Raga ‘n Josh – మజా ఐన సంగీతపు సాహిత్య వంటకం

నాకున్న గొప్ప అదృష్టాలలో ఒకటేమిటంటే నేనేమీ అడగకపోయినా, నా దగ్గరనుంచి ఏమీ ఆశించకుండానే తమ ఉదారత్వంతో నా జీవితాన్ని సంపన్నం చేసే స్నేహితులు, పరిచయస్తులు చాలామంది ఉండటం. మంచి పుస్తకాలు, మంచి సినిమాలు, మంచి అనుభవాలు, అనేక ఇతర ఆనందాలు వారివల్ల నాకు లభిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి చాలాకాలం ఛైర్మన్‌గా పని చేసి ఇప్పుడు విశ్రాంతజీవనం గడుపుతున్న డాక్టర్ సి. సుబ్బారావుగార్ని – దాదాపు పదేళ్ళ తర్వాత – మా ఇద్దరికీ మిత్రులైన వారింట గత నెలలో కలిశాను. తను చాలా ఆనందించిన పుస్తకం అంటూ ఆయన షీలా ధర్ వ్రాసిన “రాగా అండ్ జోష్” పుస్తకాన్ని నాకు బహుకరించారు. ఆయన అలా ఇవ్వబట్టే ఇంత సరదా పుస్తకాన్ని చదివే అవకాశం కలిగింది నాకు.

షీలా ధర్ ఒకప్పుడు ఇందిరాగాంధికి ముఖ్య సలహాదారుల్లో ఒకరైన ఆర్థికశాస్త్రవేత్త డాక్టర్ పి.ఎన్.ధర్ భార్య అని పరిచయం చేస్తే సరిపోదు. కిరాణా ఘరానా సాంప్రదాయంలో హిందూస్తానీ గాయికగా ప్రసిద్ధురాలు అంటే కొంతే చెప్పినట్లు. ఆవిడ చనిపోయాక హిందూలో నివాళి అర్పిస్తూ రుకున్ ఆద్వానీ ఆమెను “…she was actually among the most classically accomplished writers of evocative English prose any Indian has written over the past fifty years” అని వర్ణిస్తే అది అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది.

ఈ పుస్తకంలో మూడు భాగాలున్నాయి: మొదటిది షీలా ధర్ 1995లో ప్రచురించిన Here’s Someone I’d Like You to Meet అనే పుస్తకం; రెండవది The Cooking of Music And Other Essays అనే వ్యాససంపుటి (2001లో షీలా ధర్ మరణానంతరం ప్రచురించబడింది); మూడవభాగంలో షీలా ధర్ మరణించినప్పుడు దిలీప్ ముల్గావంకర్, రుకున్ ఆద్వానీలు వ్రాసిన నివాళి వ్యాసాలు ఉన్నాయి.

మొదటిభాగంలో షీలా ధర్ చిన్నతనం గురించి, సంగీతం నేర్చుకోవటానికి ఆమె చేసిన ప్రయత్నాలు, ఆ ప్రస్థానంలో ఆమె కలిసిన కొందరు ప్రసిద్ధ, అప్రసిద్ధ వ్యక్తుల గురించి – ముఖ్యంగా హిందూస్తానీ సంగీత ప్రపంచపు తారల గురించి – ఆమె జ్ఞాపకాలు ఉంటాయి. రెండవ భాగంలో సంగీతాన్ని నాబోటి సామాన్యులకు పరిచయం చేసే కొన్ని వ్యాసాలు, ఇంకొన్ని సంఘటనలపైన వ్యాసాలూ ఉన్నాయి.

ఇంతకూ షీలా ధర్ ఈ పుస్తకాలు ఎందుకు వ్రాసినట్లు?

“If a memoir needs a reason, mine is simply that wonderful things become even more wonderful for me if I can share them and dreadful things become more bearable. The delightful and the bitter both seem more valid if I can believe that I am not the sole experiencer. Driven by this infirmity, I have over the years compulsively told and retold some of the stories that appear here”.

ఈ కథల్ని మొదటి పుస్తకంలో Home, Musicians, Other People అనే మూడు విభాగాల్లో చెప్తుంది. ఈ కథల్లో ఆమె, ఆమె కుటుంబ సభ్యులతో పాటు, బడే ఘులామలీ ఖాన్, సిద్ధేశ్వరీ దేవి వంటి సంగీతకారులు, రిచర్డ్ అటెన్‌బరో, ఇందిరాగాంధి వంటి ప్రముఖ వ్యక్తులు కనిపిస్తారు. చమత్కారంగా, రసవత్తరంగా కథలు చెప్పటంలో షీలా ధర్ దిట్ట. ఈ కథల్లో కనిపించే చాలామంది మనుష్యులంటే ఈవిడకు చచ్చేంత గౌరవమని, ఇష్టమని తెలుస్తూనే ఉంటుంది. ఐనా గౌరవించేటప్పుడు గౌరవిస్తూనే, అవకాశం దొరికినప్పుడు వ్యంగ్యమూ, హాస్యమూ, అప్పుడప్పుడూ వెక్కిరింతలూ కలిపేసి –వారి గౌరవానికి భంగమేమీ కలుగకుండానే – కడుపుబ్బా నవ్వించగలదు. ఒకోసారి ముళ్ళపూడివారి కోతికొమ్మచ్చి గుర్తుకువచ్చింది ఈ పుస్తకం చదువుతుంటే.

1929లో పుట్టిన షీలా – రాయ్‌బహదూర్ రాజ్‌నారాయణ్ అనే లాయర్‌గారి మనుమరాలు. మధుర కాయస్థ వర్గానికి చెందిన రాయ్ బహదూర్‌గారు ఇంగ్లండులో చదువుకుని ఢిల్లీలో బారిస్టరుగా చాలా పేరు ప్రఖ్యాతులు, డబ్బు గడించారు. ఢిల్లీలో సివిల్ లైన్స్ ప్రాంతంలో, విశాలమైన ఆవరణలో అధునాతనంగా కట్టించుకున్న పెద్ద బంగళాలో ఉండేవారు. ఆయన పిల్లలూ, మనవలూ, మనవరాళ్ళూ, చుట్టాలూ పక్కాలూ కలిసి, ఏ రోజు చూసినా, కనీసం అరవై మంది ఉండేవారట ఆ ఇంట్లో; పిల్లలే కనీసం ముప్పైమందన్నా ఉండేవారట. రాయ్‌బహదూర్ గారు భార్యకి ఇంగ్లీషు ట్యూటర్‌ని పెట్టటమే కాకుండా, ఆరోజుల్లోనే తన కూతుళ్ళని కాలేజ్ గ్రాడ్యుయేట్స్‌గా చేశారట.

రాయ్‌బహదూర్‌గారి రెండో కుమారుడు (షీలా తండ్రి) యుక్తవయసులో ప్రేమలో పడ్డాడట. ఇంత అధునాతనమైన రాయ్‌బహదూర్‌గారు ప్రేమా లేదు దోమా లేదు అన్నారట. ఇక్కడ చిన్నాయన, అక్కడ ఆయన ప్రేయసి ఇద్దరూ తిండీ తిప్పలు మానేసి కృంగి కృశించేటప్పటికి తప్పనిసరై పెద్దలు పెళ్ళికి ఒప్పుకున్నారు. కృంగి కృశించిన పెళ్ళికూతురు పెళ్ళైన ఆర్నెల్లలోపే చచ్చిపోయింది. రెండేళ్ల తర్వాత ఆయనకి బలవంతంగా మళ్ళీపెళ్ళి చేశారు. పెద్దవాళ్ళమీద ఈయనకున్న కోపాన్నంతా తన భార్య మీద చూపించాడు. కాపురం ఎలా చేశాడో పిల్లల్ని ఎలా కన్నాడో కాని, పిల్లలకి ఒక వయసు వచ్చేసరికి ఆయన తన భార్యకు (షీలా తల్లికి) ఆ ఉమ్మడికుటుంబంలో ఎలాంటి గౌరవమూ ఉంచకుండా, రకరకాలుగా అవమానిస్తూ ఉండేవాడు. తండ్రి చనిపోయిన చాలా యేళ్ళ తరువాత, షీలా తన ముసలి తల్లిని అడిగింది – “ఎందుకు అన్నేళ్ళు ఆ నరకాన్ని భరిస్తూ ఆ ఇంట్లో ఉండిపోయావు? పతివ్రతా ధర్మమనా, పరువు కోసమా, వేరే గతి లేకా, పిల్లల కోసమా? ఎందుకు?” గట్టిగా, కోపంగా ప్రశ్నించిన షీలాకు తల్లి వెంటనే సమాధానం చెప్పలేదు. మూడు రోజుల తర్వాత తల్లి షీలాతో చెప్పింది, “నువ్వడిగిన ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పాలని మూడు రోజులనుంచీ ఆలోచిస్తున్నాను. నువ్వు అనుకున్నవేవీ కారణాలు కాదు, The truth is that I loved him.”

మిగతా విషయాల్లో ఎలా ఉన్నా షీలా తండ్రికి మంచి కళాహృదయం ఉంది. స్వయంగా సంగీతం నేర్చుకున్నాడు. ఢిల్లీలో భారతీయకళాకేంద్ర సంస్థ స్థాపకులలో ఒక్కడు. ఢిల్లీలో, అలహాబాదులో ఏ సంగీత సభ జరిగినా ఆయన చేయి ఉండాల్సిందే. చాలామంది గాయకులనూ, సంగీతకారులనూ ఆదరించేవాడు. వారిలో చాలామంది వారి ఇంటికివచ్చి, రోజుల తరబడి ఉండి ఆతిథ్యం స్వీకరించేవారు. మధుర కాయస్థుల్లో కొద్దిగా సంగీత అభిమానం ఎక్కువేనట. ఆడపిల్లందరూ – పెళ్ళిచూపుల్లోనూ పెళ్ళిళ్ళలోనూ పాడటంకోసం – సంగీతం నేర్చుకొనే అలవాటూ, ఆచారమూ ఉందట. షీలా ఇంట్లో పిల్లలకు ఒక సంగీతం మేస్టరు ఉండేవాడు. వారికితోడు ఇంటికి అతిథులుగా వచ్చిన కాకలు తీరిన సంగీతయోధులు సాయంత్రాలు ఇంట్లోవారికోసం కచేరీలు చేసేవారట. ఇలా కేసర్‌బాయ్ కేర్కర్, బడే ఘులామలీఖాన్ వంటి వారి సంగీతం వింటూ పెరిగిన షీలాకు సంగీతం అంటే చాలా ఆసక్తి కలిగింది.

మెడిసిన్‌లో చేరి, ఒక సంవత్సరమయ్యాక అది తన తత్వానికి సరిపడదు అని వదిలేసి, షీలా ఢిల్లీ హిందూ కాలేజ్‌లో బియే ఇంగ్లీషు ఆనర్సుక్లాసులో యూనివర్సిటీ ఫస్టుగా రికార్డుస్కోరు తెచ్చుకుంది. కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పి.ఎన్.ధర్‌ను పెళ్ళిచేసుకుంది. ఆయన హార్వర్డ్‌‌కు వెళితే ఈమె బోస్టన్ కాలేజ్‌లో ఎం.ఏ. ఇంగ్లీషులో summa cum laude పట్టభద్రురాలైంది. కొన్నాళ్ళు ఢిల్లీ యూనివర్సిటీలో పాఠాలు చెప్పింది. భారత ప్రభుత్వం పబ్లికేషన్స్ డివిజన్‌లో ఇంకొన్నాళ్ళు పని చేసింది. కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ ఫయజ్ అహ్మద్ ఖాన్ వద్ద హిందూస్తానీ సాంప్రదాయపు సంగీతాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం కోసం ఉద్యోగాన్ని మానేసింది. తర్వాత కిరాణా సంప్రదాయంలో గాయనిగా చాలా పేరు తెచ్చుకొంది. కాలక్రమేణా భర్త ప్రధానమంత్రి ఇందిరాగాంధికి ముఖ్య ఆంతరంగిక సలహాదారుల్లో ఒక్కడయ్యాడు. షీలా ధర్ వ్రాసిన Children’s History of India, This India అనే పుస్తకాలు బాగా పేరు తెచ్చాయి. సంగీత, సాహిత్యకారుల సర్కిల్స్‌లో బాగా పాపులర్‌గా ఉండేది. తన సంగీతానికీ, రసవత్తరంగా కథలు చెప్పటానికీ, వంటలకూ పేరు మోసింది.

షీలా చిన్నతనంలో వారి ఇంట్లో సంగీతకారులకి ఆతిథ్యం ఇవ్వటానికి చేసే హడావిడి గురించి చదువుతుంటే ఇల్లేరమ్మ కథల్లో ఇంటివారు ఆకాశవాణి సంగీతోత్సవాలకి వచ్చే కళాకారుల ఆతిథ్యం గురించి పడిన హడావిడి గుర్తుకు వస్తుంది. సంగీతాన్ని ప్రాణంగా భావించిన ఆమె రెండవ గురువు ప్రాణ్‌నాధ్ దారిద్ర్యాన్ని, అతని నిరాశావాద దృక్పథాన్ని గురించి చదువుతున్నప్పుడు పడ్డ బాధ, అతని జీవితంలో అకస్మాత్తుగా కలిగిన మార్పుని గురించి చదివినప్పుడు ఆశ్చర్యంగా మారుతుంది. ఇంగ్లీషు అంతగా రాని ప్రాణ్‌నాధ్‌ మన్‌హాటన్‌లో పెద్ద ఆధ్యాత్మిక, సంగీత గురువుగా రూపాంతరం చెందుతాడు. అంతేకాదు, చూడటానికి వచ్చిన షీలాకు చాలా ఉపకారమే చేస్తాడు. ఫయజ్ అహ్మద్ ఖాన్ వంటివారి విద్వత్తూ, శిష్యులకోసం వారు పడే తపన గురించి తెలుసుకొన్నప్పుడు చేయెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది.

పుస్తకం నిండా హుషారైన కథలు చాలా ఉన్నాయి. ఒక సంగీతోత్సవానికి ముందు ఉస్తాద్ బడే ఘులామలీఖాన్ బస శాకాహారుల ఇంట్లో ఏర్పాటు చేశారట. “ఇట్లా గడ్డి తింటే నా పాటకి సత్తువ ఎక్కణ్ణించి వస్తుంది” అంటూ ఆయన వంట ఏర్పాట్లు ఆయనే చేసుకున్నాడట. రేడియో కోసం ఆయన పాట రికార్డ్ చేయించాలని షీలా తండ్రి ప్రయత్నిస్తే, రికార్డింగ్ చేస్తే తన గొంతు మాయమైపోతుందని భయపడి నిరాకరించాట్ట. ఇంకోసారి, ఇంట్లో అతిథిగా ఉంటున్న సారంగి విద్వాంసుడు ఉస్తాద్ బుందూఖాన్ కనిపించ లేదట. ఏమైపోయాడో అని వెతుకుతుంటే తోటలో పూల మధ్య కళ్ళు మూసుకుని సారంగి వాయిస్తున్నాట్ట. కళ్ళు తెరిచాక చుట్టూ ఉన్న వాళ్ళను చూసి, “ఇవాళ వసంతం వచ్చింది కదా, పూలు వికసిస్తున్నాయి. వాటికోసం వాయిస్తున్నాను” అన్నాట్ట బుందూఖాన్. సిద్ధేశ్వరీదేవి, బేగం అఖ్తర్‌ల మధ్య పోటీ, సిద్ధేశ్వరీదేవి ఇంగ్లండు ప్రయాణం కథలు నవ్విస్తే, జలంధర్లో హర్‌వల్లభ్ సంగీతోత్సవం కథ ముందు ఆశ్చర్యాన్ని, తర్వాత హాస్యాన్ని పుట్టిస్తుంది.

పబ్లికేషన్స్ డివిజన్‌లో ఆమె పై అధికారిగా పని చేసిన మోహనరావు గొప్ప తమాషా ఐన మనిషి. మట్టిబిడ్డగా తనను అభివర్ణించుకునే ఈ మనిషికి తన పని మీద ఆసక్తి తప్ప ఏ భేషజాలూ లేవు. సంగీతమన్నా, గాంధీ అన్నా చాలా పిచ్చి. గాంధీ మీద సినిమా తీయటంకోసం అటేన్‌బరో మొదటిసారి ఢిల్లీ వచ్చినప్పుడు, తెగ ముచ్చటపడిపోయి అటేన్‌బరోని తన ఇంటికి భోజనానికి పిలిచి మైసూరు భోజనం పెట్టగా అటెన్‌బరో తిప్పలు చదవవలసిందే. మధుర కాయస్థ కుటుంబాల ఆచార వ్యవహారాలు, పబ్లికేషన్స్ డివిజన్‌లో పిల్లి కథ, టోంగా రాణికి భారత ప్రభుత్వ విందు, హోదాను బట్టి మర్యాదనిచ్చే ఢిల్లీ అధికారుల భార్యల ఆభిజాత్యాలను ఆట పట్టించటంకోసం తన గురించి నిజం చెప్పకుండా రకరకాల వేషాలు వేసిన షీలా కొంటెతనం, గయానాలో జన్మాష్టమి పండుగలో భగవద్గీత ప్రవచనం (Is Krishna saying to Arjuna “doan be drinkin, doan be dancin, doan be makin love, doan be enjoyin?” No, no, no! He not tellin Arjuna dat, he not tellin you dat, and he not telling me dat! He sayin “enjoy all- food, drink, dancin, makin love!”) వంటి సంఘటనలు తలచుకొన్నప్పుడల్లా నవ్విస్తాయి. ఈ కథలు ఆవిడ చెబుతుంటే వింటే ఇంకెంత బాగుండేదో అనిపిస్తుంది.

షీలా ధర్ చెప్పే కథలే కాదు. ఆమె భాష కూడా బాగుంటుంది. మనుషులన్నా, సంగీతమన్నా ఆమెకున్న ప్రేమ, జీవితమంటే ఆమెకున్న సరదా పుస్తకమంతా ప్రతిఫలిస్తుంటాయి. సంగీతమంటే ఓనమాలు (పోనీ సరిగమలు) కూడా తెలీని నాలాంటివారికి కూడా అర్థమౌతుంది అనిపించేలా ఉంటుంది ఆమె సంగీతం గురించి రాస్తుంటే. మంచి మజా ఇచ్చిన పుస్తకం. ఏమీ తోచనప్పుడో, మనసు తేలిక చేసుకోవాలనిపించినప్పుడో, మనుషుల్ని ప్రేమించాలి అనిపించినప్పుడో, మళ్ళీ మళ్ళీ చదువుకునే పుస్తకాల జాబితాలో ఈ పుస్తకాన్ని కూడ చేరుస్తాను. ప్రొఫెసర్ సుబ్బారావుగార్కి ఇంకోసారి కృతజ్ఞతలు.

పుస్తకాన్ని జాగ్రత్తగా ముద్రించారు. ఈ పుస్తకం flipkart.comలో ఇంకా దొరుకుతుంది.

అన్నట్టు ఈ పుస్తకం పేరుని గూగుల్ చేస్తే రోగన్ జోష్ అనే వంటకం గురించిన వివరాలు కనిపించటం యాదృచ్ఛికమే అంటారా?

****

Raga ‘n Josh
Stories from a Musical Life
Shiela Dhar
2005
Permanent Black, New Delhi
311 pages; Rs. 295.

You Might Also Like

One Comment

  1. Jampala Chowdary

    Apparently, the book was reviewed again recently in The Hindu:
    http://www.thehindu.com/arts/books/article2950362.ece

Leave a Reply