస్త్రి ) ఘంటసాల సహాయకబృందంలో ఉంటూ,ఆయన మరణం తర్వాత వెంపటి వారి బృందంలో చే రారు.(వెంపటి చిన) సత్యం ( భుజంగరాయ ) శర్మ సాహిత్యం సమకూర్చిన రూపకాలకి నృత్యం చేకూర్చగా ,(సంగీత) రావు సంగీతం కంపోజ్ చేసేవారమని చెప్పారు.అలాగ 12 నృత్య సంగీతరూపకాల్ని దేశ విదేశాల్లో ప్రదర్శించి ప్రశంసల నందుకొన్నామని చెప్పారు.సంగీతరావు గారు ఘంటసాలవారి గురువు పట్రాయని సీతారామశాస్త్రి గారి కుమారుడన్న సంగతి మీకు తెలిసేఉంటుంది. వెంపటి చినసత్యంగారిగురించి,ఆయన మన కూచిపూడి నాట్యానికి చేసిన అపూర్వ సేవల గురించి మీరు వివరంగా రాసారు .వారికి శ్రద్ధాంజలి అర్పిద్దాము.
Jampala Chowdary
సంగీతరావుగారి అసలు పేరు తెలియజేసినందుకు కృతజ్ఙతలు. అది తప్ప మిగతా విషయాలన్నీ ఈ పరిచయంలో ఉన్నాయి.