చిలుక తెచ్చిన చీటీలలో చిరుగాలి సితారా సంగీతం – శివసాగర్ కవిత్వం

వేరు వేరు శివసాగర్ కవితలనుంచి కొన్ని ఖండికలను ఉదహరిస్తాను.  ఈ కవితల్లో కొన్ని లయాత్మకంగా ఉంటాయి. కొన్ని ఉండవు. రకరకాల ప్రక్రియలు, ప్రతీకలు కనిపిస్తాయి. జానపద గీతాలు, పూర్వ కవిత్వం, వర్తమాన చరిత్రలు రచయితకు బాగా పరిచయమేనని చాలా కవితల్లో అనిపిస్తుంది.  అన్ని కవితల్లోనూ తేలికగా చదివించే గుణం ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం భవిష్యత్తుపై సడలని ఆశ, బలమైన నమ్మకం కనిపిస్తాయి. కింద పడ్డా పైకి లేస్తాననే నిబ్బరం ఉంటుంది. నిరాశ ఎక్కడా కనిపించదు. ఓటమి ఎక్కడా వినిపించదు. ధైర్యం, ధిక్కారం కనిపిస్తాయి.  ప్రతి కవితా చేస్తున్నది తాత్విక ప్రచారమే ఐనా, కవిత్వం లేని పంక్తులు తక్కువ. వస్తువు పట్లా, నిర్మాణం పట్లా, వ్యక్తీకరణ పట్ల శ్రద్ధ కనిపిస్తుంది. అందుకే ఆయన మాటలు మన దైనందిక భాషలో భాగమై అనుకోనిచోట్ల అకస్మాత్తుగా కనిపించి ఆశ్చర్యపరుస్తాయి.
కొన్ని చిన్న కవితలు పూర్తిగా ఇచ్చాను. చాలా కవితల్లోంచి కొన్ని భాగాలు మాత్రమే ఇచ్చాను. కవితలో పాదాలు ఇవ్వనిచోట్ల … గుర్తు ఉంటుంది. కవితలు కాలక్రమంలో ఉన్నాయి; రచయితలో పరిణామాలని కొంతమటుకు గమనించవచ్చు.

ఎర్రని తూర్పు వాకిలిలో నిలుచొని
బందూక్‌లో మందు మరింతగా దట్టించి
పక్కనే ఉంచుకొని
నా రక్తంతో రాస్తున్నాను ఈ బహిరంగ లేఖ

కాలం పురోగమిస్తుంది-ఆగదు
విప్లవం జ్వలిస్తోంది-చావదు
ఉద్యమం నెలబాలుడు
పెరిగి పెద్దవాడై
వినూత్న జీవన మహాకావ్యాన్ని రచిస్తాడు-తప్పదు
(ఉద్యమం నెలబాలుడు, 1971; చౌదరి తేజేశ్వరరావు “విప్లవ విద్రోహాన్ని” నిరసిస్తూ రాసిన దీర్ఘకవిత మొదటి, ఆఖరి పాదాలు)

 

వటవృక్షాలు అలసిపోయాయని
గాలివీయటం మానదు
తీరంలో తీరిగ్గా ఒక కునుకేద్దామనుకున్నా
అలజడి అల ఆగదు
ఓరి! ముసిలీ!
నీ నడుం జారి నెత్తి నేలకు రాసినా
మా కత్తుల కోలాటం ఆగదు
నీ విప్లవ విద్రోహం సాగదు
(కత్తుల కోలాటం ఆగదు, 1973)

 

మేరిమి కొండల్లో మెరిసింది మేఘము
ఉద్దమాల కొండల్లో ఉరిమింది మేఘము
కురుపము కొండల్లో కురిసింది వర్షము
సరిగ మొలస కొండల్లో సాగింది వర్షము
ఏరు మీద ఏరొచ్చెరా! ఓ! జాలరన్నా!
ఏరు ఎచ్చుగా పారెరా! ఓ! జాలరన్నా!
మెండుచీకటి కమ్మెరా!

తెరకొయ్య విరిగినా, తెరచాప చిరిగినా
కోటిపడగలు విప్పి ఏరు బుస కొట్టినా
మొనగాడు తమ్ముణ్ణి మొసలి మింగేసినా
ఎదిగిన అమ్మణ్ణి ఏరు కాటేసినా
గుండె జారిన దండు గంగాకు మొక్కినా
పల్లెకారుల్లోనా కల్లోలం పుట్టినా
గుండెలోని ఆశ-ఎర్ర-జెండగా! ఎగరాలి
కళ్ళలోని కాంతిబాట వెలిగించాలి!
చీకటిలో మిణుగురు చూడటం తెలవాలి
పట్తుదల ప్రాణంగా పడవ నడిపించాలి!
చుక్కాని చేపట్టరా ఓ జాలరన్నా!

(ఏటికి ఎదురీదు వాళ్ళమురా, 1973)

 

ప్రభుత్వ చక్రాలు కదలవు
ఇంజన్‌లో డూం జాయింట్
ప్రమాదాన్ని సూచిస్తోంది
ప్రభుత్వ దమనకాండ ఎక్స్‌ప్రెస్‌కు
లైన్ క్లియరెన్స్ లేదు.

ఢిల్లీ తుగ్లకాబాద్ రైల్వేయార్డ్‌లో
ప్రభుత్వానికి పిచ్చెక్కింది
కాలనీలో పిల్లల్ని పెద్దల్ని
వెంటబడి కరుస్తుంది

ప్రభుత్వానికి నెర్వస్ బ్రేక్‌డౌన్
పరిస్థితి ప్రమాదంగా ఉంది
ప్రభుత్వం ఆసుపత్రి పాలయ్యింది

“హలో హలో హలో
హలో! డాక్టర్ కాలచక్రం గారూ
ఎలాఉంది పేషంట్ ప్రభుత్వం?
ఏ సంగతీ చెప్పారు కాదు?”

“ఆపరేషన్ సక్సెస్
పేషంట్ ఎంతో కాలం బతకదు.”

(రెడ్ సిగ్నల్, 1974: రైల్వే కార్మికుల సమ్మె సందర్భం)

 

ఈ రాత్రి
ఉరికంబం  భయంతో వొణికింది
ఉరితీయబడ్డ  శిరస్సు
సగర్వంగా చదివిన
మానవుని ప్రోగ్రెస్ రిపోర్ట్ విని

ఈ రాత్రి
ఉరికంబం  గజగజా వణికింది
ఉరితీయబడ్డ  శిరస్సు పెదాలపై
చెదరని చిరునవ్వుని చూసి

ఈ రాత్రి
ఉరితీయబడ్డ  శిరస్సు
ఉరినే ఉరితీసింది

(ఉరికంబం వణికింది, 1975; భూమయ్య, కిష్టగౌడ్‌లను ఉరి తీసినప్పుడు)

 

బందిఖాన బృందావనంలో
ఒంటరిది
ఎవరికీ కానిది (?)
ఓ పువ్వు పూసింది
ఓ విరజాజి విరిసింది

పొద్దు కునికే వేళ
తన ఒంటరితనాన్ని
తలచుకొని
అది వేదనాశకలమయింది

తన కోసం కాక
అందరి కోసం వసంతం
దాని ఆకాంక్ష దాని తపన

(ఓ పువ్వు పూసింది, 1977; జైల్లో సెల్ ఎదురుగా ఉన్న ఒంటరి గులాబిమొక్కను చూస్తూ – ఇదే శీర్షికతో చలం కవితాత్మక కథ ఉంది)

 

విత్తనం చనిపోతూ
పంటను వాగ్దానం చేసింది

చిన్నారి పువ్వు రాలిపోతూ
చిరునవ్వుతో కాపును వాగ్దానం చేసింది

అడవి దహించుకుపోతూ
దావానలాన్ని వాగ్దానం చేసింది

సూర్యాస్తమయం చేతిలో చేతిలో చేయివేసి
సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది.

అమరత్వం రమణీయమయింది

అది కాలాన్ని కౌగిలించుకొని
మరో ప్రపంచాన్ని వాగ్దానం  చేసింది

(అమరత్వం, 1985; మొదటి వాక్యం ఎంగెల్స్, గెథేల దట)

 

ఆకాశం అరటావు మీద
భూదేవంత భావాన్ని
వచనకవితలో బంధించి
బట్వాడా చేయమని రాశావు
ఏం రాయను?

పొద్దస్తమానం
పనిపాటల్లో పడి
కన్నెత్తైనా చూడటం లేదని
అలిగి
కవిత
కన్నారింటికి వెళ్ళిపోయింది

అది నా ఆరిన పెదాలపై
రాలిన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ
చిరుకోపంతో పెట్టుకున్న ముద్దును
చిరకాలం గుర్తుంచుకుంటాను

(పది వసంతాలు, 1980; సృజన పదవ వార్షికోత్సవం కోసం కవిత కోరినప్పుడు)

 

రెండు నేత్రాలు
ఒకే దృశ్యం
రెండు పెదాలు
ఒకే నిశ్శబ్దం
రెండు హస్తాలు
ఒకే శిల్పం
రెండు  జీవితాలు
ఒకే ఒక్క విప్లవ స్వప్నం
నేను చితాభస్మం
ఆమె ఫీనిక్స్

(ఫీనిక్స్, 1987)

 

కన్నీటి చుక్కలా
కాలం మెరుస్తోంది
అవునా!

సూర్యోదయాన్ని
నీవెంట తీసుకొచ్చావు
సెలయేటి గలగలల్ని
నీవెంట తీసుకొచ్చావు
జీవిత నిర్వచనాన్ని
నీవెంట తీసుకొచ్చావు
ఇప్పుడు మమ్మల్ని విడిచి
నీవు వెళ్ళిపోయావు

కాలం

కన్నీటిబొట్లుగా
బొటబొటా రాలుతోంది
ఇక్కడ ఏకాంతంలో
నీకోసం నిశ్శబ్దంగా విలపిస్తాను…
ఏక్‌తార్! నిన్ను వేడుకుంటున్నాను
నా విషాదాన్ని వెక్కిరిస్తూ
జీవన సంగీతాన్ని వినిపించు
వినిపించు, వినిపించు

(ఏక్‌తార్, 1987; కామ్రేడ్ కొల్లిపర నరసింహారావు స్మృతికి)

 

సూర్యుడు నేతగాడు
తన కిరణాల దారాలతో
ఆకాశం మగ్గం మీద
ఇంద్ర ధనుస్సు వ్యూహాన్ని నేస్తాడు

సూర్యుడు వేటగాడు
తన కిరణాల బాణాలతో
ఆకాశం అరణ్యంలో
చీకటి చిరుత పులుల్ని వేటాడుతాడు

సూర్యుడు ప్రియుడు
కోటికిరణాల తొలికాంతిలో
ఆకాశం అంతస్తు దిగి
భూదేవి మూగకన్నుల్ని మనసా ప్రేమిస్తాడు

(సూర్యుడు, 1987; రహస్య జీవితంలో శివసాగర్ పేరు – రవి)

 

ఆకాశం నెలవంక
నెలవంక సొరచేప
నెలవంకలో సొరచేప
సొరచేప పసిపాప…!

ఆకాశంలో నెలవంక
నెలవంక! నెలవంక
(నెలవంక; 1988; ఆరున్నర పేజీల Stream of Consciousness  కవితలో మొదటి ఆరు పాదాలు

అమ్మా! నన్ను కన్నందుకు
విప్లవాభివందనాలు!

పొలాలలో పరిగె గింజ
ఏరుకునే వేళలందు
అమ్మా! నన్ను కన్నందుకు
విప్లవాభివందనాలు!

పక్షుల రాగాల నడుమ
గరికపూల పాన్పు మీద
అమ్మా! నన్ను కన్నందుకు
విప్లవాభివందనాలు!

రాలిపడిన పూవులకై
గాయపడిన పిట్టలకై
ప్రాణమివ్వ నేర్పినావు
అమ్మా! నన్ను కన్నందుకు
విప్లవాభివందనాలు!

చావు నన్ను సమీపించి
గుసగుసలాడకముందే
ఆంక్షలసంకెళ్ళు దాటి
నిన్ను ఒక్కసారి చూడాలని
నా చివరి కోర్కె, చివరి కోర్కె –
అమ్మా! నన్ను కన్నందుకు
విప్లవాభివందనాలు!

(అమ్మా, 1988; శివసాగర్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించకూడదని పీపుల్స్‌వార్ ఆంక్ష అట)

 

కాలానికి ఒక కవి కావాలి!
ఒక కవిత కావాలి!
అందుకనే కాలం కడుపుతో ఉండి
శ్రీ శ్రీ ని కన్నది

(శ్రీ శ్రీ, 1988)

 

ఉరితీయబడ్డ పాటనుండి, చెరపడ్డ జలపాతం నుండి
గాయపడ్డ కాలిబాట నుండి
ప్రాణవాయువునుండి, వాయులీనం నుండి
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నా కోసం ఎదురు చూడు
నా కోసం వేచి చూడు

పక్షులు చెట్లకొమ్మలకు సంగీతాన్ని అలంకరించే వేళ
శిశిరంలో రాలిన ఆకులు జీవితసత్యాల్ని విప్పిచెప్పే వేళ
తల్లి చనుబాలు నా గీతాలపై ప్రవహించే వేళ
ఎందరో నన్ను మర్చిపోయిన వేళ

తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
“నా పేరు మృత్యుంజయుడు
నా కోసం ఎదురు చూడు”
నా కోసం వేచి చూడు.

(నా కోసం వేచి చూడు, 1988)

 

నా ఫిడేల్ రాగాల డజానా!

ఎవ్వరని ఎంతువో నన్ను? నేననంత
శోక భీకర తిమిరదేశాధిపతిని

నల్ల ధనమేల ప్రవహించు తెల్లని దేశములకు?
కిక్‌బ్యాక్ లేల కడతేరు స్విస్ బ్యాంకులయందు?
ఏల మూసి పారు? దోమ లేల ముసురు?
ఏల నా బుల్లెట్‌ప్రూఫ్ హృదయమ్ము ప్రేమించు నిన్ను?

విదూషకుని ప్రేమలేఖ, 1988; పఠాభి, కృష్ణశాస్త్రి, తిలక్‌లను పేరడీ చేస్తూ)

 

జీవితం ఒక్కటి
జైళ్ళు అనేకం!
జీవితాలు అనేకం
ఎక్కడైనా జైలు ఒక్కటే

(జీవితం ఒక్కటి జైళ్ళు అనేకం, 1989; నెల్సన్ మండేలా మీద రాసిన కవితలో ఆఖరు పంక్తులు

 

శంభూకుడు పెదాల మీద చిరునవ్వుతో
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటనవేలును
గొడ్డలితో నరుకుతున్నాడు
బలి తన చిరుపాదాలతో వామనుణ్ణి
పాతాళానికి తొక్కేస్తున్నాడు

ఓహో..!
ఇప్పుడు నడుస్తున్న చరిత్ర
పరమ ఛండాల చరిత్ర

(నడుస్తున్న చరిత్ర, 1984)

 

జీవితమా!

నా యవ్వనాన్ని తిరిగి నా కివ్వు!
పొదలో పొంచివున్న అడివి ఎలుగు
నాపై కౄరాతికౄరంగా దాడి చేసే వేళ

నడిరాత్రి వెన్నెలమ్మ
నిశ్శబ్దంగా నా దరి చేరి
ప్రేమతో నన్ను సాదరంగా అనునయించే వేళ

జీవితమా!
నా యవ్వనాన్ని తిరిగి నా కివ్వు
జీవితానికి మరణానికి మధ్య
నన్ను హల్లో, అని పలకరించే
సరిహద్దు రేఖ మీద
పసిపాపలాంటి వృద్ధాప్యంలో
నిబ్బరంగా నిలబడి
చిరుగాలి సితారా  సంగీతాన్ని
పలికించే వేళ, పలవరించే వేళ

జీవితమా!
నా యవ్వనాన్ని తిరిగి నా కివ్వు!

(జీవితమా! నా యవ్వనాన్ని తిరిగి నా కివ్వు!; 2002; ఖమ్మం అడవిలో చుట్టుముట్టిన పోలీసుల్ని తప్పించుకున్న మర్నాడు రాసింది)

 

నేను  మునిగే పడవలో
హాయిగా నిద్రపోతున్నాను
వల విసిరి
కలల చేపల్ని పట్టుకుంటాను

నేను నిప్పును, నీరును
రణరంగంలో పోరాడే
లక్షలాది సైనికుల్లో
నేనొక సైనికుణ్ణి
సైనికుణ్ణి నేనే!
ర్రణ ర్రంగాన్నీ నేనే!

నేను  మునిగే పడవలో
హాయిగా నిద్రపొతున్నాను
వల విసిరి
కలల చేపల్ని పట్టుకుంటాను

నేను సమాధి పక్క
నవ్వుతూ కూర్చున్నాను
హృదయ తంత్రుల్ని మీటి
జీవన సరాగాన్ని వినిపిస్తాను

(నేను, 2003)

ఈ వ్యాసంలో ఉదహరించిన కవితలన్నీ శివసాగర్ కవిత్వం (1968 – 2004) పుస్తకం నుంచి తీసుకున్నవి. గెరిల్లా విప్లవగీతాలు (1972),జనం ఊపిరితో (1974), పది వసంతాలు (1983), నెలవంక (1988), నడుస్తున్న చరిత్ర  (2004?) అనే సంపుటాల్లో ఉన్న కవితలు, ఆ సంపుటాలకు చేరా, వరవరరావు, గుడిపాటి, శివసాగర్ వ్రాసిన ముందు మాటలు ఈ సంకలనంలో ఉన్నాయి. చాలా కవితలకు శివసాగర్ కొత్తగా చేర్చిన వివరణలు, ఇంటర్వ్యూలు, ఈ కవితల నేపధ్యాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగకరంగా ఉన్నాయి.

1968కి ముందు శివసాగర్ ఎటువంటి కవిత్వం రాశారో తెలీదు. ఉద్యమం నెలబాలుడు పుస్తకం గురించి ఈ పుస్తకంలో ప్రస్తావనలున్నాయి కానీ ఆ పుస్తకంలో కవితలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయో లేదో తెలీదు.

పుస్తకాన్ని అందంగా, శ్రద్ధగా, కాళ్ళ వేసిన ముఖచిత్రంతో ప్రచురించారు. అచ్చు తప్పులు తక్కువే కాని, ఇబ్బంది పెట్టాయి.

************

శివసాగర్ కవిత్వం (1968 – 2004)
స్వేచ్ఛ ప్రచురణలు, ఖమ్మం
Bahujan Book Syndicate, Hyderabad
2004

For copies (I am not sure whether they are still available)
B. Shakuntala
16-11-20/6/1/1, Flat No. 403
Vijayasai Residency
Saleem Nagar, Malakpet
Hyderabad, 500 036

299 pages; 100 Rs.

You Might Also Like

7 Comments

  1. prathigudupu jayaprakasa raju

    Sivasaagar gaari kavitvam meeda vachina arudaina vyaasam. Chaala baagundi. Gadachina rojulu marokasaari gurtukochaayi.

  2. Karthik Navayan

    కవిత్వం లాంటి జీవితం – కార్తీక్ నవయాన్

    Rate This

    This is my article on K.G.Sathyamurthy (Shivasagar) appeared in Andhra Jyothi Telugu Daily News paper on 27th April 2012

    -B. Karthik Navayan

    సత్యమూర్తిని నిజాయితీగా అర్థం చేసుకోగలిగితే అతను కవులకు మహాకవిగా అర్థం అవుతాడు; విప్లవకారులకు గొప్ప విప్లవ నాయకుడుగా అర్థం అవుతాడు. పేదలకు అతనొక మహా పేదవాడుగా అర్థం అవుతాడు. తత్వవేత్తలకు అతనొక గొప్ప తాత్వికుడు. ఒక రచయితను అర్థం చేసుకోవాలంటే అతని రచనలను అర్థం చేసుకుంటే సరిపోతుంది. సత్యమూర్తిని అర్థం చేసుకోవాలంటే అతని రచనలతో పాటు అతని బ్రతుకును కూడా అర్థం చేసుకోవాలి.

    సాంప్రదాయ అగ్రకుల మధ్యతరగతి విప్లవ నాయకులకు, విప్లవ కవులకు ఉన్నటువంటి అనేకానేక సౌకర్యాలకు సత్యమూర్తి దూరంగా ఉన్నాడు. అతను వాటిని పొందలేక కాదు, కల్పించుకోలేక కాదు. అతను దేనికోసం రాసాడో దానికోసమే బ్రతికాడు. సత్యమూర్తి కవిత్వానికి బ్రతుకుకు మధ్య Contradiction లేదు. విప్లకారుడిగా మారిన తర్వాత అతని జీవిత కాలంలో కేవలం గత మూడు సంవత్సరాలే అంటే తన చివరి రోజులు, తను వదిలి వెళ్ళిన పిల్లల దగ్గర గడిపాడు.

    2009 వరకు ఏదో ఒక కార్యక్రమంలో ఎవరో ఒకరితో తిరుగుతూనే ఉన్నాడు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ ఉన్న తన అభిమానుల వెంటనే ఉండేందుకు ఆసక్తి చూపించేవాడు. ఇక్కడికి వచ్చిన సమయంలో ఆరోగ్య సంబంధమైన సమస్యలు వచ్చి తన కూతురుతో తిట్లు తింటూ కూడా ఇక్కడే గడిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అతనిది కవిలాంటి జీవితం కాదు కవిత్వం లాంటి జీవితం. అతని కవిత్వాన్ని జీవితాన్ని వేరువేరుగా చూడలేము. అతను ఏ సిద్ధాంతాలు, ఏ రాజకీయాలు నమ్ముకున్నాడో వాటితోనే కాదు అతను ఏ ప్రజలను నమ్ముకున్నాడో జీవితాంతం అదే ప్రజల మధ్య, అదే పేదల మధ్య బ్రతికాడు. అదే ఇతర కవులకు, సత్యమూర్తికి ఉన్న తేడా.

    సత్యమూర్తితో కలిసి గడిపిన వారు ఎవరైనా ఆ జ్ఞాపకాలను మరిచిపోలేరు. అతని మాటలు, మనం సమస్యలనుకునే వాటిని అతను చూసే దృష్టి చాలా భిన్నంగా ప్రత్యేకంగా ఉండేవి. మనం చిన్న చిన్న విషయాలు అనుకునే విషయాల పట్ల కూడా సత్యమూర్తికి చాలా స్పష్టమైన ఖచ్చితమైన అభిప్రాయాలూ ఉండేవి. ఎంత గంభీరమైన వ్యక్తో అంత హాస్యంగా కూడా ఉండేవాడు. సత్యమూర్తి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నా రూమ్‌లో ఉండేవాడు. ఒకసారి నాకు కావాల్సిన భార్య మా కోసం సీతాఫల పండ్లు తీసుకొచ్చింది. సత్యమూర్తి ఏంటి బాబు అవి అని అడిగాడు, సీతాఫల పండ్లు అని చెప్పాను. ఎవరు తీసుకొచ్చారు అని అడిగాడు. విజయ తీసుకొచ్చిందని చెప్పాను. విజయ తీసుకొస్తే సీతా ఫలములు అంటావేమిటి బాబు అవి విజయ ఫలాలు అన్నాడు.

    సత్యమూర్తి తన 75 సంవత్సరాల వయస్సులో కూడా అజ్ఞాత జీవితం గడిపాడు. అజ్ఞాత జీవితం అంటే హైదరాబాద్‌లోనో బెంగుళూరులోనో కాదు. ఖమ్మం, వరంగల్ జిల్లా అడవుల్లో 2000-2002 సంవత్సరాల మధ్య దాదాపు ఆరు నెలల కాలం అడవిలోనే గడిపాడు. చాలా మంది యువకులకు స్ఫూర్తినిచ్చాడు. అసలు ఆ వయసులో అడవిలోనికి వెళ్ళాలనే ఆలోచనే ఎవరి ఆలోచనలకు అందనిది. అది కేవలం సత్యమూర్తికే సాధ్యం.

    ఒకసారి ఖమ్మం అడవి నుంచి సత్యమూర్తితో కలిసి వస్తుండగా ఒక ప్రశ్న అడగాలనిపించి అడిగాను. అప్పుడు నా దగ్గర పదివేల రూపాయలు సత్యమూర్తి దగ్గర ఇరవై వేల రూపాయలు ఉన్నాయి. నేను ఇలా అడిగాను. ‘సర్ ఒక వేళ పోలీసులు మనల్ని పట్టుకుంటే నేను స్టూడెంట్ నని చెపుతాను నా దగ్గర గుర్తింపు కార్డు ఉంది, వారు నా దగ్గరి డబ్బుల గురించి అడిగితే నేను స్టూడెంట్ కాబట్టి ఫీజులు అవి ఖర్చులు ఉంటాయని తీసుకెళ్తున్నానని చెబుతాను. మరి మీరేమి చెపుతారు?’. అపుడు సత్యమూర్తి ‘ఒకవేళ పోలీసులు నా దగ్గరి డబ్బుల గురించి అడిగితే ఈ డబ్బులు నావే మీకు కావాలా అని అడుగుతాను’ వారికి కావాలంటే యిచ్చేస్తానని అన్నాడు.

    సత్యమూర్తిని లెక్క కట్టేసారు, అతను శ్రీశ్రీ తర్వాత అని లెక్కేసారు. దానికి కొలమానము ఏమిటో? నిజానికి సత్యమూర్తికి ఎవరితో పోలిక సరికాదు. అతను ఎవరి తరువాత కాదు. అతనికి అతనే సాటి. యిక్కడి విప్లవ కవులు అందరూ సత్యమూర్తి ద్వారా స్ఫూర్తి పొందినవారే. సత్యమూర్తి కేవలం కవి మాత్రమే కాదు అతను పూర్తి కాలం సామాజిక విప్లవ నాయకుడు.

    అతను కవిత్వం మాత్రమే రాయలేదు. కవిత్వం సత్యమూర్తికి తన విప్లవ ఆచరణలో భాగమే ఆ విధంగా చూసినపుడు సత్యమూర్తిని ఏ మాత్రం ఆచరణ లేని ఇతర కవులతో పోల్చడం అన్యాయం. కేవలం కవిత్వం మాత్రమే కాదు సత్యమూర్తి బ్రతుకుని గురించి మాట్లాడండి. ఇతర కవుల బ్రతుకులు ఏమిటో ఎలా బ్రతుకుతున్నారో చూడండి. అందుకని పోలికలు వద్దు. సత్యమూర్తి విప్లవ కవిత్వమైనా, దళిత కవిత్వమైనా, విప్లవోద్యమమైనా, దళితోద్యమమైనా అగ్రశ్రేణిలో ఉంటాడు. అది సైద్ధాంతికమైనా ఆచరణ రీత్యానైనా సత్యమూర్తి సత్యమూర్తే.

    దళిత శ్రేణులు కూడా విప్లవ శ్రేణుల లాగా సత్యమూర్తిని నిర్లక్ష్యం చేసాయి. విప్లవోద్యమానికి దళితోద్యమానికి సత్యమూర్తి చేసిన సేవలు కొలమానం లేనివి, సత్యమూర్తి దళిత ఉద్యమానికి చేసిన… ప్రస్తుత దళిత నాయకులకు అర్థమైనా సరే మౌనంగానే ఉన్నారు. ఈ పరిధుల నుంచి విప్లవోద్యమం, దళితోద్యమం బయటపడాల్సిన అవసరం ఉంది. విప్లవోద్యమానికి తర్వాత దళితోద్యమానికి సత్యమూర్తి తన జీవితాన్ని అంకితం చేశాడు. పేదలు, దళితులు, పీడితులు, అణచబడిన జన గణాలు సత్యమూర్తి ఆలియాస్ శివసాగర్‌ని అనునిత్యం తలచుకుంటారు.

    – కార్తీక్ నవయాన్

  3. Kiran

    Chala bagundi.

  4. Jampala Chowdary

    శివసాగర్‌పై సతీష్ చందర్ సూర్య దినపత్రికలో వ్రాసిన వ్యాసం, నెలవంక కత్తి దూసింది, ఆయన బ్లాగులో చదవవచ్చు.
    http://satishchandar.com/?p=886

  5. Jampala Chowdary

    ఈరోజు ఆంధ్రజ్యోతి – వివిధ లో వరవరరావు వ్యాసంలో శివసాగర్ కవిత్వం గురించి మరిన్ని వివరాలు http://www.andhrajyothy.com/i/2012/apr/23-4-12vividha.pdf

  6. Kumar N

    Hmm!! Very Very Interesting!

Leave a Reply