Decolonising the Mind : Ngugi Wa Thingo

పరిచయం చేస్తున్న వారు: హేలీ
***********
ఈ వ్యాసం మొన్నామధ్యన నేను చదివిన “Decolonising the Mind” అనే పుస్తకం గురించి. ఈ మధ్య కాలంలో నేను చదివిన పుస్తకాలలో నన్ను ఎంతగానో ఆలోచింపజేసి నన్ను నేనే ఎన్నో సార్లు ప్రశ్నించుకునేలా చేసింది ఈ పుస్తకం. నేను చదివిన వాతావరణం ప్రభావం వలన కావచ్చును లేదా నేను పని చేసిన ప్రాంతాల ప్రభావం కావచ్చును లేదా నా మనసు ఇప్పటికే “colonise” అయిపోయినందున కావచ్చును .. కారణం ఏదైతేనేమి నేను చదివేది రాసేది ఎక్కువగా ఆంగ్లంలోనే! (ఇది కూడా ఆంగ్ల పుస్తకం తాలూకా తెలుగు పరిచయమే కదా!). ఇటువంటి వారు తప్పకుండ చదవాల్సిన పుస్తకం ఇది.

ఇది Ngugi wa Thiong’o అనే ఆఫ్రికా రచయిత 1980 లలో రాసిన పుస్తకం. పుస్తకం ముందుమాటలోనే ఆంగ్ల మాధ్యమంలో తాను రాయబోయే చివరి పుస్తకం ఇదే అని ప్రకటించారు అయన. అటు తర్వాత ఆఫ్రికా భాషలు ఐన “గికియు” “కిస్వహిలి” (Kikuyu, Kiswahili)భాషలలో తన రచన వ్యాసంగాన్ని కొనసాగించారు ఆయన.

పుస్తకం ఉపశీర్షికలో చెప్పినట్టుగా ఈ పుస్తకం ప్రధానంగా ఆఫ్రికా సాహిత్యంలో భాషా రాజకీయాల గురించి. అప్పటి ఆఫ్రికాలో మాతృభాషా పరిరక్షణకు వాళ్ళు పడ్డ కష్టాలు, ఆంగ్ల ఆధిపత్యపు ధోరణుల వల్ల ఆఫ్రికా భాష మరియు సంస్కృతి పై పడ్డ ప్రభావం వంటి విషయాలు కూలంకషంగా చర్చించారు. రచయిత అడిగే ఎన్నో ప్రశ్నలు అయన చేసిన వాదప్రతివాదాలు ఇంచు మించు అన్నీ మన రాష్ట్రంలో తెలుగు భాష ప్రస్తుత స్థితికి మనం అన్వయించుకోవచ్చు.

ఆ కాలపు ఆఫ్రికా రచయితలలో కొందరు ఆఫ్రికా ఖండపు సంస్కృతిని ప్రతిబింబించే ఆఫ్రికా భాషలలోని రచనలను ఆంగ్లంలోకి తర్జుమా చేయటం గురించి, ఆ విధంగా చేసాక తమ మాతృభాషలకు తిలోదకమిచ్చి తమ గొంతు వినిపించటానికి ఆంగ్లాన్ని మించిన మాధ్యమం లేదు అని అనుకోటం గురించి చర్చించారు. ఇది మన “ఇండియన్ ఇంగ్లీష్” రచయితలకు మనం అన్వయించుకోవచ్చు. అసలు మన భాషలో మనం రాసుకుంటే చాలదా పరాయి భాషనూ ఉద్ధరించాల్సిన అవసరం మనకేంటి అని ప్రశ్నించారు.

శరీరాన్ని స్వాధీన పరుచుకోటానికి బులెట్టును వాడినట్టుగా మనసును స్వాధీనపరచుకోటానికి పరాయి పాలకులు భాషను వాడుకున్నారని వాపోయారు. ఆంగ్ల ఆధిపత్యం తన చిన్నప్పటి కెన్యా సమాజంలో ఎలా మొదలైంది అని తలచుకుంటూ కొన్ని అనుభవాలని పాఠకులతో అయన పంచుకున్నారు. అప్పట్లో వారి స్కూలు ప్రాంగణంలో “గికియు” భాషలో మాట్లాడటాన్ని పెద్ద నేరంగా పరిగణించేవారట. గికియు మాట్లాడిన పిల్లలను కర్రతో మూడు నాలుగు దెబ్బలు వేయటం, వారి మెడల చుట్టూ “నేను గాడిదను” “నేను వెధవను” అని రాసి ఉంచిన పలకలను వ్రేలాడదీయటం వంటి పనులు చేసేవారట. ఇటువంటి సంఘటనలు నేటికి మన రాష్ట్రంలో జరుగుతూ ఉండటం గమనార్హం. విద్యార్థి యొక్క ఆంగ్ల వాక్చాతుర్యం అతని తెలివి తేటలకు, నేర్పరితనానికి ఒక కొలమానంగా చూసే వారట. పై చదువులకు ఆంగ్లం మాత్రమే అవసరం అనే భావన అప్పట్లోనే ఉండేదట .

ఇలా తన చిన్ననాటి అనుభవాలను చెప్పుకుంటూ మాతృభాషను కిందకు తొక్కి వేసి ఆంగ్లమును పై పైకి తీసుకు వెళ్ళటం వలన ఉండే నష్టాలను వివరిస్తూ మాతృభాషావిశిష్టత, మనోవికాసంలో మాతృభాష పాత్ర, సంస్కృతి పరిరక్షణలో మాతృభాష ప్రాముఖ్యత వంటి విషయాల గురించి చర్చించారు. వలస పాలకుల ఆధిపత్యం బాహ్యప్రపంచం కంటే అంతఃప్రపంచంలోనే ఎక్కువగా ఉన్న విషయాన్నీ ఎత్తి చూపారు. ఈ ఆధిపత్య ప్రభావం వలన మాతృభాషలో మాట్లాడటం అంటేనే ఒక న్యూనత భావం రావటం గురించి, సొంత ప్రాంతపు కట్టుబాట్లు సంస్కృతి అంటే ఒక రకమైన చిన్న చూపు రావటం గురించి చర్చించారు. ఒక సామాన్య ఆఫ్రికా పిల్లవాడికి చదువు చెప్పే భాష పరాయి భాషే, అతను చదివే పుస్తకాలూ పరాయి భాషలో రాసినవే, ఇలా చిన్నప్పటి నుంచి అతని ఆలోచన పరయిభాషలోనే. అతను ఇంట్లో మాతృభాషలో సంభాషించినప్పటికీ స్కూలులో పరాయిభాషతో తాను తెల్సుకొనే ప్రపంచం, అది ప్రతిబింబించే సంస్కృతి, ఇంట్లో చుట్టూరా ఉండే సంఘంలో ఆఫ్రికా భాష ప్రతిబింబించే సంస్కృతి మధ్య ఏ విధమైన సామ్యం లేకపోటం అన్నది జరగానారంభించింది. ఇలా వలసపాలకుల భాష వారి సంస్కృతిని ఆఫ్రికా పిల్లల పైన రుద్దటానికి ఒక వాహనంగా ఎలా మారిందో తెలిపారు. ఇది చదువుతూ ఉంటే లార్డ్ మెకాలే “Minute of Education” లోని “We must at present do our best to form a class … a class of persons, Indian in blood and colour, but English in taste, in opinions, in morals, and in intellect” అన్న వాక్యం గుర్తుకు వచ్చింది నాకు. బహుశా అన్ని చోట్ల ఇదే సిద్ధాంతం పాటించారేమో అప్పటి వలస పాలకులు.

ఆఫ్రికా భాషలలో నాటకరంగ పునరుద్ధరణ కోసం రచయిత పడ్డ కష్టాలు, అయన జైలుపాలు అయినపుడు టాయిలెట్టు పేపరుపై ఒక నవల రచన మొదలు పెట్టిన వైనం గురించి అయన వివరించిన విధానం నాకు ఎంతో నచ్చింది. ఆఫ్రికా భాషల రచనల ముద్రణ, వాటిని చదువరులకు చేరవేయటంలో ఉండే కష్టాల గురించి అయన చెప్పిన విషయాలు కూడా చాలావరకు మనకి అన్వయించుకోవచ్చు. నిజమైన ఆఫ్రికా సంస్కృతికి పట్టుకొమ్మలైన పల్లెలలో సరి ఐన గ్రంథాలయాలు, పుస్తక విక్రయ కేంద్రాలు లేనందున ఆఫ్రికా భాషలలో రాసిన రచనలను అవి ఇష్టపడే వారి దగ్గరికి చేర్చటంలో ఉండే కష్టాలను గురించి వివరించారు.

స్వభాషా రచనలు పునరుద్ధరించే బాధ్యతను మోయాల్సిన అవసరం రచయితదే కాని ప్రచురణకర్తలది, పాఠకులది, ప్రభుత్వాలది కాదు అని అభిప్రాయపడ్డారు. సరైన ప్రచురణకర్త, అనువాదకులు వగైరాలు అవసరమైనప్పటికీ దిశానిర్దేశం చేయగేలిగే సత్త ఉన్నవాడు రచయితే అని అన్నారు. రష్యా , ఫిన్లాండ్ వంటి ఎన్నో దేశాలలో రచయితలే నడుము బిగించి స్వభాష సాహిత్యాన్ని కాపాడారని ఆఫ్రికాలో కూడా రచయితలే ముందుండి నడిపించాలని అన్నారు. మన తెలుగు సాహిత్యానికి మరియు భారతీయ సాహిత్యానికి కూడా ఇదే మార్గం కాబోలు.

పుస్తకం కొంచెం పాతదే ఐనప్పటికీ రచయిత ఎత్తి చూపిన విషయాలు, వలస పాలకుల నిరంకుశ పాలనకు లోనైన ప్రతి దేశంలోనూ ఇంకా జవాబులేని ప్రశ్నలే అన్న విషయం మరచిపోకూడదు. ఈ పుస్తకం పీ.డీ.ఎఫ్ ను ఈ లంకె లో డౌన్లోడ్ చేసుకోవచు.

You Might Also Like

4 Comments

  1. kothapalli ravibabu

    Interesting. Please cover the other essays also by Ngugi in his book ‘Decolonising the Mind’.
    Thanks to pustakam.net
    ravibabujs@yahoo.co.in

  2. rajesh

    The cultural values of the colonised peoples are deemed as lacking in value, or even as being “uncivilised”, from which they must be rescued.To be blunt,The British Empire did not rule by military and physical force alone. “Ngugi wa thiong’o”.

  3. నాగరాజు

    Thanks Halley – you introduce interesting books.

    Geoffrey Gorer’s Africa Dances is another classic on how Colonial rule systematically destroyed africa. i bought it three months ago, but haven’t started on it yet.
    Bernard Cohn’s Colonialism and its forms of knowledge is another classic work, especially the fascinating chapter on command languages and languages of command.

  4. సౌమ్య

    Interesting. Added to my “To read sometime” list 🙂

Leave a Reply