పుస్తకం
All about booksపుస్తకభాష

April 27, 2012

The Poet Who Made Gods and Kings

More articles by »
Written by: అతిథి
Tags: , ,

పరిచయం వ్రాసిన వారు: కే.వి.యస్.రామారావు
******
The Poet Who Made Gods and Kings
by
Velcheru Narayana Rao and David Shulman

ఒక సంప్రదాయ కవి గురించి, అందునా ఒక తెలుగు కవి గురించి, అంతర్జాతీయ పాఠకులకు, ముఖ్యంగా సాహిత్యపరిశోధక పాఠకులకు కుతూహలం కలిగించి ఆ కవి గురించిన మరిన్ని పరిశోధనలు జరిగేలా ప్రోత్సహించే గ్రంథం రాయటం, దాన్ని ప్రచురించే సాహసానికి ప్రఖ్యాత ప్రచురణకర్తల్ని సుముఖుల్ని చేయటం అసామాన్య విషయాలు. ఇలాటి బృహత్కార్యానికి సాహసించి సాధించిన నారాయణ రావు, షుల్మన్ ద్వయం అభినందనీయం. దీనికి భగీరథ ప్రయత్నం కావాలి. ఈ గ్రంథం ముందుమాటలో వారే చెప్పినట్టు – “Some years ago we tried to interest a major academic publisher in an anthology of translations from classical Telugu poetry. The editors responded that they were unable to take on this book for two reasons: no one would buy it (an understandable argument), and there was also a principle involved. If they published such an anthology for Telugu, they wrote us, they would find it difficult to resist demands to publish similar anthologies “for other minor literatures”.” అంతర్జాతీయ సాహిత్యపరిశోధకుల దృష్టిలో భారతీయ భాషలు ముఖ్యంగా రెండే – సంస్కృతం, తమిళం. తెలుగు గురించి వారికి కొంతైనా అవగాహన ఇప్పుడిప్పుడే కలుగుతున్నదంటే దానికి కారణం నారాయణ రావు గారి కృషే. ఐతే ఇంకా ఈ దశలో సుదీర్ఘప్రయాణం సాగాల్సి వుందని ఇలాటి ఉదంతాలు తట్టిచెప్తాయి. కాని ఆయన ఇన్నేళ్ల అవిరళకృషి కొంతవరకు ఫలించింది అనటానికి ఇదిలా పుస్తకరూపంలో రావటమే సాక్ష్యం.

A Poem for the Right Moment సందర్భంలో చెప్పినట్టు మనకు ఇద్దరు శ్రీనాథులున్నారు – శృంగార నైషథం మొదలైన గ్రంథాలు రాసిన “పుస్తక శ్రీనాథుడు” ఒకరైతే చాటు పద్యాలలో కనిపించే “చాటు శ్రీనాథుడు” మరొకరు. శ్రీనాథ సాహిత్యం మీద పరిశోధనలు చేసిన చాలా మంది పెద్దలు ఈ రెండు రూపాల్నీ కలగలిపేసి, వారిద్దరూ ఒకరే అని భ్రమించటంతో శ్రీనాథుడి మీద జరిగిన చాలా పరిశోధనలు ఈ రెండు పార్శ్వాల్ని సమన్వయం చేయటానికి చేసిన వ్యర్థ ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. “చాటు శ్రీనాథుడి” ప్రసక్తి కొంత చివర్లో వచ్చినా ఈ గ్రంథం “పుస్తక శ్రీనాథుడి” గురించి, గ్రంథస్థమైన ఆయన ప్రతిభాపాటవాల గురించి. దీనివల్ల ముందుగా శ్రీనాథుడి గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలు తొలిగిపోతాయి. ఉదాహరణకి, శ్రీనాథుడి చివరిదశ చాలా దయనీయంగా గడిచిందనేది. చాటు సంప్రదాయపు శ్రీనాథుడు చివరిదశలో వ్యవసాయం చెయ్యబోయి అన్నీ పోగొట్టుకుని దుర్భరజీవితాన్ని భరిస్తూ “అమరకవివరు గుండియల్ దిగ్గురనగ” అమరపురికి ప్రయాణించాడు. కాని భౌతికశ్రీనాథుడి అనుభవం ఇందుకు చాలా భిన్నంగా వుండివుండాలని ఈ పరిశోధకుల అభిప్రాయం. ఎందుకంటే ఆయన గ్రంథాల ఆధారంగా చూస్తే వయసు పైబడిన నాటి శ్రీనాథుడు కవిగా గుర్తింపు పొందటంలో మంచి ఉచ్ఛస్థితికి చేరుకున్నాడు – ఒక్కొక్క కొత్త గ్రంథరచనతో ఒక్కొక్క మెట్టే పైకెక్కుతూ చివరి గ్రంథం కాశీఖండంతో ఒక నిఖార్సైన రాజుగారి ప్రాభవాన్ని సంపాదించాడు. ఆ సందర్భానికి కొంచెం ముందుగానే ప్రౌఢదేవరాయల ఆస్థానంలో డిండిమభట్టుని ఓడించాడు, అతని కంచుఢక్కని పగలగొట్టించాడు, కనకస్నానం చేయించుకున్నాడు, “కవిసార్వభౌముడి”గా తన్ను తను చెప్పుకోగలిగాడు. అంతకుముందు ఆయన గ్రంథాల్ని అంకితమిచ్చిన వాళ్లందరూ చాలా చిన్నవాళ్లు – ఊరి కరణాల నుంచి చిన్న సంస్థానాధీశుడి దగ్గర వుండే మంత్రుల వరకు మాత్రమే. కాని రానురాను తెలుగు దేశం మొత్తం తిరిగి ఎక్కడెక్కడి పండితకవుల్నీ సాహిత్యవాదాల్లో జయించి, తెలుగు భూములన్నిటా తనే అగ్రేసర కవినని చాటిచెప్పుకున్నాడు. అంతేకాదు, (నారాయణ రావు గారు ఇదివరకే ప్రకటించినట్టు) అప్పటివరకు లేని ఒక తెలుగు రాజ్యం సరిహద్దుల్ని తన సాహితీవిజయపరంపరల్తో భౌగోళికంగా కూడ చూపించాడు. ఇది ముందుముందు కృష్ణదేవరాయలికి ఒక నమూనాగా పనికొచ్చింది.

ఇక్కడ నారాయణ రావు గారి పరిశోధనావిధానాన్ని గురించి నేను గమనించిన విషయం ఒకటి చెప్పాలి – పాశ్చాత్య సాహిత్య విమర్శా దృక్పథాలలో close reading (దీన్ని బహుశ “నిశితపఠనం” అని అనువదించొచ్చేమో) అని ఒకటి వుంది. ఈ మార్గం ప్రకారం ఒక రచనని ఇంక వేరే ఏ సమాచారం మీదా ఆధారపడకుండా జాగ్రత్తగా చదివి దానంతట అది ఏం చెప్తున్నదో వినాలి. ఎలాటి బయటి ప్రభావాలనీ ఈ చదవటం మీద పడనీయకూడదు, చివరికి దాని రచయితే “నేను రాసింది ఫలానా ఉద్దేశంతో” అని చెప్పినా రచన వేరే విధంగా చెప్తుంటే రచన మాటే సరైందని ఒప్పుకుతీరాలి. నా అభిప్రాయం ప్రకారం నారాయణ రావు గారు పాటించే పద్ధతి ఇది. సర్వత్రా కాకపోవచ్చు కాని, ఎక్కువ చోట్ల ఇలా అనిపిస్తుంది నాకు. నారాయణ రావు గారి పరిశోధనల్లోని అంతర్గత తర్కాన్ని అర్థం చేసుకోవటానికి ఇది ఉపయోగిస్తుందనుకుంటాను.

ఎంతోకాలం సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా తయారైన ఈ Srinatha, The Poet who made Gods and Kings అన్న గ్రంథం శ్రీనాథుడి భావనాశక్తికి, పద్యరచనా కౌశలానికి, కథాకథన ధిషణకి అద్దం పడుతుంది. “నైషథం విద్వదౌషథం” అని సంస్కృతపండితుల మన్ననలందుకున్న నారికేళపాకపు వంటని తెలుగులో రుచిచూపటానికి పూనుకోవటం కేవలం శ్రీనాథుని వంటి సాహసి మాత్రమే చెయ్యగలడు (సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం ఐన ఏకైక కావ్యం నైషథమే!). సాహసించటమే కాకుండా చాలాచోట్ల శ్రీహర్షుణ్ణి మించిన ప్రతిభని చూపాడని నిరూపిస్తుందీ గ్రంథం. ముఖ్యంగా నల దమయంతుల సంవాద ఘట్టంలో (నలుణ్ణి దేవతలు వాళ్ల దూతగా దమయంతి దగ్గరకు పంపి ఆమె తమలో ఎవరో ఒకరిని వరించేలా ఒప్పించమని కోరతారు) ఆ ఇద్దరి మానసిక స్థితిగతుల్ని శ్రీనాథుడు ఎంత చాకచక్యంగా సంయమనంతో కళ్లకు కట్టినట్టు చూపించాడో ఆ ఘట్టాన్నంతటినీ వివరంగా విశ్లేషించి చూపుతుంది. అలాగే కలిపురుషుడు నిషిథరాజ్యాన్ని చూస్తూ తిరిగే సందర్భంలోనూ శ్రీహర్ష శ్రీనాథుల రచనా తారతమ్యాల్ని స్పష్టంగా చూపుతుంది.

సంస్కృత కావ్యాలని తెలుగులోకి అనువదించే సాహసం మరెవరూ చెయ్యకపోవటానికి ఒక ముఖ్య కారణం కావ్యం స్వతహాగా శబ్దప్రధానం కావటం. ఐతే మిగిలిన కవులకి దాటరానిదిగా నిలిచిన ఈ అడ్డంకిని శ్రీనాథుడు అవలీలగా దాటేశాడు. ఉదాహరణకు సుప్రసిద్ధమైన ఈ పద్యభాగం చూడండి –

కమలేందీవర షండ మండిత లసత్కాసార సేవారతిన్
గమికర్మీకృతనైకనీ వ్రతుడనై కంటిన్ విదర్భంబునన్ …

సంస్కృతంలో ఉన్న “గమికర్మీకృతనైకనీవ్రతః” అన్న సమాసాన్ని అలా అలవోకగా తెలుగుపద్యం చేత గుటుక్కుమని మింగించాడిక్కడ. అంతటి సమాసమూ తన ఉనికిని పూర్తిగా పోగొట్టుకుని చుట్టూ వున్న పదాలతో మెత్తగా కలిసిపోయింది. అలాగే, మూలంలో మరీ క్లుప్తంగా చెప్పి వదిలేశారనుకున్న చోట పెంచటానికీ, మరీ పెంచి రాశారనుకున్న చోట తుంచటానికీ ఏ మాత్రం వెనకాడలేదు. ఈ గ్రంథం ఇలాటి సందర్భాలకి ఎన్నో ఉదాహరణలని చూపటమే కాకుండా ఆ మార్పులు శ్రీనాథుని కావ్యనిర్మాణ ప్రణాళికలో ఎలా ఒదిగిపోయాయో చూపిస్తుంది.

ఇక్కడో సరదా పిట్టకథ – శ్రీహర్షుడు చిన్నప్పట్నుంచే అద్వితీయ భాషాపటిమ కలిగిన వాడట. ఎంతంటే అతని మాటల అర్థాలు ఎవరికీ తెలియనంత. ఇది గమనించి అతని మేనమామ రోజూ మినుములు పెట్టమని వాళ్ల అక్కకి చెప్పాట్ట, అలాగన్నా అతని మెదడు కొంత మొద్దుబారుతుందని. ఆర్నెలలు అలా గడిచాక ఆ మేనమామ మళ్లీ వచ్చి ఎలా వున్నావని మేనల్లుణ్ణి అడిగాట్ట. దానికి శ్రీహర్షుడి సమాధానం – “అశేష శేముషీ ముషీ మాష మశ్నామి మాతుల” (గొప్ప మేధస్సుని నాశనం చేసే మినుముల్ని తింటున్నాను మామయ్యా) అని. దాంతో ఆ మేనమామ “హమ్మయ్య, ఇప్పటికి కొంత అర్థమౌతున్నద”ని సంతోషించి ఇంకో ఆర్నెల్లు అలాగే చెయ్యమని వాళ్ల అక్కతో చెప్పి వెళ్లాట్ట.

శ్రీహర్షుడి మేధోసంపత్తి గురించి సంస్కృత విద్వాంసుల గౌరవభావానికి అద్దం పడుతుందీ కథ. అంతటి శ్రీహర్షుడి రచనని అంతే ఉన్నతంగా తెలుగు వారికి అందించిన కవిసార్వభౌముడు శ్రీనాథుడు.

ఇక భీమఖండం ఒక అద్భుత సృష్టి. మూలంలో ఈ కథ కొంత వున్నప్పటికీ ఇది చాలా భాగం శ్రీనాథ కల్పితం. ఐతే కళ్లు మిరుమిట్లు గొలిపే కల్పన ! ఈ పరిశోధకుల దృష్టిలో భీమేశ్వరుడు (అంటే, ఆ రూపం ఆవిర్భావం గురించిన కథ, స్థలపురాణాలు) కేవలం శ్రీనాథ సృష్టి. అనిదంపూర్వమైన ఘట్టాల్ని కల్పించటంలోను, పాత్రల్ని సశరీరులుగా పాఠకుల ముందు ప్రత్యక్షం చెయ్యటంలోను, వాళ్ల మనసుల్లోని సూక్ష్మభావాల్ని సైతం మనోహరంగా ప్రకటించటంలోను ఎంత శ్రద్ధ, పనితనం చూపాడో విశ్లేషించి చూపారు. ఉదాహరణకు, శ్రీనాథుడి కథనం ప్రకారం క్షీరసాగరమథనం జరిగింది స్వర్గం నుంచి సముద్రంలోకి పడిపోయిన వాటిని పునరుద్ధరించటానికి. అమృతం, కామధేనువు, కల్పవృక్షం ఇవన్నీ అంతకుముందు ఉన్నవే. దుర్వాసశాపంతో ఇంద్రుడు వాటిని పోగొట్టుకుంటాడు. అలా పడిపోయిన వాటిని బయటకు తియ్యటానికి సాగరమథనం చెయ్యవలసొస్తుంది. ఇంక ఏ కథనాల్లోను ఇలా ఉన్న వాటిని పోగొట్టుకుని మళ్లీ సంపాదించుకోవటం అన్న భావన కనిపించదు. ఈ నేపథ్యం ఆ ఘట్టంలో ఉన్న సందర్భాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇదెలాగో ఈ Srinatha గ్రంథం వివరిస్తుంది.

కాశీఖండం, శివరాత్రి మహాత్మ్యం – ఈ రెంటిలో ఏది ముందు రాసింది, ఏది తరవాత రాసింది అనే విషయంలో ఇంకా సంపూర్ణాంగీకారం లేదు. ఎక్కువమంది కాశీఖండం చివరిదని భావిస్తారు. ఐతే వస్తు దృష్ట్యా శివరాత్రి మహాత్మ్యం చాలా విలక్షణమైన కావ్యం. ఇది దక్షిణ ఆసియాలో వచ్చిన తొలి నవలికగా గుర్తిస్తుందీ గ్రంథం. అంటే, దీన్లోని ఏయే గుణాలు దీన్ని నవలికగా నిలబెడతాయో నిరూపిస్తుంది. అంతేకాకుండా దీన్లో శ్రీనాథుడు రెండు స్వరాలు చూపిస్తాడని సాధికారికంగా చాటుతుంది – ఒకవంక దీని కథానాయకుడు సుకుమారుడు దుశ్శీలుడని, నీచుడని చూపించాలి, మరోవంక వాడి దృక్కోణం నుంచి తను చేస్తున్న దుశ్చర్యలు సమర్థనీయాలేనని చూపించాలి. ఈ రెండు పరస్పర విరుద్ధాలైన ఫలితాల్ని శ్రీనాథుడు అమోఘంగా సాధించాడని విపులంగా వివరిస్తూ నిశ్చయిస్తుంది, ఇలాటి ప్రయోగాలు ప్రపంచసాహిత్యంలో ఎంతో అరుదైనవని వాటిలో శివరాత్రి మహాత్మ్యం ఉన్నత స్థానంలో ఉంటుందని వాదిస్తుంది. చివరగా, సామూహిక పఠనా వ్యాసంగ దశనుంచి ఏకాంత పఠన దశకి మారుతున్న కవితావిప్లవ దిశలో తొలి అడుగుగా శివరాత్రి మహాత్మ్యాన్ని గుర్తిస్తుందీ పరిశోధన. అదెలాగో నిరూపిస్తుంది.

ఇక శ్రీనాథ పద్య కళా వైచిత్రిని గురించి – పాత పరిశోధకులు ఎందరో శ్రీనాథుడి సీసం గురించి, సంస్కృత సమాస నిర్మాణం గురించి లోతుగా విచారించారు, వివరించారు. ఐతే, ఈ గ్రంథంలో ఈ పార్శ్వంలో కూడ కొన్ని కొత్తకోణాలు చూపించారు. ఉదాహరణకు, సుకుమారుడు తన కోరిక ఎంత బలమైందో ఇలా వివరిస్తాడు –

పంతంబోడదు ధర్మమున్ తగవునున్ పాడిం గులంబున్ విచా
రింతున్ వేదపురాణశాస్త్రమతపారీణుండ గానెట్లు? క
ల్పాంతద్వాదశభానుమత్ కిరణదాహాక్రూరకర్మవ్యథా
సంతాపజ్వరవేదనాభరమునన్ చాకుంట సిద్ధించినన్

ఈ పద్యం చాలా మెల్లగా చిన్న చిన్న మాటల్తో మొదలై వేగం పుంజుకుంటూ ఒక దీర్ఘసమాసంతో శిఖరస్థాయికి చేరి మళ్లీ చివర్లో చిన్న పదాల్తో విశ్రమిస్తుంది. ఇలాటి సందర్భాల్లో చాలాచోట్ల శ్రీనాథుడు ఇలాటి నిర్మాణాన్ని వాడాడని చూపుతుందీ గ్రంథం. ఉదాహరణకు, మంచి రచన ఎలా వుండాలో చెప్తూ ఒకచోట ఇలా అంటాడు –

హరచూడాహరిణాంక వక్రతయు కల్పాంతఃస్ఫురచ్చండికా
పరుషోద్గాఢపయోధరస్ఫుటతటీపర్యంత కాఠిన్యమున్
సరసత్వంబును సంభవించెననగా సత్కావ్యముల్ దిక్కులన్
చిరకాలంబు నటించుచుండు కవిరాజీరత్నగేహంబులన్

అన్నట్టు, ఈ రెండు పద్యాల్లోను కల్పాంత ప్రసక్తి వుండటంలో వున్న ఔచిత్యాన్ని కూడ ఈ గ్రంథం విశ్లేషించి చూపుతుంది.

శ్రీనాథుడు సుదీర్ఘ సంస్కృత సమాస ప్రయోగాలు ఎంత అవలీలగా చేశాడో చిక్కటి తెలుగు నుడికారాలు కూడ అంత చక్కగానూ ప్రయోగించాడు. ఐతే ఏవి ఎక్కడ ఎందుకు వాడాడనే విషయం మీద కూడ ఈ గ్రంథం ఆసక్తికరమైన చర్చను చేస్తుంది, కొత్త కోణాల్ని చూపుతుంది.

దాదాపు రెండువందల పేజీల ఈ గ్రంథంలో ఎన్నెన్నో విశేషాలు, వివరాలు, ప్రతిపాదనలు, ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. 2012లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారు ప్రచురించిన ఈ గ్రంథం ప్రస్తుతం అమెరికాలోనే దొరుకుతుంది. త్వరలో ఇండియా ఎడిషన్ వచ్చే అవకాశం వుంది. ఆసక్తి వున్నవారు amazon.com నుంచి కొనుక్కోవచ్చు.

శ్రీనాథుడివిగా ప్రచారంలో ఉన్న చాటు పద్యాలన్నీ ఇక్కడ చదువుకోవచ్చును. 

“చాటు శ్రీనాథుడి” గురించి నేను కొంతకాలం క్రితం రాసిన వ్యాసం ఇక్కడ దొరుకుతుంది.

 About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.5 Comments


 1. chala goppa ga analysis chesarandi, great


  • K.V.S. Ramarao

   జ్వాల గారు: మీకు నచ్చినందుకు సంతోషం. మీరన్న “గొప్ప analysis” నారాయణరావు, షుల్మన్ గార్లది. వారి గ్రంథాలన్నీ ఎంతో లోతైనవి. అంతర్జాతీయంగా గౌరవాన్నందుకున్నవి. ఇతర ప్రపంచదేశాల వారే కాదు, తెలుగురాష్ట్రం లోని వారు కూడ వాటిని చదవాలని, చదివి తెలుగు సాహిత్యంలో వాళ్లు చూపుతున్న కొత్త అందాల్ని చూసి ఆనందించాలని ఆశిస్తూ చేస్తున్న ప్రయత్నమే ఈ పరిచయ కార్యక్రమం.

   కిరణ్ గారు: శ్రీనాథ కవితా సౌరభాల్ని ఆఘ్రాణించడానికి “పుస్తకం” పాఠకుల్ని కొందరినైనా ప్రోత్సహించేగలిగితే ఈ గ్రంథ రచయితల కృషి ఫలించినట్టే ! తప్పక చదవండి.

   పుస్తకాలు దొరకటం కష్టమైనవారు కనీసం “ఈమాట” పత్రికలో నేను ఉంచిన చాటువుల్నైనా చదివి ఆనందించండి.


  • మీరు నారాయణరావు గారి గురించి వ్రాసిన వ్యాసాలన్నీ చదివాను. ఆయనకి ఉన్న చారిత్రికదృష్టి, విశ్లేషణ అద్భుతం. వారి పుస్తకాలు ఇప్పుడే ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను. ఆయన చూపిన వెలుగులో (ఈమాటలోని) కళాపూర్ణోదయం(వచనానువాదం) చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తోంది. మీకూ, వారికీ కృతఙ్ఞతలు.
   నా అనుభూతిని నారాయణరావు గార్కే చెప్పుకునేందుకు ఈ మెయిల్ అడ్రెస్సేమైనా మీరు ఇవ్వగలరా?


 2. ఇక్కడ ఉదహరించిన పద్యాలు ఎంత బాగున్నాయో. అర్జంటుగా వెళ్ళి ఇంట్లో ఉన్న శ్రీనాథుని పుస్తకాల దుమ్ము దులపాలనిపిస్తుంది. 🙂  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

The Sound of the Kiss, or The Story That Must Never Be Told

వ్రాసిన వారు: కె.వి.ఎస్.రామారావు ******** by Velcheru Narayana Rao and David Shulman (వెల్చేరు నారాయణ రావు గారి రచనల పర...
by అతిథి
5

 
 

Girls for Sale: Kanyasulkam, a Play from Colonial India

వ్రాసిన వారు: కె.వి.ఎస్.రామారావు ********** by Velcheru Narayana Rao “కన్యాశుల్కం” గురజాడ అప్పారావు గార...
by అతిథి
2

 
 

Symbols of Substance: Court and State in Nayaka Period Tamilnadu

రాసిన వారు: కె.వి.ఎస్.రామారావు ****** By: Velcheru Narayana Rao, David Shulman, Sanjay Subrahmanyam (మూడో రచయిత సంజయ్ సుబ్రహ్మణ్య...
by అతిథి
5

 

 

A Poem at the Right Moment

పరిచయం చేసిన వారు: కె.వి.యస్. రామారావు ************** A Poem at the Right Moment by Velcheru Narayana Rao and David Shulman (నారాయణ రావు గార...
by అతిథి
3

 
 

తెలుగులో కవితా విప్లవాల స్వరూపం

వ్రాసిన వారు: కే.వి.యస్.రామారావు ******** (ప్రొఫెసర్ వెల్చేరు నారాయణ రావు ఎంతోకాలం యూనివర్...
by అతిథి
6

 
 

సమయానికి తగు… కవిత్వం (A Poem at the right moment)

రాసిన వారు: సాయి బ్రహ్మానందం గొర్తి ************************* మనందరం అనేక కవితా సంకలనాలు చదివాం; ఇంకా...
by అతిథి
7