పుస్తకం
All about booksపుస్తకాలు

June 6, 2012

భట్టిప్రోలు కథలు

More articles by »
Written by: Jampala Chowdary
Tags:
bhaTtiprOlu0001
డాక్టర్ నక్కా విజయరామరాజుగారు నాకు గుంటూరు మెడికల్ కాలేజ్‌లో జూనియర్; 1977 (గురవారెడ్డి వాళ్ళ) బ్యాచ్. ఐతే కాలేజ్‌లో ఉండగా ఆయన్ను కలసిన గుర్తు లేదు. ఆ బ్యాచ్ వాళ్ళ సిల్వర్ జుబిలీ సావెనీర్ ఎడిటర్లలో ఒకరుగా ఆయన పేరు నాకు పరిచయం అయింది. విజయరామరాజుగారు సావెనీర్ కవర్ పేజీ బొమ్మ వేయమని బాపుగారికి ఉత్తరం రాస్తే వచ్చిన జవాబుకు ఆయన, ఆయన శ్రీమతి ప్రతిస్పందించటం గురించిన కథనం నాకు బాగా గుర్తుంది.  నాలుగేళ్ళక్రితం నవ్య వారపత్రికలో భట్టిప్రోలు కథల రచయితగా ఆయన పేరు కనిపించినప్పుడు కొద్దిగా ఆశ్చర్యమూ, కుతూహలమూ కలిగాయి.
ఆశ్చర్యమెందుకంటే ఆయన కథలు రాస్తారని అప్పటివరకూ తెలీదు. కుతూహలమెందుకంటే నాకు భట్టిప్రోలు ప్రాంతంతో కొద్దిగా పరిచయముంది. ఆ ఊరికి దగ్గరలో ఉన్న పెరవలి, ఇంటూరు గ్రామాల్లో మా నాన్నగారు కొంతకాలం పనిచేశారు. భట్టిప్రోలుకు కొన్నిసార్లు వెళ్ళాను.  1970లో భట్టిప్రోలులో ఉన్న రెండు సినిమా హాళ్ళలో ఒకేరోజు రెండు సినిమాలు (రోజులు మారాయి, అగ్గిరాముడు) చూడ్డం ఇంకా గుర్తే. ఆ ఊర్లో బౌద్ధ స్థూపాలు ఉన్నాయనీ, చారిత్రకంగా ప్రఖ్యాతి గాంచిన గ్రామమని తెలుసు కాని ఇంకా ఎక్కువ వివరాలు తెలీదు.

భట్తిప్రోలు కథలు, నామిని మూసలో చాలామంది రాసిన ఆత్మకథాత్మక హ్రస్వకథలు కావు.  శంకరమంచి సత్యం అమరావతి కథల్లా ఆ ప్రాంతపు మనుషుల, ఐతిహ్యాల కథలు. చాలా కొద్ది కథల్లో మాత్రమే రచయిత, రచయిత కుటుంబమూ పాత్రలుగా కనిపిస్తారు. చాలా పాత్రలు వివిధ కథల్లో మళ్ళా మళ్ళా ప్రధానపాత్రలుగానో, అప్రధాన పాత్రలుగానో కనిపిస్తూ ఉంటాయి.

ఇందాక నాకు భట్టిప్రోలు వివరాలు ఎక్కువగా తెలీదు అన్నాను కదా, ఐనా ఎందుకో ఈ కథల్లో పాత్రలు, చాలా సంఘటనలు నాకు తెలిసినట్లే అనిపించాయి. నాకు తెలిసిన, నేను విన్న, కన్న  పద్ధతులు, సంగతులు ఈ కథల్లో తరచు కనిపించాయి. ఈ కథల్లో కనిపించిన కొంత మంది మనుషుల్ని నేను ఎరుగుదును. అంటే ఆ పాత్రలనే కాదు, అచ్చం ఆ పాత్రలను పోలిన మనుషుల్ని. వర్ణించిన సంఘటనలూ నేనూ చూశాను. ఆ ఊళ్ళూ, ఆ కాలువలూ, లాకులూ, బుర్రిపాలెం రోడ్డూ, రత్నాటాకీసూ, హోటళ్ళూ, దొడ్లూ, ఎడ్లూ, కమతాలూ,  బాండు మేళాలూ, రాండోలు మోతలూ, వడ్లమిల్లులూ, మిఠాయి దుకాణాలూ, సినిమా హాళ్ళూ, శ్రీరామనవమి పందిళ్ళూ, రికార్డింగ్ డ్యాన్సులూ, బుర్రకథలూ, ఉద్యోగవిజయాల పద్యాలూ, కుర్రకారు వేసే పూలరంగడూ టైపు నాటకాలు (ఎం.ఏ. భాషా  గుర్తున్నాడా?), కోడిపందాలూ అన్నీ ఎంతోకొంత పరిచయమున్నవే.

ఐతే ఒక్కమాట మాత్రం నిర్మొహమోటంగా ఒప్పుకోవాలి. విజయరామరాజుగారికి తెలిసినంతగా నాకు ఈ మట్టీ, ఈ మనుషులూ తెలీదు. నా ఎరిక పైపైనే. విజయరామరాజుగారికో – ఈ మట్టీ, ఈ మనుషులు, వాళ్ళ కథలూ,  వాళ్ళ ఆవేశాలూ, ఉద్వేగాలూ ఆయనలో అణువణువునా కలసిపోయినట్లున్నాయి. అందుకనే ఆయన చెప్పిన ఏ కథైనా నిజంగా జరిగినట్లే అనిపిస్తుంది; నిజాయితీగా వేరే కల్పనలేమీ కలపకుండా చెప్పినట్లే ఉంటుంది. ఈ కథల్లో మనకు ఎచ్చులు కనిపించవు. మూడ్ కోసమో, రంగస్థలం సిద్ధం చేయటానికో అనవసరంగా వర్ణనలు చేసినట్లూ ఉండదు. ఎక్కడా కథ వండినట్లు అనిపించదు. నాటకీయతకోసమో, కథ చివర మెలికకోసమో అనవసరపు ఇబ్బందులు పడటం అరుదు.   రచయిత కథలో ఊరికే చొరబడడు.

ఈ సంపుటంలో మొత్తం 28 కథలున్నాయి. మూడు కథల్లో మాత్రమే రచయిత పాత్రగా ఉన్నాడు. అన్ని కథలూ గొప్పగా ఉన్నాయని చెప్పను కానీ, చాలాకథలు బాగున్నాయి; కొన్ని కథలు చాలా బాగున్నాయి. చాలా పాత్రలు, సంఘటనలు గుర్తుండిపోతాయి. పరమాన్నం కథ ఆత్మకథాత్మాకంగా చెప్పింది. కథ ఉత్కంఠతో సాగుతుంది. ఆఖరు వాక్యం గుండెను మెలిపెడ్తుంది.ఈ కథ ముందుభాగం పోలవరపు కోటేశ్వరరావుగారి కథనొకదాన్ని, లచ్చుమయ్య కథల్లోది అనుకుంటా, గుర్తుకు తెచ్చింది. చూరుకుట్టుబద్దలో బసవయ్య భార్య ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు నోరుగల్ల ఆడదిని గుర్తు చేస్తుంది. అంతకంటే ముఖ్యంగా రచయిత ఇంటికప్పు వేయడాన్ని వర్ణించడం మతిపోగొడ్తుంది (కొన్నేళ్ళు పోయాక పాతరోజుల్లో ఇంటికి తాటాకు కప్పు ఎలా వేసేవారో తెలుసుకోవటానికి ఈ ఒక్క కథే ఆధారంగా మిగుల్తుందేమో). అసలు చూరుకుట్టుబద్దను గుర్తుచేసినందుకే రచయితకు ఒక వీరతాడు వేయచ్చు.

యానాదుల దిబ్బ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన కథ. ఊరిబయట దిబ్బ మీద కాపురాలుండే యానాదుల పెద్ద పుల్లన్నను కళ్ళకు కట్టేట్టుగా వర్ణిస్తాడు రచయిత. “ఆజానుబాహుడు. చెయ్యెత్తితే ఆయన ఉంగరాల జుత్తు ఎవరికీ అందేది కాదు. తలపాగా చుట్టటానికి మామూలు కండువా చాలక, ఏకంగా అతని పెళ్ళాం రంగమ్మ ఏడుగజాల చీరని చుట్టుకునేవాడు. చొక్కా చుట్టుకోవడం ఎవరూ చూసింది లేదు. మొలకి గోచీలా చిన్న అంగోస్త్రం బిగించి కట్టేవాడు…తలపాగా చుట్టుకుని, బానాకర్ర వీపు వెనక పెట్టుకుని, దాన్ని రెండుచేతుల్లో వెనగ్గా పట్టుకుని ఊర్లోకి వస్తే ఇళ్ళలోని ఆడోళ్ళు కిటికీలు తీసి చూసేవాళ్ళు. కోమట్లు దుకాణాల్లోంచి పిలిచి పొగాకుకాడలిచ్చేవారు. ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఏమన్నా కాదన్నా నవ్వి ఊరుకునేవాడు”. ఏమన్నా చెప్పాలంటే మాత్రం పాటగా పాడి ఆడుతా చెప్పటం అలవాటు. అట్లాంటి యానాదుల పుల్లన్నకు ఒకరోజు అనుకోని కష్టం వచ్చింది. పలకరించడానికి వచ్చిన చుట్టపాయన ప్రశ్నకు సమాధానంగా “ఏమేమి కాలిపోయె యానాదెంకటి సోమన్నా…” అంటూ యానాది పుల్లన్న పాడిన పాట పాఠకుల చెవుల్లో కంగునమోగి గుండెల్లో దూరి మెదడులో చుట్లు తిరిగి, అక్కడే తిష్ట వేస్తుంది. ఈ కథను రచయిత వ్రాసిన తీరు అద్భుతం.

కొన్ని సరదా కథలు, కొన్ని స్థానిక ఐతిహ్యాలు, కొన్ని బడుగు జీవితాల కతలు ఈ కథల్లో ఉన్నాయి. అన్నీ కలిపి చదివితే గుంటూరు జిల్లాలో కృష్ణా కాలువల క్రింద ఉండే గ్రామాల జీవితం, అక్కడి మనుషులు, మూడు నాలుగు దశాబ్దాల వెనుక అక్కడి జీవితం కళ్ళకు కనిపించినట్టు ఉంటుంది. పనికట్టుకుని మాండలికం రాయకపోయినా, గుంటూరు యాస వినిపిస్తుంది. చాలా కథల చివరలో జ్ఞాపకాలలో మాత్రమే మిగిలిన విషయాలపట్ల వేదన కొన్నిసార్లు సూచ్యంగానూ, కొన్నిసార్లు వాచ్యంగానూ కనిపిస్తుంది.
డా. కేశవరెడ్డి ముందుమాటలో చెప్పినదాని బట్టి ఈ కథలు ఒక ప్రణాళికతో వ్రాసినవి కాదు; “ఇతివృత్తం పొద్దున్న తలలోకి వస్తుంది. సాయంత్రానికల్లా చిత్తుప్రతి తయారౌతుంది. నేను చెబితే నమ్మటానికి కష్టమవచ్చుకానీ, ఈ పుస్తకంలోని కథలన్నీ రోజుకొక్కటి లెక్కన’ తయారైనవే…రామరాజు హాస్పిటల్‌కు బయలుదేరిబోతుంటే వాళ్ళ ఊర్లో ఉండే యానాదులు జ్ఙాపకం వచ్చారు. ఆ రాత్రే వాళ్ళ దయనీయ చరిత్ర ‘యానాదుల దిబ్బ’గా అక్షరబద్ధమైపోయింది…” ఈ మాటలు చదివితే చాలా ఆశ్చర్యం వేసింది. అలాంటి సద్యోఫలాలు కాబట్టే ఈ కథలు మసాలావేసి వండిన వంటకాల్లా కాక, అప్పుడే గిల్లి తంపటవేసిన మొక్కజొన్నకండెల్లా ఉన్నాయి. సంపాదకులుగా నవ్యలో ఈ కథల్ని ప్రచురించి తెలుగు పాఠకులకి ఇంతటి రచయితను పరిచయంచేసిన శ్రీరమణ గారితో పాటు, ముళ్ళపూడి వెంకటరమణగారు. వి.ఏ.కే. రంగారావు గారు కూడా ముందు మాటలు వ్రాశారు.

భాపుగారి ముఖచిత్రంతో వచ్చిన పుస్తకం అందంగా ఉంది. లోపల బొమ్మలూ (చంద్ర, మోహన్, అన్వర్, పినిశెట్టి వేసినవి) బాగానే ఉన్నాయి. అచ్చుతప్పులు బహుతక్కువ. ఇంకొద్దిగా మార్జిన్లుంటే పుస్తకం ఇంకొంత బాగుండేది. సంవత్సరంలోపే రెండో ముద్రణకి వచ్చిన ఈ పుస్తకంలోపల స్పందనలంటూ 15 పేజీల సమీక్షలు, ఉత్తరాలు చేర్చకపోతేనే బాగుండేదని నాకనిపించింది.

డాక్టర్ నక్కా విజయరామరాజుగార్ని ప్రత్యక్షంగా ఎరగకపోయినా, మేమిద్దరమూ కాలేజ్‌లో కాంటెంపొరరీలమట అంటూ మనసులో కాలరెగరేసుకుంటూ,  ఆయన తనలోని తాజాదనాన్ని, మనిషితనాన్ని కాపాడుకొంటూ, కేశవరెడ్డి గారు ఈ భట్టిప్రోలు కథల్లో ఉన్నాయని చెప్పిన స్థానికత, సాధికారత, విశ్వసనీయతల్ని  కోల్పోకుండా మరిన్ని మంచి కథల్ని మనకు అందిస్తారని ఆశిస్తాను.

**********

భట్టిప్రోలు కథలు

డాక్టర్ నక్కా విజయరామరాజు
(నవ్యపత్రికలో ధారావాహిక జనవరి-జులై 1998)
2010, 2011

Nandini Publications
Nandini Scanning Center
Mahalakshmi Colony, Armoor
Nijamabad Dt, AP  503 224
Phone: 94407 47768
294 pages, 150 Rs/5$About the Author(s)

Jampala Chowdary

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానాకు 2013-2015కు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, 2015-2017కు అధ్యక్షుడిగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.13 Comments


 1. Dr.Nakka Vijayaramaraju

  Dr.Jampala chowdary gaariki hrudhaya poorvaka dhanyavaadhamulu. Meeru vrasina sameeksha chaala baagundi. Naaku Anotomylo Dr. Bhaskara rao gaari chetula meedhaga gold medal teesukunnantha anandamga vundhi. Navya weekly lo nenu vraasina Maavoori Kathalu vasthunnay veelunte choodandi. Bhattiprolu kathalu vishaalandhra lo unnayi.
  Thank you
  With regards
  Ramaraju


 2. choudari gaariki namaste
  Bhattiprolu kadhalu meeda mee review chaala baagundi. prastavinchina anni vishayalu lotuga unnayi


 3. ఇప్పటికి నవ్యలో నక్క విజయరామరాజుగారి కథలు వారం వారం విందు చేస్తున్నాయి .చదివిన ప్రతి కథ వెంటాడుతూనే వుంటాయి మీ పరిచయం బాగుంది


 4. Ajay Kumar

  Your review on Bhattiprolu Kathalu is wonderful.I read so many times.stories are nostalgiac.


 5. A K Prabhakar

  Choudari gaaru,
  Namaste
  Smeeksha baagundi. Aatmeeyamgaa undi.Akadamicgaanoo undi.Naaminitonoo,Satyam Shankaramanchitonoo polchi choodatam valla vyaasam BHATTIPROLU KATHALA pratyekata meeda fokas cheyadamlo saphalamaindi.
  Regards ,
  A K Prabhakar.


 6. నామిని ఎఫిక్టులొ కథలు వస్తున్న కాలం ఇది. ఆత్మకథలో పిట్టకథలు రాసేస్తున్నారు అందరు. అలాంటి మూసకి భిన్నంగా రాయడమే ఈ కథల ప్రత్యేకత. మళ్ళీ విజయరామరాజుగారి మా వూరి కథలు నవ్యలో వస్తున్నాయి… ఇంతగొప్పగా లేకపోయినా, ఈ కథలకి కొనసాగింపుగా బాగానే వుంటున్నాయి.. : http://navyaweekly.com/


  • నవ్య గురించి వినడమే కాని, ఆంధ్రజ్యోతి ప్రచురణ అని గ్రహించలేదు. నెనర్లు – లంకె ఇచ్చినందుకు.
   జంపాల గారు – చర్విత చర్వణం అవుతుంది మీకు కృతఙ్ఞతలు చెప్పడం. ఈ పుస్తకాన్ని కూడా నా పట్టిక (లిస్టు) లో చేర్చాను 🙂


 7. yaramana

  ఈ పుస్తకాన్ని బ్లాగ్లోకానికి పరిచయం చేద్దామనుకున్నాను. నా శ్రమ తగ్గించారు. ధన్యవాదాలు.

  అందరూ మెచ్చుకున్న మోస్ట్ పాపులర్ ‘యానాదుల దిబ్బ’ ని ప్రస్తావించారు. నేను ‘దయమ్మ’ ని కూడా చాలా ఇష్టపడ్డాను.

  చిన్న సవరణ. రచయిత నాకు వన్ యియర్ జూనియర్. అనగా 1977 బ్యాచ్.


  • Jampala Chowdary

   సీనియర్ని, నా శ్రమ తగ్గించాల్సింది పోయి… హన్నా!
   1977 కరెక్టే. సరి చేస్తాను. (ఇవాళ ఇది మూడోసారి 🙁
   దయమ్మ కథనం బాగుంటుంది.


 8. Jampala Chowdary

  ప్రచురణకర్త ఫోన్ నంబరు మొదట తప్పుగా ఇచ్చాను. ఇప్పుఢు సరి చేశాను.
  ఎవరికైనా ఇబ్బంది కలిగితే నా క్షమాపణలు.


 9. నేనీ పుస్తకం చదివానండీ…యానాదుల దిబ్బ కథ చాలా కాలం మనసులో తిరుగుతూనే ఉన్నది. ఆ కథల్లో ఆ ఊరిలో నేను కూడా ఓ పాత్రనైనాట్లుగా అనిపించింది.


 10. Indrani

  Is this book not available in Vishalandhra Book Shop? Do we have to contact the above address?
  Please reply.
  Thank you.


  • Jampala Chowdary

   Unless it is out of print, it should be available in all major book stores.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 
IMG_7389

ఆరు కాలాలూ, ఏడు లోకాలూ – 2016లో నేను చదివిన పుస్తకాలు

వ్యాసకర్త: చీమలమర్రి స్వాప్నిక్ *********** కిందటి ఏడు మా ఇల్లు – చాదస్తం బాబాయిలు, రెబెల్ ...
by అతిథి
22

 
 
viswanatha-aprabha

తెలుగు సాహిత్యంలో బలమైన స్త్రీ పాత్రలు-మొదటి భాగం:విశ్వనాథ నాయికలు

వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి ***************** ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన...
by అతిథి
1

 
 
cheekatirojulu

రాజకీయ బీభత్స దృశ్యం – చీకటి రోజులు

వ్యాసకర్త: ఎ.కె. ప్రభాకర్ (ఈ వ్యాసం మొదట పాలపిట్ట జనవరి 17 సంచికలో వచ్చింది. పుస్తకం.నెట...
by అతిథి
1

 

 
booksread

నేనూ, పుస్తకాలూ, రెండువేల పదహారూ …

వ్యాసకర్త: పద్మవల్లి ************* ఓ రెండేళ్లుగా కొన్ని కారణాల వల్ల నేను పుస్తకాలు చదవటం బాగ...
by అతిథి
0

 
 
booksread

2016 లో చదివిన పుస్తకాలు

వ్యాసకర్త: Naagini Kandala ********************* ప్రతి సంవత్సరం మొదట్లో క్రమం తప్పకుండా Good reads లో రీడింగ్ ఛాలె...
by అతిథి
0

 
 
IMG_20170131_173605936

కథా కబుర్లూ కాలక్షేపమూ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************* పొత్తూరి విజయలక్ష్మి గారు హాస్యకథలకు ప...
by అతిథి
0